Saturday, June 30, 2012

తలకెక్కే తత్వాలు


తత్వగీతం: దీవి సుబ్బారావు
(తత్వగీతాల సంకలనం)
పేజీలు: 166,
వెల: రూ.100/-
ప్రతులకు: నవోదయ,
విశాలాంధ్ర పుస్తకాలయాలు;

పోతులూరి వీరబ్రహ్మంగారి పేరు చెప్పగానే అందరికీ ‘కాలజ్ఞానం’ముందు గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత బ్రహ్మంగారి తత్వాలు తలపునకు వస్తాయి. దీవి సుబ్బారావుగారు శ్రమకోర్చి బ్రహ్మంగారి తత్వాలను సేకరించి, పరిష్కరించి ప్రచురించారు. ఈ సేకరణలో వారికి మరి కొందరు పండితులు సాయం చేశారు. బ్రహ్మంగారి దారిలోనే తత్వాలు పాడిన సిద్దయ్య, లక్ష్మప్పల రచనలు కూడా ఈ సంకలనంలో చేర్చడం బాగుంది. వీటితోబాటు అజ్ఞాత గీత రచయితల తత్వాలు కూడా కొన్ని, సంకలనం చివరలో చేర్చారు. చదవడానికే కాక పాడడానికి కూడా అనువయిన తత్వాల రాగ తాళాల వివరాలను ప్రచురించడం మరింత ఉచితంగా ఉపయోగకరంగా ఉంది.

బ్రహ్మంగారి తత్వాలు వినడానికి ఎంతో సులభంగా ఉంటాయి. కాని వాటిలో యోగ విద్యకు సంబంధించిన వివరాలు సూచనలు నిండుగా ఉంటాయి. ఉదాహరణకు చాలా తత్వాలలో ‘బయలు’అనే మాట కనబడుతుంది. ఈ మాట అర్థాన్ని వివరింపబూనితే కొన్ని పేజీల గ్రంథమవుతుంది. ‘బయలూరికి పోవలెరా’ అంటారు బ్రహ్మము. అది మోక్షానికి గుర్తు. కుక్కను పట్టవలె, మూడు మూతల పెట్టెలో భూతము, పాము చిర్రున లేచుట, ఆరు కొమ్ముల ఏనుగు, అయిదు కోతులు, అయిదు మేకలు మొదలయినవన్నీ లోతయిన ప్రతీకలు. ‘నీళ్లలో మునిగి గొణుగుచు ఉంటే నిలకడ చెడును’ అంటారు బ్రహ్మము. చిల్లర రాళ్లకు మొక్కుచు ఉంటే అనే ఈ పాట వేరువేరు రకాలుగా అందరికీ పరిచయమయినదే.

ఊర్థ్వమూలం, అధశ్శాఖం అన్న మాటను సులభంగా ‘మొదలు మీదుగ, తలలు క్రిందగ’ వర్ణిస్తారు మరొక పాటలో. ఇక సిద్దయ్య పాటలలో ఏ కులమని నను వివరమడిగితే’అన్నది చాలా ప్రసిద్ధము. లక్ష్మప్ప తత్వం ‘ఎరిగినందుకు గురుతు ఎరుకయే సాక్షి’ ఆ తర్వాత అమరనారాయణ కైవారయోగి నోట కూడా ‘తెలిసినందుకు గురుతు’గా ప్రతిధ్వనించింది. ఇల్లు ఇల్లనియేవు, జీవులెనుబది నాల్గు లక్షల, ‘గూట చిలుక’ లాంటి తత్వాలు కూడా ఈ సంకలనంలో ఉన్నాయి.

ఇంకా బ్రహ్మంగారు, ఆయన శిష్యుల తత్వాలు మిగిలి ఉండవచ్చునంటారు సంపాదకులు సుబ్బారావు. తత్వాలంటే నిజానికి పాటలు. ఈ ప్రచురణలోని తత్వాలలో చాలాచోట్ల లయ (వరుస) కుదరడం లేదు. మూలంలో అట్లా ఉండడానికి వీలు లేదేమో? అర్థం పేరిట పరిష్కరణ కారణంగా ఈ తేడా వచ్చిందా? తత్వాలను పల్లవి, చరణాలుగా వేసినట్టు కనబడదు. ప్రతి చరణం తర్వాత పల్లవి రావాలి. చివరలో మాత్రం ఇచ్చారు. ఏమయినా, విషయంలో ఆసక్తిగల వారందరికీ ఈ పుస్తకం అవశ్యం పఠనీయం.

Thursday, June 28, 2012

మాటర్ - ఆంటిమాటర్

తూర్పు తూర్పే, పడమర పడమరే! ఇవి రెండూ ఏనాటికీ కలవవు అని ఇంగ్లీషులో పద్యం చెప్పాడు, రుడ్‌యార్డ్ కిప్లింగ్. తూర్పు పడమరలు అసలున్నాయా అని ఆలోచనకు దిగితే జవాబు అంత సులభంగా అందదు. అట్లాగే పదార్థం, దానికి వ్యతిరేకమయిన ప్రతి పదార్థం (లేదా ఆ పదార్థం) గురించిన చర్చ కూడా జవాబు దొరకకుండా కొనసాగుతున్నది. 


ప్రపంచమంతా పదార్థంతో తయారయిందని అందరికీ తెలుసు. ఈ పదార్థానికి వ్యతిరేక లక్షణాలుగల యాంటి (ఆంటి) మాటర్ కూడా ఉందని ఎనభయి సంవత్సరాలనాడే ప్రతిపాదన వచ్చింది. దాని గురించి ఎన్నో కథలు కూడా వచ్చాయి. కథనాలంటే అందులో నిజం బలంగా కనిపించాలి మరి! ఈ పదార్థం, పదార్థంతో కలిస్తే, రెండూ నాశనమవుతాయని సిద్ధాంతం. ఇక్కడ ఒక వింత కథ మొదలవుతుంది. విశ్వం పుట్టినప్పుడు పదార్థంతో బాటు అంతే వ్యతిరేక పదార్థం కూడా పుట్టి ఉండాలి. పుడితే, అవి రెండూ కలిసి ఉండాలి. కలిస్తే, మరో పేలుడు జరిగి అంతా నాశనమయి ఉండాలి! కానీ అట్లా జరగలేదు. పదార్థం మిగిలింది. నక్షత్రాలు, గ్రహాలు, ఒక గ్రహం మీద క్రమంగా మనం, ఇంకా ఎన్నో పదార్థంలోనుంచి, పదార్థంతో పుట్టుకువచ్చిన సంగతి తెలుసు.


భౌతిక శాస్త్రంలో సిద్ధాంతాల బలం ఎక్కువ. పదార్థం, ప్రతిపదార్థం లక్షణాలను ఒకేసారి కనబరచగల పార్టికల్స్ కూడా ఉన్నాయని, ఎనభయి సంవత్సరాలనాడే మరో వాదం వచ్చింది. ఎటోరీ మజూరానా అనే ఇటాలియన్ పరిశోధకుడు ఈ సిద్ధాంతాన్ని ప్రపంచం ముందు ఉంచాడు. అది మరింత గజిబిజికి కారణమయింది. మజూరానా జీవితం కూడా అంత అర్థంకాని అంశాలతో నిండి ఉంది. 1938లో అతను పలెర్మో నుంచి నేపుల్స్‌కు వెళుతూ మధ్యలో మాయమయ్యాడు. ఆత్మహత్య చేసుకున్నాడా? ఎవరైనా ఎత్తుకు పోయారా? కలిగించిన కలవరం, ఆయనను కూడా కలత పెట్టినందుకు తానే ప్రపంచం నుంచి దూరంగా పోయాడా, అంతుపట్టలేదు. మొత్తానికి, అతను ప్రతిపాదించిన పార్టికల్స్‌కు మజురానా పార్టికల్స్ అని పేరు పెట్టారు. అలాంటి కణాలు ఉన్నాయని నిరూపించడం సులభం కాదు. కనుక, కుదరలేదు. కుదిరితే, డార్క్ మాటర్ గురించి మరింత బాగా అర్థమయి ఉండేది. విశ్వమంతటా డార్క్ మాటర్, డార్క్ ఎనర్జీ నిండి ఉన్నాయన్న మాటలోని నిజం తెలిసి వచ్చేది. అసలు పదార్థం లక్షణాలు మరింత బాగా అర్థమయి ఉండేవి. పదార్థం ఎందుకుంది? అన్న అసలు రహస్యం, తెలిసిపోయేది.

ఫిజిక్సు లేనిదే మిగతా సైన్సు తెలివి ఏదీ ఉండదు. పదార్థం పని చేయాలి. వివిధ రూపాలలోకి మారాలి. జీవం కూడా అందులో ఒకటి. కానీ, పదార్థం గురించి తెలిసింది మాత్రం తక్కువ. మిగతా సైన్సు విభాగాల గురించి తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం, కొంత సులభం అనాలి. భౌతిక శాస్త్రం మాత్రం అట్లా కాదు. పదార్థమే అర్థం కాలేదంటే, వ్యతిరేక (ప్రతి) పదార్థమూ, ఆ రెండింటి లక్షణాలు కలిగిన మజూరానా కణాలు అసలే అర్థం కావు. పరిశోధకులకు కూడా అవి ఇప్పటివరకు అందలేదు. ఈ కణాలు, అనుక్షణం, లక్షల సంఖ్యలో మన శరీరాలలోనుంచి కూడా దూసుకుపోతున్నాయని కొందరంటారు. అందుకు నిదర్శనాలు మాత్రం అందుబాటులో లేవంటారు. జెనీవాలోని లార్జ్ హాడ్రాన్ కొలైడర్‌లో అవి కనబడతాయని కొందరంటున్నారు. ఇప్పటివరకు మాత్రం ఆపని జరగలేదు. కనిపించాయంటున్నవారు మరో కథ చెపుతున్నారు. కాస్మిక్ కారణాలలోగానీ, కణాలు కొట్టుకున్నందుకు కలిగిన ఫలితంలోగానీ, అవి కనబడలేదు, నిజమే. అవి సూపర్ కండక్టర్ పదార్థంలో చిక్కుకుని కనిపించాయట. అంటే మజూందా పార్టికల్స్ సంగతి రహస్యం, విడిపోయిందా?

పాల్ డిరాక్ అనే ప్రఖ్యాత ఫిజిక్సు పరిశోధకుడు, క్వాంటం మెకానిక్స్ (అణు నిర్మాణం పని తీరును గురించిన సిద్ధాంతాలు)నూ, ఐన్‌స్టైన్ సాపేక్ష సిద్ధాంతాన్ని కలగలిపి, ఒక సిద్ధాంతాన్ని 1928లోనే ప్రతిపాదించాడు. ప్రపంచంలోని పదార్థం నిర్మాణానికి ఆధారమయిన సెర్మియాన్‌లనే కణాలను గురించి కూడా డిరాక్ వర్ణించాడు. మజూరానా, ఇక్కడినుంచి ఎత్తుకుని, కొంత మార్పు ఆలోచించి, తన సిద్ధాంతాన్ని చెప్పాడు.

డిరాక్ సూచనలు, అందరికీ కనువిప్పుగా, మార్గదర్శకాలుగా మారాయి. అయస్కాంత క్షేత్రంలో ఉన్న ఇలెక్ట్రానులు (ఎలెక్టానులని అంటున్నాం!) అవి తిరిగే తీరు, దిశలను బట్టి రెండురకాలుగా పనిచేస్తాయన్నాడతను. నిజానికి నాలుగు పరిస్థితులు వీలవుతాయి. కానీ, అందులో రెండు మాత్రం, వాస్తవంగా జరుగుతున్నాయన్నాడు. మిగతా రెంటిలో కొంత నెటెటివ్ శక్తి ఉందన్నాడు. చదువుతున్నవారికి ఈ మాటలు అర్థం కాలేదని రాసిన మనిషికి తెలుసు! అప్పట్లో మిగతా పరిశోధకులు కూడా మనలాగే వెర్రి మొగం వేశారు. 1932లో ఆండర్సన్ అనే మరో పరిశోధకుడు, ఎదురుదారిలో తిరుగుతున్న ఇలెక్ట్రానులను గమనించాడు. వాటిని పాజిట్రాన్స్ అంటున్నారు. అవి ఇలెక్ట్రానులలాగే ఉంటాయి. కానీ వాటిలో పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. అంటే మరి అది వ్యతిరేక (ప్రతి)పదార్థమా? ఆంటిమాటర్ అంటే ఇదేనా?

డిరాక్ ఫార్ములా ప్రకారం, విద్యుదావేశం (ఛార్జ్) ఉన్న కణాలకు మాత్రమే వ్యతిరేక కణాలుంటాయి. మజురానా మరింత ముందుకు వెళ్లి, అన్ని పార్టికల్స్‌కూ ఆంటి పార్టికల్స్ ఉంటాయన్నాడు. ఛార్జ్ తేడా ఉంటే వాటి గురించి తెలిసే వీలుంది. రెండూ ఒకే రకంగా ఉంటే ఏది ఏదో తెలియదు. వాటిలో పదార్థం, దాని వ్యతిరేక పదార్థం లక్షణాలు రెండూ, ఏక కాలంలో కనబడతాయి. అసలీ మాటలకు అర్థం లేదని తోచడానికి, మనం చాలు, భౌతిక శాస్తవ్రేత్తల అవసరం లేదు. ఒక కణం, దానికి వ్యతిరేక కణమయితే ఆ రెండూ కలవగానే నాశనం కావాలి. మజూరానా పార్టికల్స్ తమను తాము నాశనం చేసుకోవాలి, అని మనకూ తోస్తుంది. పరిశోధకులు కూడా అదే అంటున్నారు! క్వాంటమ్ ఫిజిక్సు, ఫిజిక్సు, అర్థం కావని ఎవరన్నారు? మనం కూడా అందులో పాల్గొని సంగతులను గురించి చెప్పగలుగుతున్నాం మరి!

ఒక్కసారి ఫొటాన్ అనే కాంతికణం గురించి ఆలోచిస్తే, దానికి ఛార్జ్ లేదు. ద్రవ్యరాశి అసలే లేదు. అవి రెండూ గనుక కలిస్తే (మామూలుగా కలవవు), ఒకదాన్నొకటి నాశనం చేసుకుంటాయి. ఇక బోసాన్‌లు, ఫెర్మియాన్‌లు మరో కథ!

అర్థంగాని విషయాన్ని, సైన్సును గురించి పట్టించుకోనివారు కూడా ‘బ్రహ్మపదార్థం!’ అంటారు. నిజంగానే, పదార్థం యొక్క స్వరూప, స్వభావాలు అంత సులభంగా అర్థంకావని మనకూ అర్థమయిపోయింది. అయినా సైన్సు మాత్రం సాగుతూనే ఉంది. వేరు కనబడదు. వేళ్లు కనబడవు. కొమ్మలు కనబడతాయి!

Saturday, June 23, 2012

అవకాశం అందుకోవాలి!

పని దొరకడం లేదని ఏడుస్తూ కూచునే వారి సంఖ్య రాను రాను తగ్గుతున్నట్టు తోస్తుంది. అవకాశాలను అందుకోవాలని అందరూ అనుక్షణం ప్రయత్నిస్తున్నారు. అవకాశాలు ఉన్నాయి, లోపమంతా నీ ప్రయత్నంలోనే! అంటూ అందరూ మనల్ని ముందుకు తోస్తుంటారు కూడా! అవకాశాలున్నాయి, కానీ, అవి మనకు సరిపడేవిగా ఉన్నాయా? మన పరిస్థితులను, శక్తియుక్తులను కూడా లెక్కించాలి కదా! అక్కడే ప్రయాణం మొదలవుతుంది. వెతుకుతూ బయలుదేరితే, ఇంతకుముందు ఊహించని గమ్యాలకు చేరే వీలుంది. అందుకు ఓపిక, పట్టుదల, ప్రయత్నం అవసరం!


చదువులోగానీ, మరేదయినా పనిలోగానీ పడిన శ్రమ ఊరికే పోదు. చదువుకున్న సంగతి పోయి, సరదాగా నేర్చుకున్నదేదో మనకు దారి చూపించగలదు. అందులో మనం బాగా రాణించగలం కూడా. ఇలాంటి పరిస్థితులు వచ్చినపుడు, ఆలోచనతో, నిలకడగా నిర్ణయాలు చేయవలసి ఉంటుంది. ఎక్కడో ఒక రంగంలో మన సత్తా చూపించగలిగితే, ఆ అవసరం కలిగిన వారంతా మన గురించి ఆలోచించే పరిస్థితి రావాలి. అందుకు మన కృషి మాత్రమే ఆధారం. నాణ్యత అంతకన్నా ముఖ్యం. చేయగలిగే పనులను మరింత బాగా చేసే చోటికి మనం ఎదగాలి. కొత్త పనులు నేర్చుకోవాలి. ఒక సమయంలో ఎవరికీ కంప్యూటర్ గురించి తెలిసేది కాదు. ప్రస్తుతం కాల్ లెటర్స్ కూడా ఈ-మెయిల్‌లో పంపుతున్నారు. అవకాశాలను వెదకడంలో అవసరమయిన శ్రమ నిజానికి శ్రమ కాదు. అది మనకోసం మనమే పడుతున్న ప్రయాస!

*కళ్లు మూసుకుని ఉంటే అవకాశాలు కనబడవు. కళ్లు తెరిచిన తర్వాత అవి కరిగిపోతాయి. నిత్యం పనిగట్టుకుని వెతుకుతూనే ఉండాలి. కనిపించిన అవకాశాల గురించి అదేపనిగా ఆలోచిస్తూ కూచుంటే లాభం లేదు. అప్లై చేయడమా, మానడమా? అన్న ఆలోచనలోనే కాలమంతా గడిస్తే చివరి రోజున ఆదరాబాదరాగా, అరకొరగా అప్లికేషన్ పంపవలసి వస్తుంది. బాగుంది, అనిపిస్తే చాలు, కాగితం పంపడమే మంచిది. నచ్చకపోతే, ఇంటర్వ్యూకే వెళ్లము! తర్వాత, బాధపడడంకన్నా ఇది మంచి పద్ధతి కదా!

*కొన్ని అవకాశాలు, రారమ్మంటూ పిలవకుండా దాగి ఉంటాయి. చాలా ఉద్యోగాల గురించి ఎక్కడా ప్రకటనలు రావు. ఈ మధ్యన రెఫరల్ పద్ధతి ద్వారా ఉద్యోగులను ఎంచుకోవడం ఎక్కువయింది. అలా మన పేరు పదిమంది గుర్తుంచుకుని రెఫర్ చేసేలాగా, పరిచయాలు, నెట్‌వర్కింగ్ సిద్ధం చేసుకోవాలి. ఒక ఉద్యోగిని పరిచయం చేసిన తర్వాత, అతను ఉద్యోగానికి ఎంపికయి, చేరితే, రెఫర్ చేసినవారికి కూడా ఇనె్సంటివ్ ఇస్తున్నారు. రెఫర్ చేసినవారు మంచి నెట్‌వర్కింగ్ గలవారుగా లెక్కలోకి వస్తున్నారు.

*చిన్న ఉద్యోగంలో ఉన్నవారు అదే కంపెనీలో పెద్ద ప్రాజెక్టులలోకి దూకడం మామూలయింది. సంస్థ పెరుగుతున్నదంటే, వెయ్యి కళ్ళతో, మనకు సరిపడే ఖాళీల గురించి చూస్తుండాలి. పనిచేసేచోట మన ‘పనితనాన్ని’ చూపుతుంటే, కొత్త అవకాశాలు మరింత సులభంగా అందుతాయి. ఒకే కంపెనీలోని వేరు వేరు విభాగాలలో అవకాశాలు వస్తుంటాయి. అక్కడ రెఫరల్ మరింత బాగా పనిచేస్తుంది.

*అన్నింటికన్నా ముందు మన గురించి మనకు తెలిసి ఉండాలి. అవకాశాలు ఉంటాయిగానీ, అందుకు మనకు ఎంతవరకు అర్హత ఉందన్నది ప్రశ్న. చేస్తున్న పనిలో ఏ అంశాలు మనకు నచ్చుతున్నాయి? ఏ పనులను మనం బాగా చేయగలుగుతున్నాము? మిగతా వారికంటే మనం ఎక్కడ పైచెయ్యిగా ఉన్నాము? మిగతావారికి చేతగాని పనులు, తెలియని విశేషాలు మనకు ఎంతవరకు పట్టులో ఉన్నాయి? మనకు తెలిసిన పెద్దవారిలో, మన గురించి మంచి మాట చెప్పగలవారు ఎవరున్నారు? లాంటి ప్రశ్నలన్నీ మన మెదడులో తిరుగుతూ ఉండాలి. ప్రశ్నలతోనే సరిపెట్టుకుంటే చాలదు. ఈ ప్రశ్నలన్నింటికీ పాజిటివ్ సమాధానాలు వచ్చేదిశగా మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి.

*మనకు చేతనయిన సంగతులతో బాటు, చేతగానివీ ఉంటాయి. బలహీనతలను కూడా గుర్తించి వాటిని గురించి కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సాగాలి. మనంకొన్ని పనులు ఇష్టం లేక, చేతగాక తప్పించుకుంటాము. అది తప్పుకాకపోవచ్చు కానీ, ఆ సంగతి మనకు తెలిసి ఉండాలి. తోటివారు, పై అధికారులు, పెద్దలు మనలోని బలహీనతలు, లోపాల గురించి ఏమనుకుంటున్నారు? సాధారణంగా, మన సమాజంలో ఎవరూ ఇలాంటి విషయాలను చెప్పరు. కానీ వాటిని కూడా చెప్పగల వారు మన సర్కిల్‌లో ఉండాలి. లోపం గురించి మనకు తెలియకపోవచ్చు. తెలుసుకోవాల్సిన అవసరమూ రాకపోవచ్చు. తెలిస్తే మాత్రం, వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది.

శఅసలు మన మీద మనకు నమ్మకం ఉందా? ఆత్మస్థైర్యం ఉందా? పనులను పక్కనపెడుతూ తప్పించుకు తిరుగుతున్నామా? మనమే ఆలోచించి తెలుసుకుంటే మేలు గదా!

*కొత్త అవకాశం కనిపించిన వెంటనే దూకడం కూడా మంచిది కాదు. గోడ దొరికిన తరువాత తడికను తన్నమన్నాడు ఒకాయన! అసలు మనకు జీవితంలో ఏం కావాలి? తేల్చుకుని ముందుకు సాగాలి. ఊరు మారవలసి వస్తే కుదురుతుందా? జీతం భత్యాల విషయంలో తేడా రాదు గదా? కొత్త ఉద్యోగం నిలకడగా ఉంటుందా? అసలు అక్కడ మనం సుఖంగా కొనసాగగలుగుతామా? అక్కడ మరింత ముందుకుపోయే అవకాశాలు ఉంటాయా? అసలు అన్నింటికంటే ముందు కొత్త అవకాశం ఆసక్తికరంగా ఉందా? ఎన్నో ప్రశ్నలు! మనలో మనం, మరొకరితో వీలయితే అక్కడా చర్చించుకుని ముందుకు కదలాలి.

*కొంత అనుభవం కలిగినవారికి, చాలా అవకాశాలు కనిపించే వీలు కూడా ఉంటుంది. అప్పుడు వాటన్నిటి గురించీ వివరాలు సేకరించాలి. ఎక్కడ మనకు అనుకూలంగా ఉంటుంది? పని ఆనందం ఎక్కడ వీలవుతుంది? సంతృప్తికి వీలు ఎక్కడ? అన్నింటికీ మించి, సులభంగా అందుకోగలిగిన అవకాశాలు ఏవి? లాంటి ప్రశ్నలు ఎదురవుతాయి. కొన్ని ఉద్యోగాలలో చిక్కులుంటాయి. కానీ ముందు కనబడవు. వెళ్లిన తరువాత, తప్పు చేసిన భావం మిగులుతుంది. వెనక్కురావడానికీ ఉండదు.
అవకాశాల వేట, ఈ కాలంలో ఒకచోటికి ముగిసేదికాదు. ఉద్యోగాలు మారినందుకు మనుషుల విలువ పెరుగుతున్నది. ఒకప్పుడు పనిచేసిన చోటికే, పెద్ద స్థాయిలో తిరిగివచ్చేవారున్నారు. జాగ్రత్తగా, పట్టుదలగా, విశాల దృక్ఫథంతో ముందుకుసాగడమే! అవకాశాలు పిలిచినప్పుడు రావు. తెలిసేలా రావు. దూకుతూనే ఉండాలి. ఒకసారి అవకాశంలోకి దూకామని తర్వాత అర్థమవుతుంది.సంగతి తెలిసింది!


ఒక దేశం ఉంది. ఆ దేశంలో గాడిదలు లేవు. ఒకతను ప్రయత్నంగా మరెక్కడినుంచో ఒక గాడిదను తెచ్చుకున్నాడు. కొంతకాలం దాన్ని బాగానే సాకాడు. కానీ, దాన్ని ఏరకంగా వాడుకోవాలో అర్థం కాలేదు. తిండి దండగ అంటూ గాడిదను ఒక కొండ పక్కన అడవిలో వదిలేసివచ్చాడు. అతని బాధ తీరింది. గాడిద, దొరికిందేదో తింటూ బాగానే బతుకుతున్నది. ఆ అడవిలో ఒక పులి కూడా ఉంది. అది ఒకనాడు గాడిదను చూచింది. అంత ఎత్తున్న కొత్త జంతువును చూసి కొంచెం భయపడింది. ఎక్కడినుంచి వచ్చిందో అనుకుంటూ కంటబడకుండా తప్పించుకుని తనదారిన తాను పోయింది. ఆ తరువాత పులి, దొంగచాటుగా గాడిదను పరిశీలిస్తూ కాలం గడిపింది. కొన్నాళ్లకు కొంచెం ధైర్యం కలిగి గాడిదకు దగ్గరగా వచ్చింది. అయినా తప్పించుకుని తిరిగింది. ఒకనాడు పులి వచ్చిన సమయానికి గాడిద ఓండ్రపెట్టింది. తన సంగతి తెలిసిపోయిందేమోనని జడుసుకుని పులి పరుగుతీసి దాక్కుంది. కొంచెం సేపటికి దొంగచాటుగా వచ్చి గాడిదగారిని రహస్యంగా పరికించింది. పెద్ద శరీరం, పెద్ద గొంతు తప్పితే మరేమీ ప్రత్యేకంగా కనిపించలేదు. పైగా, గాడిద గడ్డీగాదం తింటున్నది! పులికి, గాడిద అరుపులు అలవాటయి, నిర్లక్ష్యం మొదలయింది. అది వచ్చి గాడిద చుట్టు తిరిగి చూచింది కూడా! దానికి ధైర్యం పెరిగింది. గాడిద ముందుకు వెళ్లి, కావాలనే దాన్ని కుమ్మింది. గాడిదకు కోపం వచ్చింది. అది వెనుక కాళ్ళతో పులిని తన్నింది! పులికి విషయం అర్థమయింది! ఇంతేనా ప్రతాపం! అనుకుంది. అమాంతం పైనబడి, పులి గాడిదను చంపి తినేసింది!

పని - సమయంనటుడు నసీరుద్దీన్ షా నాటకాల్లో, మామూలు సినిమాల్లో, ప్యారలల్ సినిమాలో పని చేస్తాడు. ‘రోజులో 24 గంటలున్నాయి. ఎనిమిది గంటలు పని. ఎనిమిది గంటలు నిద్ర. అయినా మరో ఎనిమిది గంటలు ఉండనే ఉన్నాయి. చేయదలచుకున్న పనికోసం సమయాన్ని వాడుకోవడం నా పద్ధతి’ అంటాడు ఈ 61 ఏళ్ళ యువకుడు. అతనింకా సినిమాల్లో నటిస్తున్నాడు. నాటకాలలో పాల్గొంటున్నాడు.
===

అసలు మాట
అవకాశాలలో అపార్థాలను, అనర్థాలను చూచేవారు నిరాశావాదులు. అనర్థాలలో కూడా అవకాశాలను వెదికేవారు
ఆశావాదులు -హ్యారీ ట్రూమన్

స్వతహాగా స్వభావం మంచిదయితే, ప్రపంచంలో వెలుగులే కాదు, మరెన్నో కనబడతాయి. అనుకోకుండానే, మంత్రం వేసినట్టు, అవకాశాలన్నీ మన ముందుకు వచ్చేస్తాయి. అప్పటివరకు కనిపించని ప్రపంచమంతా, మార్పు తరువాత ఎదుట నిలుస్తుంది.
-అర్ల్ నైటింగేల్

Sunday, June 17, 2012

సైన్సు.. బతుకు.. తీరు..


సైన్సు అంటే ఫ్రపంచం. సైన్సు అంటే జీవితం. ప్రపంచంలో, జీవితంలోనూ అందమయిన, ఆనందమయిన సంగతులుంటాయి. అంతకంటే ఎక్కువగా అందుకు వ్యతిరేకమయిన అంశాలు కూడా ఉంటాయి. అందుకే, సైన్సులోకూడా గొప్ప సంగతులుంటాయి. అవి ప్రపంచాన్ని గురించి పాఠాలు చెపుతాయి. కొన్ని సంగతులు మాత్రం భయంకరంగా ఉండి పాఠాలు చెపుతాయి. వాటిని పట్టించుకోకుండా బతకడం వీలుకాదు.

భూమి- విశ్వం:
మనిషి మొదట్లో ఈ విశ్వానికి తాను, తన భూగోళం కేంద్రం అనుకున్నాడు. ఇవాళటికీ భూమి స్థిరంగా ఉందని, సూర్యుడు తూర్పున ఉదయించి, పడమట అస్తమిస్తాడనీ అనుకునేవారు మన మధ్యన ఉన్నారు. కోపెర్నికస్ వచ్చి, భూమి మిగతా గ్రహాలతోబాటు సూర్యునిచుట్టూ తిరుగుతున్నదని అన్నాడు. అప్పటివారంతా ‘అర్థంలేని మాటలు’ అని కొట్టిపడేశారు. విశ్వానికి భూమి కేంద్రం కాదని అర్థం కావడానికి వందల ఏళ్లు పట్టింది. గెలిలెయో వచ్చి, దుర్భిణీ పెట్టి చూపించి విషయాన్ని వివరించసాగాడు. అప్పటివారికి చంద్రునిమీద గుంటలున్నాయంటే నచ్చలేదు. అసలు కొందరు టెలిస్కోపునే ఏవగించుకున్నారు. మతవాదులు గెలిలెయోను శిక్షలతో సత్కరించారు. సైన్సు నిజం చెపుతుంది. మనిషికి ఆ నిజం కనిపించడానికి సమయం పడుతుంది.

సూక్ష్మజీవులు:
అసలు కొంతకాలంవరకు ఈ సూక్ష్మప్రపంచం గురించి తెలియదు. తెలిసిన సూక్ష్మజీవుల ప్రపంచమంతా మనకు శత్రువులతో నిండి ఉందన్న భావం ఇంకా మిగిలింది. మన ఒంట్లో సూక్ష్మజీవులు ఉండి మనకు సాయం చేస్తుంటాయని చాలామందికి తెలియదు. సూక్ష్మజీవులను మందుల సాయంతో చంపడం ఒక పద్ధతి. సూక్ష్మజీవులనే వాడి వాటిని నాశనం చేయడం మరో పద్ధతి. టీకాలు లేకుంటే.. ఈ ప్రపంచం, ఈ జనాభా మరొక రకంగా ఉండేది. ఆటలమ్మ, మశూచి లాంటి వ్యాధులను వాటి ప్రభావాన్ని చూచిన వారికి తప్ప, ఈ సంగతి సులభంగా అర్థం కాదు. ఇక కొన్ని సూక్ష్మజీవులు మాత్రం అదుపు చేయడానికి వీలుగాని వేగంతో పెరుగుతున్నాయి.

ఇన్‌ఫ్లుయెంజా వైరసు అనుక్షణం మారుతూ పోతుంది. ఈ ఏడాది తయారుచేసిన టీకా మందు మరో ఏడాదిలో పనిచేయదు. స్ట్ఫాలోకోకస్ క్రిమి ఆసుపత్రులలో నిండి అందరినీ గజగజలాడిస్తున్నది. ఎబోవా, సార్స్, బర్డ్ఫ్లూ, స్వైన్‌ఫ్లూ లాంటి కొత్త వ్యాధులు బయటపడుతున్నాయి. క్షయవ్యాధి తిరిగి తల ఎత్తుతున్నదంటున్నారు. ఎన్ని రకాల మందులు వేసినా, తట్టుకుని పెరిగే క్రిములు వస్తున్నాయంటున్నారు. కొత్త శతాబ్దం వచ్చింది. పాత సమస్యలు మాత్రం మొండిగా కొనసాగుతున్నాయి. సైన్సు ముందుకు సాగుతున్నది. కొన్ని విషయాలలో మాత్రం గెలుపు కుదరడం లేదు.

తిండి తీరు:
మనిషి బతకడానికి తిన్నంతకాలం పరిస్థితి బాగానే ఉంది. కానీ, తిండిలో రుచి వెతకడంతో సమస్యలు పుట్టుకు వస్తున్నాయి. రుచికరమయిన తిండి ఏదీ ఆరోగ్యకరమైనది కాదనే పరిస్థితి వచ్చింది. మన దేశంలో తీపి, నూనె, నెయ్యి లాంటివి చాలామందికి విషాలుగా కనబడుతున్నాయి. అసలు తిండి తినకుండా బతకడం వీలయితే బాగుండుననే వారు ఉన్నారు. రుచిగల తిండి తింటే గుండె జబ్బులు, డయాబెటిస్, కొన్ని రకాల క్యాన్సర్లు క్రమంగా పెరుగుతాయని పరిశోధనల ద్వారా నిరూపిస్తున్నారు. మసాచుసెట్స్- యుఎస్‌ఏలో 1948లో 5000 మందితో గుండె- తిండి సంబంధం గురించి పరిశోధనలు మొదలయ్యాయి. అప్పటి వలంటీర్ల మనుమలు, మనుమరాండ్రతో ఇంకా ఈ సర్వే సాగుతున్నది. ఇంతకాలం పరిశోధించి వారు చెప్పింది ఒకటే సంగతి. రుచిగల తిండి మంచిది కాదు.. అని! అక్కడి వారు వేపిన మాంసం, ఐస్‌క్రీములు మరీ ఎక్కువగా తింటున్నారు. అవి అసలు పనికిరావని తినకూడదని పరిశోధకులు చెపుతున్నారు. పండ్లు, కాయధాన్యంలో రకాలు కొన్ని, నట్స్, రెడ్‌వైన్ మంచివని కూడా వారే చెపుతున్నారు.

మానవులు తిండి దొరకని కాలంలో, కేవలం కాయలు, పళ్లు ఏరుకుని, జంతువులను వేటాడి తిండి సంపాదించేవారు. అప్పుడు, కావలసినపుడు తిండి దొరికేది కాదు. ఉప్పు, కొవ్వు, చక్కెరలు దొరికినంత తినడం అప్పుడు మొదలయింది. అప్పుడవి తిన్నా నష్టం లేదు. కానీ, కూచుని కదలకుండా దినం గడిపే ఈ కాలంలోనూ అదే తింటామంటే కుదరడంలేదు. మనవారు నెయ్యి పోసుకుని తిన్నారు. అంతగాను శ్రమించారు. మనకు శ్రమ తెలియదు. నెయ్యి తినడం కుదరదు. సైన్సు ఎన్నో చెపుతుంది. మంచీ, చెడు తెలుసుకోవడం మనిషికి ఒకోసారి కష్టమవుతుంది.

జంతు జాతులు కనుమరుగు:
రకరకాల విషయాల ఆధారంగా గతంలో జరిగిన సంగతులను పరిశోధించే వారున్నారు. వాటిలో పాలియోంటాలజిస్టులు కూడా ఒక రకం. వారు జీవం చరిత్రను గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. జీవజాతుల చరిత్రలో ఇప్పటికి మొత్తం ఐదుసార్లు పెద్ద ఎత్తున జంతు, వృక్షాలు తుడిచిపెట్టుకుపోయినట్లు వారు లెక్కలు తీశారు. అంతరిక్షం నుంచి రాళ్లువచ్చి గుద్దుకుని, అగ్ని పర్వతాలు పేలి, లేక వాతావరణంలో పెద్ద ఎత్తున మార్పులు వచ్చి ఈ ప్రళయాలు జరిగాయి. ఇంకా కొన్ని కారణాలు కూడా ఉండి ఉంటాయి.

జంతు జాతులు నమూనా మిగలకుండా తుడిచిపెట్టుకుపోతాయంటే చాలామందికి నమ్మకం కుదరలేదు. మాస్టడాన్ అనే ఏనుగులాంటి జంతువు ఎముకలు కనిపించినపుడు, ఆ రకం ప్రాణి అడవులలో ఎక్కడో ఉండాలని అనుకున్నారు. కానీ, ఆ జాతి పోయి శతాబ్దాలయింది. ప్రస్తుతం ఆరవ ప్రళయం జరుగుతున్నదని పాలియోంటాలజిస్టులు అంటున్నారు. మనిషి జాతి ఒక ఖండం నుంచి మరో ఖండానికి వ్యాపించిన కొద్దీ పెద్ద జంతువులు నాశనమయిపోయినయి. అమెరికాలో మాస్టడాన్, ఆస్ట్రేలియాలో పెద్ద కంగారూ, యూరోపులో పొట్టి ఏనుగులు అందుకు ఉదాహరణలు. మనిషి ప్రస్తుతం వేటవల్ల, వాటి ఆవాస ప్రాంతాలను ఆక్రమించడం చేతనూ, వ్యాధులు ప్రబలడానికి కారణం కావడం వల్లనూ, ఎన్నో జంతు జాతుల వినాశనానికి కారణమవుతున్నాడు. కొన్ని మార్పులు చాలా కాలంపాటు జరుగుతాయి. అవి మనకు కనిపించవు, అర్థం కావు. వాటికి గల కారణాలు చటుక్కున తోచవు. అందులో మన ప్రమేయం ఉందని అసలే అర్థం కాదు. సైన్సు హెచ్చరిస్తుంది. అది మనకు అనవసరమనిపిస్తుంది.

ఐన్‌స్టైన్ సూత్రం:
శక్తిని నిర్వచించడానికి- ఈ ఈజ్ ఈక్వెల్‌టు ఎమ్.సి స్క్వేర్ అని ఒక సూత్రాన్ని ఐన్‌స్టైన్ ప్రతిపాదించాడు. ఇది నిజంగా, చాలా గొప్ప సమీకరణమని అందరూ చెపుతారు. అంత వరకు బాగానే ఉంది. అది నిజానికి మరో చిత్రమయిన అంశాన్ని సూచిస్తుంది. గొప్ప శక్తిని పుట్టించడానికి ఎక్కువ పదార్థం అవసరం లేదని, ఈ ఈక్వేషన్‌కు మరోలా అర్థం చెప్పవచ్చు. సీస్క్వేర్ అన్న పరిమాణంలో ఆ రహస్యం (అంత రహస్యమేమీ కాదది!) ఉంది. అది కాంతివేగం. సెకండుకు అది 186,282 మైళ్లు కదులుతుంది. ఆ అంకెను అదే అంకెతో గుణించాలి. (స్క్వేర్ అంటే అదే) వచ్చే అంకె 34,70,09,83,524. ఐన్‌స్టైన్ సూత్రాలు అర్థంగాక బుర్రలు బద్ధలు కొట్టుకున్న వారి లిస్టులో మనమూ చేరదామంటే సరే! కానీ ఇక్కడ ఒక విషయం మాత్రం సులభంగా అర్థమవుతుంది. ఒక మహానగరాన్ని క్షణాలమీద నాశనం చేయాలంటే, ఒక్క పిసరంత ప్లుటోనియం ఉంటే చాలు! ఐన్‌స్టైన్ సూచనను ఈ రకంగా అర్థం చేసుకున్నవారు ఎంతమంది? సైన్స్ ఎన్నో చెపుతుంది. వాటికి అర్థాలు, అన్వయాలు మనం వెతకాలి మరి!

మనమూ - మన మెదడు:
సైన్సు అనగానే ఫిజిక్సు, కెమిస్ట్రీ, జియాలజీ లాంటివే అందరికీ కళ్లముందు కదలాడతాయి. వాటి ప్రభావం, ప్రమేయం మన మీద ఉందని గమనించగలిగితే మరో రకంగా ఉంటుంది. అందుకే, మన సంగతి చూడాలని ప్రయత్నం. మన ప్రవర్తన, పద్ధతులు, భావాలు మొదలయినవి మన అదుపులో లేవు. మనకు అర్థం కావు అని పెద్ద పెద్ద పరిశోధకులంతా చెపుతూనే ఉన్నారు. ఆనందంగా, ఆహ్లాదంగా ఉన్నారంటే ఆనాడు బయట వాతావరణం సుఖప్రదంగా ఉన్నందుకట తెలుసా? పది రకాల రుచులను నాలుకకు అందించి, అందులో ఏది బాగుందని అడిగితే, అందరికీ, లేదా చాలామందికి మొట్టమొదటి రుచి గుర్తుకు వస్తుందట. మరీ తరచుగా కనిపించే వస్తువు లేదా మనిషి మీద ప్రేమ మరీ ఎక్కువవుతుందట. జంటల మధ్యన ఆకర్షణకు వాసనలు ఆధారమట. ఇక కథను మరోవైపు నడిపిస్తే మనం కారణం లేకుండా, తెలియకుండా కొందరు వ్యక్తులు, కొన్ని వస్తువులను అసహ్యించుకుంటాము. అందిన సమాచారానికి, మనకు నచ్చిన, అనుకూలమయిన అర్థాలు చెప్పుకుంటాము. అనవసరమైన సంగతులన్నీ మన దృష్టిని ఆకర్షిస్తాయి. జ్ఞాపకాలు అనుకుంటున్నవన్నీ మనకు మనం చెప్పుకుంటున్న సంగతులు మాత్రమే. అందులో చాలావాటిని నమ్మడానికి లేదని పరిశోధన పూర్వకంగా రుజువు చేశారు.
మనకు ప్రపంచ జ్ఞానం చాలా ఉందనుకుంటాము. సైన్సులోనూ ఎందరో మహామహులు కొత్తదారులు వేసి ప్రపంచం నడిచే తీరును, దిశలను మార్చారు. కాని, వారి ప్రవర్తన మాత్రం ఎవరికీ అర్థం కాలేదు!

సైన్సుకు అందని అంశాలలో మనిషి, మెదడు మొట్టమొదటివి!

అంతా కోతులమే!:
కోతులు మన తాతలు అంటే బాగుంటుంది. మనం కోతులం కాదులే! అనుకోవచ్చు. కానీ పరిణామక్రమం ఒక నాటిలో, వందేళ్లలో జరిగిన సంగతి కాదు. ఇంకా మనలో ఎంత కోతి శాతం మిగిలి ఉందన్నది అసలు ప్రశ్న!
భూ చరిత్రలో సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాలకు గుర్తింపు లేదు. మనకు ఈ సంగతి అర్థమయింది గనుక మనల్ని మనం ప్రత్యేక జాతిగా అనుకుంటున్నాము కానీ, కోతుల జాతి చరిత్రలో మనం ఇటీవలి మార్పు కింద లెక్క. చింపాంజీలకు, గొరిల్లాలకన్నా మనకు కొంచెం ఎక్కువ తెలివి ఉందేమో! కానీ ఈ కోతి మనసుకు కొంత మాత్రమే తెలుసు!
అందరూ జీవమంతా, వైవిధ్యంతో సహా, ఒకేనాడు పుట్టిందనుకున్నవాళ్ళే. డార్విన్ కూడా ఇలాగే అనుకున్నాడు. కానీ పరిశీలనల కారణంగా అభిప్రాయాలు మార్చుకుని పరిణామసిద్ధాంతాన్ని మనకు అందించాడు. ఒకటిన్నర శతాబ్దం గడిచింది గానీ, పరిణామం పద్ధతి మాత్రం ఇంకా అర్థం కాలేదు. మనం కోతులమంటే ఎవరికీ నచ్చదు. కానీ సైన్సు మాత్రం అదే నిజమంటున్నది!

ఆలోచనలు ఉన్నంత మాత్రాన సైన్సు సాగదు. సాగలేదు. అవగాహనలో లోతు అవసరం!

మనిషికి మనిషే శత్రువు:
ఈ సంగతి అందరికీ అనుభవంలో ఉన్నదే. వాతావరణం, నీరు, గాలి, ఆరోగ్యం లాంటివి సమస్యగా మారాయంటే, మన కారణంగానే కనుక, మనకు మనమే శత్రువులం. మానవ చరిత్రలో రాజ్యాలు, రాజుల గురించి చెపుతారు. కానీ మనిషి స్వభావం గురించి తక్కువగా మాత్రమే చర్చిస్తారు. ఒక తండ్రి, తన కొడుకుకు తిండి దొరకదని, తన శరీరాన్ని పీక్కుతినమన్నాడు. ఒక మహారాజు మరణించిన తరువాత కూడా, తనతో సిరిసంపదలను పాతి పెట్టించుకున్నాడు. ఆడ తోడును బలవంతంగా వెంటబెట్టుకు‘పోయిన’ కథలు మన దేశం, చైనాలలో ఉన్నాయి. నరబలి కథలు మనకు తెలిసినవే. ఆజ్‌టెక్ జాతి వారు ఒక మందిరం పారంభం కొరకు వేలాది మందిని బలియిచ్చారు. ఈ సంగతులలో నిజమెంతో, కథ ఎంతో చెప్పడం తేలిక! బైబిల్‌లో, గ్రీకు పురాణాల్లో, నార్స్ చరిత్రలో రోమన్ గాథలలో నరబలి నిండుగా వివరాలతో కనబడుతుంది. మనిషిని మనిషి చంపడం రకరకాలుగా సాగింది. కానీ, అదొక తంతుగా చంపడం కూడా సాగడం విచిత్రం! మనిషిని మనిషి తినడం అంతకన్నా విచిత్రం! ఇందులోని సైన్సు అర్థం కాదు. ఇందులో సైన్సు ఏమిటి అన్నా తప్పులేదు!

పర్యావరణం- వాతావరణం:
సులభంగా అర్థమయే సంగతులు కూడా మనకు పట్టడంలేదు. కార్లు, దీపాలు, మరెన్నో సౌకర్యాల పేరున ఇంధనాలను వాడుతున్నాము. కార్బన్‌డై ఆక్సైడ్ లెస్సగా పుడుతున్నది. భూవాతావణం మొత్తం వేడెక్కుతున్నది. ఫలితంగా మంచు కరుగుతున్నది. పూలు అకాలంగా, త్వరత్వరగా పూస్తున్నాయి. చల్లదనం పేరున, మనుషులు జంతువులు వలసపోతున్నారు!

మనం పుట్టించిన ఈ కాలుష్యం, మనం పోయిన తర్వాత వందల ఏళ్ల దాకా నిలిచి ఉంటుంది. అంటే ప్రభావాలు, మన వారిమీద కలకాలం కొనసాగుతాయి! నరబలి అంటే.. ఇదేమి సైన్సు అనవచ్చు. కాలుష్యం కూడా మరో రకం నరబలి కాదా?

విశ్వం - విస్తారం:
మనకు మన గురించి అర్థం కాలేదు. మన మనసు తెలియదు. మెదడు లోతు తెలియదు. కానీ ప్రపంచమంతా అర్థమయిందన్న భావం మాత్రం బలంగా ఉంది. ప్రపంచ జ్ఞానం అన్న మాటను అందరమూ గర్వంగా వాడుతుంటాము. ఈ విశ్వంలో మన ప్రపంచం ఒక చిన్న చుక్క! విశ్వం అన్నమాట వినగానే, చదువుకున్నవారికి, విశ్వం గురించి చదువుతున్నవారికి తోచేవి గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలు, బ్లాక్‌హోల్స్, తోకచుక్కలు, మరింత దుమ్ము మాత్రమే! ఇవన్నీ కలిసి విశ్వంలో నాలుగు శాతం కన్నా ఎక్కువ భాగం కాదంటే ఆశ్చర్యం కదా! మిగతాదంతా చీకటి అంటే డార్క్ వ్యవహారం. విశ్వంలో 23 శాతం డార్క్ మాటర్ ఉంది. మిగిలిన 73 శాతం డార్క్ ఎనర్జీ. వీటి స్వభావం గురించి తెలిసింది తక్కువ. డార్క్ పదార్థం కణాల గురించి కేవలం అభిప్రాయాలు మాత్రమే ఉన్నాయి. సమాచారం లేదు. ఇక డార్క్ శక్తి గురించి అసలేమీ తెలియదు. దీన్ని ‘సైన్సులో అసలు సిసలయిన మిస్టరీ’ అని వర్ణిస్తున్నారు. కానీ, ఈ డార్క్ వ్యవహారం ఆధారంగానే విశ్వం విస్తరిస్తున్నదని మాత్రం తెలుసు. ఈ విస్తరణ ఊహలకందని వేగంతో సాగుతున్నది. విస్తరణ సాగితే విశ్వం పలచబడుతుంది. చల్లబడుతుంది. కుప్పకూలుతుంది. అది బిగ్ బ్యాంగ్‌తో మొదలయిన కథకు చక్కని ముగింపు!

ఇది సైన్సు తీరు! విజ్ఞానం అంటే తెలివి. మనకు తెలిసింది తక్కువ అన్న తెలివి. ఆ కొంచెం తెలిసిన సైన్సు- అర్థం కాదంటారు. అవసరం లేదంటారు. ఏమిటిదంతా?

Wednesday, June 13, 2012

దేవులపల్లి కృష్ణశాస్త్రి కవిత

ఈ కవిత పైన చాలా చర్చ జరిగింది.
గజిబిజిగా ఉందన్నారు.
నైరాశ్యం అన్నారు

మీరే చదవండి.


ఈ కవిత చాలా పాతది. 50 దశకంలోనిదేమో.

Tuesday, June 12, 2012

అర్థమయిందా?


కంటికి ఎన్నో కనబడతాయి. చెవులకు ఎన్నో వినబడతాయి. ఈ కనిపించే వినిపించేదంతా సమాచారం. అందులో భాష ఉంది. భాష కాని సమాచారం కూడా ఉంది. మనసుకు ఎక్కనంత వరకు ఈ సమాచారమంతా కేవలం వెలుగు, ధ్వని మాత్రమే. మెదడును ఉపయోగించి వాటికి అర్థాలు వెతకాలి. అందుకు మనకు ముందుగా అనుభవం ఉండాలి. కనిపించేవీ, వినిపించేవీ అప్పటికే మనకు తెలిసి ఉంటే వాటికేదో అర్థం ఉంటే, అది తెలుస్తుంది. అందులో కొన్ని నమ్మకాలు, విలువలు, గుర్తున్న అంశాలు, గమ్యాలు, అవసరాలు మొదలయిన ఎన్నో విషయాల ప్రభావం కూడా తోడుగా ఉంటుంది. మన లోపలే బోలెడంత సమాచారం కుప్పగా పడి వుంటుంది. దాని ఆధారంగా, ఈ కొత్త సమాచారం సంగతి తెలుస్తుంది. ఒక అనుభవంలో నుంచి, సాధారణమయిన భావాలు, సంకేతాలు మెదడుకు అందుతాయి.

కనిపించే, వినిపించే సమాచారాన్ని అందించిన వారు ఒక ఉద్దేశ్యంతో, ఒక అర్థాన్ని ఊహించి సంకేతాలను తయారుచేసి ఉండవచ్చు. లేదా, ఆ సమాచారం దానంతటదే పుట్టి ఉండవచ్చు. కోపం తెలియజేయడానికి చేతిలోని వస్తువును కింద పడవేస్తే ఒక అర్థం. ఆ వస్తువు అనుకోకుండా కింద పడితే ఒక అర్థం. భాష తెలిస్తే ఒక అర్థం, తెలియని భాషయితే అది మరో అర్థం! సమాచారం అందగానే మనలోపల కొంత జల్లింపు జరుగుతుంది. పంపేవారుంటే, వారిలో కూడా ఈ జల్లింపు ఉంటుంది. ఒక వస్తువు, ఒక మనిషి కనబడితే, చటుక్కున గుర్తిస్తాము. ఆ తర్వాత వరుసగా జల్లింపు జరిగితే ఆ మనిషి, వస్తువు గురించి, సమయ సందర్భాల గురించీ అర్థమవుతుంది. గడియారం గంటకొట్టింది. అంటే ఒక పనికి వేళయిందని అర్థం. పాల మనిషి వచ్చాడు. అంటే గిన్నె తెచ్చి పాలు పట్టాలని అర్థం! ఈ సంగతులన్నీ అలవాటుగా అనుకోకుండా జరిగిపోతుంటాయి. వాటి గురించి మనం ప్రత్యేకంగా ప్రయత్నించి ఆలోచించనవసరం లేదు.

ముందుగా ఒక సంగతి తెలుస్తుంది. దాని కారణంగా మరేదో అర్థమవుతుంది. ఆ తరువాత చేయవలసింది, చెప్పవలసింది ఏదో ఉంటుంది. కొన్నిసార్లు ఏమీ చేయకుండా ఉంటేనే సరైన పనని కూడా అర్థమవుతుంది. వచ్చినది పాల మనిషి అనుకుంటాము. అతను వచ్చే టైం అయింది గనుక ఆ భావం. కానీ చూస్తే, అతను కాదు. మరోసారి, మామూలుగా వచ్చే పాలమనిషి కాదు, కానీ, ఈ వచ్చిన కొత్తమనిషి మాత్రం మనకు పాలు పొయడానికే వచ్చాడు. ఈ మాట అర్థం అయ్యేలోగా కొంత ఆలోచన ప్రయత్నం జరుగుతాయి. వచ్చినది పాల మనిషి కాదని తెలిస్తే, మెదడులో మరెన్నో ప్రశ్నలు, మరెన్నో అర్థాలు మొదలవుతాయి.

కొన్నిసార్లు ఈ ప్రశ్నలు, అర్థాలు అనుకున్నట్లు సాగవు. సమాచారానికి తప్పుడు అర్థాలు తోస్తాయి. సమాచారం మరీ ఎక్కువయినా తప్పుడు అర్థాలు పుడతాయి. లేక మొదట అందిన సమాచారం సరిగా మెదడుకు ఎక్కదు. సరయినది కాదు. మన ఆలోచనలు, అనుమానాలు మొదలయినవి నూరుపాళ్లు సరయినవి కాకపోవడం కూడా తప్పుడు అర్థాలకు కారణమవుతుంది.

బయట ఏదో పడింది. ‘అదేమిటి?’ అర్థం కాలేదు. ఇక మెదడులో ఆలోచనలు సుడులు తిరగడం మొదలవుతుంది. అప్పుడిక ఏదో శారీరకంగా చేయవలసి ఉంటుంది. వెళ్లి చూడాలి. లేక ఆ ధ్వని గురించిన మన అనుభవాలను వెదకాలి. అప్పుడు సంగతి తెలిసిపోతుంది.

ముల్లా నస్రుద్దీన్ యింట్లోనుంచి ‘దబ్’ అని ధ్వని వచ్చింది. పక్కింటి అతను వచ్చి ‘ఏమిటా చప్పుడు?’ అన్నాడు. ‘చొక్కా పడింది!’ అన్నాడు నస్రుద్దీన్. ‘చొక్కాపడితే అంత చప్పుడా?’ పక్కింటతను అనుమానంగా అడిగాడు. ‘అందులో నేనూ ఉన్నాను లేవయ్యా?’ నవ్వుతూ చెప్పాడు ముల్లా! అదీ, సంగతి! అర్థమయిందా?

అర్థం కాకుంటే, కొత్త అర్థం కొరకు ప్రయత్నించాలి. ఇది కొంచెం చికాకుగా ఉంటుంది. ఒక సిద్ధాంతాన్ని, లేదా కొన్ని సిద్ధాంతాలను ఊహించి, ఒక్కొక్క దాన్ని పరిశీలించాలి. ముల్లాను వదిలి మరేదో ఆలోచించండి. అర్థమవుతుంది. పని జరగకుంటే , మరెవరినో సాయం అడగాలి. ఆ మిగతా వారు ఏం చేస్తున్నారు, ఏమంటున్నారు గమనించాలి. అలవాటయిన వారయితే ముల్లాను అడగరు. అడిగి తప్పు చేసినా, అతను చెప్పింది విని ఊరుకుంటారు. మనం కొత్త వాళ్ళమయితే, కాసేపు తికమకపడి, ఆ తర్వాత అర్థం చేసుకుంటాము. చివరకు ఏమీ జరగనట్టే, మనదారిన మనం పోతాము.

అసలు మీకు ముల్లా తెలుసా? అతగాడిని ఇదివరకెప్పుడయినా చూచారా? పలకరించారా? ఇవేవీ జరగకుంటే ఒక తీరు. అంతంతగా గుర్తుంటే మరొక తీరు. బాగా తెలిసి ఉంటే అసలే వేరు! ముల్లాలాగే ఉన్నాడు. అతనేనా? కాదా? అనుమానం మొదలయిందనుకోండి. అది మరింత గజిబిజి. ముల్లా యింటికి ఎవరో పరుగెత్తుకు వచ్చారు. బజార్లో ముల్లా గాడిదమీదనుంచి పడి మతితప్పి ఉన్నాడని, వాళ్లావిడకు చెప్పడానికి వారు వచ్చారు. కానీ, ఇక్కడ ముల్లా లక్షణంగా అరుగుమీద వాలి ఉన్నాడు. వాళ్లు ఖంగుతిన్నారు. ‘ఏమిటి?’ అన్నాడు నస్రుద్దీన్. వాళ్లు సంగతి వివరించారు. ‘ఆ పడినవాడి తలపాగా ఏ రంగు?’ అన్నాడు ముల్లా. ‘ఎరుపు’ అన్నారు వచ్చినవారు. ‘అయితే నేను కాదు! నా దగ్గర ఎర్ర తలపాగా లేదు!’ అన్నాడు ముల్లా నిదానంగా! అదీ సంగతి. అర్థమయిందా?

అర్థం కాకుంటే మీరు చేసే సిద్ధాంతాలను గురించి మరో వ్యాసం రాయవచ్చు. అన్నిటికంటే ముందు మిమ్మల్ని మీరు గిల్లి చూచుకోవాలి. లేదా పిచ్చెత్తి పరుగెత్తాలి! సరదా సంగతి పక్కన పెడితే, మనకు అర్థమయిన సంగతిని బట్టి మన భావాలు, ఆవేశాలు మారిపోతాయి. ఇది ఏ సమాచారం గురించి అయినా ఒకటే. ఇందాక కిందపడింది మీ వస్తువు, మీ అభిమాన వస్తువని తెలిస్తే కోపం రావడం సహజం కదా! ఎమోషన్ మారితే అర్థాలు మారతాయి. అర్థాలతో ఎమోషన్ మారుతుంది. మీ పుస్తకం కిందపడింది. పాడయింది. ఎదుటివారు ఏమీ జరగనట్లున్నారు. వారు మీకు విలన్‌లాగా కనబడతారు. మీ విలువలు, నమ్మకాలు, జ్ఞాపకాలు అన్నీ కలిసి చుట్టుముట్టి, కందిరీగలాగా రొద చేస్తాయి. కొంతకాలం వరకు ఏదీ సరిగా అర్థం కాదు. అసలు జరిగింది ఏమిటో గుర్తుండని స్థితి వస్తుంది. అప్పుడిక అందిన సమాచారానికి అర్థం వెతికే రూటు మారుతుంది.
మామూలు సమాచారం అర్థం కావడంలో ఇంత గొడవ ఉందని ఎప్పుడయినా ఆలోచించారా? ఇక వికాసం అర్థమయిందో లేదో ఆలోచించే తీరు వెదకాలి. అర్థమయిందా?

అగ్ని ప్రళయం


అనగనగా ఒకతను. అతను యిద్దరు అమ్మాయిలను ప్రేమించాడు. ఇద్దరినీ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆ ఇద్దరేమో నిజానికి పక్షులు. కిలకిలా గలగలా నవ్వి వెళ్లిపోయాయి. మనిషి ఉత్తరంగా వెళ్లాడు. ఒక బోటు తయారు చేసుకున్నాడు. ప్రపంచానికి నిప్పంటించాడు. తాను మాత్రం బోటెక్కి తప్పించుకుపోయాడు.

అగ్గి అడవులంతా పాకింది. అతివేగంగా పాకింది. దక్షిణంగా సాగింది. మనుషులు, చెట్లు, రాళ్లు, జంతువులు, నీళ్లు అన్నింటినీ మసి చేసింది. చివరకు భూమిని కూడా!

మరీ దక్షిణంలో ఉండే అడవి కుక్క అగ్గిని చూచింది. చిటపటలు విన్నది. తప్పించుకోవాలని పరుగులు పెట్టింది. కుదరలేదు. కనుక అగ్గిని ఆర్పాలని ప్రయత్నించింది. ఇద్దరు అబ్బాయిలను సంచిలో వేసుకుని ఉత్తరంగా ఉరికింది. పొగమంచును నోట్లోకి తీసుకుని, నిమిలి ఊసింది. మంట ఆరిపోయింది. మంటయితే పోయింది కానీ, నీళ్లు లేవు. కుక్కకు దాహంగా ఉంది. అది పటికబెల్లం నమిలింది. మరింత పటిక బెల్లం తెచ్చి, గుంట తోడి పూడ్చిపెట్టింది. అదంతా నీరయి లోయ నిండిపోయింది. అంటే మళ్లీ నీరొచ్చింది.

ఇద్దరు అబ్బాయిలు ఏడవసాగారు. వారికి మనుషులెవరూ కనబడలేదు. కుక్క పుల్లలతో ఇల్లు కట్టింది. పుల్లలను చీల్చి నిలబెట్టింది. రాత్రి గడిచేసరికి పుల్లలన్నీ పిల్లలుగా మారాయి.

కథ కంచికి. మనం ఇక్కడే!

ఇంతకూ అర్థమయిందా? ఇది మరీ మరీ పాత కథ. అప్పటి ఆలోచనలు ఇట్లాగే ఉంటాయి.

అసలు మాట!

  • 23/05/2012
ఈ విశ్వం మొత్తానికీ, అసలు అర్థం లేకుంటే, దానికి అర్థంలేదని మనకు అర్థమయి ఉండేది కాదు. ఈ విశ్వంలో వెలుగే లేకుంటే, కనుక కళ్లున్న జీవులే లేకుంటే, అది చీకటని మనకు తెలిసేది కాదు. చీకటంటే, ఆ మాటకు అర్థం ఉండేదికాదు. -సి.ఎస్.లెనిన్
అర్థమయిందా? అయిందనుకుంటే అయింది. అర్థం కాదనుకుంటే, అర్థం కాదన్న సంగతి మనకు అర్థం కాదు!
జాగ్రత్తగా గమనించండి. అది వాతావరణం గురించి కాదు. జీవితంలో జరుగుతున్న సంఘటనల సంగతి అంతకన్నా కాదు. వాటికి మనమిచ్చే అర్థాలమీద అంత ఆధారపడి ఉంది. వాటికి మనమిచ్చే అర్థాలను బట్టి, మనం ఇవాళ ఉన్న తీరు, రేపు ఉండబోయే తీరు తేలుతుంది. -టోనీ రాబర్ట్స్

‘మనిషి’ అంటే అర్థాలు వెదుకుతున్న ఒక జీవి- ప్లేటో!

అర్థమయిందా? ప్రతిదానికి అర్థముండాలన్నా, అవి అర్థం కావాలన్నా కష్టం మరి!

Friday, June 8, 2012

ఆంగ్లంలో రాయల ఆముక్తమాల్యద


తెలుగునుంచి ఇంగ్లీషులోకి అనువాదమవుతున్న సాహిత్యమే తక్కువ. అందునా ఒక తెలుగు కావ్యాన్ని యథాతథంగా ఇంగ్లీషులో చెప్పే ప్రయత్నాలు జరగనేలేదు. విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం, లలిత కళల విభాగంలో, అధ్యాపకులు శిష్ట్లా శ్రీనివాస్ ఏకంగా శ్రీకృష్ణదేవరాయల ‘ఆముక్తమాల్యద’ను ఎంచుకుని ఆంగ్లంలోకి అనువదించారు. ‘తాను ధరించిన పూమాలను శ్రీరంగనాధునికి సమర్పించిన’ శూడికుడుత్తు నాచ్చియార్ అనే గోదాదేవికి ఆముక్తమాల్యద అని పేరు. చెప్పడానికి గోదమ్మ గురించి నిజానికి పెద్ద కథ లేనేలేదు. కానీ శ్రీ కృష్ణదేవరాయలు, వైష్ణవ సాంప్రదాయానికి చెందిన మరెన్నో అంశాలు కావ్యంలో ఉండవలసిన వర్ణనలు కలిపి ఈ పేరున కావ్యాన్ని వెలయించాడు.

తెలుగు కావ్యాలలో ‘ఆముక్తమాల్యద’కున్న స్థానం విశిష్టమయినది. విచిత్రమయినది. కవిత్వంలో రెండు లక్షణాలుంటాయని, మొదటిది శబ్దం, కూర్పు, బిగింపు, గడుసుదనము, పలుకుబడి కలిగి ఉంటే, రెండవ దానిలో భావము, కల్పన, అలంకారములు, కథన శైలి ముఖ్యమయినవి. ఆముక్తమాల్యద ‘ఈ రెండు మార్గములలోను దానికదే సాటి’ అని విశ్వనాధ సత్యనారాయణగారి విశే్లషణ. పైగా ఈ కావ్యం సులభంగా నములుడుపడని నారికేళ పాకంలో నడుస్తుందని అందరూ అంగీకరించిన విషయం.

శ్రీనివాస్‌గారు ఇంతకుముందు కళా విషయాలను గురించి మంచి పుస్తకాలను రచించి, ప్రచురించారు. మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయనచూపు కావ్యాలను అనువాదం చేయడంవేపు మళ్లింది. మొదటి ప్రయత్నంగా తాము రాయల ఆముక్తమాల్యదను ఎంపిక చేసుకోవడానికి ఎన్నో కారణాలున్నాయంటూ శ్రీనివాస్‌గారు ఒక చక్కని నోట్ రాశారు. ముందు పుస్తకం గురించి పరిశోధన మొదలైంది. ప్రతులు, వ్యాఖ్యానాలు, చరిత్ర అన్నింటినీ సేకరించి సవివరంగా పరిశీలించారు. అనువాదం కూడా చేశారు. ఇంతకు ముందు రాసిన పుస్తకాలకు లాగే, ఈ ఆంగ్లానువాదానికి కూడా తానే ప్రచురణకర్త, సంపాదకుడు కూడా!

కావ్యంయొక్క అనువాద భాగం 325 పేజీలపైన ఉంది. ముందొక 125 పేజీలు, చివర మరొక కొన్నిపేజీలు, ఆసక్తికరమయిన విశేషాలతో నిండి ఉన్నాయి. చిత్రంగా ఈ పుస్తకంలో బోలెడన్ని బొమ్మలున్నాయి. బొమ్మలెందుకు అన్న ప్రశ్నకు కూడా శ్రీనివాస్ చక్కని వివరణ ఇచ్చి ఉన్నారు. కృతజ్ఞతల పేజీలో కొందరి పేర్లున్నాయి. నిజమే కానీ, పుస్తకమంతా శ్రీనివాస్‌గారి త్రివిక్రమావతారం కనిపిస్తుంది. ఇందులో ఒక వెసులుబాటు ఉంది. కొన్ని కష్టాలూ ఉన్నాయి.

పరిశోధకుడు, అనువాదకుడు, ఫ్రచురణకర్త తానే అయిన శ్రీనివాస్ ఒక కళాజీవిగా, కథకుడుగా చక్కనిపుస్తకాన్ని అందించారు. ముద్రణ కూడా చాలా బాగుంది. అట్టమీద బొమ్మ అందంగా ఉంది. గానీ ఆ బొమ్మనే ఎందుకు వాడిందీ అర్ధం లేదు. మొత్తానికి ఈ పుస్తకం ప్రచురణలో మరెవరిదైనా ప్రమేయం ఉంటే, దాని తీరు మరోరకంగా ఉండేదన్న భావం కలిగింది.

పరిశోధన చేసి రాసిన ప్రవేశిక, పండితులను ఆకర్షించేదిగా ఉంది. రాయల ఆముక్తమాల్యద వ్రాసిన తీరు గురించి, కథాక్రమం గురించి విడిగా చెప్పారు.ఆ తరువాత రియాలిటీ అండ్ మిత్ అనే పేరుతో కావ్యానికి సంబంధించిన సాహిత్య,రాజకీయ, మతపరమైన విశేషాలను ఎన్నో ఉపశీర్షికల కింద తర్కించారు. ఇందులోని చాలా అంశాలు (శ్రీనివాస్‌వల్ల కాదుగానీ) చర్చనీయమైనవే. రకరకాల విషయాలను ఒక చోటి చేర్చి చూడాలని శ్రీనివాస్ చేసిన ప్రయత్నం చాలా బాగుంది.

గోదమ్మ, పన్నిద్ధరాళ్వారులలో ఒకరు. కనుక కావ్యమంతటా వైష్ణవమే. కనుక శ్రీనివాస్‌గారు వైష్ణవం గురించి తర్కించడం సమంజసం,. అవసరం కూడా. కానీ మరింత వివరంగా ఈ విషయం గురించి సమాచారం చేరి ఉంటే బాగుండును. అహోబిల మఠాన్ని స్థాపించినవారు ఆదివణ్ శఠకోపయతి. ప్రస్తుతం ఉన్న ఇరువురు జియ్యర్లతో సహా, మఠానికి అధిపతులయిన యతీంద్రులు అందరి పేరులోను ముందు ఈ శఠకోప శబ్దం ఉంటుంది. ఈ పదానికి గల అర్ధం గురించి ప్రసక్తి సరిగా లేదని అనుమానం. శఠమనే దుర్లక్షణాన్ని దూరం చేసేది శఠగోపమని సంప్రదాయం. తమిళ భాషలో క,గలలకు ఒకటే అక్షరం గనుక అది శఠకోపమయిందా? తరువాత ‘వణ్ శఠకోప’ అని ఒక మాట వాడారు. శ్రవణ్ శఠకోప అని ఉండాలేమో! శ్రీమాన్ వంటి శబ్దమది.

‘చాలా తక్కువగా ఉన్న అచ్చు తప్పుల లాగే, ఏవో చిన్న ప్రశ్నలు తప్ప, శ్రీనివాస్ అందించిన పరిశోధనాంశాలు, కావ్యాలతో పోటీపడి చదివించేవిగా ఉన్నాయి. అనువాదానికి పడ్డ శ్రమకు సూచనగా పాఠభేదాలు, వ్యాఖ్యానాలతో తేడాల గురించి చేసిన చర్చ ఆసక్తికరంగా ఉంది. ‘పొరి విళంగాగ గములు’ అన్న మాటకు అర్ధం వెదికిన తీరు, ఆ వివరాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. తమిళంతో, అలనాటి తమిళంతో మంచి పరిచయమున్న వారు ఈ విషయాలను వివరిస్తే బాగుండును. పొరి అంటే పొడి అని అర్ధం ఉంది. లడ్డూలవంటి మధుర పదార్ధాలను ‘కాయలుగా వర్ణించే పద్ధతి కూడా ఉంది. గమి అన్నా గములు అన్నా సమూహమే! బాగుంది.

రాయల రచన చిత్రంగా సాగుతుంది. అది పండితులకే తప్ప మామూలు పాఠకులకు సులభంగా లొంగదు. మాతృక శైలి నారికేళమయితే, అనువాదశైలి కూడా అదే దారిని నడవాలా? నడవకూడదు. నడవలేదు. ఫలితంగా కావ్యం ఇంగ్లీషులో చదివితే అర్ధమయ్యేదిగా వచ్చింది. మూలంలోని ’జిగి’, ’బిగి’ అందవు. ఒకరకంగా అది లోపం. కానీ విషయం అందుతుంది. అది గుణం!

రెండవ అశ్వాసంలోనే విష్ణుచిత్తుడు ‘నాకు చదువురాదు!’ అని చెప్పడానికి ఒక పద్యం! ‘స్వామీ నన్ను’ అని ఆరంభమయే ఆ పద్యం అందరికీ తెలిసి ఉంటుంది. అందులో రెండు పాదాల నిడివికి పైన ఒక దీర్ఘమయిన సమాస పరంపర. దాన్ని ఇంగ్లీషులో మాత్రం చాలా సులభగ్రాహ్యమైన మాటలలో రాశారు. (ఈ పద్యం అనువాదంలో 91-ఎమెస్కో వారి మూలంలో 90-పాఠభేదమని అర్ధం!

అట్లాగే మూడవ ఆశ్వాసంలో 85 పద్యం ఒక సీసం. అది రాయల రచనకు మచ్చుతునక. మొదటి పాదంలోని మొదటి భాగం సంస్కృత సమాసం. రెండవ భాగం, (దొడ్డ కెందమ్మ కన్‌దోయి వాలి) అచ్చతెనుగు. ఆంగ్లంలో ఈ శైలిని ప్రతిబింబించడం సాధ్యమా? రాయల రచన ఎంత గహనంగా సాగుతుందో, శ్రీనివాస్ అనువాదం అంత సరళంగా సాగింది. మూలంలోని తీరు కనపడకపోవడం, లోపమయితే ఇది లోపం! అశోక్ బ్యాంకర్ అనే రచయిత ఆంగ్లంలో రామాయణం రాశాడు. అది నవల చదివినట్టు ఉంటుంది. అది లోపమా?

శ్రీనివాస్ కథను పద్యాల ప్రకారం వచనంగా చెప్పలేదు. పాదాల ప్రకారం అనువాదం చెప్పారు. అది కవిత మాత్రం కాదు. తన మాటలలో లయ ఉందని ఆయనే అన్నారు. తెలుగు పద్యాలలో ఎక్కడా కనిపించని ‘కొటేషన్’ మార్కులు ఎమెస్కో తెలుగు ప్రతిలో ఉన్నాయి. ఆశ్చర్యం మార్కులు అనువాదంలో ఉన్నాయి. అవి విషయంలో అనువాదకుడు పొందిన అనుభూతికి గుర్తులు!

కళా పరిశోధకుడు, పరిశీలకుడు శ్రీనివాస్, ఈ ‘కావ్యం’లో వాడిన ఫోటోలను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ‘సచిత్ర’ కావ్యం ఒక కొత్త పద్ధతి. పద్యం చదువుతుంటే, తన కనుల ముందు మెదలిన చిత్రాలను, (అక్కడకక్కడ నేరుగా సంబంధం లేకున్నా) వాడిన తీరు ఆసక్తికరంగా ఉంది.

‘తలిరింగైదువుజోదునానతి’ (వి.95)లో ఆయుధాల ప్రసక్తి. అక్కడ బొమ్మ లియోనార్డో దావించీ ఫిరింగి! భలే!
తెలుగు, ఇంగ్లీషు భాషలతో సమానంగా పరిచయమున్నవారు రెండు ‘వర్షన్స్’ను తులనాత్మకంగా చదివి ఆనందించవచ్చు. తెలుగు తెలియనివారు గోదమ్మ కథను, మిగతా అంశాలను మరింత బాగా ఆనందించవచ్చు. ఆనందించవలె! ఈ పుస్తకాన్ని అంతర్జాతీయ సంస్థలవారు (ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్) అందుకుని ఉంటే, తెలుగులోని రచనల తీరు ప్రపంచానికి ‘మరింత’ బాగా అందేదని అనిపించింది. ఇప్పుడు అందనిది లేనే లేదు. మంచిపనికి మంచి ప్రాచుర్యం రావాలి. శ్రీనివాస్‌గారు ‘సేల్స్’ అన్న కార్యకమాన్ని కూడా తామే తలకెత్తుకుంటే తర్వాతి సృజనాత్మక కార్యక్రమం సాగదు. పుస్తకం అందవలసిన దూరాలకు అందదు!

అందంగా ఆసక్తికరంగా రూపొందించిన ‘ఆముక్తమాల్యద’ గ్రంథానికి అయిదు తక్కువ అయిదువందలు. తక్కువే ధర!

-కె.బి.గోపాలం

ఈ రచయిత ఈ మధ్యనే మనుచరిత్ర ఆంగ్లానువాదం కూడా ప్రచురించారు.

వివరాలకు:

శ్రీనివాస్ శిష్ట్లా
దృశ్యకళాదీపిక
4-61-7, లాసన్స్ బే కాలనీ,
విశాఖపట్నం - 530017

ఫోన్ - 09395345431

sistlasrini@gmail.com 

Tuesday, June 5, 2012

ప్రకటన - పరిస్థితి

టీ కొత్తగా దేశంలోకి వచ్చిన కాలంలో ఇలాంటి ప్రకటనలు వచ్చాయంటే నమ్మగలరా?