Thursday, November 29, 2012

పిట్టల గురించి పట్టదా?

‘ఇంత ఛిన్న పిట్టవు. ప్రపంచానికి పట్టవు’-అని అరుణగారు తమ కవితలో పిట్టల గురించి పట్టించుకున్నారు. పిట్టలు, వాటి గూళ్లు నేడు కనబడడం లేదు. పట్నాలలో పావురాలు కూడా తరిగిపోతున్నాయి. పిట్ట కనబడితే పండగ చేసుకోవచ్చు! పిట్టను ఊరపిచ్చుక అని కూడా అంటారు. జంతు శాస్త్రం ప్రకారం దాని పేరు పిట్టా సటైవా. ఇందులోని పిట్ట అనే మాట, అసలయిన మన తెలుగుమాట. సటైవా అంటే మనుషుల మధ్యన, ఇండ్ల మధ్యన, ఇండ్లలో ఉంటుందని అర్థం. మరేమయింది ఈ పిట్ట? పిట్ట గూడు కట్టే పద్ధతి మనిషికి చేతగాదు. అంత సౌకర్యంగా, సురక్షితంగా, అందంగా ఇల్లుకట్టుకోవడం పిట్టకే చేతనయింది. అంత చిన్న పిట్టకు తనకన్నా ఎంతో పెద్ద గూడు కట్టడమంటే కొన్ని రోజులపాటు కొనసాగే కార్యక్రమం. నగరాలలో కాదు, పల్లెల్లో కూడా పిచుకలు లేవిప్పుడు. అందుకు కారణాలు వెదుకుతూ జూలియా అనే షెఫీల్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకురాలు పట్నాలు వదిలి కనీసం రోడ్లు కూడా లేని పల్లె ప్రాంతాలకు వెళ్లిపోయారు. గడచిన దశాబ్దాలలో మన మధ్య నుంచి పిట్టలు పారిపోవడానికి, తరిగిపోవడానికి గల కారణాలు, ఆమెకు అక్కడ అర్థమయినయి.

అరుదయిన జంతువులను గురించి పరిశోధించాలనుకునేవారు సాధారణంగా తమ కృషిని కొనసాగించడానికి దీవులను ఎంచుకుంటారు. అక్కడయితే జంతువులు అక్కడే ఉండిపోతాయి. దీవి ప్రకృతి సిద్ధమయిన పరిశోధనశాలగా మారి పరిశీలనలు సులభంగా సాగేందుకు సాయం చేస్తుంది. పిచుకలకు మనం చేసే గోల సహించడం వీలుగావడం లేదని కొంతవరకు గమనించారు. జూలియా ప్రోడర్ ఈ సిద్ధాంతాన్ని మరింత పరిశీలించడానికి ఇంగ్లండ్ తీరంలోని లుండీ అనే పల్లె ప్రాంతానికి చేరుకున్నారు. కానీ, అక్కడ ఆమెకు ఆశ్చర్యం ఎదురయింది. దీవి అంతా ప్రశాంతంగా ఉంది. ఒక చోట మాత్రం పొలంలో కట్టుకునే గుడిసెలాంటి బార్న్ ఉంది. అక్కడ ఉండే జెనరేటర్ అదేపనిగా చప్పుడు చేస్తున్నది. అయినా పిట్టలు ఆ బార్న్‌లోకి వస్తున్నాయి. గుడ్లు కూడా పెడుతున్నాయి. గుడ్లనుంచి పుట్టే పిల్లలపైన గోల ప్రభావం గురించి అక్కడ పరిశీలన సాగింది. గోల లేని చోట, ఉన్న చోట పిల్లల సంఖ్యలో పెద్ద తేడా లేదు. కానీ ఉన్న తేడాలో ఏవో అర్థాలు తోచాయి.

గోలగా ఉండే చోట పిల్లలకు, తల్లి పిట్టకూ మధ్యన సమాచార వినిమయం తక్కువగా ఉంటుంది. అందుకని తల్లి తన పిల్లలకు సరిగా తిండి అందించదని గమనించారు. పిల్లలకు తలిదండ్రులు రావడం తెలియడం లేదు గనుక అవి అరవడం లేదా? లేక పెద్ద పిట్టలకు పిల్లల ధ్వనులు వినిపించడం లేదా? అన్న విషయంలో ఇంకా అనుమానాలు ఉన్నాయి. ఇంతకు ముందు కేట్ వినె్సంట్ లాంటి మరికొందరు పరిశోధకులు పిట్ట పిల్లల తిండి గురించి పరిశోధించారు.

పిట్టలు ముఖ్యంగా పురుగులను తింటాయి. పరిసరాలలో ఆ రకం తిండి, అంటే పురుగులు సరిగా అందకుంటే, పిట్ట పిల్లలు బతికి పెద్దవిగా పెరగడం కష్టమని గమనించారు. ఇక వాతావరణంలో నైట్రోజెన్ డై ఆక్సైడ్ ఎక్కువగా ఉన్నా పిల్లలు సరిగా పెరగవని తెలిసింది కూడా. అంటే ట్రాఫిక్ ఉండే రోడ్ల పక్కన పిట్టలు గూడు కట్టి పిల్లలను కంటే, అవి మిగతా చోట్లలో పిల్లలవలే బలంగా పెరగడం కుదరదని అర్థం. కనుక పిల్లలు పెరగకపోవడానికి కాలుష్యంతో బాటు, గోల కూడా కారణమవుతుందని ప్రస్తుతం పరిశోధనలతో అర్థమవుతున్నది.

మనుషుల మనుగడే కష్టంగా ఉంది గనుక, మన దగ్గర పిచ్చుకల గురించి పట్టించుకునేంత మంచితనం లేదు. సందర్భం వచ్చిందని పిట్టల బొమ్మలను నగరాలలో రోడ్లమీద నిలిపితే వాటికి రక్షణ దొరకదు. ప్రపంచమంతటా, అంతరించిపోతున్న జంతుజాతులను గుర్తిస్తున్నారు. వాటిని రక్షించాలని మాట్లాడుతున్నారు. వరిపొలాల్లో కనిపించే నత్తలు, అంతటా కనిపించే కప్పలు, పిచుకలు వెతికినా కనిపించని కాలం వచ్చింది. ఇంగ్లండ్‌లో కూడా పిచుకలను రెడ్ లిస్టులో చేర్చారు. కానీ, అక్కడ ఇంకా కావలసినన్ని పిట్టలున్నాయని లెక్క చెపుతున్నారు. సుమారు అరవయి లక్షల జతల పిచుకలున్నాయని వారు లెక్క చెపుతున్నారు కూడా!

మనిషికి, ప్రకృతికి మధ్యన వారధిగా ఊరపిచ్చుకలను గురించి చెప్పుకునేవారు. మనకు అన్నింటికన్నా ఎక్కువగా, తరచుగా కనిపించే పక్షులలో అవే మొదటివిగా ఉండేవి. ఒక్కసారిగా 15-20 సంవత్సరాల కాలంలో పిట్టల సంఖ్య తొంభై శాతం వరకు తగ్గిపోయిందంటే ఆశ్చర్యం. ఆ తరుగుదల మొదలయినప్పుడే బ్రిటన్ లాంటి చోట్ల పరిశోధకులు, పరిస్థితిని గుర్తించారు. మనం ఆ అవకాశాన్ని వదులుకున్నట్టు తోస్తుంది. ఒకప్పుడు నగరాలలో పావురాల సంఖ్య మరీ ఎక్కువగా ఉంటూ కొంత సమస్యకు కారణమయేది. ఈ మధ్యన వాటి సంఖ్య కూడా వేగంగా తరిగిపోతున్నది.
పిచ్చుకలు తగ్గడానికి కొన్ని కారణాలు ముందుగా కనబడతాయి. మనం ఇళ్లు కట్టుకునే తీరు మారింది. నేడు పూరిళ్లు పల్లెల్లో కూడా లేవు. మన ఇళ్లు, పరిసరాలు మరింత పరిశుభ్రం, ఆధునికం అయినయి. తోటలు కూడా మరీ మరీ శుభ్రంగా ఉంటున్నాయి. కనుక గతంలో వలే పిచుకలకు తలదాచుకునే చోటు లేదు. తిండి అంతకన్నా లేదు. పిచ్చుకలకు మనుషుల మధ్యనే పచ్చని ప్రాంతాలుండాలి. పొదలుండాలి, పురుగులు ఉండాలి. అవన్నీ మనకు అనాగరికంగా కనిపించే లక్షణాలుగా మారాయి.

నిజానికి మనుషులు ఎక్కువగా తిరగని, పాడుబడిన బంగళాలలో, అపరిశుభ్రంగా, ఎవరూ పట్టించుకోక వదిలిన పార్కులలో పిట్టలు కనబడుతున్నాయట. అక్కడ పిట్టలకు పుష్కలంగా పురుగులు దొరుకుతాయి. ఇళ్లు అందంగా, శుభ్రంగా కట్టుకోవడం అవసరమే కానీ పిట్టలుంటే చుట్టూ ఉండే పురుగులను తింటాయి. మన పరిసరాలు మరింత పరిశుభ్రంగా ఉంటాయి. కొంతమంది పిచుకలు ఉండడానికి అనువుగా గూళ్లను ఏర్పాటుచేస్తుంటారు.

అందులో వాటికి కొంత తిండి కూడా దొరికే ఏర్పాటు ఉంటే పిచుకలు తిరిగి వస్తాయి. ఎక్కడో ఒక మూల చెత్త చేరడం మామూలే. అందులో పురుగులు దొరుకుతాయి గనుక పిచుకలు మరింతగా పెరుగుతాయి. కానీ, నగరాలలో, పల్లెలలో కూడా గోల బాగా ఎక్కువయింది. మిగతా పరిస్థితులు అనుకూలంగా వున్నా, గోల కారణంగా పిచుకలు తరిగిపోతున్నాయి. గోల చేయకుండా బతకడం మనకు చేతనవుతుందన్న నమ్మకం పోయింది. ప్రశాంత వాతావరణం పక్షులకే కాదు, మనకు కూడా మంచిది! ఈ సంగతి అర్థమయితే.. పిట్టలను మనం పట్టించుకున్నట్టే!

Friday, November 23, 2012

గొడ్డలి వేటు - మతియాస్ నెస్పోలోముసలి మొరెట్టి ముందర నరకవలసిన కట్టెలు చాలనే ఉన్నయి. అతని వేళ్లు మాత్రం అప్పటికే కొంకర్లు పోతున్నయి. కాలి వేళ్ల గురించి చెప్పనవసరమే లేదు. అవి ఉన్నయో లేవో తెలియడము లేదు. ఇంకో పక్క ముక్కు మరగకాచిన నీటిలో ముంచినట్టు మండుతున్నది. మెడ చుట్టు మేక వెంట్రుకల మఫ్లర్ ఉంది. నెత్తికి ఒక గుడ్డ చుట్టి ఉంది. దాని మీదినించి ఒక వెడల్పు అంచు ఉన్న షాంబర్గో టోపీ పెట్టుకున్నడు.

గంటసేపటినుంచి ఆయన ఆగకుండ కట్టెలు కొడుతున్నడు. అలిసి పోయినడు. వయసు పైనబడిందాయె. ఎంతకూ తెగని ఒక ముక్కను ఆయన తిడుతున్నడు. ఇంక ఓపిక నశించింది. మొరెట్టీకి కాలయాపన చేసే ఆలోచన లేదు. బాగా ఊపిరి పీల్చి గట్టి దెబ్బ ఏసినడు. సూటిగ. పడవలసిన చోట. ఎదలోనుంచి ఒక్క మూలుగు వచ్చింది. కట్టె మూడు తునుకలయ్యింది. కాని, గొడ్డలి ఆయన చేతినించి జారి పోయింది. అది మంచులో నాటుకున్నది. ఆయన కాలి బూటు పక్కననే.

మొరెట్టికి సంగతి తెలిసేందుకు కొంచెం సేపు పట్టింది. చలిగాలిలో ఆయన ఊపిరి కనబడుతున్నది. గొడ్డలిని తీసుకునేందుకు వంగినడు. అది బాగా బలంగ నాటుకుని ఉంది. కామ మంచుకన్న చల్లగ ఉంది. ఇప్పటి వరకు అది తన చేతిలోనే ఉంది. మరి అంత ఎట్ల చల్లగయ్యింది.

దాన్ని అట్లనే ఇడిచి పోదమా అనుకున్నడు. ఇంకొన్ని కట్టెపుల్లల కొరకు, మంచులో గడ్డగట్టుకపోతే అర్థం లేదు. వాతావరణం బాగయిన తరువాత పని మళ్ల మొదలు పెట్టవచ్చు. ప్రస్తుతానికి రాత్రి మంటకు సరిపోను కట్టెలున్నయి. రేపు ఆదివారం. కొడుకు సెర్జియో ఒస్తడు. వాడు పట్నములో గొంగళ్ల సంగెములో పనిజేస్తడు. పిల్లగాడే. కాని కనీసము సెక్రటేరీ అన్న అయ్యి ఉంటడని ముసలాయన నమ్మకము. మొరెట్టీకి కొడుకు గురించి గర్వంగ ఉంటుంది. వాడు వచ్చినంక కట్టెలుగొట్టి కొట్టము నింపమని సాయం అడుగవచ్చు. ఇంక ఎండకాలము దనుక ఏ ఆలోచన ఉండదు. వాడు ఎట్లనన్న రెండు వారాలు ఉంటననే అన్నడు మరి. వానికి గూడ పని నించి తెరిపి గావాలే. అప్పటికల్ల చెట్లు పడగొట్టి పెడితే రెండు మూడు వారాలల్ల పని అయితది. పొయ్యిల పట్టెటంత తునుకలు జేస్తే చాలు.

ఆయన ఆ పనిని మెల్లమెల్లగ తన పద్ధతిలో చేస్తుంటడు. తీరిక ఉన్నప్పుడే వసంతరుతువులో మొదలు పెడితే చలి మొదలయ్యే కాలానికి కావలసిన కట్టెలు చేరుకుంటయి. కానీ ఈ సంవత్సరం అట్ల చేయడము కుదురలేదు. ఈ సారి ఆయన గొర్రెల ఉన్ని తీసే పని మానేసినడు. కొండలెక్కే వాండ్లకు తిండి అందించే పనిలోకి దిగినడు. రొట్టెలు చేసి అమ్మితే ఎక్కువ పైసలు వస్తయని ఆయనకు తోచింది. కానీ అనుకున్నదానికంటే ఆ పనిలో ఎక్కు సమయం పట్టింది. ముఖ్యంగ మట్టితోటి పెద్ద పొయ్యి కట్టవలసి వచ్చింది. ఇప్పటికి ఉన్న పొయ్యి నిజానికి అంత పెద్దది కాదు. కొత్త పొయ్యిని వేడి చేసి సరిగ్గ మంట ఉండేటట్లు చూడాలంటే కట్టెలు శాన కావల్సి వచ్చినయి. చలికాలానికి సరిపొయ్యేటన్ని కట్టెలు జమచేసుడు గాక ఎండకాలమంత వ్యాపారం కొరకు కట్టెలు గొట్టుడుతోనే సరిపొయ్యింది. సంగతి అర్థమయ్యే సమయానికి చలికాలం రానే వచ్చింది. అందుకే ఇప్పుడాయన కష్టపడుతున్నడు.
ఏదో రకంగ తనకు తానే నచ్చజెప్పుకుంటు, గొడ్డలివట్టుకుంటే ఒళ్లు బిగదీసుక పోతున్నది. గొడ్డలి వేరులో దిగవడినట్టున్నది. కామను పట్టుకోని గట్టిగ లాగినడు. ఏమయిందో వెంటనే అర్థమయ్యింది ఆయనకు. ఎడమ కాలిలో పొడుస్తున్న బాధ తెలిసింది. అది వెన్నెముకలోనుంచి మీదికి పాకుతున్నది. ప్రభావం మెడ వెనుక తెలుస్తున్నది. అది నిజం కాజాలదు. ఒక్కసారిగ ఒళ్లంత ఉడుకయ్యింది. బట్ట కణతలకు అంటుకుంటున్నది. చెమటలు పడుతున్నయి. నిజంగ ఇట్ల జరుగుతున్నదా. నాశినం గాను. కాల్లో నొప్పి బాగ సలుపుతున్నది. కిందికి చూస్తే అనుమానాలన్ని దూరమయినయి. బూటు రక్తం మడుగులో ఉంది. కరిగిన మంచులోనుంచి ఆవిర్లు పుడుతున్నయి.

ముసలి మొరెట్టీకి నమ్మకం గలుగలేదు. గొడ్డలితోటి ఇంతకు ముందెప్పుడు ఇట్ల జరగలేదు. అసలు అట్ల ఏదీ జరుగలేదు. తెలివి దెలిసినప్పటినుంచి కట్టెలు కొడుతునే ఉన్నడు మరి. ఒకప్పుడు గొర్రెల మంద చుట్టు వేసిన కంచెతీగె తెగింది. అది మొఖంలో తగిలింది. ఇంకొక సారి గొర్రెల ఉన్ని తీసే కత్తెరతోటి చెయ్యి తెగింది. తొందరలో ఉండంగ ఒక మంకు గొర్రె పట్టుదప్పి కదిలింది.ప్రమాదాలు జరుగుతయి. కానీ గొడ్డలితో ఎన్నడు జరుగలేదు. ఎట్లనంటే చెప్పేటందుకు లేదు.

గొడ్డలి చేతిలోనే వేలాడుతున్నది, ఆయన అన్యమనస్కంగ ఆలోచనలో పడినడు. గొడ్డలిని దాని చోటులో పెట్టాలనుకున్నడు. కానీ ఆగినడు. ముందు కాలిని రక్తం మడుగులోనుంచి ఎత్తే ప్రయత్నం చేసినడు. నిలకడ తప్పింది. తలకాయ తిరిగింది. తాను కింద పడిపోలేదు. కానీ, గొడ్డలిని మాత్రం గట్టిగ పట్టుకున్నడు. అప్పుడు దాన్ని ఆధారంగ వాడవచ్చునని తోచింది. కామను మంచులో పొడిచి గొడ్డలిని గట్టిగ పట్టుకున్నడు. చేతికంత రక్తం అంటింది.

కాలును మెల్లెగ మీదికి ఎత్తి శుభ్రంగ ఉన్న మంచు మీద పెట్టినడు. అయినా చుక్కలు గనిపించుడు మొదలయింది. ఒక్కసారిగ ఐదు పండ్లు ఊడబీకినట్లున్నది. ఉన్నవే తక్కువ మరి. అది గూడ మత్తుమందు ఇయ్యకుండనే పండ్లు పీకినట్టున్నది. మొరెట్టీ నోటెంట తిట్ల వాన మెదలయింది. కుడికాలు మీదికి లేపి ఒక్క అడుగు ముందుకు ఏసినడు. నొప్పి బాగ ఎక్కువయింది. చూపు ఆనుత లేదు. దెబ్బతగిలిన కాలి మీద బరువు ఏసే ధైర్యం లేదు. దాన్ని మీదికి ఎత్తేదే కష్టంగ ఉన్నది. ఈడ్చుకుంటు పోవాలె ఇగ.
బూటును గుంజుతున్నందుకు మంచులో కాలువవడుతున్నది. దాంట్లో చిన్న ప్రవాహంగ రక్తం వస్తున్నది. ఇంటిలోనికి పోవాలంటే ఇరువయి మీటర్ల దూరమున్నది. ముసలాయనకది అయిదు నూర్లంతంలు అనిపించింది. నొప్పి. దిక్కుమాలిన నొప్పి. గొడ్డలి ఇంకా కాల్లోనే ఉన్నంత నొప్పి.

వరండా చేరుకోని కమ్ములను గట్టిగ పట్టుకున్నడు.  బరువునంత గొడ్డలి మీద ఆనించినడు. కుంటికోడి లాగ ఎగురుకుంటు మూడు మెట్లు ఎక్కినడు. నేల చెక్కల మీద గొడ్డలి కామ తగిలి చప్పుడు చేస్తున్నది. మూడు గుద్దులు గుద్దినట్టు ఉందది. భుజంతోటి తలుపులను ముందరికి తోసి పెము కుర్చీలో కూలవడ్డడు. స్టవ్ మండుతున్నది. తలుపులోనుంచి గాలి వస్తున్నది. తలుపును మూయాలని తాను చేసిన ప్రయత్నం పని చెయ్యలేదని అర్థం.

మొరెట్టీ గొర్రెలను తరిమిన కుక్కలాగ ఒగరుస్తున్నడు. రక్తం వాసన పసిగట్టి కుక్క తనచోటినుంచి వచ్చింది. చారను చూసుకుంటు ఇంట్లోకి వచ్చింది. వచ్చి బూటును నాకసాగింది.

ఫో చీదర!’ మొరెట్టీ అదిలించినడు. కుక్క దూరం జరిగింది. కాని మరీ అంత దూరంగాదు.

బూటు నీటిబుగ్గ వలె ఉన్నది. రక్తం ఓడుతున్నది. అన్యాయంగ ఉన్నది అనుకున్నడు ముసలాయిన. కాల్లో ఉడుకుదనం అలలు అలలుగ కదులుతున్నది. రక్తనాళం తెగినట్టున్నది.

ఆయన నెత్తికి గట్టిన గుడ్డను టోపీని తీసేసినడు. ఊపిరి బిగబట్టి కోటును కూడ వదిలించుకున్నడు. అనుకోకుండనే గొడ్డలిని కుర్చీ పక్కకు ఆనించి వదిలేసినడు. దాని తల పైకి ఉన్నది. రక్తంలో తడిసి గర్వంగ. ఒక చేదు నవ్వుతో మొరెట్టీ దాన్ని పక్కకు పడేసినడు. అది వినయం లేని పిశాచి. దాని ఆలోచన ముందే తెలిసి ఉంటే, దాన్ని సానరాయి మీద అంతగనము నూరి ఉంటేవాడు గాదు. కట్టెలు కొట్టినప్పుడల్ల చేసే పనేనాయె అది.

బాగున్న కాలి బొటనవేలు సాయంతో, బూటును మడమ నుంచి కిందికి కదిలించినడు. అది ఊడింది. సలుపుతున్న నొప్పి తగ్గినట్టనిపించింది. ఏదో తిమ్మిరి మాత్రం మిగిలింది. బూటును పూర్తిగ తీయాలని ఒంగినడుతను. మళ్ల తల తిరిగింది. బూటు దానంతటదే కింద పడినంతవరకు కాలిని రెండు మూడు సార్లు విదిలించినడు. బొటనవేలు మధ్యగ చీలింది. గాయం విచ్చుకోని బాగ కనవడుతున్నది. కొంచము కదిలించి చూస్తే పాదంలో కూడ గాయమయిందని అర్థమయింది. బూటు ఇంక పనికిరాదు.
ఇంతసేపయింది. కాని ముసలాయన, గాయాన్ని మాత్రం చూడలేదు. కావాలనే అట్ల చేస్తున్నడనిపిస్తుంది. నిజానికి చూడదలుచుకున్నా, రక్తం, రక్తంలో ముద్దయిన సాక్ మాత్రమే గద కనిపించేది. సాకును కుట్టుకోవాలె. తప్పదు. అసలు ముందు ఆ రక్తాన్ని ఆపాలె. నేల మీద రక్తం మడుగు రానురాను పెద్దగవుతున్నది. అది కుర్చీ కాలు వరకు, అటు స్టవ్ కాలు వరకు పారింది. మొరెట్టి నోరు ఎండుకపోతున్నది. ఒక గ్లాసు మంచినీళ్ల కొరకు ఏమయిన చేసేట్లున్నది. కాని, పొయ్యి నీళ్లు తెచ్చుకునే ఓపిక మాత్రం లేదు. మగత ముంచుకొస్తున్నది. ఆయన ఓడిపోతున్నడు. కనురెప్పలు బరువవుతున్నయి. కొంచసేపు విశ్రాంతి దీసుకుంటే నష్టమేమి లేదు.

ముందు రక్తం ప్రవాహాన్ని ఆపాలని తెలుసు. కాని అది చిత్రమైన ఉన్నది. ఆ పని చేయకపోతే అంతే సంగతులవుతుంది. రక్తం మొత్తం పోయేట్టుంది. ఒకప్పుడు ఫస్ట్ ఎయిడ్ గైడు ఒకాయన చూపినది గుర్తున్నది. బెల్టుతోటి కాలిని కట్టవచ్చు. దానికి ఒక కట్టె లేకుంటే అటువంటిదేదో కావాలె. పోకరు గూడ పనికి వస్తుంది. కాని మంచినీళ్ల లాగనే అవేవి అందే దూరంలో లేవు. ఆయన లేవాలె. కాని లేవడు. నిజం చెప్పాలంటె, అది కుదిరేట్టు లేదు. ముసలాయన వశంలో లేడు.

బెల్లు ఊడదీయాలనే చిన్న పని గూడ గగనమయి పొయ్యింది. ఎస్టెలా ఉండి సహాయం చేస్తే ఎంత బాగుండు. తాను పోయినంక ఇది మూడో చలికాలం. ఈ లోపల అంత కష్ట పడకుండ వంటచేసుకునేది మాత్రం అలవాటయింది. కాని, అమె లేని లోటు అప్పుడప్పుడు తోస్తుంది.లేదంటే, ఇప్పటి లాగ ఆమె అవసరం తెలుస్తుంది. కాని, చేయగలిగింది ఏమీ లేదు. జీవితం అంతే. తాను ముందు పోయుంటే బాగుండేది. ఆమె పోయి తాను మిగిలినందుకు అది తప్పు అనిపిస్తుంది. ఎస్టెలా తనకంటె నాలుగేండ్లు చిన్నది. కాని, ఇదే బాగుందేమో. ఆమె ఒక్కతి మిగిలి ఉంటే ఇంకా కష్ట పడేది పాపం. అది నిజం.

మొరెట్టి బెల్టును గుంజినడు. అది ఎట్లనో ఊడి వచ్చింది. దాన్ని తొడ చుట్టు తిప్పినడు. బకుల్లోనుంచి ఏసి గట్టిగ బిగించినడు. కాని, కావలసినంత బలం ఆ మనిషిలో మిగిలి లేదు. చాతనయినంత గుంజి బిగించినడు. కుక్క ఆయన కదలికలను బాగ గమనిస్తున్నది. కాని దగ్గరికి మాత్రం రాలేదు. రెండు మీటర్ల దూరంలో అది సాగదీసుకొని కూచోని ఉన్నది.

అంతే, ముసలాయన గట్టిగ ఊపిరి వదిలి ముందుకు ఒంగినడు. తల తిరుగుతున్నది. అందుకే మెల్లెగ ఒంగినడు. చెయ్యిజాపి గుంజితే ఒక్క ఊపుతోటి సాకు ఊడింది. అది దీపంలో ఒత్తివలె తడిసి ఉంది. గాయం నుంచి ఇంకా రక్తం కారుతునే ఉన్నది. కాని మొదటి అంత లేదు. అదిప్పుడు బాగ కనవడుతున్నది. దెబ్బ అంత పెద్దది కాదు. తరువాత కట్టు కట్టుకోవచ్చు. ఇప్పుడు గావలసింది విశ్రాంతి. గాయానికి కుట్లు వడతయి. తప్పించుకునే పద్ధతి లేదు. తాను ఈ పరిస్థితిలో డ్రయివింగ్ చెయ్యలేడు. మరి తనను పట్నంలోకి ఎవరు తీసుకపొయ్యి చూపిస్తరు. అదిగూడ ట్రక్ స్టార్ట్ అయినప్పుడు. హీటర్లు పాడయ్యి ఉంటయి. ఇంత చలిలో రేపటి వరకు ఎదురు చూచేది తప్ప ఇంకేమి చేసేది లేదు. సెర్జియో వచ్చేటి వరకు విశ్రాంతిగ ఉండి ఎదురు చూడాలె.

మొరెట్టి కుర్చీలో కూలవడ్డడు. తలను బద్దకు ఆనించి కండ్లు మూసుకున్నడు. వెంటనే నిద్రలోకి జారుకున్నడు. అలిసిపొయినడు మరి. ఎస్టెలా తనతోటి మాట్లాడుకుంటు, వంటజేసుకుంటు తినేటందుకు ఏమో పెడుతున్నట్లు కల. తన కుర్చీ ఇంకొక దిక్కు మళ్లి ఉంది. ఆమె కనిపిస్తులేదు. కాని ఉన్నదని మాత్రం తెలుస్తున్నది. ఆమె మేకకూర వండుతున్నది. తనకు ఇష్టమని ఎక్కువ ఉల్లిపాయలు ఏస్తుంది దాంట్లో. ఆమె చెయ్యి మాత్రం మేట్ పానీయాన్ని అందిస్తున్నట్టు కనవడుతున్నది. కమ్మటి గొంతుతోటి ఒకటే సారి వెయ్యి సంగతులను గురించి మాట్లాడుతుంది ఆమె. ముసలాయనకు ధ్యాస కుదురుతు లేదు. ఆయన రేడియో వింటున్నడు. వార్తలు. తలుపు తెరితి ఉంది. మధ్యాహ్నం ఎండ ఇంట్లోకి ఒస్తున్నది.

బయటినుంచి సెర్జియో పిలిచినట్టు వినిపించింది. అరుస్తున్నడు. వాడు చిన్నతనంలో ఏదన్న జంతువు కనిపించినప్పుడు లేదంటే మందలో ఒక మేకపిల్ల రాత్రికి ఇంటికి తిరిగి రాలేదని చూచినప్పుడు అరిచినట్టు. నీవే పోయు చూడు. ఇక్కడ పొయ్యి మీద కూర మాడిపోతున్నది అంటుంది ఎస్టెలా. వాడు ఊరికెనే అంటున్నడులే అంటడు మొరెట్టి. ఇప్పుడు సెర్జియోది అట్ల ఆటలాడే వయసు కాదని తెలుసు.

ఎస్టెలా ఏదో మాట్లాడుతునే ఉన్నది. వార్తలను ఆపి మధ్యలో ఏదో ప్రభుత్వ ప్రకటన వినిపించినరు. సంగతి అర్థం జేసుకోవాలని ప్రయత్నం చేసినడు ముసలాయన. కొంచం గూడ అర్థంగాలేదు. సెర్జియో యూనియన్ నినాదాలు చేస్తున్నడు. ఎస్టెలా పిచ్చిగ అరుపులు మొదలువెట్టింది. మొరెట్టీకి చీదరగ ఉన్నది. ఏం జరుగుతున్నదో అర్థమవుతు లేదు. సెర్జియోకు ఇది సమయం గాదని చెప్పాలనిపించింది. కాని, తేచేందుకు కుదరలేదు. ఒక్కసారిగ రాత్రయింది. దీపం మాత్రం పెట్టలేదు. చలివెడుతున్నది. ఇంక అరుపులు తన వంతయింది. బోనులో బంధించిన ఎలుక తీరుగ బాధ పేగులను తెగ కొరుకుతున్నది. కండ్లు తెరిచి చూస్తే మళ్ల తెల్లవారింది. ఒక్క చప్పుడుగూడ ఇనిపిస్తు లేదు. స్టెలా మిఠాయి, ఒక చేతిలో కెటిల్ పట్టుకోని ఒస్తున్నది. ఎనికి నుంచి వచ్చే ఎలుతురు తోటి ఆమె నీడ పొడుగ్గ కనవడుతున్నది. ఆమె మాట్లాడుతు లేదు. ఇక్కడి దిక్కే చూస్తున్నది. కండ్లలోకి సూటిగ. ఆమె కండ్లలో దృశ్యం మొరెట్టీకి నచ్చలేదు. దాంట్లో ఏదో తప్పువడుతున్న భావం ఉన్నది. స్టెలా మిఠాయి ఇచ్చేది పోయి, కాగుతున్న నీళ్లను తన కాలి మీద ఒంపింది. దెబ్బ తగిలిన కాలి మీద.

మొరెట్టి గట్టిగ అరిచి నిద్ర లేచినడు. ఏమి అర్థం గాలేదు. నోట్లో చేదు రుచి. దప్పి తోటి గొంతు ఎండిపోతున్నది. ఎస్టెలా ఎందుకట్ల చేసిందో అర్థం గాలేదు. తాను ఏం తప్పు చేసినడని. మండుతున్న కాలిని చూస్తే గొడ్డలి సంగతి, గాయము గుర్తుకొచ్చినయి.
అందుకా కాలు మండుతున్నది.

బెల్టు కాలిని కొరుకుతున్నది. నొప్పి భరించరాకుండ ఉన్నది. ఆయన దాన్ని ఒదులు చేసినడు. ఇప్పుడు కొంచం మేలు. రక్తం గడ్డ గట్టినట్టు మాత్రం లేదు. మళ్ల గాయం నుంచి రక్తం మొదలయింది. కాలు వాపు దిగినంత వరకు ఆయన ఊరుకున్నడు. తిరిగి బెల్టునుబిగించినడు. అంత బలంగ కుదురలేదు. ఆయన సంగతి వానలో యాలాడేసిన కొత్త తోలులాగ ఉన్నది.

చీకటి పడుతున్నది. కుక్క మాత్రం అక్కడనే ఉన్నది, కాళ్ల దగ్గర. అది పండుకున్నట్టే ఉండి, అయిష్టంగనే ముసలాయన మీద ఒక కన్నేసి ఉంచింది. స్టవ్ లో మంట మెల్లగ తగ్గి పోయింది. తలుపు సందుల్లోంచి చలిగాలి దూరి వచ్చి ప్రళయం చేస్తున్నది. అయినా మొరెట్టీకి మాత్రం వెచ్చగనే ఉన్నది. కసిగ తిరగవడిన నొప్పి పిచ్చెక్కిస్తున్నది. కండ్లు మూసుకుంటే కాలు పెద్ద అవెన్ పొయ్యిలో ఉన్నట్లు అనిపిస్తున్నది. డబల్ రొట్టెలాగ పొంగిందది. మండుతున్నది. దాన్ని బైటికి తీసే వీలు లేదు. ఆయన మూలుగుతడు. తిడుతడు. తల కదిలిస్తడు.

అంతలోనే ఆయన గట్టిగ అరువను మొదలు చేసినడు. తన కాలిని కుక్క కొరుకుతున్నదని తోచింది ఆయనకు. నిద్రలోకి జారుకునే వరకు అదే ధ్యాస. ఈ సారి కలలు రాలేదు.

తెల్లవార కండ్లు తెరిచినడు. వణుకుతున్నడు. తెగ చలి. దప్పి తీరేటట్లు లేదు. నరకంగ ఉన్నది. అయినా కొనసాగాలె. పూర్తిగ తెల్లవారుతుంది. సెర్డియో వచ్చే వరకు ఓపికగ ఉంటే సరి. మొరెట్టీ మళ్ల నిద్రలోకి జారుకున్నడు. తల వాలిపొయింది. కాళ్లు, చేతులు సడలి పొయినయి. ఆయనకు ఇంక నొప్పి తెలుస్తు లేదు.

మధ్యాహ్నంకల్ల ముసలాయన కాలు బాగ శుభ్రంగ అయ్యింది. కుక్క తన నాలుకతోని దాన్ని శుభ్రం చేసింది. మొరెట్టి చల్లగ ఉన్నడు. అదే కుర్చీలో. ఆయనట్ల ఇంకొక మూడు నాలుగు దినాలు, కొఆపరేటివ్ నుంచి ఎవరన్న ఉన్ని కొరకు వచ్చే వరకు, పడి ఉంటడు. సెర్జియో గడిచిన ముప్ఫయి ఏండ్లలో ఎన్నడు ఇంటికి రాలేదు.


ఆర్జెంటీనా రచయిత, మతియాస్ నెస్పోలో కథ ఎల్ హషాజో ను బెత్ ఫౌలర్ ఇంగ్లీషులోకి అనుదించారు. దాన్నితెలుగులోకి రాసింది విజయగోపాల్.Saturday, November 17, 2012

సలహాలు - సంప్రదింపులు

పని బాగా జరుగుతున్నంత కాలం పక్కవారి గురించి ఆలోచన కూడా రాదు. సమస్య ఎదురయితే మాత్రం, బాసునో, మరొకరినో సాయం అడగాలనిపిస్తుంది. సమస్యను మరొకరి ముందు పెట్టడం వరకే మన పని అనుకుంటే, అక్కడితో మన పెరుగుదల ఆగిపోతుంది. పైఅధికారులు మనకు సహాయం చేయడానికే ఉన్నారు. మరి మన దగ్గరకు ఎవరైనా సమస్యతో వస్తే ఏం చెప్తాము? తెలుసుననుకుని సులభంగా ఒక సమాధానం చెప్పి పంపిస్తామా? మన సమస్యలన్నింటికీ బాసులు సమాధానం చెప్పి పంపుతున్నారా? నిజంగా అట్లా జరుగుతున్నదంటే, ఎక్కడో లోపం ఉందని అర్థం! బాసుకు ఏదో అనుమానం వస్తుంది. అప్పుడు ఎవరిని అడగాలి? ఎవరు సమాధానం చెపుతారు?


సమస్యను తెచ్చి మన ముందు పడేస్తే, ఆ పడేసిన వారి బాధ్యత ముగిసినట్లు కాదు. మనమయినా సమస్యను మరొకరి ముందుకు నెట్టి, చేతులు దులుపుకోలేము. మనమయినా మరొకరయినా, సమస్యతో బాటు సలహాలను జోడించాలి. ‘మీరు చెప్పండి. మేము మీరు చెప్పినట్టు చేస్తాం!’ అంటారు చాలామంది. మరి చెప్పవలసిన వారికి సమస్య ఎదురయితే ఎవరు చెప్పాలి. ఏదో ఒకనాడు మనమూ ఆఫీసర్లవుతాము. బాసులవుతాము. ఇంట్లో పెద్దవాళ్లమవుతాము. బాధ్యత అంతా మన తలకెక్కినప్పుడు బరువు తెలుస్తుంది. ఈ సమస్య ఎందుకు వచ్చిందంటారు? నా స్థానంలో మీరుంటే ‘ఈ విషయంలో ఏం చేయాలనుకుంటారు? మీరే ఏదో ఒకటి చెప్పండి!’ అనే బాసు మీద కోపగించుకునేవారు చాలామంది ఉంటారు.

నిర్ణయాలు వేరు, సలహాలు వేరు. ఏం చేయాలో చెపితే, అది నిర్ణయమవుతుంది. ఇలా చేయవచ్చునేమో, అని చెపితే అది సలహా. సమస్యను ఎస్కలేట్ చేసిన వారు, అంటే పైవారి ముందు పెట్టిన వారు నిర్ణయం చేయలేకనే ఆపని చేస్తారు. నిర్ణయం సరయిందన్న నమ్మకం లేకపోతే ఆ పని చేస్తారు. అప్పుడు చెప్పే తీరులో ఈ సంగతి చక్కగా కనిపించాలి. ఇది సమస్య, ఇది నా నిర్ణయం అని చెప్పడం బాగుండదు. ఈ నిర్ణయం బాగుంటుందని అనుకుంటున్నాను, అంటే, అది సలహాగా మారుతుంది. సంప్రదింపుల ద్వారా, సమస్యకు గల సమాధానాలను వీలయినన్ని ముందు ఉంచుకుని, వాటిని చర్చించి, ఒకటి, రెండింటిని ఎంచుకోవచ్చు. అమలు చేసి చూడవచ్చు. సమస్యను ముందుంచిన వారే, నిర్ణయాన్ని సూచించడం అంతగా అలవాటు లేదు. ఎందుకొచ్చిన బెడద అనుకుంటారు చాలామంది. బాసులకు కూడా సరైన అవగాహన లేకుంటే ‘ఇక నేనెందుకు?’ అంటారు. ఇవి రెండూ తప్పు పద్ధతులే. సలహాలు, సంప్రదింపులు మాత్రమే సరయిన పద్ధతి. చిన్న చిన్న విషయాలలో కూడా ఈ పద్ధతిని పాటించవచ్చు. ఇంట్లో, మిత్రుల మధ్య కూడా ఈ పద్ధతిని పాటిస్తే, అందరికీ సంతృప్తిగా ఉంటుంది. ‘ఇడ్లీ తిందాం పదండి’ కన్నా ‘ఏం తిందాం?’ అన్నమాట బాగుంటుంది. అందరికీ తమ అభిప్రాయం చెప్పే వీలు కలుగుతుంది. చివరికి ఎవరిమాట నెగ్గినా, సలహా ఇచ్చినా సంతృప్తి మిగులుతుంది. ఈ సంతృప్తి, మరింత ఆలోచించడానికి, బాధ్యతతో ప్రవర్తించడానికీ, అవసరమయిన బలాన్ని ఇస్తుంది. దీనే్న ఎంపవర్‌మెంట్ అంటారు.

నిర్ణయాలు చేసే శక్తి కాకున్నా, నిర్ణయాల వరకు చేరుకునే కార్యక్రమంలో భాగం ఉంటే ఆ వ్యక్తులకు మానసిక బలం పెరుగుతుంది. అదే ఎంపవర్‌మెంట్. కూరలు కొనడం తనకు తెలియదు అనుకుంటే జీవితమంతా తెలియకుండానే పోతుంది. కూరలు కొనడంలోని మెళకువలు అర్థం అయే పరిస్థితిని కలిగిస్తే రేపు కూరలు కొనే బాధ్యతను పంచుకోవడానికి మనకే సాయం దొరుకుతుంది. ఎందుకు తెలియదు? ఏం తెలియదు? ఏ రకం కూరల గురించి తెలియదు? లాంటి ప్రశ్నలడిగితే, మరో వ్యక్తికి ఎంపవర్‌మెంట్ జరుగుతుంది. అలాగని ఎడ్డెం తెడ్డెం ప్రశ్నలడిగితే పని జరగదు. పైగా, ఆ మనుషులు మరింత కుంగిపోతారు. కొత్తగా ఆలోచించడానికి దారితీసే ప్రశ్నలుండాలి. విషయం గురించి ఎదుటివారి ఆలోచనలు మరింత పెరిగే రకంగా ప్రశ్నలు అడగాలి. ఇలాగే అడుగుతారు కూడా. మనకు ఆ సంగతి అర్థం కాకుంటే, ఆ ప్రశ్నలు ‘చొప్పదంటు ప్రశ్నలు’గా చికాకు ప్రశ్నలుగా కనిపించి, వినిపించి చికాకు కలుగుతుంది. అందుకే ఎవరైనా ప్రశ్నలు అడిగినా, మనం అడగవలసి వచ్చినా ఒక్క క్షణం ఆలోచించడం మంచిది. అప్పుడు విషయం మరింత సులువుగా అర్థమవుతుంది. రెండువేపుల నుంచి చక్కని సలహాలు వస్తాయి. సమస్యకు సమాధానం దొరుకుతుంది.

జాగ్రత్తగా గమనిస్తే, ఈ సందర్భంలోని ప్రశ్నలకు ఒక పద్ధతి ఉంటుంది. వాటికి సూటిగా ఒక జవాబు ఉండదు. ‘ఎందుకు?’ ఎట్లా?’ ‘ఏమయి ఉండవచ్చు?’ లాటి ప్రశ్నలకు జవాబులు కేవలం అభిప్రాయాలు. అవి రకరకాలుగా ఉంటాయి. ఉండాలి కూడా! సమస్య తెచ్చిన వారికి ఈ ప్రశ్నల కారణంగా, మరింత అవగాహన వీలవుతుంది. మరిన్ని జవాబులు మెదడులో మెరుస్తాయి. తమ మీద తమకు నమ్మకం పెరుగుతుంది. జవాబు నేనే యిచ్చానన్న ధీమా కలుగుతుంది. అసలిది సమస్యగా ఎందుకు కనిపించింది? అన్న అనుమానం కూడా రావచ్చు. కావలసింది కూడా అదే! ఈ ప్రపంచంలో ఏ సమస్యకూ, ఎవరివద్దా రెడీమేడ్ జవాబులు ఉండవు. ఉంటే, అసలివి సమస్యలు కావు! సరైన సమయంలో సరయిన ప్రశ్నలు అడిగితే, సమస్య మబ్బులాగా విడిపోతుంది. అందరికీ నచ్చే సమాధానాలు కనబడతాయి. అందరికీ నమ్మకం కలుగుతుంది. అది సలహా, సంప్రదింపులోని బలం!

బాసు మనలను అభిప్రాయం అడిగారంటే, మన తెలివిని, ఆలోచన శక్తిని వారు నమ్ముతున్నారని, గౌరవిస్తున్నారని అర్థం! అదే పద్ధతిని మనం కూడా మనవారిమీద, చివరకు పిల్లలమీద కూడా ప్రయోగించవచ్చు. అటువంటి ప్రశ్న ఎదురయిన మరుక్షణం మన బాధ్యత పెరుగుతుంది. కనుక మరింత జాగ్రత్తగా ఆలోచించే ప్రయత్నం మొదలవుతుంది. సమస్యకు సమాధానం మననుంచి వస్తే అది అప్పటికప్పుడు కనిపించే విలువ, లాభం. ఇక ముందు ఈ రకం సందర్భాలలో కూడా ముందే ఆలోచించి, సలహాలతో కూడా ముందుకు సాగే నమ్మకం కలుగుతుంది. అది ఎప్పటికైనా పనికివచ్చే మానసిక బలం. అది మరింత గొప్పలాభం!

అంతా నాకే తెలుసు, నీకేం అధికారం, అని మనం అనవచ్చు. మనమీదివారు మనల్ని అనవచ్చు! మనిషిని మానసికంగా కుంగదీయడానికి అంతకన్నా కావలసింది లేదు! ఎవరికీ ఎవరికన్నా ఎక్కువ తెలియదు. నాలుగు తలలు ఒక చోట చేరితే సలహాలు, సంప్రదింపులు సాగుతాయి. అది తెలివి!

Thursday, November 8, 2012

అదీ తెలివి....

ఒక పెద్దాయన పాపం, దేశాంతరం వెళ్లి అక్కడే కాలం చేశాడు. వీలునామా కింద తన ఊరి వారికి ఒక వర్తమానం పంపించాడు. ఊరివారు నా ఆస్తిలో తమకు కావలసింది తీసుకోవచ్చు. తమకు యిష్టమయినంత భాగం, అమాయకుడయిన నా కుమారుడు ఆరిఫ్‌కు ఇవ్వవలెను అన్నది ఆ వర్తమానంలో సమాచారం. ఆ సమయానికి ఆరిఫ్ యింకా చిన్నవాడు. అంతమందిలో నోరెత్తి మాట్లాడగలశక్తి కూడా లేని అమాయకుడు. ఇంకేముంది? పెద్దలంతా చేరి పెద్దాయన ఆస్తిని పంచుకున్నారు. ఎందుకూ పనికిరాని బంజరు ఏదో మిగిలితే అది ఆరిఫ్‌కు యిచ్చామన్నారు. ఆ బంజరు ఎవరికీ అవసరం లేదు మరి!

ఏళ్లు గడిచాయి. ఆరిఫ్ పెరిగి పెద్దవాడయ్యాడు. బలవంతుడయ్యాడు. తెలివిగలవాడూ అయ్యాడు. ఊరి పెద్దలను కలిసి, తన తండ్రి ఆస్తి తనకు తిరిగి ఇవ్వమని అడగసాగాడు. ఎవరికివారు ‘అదేం ఆలోచన’ కుదరదు పొమ్మన్నారు. ‘వీలునామా ప్రకారం నీకు యివ్వవలసింది యిచ్చేశా’మన్నారు. అమాయకుని ఆస్తిని అప్పగించామన్న ఆలోచన ఎవరికీ కలిగినట్లు లేదు. ఎవరికి కావలసింది వారిని తీసుకొమ్మన్నది మీ నాయనే!’ అని కూడా అన్నారు. అందరినీ పోగేసి సలహాలడుగుదాం అన్నాడు ఆరిఫ్. తమ తప్పు లేదనుకున్న పెద్దలు సంప్రదింపులకు ఒప్పుకున్నారు. సమావేశం మొదలయింది. ఎవరి అభిప్రాయం వారు చెపుతున్నారు. ఒకతను మాత్రం ఏదో తప్పదుగనుక వచ్చానన్నట్టు మొగం వేలవేసుకుని కూచుని ఉన్నాడు. అతని వంతు వచ్చింది. 'మీకు వీలునామా మాటలకు అర్థం తెలియలేదు. తమకు ఇష్టమయినంత భాగం కొడుక్కు యిమ్మన్నాడు పెద్దాయన.అది ఇవ్వడానికి యిష్టమయినంత కాదు. మీరు తీసుకోవడానికి యిష్టమయినంత! మీకు బాగనిపించింది అతనికి ఇస్తే, పిల్లవాడు బాగా బతుకుతాడని తండ్రి నమ్మకం’! అన్నాడు. అందరూ మంచివాళ్లే. అసలు సంగతి అర్థమయి నోళ్లు వెళ్లబెట్టారు. 

ఇష్టమయినంత అన్నమాటకు అర్థం తెలిసింది వారికి. ‘అతను దూరాభారంలో మరణించాడు. ఆస్తి అమాయకుడయిన కొడుకు చేతిలో పెడితే, అతనికి ఏమీ మిగుల్చుకునే శక్తి లేదని తెలుసు. అందుకే ఆస్తిని మీకు అప్పగించాడు. మీదేననుకుని మీరు దాన్ని యినే్నళ్లూ కాపాడారు. కొడుకు పెరిగి, పెద్దవాడయి తెలివి తెలుసుకుంటాడన్న నమ్మకం ఆ తండ్రికి ఉంది. అదే జరిగింది. గౌరవంగా ఆస్తిని అతనికి ఇవ్వడం మంచిది’, అని కూడా వివరించాడు వేలమొగం మనిషి! ఆరిఫ్‌కు ఆస్తి అందింది. పెద్దలు నిజం చూడగలిగారు.

-సయ్యద్ గౌస్ అలీషా (1881)

=============
అసలు మాట

‘జాగ్రత్తగా ఉంటూ నెమ్మదిగా మాట్లాడడమే సద్గుణం అన్నాడు మాస్టర్. ‘అదెట్లా’గన్నాడు శిష్యుడు. ‘ఏం చేయాలో తోచనప్పుడు జాగ్రత్తగా ఉంటూ నెమ్మదిగా మాట్లాడడమే మంచిది గదా!’అన్నాడు మాస్టర్.

-కన్ఫ్యూషియస్ ఆనలెక్ట్స్ నుంచి