Friday, August 23, 2013

సి సి ఎమ్ బి - ప్రారంభం - లోకాభిరామమ్

సైన్స్ అందించిన అందమయిన మత్తులో హాయిగా గడుస్తున్న దినం కాదిది. ఆ రోజు గడిచింది. ఇది మరుసటి రోజు. అవగాహనకు అందని అంశాలను, అనర్థాలకు దారి తీస్తున్న అంశాలను, మరింత సులభంగా పరిశీలించడానికి, ఇప్పటి వరకూ వచ్చిన సైన్సు, కొత్త వెసులుబాటు మాత్రమేనని, అందరికీ అర్థమైంది, అంటాడు ఆల్డస్ హగ్జ్‌లే

* సైన్సుకు స్వంతంగా విలువలు ఉండవు. విలువలు మనుషులకుంటాయి. సైంటిస్టులు మనుషులు. సైన్సును వాడుకునే వాళ్లు మనుషులు.


సైన్సు పండుగ
* ‘పుష్పా! ఈ సదస్సులో నేను పాల్గొనడానికి పద్ధతేమిటి?’ ఇంచుమించు ఈ అర్థం వచ్చే ప్రశ్న ఏదో అడిగాను. ‘అదేమిటి? నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను’ అన్నాడు పుష్పా. అవును పుష్ప అమ్మాయి కాదు. పుష్పమిత్ర భార్గవ అనే పి.ఎమ్.భార్గవ. జంటనగరాల్లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ’ అనే గొప్ప సంస్థను ప్రారంభించిన డైరెక్టర్ ఆయన. ఆ సంస్థ అప్పటివరకు ఆర్‌ఆర్ ల్యాబ్‌లోనే భాగంగా ఉండేది. స్వంత భవనాలు, మిగతా సౌకర్యాలు వచ్చిన తరువాత, ప్రారంభోత్సవానికి ప్రపంచంలోని గొప్ప శాస్తవ్రేత్తలను చాలామందిని పోగేసి రెండు వారాల పాటు సదస్సులు నిర్వహించారు. నేను అడిగింది, ఆ సదస్సులో పాల్గొనడం గురించే. నేను మాలిక్యులర్ బయాలజీ చదువుకున్నాను. పిహెచ్‌డి కూడా చేశాను. కానీ సదస్సుల నాటికి కేవలం సైన్సు జర్నలిస్టును! సైంటిస్టును కాదు! సదస్సుల వివరాలను, పాల్గొంటున్న వారి వివరాలను కలిపి ఒక పెద్ద పుస్తకం వేశారు. దేశ విదేశాలలోని వారెంతోమంది, పాల్గొనడానికి అప్లికేషన్స్ పంపారు. వారిలోంచి ఎంపికయిన వారు రెండు మూడు వర్గాలతో సెలెక్టెడ్ పార్టిసిపెంట్స్. ‘చాలా ముఖ్యమయిన వ్యక్తులు’ మాత్రం ఆహ్వానాలు అందుకుని వచ్చారు. పెద్ద సంస్థల డైరెక్టర్లు, ప్రభుత్వంలో సెక్రటరీల లాంటి వారితో సమానంగా, ఆ లిస్టులో నా పేరుఉంది. అప్పట్లో దేశంలో ఉండిన రెండు సైన్సు పత్రికల ఎడిటర్లు కూడా వచ్చారు. ఆరుగురు నోబెల్ బహుమతి గ్రహీతలు వచ్చారు. డిఎన్‌ఏ నిర్మాణం కనుగొన్న ఫ్రాన్సిస్ క్రిక్, టెస్ట్‌ట్యూబ్ బేబీలను ప్రారంభించిన ఎడ్వర్డ్స్ లాంటివారు అక్కడ ఉన్నారు. కానీ, సమావేశంలో మొదటి ఉపన్యాసం ఎఫ్రాయిమ్ కచాల్‌స్కీ అనే పరిశోధకుడు సమర్పించారు. దీన్ని ప్రోటోకాల్ అంటారు. అంటే మర్యాదలు పాటించడమని అర్థం!

ఎఫ్రాయిమ్ కచాల్‌స్కీ అనే ఆ భారీ మనిషి, ఇజ్రాయెల్ దేశానికి అధ్యక్షుడు, మన భాషలో రాష్టప్రతిగా పనిచేశాడు. ఆ దేశంలో గొప్ప సైంటిస్టులను, పండితులను ప్రెసిడెంట్ చేసే సంప్రదాయం ఉంది. ఒకప్పుడు, ఐన్‌స్టయిన్‌ను అడిగారు. కానీ ఆయన ఒప్పుకోలేదు. బహుశః ఆ మార్గంలోనే మన దేశంలో అవ్వల్ ఫకీర్ జైనులాబుదీన్ అబ్దుల్ కలామ్‌గారు అధ్యక్షులయ్యారు. కచాల్‌స్కీ పేరున్న జన్యుశాస్తవ్రేత్త. మంచి ప్రసంగం చేసినట్టు గుర్తుంది. వివరాలు గుర్తుకు రావడంలేదు. మొత్తానికి ఆయన మృదుభాషి. స్నేహశీలి. అంతకు ముందు నా పరిశోధన పత్రమొకటి, ఇజ్రాయెల్‌లో జరిగిన కాన్ఫరెన్సులో అంగీకరించబడింది. కానీ మన దేశానికీ, ఆ దేశానికీ సంబంధాలు సరిగా ఉండనందుకు నేను వెళ్లలేకపోయాను. ఒక మధ్యాహ్నం కచాల్‌స్కీ గారితో చాలాసేపు కబుర్లు గడిచాయి. ఒక ఇంటర్వ్యూ రికార్డు చేశాను. అంతా ముగిసి బయటకు వచ్చిన తర్వాత ఆయనను అనుక్షణం ఇంటిలిజెన్సు వారు పహరా కాస్తున్నారన్న సంగతి అర్థమైంది. ఒకాయన వచ్చి, నా రికార్డర్ లాక్కున్నాడు. ఆయనతో ఏం మాట్లాడావని గట్టిగా అడిగాడు. ‘నేను సైన్సు మాట్లాడాను. కావాలంటే, ఆ కాసెట్ పట్టుకుపో అన్నాను. అతను ఊరుకున్నాడు. మిగతా పాత్రికేయులను ఆయన దరిదాపులకు పోనివ్వలేదట! ఆ దేశంనుంచి మైకేల్ సేలా అని మరో గొప్ప ప్లాంట్ జెనెటిసిస్ట్ వచ్చాడు. ఆయనతో మాట్లాడితే ఎవరూ పట్టించుకోలేదు.


జెనెటిక్స్‌ను ఎంతో ప్రేమగా చదువుకున్న నాకు ‘ఫ్రాన్సిస్ హారీ క్రాంప్టన్ క్రిక్’ మరీ గొప్పవాడుగా కనిపించాడు. నాకు కొంతమంది పట్ల మరీ ఆరాధనా భావం ఉంటుంది. అవకాశం ఉన్నా వారికి మరీ దగ్గరగా పోవడానికి మనసు ఒప్పుకోదు. క్రిక్‌తో గుంపులో మాట్లాడడమే కానీ ఒంటరిగా కబుర్లు చెప్పే సాహసం చేయలేదు అందుకనే.
కార్ల్‌టన్ గాజుసేక్ అని మరో నోబెల్ లారేట్ వచ్చారు. ఆయన విశృంఖల భావాలు గల మనిషిగా పేరున్న వ్యక్తి. కొండజాతుల వారు, జెనెటిక్స్‌లో వారి పద్ధతుల పాత్రల గురించి గొప్ప పరిశోధనలు చేసినా, ఎందుకో అందరూ ఆయనను చూచి జంకుతారనిపించింది. నేను మాత్రం ఆయనను టైం అడిగాను. ‘నీవేమీ రికార్డు చేయనంటే ఎంతసేపయినా మాట్లాడవచ్చు!’ అన్నాడాయన. మేమిద్దరం గంటకన్నా ఎక్కువసేపు ఎన్నో సంగతులు మాట్లాడుకున్నాము. స్ర్తి పురుష సంబంధాల గురించి, ఆయనకు, కొండ జాతుల వారిలాగే, కొన్ని విచిత్రమైన అభిప్రాయాలున్నాయని అర్థమైంది. అది తప్పుకాదేమోననిపించేలాగ మాట్లాడారాయన. మేమంత సేపు మాట్లాడడం ఆశ్చర్యంగా కనిపించింది లాగుంది. సిసిఎంబీ వారి అఫీషియల్ ఫోటోగ్రాఫర్ మా ఫోటో తీసి మరునాడు ఉదయానికి నోటీసు బోర్డులో పెట్టాడు. నేను కాపీ తీసుకున్నాను. నేను రాసిన మరో వ్యాసంతోపాటు, అది ఒక దినపత్రికలో అచ్చయింది. కానీ, అదిప్పుడు నా దగ్గర మాత్రం లేదు.


జెర్మనీనుంచి వచ్చిన మరో నోబెల్ బహుమతి గ్రహీత యువకుడు. అతను బంజారా హోటేల్‌నుంచి సైకిల్‌మీద తార్నాక రావడానికి ప్రయత్నించాడు. మన మ్యాపుల కారణంగా, ఊరంతా తిరిగి తిరిగి చివరికి రానేవచ్చాడు. అప్పట్లో అదొక సంచలన వార్త! సైంటిస్టులు, పరిశోధకులు కూడా మనుషులే అనడానికి మరెన్నో ఉదాహరణలను ఈ సదస్సు సందర్భంగా నేను చూడగలిగాను.


ఇంగ్లండ్‌నుంచి ఎడ్విన్‌డాస్ దంపతులు వచ్చారు. డాస్ గారిని ఎడ్డీ అని పిలుస్తున్నారందరూ. ఆయన ‘అయామ్ ఎడ్డీ!’ అని పరిచయం చేసుకుంటున్నాడు. కరిగే ప్లాస్టిక్‌లను కనుగొని వాటి గురించి మరింత కృషి చేస్తున్న గొప్ప పరిశోధకుడాయన. వింత ఏమిటంటే, ఆయనకు ఇంద్రజాలికుడు అంటే మెజీషియన్‌గా కూడా ప్రపంచమంతటా మంచి పేరుంది! మాజిక్ అంతా సైన్స్ అనడానికి ఆయన నిలువెత్తు ఉదాహరణ. ఒకనాటి సాయంత్రం, సతీమణి సాయంతో ఆయన చక్కని ప్రదర్శన చేశారు. అందరికీ ఆయనంటే వున్న గౌరవం నాలుగింతలైంది. ఈ సందర్భంగా సీసీఎంబీ ఆస్థాన మెజీషియన్, మ్యుజీషియన్ మధుసూదన్ వామన్ పండిత్ గురించి చెప్పకపోతే అన్యాయమే అవుతుంది. పరిశోధకుడు పండిత్ మంచి మెజీషియన్. అంతకన్నా హార్మోనియం మీద హిందుస్తానీ సంగీతంలో దిట్ట. దేశంలోని ప్రసిద్ధ గాయకులెందరితో బాటు సహకార వాద్యం వాయించాడు. పండిత్ ఆ తర్వాత మంచి మిత్రుడయ్యాడు.


గొప్ప పరిశోధకులంతా వేరు దేశాల వారే అనుకుంటున్న నాకు, పెట్రోలును తినే సూక్ష్మ జీవులను కనుగొన్న ఆనంద చక్రబర్తి, ఎయిడ్స్ పరిశోధకుడు శార్ఞరవన్ (ఈ పేరును అచ్చువేయడం కుదరదేమో శారంగ రవన్ అనవచ్చు!) మరో టాటా (నిజంగా ఒక టాటా పరిశోధకుడున్నాడు!) కనిపించి, మిత్రులయి, భుజాలు పొంగేలా చేశారు. ఈ సదస్సుల సందర్భంగా కళలను గురించి ఒక సెషన్ జరిగింది. మన చిత్రకారులు పీవీ రెడ్డి, ఎమ్.ఎఫ్.హుస్సేన్, కవి విక్రంసేఠ్, ప్రసిద్ధ నిర్మాణ నిపుణుడు చార్ల్స్ కొరియా మరెందరో ఆ సెషన్‌లో పాల్గొన్నారు.
సమాపన కార్యక్రమంలో ప్రధాని రాజీవ్‌గాంధీ పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత మేమంతా భోజనాలకు బయలుదేరాము. ‘ప్రధాని మనతో భోజనం చేయనున్నారు. ఆయన కొరకు వేచి ఉండాలి!’ అని వార్త వచ్చింది. తాంక్స్‌గివింగ్‌డే, టర్కీ డిన్నర్‌లో రాజీవ్‌గాంధీ గారితో మాట్లాడే అవకాశం కూడా దొరికింది. ఆకర్షణగల అందగాడతను! ప్రధాన మంత్రి ఉండగా, ఫ్రాన్సిస్ క్రిక్ ‘జెనెటిక్స్ అంటే ఏమిటి?’ అని ఒక పాపులర్ ప్రసంగం చేశారు. నోబెల్ బహుమతి గ్రహీత, విషయాన్ని సులభంగా చెప్పిన తీరు అందరికీ నచ్చింది. సైన్స్ ఏజ్ అనే సైన్సు మాసపత్రిక సంపాదకుడు సురిందర్‌ఝా ఆ ప్రసంగ పాఠాన్ని పత్రికలో అచ్చు వేయాలనుకున్నాడు. రికార్డింగు కోసం భార్గవను అడిగాడు. సిసిఎంబీ వారు అన్ని ప్రసంగాలను రికార్డు చేశారు. క్రిక్ ఉపన్యాసాన్ని వదిలేశారు. భార్గవ, అంటే పుష్పా నన్ను అడిగాడు నేను రికార్డింగ్ ఇచ్చాను. ప్రసంగ పాఠం అచ్చయింది.


సంగీతోత్సవాలు, నాటకోత్సవాలు జరుగుతుంటాయి. సీసీఎంబీలో జరిగింది సైన్సు పండుగ. అంత ఎత్తున కాకున్నా, అడపా దడపా సైన్సు ఉత్సవాలు జరిగితే ప్రజలకు, సైన్సుకు మధ్యన ఉందనుకుంటున్న దూరం తగ్గుతుంది!

Saturday, August 17, 2013

‘చంద్రయానం’

భారత చంద్రయానం
- రచన: డా.టి.వి. వెంకటేశ్వరన్,
అనువాదం: ఎ.జి.యతిరాజులు,
ప్రజాశక్తి బుక్‌హౌస్,
ఎం.హెచ్. భవన్,
ఆజమాబాద్, హైదరాబాద్- 20, 040- 27660013.

తెలుగులో సైన్సు పుస్తకాలు వస్తున్నాయంటేనే ఆనందం. అం దునా ఏవో పాత విషయాలను గురించి కాకుండా, ఇటీవలి చంద్రమండల పరిశీలనల గురించి పుస్తకమంటే అంతకన్నా ఆనందం ఏముంటుంది. వెంకటేశ్వరన్‌ఈ పుస్తకాన్ని తమిళంలో రాశారు. ఆయన బహుశః పరిశోధకుడై ఉండాలి. చంద్రయానం ఒక్కటే గాక, చంద్రుని గురించి కూడా సరళంగా తెలియజేయడం తన రచన ఉద్దేశమని సూటిగా చెప్పారు. సైన్సులో ఒక అధునాతన విషయాన్ని గురించి, అందరికీ అర్థం కావాలంటే, ఆ విషయం గురించిన పూర్వాపరాలు తెలిసి ఉండడం నిజంగా అవసరం. ఈ పద్ధతిని అందరూ పాటించాలి.

ఇందులో కవితా ధోరణిలో పెట్టిన శీర్షికలు చంద్ర వదనం, మాటున ఉండి చూచే మర్మమేమి?, నీవులేక నేనులేను, బుగ్గపై గాయం లాంటివి పాఠకుడిని పట్టి చదివిస్తాయి. కథనం కూడా అంత బాగానూ నడుస్తుంది. చంద్ర బింబంలోని మచ్చల గురించి చెప్పిన వివరాలు బాగున్నాయి. చంద్రగోళం గురించి సవివరంగా చెప్పడమే కాదు, సాంకేతిక విషయాలూ అందించారు. చంద్రగోళం నిర్మాణం గురించి, అది పుట్టిన నాటినుంచి ఈ నాటి వరకు వచ్చిన మార్పుల గురించి శాస్ర్తియ విశేషాలతో వివరించారు. చంద్ర గ్రహాన్ని పరిశీలించడానికి, దూరం నుంచి అక్కడ దిగి చేసిన ప్రయత్నాల వివరాలు కూడా ఉన్నాయి. 125వ పేజీలో మన పరిశోధకులు చేసిన చంద్రయానం వివరాలు మొదలవుతాయి. చంద్రయాన్ సాధించిన విజయాలతో పుస్తకం ముగుస్తుంది. ఈ తరహా పుస్తకంలో బొమ్మలు ఉంటే మరింత సులభంగా అర్థమవుతుందనే భావనతో అవసరమైన చోటల్లా కావలసినన్ని ఫొటోలు, రేఖాచిత్రాలు వేశారు. అచ్చు టెక్నాలజీ బాగా పెరిగిన ఈ కాలంలో ఫొటోలు మరింత బాగావేసి ఉండవచ్చుననిపించింది.

అనువాదం చాలా సులభంగానే సాగింది. సాంకేతిక వివరాలు ఎక్కువగా ఉన్నందుకు చదివించే సౌలభ్యం కొంత తగ్గిన భావన కలిగింది. అనువాదకులు తెలుగులో వాడుకలో ఉన్న పదజాలంతో అంతగా పరిచయంగలవారు కారు. సూర్యుని చుట్టూ తిరిగేది గ్రహం. దాని చుట్టూ తిరిగే మూన్స్‌ని మనం ఉపగ్రహాలంటున్నాము. పుస్తకంలో సహాయక గ్రహాలు అనే మాట వాడారు. గ్రహాలను గోళాలు అన్నారు. అంతెందుకు చిత్రా నక్షత్రాన్ని చైత్రం నక్షత్రం అన్నారు. వికీర్ణం- వికిరణంల మధ్య తేడా ఉంది. ఇంత మంచి పుస్తకానికి, ఒక సంపాదకుని సాయం తోడయితే, మరింత బాగా వచ్చి, మరింత బాగా చదవడానికి వీలుండేది. పత్రికలకే కాదు, అన్ని ప్రచురణలకూ విషయం తెలిసిన సంపాదకులుండాలన్న సంగతిని మనవారు గుర్తిస్తే కాస్త బాగుండేదేమో!

Wednesday, August 14, 2013

కారు మబ్బులు

మా అబ్బాయి అమెరికాలో తీసిన ఫొటో ఇది.
పేరు కారు మబ్బులట!

(బొమ్మ బాగా పెద్దది. వాల్ పేపర్ గా వాడండి)

Sunday, August 11, 2013

నాన్నను (నన్ను) గురించి

తినే తిండిని ఆనందంగా అనుభవించాలని, ఆదరా బాదరాగా తినగూడదని మాకు తెలియకుండానే అలవాటయింది. నాన్న బడిపంతులు! స్థితిపరులం కాదనే చెప్పాలి! కానీ తిండి సంగతిలో మాత్రం, ఎప్పుడూ లోటు లేదు. నాన్న వంటకు ఉపక్రమిస్తే, ఇక పండగే. ఒకసారి అమ్మ ఊళ్లో లేనప్పుడు, నూగులు, కొత్తిమీర, పచ్చిమిర్చిలతో నాన్న చేసిన పచ్చడి నాకు ఇవాళటికీ గుర్తుందంటే నమ్మండి. మాకంతా, ‘వంటొచ్చిన మగవాళ్లు’ అని పేరుంది! ఇక్కడ, ఎక్కువ తినడం గురించి కాదు సంగతి. ఇష్టంగా తినడం గురించి.

యూనివర్సిటీ రోజుల్లో ననుకుంటాను. ఎవరో నన్ను, నీకిష్టమయిన విషయాలు ఏమిటి? అని అడిగారు. ‘అమ్మాయిలు, స్వీట్లు, పుస్తకాలు, శాస్ర్తియ సంగీతం’ అన్నాను. ‘నాట్ నెససరిలీ ఇన్ దట్ ఆర్డర్’ అని కూడా అన్నాను. వరుస అదే కానవసరం లేదని భావం! ‘జిహ్వోపస్థ పరిత్యాగీ’ అని మొదలుపెట్టి నాన్న ఒక శ్లోకం చెప్పారు. నా యిష్టాలలో మొదటి రెండింటి మీద ఆసక్తి లేని వాడి బతుకు దండగ అని శ్లోక భావం మాత్రం గుర్తుంది. నేను పెళ్లి చేసుకోను దేశాన్ని ఉద్ధరిస్తాను! అన్నప్పుడు ఈ సంగతి చెప్పినట్లు నా అనుమానం. సందర్భం సరిగా గుర్తు రావడంలేదు.


నాన్న ఒక ట్రాన్సిస్టర్ రేడియో కొని తెచ్చాడు. నేను దాన్ని ‘సన్నవిల్లలాగ’ (చంటిపాపలాగ) చంకనేసుకుని తిరుగుతానని అందరూ అనేవారు. రకరకాల కార్యక్రమాలు వింటూ కాలం గడపడం అలవాటయింది. సిలోన్, వివిధ భారతి స్టేషన్ల నుంచి వచ్చే హిందీ సినిమా పాటలు పిచ్చిగా వినడం అలవాటయింది. తెలుగు పాటలు వారానికి రెండు అరగంటలూ, సాయంత్రం సిలోన్‌లో కొన్నీ వినిపించేవి అంతే. మా ప్రాంతంలో శాస్ర్తియ సంగీతం వినడం నిజానికి ఎవరికీ అలవాటు లేదు. నాన్న మాత్రం గద్వాల సంస్థానంలో బాల్యం, ఆ తరువాత కూడా చదువుకున్నారు. అక్కడ నాటకం, సాహిత్యం, సంగీతం లాంటి రుచులన్నీ ఆయనకు తగిలాయి. అప్పుడప్పుడు పాత పద్ధతిలో ఆయన పాడుతూ ఉండేవారు కూడా! నన్నొకసారి పిలిచి ‘నాన్నా! ఊరికే అస్తమానం ఆ సినిమా పాటలు వింటున్నావు. అప్పుడో ఇప్పుడో సంగీతం (శాస్ర్తియం) విని చూడగూడదా?’ అన్నారు. నిజం చెపుతున్నాను. ఆయన మాత్రం ప్రయత్నంగా సంగీతం విన్నట్లు నాకు గుర్తులేదు.


నాన్న ఈ మాటలన్నది నవంబరు, డిసెంబరు రోజులనుకుంటాను. రేడియో సంగీత్ సమ్మేళన్ అని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కచ్చేరీలు వచ్చేవి. మద్రాసు ‘సంగీతోత్సవం’ కచేరీలను హైదరాబాద్ రేడియో వారు కూడా ‘రిలే’ చేసేవారు. (తమిళంలో అనౌన్స్‌మెంట్లు వస్తాయని మానేశారట!) మొత్తానికి కారుకురుచ్చి అరుణాచలం, టి.ఆర్.మహాలింగం, చెంబై వైద్యనాథ భాగవతార్ వంటి మహామహుల సంగీతం విన్నాను. ‘సంగీతమంటే ఇది గదా!’ అన్న భావం ఒకటి బలంగా నాటుకుపోయింది.


నాకు ఇష్టమని చెప్పుకున్న విషయాల్లో మొదటి రెండింటి మీద, అంత ప్రేమ లేదు! నిజం! పుస్తకం, సంగీతం లేనిదే రోజు గడవదు. ఇది అంతకన్నా నిజం!


* ‘అత్త పత్తెమయితే, ఇల్లల్ల పత్తెమ’ని మాకొక మాట ఉన్నది. ఇక్కడ పత్తెమంటే, పథ్యం. తిండిలో నిబంధన. నాకు ఇష్టమయిన సంగతులు, అందరికీ ఇష్టముండాలని ఎక్కడా లేదు. కానీ, బతుకంటే ఇష్టం లేనివాళ్లు ఉండరు, ఉండగూడదని నా నమ్మకం. అమ్మ, నాన్న నాకు బతుకు నేర్పించినట్లే, బతుకు మీద ప్రేమ నేర్పించి, వారి దారిన వారు వెళ్లిపోయారు. అమ్మా, నాన్నా పెద్దవాళ్లయి, పోవడం సహజం! అయినా, వాళ్లు ఉన్నారనుకునే బతుకుతున్నాను. మన వాళ్లందరూ, అనుక్షణం మన కళ్ల ముందు ఉన్నారు గనుకనా?

* మాత, పిత, గురుదేవులు, హితులు - వీళ్లే దేవుళ్లనుకుంటే ఎంత బాగుంటుంది? అంతా కనిపించే దేవుళ్లు! కనిపిస్తారు, పలకరిస్తారు, కనికరిస్తారు!


* కోతి రాగమ్మ - చింతకాయ తొక్కు

‘కోతి రాగమ్మ చింతకాయ తొక్కు’ అన్న మాట వినగానే మీకేమయినా తోచి ఉండాలి. చాలామందికి తోచదు. కొన్ని మాటలు, జోకులు, కథలు, ఒకో ప్రాంతం, వర్గంలో మాత్రమే ప్రచారంలో ఉంటాయి. రాఘవులు, రాగడవుతాడు.. రాఘవమ్మ రాగమ్మవుతుంది. దంచడం, తొక్కడం, నూరడం సమానార్థకాలు కాకున్నా ఇంచుమించు ఒకే పనిని సూచిస్తాయి. పచ్చడి అని కొందరనే పదార్థాన్ని మేము ‘తొక్కు’ అంటాము. తొక్కింది తొక్కు. చింతకాయలు అందరికీ తెలిసినవే. ఇంత తెలిసినా, శీర్షిక అర్థం మాత్రం తెలియదు.


రాగమ్మ ముందే కోతివంట మనిషి. పనులను తన పద్ధతిలో చేసుకుంటుంది. ఆమె చింతకాయ తొక్కు పెట్టడానికి ఉద్యమించింది. పెట్టడమంటే, నిలువతొక్కు తయారుచేసి కాగు (బాన) నింపడమని భావం. ఎవరికో పెట్టడం కాదు. సరే, చింతకాయలు దంచి, నారలు కొంతవరకు తీసి పడేయాలి. పసుపు, మెంతుల పొడి, జిలకర మొదలయినవి కలపాలి. ఇక పచ్చిమిర్చి, ఉప్పు ముఖ్యంగా చేర్చాలి. అంతా అయింతర్వాత రుచి చూస్తే, కారం ఎక్కువయింది. కనుక కొంత ఉప్పు చేర్చింది. ఈసారి రుచి చూస్తే ఉప్పు మరీ ఎక్కువయింది. కనుక ఈసారి మరిన్ని చింతకాయలు దంచి కలిపింది రాగవ్వ! రుచి చూస్తే ఉప్పు తక్కువయింది. మళ్లీ సర్దుబాటు చర్యలు!


మొత్తానికి ఒక్క కాగు అనుకోని మొదలుపెట్టిన తొక్కు మూడు కాగులయింది.
అదీ కథ! అందుకే, ఎవరన్నా పనులను ఈ పద్ధతిలో సర్దడానికి ప్రయత్నిస్తే కోతి రాగమ్మ చింతకాయ తొక్కు అంటారు మా వాళ్లు!


* జొన్న చేనుకు పోయి, సొగసుకత్తెను చూచి, నిన్న మాపటి నుంచి నిద్ర లేదు. దాన్ని నన్ను గూర్చి దయ చేయి మాధవా! పొన్న పూలతోటి పూజసేతు!


పద్యం హృద్యంగా ఉంది కదూ! ఈ పద్యాన్ని మాకు సంగతేమిటో అర్థంకాని చిన్న వయసులోనే నేర్పించారు. నాట్యం పేరున చిన్నచిన్న పిల్లలు, ‘రాడాయెనే స్వామి’ అనీ, ‘స్వామిరార!’ అనీ గుప్పిగంతులు వేస్తుంటే నాకు ఈ పద్యం గుర్తుకు వస్తుంది.


* బూతుల్లోనూ అందమయినవి కొన్ని, అసహ్యమయినవి కొన్ని ఉంటాయి. సంస్కృత భాషలో ఉన్నంత మాత్రాన మాటలన్నీ ఒక పరిష్కారం గలవి కావు. ‘సుతా సురత సౌందర్యం, జామాతా వేత్తి, నో పితా!’ అని ఒక మాట ఉంది. ‘అమ్మాయి రతి సౌందర్యము, అల్లునికి తెలుస్తుంది, తండ్రికి కాదు!’ అని భావం. నిజమే, కానీ ఎంత చీదరగా ఉంది ఈ మాట! బాగలేదు!


* ఇతి శం! కోతి రాగమ్మ చింతకాయ తొక్కు, ఇక ఆగును!

Friday, August 9, 2013

మిస్సమ్మ - ఉత్తరం

మిస్సమ్మ సినిమా వచ్చినప్పుడు సినిమా రంగం అనే పత్రికలో ఒక ప్రేక్షకుడు రాసిన ఉత్తరం.
అప్పుడు మరి ఫేసుబుక్కలూ లైకులూ లోవు గదా!
Monday, August 5, 2013

రూమీ - అస్తిత్వం

మౌలానా జలాలుద్దీన్ రూమీ ప్రసిద్ధ కవి, తాత్వికుడు.
పర్షియన్ భాషలో రాసిన ఆయన కవితలు ప్రపంచమంతటా  పేరు పొందినయి.

దీవాన్ అంటే  సంపూర్తి కవితాసంకలనం అని అర్థం.
రూమీ దీవాన్ లోని 238వ కనిత ఇది.

ఉండుట, లేకుండుటల గురించి కాదు 
నా తికమక.

రెండు ప్రపంచాల నుంచి తెగతెంపులు 
చేసుకోవడం ధైర్యమనిపించుకోదు.

నాలో ఉన్న అద్భుతాలను 
గుర్తించ లేకుండడం
అది 
అసలయిన వెర్రితనం!

అంటాడాయన.I neither know Persian nor English.
What I did is not translation.
I only tried to bring the idea here.

To be or not to be 
is not my dilemma.
To break away from both the worlds
is not bravery.
To be unaware of the wonders
that exist in me
that
 is real madness!

(Translation by Maryam Mafi & Azima Melita Kolin)

Saturday, August 3, 2013

అచ్చులో లోకాభిరామం

చాలా కాలం పాటు అచ్చులో వచ్చిన అంశాలను నెట్ లో అందించాను.
ఇక్కడికన్నా నా బహుభాషా బ్లాగులో అటువంటి అంశాలు ఎక్కువ.

ఆంధ్రభూమి శాస్త్రి గారూ, మూర్తి గారూ పట్టుబట్టి నా లోకాభిరామంని లోకాభిరామమ్ గా మార్చి అచ్చులో అందిస్తున్నారు.

అంశాలు కొత్తవి.
ఇక్కడినుంచి ఎత్తినవి కావు.

చిత్తగించండి.
ఊదవలసిన శంఖం


* ‘నేను చెప్పే మాటలు ఎవరికీ పట్టవని నాకు తెలుసు. అయినా చెపుతాను. ఈ మాటలు, నేను చెప్పకుంటే మరెవరూ చెప్పరు. చెప్పలేరు’ అంటాడొక చైనా తాత్వికుడు.

‘ఊదర సంగై ఊది వెచ్చాల్, విడియుం బోదు, విడియాట్టుం’ అని ఒక తమిళ సామెత. ఊదే శంఖాన్ని ఊదేస్తే, తెల్లవారేటప్పుడు తెల్లవారనీ, అని అర్థం.

* కనీ పెంచీ, కనిపించిన దేవతలు అమ్మా, నాన్నా! బతుకుకు, చదువుకు గురువు, తరువాత హితుడు, స్నేహితుడు నాన్న! (నేను నాన్నగారు, స్నేహితులు అనలేదని ఎవరూ బాధ పడనవసరం లేదు! మా తీరే అంత!) ఈ పని ఈ రకంగా చేయండి, అని నాన్న ఏనాడూ చెప్పింది లేదు. అయినా అన్నింటికీ ఆయనే గురువు. నాన్న సైకిలు పెట్టే చోట, గోడలో ఒక చిన్న చెక్క తలుపు అల్మారా ఉండేది. నేనూ, తమ్ముడూ పొద్దున్నే ముఖం కడుక్కుని వచ్చి అక్కడ నిలబడి, ‘ఎలుకా! మాకేమయినా యియ్యవా?’ అని అడగాలి. కళ్లు మూసుకుని అడగాలి. అల్మారాలో ఎలుక ఉంటుంది. అది మాకు బిస్కెట్లు, చాక్లెట్లు ఇస్తుంది. ఇప్పటిలాగ చారెడు, బారెడు చాకొలేట్లు లేవప్పుడు. ప్యారీ, దకన్, రావల్‌గావ్ అంటూ రెండు వేపుల చెవులు మెలేసిన చాక్లేట్లవి. బుద్ధిగా పిడక బూడిదతో పళ్లు తోముకుని, ముఖం కడుక్కుని వచ్చి నిలబడడమంటే, ఎలుక కొరకేనా?

నాన్న ఆ ఊళ్లోనే, అంటే మా ఊళ్లోనే బడిలో టీచరు. ఆయన సిద్ధమయి, ధోవతీ కట్టుకుని, తాంబూలం వేసుకుని, సైకిలు తీసుకుని ఠీవిగా బయలుదేరితే దారిలో ఎవరూ అడ్డువచ్చేవారు కాదు. కానీ, అదంతా చూచే ఓపిక ఎక్కడిది! ఉడుతలా పరుగెత్తి బడికి చేరుకునే వాణ్ని. పుస్తకాలు లేవు. కనీసం పలక లేదు. నాకసలు బడిలో అడ్మిషనే లేదు. ప్రార్థన అయింతర్వాత చెప్రాసీ (బంట్రోతు) శాంతయ్య, నన్ను ఇంట్లో దింపుతాడు. అతను భుజం మీద ఎత్తుకుని ఇంటికి తెస్తుంటే, నచ్చక, ఒకనాడు, అతని చెవి కొరికినట్టు జ్ఞాపకం! శాంతయ్య తలకు రుమాలు కట్టుకునేవాడు. మరి చెవి ఎట్లా కొరకడం కుదిరింది? ఇప్పుడు అనుమానం వస్తుంది. పెద్దవాణ్ని అయింతర్వాత శాంతయ్య ఎప్పుడూ ఆ సంగతులు చెప్పి మురిసిపోతుండేవాడు.

నేనూ బడిలో చేరాను. అక్షరాలు దిద్దే అవసరం లేకుండా, ఏకంగా పుస్తకం పట్టుకున్నానట. ఒకనాడు అందరినీ నిలబెట్టి నాన్న డిక్టేషన్ చెపుతున్నాడు. నేను మెడలిక్కించి ముందున్నవాడి పలకలోకి తొంగి చూచాను. తల మీద ఠపీమని దెబ్బ పడింది. తిరిగి చూస్తే నాన్న! పలక కింద పడేసి ఏడుస్తూ ఇంటికి వెళ్లిపోయాను. పలకను నాన్న ఇంటికి తెచ్చాడు. ఆయన చెప్పిన మాట, అప్పటికే నేను రాసి ఉంచానన్న సంగతి ఆ పలక ప్రకటించింది! నాన్న గట్టిగా నవ్వాడు! నేనూ గర్వంగా నవ్వాను.

క్రమశిక్షణంటే నాన్న తర్వాతే ఎవరయినా! ఆయన్ను చూచి గడియారం తత్తరపడేదేమో? చివరి వరకూ ఆయన అదే పద్ధతిగా బతికారు.

ఇంట్లో తాతయ్య పుస్తకాలు ఒక పెద్ద అల్మారా నిండా ఉండేవి. వాల్మీకం మొదలు ఆనంద రామాయణం దాకా, ఎన్ని రామాయణాలున్నా ఆశ్చర్యం లేదు. ఆరోగ్యం, వైద్యం, యాత్రా చరిత్రలు, గారడీ విద్య, మొదలయిన పుస్తకాలన్నీ తాతయ్య కొని చదివారంటే భుజాలు పొంగిపోతాయి. ఆ పుస్తకాలను తరచు దులిపి, నిర్వహించడం నా డ్యూటీ. ఆ పుస్తకాలు నావి, అది గర్వం!

నాన్న బాగా చదువుకున్న మనిషి. కానీ సర్ట్ఫికేట్లు లేని చదువది. ఏదో ఒక చిన్న ట్రెయినింగ్ పొంది, ప్రైమరీ స్కూల్ పంతులుగా సెటిలయ్యారాయన. అందులోని ఆనందం గురించి తర్వాతెప్పుడో చెప్పాడాయన మాతో! ఆయన విపరీతంగా పుస్తకాలు చదివేవాడు. నాకు అక్షరాలతో పరిచయం ‘చందమామ’తో మొదలయింది. మూడవ తరగతిలో ఉన్నప్పుడు చందమామ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా చదవడం అలవాటయిపోయింది. అందులో వచ్చే వ్యాపార ప్రకటనలు కూడా గుర్తున్నాయి. నాన్న తాను చదివిన నవల, పత్రిక ఏదయినా సరే తరువాత నా ఒళ్లో పడేయడం అలవాటయింది. కోడిగుడ్డు దీపం పెట్టుకుని, అయిపోయిందాక అపరాధ పరిశోధక నవల చదివి,ఆ దృశ్యాలు కళ్ల ముందు మెదులుతుంటే, భయంగా పడుకోవడం గుర్తుంది! ‘ఈ ప్రపంచంలో పనికిరాని పుస్తకమని ఏదీ లేదు’ అని నాన్న అనుకున్నాడనిపిస్తుంది. అంగట్లో పప్పు కట్టిచ్చిన కాయితం కూడా చదవందే పడేయకపోవడం, అప్పుడే అలవాటయింది.

సెలవులు వచ్చినయంటే, ఏ లైబ్రరీ నుంచో సంచెడు పుస్తకాలు ఇంటికి వస్తాయి. నిదానంగా చదివితే నాలుగు రాళ్లు కాలం గడుస్తుంది. కానీ, అంత ఓపిక ఏదీ? పిచ్చెత్తినట్టు అన్నీ చదివేసి, మరో బ్యాచ్ కొరకు ఎదురుచూడడమే!
అది పరీక్షకు చదవవలసిన ‘సిలబస్’ పుస్తకం గానీ, సరదాగా చదివే నవల గానీ, చదువు కాని చదువుగా చదివే మరో పుస్తకం గానీ, పుస్తకమంటే, నాన్నలాగే మిత్రుడు, ఆప్తుడు! కష్టపడి చదవడం, సరదాగా చదవడమన్న తేడా లేదు! అన్నీ యిష్టంగానే చదవడం అలవాటయింది. వరుసబెట్టి రెండు క్లాసిక్సు, రెండు నవలలు చదివి, అదే ఊపులో ‘సిలబస్’ కూడా చదివితే, అన్నీ ఒకే రకంగా, సినిమాలాగ గుర్తుకు వచ్చేవి.

మా ఊరి బడిలో అయిదవ తరగతి వరకే ఉండేది. తరువాత, పక్కనున్న పాలమూరులో చదువు. చిత్రంగా నాన్నకు, తిరిగి మా బడికే బదిలీ అయింది. చివరి పీరియడ్ జరుగుతుండగా, (మామూలుగా అది ఆటల పీరియడ్) నన్ను వెతికి, ‘ఇంటికి పరుగెత్తకు;’ అని ఒక మాట చెప్పి వెళతాడు నాన్న! అంటే ఆనాడు సినిమా చూసే కార్యక్రమం ఉందని అర్థం. సినిమాలు చూడడమే కాదు, వాటిని గురించి చర్చించడం కూడా నాన్న దగ్గర నేర్చుకున్నాను. నమ్మండి, నమ్మకపొండి, జరదా పాన్ తినడం, నాన్న దగ్గర నేర్చుకున్నాను!

జీవితాన్ని హాయిగా ఎంజాయ్ చెయ్యాలన్నది నాన్న ఫిలాసఫీ. పట్నంలో పడి, నన్ను నేను వెదుక్కుంటూ బతికే రోజుల్లో పండగకు ఇంటికి వెళతాను. సాపాట్లు (భోజనాలు) అయింతరువాత నాన్న పాన్ వేసుకుని, ఆ అందమైన పెట్టెను నా ముందుకు తోస్తారు అది అలవాటు. ఒకసారి, నేను ‘మానేశాను వద్దు’ అన్నాను. ‘నాన్నా! టీ, కాఫీ తాగవు. మరే అలవాట్లూ లేవు. ఉన్న ఈ ఒక్క సరదా (అదే జరదా) మానేసి ఏం చేస్తవయ్యా?’ అన్నారాయన.

-మళ్లీ వచ్చేవారం