Sunday, June 16, 2013

యోగీశ్వర విలాసము

యోగీశ్వర విలాసము
నందికొటుకూరు సిద్ధయోగి ద్విపద కావ్యము
పరిష్కర్త: వైద్యం వేంకటేశ్వరాచార్యులు,
అక్షరార్చన ప్రచురణలు- కర్నూలు
ప్రతులకు: పరిష్కర్త, ప్లాట్: 167,
శ్రీకృష్ణ నిలయం, రెవెన్యూ కాలనీ, కర్నూలు
పేజీలు: 220, వెల: 120 రూ.

నందికొటుకూరు సిద్ధయోగీంద్రుడు 1700- 1770 మధ్య కాలమున జీవించిన శివయోగి. కూచిపూడి సిద్ధేంద్రయోగి, బ్రహ్మంగారి శిష్యుడు సిద్ధప్పలకు పేరులో మాత్రమే వీరితో పోలిక. వారిద్దరు వేరు. ఈ విషయాన్ని పరిష్కర్త సవివరంగా చూపించారు. నిజానికి ఈ రచనను ప్రపంచానికి అందించిన వైద్యం వేంకటేశ్వరాచార్యుల గురించి రెండు మాటలు చెప్పుకోవాలి. ఈయన పండితుడు. పరిశోధకుడు. వైష్ణవ సాంప్రదాయ అవలంబి. అయినా ఎన్నో శైవ గ్రంథాలను కూడా వెదికి, పరిష్కరించి ప్రపంచానికి అందజేశారు. నలభయికి పైబడిన ఈయన పుస్తకాలన్నీ పరిశోధన పద్ధతిలోనివే. 1923లోనే లింగైక్యం చెందిన చింతలేని సూగూరప్పలేదా నిశ్చింత సూగూర సూరిరాతప్రతినుంచి ప్రస్తుత గ్రంథాన్ని పరిష్కరించారు.

సిద్ధయోగి కవి మాత్రమే కాదు, యోగి కూడా. ఆయన జీవితం, మహిమల గురించి, సుమారు 20 పేజీల రచన ఒకటి పుస్తకం చివరలో ఉంది. అందులోని విశేషాలు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక పీఠికలో పరిష్కర్త అందించిన వివరాలు, విశే్లషణ మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. సిద్ధయోగి గాజులమ్మేవారు. ఊరూరు తిరుగుతూ, అలంపురంలో ఒక గురువును గుర్తించి, వారివద్ద శిక్షణ పొందిన వివరాలు కథలకన్నా బాగున్నాయి. శైవ సిద్ధాంత ప్రవర్తకులు, పండితులుగాక మామూలు మనుషులుగా బతికిన వారన్న సంగతి చరిత్రలో చూడవచ్చు. అటువంటి ఒకానొక మహాయోగిని అక్క మహాదేవి. యోగీశ్వర విలాపములో ఆమెకథ ఉన్నట్లు లెక్క. ఆ కథ కేవలము సూత్రము. ఆ దారంతో శైవ సిద్ధాంతంలోని వివిధ అంశాలను పూలుగా మార్చి పేర్చినది ఈ రచన.

ప్రాచీన శైవ సాహిత్యం ద్విపదల్లో ఉండడము కూడా జగమెరిగిన సత్యం. సిద్ధయోగి ద్విపద మరింత కట్టుబాట్లకు లొంగి నడిచిందని పరిష్కర్త పేర్కొన్నారు. అసలు రచన 159 పుటలలో మూడు ఆశ్వసాలుగా సాగింది. మొదటి ఆశ్వాసంలో రకరకాల విమర్శనములు. శుశ్రూష, వైరాగ్యము, పంచముద్రలు, పంచకోశము, పంచ భూతములు మొదలయిన వాటి తీరున వివరించడమే ఈ విమర్శనములు. పంచభూతముల గురించిన వివరణము పండితుల మెదళ్ళకు పనిపెట్టేదిగా ఉంది. రెండవ ఆశ్వాసంలో అక్క మహాదేవి కథ కూడా ఎన్నో మార్మిక విషయాల చర్చతోబాటుగా కొనసాగుతుంది. వీరశైవ రహస్యము ఇందులో ప్రత్యేకమయిన అంశము.

ఇక మూడవ ఆశ్వాసము మరింత గహనమయిన అంశాలను ముందుకు తెస్తుంది. జనన దిన ఫల వివేకము మొదలు, తానుతానగు వివేకము వరకు ఇక్కడ వరుసగా ఎన్నో వివేకములున్నాయి. యతిచంద్రవినుమునే- సంతధనంబు/ క్షితి పుట్టినపుడు తె- చ్చెడు నది కాదు/ తరలి గిట్టినవేళ- దనము రమంత/ పొరలి తాగైకొని- పోవుటలేదుచెప్పినది మామూలు విషయమయినా, తాత్విక వివేకమయినా భాష, పదముల నడక మాత్రము గొప్ప జిగితో సాగుతుంది.
పుస్తకంలో ఆ తరువాత సిద్ధయోగి రచనలు చిన్నచిన్నవి కూడా చేర్చారు. వేదాంత సూత్రము, షట్‌స్థల దర్పణము, నవ పద్య పుష్పమాలిక, పంచరత్నములు, సప్తచక్ర తత్వము అన్నవి పద్య రచనలు. ఒక తత్వము, మంగళహారతి కూడా ఉన్నాయి.


ఇది కథకొరకు, కాలక్షేపంకొరకు చదవవలసిన పుస్తకం కాదు. పండితులు, ఆర్ష, శైవ విజ్ఞానంలో ఆసక్తిగలవారు శ్రద్ధగా అనుసంధానం చేయవలసిన గ్రంథం ఇది. ఓపిక ఉండి చదివితే మాత్రం, అందరికీ ఎన్నెన్నో విశేషాలు తెలుస్తాయి. భాష మీద కాసింత పట్టున్న వారికి మరెన్నో మర్మాలు కనబడతాయి. రచనా కాలం ప్రకారం ఇది నిజంగా ప్రాచీనగ్రంథం. ఇంత మంచి పుస్తకాన్ని, పరిష్కరించి అందించిన పరిష్కర్త అభినందనీయులు.