Sunday, February 26, 2012

సైన్సు - బతుకుతీరు

మన దేశంలో ఫిబ్రవరి 28వ తేదీన లెక్క ప్రకారం ‘జాతీయ సైన్సు దినోత్సవం’ జరుపుకోవాలి. అక్కడో యిక్కడో జరుపుకుంటారు కూడా! కానీ, మామూలుగా ఆ తేదీన పార్లమెంటులో బడ్జెట్ ప్రతిపాదన జరుగుతుంది. కనుక, చాలామంది చూపు అటువేపే ఉంటుంది. ప్రతిసారీ సిగరెట్లు, మత్తుపానీయాల ధరలు పెరుగుతాయి. అయినా వాటి అమ్మకం కూడా పెరుగుతుంది తప్ప తరగదు. ఇంతకూ సైన్సు దినోత్సవం జరపడానికి ఫిబ్రవరి 28ని ఎందుకు ఎంచుకున్నారు. బడులు, కాలేజీలలో కూడా పరీక్షలు దగ్గర పడ్డాయని పిల్లలూ, పంతుళ్లు గోల పడుతుండే సమయం అది. సీవీ రామన్ గారిని గుర్తుంచుకోవడానికి ఆయన పుట్టిన రోజు హాయిగా నవంబర్‌లో వస్తుంది. అప్పుడు ఈ ‘సైన్స్ డే’ జరపవచ్చునన్న ఆలోచన ఎందుకు రాలేదు?

సంవత్సరమంతా గుర్తుండవలసిన మిత్రులు, లేక గాంధీ లాంటి మహనీయులను ఒక రోజున మాత్రం ప్రత్యేకంగా గుర్తుచేసుకోవడంలో అర్థం ఉంటే ఉంది. గాంధీగారికి పుట్టిన దినం ఉంది. సైన్సుకు అలాంటి దినమంటూ లేదు. ప్రతినిత్యమూ సైన్సు దినోత్సవమే. సైన్సు పద్ధతి ప్రకారం నడిచే వారికి నిత్యమూ ఉత్సవంగానే సాగుతుంది. సైన్సుకు ఒక పద్ధతి ఉంటుందని చాలామందికి తెలియదు. తెలిసినా అదేదో వంకాయ కూర వండే పద్ధతిలాంటి క్రమం తెలిసి ఉంటుంది. ఆ పద్ధతిని సైన్సులోనే కాదు, బతుకు అంతటిలోనూ వాడవచ్చు. వాడాలికూడా! ఎందుకంటే బతుకు మహా సైంటిఫిక్‌గా సాగే విషయం మరి!


ప్రశ్నలడగడంతో సైన్సుపద్ధతి మొదలవుతుంది? ఫిజిక్సులో ప్రయోగమయినా ఎదుటి మనిషి పేరు తెలుసుకోవడమయినా ఈ ప్రశ్నతోనే మొదలవుతుంది. తరువాత కొంచెం పరిశీలన. మరిన్ని ప్రశ్నలడిగి, ఒక ప్రతిపాదనను తయారుచేయడం తరువాతి అంచె. ఆ తరువాత సిద్ధాంతాన్ని పట్టుకుని ప్రయోగాలు చేయడం (ఎదుటి మనిషి పేరు తెలిసింది. ఆ పేరు పెట్టి పిలిస్తే పలుకుతాడా?) ప్రయోగం ఫలితాలను బట్టి ఒక అనుభవం. సూక్ష్మంగా చెపితే సైన్సు పద్ధతి ఇంత సులభంగానూ ఉంటుంది. ప్రశ్న, ప్రతిపాదన, ప్రయోగం, సమాచారం, ఒక సూత్రం! ఇదీ క్రమం. కానీ సైన్సు ఈ క్రమంలో మాత్రమే జరగదని చాలామందికి అర్థం కాదు. మొత్తానికి సైన్సులో ప్రతి విషయానికి సంబంధించి ప్రయోగం, పరీక్షలూ జరుగుతాయనీ, ప్రతి విషయానికీ వెనుక గట్టి ఆధారాలు, సాక్ష్యాలు ఉంటాయనీ మాత్రం అర్థమవుతుంది.


సైన్సు పద్ధతి, అంచెలుగా ముందుకు మాత్రమే సాగుతుంది, అనుకుంటే మరి ఆ తరువాత ఏమిటి? వంకాయ కూర తయారయితే సరిపోదు. అందులో రకరకాల మార్పులుండాలి. మరెన్నో రకాల దినుసులు అందులో చేరడానికి వీలు ఉండాలి. సైన్సులోనూ, అడుగడుగునా, రకరకాల చేరికలు, మార్పులు ఉంటాయి. ఒకే అంచెను రకరకాలుగా, ఒకేరకంగా కూడా మరీ మరీ చేసి చూడడం తప్పనిసరి! ఇందులో వంకాయ కూర పద్ధతి పనికిరాదు. కూరలో ఒకసారి ఉప్పువేస్తే అక్కడికి ఆ అంచె ముగుస్తుంది. సైన్సులో అలాగ్గాదు. పరిస్థితులు వచ్చిన కొద్దీ సిద్ధాంతానికి కొత్త రూపాలు, అర్థాలు పుట్టుకువస్తాయి. వంకాయ కూర ఎవరింట్లో వారిది తయారవుతుంది. సైన్సు ఎవరికి వారు చేసేదికాదు. ఎక్కడ చేసినా ఒకే రకమయిన ఫలితాలు ఉండాలి. నీరు వంద డిగ్రీల సెల్సియస్ దగ్గర మరుగుతుందని అందరికీ తెలుసు. కానీ, వాతావరణంలోని ఒత్తిడి మారితే, అంకె మారుతుంది. ఈ సంగతి చాలామందికి తెలియదు. అందుకే సైన్సులో సిద్ధాంతాలకు ఒక ‘రైడర్’ ఉంటుంది. ‘అండర్ ద గివన్ కండిషన్స్’ అంటే పేర్కొనబడిన పరిస్థితులలో మాత్రమే సిద్ధాంతం నిజమవుతుంది. సైన్సులో శాశ్వత సత్యాలు లేవని అందుకే అంటూ ఉంటారు. విషయం గురించి మరో కొత్త అవగాహన కలిగే వరకు మాత్రమే అది నిజం! అందుకే ఒక ప్రయోగాన్ని వేరు వేరు ప్రాంతాలలో చేసి, ఫలితాలను ఒక చోట చేర్చిన తరువాత మాత్రమే ఒక విషయానికి అంగీకారం అందుతుంది. సైన్సులోని వారందరూ అవునంటేనే అదొక సూత్రమవుతుంది!


సైన్సులో పుట్టిన ప్రతి ఆలోచన, ప్రతిపాదన పరీక్షలకు గురయే తీరును గమనిస్తే మనకు బతుకులోని ఆలోచనలను గురించి కూడా మంచి అవగాహన కలుగుతుంది. ప్రతిపాదన పుట్టగానే అందుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం మొదటి కార్యక్రమం. వంకాయ కూర చూడడానికి, తినడానికి ఒక రకంగా ఉంటుందని ఊహించిన తర్వాత వండే కార్యక్రమం సాగుతుంది. అది అనుకున్నట్టు రావచ్చు. రాకపోవచ్చు. సైన్సులోనూ ఇలాగే జరుగుతుంది. నమ్మగలరా? అందిన ఫలితాలు అనుభవాలను బట్టి, సమాచారానికి అర్థాలు వెదకడం, అసలయిన కార్యక్రమం. వంకాయ కూర ఎలాగున్నా తినవచ్చు. కానీ, మరోసారి వండాలనుకుంటే ఏమిటి మార్గం? అది ఇక్కడి పరిస్థితి. వచ్చిన సమాచారం అనుకున్న తీరును అవునంటుంది. కొన్నిసార్లు కాదంటుంది. అప్పుడప్పుడు అనుకోని ఫలితాలు ఎదురయి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అడపాదడపా అనుకున్న ఫలితాలు మొత్తంగా రానే రావు. వీటి ఆధారంగా చూస్తే మొదట్లో చేసిన ప్రతిపాదన నిజమవుతుంది. లేదా వీగిపోతుంది. కాదు, మార్పులతో మరేదో ప్రయత్నం సాగాలనిపిస్తుంది. అసలు ఆలోచనే మారాలనీ అనిపిస్తుంది!


జీవితమంతా సైన్సు అని ఊరకే గోలపెడితే సరిపోదు. మన ఆలోచనలు, బతుకు తీరు తయారయింది. వంకాయలు, కూరకూడా రసాయనాలే అంటే సరిపోదు. మన ఆలోచనలు, బతుకుతీరు ఈ క్రమంలో సాగుతాయని అర్థం చేసుకుంటే, అప్పుడు శాస్ర్తియ దృక్పథం, ఆలోచనా విధానం అలవడతాయి. మనం చేసే ఏ పనిలోనయినా, ఆలోచన, ప్రతిపాదన, ప్రయోగం, ఫలితాలు, వాటికి అర్థాలు ఉండనే ఉంటాయి గదా! ఎవరో చెప్పినందుకు ఏ విషయమూ సత్యం కాదు. నిప్పును ముట్టుకుంటే చెయ్యి కాలుతుందని అనుభవంలోకి వస్తుంది గనుక, పిల్లలు కూడా నిప్పునుంచి దూరంగా ఉంటారు. ఎవరో చెపితే, ఎవరికయినా, ‘చేసి చూస్తే పోదా?’ అనిపిస్తుంది. అందుకే ప్రశ్న అవసరం. ప్రతిపాదన అవసరం. ప్రయోగం అవసరం.
ఫిబ్రవరి 28న సైన్సు దినోత్సవం జరుపుకుంటే బాగానే ఉంటుంది. ఈ ఉత్సవం, ఆలోచనలు ప్రతినిత్యం సాగితే మరింత బాగుంటుంది! బాగా బతకడానికి ఆలోచనలు ఉండాలి. ఆ ఆలోచనలు సైంటిఫిక్ మార్గంలో సాగితే మరీ మరీ బాగుంటుంది!

Thursday, February 23, 2012

చిరాకు మనుషులతో...

ఈ ప్రపంచంలో అందరూ ఒకేలాంటి మనుషులుండరు. కొంతమందిని చూడగానే సంతోషమవుతుంది. కొంతమంది రకరకాలుగా చిరాకు పెడుతుంటారు. బంధువులు, పరిచయమైనవారు మాత్రమే ఇలాంటి వారయితే, వాళ్లను తప్పించుకుని బతకడానికి మనం ప్రయత్నం చేస్తాము. కానీ పొరుగింటివారు, ఇంట్లోవారు, తోటి ఉద్యోగులు చిరాకుపెట్టేవారయితే, వాళ్లను తప్పించుకోవడం కుదరదు. వారితో కలిసి కొనసాగాలంటే చేయవలసిన పనిమీదకన్నా మనల్ని మనం అదుపులో పెట్టుకోవడం మీద ఎక్కువ ధ్యాస అవసరమవుతుంది. ఇలాంటి తోటి ఉద్యోగులు ఉండటం మామూలే. వాళ్ళని తప్పించుకుంటే పని జరగదు. మరి ఏం చేయాలి?


మనం అదుపులో ఉండాలి

ఈ చిరాకు మనుషులతో కొంత బాధ ఉంటే ఫరవాలేదు. అసలే కుదరకపోతే మాత్రం సమస్య! ఈ రకం మనుషులు ఎలా ప్రవర్తిస్తారు, మన మాటలకు ఏ రకంగా రియాక్ట్ అవుతారు అని ముందే ఊహించడం దండగ. మన ప్రవర్తన మన చేతుల్లో ఉంటుంది కనుక మనల్ని మనం అదుపులో ఉంచుకుని, చిరాకు పడకుండా ఉంటే సరి. ఒత్తిడి కలుగుతుంది, తప్పదు. కానీ, రాను రాను అలవాటవుతుంది. అప్పుడు, ఆ చిరాకు కూడా అలవాటవుతుంది!

మన అసంతృప్తి మనతోనే ముగిస్తే మంచిది

అసంతృప్తి కలిగినప్పుడు, దాన్ని ప్రదర్శించటం సహజం. అది అలవాటయినప్పటికీ, లోపల రగులుతూనే ఉంటుంది. మన భావాలు సరయినవే. అవి మరెవరయినా చెపితే సంతృప్తి కలుగుతుంది. అందుకని, ఈ చిరాకు మనుషుల గురించి మరో మనిషి దగ్గర చర్చచేయడం మనకు అవసరమనిపిస్తుంది. సందర్భం వచ్చినవెంటనే ‘అసలు ఏమయిందంటే’ అంటూ ఫిర్యాదులు చేయకుండా ఉండగలగాలి. నిజానికి ఫిర్యాదుల కారణంగా మన వ్యక్తిత్వం కొంత దెబ్బతింటుంది. ఓపిక లేనివారని మనకు పేరు వచ్చే ప్రమాదం ఉంటుంది. కనుక చిరాకు. కొలీగ్ గురించి ఆఫీసులో, కంపెనీలో చర్చించకుండా ఉండటమే మేలు. నమ్మకమయిన బయటివారితో, వారి గురించి చర్చించి కొంత ‘మంటను’ చల్లార్చుకోవచ్చు.

చిరాకు మనవల్ల కలుగుతున్నదేమో?

మనం మాటమాటకూ చిరాకుపడటం మానేశాము. మిగతా వారితోనూ చర్చించడం లేదు. అప్పుడు ఆలోచనను మనమీదకు మళ్లించాలి. చిరాకు వ్యక్తి గురించి మనకు నచ్చని అంశాలు, ఆలోచనలను గురించి ఆలోచించగలగాలి. మన ఆలోచనలు, వాళ్ల ఆలోచనలు వేరుగా ఉంటాయా? వారిలో మనం, మనకు నచ్చని మరో వ్యక్తి పోలికలను చూస్తున్నామా? లేక ఎక్కడయినా మన ఓర్వలేనితనం, తన ప్రభావం చూపుతున్నదా? ఆలోచించండి. ఎదుటివారిని అంచనా వేయడంలో అసూయకు, అసహనానికి చోటులేదు. ఒకరు మనలాగా లేనంత మాత్రాన, ఆలోచించనంత మాత్రాన వారిని చిరాకు మనుషులనడం మన తప్పు అవుతుంది. ఈ చిరాకులో మన పాత్రను గుర్తుంచుకుంటే మేలు. మనకు మరీ ఎక్కువమంది చిరాకు మనుషులు ఎదురయితే, సమస్య మనలో ఉందని కూడా అర్థం!

వారితో మరింతకాలం గడపగలిగితే

నచ్చని మనుషులతో, మరింతగా కలిసి పనిచేసే అవకాశం వస్తే, వారి లోతుపాతులు, మనలో లోపాలు మరింత బాగా బయటపడతాయి. వారిని తప్పించుకోవాలనే ఆలోచన నుంచి, కలిసి పనిచేసే దాకా మారడానికి చాలా ఓపిక కావాలి. ఆ మార్పు జరిగితే ‘మంచివారే, మాట తీరు మాత్రమే చిరాకు’ అనిపించవచ్చు. ఆ మాట తీరు, మనిషి తీరులకున్న కారణాలు కూడా మనకు కనిపించే అవకాశం ఉంటుంది. చివరకు వారిమీద సానుభూతి కూడా పుట్టవచ్చు కానీ, ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. నైతికత కారణంగా చిరాకు కలిగించేవారిని తప్పించుకోవడమే, మంచిదారి. మిగతా లోపాలను భరించవచ్చు మార్చవచ్చు!
నేరుగా చెప్పడానికి ప్రయత్నించండి


మన ప్రయత్నాలేవీ ఫలించలేదు. అప్పుడిక సూటిగా ‘మీరిలా ప్రవర్తిస్తున్నారు. మీకేమయినా తోచిందా?’ అని అడగవచ్చు. చాలామందికి తమప్రవర్తన గురించి ఆలోచన ఉండదు. అంతా బాగనే ఉంది, అనుకుంటారు. చాలామంది విషయం చెపితే మారటానికి ప్రయత్నిస్తారు కూడా! ఈ ప్రపంచంలో ఫీడ్‌బ్యాక్‌ను, నిర్భయంగా, నిస్సందేహంగా ఇచ్చేవారు కరవు. మీరు ఆ పని చేయగలిగితే, దానివల్ల మంచి ప్రభావం ఉండే వీలు ఉంది.


కానీ, మనమిచ్చే ఈ ఫీడ్‌బ్యాక్ నిజంగా, నైపుణ్యంతో జరగాలి. లేకుంటే వారి హృదయానికి సూది గుచ్చుకునే ప్రమాదం కూడా ఉంది. ఎదుటివారి గురించి మన అభిప్రాయం చెప్పేముందు, మన గురించి వారి అభిప్రాయాన్ని వినే ఓపిక కూడా మనలో ఉండాలి. లేకుంటే పేచీలు తప్పవు!


వదిలేయండి

కొంతమందితో ఏ ఉపాయమూ పని చేయదు. వారిని వదిలేయడం కన్నా తోవ లేదు. చిరాకును పట్టించుకోనవసరం లేదు. మనం బాధపడడం మానేస్తే, బాధే లేదు.

గుర్తుంచుకోండి

మన ప్రవర్తన అదుపులో ఉండాలి. మన ప్రతి క్రియ, ఆలోచనలు అదుపులో ఉంటే ఇక సమస్య లేదు. చిరాకు మనుషులను అర్థం చేసుకునే ప్రయత్నం మంచిది.

తప్పంతా ఎదుటివారిదే అనుకోవడం తప్పు. చిరాకుకు మనం కూడా కారణమేమో? మనలో నెగెటివిటీ ఉన్నందుకు, అది ఎదుటివారిలో ప్రతిఫలిస్తున్నదేమో గమనించగలగాలి. పేచీ పెట్టుకోవం మంచిది కాదు. కానీ నిజం చెప్పగలిగితే లాభం ఉండవచ్చు!

Wednesday, February 22, 2012

అవసరాలు - అపాయాలు

బాగా బతకడం అన్న మాటకు అర్థాలు మారిపోయినయి. కూడు, గుడ్డ, గూడూ సరిపోవు. మామూలు వాళ్ళమని అనుకుంటున్న వారలము కూడా ఫ్యాన్ కావాలి, ఫోన్ కొనాలి అనుకుంటున్నాము. వీలయితే బైకు ఉండాలి. లేకున్నా బస్ ఎక్కి ఎక్కడికో వెళ్లాలి. ఈ మాటలను ఇలా పొడిగించుకుంటూ పోతే చివరికి ఒక సంగతి తేలుతుంది. అందరూ ఏదో ఒక రకంగా ఇంధన శక్తిని వాడుతున్నారు. కలిగినవారయితే పవర్‌ను అన్యాయంగా వాడి ఆడుకుంటున్నారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న ఇంధనం సరిపోవడం లేదు. అందరికీ అన్ని సదుపాయాలు అందాలనుకుంటే ఇంతకు పది రెట్లు వనరులు అందుబాటులోకి రావాలి.

సాంకేతిక పద్ధతులు రాను రాను పల్లెలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. అంతా యంత్రాలతోనే నడిచే రోజు ఎంతో దూరం లేదు. దీనికంతా సరిపడే పవర్, ఇంధనశక్తి ఎక్కడ నుంచి రావాలి? పెట్రోలియం లాంటి శిలాజ ఇంధనాలు తరిగిపోతున్నాయి. వాటివల్ల ప్రపంచమే వేడెక్కి, పరిస్థితి మారిపోతున్నది. అందరూ ప్రత్యామ్నాయాలంటూ సౌరశక్తి, గాలిమరల వంటి వేరే పద్ధతులను వాడే ప్రయత్నం చేస్తున్నారు. అసలు రహస్యం ఏమిటంటే... ఈ ప్రత్యామ్నాయ ఇంధనాలవల్ల కూడా ప్రకృతి మీద చెడు ప్రభావాలు ఉంటాయి.


‘పెద్ద గీత-చిన్నగీత’ పద్ధతిలో రాక్షసిలాగా పెట్రోలియం కాలుష్యం ప్రభావాలు కనబడుతున్నాయి. వాటిముందు మిగతా ఇంధనాల వల్ల కలిగే కష్టనష్టాలు చిన్నవిగా, తక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే ఈ రకం ఇంధనాల నుంచి వచ్చే శక్తిని ఇంకా ‘క్లీన్ ఎనర్జీ’ అంటున్నారు. కానీ వాటినింకా ఎక్కువగా వాడవలసిన పరిస్థితి గనుక, రాను రాను వాటి ప్రభావం గురించి కూడా తెలియవస్తుంది. నిజానికి ఈ విషయాలను గురించిన పరిశోధనలు కూడా ఇంకా తొలి దశలోనే ఉన్నాయనాలి. అందరూ అణు విద్యుత్తు గురించి మాట్లాడుతున్నారు. కొందరు మాత్రం దాన్ని భూతంతో పోల్చి భయపెడుతున్నారు. అంతకన్నా చాలా పెద్ద భూతం, మనలను సగం మింగింది. కనుక అణు విద్యుత్తు మంచి పద్ధతిగానే చాలామందికి కనబడుతున్నది. అవసరం ముందు అపాయాలు తక్కువగా కనిపిస్తాయి మరి! అణువిద్యుత్తు మన ఇంధన సమస్యకు శాశ్వత పరిష్కారం కాదని మాత్రం అందరికీ లోలోపల తెలిసి ఉంటుంది. తరగని ఇంధన వనరులను కూడా జాగ్రత్తగా వాడవలసి ఉంటుంది. వాటివల్ల కూడా ఏవో ప్రభావాలు ఉండనే ఉంటాయి. పెద్ద ఎత్తున వాడినప్పుడు మాత్రమే అవి ముందుకు వస్తాయని అంటున్నారు ఇంధన రంగంలోని అనుభవజ్ఞులు. ముందే జాగ్రత్తపడి, గాలి శక్తి లాంటి వనరులను తెలివిగా వాడుకుంటే మిగతా కారణాలవల్ల జరిగిన మార్పులను కూడా తిప్పికొట్టే వీలు ఉందని అంటున్నారు. ఇంధనాలు వాడి సౌకర్యాలు పొందడం గురించి ఈమధ్య ఆసక్తికరమయిన సంగతులు తెలుస్తున్నాయి. ఇంధన శక్తిని ఏ ఉపయోగానికి వాడినా అందులోనుంచి కొంత వేడి పుడుతుంది. అది మరో రకంగా వాడడానికి వీలుగానిది అంటే వ్యర్థమవుతుందని అర్థం. సెల్‌ఫోన్‌లు, కంప్యూటర్‌లు బాగా పెరుగుతున్నాయి. వాటిలోనుంచి వేడి పుడుతుందని తెలుసు. ముందు ఫోన్, కంప్యూటర్‌లోని లోపలి భాగాలు మాత్రమే వేడవుతాయి. ఆ వేడి మనకు అసౌకర్యంగా కనిపించదు. కానీ అది కూడా చివరకు వాతావరణంలోకి చేరుతుంది. వాటిలోనుంచి మరింత శక్తి విద్యుదయస్కాంత తరంగాలుగా మారుతుంది. ఈ తరంగాలు కూడా ఎక్కడోఒకచోట వేడిగా మారుతాయి. వెలుగు కోసం బల్బు వెలిగినా, గాలి కోసం పంఖా తిరిగినా, మరే పరికరాన్ని వాడినా కావలసినంత వేడి పుడుతుంది. చిన్నా, పెద్దా యంత్రాలు అన్నింటినూ ఊహించి, వాటివల్ల భూ వాతావరణం ఎంత వేడెక్కుతున్నదో ఊహించవచ్చు.


మనుషులంతా కలిసి ఒక క్షణంలో పదహారు టెరావాట్ల విద్యుత్తును వాడుతున్నాము. విచిత్రంగా అంతే సమయంలో సూర్యుని నుంచి 1,20,000 టెరావాట్ల సౌరశక్తి భూమి వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ లెక్క ఎంత శక్తి వచ్చింది, ఎంత తిరిగి వెళ్లిపోయింది అనే వివరాల మీద ఆధారపడి ఉంటుంది. వాతావరణంలోకి వచ్చినంత వేడి తిరిగి బయటకు కూడా పోతుంటే, లోపల స్థితి సమతూకంలో ఉంటుంది. ఒకవేళ తేడా వచ్చి వాతావరణం వేడెక్కితే సమతూకం వచ్చేదాకా, వేడిమి వెలుపలికి పంపే పద్ధతి మొదలవుతుది కానీ, సమతూకం కొంత ఎక్కువ వేడి దగ్గర కుదురుకుంటుంది. గడచిన వేల సంవత్సరాలుగా ఈ తంతు జరుగుతూనే వుంది. అయినా వాతావరణం మాత్రం చెప్పుకోదగినంత వేడెక్కలేదు. ప్రస్తుతం మాత్రం గ్రీన్ హౌస్ గ్యాస్‌ల కారణంగా వేడి పెరుగుతున్నది. కారణంగా వచ్చే వేడికన్నా 380 టెరావాట్లు తక్కువ వేడి వెలికి పోతున్నది అంటే భూవాతావరణం వేడెక్కుతున్నదని అర్థం!


ఈ లెక్కతో పోలిస్తే, మనుషులు తమ సదుపాయాల పేరున పుట్టిస్తున్న 16 టెరావాట్ల వేడిమి మరీ అంత ఎక్కువ కాదు కానీ, రాను రాను ఈ సమస్య మరింత ఎక్కువవుతుంది. మనుషులు అయిదువేల టెరావాట్లు విద్యుత్తు వాడే రోజు త్వరలోనే వస్తుంది. అప్పటికి వాతావరణం మరో మూడు డిగ్రీల వేడి ఎక్కువవుతుందని లెక్క తేల్చారు!


కార్బన్‌డై ఆక్సైడ్ కారణంగా పుట్టే వేడి తన దారిని తాను వాతావరణాన్ని వేడెక్కించి సమస్యను మరింత పెంచుతుంది. ఆ వేడి వేరుగా ఉందని మనం గుర్తుంచుకోవాలి. ఈ లెక్కలు చేసిన చైసన్ అనే పరిశోధకుడు, ‘ఇవన్నీ తప్పు అని ఎవరైనా రుజువుచేస్తే బాగుండును. నావన్నీ కాకిలెక్కలే అంటే బాగుండును’ అని చమత్కరించాడు. సైన్సులో ఇదేమంత గొప్ప జోక్ కాదు. కానీ చైసన్ లెక్కలను ఇప్పటివరకూ ఎవరు ‘తప్పు’ అనలేదు.


మరైతే మనిషి ఇంధనశక్తి వాడకం తగ్గించాలా? అన్నది ప్రశ్న. ఆ అవసరం లేదుగానీ శక్తి ఎక్కడనుంచి వస్తుందన్నది ముఖ్యమంటున్నారు పరిశోధకులు. సౌరశక్తి కాక మరే వనరులయినా అదనపు నష్టాన్ని కలిగిస్తాయి. ఎండ ఏదో ఒక రకంగా వేడిని పుట్టించక మానదు. ఎండ కారణంగా వచ్చే గాలి, జల విద్యుత్తు, అలల నుంచి శక్తి కూడా సౌరశక్తికి సంబంధించినవే. కనుక వాటివల్ల నష్టం లేదని అంటారు చైసన్. ఈయన ప్రఖ్యాత పరిశోధకుడు, రచయిత కార్ల్ సేగన్ శిష్యుడు. సేగన్ కూడా ఇదే దారిలో మాట్లాడేవారు. అంతరిక్షంలో సోలార్ ఎనర్జీ పుట్టించడం కూడా అదనపు వేడికి దారితీస్తుందని ఆయన అనేవారు. అవసరాలకు, అపాయాలకు సరైన చోటిచ్చి గుర్తించాలని వీళ్ల వాదం.

Monday, February 20, 2012

జీవం లైబ్రరీ


మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు - జీవులన్నింటికీ చరిత్ర ఉంది. భూమి మీద జీవం పుట్టి నాలుగు బిలియన్ సంవత్సరాలయిందంటారు. చరిత్ర కూడా అక్కడే మొదలయింది. ఈ వరుసలో ఎన్నో రకాలు జంతువులు, చెట్లు వచ్చాయి. పోయినయి కూడా. ఇవాళ మనమున్న ఈ ప్రపంచం తీరు.. ప్రస్తుతం ఉన్న లక్షల కోట్ల రకాల జంతువులు, జీవుల మీద ఆధారపడి ఉంటుంది. ఈ జీవమే రాళ్లను కరిగిస్తుంది. మట్టిని తిరగబెడుతుంది. వానకు కారణమవుతుంది. వరదలో కొట్టుకు పోతుంది. భూమి మీది వాతావరణం ఉన్న తీరుకు చెట్లు, జంతువులు కారణమంటే ఆశ్చర్యం లేదు. జీవుల బతుకు తీరు ఆధారంగా, వాతావరణంలో వాయువుల సమ్మేళనం మారుతూ ప్రపంచాన్ని మారుస్తుంది. మొత్తం మీద ఈ భూప్రపంచమే ఒక జీవిలాగ కనబడుతుంది!

నాలుగయిదు దశాబ్దాల కింద జీవశాస్త్రం చదువుకున్న వారికి జంతువులు, చెట్ల మధ్య తేడా గురించి చెప్పేవారు. అప్పటికి జీవం అనే చెట్టుకు ఇవి రెండే కొమ్మలు. మరేవో చిన్న రకాలు ఉన్నా లెక్కలోకి వచ్చేవికావు. ప్రస్తుతం 19 లక్షల స్పీసీలను గుర్తించి లక్షణాలను నిర్వచించారు. పరిణామక్రమంలో ఈ రకాలకుగల సంబంధాలను మరీ కొత్త పద్ధతులతో పరిశీలిస్తున్నారు. జీవం అనే చెట్టు బొమ్మగీస్తే, అది పొదమాదిరి కనిపించే పరిస్థితి వచ్చింది. జంతువులు, చెట్లతో బాటు అంతే బలంగా ఫంజి, అంటే బూజు జాతి మొక్కలు(!) వచ్చి చేరాయి. ఇవి మొక్కలేనన్న అనుమానం ఉండేది కాదని చెప్పే కాలం వచ్చింది. మిగతా ఎనె్నన్నో రకాలు, వాటిలో కొన్ని, జీవం పుట్టిన నాటి నుంచీ సంబంధాలు కొనసాగుతున్నవి! వాతావరణపరంగా చచ్చినచోట్ల కూడా జీవం కనబడిందని అంటున్నారు పరిశోధకులు. మనుషుల్లో తీవ్రవాదులు... ఈ రకం జీవుల ముందు ఎంత?
భూమి మీద కనిపించే వైవిధ్యం అంతులేనిది! ఆ లైబ్రరీలో పుస్తకాలకు లెక్కలేదు. కొన్ని ఉన్నాయని కూడా, ఇంకా గుర్తించింది లేదు. ఈ లైబ్రరీతో లాభం ఏమిటి? అవి ఎవరయినా ప్రశ్న అడిగితే, అంతకంటే పిచ్చి ప్రశ్న ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు.

పుస్తకాల లైబ్రరీలను కాపాడవలసిందే. వాటిలో తరతరాల ఆలోచనలు ఉంటాయి. ప్రకృతి అనే ఈ లైబ్రరీలో కూడా అంతే విలువయిన సమాచారం దాగి ఉంటుంది. పుస్తకాల సమాచారం లాగే, ఇక్కడ కూడా కొంత సమాచారమే కనబడుతూ ఉంటుంది. జీవులను గురించి పరిశోధనలు సాగుతుంటే, రానురాను, ఊహలకు అందని లక్షణాలు బయటపడుతున్నాయి. కొంత సమాచారం మామూలు మనిషికి అవసరమయేది కాదు అనిపిస్తుంది కూడా. కానీ, తరచి చూస్తే ఆశ్చర్యాలు ఎదురవుతాయి. పసిఫిక్ యూ అని ఒక చెట్టు ఉంది. అది ఎందుకూ పనికి రాదనుకున్నారు. ఏవగించుకున్నారు కూడా. పరిశోధకుడొకరు, ఆ చెట్టునుంచి టాక్సాల్ అనే రసాయనాన్ని వెలికి తీశారు. ఇప్పుడు ఆ మందు ‘ట్యూమర్ల’ను తగ్గించడంలో, అన్నిటికన్నా ముందుగా గుర్తుకు వస్తున్నది. సముద్రంలో ఉండే కొన్ని రకాలు సూక్ష్మజీవులకు చమురును తిని, అరిగించుకోవడం చేతనవుతుంది. సముద్రంలో ప్రయాణిస్తున్న ఓడల నుంచి చమురు ఒలికినప్పుడు ఈ సంగతిని గ్రహించారు. ఆ బ్యాక్టీరియాను తెచ్చి పరిశ్రమలలో పరిశుభ్రత కొరకు వాడితే, పర్యావరణమే శుభ్రమవుతుందని పరిశోధన మొదలయింది.

భరించరాని వేడి ఉండే వేడి నీటి బుగ్గలలో జీవం ఉందని గమనించారు. మెల్లోస్టోన్ హాట్‌స్ప్రింగ్‌లలో కనుగొన్న ఈ సూక్ష్మజీవుల నుంచి ఎంజైములను సేకరించారు. ఈ రసాయనాలను వైద్యంలో వాడుతున్న తీరు పరిశోధకులకే ఆశ్చర్యం కలిగిస్తున్నది. నేర పరిశోధనలో కూడా ఈ రసాయనాల వాడకం కొత్త దారులను చూపింది. మనుషుల జన్యువుల విశే్లషణలో కూడా వీటికి పాత్ర ఉందంటున్నారు. ఈ వేడిని తట్టుకుని వేడిలో బతికే సూక్ష్మజీవుల కారణంగా కలిగిన లాభాన్ని లెక్క వేస్తే, ట్రిలియనులలో ఉంటుంది!

మామూలుగా బతికే మనలాంటి వారికి, మనుషుల గురించే సరిగా తెలియదు. ఇక ఎన్నిరకాల పిట్టలున్నాయి, పాములున్నాయి, బూజులున్నాయి, వాటిలో ఏవయినా మనకు పనికివస్తాయాలాంటి ప్రశ్నలు మనకు తోచనే తోచవు! మన బతుకు మనం బతుకుతూ వెళతాం. కానీ, ఈ నడకలో, ఎన్ని రకాల జంతువులను, మొక్కలను తొక్కి నాశనం చేస్తున్నామన్న సంగతి మనకు పట్టదు. అడవులు అవసరం లేదు. చెరువులు అవసరం లేదు. మనిషికి కూడూ, గూడూ రెండు ఉంటే చాలుననే పరిస్థితిలో ఉన్నాము. ఫలితంగా ఎనె్నన్నో రకాల అరుదయిన జంతు, వృక్షజాతులు పూర్తిగా లేకుండా పోతున్నాయి. మామూలుగా, పరిణామంలో భాగంగా కొన్ని రకాలు పోతాయి. పోవాలి. కానీ మనిషి కారణంగా అందుకు వెయ్యిరెట్ల రకాలు సమసిపోతున్నాయని లెక్క తేల్చారు. చేపల రకాలు, అటు సముద్రంలోనూ, ఇటు మంచినీటిలోనూ తరుగుతున్న తీరు ఇందుకొక ఉదాహరణ. సముద్రమంతా ఆసిడ్‌గా మారుతున్నది. అందులో జీవం మారుతున్నది. సముద్రాల వేడిమి కూడా పెరుగుతున్నది. పగడపు కొండలన్నీ సున్నం గుట్టలుగా మిగులుతున్నాయి. కోనిఫెరస్ చెట్లుగల అడవులు బోసిపోతున్నాయి. ప్రకృతిలో మార్పులు సహజం. గత 300 ఏళ్లలో మార్పు తీరు మారింది. అందులో మనిషి ప్రభావం ఎక్కువగా కనబడుతున్నది. మనిషి మనుగడకే ముప్పు తెచ్చే తీరుకు దారితీసింది. ప్రకృతిలో సహజంగా ఉండే వైవిధ్యం నిలబడితే, అది ప్రకృతిగా మిగులుతుంది. మనిషి కారణంగా దాని తీరు మారితే అది ‘వికృతి’ అవుతుంది. పచ్చదనం ఈ భూమికి గుర్తుగా నిలిచిన లక్షణం. ఆ రంగు తరిగిపోతుంటే, భూమి తీరు మారుతుంటే, మనం మాత్రం మిగులుతామా? ఈ రకంగా జరుగుతున్నదట! అన్న భావం ఒకటి మిగిలినా చాలు! మళ్లీ పిచుకలు కనిపిస్తాయి. నత్తలు నడుస్తాయి. కప్పలు బెకబెకమంటాయి. ప్రకృతి, ప్రకృతిగా మిగులుతుంది. 

Friday, February 10, 2012

మన గురించి మనం - 6


మెదడుందా? తెలివి ఉందా?
మనసు ఉందా? భావాలు ఉన్నాయా?
గుండె ఉందా? ధైర్యం ఉందా?

మెదడు లేదు అనడం కూడా కుదరదు. లేదు అన్నమాట ఎక్కడినుంచి రావాలి ఆలోచనలో నుంచి కదా మెదడు లేకుండా ఆలోచన ఎట్లా వీలయింది మనం ఉన్నమన్న భావం ఉందంటే మెదడు ఉందని కదా అర్థం కనుక ఎవరయినా మెదడు లేదు అంటే వారు తమకు మెదడు  ఉందని చెప్పినట్టు లెక్క. తెలివి సంగతి మరోలాగ ఉంటుంది. ముందు మెదడు ఉంది అంటే ఏమని అర్థం పురంరె ఉంది. అందులో మెదడు ఉంది. అంటే ఏదో పదార్థం ఉందని అర్థం. మన బుర్రలో మెదడు ఉందని మనం చూడలేము. ఈ మధ్యన డాక్టర్లు మన మెదడును చూడగలుగుతున్నారు మనిషికి మత్తు కూడా ఇవ్వకుండానే మెదడుకు చికిత్స చేస్తున్నారు. కనుక మనకూ మెదడు ఉండే ఉంటుంది అని ఒక నమ్మకం. మరి మెదడు ఉంటే తెలివి ఉన్నట్టేనా?
మెదడు తెలివి ఒకటేనా?

ఒకటేమో కనిపించే పదార్థం. ఇంకొకటి కనపడని అలోచన.
అవి రెండూ ఒకటి కానే కావు!

పదార్థానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. అవి కొంత స్థలాన్ని ఆక్రమించుకుంటాయి. వాటికి కొలతలు ఉంటాయి. ఆకారాలూ ఉంటాయి. ఒక చోటు కూడా ఉంటుంది మెదడు తలలో ఉంటుంది కొంత బరువు ఉంటుంది. ఆకారమూ ఇంచుమించు తెలుసు. మరి తెలివికి ఇవేవీ లేవుగదా!

ఆలోచనలు ఎట్లాగున్నాయని అడగ వచ్చు కానీ ఎంత ఉన్నాయని అడిగితే అర్థం ఉండదు. ఉన్నామన్న భావనకు పొడవు వెడల్పులుండవు. ఈ ఆలోచన ఎక్కడ ఉందన్నా అర్థం ఉండదు.

నాహృదయంలో నిదురించే చెలీ అని పాట పాడితే బాగానే ఉంది కానీ, ఈ చెలి ఎక్కడ నిదురించింది. ఆలోచనల్లో కదా ఎక్కడున్నాయి ఆ ఆలోచనలు. మనసులోనా మెదడులోనా. ఇంగ్లీషులో బ్రెయిన్, మైండ్ అని రెండు మాటలున్నాయి. మనకా బాధ లేదు. రెండూ ఒకటేనన్న భావం కలిగే విధంగా మాట ఉంది. కానీ మనం దానితోనూ తికమక పడుతున్నాము.
గట్టి గుండె గల మనిషి అంటే డాక్టర్లు ఆ మనిషికి బతికే అవకాశాలు తక్కువంటారు. అంటే రక్తం పంపించే గుండె, ధైర్యం ప్రదర్శించే గుండె వేరువేరన్నమాట.

ఇవన్నీ కలిసి మెదడులోనే ఉన్నాయని చెప్పడానికి ఇంత గందరగోళం.
ఈ మనసు, మెదడు, గుండె కాంప్లెక్స్ విచిత్రమయినది. స్వంతదారునికే తప్ప మిగతా వారికి వాటి లోతులు తెలియవు. ఉనికి కూడా తెలియదనవచ్చునేమో.

ఎవరి అలోచన వారికే తెలుస్తుంది. మిగతా వారికి దాని చాయలు కూడా తెలియవు. కొండొకచో చెప్పినా అర్థం కావు. మన చేతులు, కాళ్లు, తల. నాలుక లాంటి వాటి సంగతి అట్లా కాదు. మెదడులోకి వైద్యులు కళ్లతో తొంగి చూడ గలుగుతారు. ఇతరుల మెదడును చూడ గలిగిన ఈ డాక్టర్లు మనసులోకి మాత్రం చూడలేరు. వారికి మెదడు కనిపిస్కుంది. అందులోని మనసు, గుండె కనిపించవు. అవి ఎవరివి వారికే స్వంతం.

ఇంత చెప్పినా ఈ మనసంటే ఏమిటో తెలియలేదు. తెలియదు.
అది మెదడులో ఉందంటే నమ్మకం కుదరదు.
కనుకనే దాన్ని మనం పట్టుకోవాలి. అదుపులో పెట్టుకోవాలి.
ఆలోచించండి. వీలవుతుందా?

Thursday, February 9, 2012

అవునంటారా? ఆలోచించండి!

బతుకు బంఢి దానంతటది ముందుకు సాగుతున్నదా? లేక మనం నడపదలుచుకున్న దారిలో నడుస్తున్నదా? మనమనుకున్న దారిన సాగాలంటే మనం అప్పుడప్పుడు నిర్ణయాలు చేసి బండిని పక్కకు మళ్లించవలసి ఉంటుందేమో? ఏ పక్కకు మళ్లవలసిందీ మనకు తెలుసునంటే మనం నిర్ణయాలు చేస్తున్నామని అర్థం. మంచి చెడ్డలను గమనించి నిర్ణయం చేస్తున్నామంటే, మనం ఆలోచిస్తున్నామని అర్థం! అవునా? ఆలోచిస్తున్నామా?

ఎందుకు ఆలోచన? అంతా బాగానే నడుస్తున్నప్పుడు దేని గురించి ఆలోచన? ఈ ఆలోచనలతో మనమేమైనా బాగుపడే పద్ధతి ఉందంటారా? జవాబు చెప్పడం సులభం. ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారంటే ఆలోచన చేసినందుకే కదా? అది బతుకు దారిగానీ మరో విషయంగానీ తెలిసీ, తెలియకుండా మన మెదడులో ఆలోచనలు సాగుతూనే ఉంటాయి. వాటి ప్రభావం మనకు అర్థమయి, మార్పులు చేర్పులు చేయగలగడం, అది తర్వాతి మెట్టు. కొన్ని పనులు మాత్రం అలవాటయిపోతాయి. వాటి గురించి ఆలోచన అవసరం ఉండదు. ఉదాహరణకు చేతిలోకి తీసుకున్న తిండి పదార్థాన్ని నోట్లో బదులు ఎప్పుడయినా ముక్కులో పెట్టుకున్నారా? కానీ ఏం తినాలనేది మాత్రం గొప్ప ఆలోచన, చర్చ! దానిమీద రకరకాల నిర్ణయాలుంటాయి. ఆలోచన లేనిది ఈ నిర్ణయాలన్నీ జరగవు.


మనిషి అన్న తర్వాత మెదడులో నిరంతరం ఆలోచనలు సాగుతూనే ఉంటాయి. నిజానికి మనకు ఆలోచనకన్నా సులభంగా చేతనయిన పని ఇంకొకటి లేదు. అయితే చాలావరకు ఈ ఆలోచనలను మనం వాటిదారిన వదిలేస్తుంటాము. అందుకే వీలు దొరికితే చాలు, మనకు ప్రమేయం, మన మీద ప్రభావం లేని విషయాలను గురించి ఆలోచిస్తాము. వాటి గురించి మాట్లాడతాము కూడా. (బుచ్చిబాబుగారు, నవీన్‌గారు లాంటి కథా రచయితలు అదుపు లేకుండా సాగే ఈ ఆలోచనలను కథలుగా, నవలగా రాశారు. దాన్ని స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్‌నెస్ అన్నారు). నిద్రలేచిన మరుక్షణం ఆలోచనలు మొదలవుతాయి. నిద్రలో కలలకు మన ఆలోచనలే కారణం. మెలుకువ ఉన్నంతసేపు ఏదో ఆలోచిస్తూనే ఉంటాము. మరో పనిలో ఉన్నా కూడా ఆలోచనలు సాగుతూనే ఉంటాయి. ఈ నాలుగు అక్షరాలు చదువుతూ మీరు, ‘ఏమిటీ ఈ మాటలకు అర్థం? వీటిని పట్టించుకోవాలా? పోనివ్వాలా?’ అని ఆలోచిస్తున్నారు. ఈ రకంగా, మనకు తెలియకుండానే, ఆలోచనలు సాగుతుంటాయి. కనుకనే మనకు స్వంత భావాలుంటాయి. ఇష్టాలు, అయిష్టాలు ఉంటాయి. మనకు, మన ప్రవర్తనకు ఒక తీరు ఉంటుంది. మనం చేయదలుచుకున్న పని, ఉద్యోగం, వ్యాపారం మొదలయిన వాటి గురించి ఆలోచన జరుగుతుంది. నిర్ణయాలు జరుగుతాయి. బతుకు బండి ముందుకు సాగుతుంది. సీరియస్‌గా ఆలోచించటం మాని, జరుగుతున్న పనులను జరగనిస్తే అసంతృప్తి మిగులుతుంది. ‘ప్రవాహంలో కొట్టుకుపోవడమే నరకం, ఈది మన దారిన పోవడం స్వర్గం’ అన్నారొకాయన.

ఆలోచించడం ఇంత సులభంగా జరిగేదయితే, దాని గురించి అంత ఆలోచించడం ఎందుకు, అని అనుమానం ఎవరికయినా రావచ్చు! అందరూ సరిగా ఆలోచించి తమ బతుకు బండి పగ్గాలు తమ చేతులో ఉంచుకుంటే, సమస్య ఏముంది? మనిషి మనసు తన దారిలో ఆలోచిస్తుంది. దాన్ని ఆలోచించే మెదడు, అదుపులో ఉంచుకోవాలి. సైకాలజీ, సమస్యలు మొత్తం ఈ మనసు, మెదడులో పోటీలోనుంచే పుట్టుకు వస్తాయి.


తెలిసి కూడా తప్పులు చేస్తున్నవారి గురించి మనకు తెలియదా? ‘నేను సిగరెట్లు ఎన్నిసార్లు మానివేశానో నాకే గుర్తులేదు!’ అన్న వ్యక్తి ఎంత చిత్రమయిన మనిషయి ఉండాలి? ఆలోచన అనుకున్నట్లు నడవదు. అందులోనుంచి సమస్యలు పుడతాయి. బతుకులోనూ సమస్యలు పుడతాయి. అప్పుడు కూడా చాలామందికి అర్థం కాదు. నేను ఇలాగెందుకు ఉన్నాను? అన్న ఆలోచన చాలామందికి కలగదు. ఈ ప్రపంచంలోని సమస్యలన్నింటికీ మూలం మనిషి ఆలోచన పద్ధతి! ‘అయితే ఏంటి?’ ‘నీకెందుకు?’ లాంటి ప్రశ్నలు తెలిసినవే! ‘నేను బాగానే ఉన్నాను. నా ఆలోచనలు అందరికంటే గొప్పవి’ అనుకుంటారు చాలామంది. మనుషులకు మొదటినుంచీ, ఆలోచనతో పనిలేకుండా బతకడం అలవాటయింది. నాకు సమస్య ఉంది అనుకోగలగడం ఒక మెట్టు. నా పరిస్థితికి, నా ఆలోచనలే కారణం అనుకోగలగడం ఆ తరువాతి మెట్టు! అందుకే మనం సీరియస్‌గా, ఆలోచించడం అలవాటు చేసుకోవాలి!


మంచివిగా గుర్తింపు పొందిన ఆలోచనలతో మన ఆలోచనలను సరిపోల్చుకోవాలి! అక్కడ అసలు కథ మొదలవుతుంది!

Tuesday, February 7, 2012

ప్రొఫెసర్ నాయుడమ్మ - పుస్తకం


విశిష్టం.. శాస్తజ్ఞ్రుడి జీవన చిత్రం

డా.వై.నాయుడమ్మ
రచన: డా. సోమరాజు సుశీల
సి.పి.బ్రౌన్ అకాడమి 53,
నాగార్జునహిల్స్,
పంజగుట్ట, హైదరాబాద్-82
పేజీలు: 134;

వెల: రూ.95/-


సి.పి.బ్రౌన్ అకాడమీవారు విరివిగా చేస్తున్న పుస్తక ప్రచురణలో 25కు పైగా పుస్తకాలు వివిధ రంగాలకు చెందిన మహనీయుల జీవిత చిత్రాలు. వాటిలో ఒక సైంటిస్టు గురించి వచ్చిన పుస్తకం ఇదేననవచ్చు. నాయుడమ్మగారు కేవలం ఒక సైంటిస్టు కాదు. గొప్ప మానవతావాది. అట్టడుగు వర్గాల మేలుకొరకు పాటుపడిన ఆదర్శమూర్తి. ఈ ప్రపంచంలో చాలా కొద్దిమంది జీవితాలు మాత్రమే అందరూ అనుసరించవలసిన బాటలుగా సాగుతాయి. అటువంటి అరుదయిన వ్యక్తులలో నాయుడమ్మగారి పేరు ముందు వస్తుంది.


‘నేను పుట్టుకతో రైతును! వృత్తిద్వారా అంటరాని వాడిని, రెండింటి గురించి నేను చాలా గర్వపడతాను!’ అన్నారు డాక్టర్ యెలవర్తి నాయుడమ్మ. ఆయన తమ పరిశోధనకొరకు ఎంచుకున్న రంగం తోలు పరిశ్రమ. ఎన్ని రకాల పదవులు, అవకాశాలు వచ్చినా ఆయన ఈ రంగాన్ని మాత్రం వదలలేదు. భారతదేశంలో శాస్త్ర పరిశోధనలు, మామూలు ప్రజలకు పనికివచ్చేలా సాగవు. నిజానికి అవి ఎవరికీ పనికిరావు అన్న విమర్శ ఉంది. వౌలిక పరిశోధనలు కొంతవరకు ఆ రకంగా ఉంటే ఉండవచ్చు. వ్యవసాయం, ఆరోగ్యం, పరిశ్రమల విషయంలో మన దేశంలో జరిగిన పరిశ్రమ మామూలువారికి కూడా అందుబాటులోకి వచ్చే విప్లవాలకు కారణమని చాలామంది గమనించరు. నాయుడమ్మగారి నేతృత్వంలో దేశంలో జరిగిన ‘తోలు’ గురించిన పరిశోధనకు ప్రపంచస్థాయిలో ఎంతో గుర్తింపు ఉంది. అంతేగాదు బడుగు చర్మకారులకు సాయపడింది!


నాయుడమ్మగారి జీవిత చిత్రాన్ని డా.సోమరాజు సుశీలగారు రాయడం ఎంతో ఉచితంగా ఉంది. ఆమె నాయుడమ్మగారిని స్వయంగా ఎరిగినవారు. నాయుడమ్మగారి పరిశోధనలు, నిర్వహణ విధానాలవల్ల లాభపడినవారు కూడా. అందుకే, స్వయంగా కెమిస్ట్రీ పరిశోధకులయిన సుశీలగారు నాయుడమ్మగారి పరిశోధనల గురించి, దేశంలో సైన్సు, పరిశోధన, సంస్థలు, పరిశ్రమల గురించి బాగా రాయగలిగారు.


నాయుడమ్మగారు మద్రాసులోని చర్మ పరిశోధన సంస్థలో తమ కృషిని ప్రారంభించి, ఆ సంస్థకు నిర్దేశకులయ్యారు. భారతదేశంలో చర్మ పరిశ్రమకు కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. శాస్త్ర, సాంకేతిక పరిశోధనలను నడిపించే సి.ఎస్.ఐ.ఆర్‌కు ఆయన డైరెక్టర్ జనరల్ అయ్యారు. ‘నేను రిటైర్‌మెంట్‌దాకా ఆ పదవిలో ఉండను. అయిదు సంవత్సరాల తర్వాత వచ్చి, నా పరిశోధన చేసుకుంటాను, మీకు అంగీకారమయితేనే వస్తాను!’ అని దేశ ప్రధానమంత్రికే సూటిగా చెప్పగలిగారు నాయుడమ్మ. ఆయనకు తమ పరిశోధన మీద గల అంకితభావం, అక్కడ ప్రపంచానికి కనబడుతుంది. నిర్వహణదక్షుడయిన నాయుడమ్మగారు, చర్మ పరిశోధన సంస్థలో ఒక ఎకనామిక్స్ శాఖను కూడా ఏర్పాటుచేసి, పరిశోధనలను వాడడం వేపు చూసిన దృష్టి ఆశ్చర్యం కలిగిస్తుంది.
‘కాయబోయే కాయలకన్నా, పండిన ఫలాలను పంపిణీ చేయడంపై ఆయన దృష్టి ఉండేదని’ సుశీలగారు రాశారు. అన్ని రంగాలలోనూ ఈ రకం ఆలోచన ధోరణి కొంత ఉన్నా, దేశం ప్రపంచం ఎంతో బాగుపడతాయి.


నాయుడమ్మగారిని ప్రఖ్యాత జెఎన్‌టియుకు వైస్ ఛాన్సలర్‌గా ఏరికోరి నియమించారు. అక్కడ తనకు కుదరదని, ఆయన తిరిగి పరిశోధనలోకి వచ్చేశారు. ప్రతి అనామకుడూ అధికారంకొరకు పాకులాడుతుండడం అందరికీ తెలిసిందే.
ఈ పుస్తకంలో నాయుడమ్మగారు తమ కార్యదర్శులకు రాసి ఇచ్చిన పనె్నండు సూత్రాలు, అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్‌కు రాసిన లేఖ లాంటి కొన్నింటిని అనువదించి పొందుపరిచారు. నాయుడమ్మగారు అమలుచేసిన కరీంనగర్ ప్రాజెక్టు వివరాలు కూడా ఇందులో ఉన్నాయి. వీటిని, మొత్తంమీద ఈ పుస్తకాన్ని అందరూ చదవాలి. చేతనయితే దీన్ని ఇంగ్లీషులోకి అనువాదం చేయించి దేశంలోని శాస్త్ర పరిశోధకులందరికీ అందజేయాలి!


కేవలం రెండుమూడు గంటలు మాట్లాడినంత మాత్రాన, ఒక వ్యక్తి జీవితమంతా గుర్తున్నారంటే, ఆ వ్యక్తి నిజంగా ఆదర్శమూర్తి. అటువంటి అనుభవం ఈ సమీక్షకునికి మిగిలించారు నాయుడమ్మగారు. ఆంగ్ల చిత్రాల నటుడు గ్రెగరీపెక్ లాగ కనిపించే నాయుడమ్మగారు, ‘ఫీడ్, ఫాడర్, ఫెర్టిలైజర్’ అనేవి మూడు కుదిరితే ఆంధ్ర దేశం మరింత ముందుకు సాగుతుందని రేడియో పరిచయంలో చెప్పిన మాటలు యింకా చెవుల్లో గింగురుమంటున్నాయి
.
హాస్యప్రియులు, జీవితాన్ని ప్రేమించిన వ్యక్తిఅయిన నాయుడమ్మగారి ఆసక్తికరమయిన జీవితానికి ఈ పుస్తకం ‘కొండను అద్దంలో చూపించే’ ప్రయత్నం. అయినా జీవన చిత్రంలో ఉండవలసినవన్నీ ఇందులో ఉన్నాయి. కనుక, ఈ పుస్తకాన్ని అందరూ చదవాలి. అందరిచేత చదివింపజేయాలి.

Monday, February 6, 2012

అంతరిక్షంలో కొవ్వొత్తి వెలిగిస్తే మండుతుందా?


అంతరిక్షంలో కొవ్వొత్తి వెలిగిస్తే మండుతుందా?


ఒక అబ్బాయి మందుల కంపెనీ రిప్రెజెంటేటివ్ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్ళాడు. అక్కడ అతడిని భూమి నుంచి చంద్రుడు ఎంత దూరం? అని అడిగారు. ‘ఏమండీ మన మందులు చంద్రునిమీద కూడా అమ్ముతారా?’ అని గడుసుగా ఎదురుప్రశ్న వేశాడు అబ్బాయి. అంతరిక్షంలో చీకటి ఉంటుందా? అక్కడ కొవ్వొత్తి ఉంటుందా? వెలిగిస్తే మండుతుందా? ఇలాంటి ప్రశ్నలు పుట్టిన బుర్ర గొప్పది! ప్రశ్నలకు జవాబులు ఆలోచించిన బుర్రలు అంతకన్నా గొప్పవి. ఈ రకం సంగతులను కూడా చదవాలనుకునే బుర్రలు మరింత గొప్పవి!


ముందుగా అంతరిక్షంలోకి మనుషులు లేకుండానే నౌకలను పంపారు. అందులో మన వాతావరణంలోలాగా అన్ని వాయువులు కలిపిన గాలికి బదులు, అంతా ప్రాణవాయువే ఉంటే ఎలాగుంటుందని చూడదలుచుకున్నారు. ఆక్సిజన్‌తో అగ్ని ప్రమాదాలు జరుగుతాయని అనుమానం వచ్చింది. అందుకే అక్కడ కొవ్వొత్తి వెలిగించి చూశారు. నిజంగా కొవ్వొత్తి మంటా? లేక మరో మంటనా? అన్న ప్రశ్నను పక్కన ఉంచితే, అంతరిక్షంలో మంట తన కారణంగా తాను ఆరిపోతుందని అర్థం చేసుకున్నారు!

కొవ్వొత్తి వెలిగిస్తే, వెలుగు, వేడి, కార్బన్ డై ఆక్సైడ్, నీటి ఆవిరి పుడతాయి. వేడివల్ల అవి వ్యాకోచం చెందుతాయి. అంటే వాటి సాంద్రత (చిక్కదనం) తగ్గుతుంది. కనుక అవి తేలికయి పైవేపు బయలుదేరతాయి. కనుక మంట పైకి సాగుతుంది. ఎక్కువ సాంద్రతగల గాలిలోనుంచి ఆక్సిజన్ తక్కువ సాంద్రతలోకి ప్రవహిస్తుంది. మంట కొనసాగుతుంది. సాంద్రతలో తేడావచ్చి మంట పైకి సాగడానికి ముఖ్యకారణం భూమిక గల గురుత్వాకర్షణ శక్తి, అంతరిక్షంలో ఈ లక్షణం ఉండదు. అందుకే అక్కడ బరువు తెలియదు. కనుక సీఓటూ, నీటి ఆవిరులు పైకి పోకుండా మంట చుట్టూ జమగూడుకుంటాయి. ఆక్సిజన్‌ను అడ్డుకుంటాయి. మంట ఆరిపోతుంది.
గురుత్వాకర్షణలేని వాతావరణం లో మంట కొనసాగాలంటే, అందులోకి ఆగకుండా ఆక్సిజన్ పంపుతూ ఉండాలి. లేదా వత్తిలో నూనెలాగా డిఫ్యూజన్ అనే పద్ధతిలో వాయువు అందాలి. గాలి కదలకుండా ఉండి కూడా గదిలో సువాసనలు వ్యాపించే పద్ధతి ఇది. వాసన గాలిలో కలిసి అంతటా సమంగా వ్యాపించే ప్రయ త్నం చేస్తుంది. కానీ ఈ పని చాలా నెమ్మదిగా సాగుతుంది గనుక మంట ను నిలబెట్టజాలదు.

అంతరిక్ష నౌకలో మంటలు రేగుతాయన్న అనుమానంతో ఈ ప్రయో గం జరిగింది. కానీ 1967లో అపోలో-1లో మంటలు రేగాయి. ముగ్గురు వ్యోమగాములు మరణించారు. అదెట్లా? అని అనుమానం కలిగింది కదూ! ప్రమాదం జరిగినపుడు నౌక ఇంకా భూమిమీదనే ఉంది మరి! ఆ ప్రమాదం అంతరిక్షంలో జరిగే అవకాశం లేదు

.

మందులకు లొంగని క్షయ

ఇది ఆంద్రభూమిలో వచ్చిన నావ్యాసం


పెద్దిగా చూడడానికి చిత్రం మీద క్లిక్ చేయండి

Saturday, February 4, 2012

నీరు - విశేషాలు


* భూమి మీద నీరున్నందుకే జీవం ఉంది. మనం ఉన్నాము. నీటి లక్షణాలు చిత్రమయినవి.

*మానవ శరీరంలో ఎక్కువ శాతం నీరే ఉంటుంది. యుక్తవయసుగల స్ర్తి, పురుషుల శరీరంలో శరీరం బరువులో 55 శాతం, 60 శాతం నీరు ఉంటుంది. అమ్మాయిల శరీరంలో కొవ్వు పదార్థం ఎక్కువ గనుక కొంత నీరు తక్కువగా ఉంటుంది.

* నీటి శాతం: స్ర్తిలు 55 శాతం పురుషులు 60 శాతం, శిశువులు 78 శాతం, క్రీడాకారులు 60-65 శాతం.

* ఒక్క టెన్నిస్ క్రీడాకారుని శరీరం నుంచి గంటకు 10 నుంచి 11 కప్పులు చెమట రావడంలో వింత లేదు!

* నీరు తాగకుండా ఒక మనిషి 7రోజులవరకు బతకవచ్చునంటున్నారు.

* తిండి లేకుండా నెల రోజులు కూడా మనం ఉండగలుగుతాము.

* మనిషి మెదడు 70 శాతం నీటితోనే నిండి ఉంటుంది. అంటే నీరు వేరుగా మాత్రం ఉండదు మరి!

*ఎండ బాగా ఉండే రోజున ఒంటె 53 గాలన్ల నీరు తాగగలుగుతుంది.

* ఒంటె తాగిన నీరు దాని రక్తంలో ఉంటుంది. మూపురంలో మాత్రం కాదు.

*వాన నీటి చుక్కలు 2-3 మి.మీ దాకా ఉంటాయి. గాలి తాకిడి ఎక్కువయితే అవి చిన్న చుక్కలుగా విడిపోతాయి.

*ఈ ప్రపంచంలో 88.4 కోట్లమందికి తాగడానికి మంచినీరు అందడంలేదు!

*వ్యర్థం: మీ ఇంట్లోగానీ, మరోచోటగానీ కుళాయి నుంచి సెకండుకు ఒక చుక్క ప్రకారం నీరు లీక్ అవుతున్నదనుకోండి. ఒక సంవత్సరంలో 2,642 గాలన్ల నీరు వ్యర్థంగా పోతుంది!

Friday, February 3, 2012

తర్కమంటే అంతే


అవును మరి,
తర్కమంటే అంతే.


కానీ ఇందులో మరో విషయం కూడా ఉంది.
చెప్పిన మాట నచ్చకుంటే
"శేషం కోపేన పూరయేత్"
అని సిద్ధాంతమట.


వినే మనసుంటే అందరి మాటా నిజమనిపిస్తుంది
జాగ్రత్త!