Thursday, August 30, 2012

ఇంకా కొంచెం

‘చదువు బాగానే సాగింది. ఉద్యోగం కూడా దొరికింది. లేదంటే త్వరలోనే దొరికేట్లు ఉంది. కానీ, ఏవో కొన్ని పనులు మాత్రం అనుకున్నట్లు జరగడంలేదు’. ఎక్కడుంది చిక్కు? మీరుకూడా ఈ ప్రశ్న మిమ్మల్ని మీరు అడుగుతున్నారా? ఈ ప్రశ్న అడగనివారు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరంటే ఆశ్చర్యం లేదు. చాలా విజయవంతంగా బతుకుతున్నారన్న వారిని కూడా అడిగితే, చాలాసార్లు, ఆ విజయం ఎట్లా వీలయిందీ చెప్పలేకపోతారు. వారికి కూడా, అందని సంగతులు కొన్ని ఉండనే ఉంటాయి. ఈ ప్రపంచంలో ఎవరికైనా సరే, కొన్ని పనులు చేతవుతాయి. కొన్ని కావు! తెలివిగల వారందరికీ చదువు అంటదు. బాగా చదువుకున్నవారందరూ గొప్పవారు కాలేరు.


మనకు ఏం కావాలి?

సంతోషంగా ఉన్నాను, అంటే, ఎంత సంతోషంగా ఉన్నారో చెప్పగలరా? అని అడిగిన పెద్దమనిషి, నిజంగా గొప్పవాడనిపించేది. కానీ, తరువాత ఆయనకు పట్టిన గతి మాత్రం మరెవరికీ రాకూడదు. అందరూ విజయాన్ని కోరేవారే. మీ దృష్టిలో విజయమంటే ఏమిటి? అన్న ప్రశ్నకు జవాబు కష్టం. డబ్బు సంపాదించడం చాలా సులభమూ, ఫాషనబుల్ అయిపోయింది. అదే విజయానికి గుర్తింపుగా మారింది. అందులో కూడా ఒక నిర్దుష్టత లేదు. డబ్బు కావాలి, నిజమే, కానీ, ఎప్పటిలోగా ఎంత డబ్బు సంపాదించదలుచుకున్నదీ తెలిస్తే, పథకం సులభమవుతుంది. ఎక్కడికి చేరాలో తెలిస్తే, నడక బాగా సాగుతుంది. చేరిన తరువాత గమ్యాన్ని మరింత ముందుకు నెట్టవచ్చు. నిద్ర సరిపోవడం లేదు. మరింతసేపు నిద్రపోతే బాగుండును, అనుకుంటాము. అది కుదరదేమో? ఇవాళ పది గంటలకు, పడకమీద ఉండాలి, అనుకుంటే, అనుకున్నది సాధించామా? లేదా తెలుస్తుంది.

ఒకే గమ్యం కాదు!

ఒకాయన కోసం యమదూతలు వచ్చారట. ‘పోండి అవతలకి! నేనొక వేపు పని తెమలక ఛస్తుంటే, మీ గోల ఏమిటి?’ అన్నాడట ఆయన. నిజమేనేమో అనుకుని, వచ్చినవారు వెళ్లిపోయారట! ఈ మధ్యన ఎవరికీ, ఏ పనికీ తీరిక ఉండడంలేదు. వంద పనులు తలకెత్తుకుని బతుకుతుంటాము. ఒక పనిలో మునిగి ఉంటాము. మరేదో పనిలో విజయం అందే అవకాశం వస్తుంది. పనిలో ఉండి, దాన్ని గుర్తించలేకపోతాము. నిద్రపోవాలని గుర్తురాక, నవల చదువుతూ కూచుంటాము అని చెపితే, పరిస్థితి మరింత బాగా అర్థమవుతుందేమో? వికాసం అంటే, బాగా సంపాదించడం, బాగా బతకడం అని భావం. ఈ బాగా అన్నమాటలో ఎన్ని అంశాలున్నాయి. ఒక కాగితం మీద రాసుకుంటే బాగుంటుంది. వాటన్నిటినీ, ఒక పద్ధతిలో చేస్తూ, ముందుకు సాగే రకంగా బతుకును తీర్చుకోవచ్చు. అనుకున్న పనులను, ఎక్కడ, ఎప్పుడు చేస్తాము అన్న పథకం, కళ్లముందుండాలి. అందులోనూ మళ్లీ లెక్కలుండాలి. బుధవారం యువ చదవాలని నిర్ణయించుకుంటే, అందుకు సమయాన్ని మెదడే కనుక్కుని ఏర్పాటు చేసే వీలు ఉంటుందని పరిశోధకులు చెపుతున్నారు.


అన్నీ అనుకున్నట్లు జరగవు!


కనుకనే నిర్ణయాలు, పథకాలు, ప్రణాళికలు కావాలంటున్నాము. ఏ పని, జరగవలసిన సమయానికి జరగలేదు? బుద్ధిగా లెక్క చూస్తే, విషయం తెలిసిపోతుంది. మరెవరో వచ్చి, ‘నీవు ఈ పూట అన్నం తినలేదని చెప్పే వీలు లేకపోవచ్చు. మనమే, ఆ సంగతిని (కూడా) పట్టించుకోవాలి. ఎందుకు తినలేకపోయిందీ తెలిస్తే, కార్యక్రమాలను, పద్ధతులను ఇంకా కొంచెం జాగ్రత్తగా ఏర్పాటు చేయవచ్చు. చదువు, పని, వ్యాయామం మిత్రులు, మనవారు, ముందు జరగవలసిన పనులు అన్నింటిలోనూ, ఏం జరిగిందీ లెక్క తెలిస్తే ఇక ముందు జరగవలసిన కార్యక్రమాలు, మారవలసిన అవసరం, అనవసరం అర్థమవుతాయి. కొన్ని సంగతులను నిత్యం లెక్క చూడాలి. కొన్నింటిని వారానికి ఒకసారి చూడాలి. ఈ తేడా కూడా తెలిసి ఉండాలి. పథకం వేయాలంటే, ముందు, గతం గురించి తెలిసి ఉండాలి గదా!


ఇంతకంటే ఏం చేయగలము?

అంతా సంతోషంగా సాగుతున్న వారి ముందు కూడా ఈ ప్రశ్న ఉండి తీరాలి. ఇంత చాలు అనుకుంటే, అది సులభంగానే దొరుకుతుంది. కానీ, అంతటితో బతుకు తెల్లవారిందన్న భావం మాత్రం కలగకూడదు. గమ్యాన్ని మరింత ముందుకు కదిలించడమని ఒక పద్ధతి ఉంది. ఆకాశాన్ని అందుకుందామని ఎగిరితే, అందకపోవచ్చు. చెట్టుమీది పండు మాత్రం సులభంగానే అందవచ్చు. పండు అందుకున్నందుకు సంతోషం సరయినదే, కానీ ఆ తరువాత మరో గమ్యం ఉండాలి. ఆ తరువాతి గమ్యాన్ని కూడా అందుకుంటామన్న నమ్మకం సులభంగా వీలవుతుంది. అందుకు కావలసినదేదో మనలో ఉందన్న నమ్మకం ఎంతో ముఖ్యం. ఆ ‘ఏదో’ నిలిచి ఉండి, పని ముగిసేదాకా సాయంగా రావడం, వచ్చేలా పని చేయడం, అంతకన్నా ముఖ్యం.


నాకు ఇంతే వచ్చు!

అనుకుంటే, ఆ తరువాతి సంగతి గురించి ఆలోచనే రాదు. వంద మీటర్ల పరుగును పది సెకండ్లకన్నా తక్కువలో ఎవరూ పూర్తి చేయలేరు అనుకున్నారు. అందరూ ఆ గమ్యంతోనే పరుగెత్తారు. ఎవరో ఒకతను, తక్కువ సమయంలో పరుగెత్తి చూపించాడు. మిగతా వారికి కూడా నమ్మకం కలిగి, అందరూ ‘అసాధ్యాన్ని సాధించారు’. ఉసేన్ బోల్ట్, తన రికార్డును తానే పడగొట్టగలిగాడు. నేను మారగలను, అనుకున్న తరువాత, మారవలసిన సంగతులు కళ్లముందు నాట్యమాడతాయి. ఆ ఆలోచన రానంతవరకు అంతా శూన్యంగానే కనబడుతుంది. బెస్ట్ తర్వాత కూడా ఏదో ఒకటి ఉండి తీరుతుంది!
అటునుంచి నరకడం అని ఒక పద్ధతి ఉంది. వంద, అనుకున్నాము. ఒకటి నుంచి మొదలుపెట్టాము. 90 తర్వాత, మనసు ‘చాల్లే!’ అంటుంది. కనుక, వందతో మొదలుపెట్టి, తగ్గింపు పద్ధతిలో లెక్కపెడుతుంటే, సున్నా వచ్చిన దాకా, ఆగకూడదని, ఆ మనసే చెపుతుంది. మరుసటి నాడు నూట ఇరవై నుంచి తగ్గిస్తూ వచ్చే వీలు కూడా ఉంటుంది.


మాటలతో కుదరదు!

కొన్ని మాటలు వినడానికి, చదవడానికి బాగుంటాయి. ‘నిజం!’ అనిపిస్తాయి. పక్కకు కదిలిన తరువాత, ఆ మాటలు కూడా, మనసు తెరమీద నుంచి మరలిపోతాయి. కనుకనే మననం అనే పద్ధతిని అలవాటు చేసుకోవాలి. నచ్చిన పద్ధతులను, అమలు చేసుకోవాలి. ఒక్క అంశంలో మంచి ఫలితాలు కనిపిస్తే, దాన్ని బట్టి ఆ పద్ధతిని మన స్వభావంగా మార్చుకోవాలి.


తెలిస్తే బాగుండేది, అనుకుంటే ఏదీ తెలియదు. తెలిసింది కొంతయితే, ఇంకా కొంచెం తెలుసుకునే ప్రయత్నంలో ఉందాము! కొంతయినా తెలుస్తుంది!

Wednesday, August 29, 2012

మనుషులంతా ఒక్కటే(నా?)


చుట్టూ చూడండి. మీవంటి స్వభావం గలవారు ఎక్కడోగాని ఉండరు. మీవంటి రూపం గలవారు అసలే కనపడరు. ఇక నూటికి నూరుశాతం మీ వంటివారు ఉండరుగాక ఉండరు. ఇంతమంది మనుషులు కనబడుతుంటారు. అయినా అందరూ అన్నిరకాలుగానూ ఉంటారు. ముఖాలు, శరీరాలు, నడవడి, తీరు అన్నీ ఎవరి తీరు వారిదిగానే ఉంటాయి. ప్రపంచంలోని మనుషులందరినీ ఒకచోట చేర్చినా లెక్క అంతే! ఈ భూ ప్రపంచంలో ఈ క్షణాన మనుషుల సంఖ్య 705 కోట్లపైన ఎక్కడో ఉందని అంచనా. గడిచిన 50 వేల సంవత్సరాలలో పదివేల కోట్లమంది పుట్టి గతించారని లెక్క చెపుతున్నారు. మరి అంతమందికీ ఎవరి ప్రత్యేకత వారికి ఉండేది. ఇకమీద పుట్టే వారందరూ కూడా అదే రకంగా ఉంటారు. ప్రతి తల్లీ- పుట్టిన ప్రతి సంతునూ ‘చుక్కల్లో చంద్రుడ’నే అంటుంది మరి!

ఆశ్చర్యంగా అందరూ మనుషులే. కానీ అందరూ ప్రత్యేకత గలవారే. జీవ వైవిధ్యం చాలా గొప్పది అనుకుంటే, శతకోటి జీవాలలో ఒకటయిన మానవజాతిలోని వైవిధ్యం అంతకన్నా ఎంతో గొప్పదని అర్థం. ఇందరిలోనూ ఎవరి గుర్తింపు వారిదిగా ఉండడానికి, ఆధారాలను వెదుకుతూ లోతులకు పోవచ్చు. అక్కడ మనకు డిఎన్‌ఏ, వేలి ముద్రలు, కంట్లో గీతలు మొదలయినవి ముందు కనబడతాయి. ఇంకొంచెం లోతుకు పోతే మరెన్నో సంగతులు ఆశ్చర్యం కలిగిస్తాయి.


జన్యు పదార్థం- డిఎన్‌ఏ
వైవిధ్యం మొత్తానికి మూలకారణమంతా ఇందులోనే ఇమిడి ఉంది. ఇదొక గట్టి నిజం. మనం మనంగా, మీరు మీరుగా ఉండడానికి ఆధారం ఈ జన్యు పదార్థమే. ఇక్కడ కూడా కొన్ని లెక్కలున్నాయి. 2001లో మానవుల డిఎన్‌ఏ మొత్తాన్ని మ్యాపింగ్ చేశారు. మనుషులందరిలోనూ 99.9 శాతం డిఎన్‌ఏ ఒకేరకంగా ఉంటుంది, అన్నారు. అంటే, ఇప్పటివరకూ మనం లెక్కించిన వైవిధ్యానికి కారణం 0.1 శాతం మాత్రమేనని అర్థం. గడిచిన పదేళ్ళలో లెక్కలు వేసి తేడాను 0.5 శాతంగా పెంచారు. వైవిధ్యం దృష్టితో చూస్తే అది కూడా తక్కువే మరి! లెక్కను మరింత ముందుకు నడిపితేగాని సంగతి అర్థం కాదు. మనిషి డిఎన్‌ఏ- అనే పుస్తకంలో 320 కోట్ల అక్షరాలుంటాయి. అందులో 0.5 శాతం అంటే సుమారు కోటి అరవయి లక్షలు. వాటిలో మళ్లీ రకరకాల కలయికలు. ఒకటి, రెండు అన్న రెండు అంకెలుంటేనే, 1, 2, 12, 21, 122, 111, 121.. ఇలా కొన్ని అంకెలు వీలవుతాయి. ఇక కోటి అరవయి లక్షల అక్షరాలుంటే ఎన్నో రకాల కలయికలు వీలవుతాయని ఊహించడం కూడా కష్టం. ఇప్పటివరకు పుట్టి, చనిపోయిన వారి సంఖ్య ఆ వీలయ్యే రకాలలో ఎంతమాత్రమూ కాదని తేలిపోతుంది. అంతమందిలో కూడా ఒకే రకం జన్యు అక్షర క్రమం ఉండే వీలు ఇంచుమించు సున్నా మాత్రమే. కవలలో కూడా ఆ వీలు లేదు. అందుకే కవలలను గుర్తించడం వీలవుతుంది. మొదట్లోవారు ఒకే రకం జన్యు పదార్థంతో మొదలవుతారు. పెరిగిన కొద్దీ తేడా పెరుగుతుంది. జన్యు పదార్థం కాపీ జరిగితేనే కణాలు పెరుగుతాయి. శరీరం పెరుగుతుంది. ఈ కాపీ జరిగే సమయంలో మ్యుటేషన్స్ అనే చిన్న మార్పులు జరుగుతాయి. కవలల మధ్య తేడా రావడానికి ఈ మార్పులు చాలు. ఇక జన్యువులు పనిచేసే తీరును అదుపు చేసే మార్కర్ జన్యువులలో మార్పు వస్తుంది. కవలలుగానీ మిగతావారు గానీ, ఎవరిదారిన వారు పెరగడానికి ఈ మార్పులు కారణాలవుతాయి. జరిగే మార్పులన్నింటికీ ప్రభావం బయటకు కనిపించదు. కానీ, చిన్న మార్పుల ప్రభావం పెద్ద ఎత్తున కనబడుతుంది. మీరు మీలాగే ఉన్నారంటే, అందుకు మీ జన్యువులే ఆధారం. జన్యువులు మాత్రమే ఆధారం కావు. వాతావరణం, అమ్మ కడుపులో వాతావరణం లాంటివి కూడా ఈ ఆధారాలలో కొన్ని.

అసలయిన గుర్తింపు- వేలి ముద్రలు
వేలిముద్రలు ఎవరివి వారివేనని అందరికీ తెలుసు. వీటి వెనక జన్యువులు కారణంగా ఉంటాయని తెలియకపోవచ్చు. కనీసం వాటి సైజు, ఆకారాలు జన్యువుల మీద ఆధారపడతాయి. కానీ, అమ్మ కడుపులో ఉండగా- శిశువు మీద ఉమ్మ సంచి ఒత్తిడి పెడుతుంది. అందులోని నీరు కదులుతూ కుదుపుతుంది. వీటి ప్రభావంతో వేలి ముద్రలు మారతాయంటే నమ్మగలరా? నమ్మక తప్పదు. ఒకే రకంగా ఉండే కవలల్లో కూడా వేలిముద్రలలో కొంతవరకు తేడాలుంటాయి. లోపలి వాతావణం వారిమీద, అంత సమానంగా ఉండకపోవడం అందుకు కారణం. ఒక గీత రెండుగా విచ్చుకునే చోటులో తేడా, శంఖం, చక్రాలలో గీతల మధ్య బాగా వేరుగా ఉంటాయి. కాలి గీతల్లో కూడా ఈ తేడాలు కనబడతాయి.
నేర పరిశోధనలో వాడుకుంటారుగానీ, నిజానికి మనకు వేలిముద్రలవల్ల ప్రయోజనం ఉందా? ఉంటే ఏమిటి? అన్నసంగతి ఇప్పటికీ అర్థం కాలేదు. అందరూ సులభంగా ‘ఆ గీతల వల్ల పట్టు దొరుకుతుంది!’ అంటారు. కానీ వాటివల్ల పట్టు సడలుతుందని పరిశోధకులు గుర్తించారు. చర్మం విస్తారం పెరుగుతుందనీ, చర్మానికి సాగే శక్తి వస్తుందని, స్పర్శ బాగా తెలుస్తుందనీ ఎన్నో చెప్పుకున్నారు. వీటిలో ఏది ఎంత నిజమని తేలలేదు. మొత్తానికి వేలిముద్రలు లేకుండా కూడా మనం బతకగలుగుతామని తెలిసిపోయింది. జన్యువులలో అనుకోని మార్పుల కారణంగా అయిదు కుటుంబాలలో కొందరు వేలిముద్రలు లేకుండా పుట్టారు. వాళ్లందరూ బాగానే బతుకుతున్నారట.

ముఖం చూడు..
ఎవరి ముఖం వారికి గుర్తింపు. శరీరంలోని భాగాలన్నింటినీ చూడడం ఒక ఎత్తు. మనిషిని గుర్తించడానికి ముఖం చూడడం మరో ఎత్తు. అయినా ముఖాలలో నిజానికి అంతగా తేడా ఉండదట. మీ లాంటి ముఖం పోకడలు, పోలికలు గలవారు అక్కడో ఇక్కడో ఉండనే ఉంటారు. మనమనుకుని మరెవరినో పలకరించిన వారు, కనీసం అనుకున్నవారు మనకు ఆ సంగతి చెప్పి ఉంటారు కూడా. కంప్యూటర్‌లో ముఖాన్ని గుర్తించే సాఫ్ట్‌వేర్ వచ్చింది. ప్రపంచంలోని మనుషులలో 92శాతం మందికి ఒకరయినా ఈ సాఫ్ట్‌వేర్‌ను కూడా తికమక పెట్టేంత పోలికలున్నవారు ఉంటారని పరిశోధనలో తెలిసింది.
ఒకేవ్యక్తి రెండు ఫొటోలను చూపిస్తే, ఈ సాఫ్ట్‌వేర్, మనుషులు తికమకపడిన సందర్భాలను పరిశోధకులు గమనించారు. ఆ ఫొటో తెలిసిన వారిదయితే గుర్తించడం కొంచెం సులభమవుతుంది. తెలియని వారిలో వయసుతో, కోణంతో వచ్చే తేడాలు తికమకపెడతాయి. అంటే, మనం ముఖం మనకు గుర్తింపు అన్న విషయంలో అనుమానం ఉందని అర్థమేమో?

నడక తీరులో తేడా
మనిషి కూడా మొదట్లో నాలుగు కాళ్లమీద నడిచేవాడు. పదిహేను లక్షల సంవత్సరాల క్రితం నిటారుగా నడవడం నేర్చుకున్నాడు. నాటినుంచి నేటివరకు అందరూ ఒకే తీరుగా నడుస్తున్నారు. ఒక కాలు ఎత్తి, మరో కాలు కన్నా ముందుకు వేయడం, తుటి నుంచి మడమ, కాలివేళ్ల వరకు ఒక రకమయిన కదలికలు కలకాలంగా సాగుతున్నాయి. కానీ, ఆ కదలికల్లో ఎక్కడో ‘కొంత’ తేడా ఉంటుంది. ఎవరి నడక తీరు పూర్తిగా వారికే ప్రత్యేకమని చెప్పడానికి లేదు. కానీ, కేవలం నడక ఆధారంగానే మనుషులను గుర్తించడానికి 90 శాతం వరకు వీలుందని 70 దశకంలోనే నిరూపించారు.
పిల్ల వయసులో నడక తీరు మారుతూ పోతుంది. శరీరం పెరుగుదల ఆగేసరికి నడక తీరు స్థిరమవుతుంది. కాళ్ల పొడుగు, తుంటి వెడల్పు, శరీరం బరువు, కండరాల తీరు లాంటి లక్షణాలు ఆధారంగా నడకకు ఒక ప్రత్యేకత వస్తుంది. ఆ నడక తీరును అందరూ గుర్తిస్తారు. వర్ణించడం మాత్రం సులభంగా కుదరదు. ఇది నడక గురించి పరిశోధకులు అంటున్న మాట. కాళ్లు, చేతులు కదిలే మార్గాన్ని గీతలలో గుర్తించి, పిరుదులు, మోకాళ్లు, పాదాలు కదలికలను లెక్కించి, ఒక దాంతో మరొక దానికి గల సంబంధాలను లెక్కించి కంప్యూటర్లు నడకను గుర్తించగలిగాయి. కాలిగుర్తుల తీరు, వాటిలో పడిన ఒత్తిడి ఆధారంగా కూడా నడక తీరును గుర్తించారు. జపాన్‌లో ఈ రకమయిన పద్ధతిలో మనుషులను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
స్మార్ట్స్ ఫోన్స్‌లో కదలికలను గుర్తించే సెన్సర్స్ మామూలయినాయి. వాటి ఆధారంగా నడక తీరును గుర్తించే ప్రయత్నాలు కూడా ఈ మధ్యనే మొదలయినయి. సెన్సర్స్‌ను కాలికి కడితే వేగం, కదలిక లాంటివన్నీ తెలుస్తాయి. అది తెలిసిన ఫోన్- మరెవరో వాడితే పలకదు!

చెవులను గమనించారా?
మనుషులను గుర్తించడానికి వేలిముద్రలు, కంటిపాపలను వాడినట్టే చెవి తీరును వాడవచ్చు! పైగా, కాళ్లలాగే, కుడి, ఎడమ చెవులు రెండూ ఒకే రకంగా ఉండవు! ఏ ఇద్దరి చెవులూ ఒకే రకంగా ఉండవు. అమ్మ కడుపులో ఒక వ్యక్తి ఉనికి మొదలయిన తర్వాత అయిదు వారాల వరకు చెవులుండవు. అప్పుడు తలకు ఇరువేపులా ఆరేసి బుడిపెలు పుడతాయి. అవి పెరుగుతూ కలిసి చెవులవుతాయి. వాటి ఆకారానికి జన్యువులలో సమాచారం ఉంటుంది. అయినా వేలిముద్రలలాగా చెవులు కూడా అక్కడి ఒత్తిడి, ఒరిగిన దిక్కులాంటి సంగతులను బట్టి పెరుగుతాయి. మనుషుల శరీరంతోపాటు, చెవులు కూడా పెరుగుతాయి కానీ, వాటి ఆకారం మాత్రం మారదు!
చెవి గుర్తుల ఆధారంగా నేరస్తులను పట్టుకున్న సందర్భాలు అమెరికా, నెదర్లాండ్స్ దేశాలలో నమోదయి ఉన్నాయి. అయితే, ముద్రలు పడిన తీరు ఒత్తిడి కారణంగా మారుతుంది గనుక, దీన్ని పూర్తిగా నమ్మదగిన పద్ధతిగా అందరూ అంగీకరించలేదు. ముఖాన్ని చూచి తికమకపడినట్లే, చెవి విషయంలోనూ కొంత తికమక ఉంది. ఈ మాటను అడ్డుగా పెట్టుకుని యుఎస్‌లో ఒక నేరగాడు శిక్షను తప్పించుకున్నాడు కూడా!

కళ్ళలో తేడా ఉంటుంది
యుకె, యుఎస్, కెనడా లాంటి దేశాలలో మనుషులను గుర్తించడానికి కంటి పాపలను కంప్యూటర్ సాయంతో స్కాన్ చేస్తున్నారు. ‘అచ్చం అమ్మ కళ్లే’ అనడం మనం వింటూనే ఉంటాము. మరి కళ్లసాయంతో మనుషులను గుర్తించడం ఎట్లా కుదురుతుంది? కంటి పాపలో రకరకాల కండరాలు చిక్కులు పడినట్టు ఉంటాయి. వాటి మధ్యన లిగమెంట్స్, రక్తనాళాలు, రంగు కణాలు కూడా ఉంటాయి. వీటన్నింటి కారణంగా కళ్లలో రంగు, లోతు, ఎత్తులు, చుక్కలు మొదలయిన తేడాలు ఏర్పడి ఉంటాయి.
మామూలుగా కంటిపాప రంగు జన్యుపరంగా వస్తుంది. అందుకే అమ్మ కళ్లు, నాన్న కళ్లు అంటారు. కుడి, ఎడమ కనుపాపల రంగు ఒకే రకంగా ఉంటుంది. అందుకే కంప్యూటర్ సాయంతో కళ్లను స్కాన్ చేసే చోట రంగు లాంటి అంశాలను పట్టించుకోరు. ఎత్తులు, పల్లాలు, గీతలను మాత్రమే చూస్తారు. కంటిలోని ఐరిస్- వ్యక్తి పుట్టకముందే తయారవుతుంది. దాని నిర్మాణానికి జన్యువులకు సంబంధం లేదు. కనుక వాటిలోని కండరాలు, లింగమెంట్స్, రంగు కణాలు రకరకాలుగా పరచుకుంటాయి. అంటే ఏ ఇద్దరి కళ్లూ ఒకే రకంగా (పాప విషయంలో) ఉండవు.

గొంతు అంటే ధ్వని
గొంతులోనుంచి మాట బయటకు రావాలంటే ఎంతో ఫిజిక్సు జరగాలి. స్వరపేటికలోనుంచి గాలి వస్తూ ధ్వనికి కారణమవుతుంది. అది నోరు, ముక్కులలో చాలా రకాలుగా కొట్టుకుంటుంది. అంగిలి, నాలుక, పెదవులు, దవడల కారణంగా ‘మాట’వుతుంది. స్వరపేటిక, నోరు, ముక్కు, దంతాలు, కండరాలు, అన్నీ ఏ ఇద్దరిలోనూ ఒకే రకంగా ఉండవు మరి! అందుకే ఎవరి మాట ధ్వని వారిదిగానే ఉంటుంది.
వేలిముద్రలను, కంటిపాపలను మార్చ డం కదురదు. కానీ, కండరాల సాయంతో స్వరపేటికను, మిగతా భాగాలను వేరుగా కదిలించి గొంతుకను మాత్రం మార్చవచ్చు. మిమిక్రీ కళాకారుల విజయ రహస్యం అదే! కొందరి గొంతు అనుకోకుండానే మారుతుంది. మనకు తెలియకుంటే మనం గొంతును మార్చి మాట్లాడుతుంటాము.
మిమిక్రీ ఎలా వీలవుతుందని పరిశోధించారు, పరిశోధిస్తున్నారు. అందరికీ ఆ విద్య వీలుగాదు. అంటే మొత్తానికి, గొంతు, ధ్వనుల ఆధారంగా వ్యక్తులను గుర్తించడం వీలుగాదని అర్థం. గొంతును గుర్తించే పద్ధతితోబాటు మరేదో గుర్తించి కూడా ఉండాలి. మిమిక్రీ ఫెయిల్ కావచ్చు!

వాసనలు వేరుగా ఉంటాయా?
వాసనల ఆధారంగా నేరగాళ్లను పట్టడానికి కుక్కలు అవసరం. ఎవరి కంపు (కంపు అన్న మాటకు అసలు అర్థం వాసన అని మాత్రమేనని గమనించాలి!) వారిదే. అయితే ఏడు వందల కోట్ల వాసనలున్నాయా? ఉన్నాయి అని అంటున్నారు పెన్సిల్వేనియా పరిశోధకులు. డిఎన్‌ఏలో ఉండే మూల అక్షరాలు నాలుగు. మనిషి బాహుమూలంలో 20కిపైగా వాసన రసాయనాలున్నాయి. ఇంకా ఎక్కువగా కూడా ఉన్నాయి. వాటిని రకరకాల కలయికలు, మోతాదులుగా చూస్తే ఎన్ని రకాల వాసనలయినా ఉండవచ్చు.
మనిషి శరీరంలో వేరు వేరు భాగాలలో వేరు వేరు స్రావాలు పుడుతుంటాయి. అక్కడ రకరకాల సూక్ష్మజీవులుంటాయి. వాసనలేని స్రావాలకు కూడా వాటివల్ల వాసన పుడుతుంది. ఒక వ్యక్తి శరీరంలో మొత్తం ఐదు వేల రకాల రసాయనాలు వాసనలకు ఆధారాలు. ఆమ్లాలు, ఆల్కహాల్స్, కీటోన్‌లు, ఆల్డీహైడ్‌లు ఈ రసాయనాలలో రకాలు. వాటిలో కనీసం 44 మాత్రం వేరువేరుగా ఉంటూ, వేలిముద్రలలాగే రకరకాల వాసనలకు కారణమవుతాయి. ఈ రసాయనాలకు వాసన కలిగించడం తప్ప మరో పని లేదని కూడా గుర్తించారు. ఈ వాసనల ఆధారంగా మనుషులను గుర్తించడం ఒక సహజమయిన పద్ధతి అని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
శరీరం మొత్తంమీది వాసనలను సేకరించి, వ్యక్తిని గుర్తించే పద్ధతి ఇంకా రాలేదు. ఆ ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయి

లబ్-డబ్ లేదా హృదయలయ
కవులు, గాయకులు గుండె చప్పుడు గురించి ఊహించారు. నిజంగా కూడా ఏ రెండు గుండెలు ఒకే రకంగా కొట్టుకోవు. వింటే తేడా తెలియదు కానీ, విద్యుత్తు తరంగాలుగా చూస్తే మాత్రం తెలుస్తుంది. ఇసీజీలో గుండెలోని మూడు రకాల కదలికలు తెలుస్తాయి. ప్రతి గుండె పరిమాణం, ఎత్తు, పొడుగు, ఆకారం వేరువేరుగా ఉంటాయి. వేగం మారినా గుండెలయ మాత్రం మారదు. దీన్ని మన ఇష్టప్రకారం మార్చడం కుదరదు. గుండె ఆధారంగా మనుషులను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మెదడు నుంచి పుట్టే తరంగాలు
ఆలోచనలు ఎవరివి వారికి వేరంటే కొత్తేమీ లేదు. వాటినుంచి వచ్చే తరంగాలను గుర్తించి తేడా చూపవచ్చునని మాత్రం ఈ మధ్యే తెలిసింది. మెదడులో లెక్కలేనన్ని కణాలు మారి మారి, చివరికి ఒక వ్యక్తిత్వం ఏర్పడుతుంది. ఇఇజీ అనే యంత్రం మెదడు తరంగాలను చూపగలుగుతుంది. రామన్ పరాంజపే అనే పరిశోధకుడు కెనడాలో పరిశోధనలు జరిపి ఆలోచనా తరంగాల మధ్య తేడాను బయటకు చూపించాడు. అందరూ ఒకే పనిచేస్తున్నా, మెదడు పనిలో తేడా ఉందని నిరూపించాడు. అయితే, ఈ బ్రెయిన్ వేన్స్ ఎన్ని రోజులయినా, ఏ పరిస్థితిలోనయినా ఒకే రకంగా ఉంటాయా? ఈ ప్రశ్నకు జవాబు యింకా రాలేదు. ఆలోచనలు, వేలిముద్రల వంటివి కావని మాత్రం తెలుసు!

మనం కాని మనం
మనిషిని గుర్తించడానికి అన్నింటికన్నా ఆశ్చర్యకరమయిన ఆధారం- ఆ వ్యక్తిలోని సూక్ష్మజీవుల తీరు, కలయికలు. ఒక వ్యక్తి శరీరం బయట లోపల కలిసి వంద ట్రిలియనుల (అంటే ఎన్ని?) సూక్ష్మజీవులుంటాయి. శరీరం కణం ఒక్కింటికి 10 సూక్ష్మజీవి కణాలుంటాయి. (మనం అంటే మనం కాదని, మన సూక్ష్మజీవులని అనాలేమో?) మన జన్యువులు 23,000 మాత్రమే. మనలోని సూక్ష్మజీవుల జన్యువులు 33 లక్షలు. మనం 0.7 శాతం మాత్రమే మనం అంటారు పరిశోధకులు. ఈ సూక్ష్మజీవులను బట్టి మనుషులను గుర్తించడం చాలా సులభం అనాలి!

ఇప్పుడు చుట్టూ చూడండి, మీలాటివారు మరెవరయినా ఉన్నారేమో వెదకండి! మనుషులంతా నిజానికి ఒక్కటే. అందరిలోనూ అదే రక్తం పారుతున్నది. కానీ...!

Tuesday, August 21, 2012

అంతే మరి!


ఒక రైతు ఉండేవాడు. అతగానికి రకరకాల జంతువులను, పశువులనూ పెంచడం ఇష్టం. ఒకప్పుడు అతను ఒక గుర్రాన్ని కొన్నాడు. ఆ గుర్రం అన్ని గుర్రాల వంటిది కాదు. చాలా అరుదయిన రకం. గుర్రాన్ని రైతు చాలా అపురూపంగా చూచేవాడు. కొన్నాళ్లకు గుర్రం జబ్బుపడింది. పరుగెత్తదు. తిండి తినదు. పాపం రైతు కుదేలు పడిపోయాడు. వైద్యుడిని పిలిపించాడు. వైద్యుడు రకరకాల పరీక్షలు చేసి, ‘మూడుదినాలు మందివ్వాలి. పరుగెత్తిందా సరేసరి! లేదంటే గుర్రాన్ని చంపడమే మంచిది. లేకుంటే, దాని జబ్బు మిగతా అన్నింటికీ అంటుకుంటుంది’ అన్నాడు.

ఈ మాటలు చెప్పడం, అక్కడ ఉండే కోడి విన్నది.

వైద్యుడు మందు యిచ్చి వెళ్లిపోయాడు. కోడి, తరువాత గుర్రం దగ్గరకు వెళ్లి ‘సంగతి తెలుసా? నీవుగాని పరుగెత్తలేదంటే, నిన్ను చంపుతారట! ఏదో తిను! కాస్త బలం తెచ్చుకో!’ అని చెప్పింది.

రెండవరోజు మందుయిచ్చారు గుర్రానికి! కోడి వచ్చి గుర్రానికి బుద్ధి చెప్పి సాగింది. ‘‘ఊరికే ఛస్తావు! తిన్నావుగా! కదులు మరి! కావాలంటే నేను నీతో వస్తా! ఏదీ పద! అదీ! అదీ!’ అంటూ హుషారు చేసింది.

మూడవనాడు మందు యిచ్చిన వైద్యుడు, ‘రేపటితో సంగతి తెలుస్తుంది’ అంటూ వెళ్లిపోయాడు. కోడి తిరిగి ‘సిగ్గులేదూ! ఛస్తే ఏమొస్తుంది?’ అని గుర్రాన్ని ఎంతో హుషారు చేసింది. మరునాడు తెల్లవారుతుండగానే కూసిన కోడి, వెంటనే గుర్రం దగ్గరకు వచ్చింది! ‘అన్నా! రా! నాతో రా! మాట విను! పరుగెత్తు! దాణా తిను! పరిగెత్తు!’ అంటు రకరకాలుగా హుషారు చేసి చివరకు గుర్రాన్ని పరుగెత్తించింది!

అలికిడి విన్న రైతు బయటకు వచ్చాడు. గుర్రం పరుగెత్తుతూ కనిపించింది. అతను సంబరపడిపోయాడు. అందరినీ కేకలేసి పిలిచాడు. ‘చూడండిరా! నా గుర్రం! ఎంత బాగా పరుగెత్తుతున్నదో చూడండి! నాబాధ తీరింది! ఏమిటో అనుకున్నాను. ఇవాళ పండగ చేయాల్సిందే! ఏదీ! ఆ కోడిని పట్టుకోండి! పలావు వండుకుందాం!’ అన్నాడు.

Thursday, August 16, 2012

పరిశోధన - పద్ధతి

కలడు కలండనెడివాడు కలడో లేడో? అని అనుమానం. ఉన్నాడని చెప్పేవారే గానీ, చూచినవారులేరు. అదే పద్ధతిలో పీటర్ హిగ్స్, సత్యేంద్రనాధ్‌బోస్ లాంటివారి ‘మరికొందరు’ ఒక పార్టికల్ ఉండి తీరాలని అన్నారు! ఇప్పుడేమో మరికొందరు- ఆ పార్టికల్ ‘కనిపించినట్టు ఉంది!’ అన్నారు. నాలుగురోజులు పాటు ప్రపంచమంతటా అందరూ చిందులు వేశారు. పరిశోధకులు ఎవరూ ఆ కణాన్ని- కనిపించని, కలడో లేడో అనే అనుమానం గలవానికి ముడిపెట్టినట్టు కనబడదు. మీడియా వాళ్లుమాత్రం ‘గాడ్‌ పార్టికల్’ అనేశారు. మనవారు మరో అడుగు ముందుకువెళ్లి దాన్ని ‘గాడ్‌లీ పార్టికల్’ చేసేశారు.

హిగ్స్ బోసాన్ కనిపించదు. కనుక, అది ఉందనేందుకు సూచనలను వెదికారు. గాలి కనిపించదు. కానీ గాలి ఉందనడానికి సూచనలు కనబడతాయి. అదే తీరులో హిగ్స్ బోసాన్ కూడా ఉందనడానికి ఆధారాలు కనబడ్డాయి. అవి అంతకుముందే ఒకసారి కనిపించాయన్నారు. కానీ, కనిపించలేదేమోనని అనుమానం కూడా కనిపించింది.

పొరపాట్లు లేకుండా పని చేయడానికి సిక్స్ సిగ్మా అని ఒక విశ్లేషణ పద్ధతి ఉంది. ఇక్కడా దాని ఫైవ్ సిగ్మాగా మార్చి, ప్రమాణంగా పెట్టుకున్నారు. కనుగొన్నది- మనం అనుకుంటున్న కణం కాకుండా పోవడానికి అవకాశం 0.00006 శాతం మాత్రమేనన్నారు. అందుకే పరిశోధకులు కూడా ఒళ్ళు దగ్గరబెట్టుకుని ‘మామూలు మనిషిగా చెపుతున్నాను (పరిశోధకుడిగా కాదు అని గదా అర్థం!) ఉన్నట్లే ఉంది!’ అన్నారు. ఆ కొద్ది మాటకే ప్రపంచమంతా పొంగిపోయి, కలడో లేడో అన్న అనుమానం తీరిపోయినంత గగ్గోలు చేశారు. సిఇఆర్‌ఎన్ వారి ప్రకటనను విశే్లషించి, తరువాత ఏమి కావచ్చునని సీరియస్‌గా వచ్చిన వ్యాసాలను, అభిప్రాయాలను ఎవరూ పట్టించుకోలేదు. ‘మేము కనుగొన్న పార్టికల్ ‘హిగ్స్ బోసాన్’గా తేలే అవకాశం (సంభావ్యత- ప్రాబబులిటీ) ఎక్కువగా ఉందని సెర్న్ వారు చేసిన ప్రకటన, చాలా ముఖ్యమయినది అంటున్నది అలాంటి ఒక వ్యాసం! పదార్థం నిర్మాణానికి ఆధారమయిన కణాలు, ఏ కొలతలూ లేని (రవ్వ) రూపంలో గాక పోగులు, దండలుగా ఉందన్న అంశాన్ని గురించి కొంతకాలమే ప్రతిపాదనలు వచ్చాయి. ఈ పద్ధతిలో చూస్తే కొలతలు పది ఉండాలని కూడా సూచనలు వచ్చాయి. ఐన్‌స్టైన్ మాత్రం స్థలం మూడు కొలతలు, కాలం ఒకే కొలత గురించి చెప్పి అందరినీ ఆలోచింపచేశాడు. అతనితో బాటే పనిచేసిన ‘మన’ సత్యేంద్రనాథ్ బోస్ చెప్పిన ‘బోసాన్’ గురించి ఆలోచించాలంటే, పది కొలతలు కూడా పనికిరావంటే, మనమంతా ఏదో అర్థమయినట్లు పండగ చేసుకుంటున్నాము. క్వాంటం ఫిజిక్స్ అంత సులభంగా పరిశోధకులకే అర్థం కాదు. అందులో ఏదో కొత్త ఆలోచనకు దారి దొరికితే సీరియస్ పరిశోధకులు బుర్ర తిరిగేలా ఆలోచిస్తున్నారు. అర్థం చేసుకుని ముందుకు సాగడానికి ప్రయత్నిస్తున్నారు. మిగతా వారందరూ మాత్రం ఈ దెబ్బతో ప్రపంచంలోని సమస్యలన్నిటికీ జవాబు దొరికిందన్నంత గొప్పగా గోల చేస్తున్నారు.


హిగ్స్-బోస్ అనేవారిలో పీటర్ హిగ్స్ ఇంకా బతికే ఉన్నాడని చాలామందికి తెలియకపోవచ్చు. ఆయనను ‘మీరేమంటారు?’ అని అడిగితే, ‘అనేందుకు ఏముంది’ లాంటి సమాధానమిచ్చాడు. ‘ఈ బోసాన్‌కు తండ్రులు బోలెడంత మంది ఉన్నారుగదా, మరి నోబేల్ బహుమతి ఎవరికిస్తారు?’ అని కూడా అడిగారు ఆయనను. ‘అలాంటి నిర్ణయాలు నేను కాదు గదా చేసేది’ అన్నాడాయన. అటు పాకిస్తాన్‌లో అబ్దుస్ సలాంగారికి (ఈయనకు మన కలాం గారికి సంబంధం లేదని గుర్తుంచుకోవాలి) ఇటు మన దేశంలో సత్యేంద్రనాధునికి అన్యాయం జరిగిపోయిందని, వ్యాసాలు వచ్చేశాయి. బోసాన్ కణం ఉందని కనుగొనడానికీ, బోస్‌కు సంబంధం లేదు. హిగ్స్‌కు అంతకన్నా సంబంధం లేదు. ఇంకా ఆ పార్టికల్‌ను హిగ్స్ బోసాన్ అంటున్నారంటే, వారిద్దరినీ గౌరవించినట్లే లెక్క. ఫెర్మియానులు, బోసానులు, వాటిలో రకాల గురించి, ఇక్కడ చర్చ మొదలుపెడితే, ఎవరికీ ముక్క తోచదని, అర్థంకాదని అంటే తప్పుకాదు. నిజానికి హిగ్స్‌తో బాటు పనిచేసిన టామ్ కిబెల్ అనే సైంటిస్టును ఈ క్షణంలో అందరూ గుర్తు తెచ్చుకోవాలి అంటారు నిజంగా సంగతి తెలిసినవారు. సలాంను, బోస్‌ను ఎవరూ మరిచిపోలేదు. వాళ్లు గొప్ప పరిశోధకులు. కానీ ఇప్పుడు జరిగిన పరిశోధనలో వారికి సంబంధం లేదు, అంటున్నారు కూడా!
ప్రపంచానికి నిత్యం ఒక సంచలన వార్త కావాలి. ఇవాళటి కొత్త సంచలనం రాగానే, నిన్నటి మహా సంచలనం మరుగున పడిపోతుంది. కానీ సైన్సు ప్రపంచం పద్ధతి వేరు. అక్కడ సంచలనాన్ని సంచలనంగా కాక, మరింత కృషికి మార్గంగా భావిస్తారు. మరింత సీరియస్‌గా ముందుకు సాగుతారు. లాజికల్‌గా ముందుకు సాగుతారు. ఈ లాజిక్ అన్న అంశం పరిశోధకులను కొన్ని అభిప్రాయాలనుంచి సత్యాలవరకు నడిపిస్తుంది.


ఒకటి ఉంది గనుక రెండు కూడా ఉంటుంది. కలిసి మూడవుతాయి అన్నది భావన. నిజంగానే లాజిక్‌లో లెక్కలుంటాయి. అది లెక్క ప్రకారం ముందుకు సాగుతుంది. మొదలు అనుకున్న అభిప్రాయం లేదా భావన నిజమే అయితే, ఆ తరువాతి లెక్కలు కూడా నిజాలవుతాయి. కానీ, సైన్సులో కూడా అభిప్రాయాలు సమగ్రంగా అవసరమయినవి అన్ని ఉండి, పరిశోధన మొదలయ్యే స్థితి ఉండదు. అందుకే లాజిక్- లెక్క ప్రకారం వచ్చిన ఫలితాలను కూడా పూర్తి చివరి సత్యాలు అనడానికి ఉండదు. బోసూ, హిగ్స్ మరి కొందరు, ఇలాంటి కణాలు ఉండితీరాలి అన్నారు. ఇవాళ ఉన్నట్టే ఉంది అంటున్నారు. మరెన్నో ప్రయోగాలు, పరిశీలనలు జరగాలి. అందరికీ ఒకే తీరు ఫలితాలు రావాలి. అప్పుడు గానీ ఒక సిద్ధాంతం ముందుకు రావటనికి వీలు కలుగుతుంది.


లెక్కలున్నంత మాత్రాన పని జరగదు. కవి, చిత్రకారుడులాగే, సైంటిస్టు కూడా ఒక భావనను కల్పించుకోవాలి. బోస్‌లాంటి వారంతా అదే చేశారు. బోసాన్ ఉందని తేలిననాడు, బోస్‌కు సన్మానం జరిగినట్లే లెక్క. ఆ సంగతి తెలుసు గనుకనే పీటర్ హిగ్స్ నిక్షిప్తంగా మాట్లాడింది! మన మాట నిజమని రుజువయితే, అంతకంటే ఏం కవాలి? అన్నది ఆయన భావం!


స్టేజిమీద తెర ఇప్పుడే లేచింది! నాటకం మొదలు కాలేదు. అప్పుడే చప్పట్లు కొడితే ఎట్లా?

Tuesday, August 7, 2012

అదీ.. మనిషి స్వభావం

ఒక పోలీసాయన ఉంటాడు. చాలా మొరటుగా ప్రవర్తిస్తుంటాడు. ఇంట్లోకూడా అట్లాగే ఉంటాడేమో తెలియదు. తన పనిలో మాత్రం చాలా మొరటుగా ఉంటాడు. ఆయనకు ప్రపంచంలోని అందరూ నేరస్తులలాగా కనబడతారు. వాళ్లతో తాను మొరటుగానే ఉండాలని ఆయన అభిప్రాయం. నేరం చేసిన వారి మీద జాలి ఎందుకని భావం. తనకు అధికారం ఉంది గనుక, తన స్వంత అభిప్రాయాలు తనకున్నాయి గనుక, మొరటుగా ప్రవర్తిస్తున్నానని ఆయనకు తోచదు. తన అధికారాన్ని అనవసరంగా వాడుతున్నాననీ, ఆ అమాయకులు తనను ఎదిరించలేక పోతున్నారనీ ఆలోచన రాదు. తనకు తాను న్యాయంగా బాధ్యతాయుతంగా ఉన్నాననే అనుకుంటాడు. తానెంతో క్రూరుడినన్న సంగతి తోచనే తోచదు. మొరటుగా ఉండే ఆడ పోలీసులున్నారంటే, అనుమానం అవసరం లేదు.

అదీ మనిషి తీరు. మనకందరికీ, రకరకాలస్థాయిలో స్వంత స్వభావాలు, అభిప్రాయాలు, అనవసరంగా పుట్టిన యిష్టాయిష్టాలు ఉన్నాయి. వాటిలో కూరుకుపోయి మనం అందరినీ ఏమారుస్తుంటాము. మంచితనం, సత్యం మనలోనే ఉన్నాయనుకుంటాము. అందరూ ఇలాగే అనుకుంటారు గనుక మనం కూడా అడుగడుగునా మోసానికి, వంచనకు గురవుతాము. అయితే అన్నిసార్లూ పరిస్థితి ఒకేరకంగా ఉండదు. మనలో ఎవరికీ నిజంగా సరైన ఆలోచనలు ఉండవు. పర్‌ఫెక్షన్ ఉండదు. కానీ, మనం మరింత మంచి ఆలోచనలు చేయగలుగుతాము. ఈ సంగతిని మాత్రం మరువకూడదు.

అందరూ ఆలోచించనవసరం లేకుండా, ఆలోచించకుండా బతుకుతున్నారు. అందులో మనం కూడా ఉన్నాము. ఇది ఒకరకంగా అబద్ధం. మనకు తెలియకుండానే మనలోపల ఆలోచనలు సాగుతూ ఉంటాయి. ఉదయం లేవాలంటే ఆలోచన. మరేదో పని చేయాలన్నా, మానుకున్నా ఆలోచన ఉంటాయి. ఈ ఆలోచనలు మామూలుగా మనకు తెలియకుండానే (అచేతనలో) జరుగుతుంటాయి. వాటిని చేతనలోకి అంటే తెలిసి జరిగే స్థితికి మనమే తేగలగాలి. ఈ పని ఒకసారి జరిగితే చాలదు. ఒకనాడు జరిగితే చాలదు. అలవాటు చేసుకుంటే, మన ఆలోచనలన్నీ మనకు తెలిసి జరుగుతాయి. సమస్యలు సంతోషాలు ఎదురవుతాయి. అవన్నీ ఆలోచనల్లో ఉంటాయి. సమస్య అన్నా, సంతోషం అన్నా ఆలోచనలే! వాటన్నింటినీ మనం గుర్తించగలగాలి. ఇది చేతనయితే మన ఆలోచనల్లోనూ మన బతుకులోనూ మార్పులు వీలవుతాయి. గిరి గీసుకుని అందులోనే బతకడం, ఆలోచించడం మనిషికి మామూలే. కానీ, అందులోంచి బయటకు వచ్చి, ఎత్తులకు ఎగిసి, గొప్ప ఆలోచనలు చేయగలగడం మనిషికి చేతనవుతుంది. మనముందే ఎంతోమంది ఈ పని చేస్తుంటారు. మనం వాళ్లను గుర్తించలేకపోతాము. మనం మన మెదడు సాయంతో మన మెదడుకు పాఠాలు నేర్పగలుగుతాము. ఆలోచనలను వాడుకుని ఆలోచనలను మార్చగలుగుతాము. మనం ఇప్పుడున్న తీరునుంచి మరో తీరులోకి మారగలుగుతాము. అందుకు మనకు ఆలోచనలే ఆధారం. మారాలన్న పట్టుదల, కోరిక అవసరం. ఇదిమరెవరో చేయగల పని కాదు. ఇది మనకు మనం చేసుకోగల, చేసుకోవలసిన ఉపకారం.

ఆలోచన మనసులో ఉంటుంది. మనసు మెదడులో ఉంటుంది. వీటి బలం పెరగాలి.

ప్రతి విషయం గురించి ఏం జరుగుతున్నదీ మనం ఆలోచించగలగాలి. జరగవలసిన దాన్ని గురించి ఆలోచించగలగాలి. ఈ రెంటిలో ఏదో ఒకటే మనకుకావాలి. మరోదాన్ని మనం వదులుకోవాలి. రానివ్వకుండా ఎదుర్కోవాలి. మన ఆలోచన బలంగా సాగితే, విషయంలోని రెండువైపులూ మనకు చక్కగా కనబడతాయి. మనకు అనవసరమైనవి సులభంగా తెలుస్తాయి. మనకు తెలియకుండానే ఎన్నో పనులు మనమే చేస్తుంటాము. వాటి గురించి ఆలోచన ఉండదు. కనుక, ఆ పనుల ప్రభావానికి మనం తెలియకుండానే గురవుతుంటాము. ఆలోచిస్తే మాత్రం సంగతి అర్థమవుతుంది. కనుక ఆలోచన అలవాటుగా మార్చుకోవాలి.

*మనం మనలాగా ఆలోచించేవారి మధ్యన బతుకున్నాము. కనుక మన తీరును ఎవరూ తప్పు పట్టరు.
*ఎవరో ఒకరు మనలను తప్పుపట్టారని అనుకుందాము. మనం దుఃఖంలో మునిగిపోతాము. నిరాశకు గురవుతాము. ‘నువ్వు కూడా ఇట్లాగంటావని నేననుకోలేదు! నీవు నాకు కావలసిన మనిషివనుకున్నాను’ లాంటి అర్థంలేని మాటలు అంటాము. కొంతమంది అదేపనిగా తప్పులు పడుతుంటారు. వారిని వదిలేద్దాము. కానీ మనం మంచి కోరేవారు మనల్ని తప్పుపడితే గుర్త్తించగలుగుతున్నామా? మనకు అంత ఆలోచనా శక్తి ఉందా? ఎవరేమన్నా, ముందు ‘కాదు’ అంటుంది మనసు. కానీ, క్షణం ఆలోచించి ‘అవునా?’, ‘అవునేమో?’ అనుకోగలిగితే, అంటే ఆలోచించగలిగితే ఎంత బాగుంటుంది. అనవసరమైన మనస్తాపాలుండవు. వాదాలు ఉండవు. పైగా, ఆలోచించి మనం కాదనవలసినదేదో, మనలో ఉందని తెలుసుకుంటే, దాన్ని వదులుకునే వీలుంటుంది. ఒక్క క్షణం బాధ కలుగుతుంది! నిజమే! కానీ, మనం ఆలోచించడంలేదని అర్థమయి, విషయం తెలిస్తే మాత్రం, పశ్చాత్తాపం, మార్పు, ఆనందం వరుసగా వస్తాయి గదా!

* తప్పుడు మాటలంటాము. తప్పుడు పనేదో చేస్తాము. వెంటనే, మనలను మనం సమర్థిచుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ‘అది కాదు నేననదలచుకున్నది’ అని తర్వాత అంటే లాభం లేదు. మన మాటలను, మన చేతలను మాత్రమే ఎదుటివారు అర్థం చేసుకుంటారు. మన భావాలు వారికి అర్థం కావు. కనుక తప్పు తప్పుగానే తోస్తుంది. వారికి మనం తప్పుడు మనుషులుగా గుర్తుండిపోతుంది. ఆలోచన లేని పనులవల్ల ఇలాంటి పర్యవసానాలుంటాయి. పోలీసాయనకూడా మనిషే. అతనూ కొందరితో ప్రేమగా, స్నేహంతో ప్రవర్తిస్తాడు. కొన్నిచోట్ల మొరటుగా ఉండవలసి వస్తుంది. కానీ అది స్వభావంగా మారుతుంది. దొంగతనాలు చేసే మనిషి, తన యింట్లోకి కూడా కన్నం వేసి దూరితే బాగుండదు మరి!

* బ్రతుకు భారంగా, జగము చీకటిగా కనబడవచ్చు. ఆలోచన అటువైపే ఉంటే ఇక వెలుగు ఉంటుందని కూడా తోచదు. ఇక్కడే మనిషి, సత్యాసత్యాలను, చీకటి వెలుగులను చూడగలగాలి. ఇవన్నీ ఆలోచనల నుంచి వస్తాయి. నాకు కావలసింది నాకు తెలుసు అని ముందే నిర్ణయించుకుంటే అది చీకటి అని తెలియదు. కావలసింది ఒకటి ఉంటే, కాకూడనిది, అనవసరమయినది కూడా ఒకటి ఉండాలి. ఈ వైరుధ్యాలను గురించి ఆలోచన కలిగితే, వాటిలో మనకు కావలసింది అర్థమవుతుంది. మొరటు ప్రవర్తన కూడా అవసరమే. కానీ, దానికి సమయం, సందర్భం ఉంటాయి ఆ సందర్భం తెలియాలి. మన మీద మనం నిఘా వేసుకోవాలి. ఒక సందర్భంలో మన మీద మనం మొరటుగా ప్రవర్తించాలి. ఏం జరిగినా అది ఆలోచన మీద జరగాలి! ఆలోచించండి!

Monday, August 6, 2012

మన గురించి మనం


ప్రశ్నలడగడం తెలుసు
ప్రయాణం సంగతి తెలుసు
కలల గురించి తెలుసు
మనసు గురించీ తెలుసు
అయితే ఏంటట?
పోదురూ విసిగించక అంటారా? అవును మరి. ఇప్పుడవన్నీ ఎవరికి కావాలి అసలే పని తెమలక ఛస్తుంటే అంటారా అక్కడే మొదలవుతుంది అసలు కథ ఎన్ని తెలిసినా, ఎంత చేతనయినా మనసులో ఉత్సాహం లేనిదే ఏమీ చేయాలనిపించదు. మెదడులో తెలివి ఉన్నా మనసులో మరేదో ఉండాలంటారు అందుకే. రెపటి రూపం తెలియాలంటే మనసులో అందుకు సంబంధించి కోరిక ఉండాలి. తెలుసుకోవాలన్న ఉత్సాహం ఉండాలి.
నా బతుకింతే అనుకుంటే నిజంగా అంతే. మరేమీ లేదా అంటే మరేమయినా ఉండవచ్చు. ఉందా అంటే ఎవరూ వెతికి పెట్టరు. మనమే వెతుక్కోవాలి. ఈ జీవితం ఒక సినిమా. ఇందులో మీరే ముఖ్యపాత్ర. మరెవరి సినిమాలోనో వెనుక కనిపించే పాత్ర కాదది.
మనం లేకున్నా అంతా బాగానే సాగుతుందంటారు కని రెడ్డిగారు. సవినయంగా వారి మాటను నేను కాదంటాను. మనం లేకుంటే మనం లేని లోటు కనబడి తీరుతుంది. మనం లేకుంటే మనం చెప్పవలసిన మాటలు మరెవరూ చెప్పరు.
  
మనం చెయ్యవలసిన పని మనమే చేయాలి. మనం చెప్పవలసిన మాట మనమే చెప్పాలి.
చెప్పిన మాట ఎవరూ వినరని తెలిసినా సరే మన పని మనం చేస్తూ ముందుకు సాగాలి.
మనకిష్టం వచ్చింది చేద్దామా?
పదుగురికి నికి వచ్చేది చేద్దామా?
మన కొరకు బతుకుదామా?
మనవారి కొరకు బతుకుదామా?
మధ్యలో చేతనయితే కాస్త బాలెన్సు చూపుదామా?
మన సంతోషం పది మంది సంతోషంలో ఉందన్న సంగతి మనం మరిచి పోతుంటాము.
అట్లాగని తెల్లవార్లూ ప్రజాసేవలో బతకడం కుదరదు.
అక్కడే ఉంది అసలు కిటుకు.
సర.న దారి అని అందరూ సులభంగా చెపుతారు. ఎలాగుంటుంది సర.న దారి
మీకు తెలుసా?
తెలిస్తే అంతకన్నా కావలసింది లేదు!
తెలుసన్న సంగతి తెలిస్తే అటువంటి మనుషులకు సాగిలబడి మొక్కవచ్చు.

ఈ ప్రపంచంలో మంచి జరుగుతూ ఉంటుంది. కానీ అది కనబడే లాగ జరగదు. దానం చేశారనుకోండి. ఒకరు ఇవ్వడమూ, మరొకరు పుచ్చుకోవడమూ కనబడుతుంది. కానీ అందులోని మంచితనం కనబడదు. కాని వారికి దానం చేసినా చేసినప్పుడు అర్థం కాదు. మనం డబ్బులిచ్చిన మనిషి తరువాత కల్లుపాకలో కనబడితే ప్రాణం ఉసూరుమంటుంది. ఆకలిగా ఉన్న మనిషికి అన్నం పెడితే ఆ కళ్లల్లో సంతృప్తి కనబడితే, ఆ పూట అన్నం తినకున్నా నిద్ర సుఖంగా పడుతుంది. అక్కడా మంచితనం కనబడదు. అనుభవంలోకి వస్తుంది అంతే.
కళ్లకు వెలుగులు కనబడతాయి. రంగులు కనబడతాయి. మంచితనం కనబడదు. తప్పూ, ధర్మం తేడా కనబడదు. అలాగని అవి లేవందామా మనకు కనిపించనివన్నీ లేవంటే మనవాళ్లందరబ ప్రతి క్షణం మనకు కనబడుతూ ఉన్నారా పోయినవాళ్లు కనబడరు. భావం మాత్రం ఉంటుంది. వాళ్లు ఉన్నారనుకుంటే ఉన్నట్టేనా? ఉన్నవాళ్లు, ఉన్న సంగతులు లేవనుకుంటే లేకుండా పోతాయా?

ఏ వస్తువయినా మనం చూచినప్పుడు ఉన్నట్టే ఉండి పోతుందా? మన మనసులో మాత్రం ఆ పాత బొమ్మ ఒకటే నిలిచి ఉంటుంది. మంచితనమ సంగతి వేరు. అది ఏ సంగతిఎట్లా ఉంటే బాగుంటుంది అన్న భావానికి రూపం. అది మనసులో మాత్రమే ఉంటుంది.
దానగుణం మంచిది అని మనకు అనిపిస్తే, అందరూ దానం చేస్తూ ఉండాలను మనం అనుకుంటామని అర్థం. కళ్లకు అది కనిపించదు. జరిగినా ప్రతి సందర్భాన్నీ మనం చూడలేము.

తెలిసి జరిగిన మంచితనమం మన దృష్టికి వస్తుంది. తెలి.నిది తెలియకుండానే ఉండిపోవచ్చు. తెలి.కుండా జరిగే చెడ్డతనమయినా అంతే. అనుకోని ఘాతుకం మన కళ్ల ముందు డరిగితే అది తప్పు అని మనకు వెంటనే తెలుస్తుంది. అందులోని తప్పిదాన్ని మనం చూడలేమన్న సంగతి ఆ క్షణాన గుర్తుకు కూడా రాదు. బల్ల గుద్ది అది తప్పు అని వాదించడానికి కూడా మనం సిద్ధమవుతాము. శరీరానికి అంటే కళ్లకు, చెవులకూ అందని సంగతి గురించి మనం నిరణ.లు ఎందుకని అంత సులభంగా చేయ గలుగుతాము.

అందులోని మంచి చెడుల గురించి మనం ఎందుకు, ఎట్లా నిర్ణయానికి రాగలుగుతాము.

అంటే మంచి చెడుల తేడా మనకు తెలియకుండానే మనకు తెలుసన్న మాట. దానం మంచిది. దొంగతనం చెడ్డది. ఇవి సులభమయిన సంగతులు. ఇంతకన్నా గట్టి. సంగతుల గురించి కూడా మనకు గట్టి అభిప్రాయాలు ఉంటాయి. ఏది మంచి ఏది చెడు అంటే వెంటనే ఉపన్యాసానికి లంకించుకుంటాము. ఎట్లా అవి మంచి తెడులయిన. అని ఎవరన్నా ఎదురు అడిగితే మాత్రం మన నుంచి సమాధానం అంత నమ్మకంగా రాదు.

నమ్మకంగా మీరు మంచి వేపు ఉన్నారా?
ఎదుటివారి గురించి వ్యాఖ్యానించే చోటికి మీరు చేరుకున్నారా?
మంచి చెడుల తేడా తెలుసా?
గట్టిగా మంచి వేపున నిలిచి పోరాడగలరా?
ఆలోచించండి!!

Sunday, August 5, 2012

ఆటలు - పోటీలు - సైన్సు

నిషి ఆలోచన మొదలయిన నాటినుంచి సదుపాయాలు కొరకు వెతికాడు. రాళ్లతోనే గొడ్డళ్ళను, కత్తులను తయారుచేసుకున్నాడు. కడుపు నిండిన తరువాత మరి కాలక్షేపం కావాలి. సరదా కావాలి. అందుకని ఆటలు మొదలయినయి. ఆటల్లో కొన్ని శరీర శక్తి మీద ఆధారపడినవి. కొన్ని మెదడు మీద ఆధారపడినవి. మరికొన్ని రెండూ కలిపిన రకం. టెక్నాలజీలో కూడా ఈ రెండూ ఉన్నాయి. వేటకొరకు బాణం కడితే అది అవసరం. బాణాన్ని ఎంత దూరం వరకు వేయగలమని పోటీపడితే అందులో సరదా కూడా ఉంది. బాణాన్ని ఎక్కువ దూరం వేయగలగాలంటే విల్లు, అమ్ములను మరింత ‘బాగా’ తయారుచేయాలి. అట్లా టెక్నాలజీ పుడితే అది ‘ఆట’ మాత్రం కాదు. ఆటలోకూడా రూల్స్‌ను దాటనంతవరకు ఎంత టెక్నాలజీ వాడినా తప్పులేదు. చిత్రంగా, మిగతా రంగాలకన్నా ఆటలో ఎక్కువగా ఈ టెక్నాలజీ వాడకం మొదటినుంచి జరిగింది.

మనుషుల నాగరికత నడకలో ఒలింపిక్స్‌ను ఒక మలుపుగా గుర్తించారు. క్రీస్తు పూర్వం 776లో గ్రీస్‌లోని ఒలింపియా నగరంలో మొదటి ఆటల పోటీలు జరిగాయి. అప్పుడు ఒకే ఒక పోటీ జరిగింది. దాని పేరు స్టేడియాన్. సుమారు రెండు వందల మీటర్ల నిడివి గల ట్రాక్ వెంట పరుగుపెట్టి వెనక్కు రావాలి. త్వరలోనే ఆ పోటీకి కొన్ని రూల్స్ వచ్చాయి. అంటే కొంత టెక్నాలజీ కూడా వచ్చిందనవచ్చు. పరుగు మొదలయ్యే చోట, కాళ్లకు ఆధారంగా గుంటలు, అటు చివర కొయ్యలువచ్చాయి. ఆ తరువాత ఒలింపియాడ్స్ వందల ఏళ్లు కొనసాగినయి. క్రీస్తుశకం నాలుగవశతాబ్దం నాటికి రథాల పరుగులు, బల్లెం విసరడం, అస్తశ్రస్త్రాలన్నీ మోస్తూ పరుగు తీయడం లాంటి రకరకాల పోటీలు అందులోకి వచ్చి చేరుకున్నాయి. అన్నింటిలోనూ ఎన్నో నియమాలు, ఎంతో టెక్నాలజీ కూడా వచ్చాయి.

ఒక్కసారిగా పారిశ్రామిక విప్లవకాలం నాటికి కప్పదాటు వేస్తే, అదంతా సాంకేతికత కాలం. పనివారికంతా, తీరిక, సరదాలు కావాలి. అందరికీ హాయిగా తిండి దొరుకుతున్నది. ఆటలకు కావలసిన సరంజామా అందరికీ అందుబాటులోకి వచ్చింది. అప్పటివరకు ఆట పోటీల్లో కర్ర, చర్మం లాంటి పదార్థాలను మాత్రమే వాడుతున్నారు. అవి సులభంగా, అందరికీ దొరుకుతాయి. అప్పుడప్పుడే హాన్‌కాక్, గుడ్‌యియర్, మాకింటాష్‌లు రబ్బరు తయారీని కనుగొన్నారు. సహజంగా దొరికే రబ్బరుకు గంథకం కలిపి ఉడికిస్తే, మన్నికగల రబ్బరు వచ్చింది. దానితో 1800 ప్రాంతంలో ఆటలలో వాడుకునే బంతుల తీరు మారింది. జంతు చర్మంతో తయారుచేసిన బంతులు అన్నీ ఒకే రకంగా ఉండవు. రబ్బరు బ్లాడర్లు అన్నీ ఒకేరకంగా, ఎన్నయినా తయారుచేయవచ్చు. రబ్బరుతో షూస్, దుస్తులు కూడా తయారుచేయడం వీలవుతుంది. డన్‌లాప్ తయారుచేసిన టైర్ల కారణంగా మంచి బైసికిళ్లు, మిగతా వాహనాలు వచ్చేశాయి. ఈ రకంగా ఒకవేపు బతకడానికి సదుపాయాలు పెరుగుతున్నాయనుకుంటే, అవన్నీ ఆటల పోటీలోనూ మార్పులను తెచ్చాయి.

ఇంత జరిగిన తరువాత ఆటలనే తమ పనిగా ఎంచుకునే వారు రావడంతో ఆశ్చర్యం లేదు. పోటీలో కాలాలు, నిడివి లాంటి వాటిని సరిగ్గా కొలతవేసే పద్ధతులు అవసరమయ్యాయి. 1885 ఫొటో ఫిల్మ్ వచ్చింది. గుర్రాలు, మనుషుల పరుగులలో ‘్ఫటోఫినిష్’ అనే మాట వచ్చింది. కంటిచూపు కాక, ఫొటోల ఆధారంగా గెలుపు నిర్ణయాలు చేయడం అసలయిన స్పోర్ట్స్ టెక్నాలజీ! అక్కడితో ఆగక, క్రీడాకారుల శిక్షణలో కూడా ఫొటోలు, ఫిల్ముల వాడకం అప్పుడే మొదలయింది. బొమ్మలను చూచి, పద్ధతులను మార్చుకుని అందరూ, ‘మరింత బలంగా, మరింత ఎత్తులకు, మరింత వేగంగా’ చేరడం నేర్చుకున్నారు.
పరుగులలో సమయం నిడివి చాలా ముఖ్యం. 1930లోనే సెకండులో పదవ భాగాన్ని లెక్కించడం మొదలయింది. 1970లో గెలుపులు, సెకండులో వందవ భాగం ప్రకారం నిర్ణయం చేయడం మొదలయింది. పరుగు మొదలయే చోట పిస్టల్ పేలుతుంది. దానికీ క్వార్ట్స్ క్రిస్టల్ గడియారానికి లంకె ఉంటుంది. పరుగు ముగిసే చోట లేజర్ కన్ను ఉంటుంది. రెంటినీ కలిపి పరుగు సాగిన సమయాన్ని లెక్కవేస్తారు. ఈ లెక్కలు చెప్పడానికి సులభంగా కనబడతాయి. కానీ వాటి గురించి ఎంతో పరిశోధన జరిగింది. చిక్కులు వచ్చాయి కూడా.

పరికరాలు, పదార్థాలు: ఆటల పోటీలలో, సాంకేతిక శాస్త్రం తెచ్చిన మార్పులు అంతులేనివి. ఉదాహరణగా టెన్నిస్ రాకెట్లగురించి చెప్పవచ్చు. శతాబ్దాలుగా వాటిని కర్రతో చేసి వాడుకున్నారు. గ్రాఫైట్‌తో రాకెట్లు తయారుచేయవచ్చునని తెలిసిన తరువాత ఆట మారిపోయింది. రాకెట్లు మరింత పొడుగయ్యాయి. వెడల్పు కూడా పెరిగింది. అందులో బంతి తగిలే ‘స్వీట్ స్పాట్’ ఏరియా పెరిగింది. అంతకుముందు రాకెట్లలో, బంతి గనుక అంచున తగిలితే, రాకెట్, చేతిలో తిరిగేది. ఇప్పుడు ఆ సమస్య లేదు. దీంతో ఆట నేర్చుకునే వారు ఎక్కువయ్యారు. నేర్చిన వారి ఆటలో వేగం పెరిగింది. గోల్ఫ్‌లో టైటేనియం వాడుకలోకి వచ్చింది. అంతకన్నా మించిన మార్పులు బైసికిల్ విషయంలో వచ్చాయి. బ్రిటీష్ డిజైనర్, మైక్ బరోస్, కార్బన్ ఫైబర్ ఫ్రేమ్‌తో కొత్త రకం సైకిల్‌ను తయారుచేశాడు. 1992 బార్సెలోనా ఒలింపిక్స్‌లో క్రిస్ బోర్డ్‌మన్ అనే క్రీడాకారుడు, ఆ సైకిల్‌ను వాడి నాలుగువేల మీటర్ల పోటీని సునాయాసంగా గెలిచాడు. సైకిలు చూడడానికి అందంగా ఉండడం అటుంచి, దాని బరువు తగ్గింది. స్ట్ఫినెస్ పెరిగింది. గాలిలో సైకిలు కదిలే ఏరోడైనమిక్ ఎఫిషియెన్సీ పెరిగింది. రైడర్‌కు ఇవన్నీ అదనపు సౌకర్యాలు!

రకరకాల ఆటవస్తువుల కొరకు వాడడానికి ఎన్నో పదార్థాలున్నాయి. వాటన్నింటి గురించి గొప్ప పరిశోధన మొదలయింది. రకరకాల పదార్థాలను కలిపి వాడినందుకు వచ్చే లాభాల ఛార్ట్‌లు దొరుకుతున్నాయంటే ఆశ్చర్యం. బోటు నడపడంలో తెడ్లు, పోల్‌వాల్ట్‌లోని గడకర్ర అన్నీ పరిశోధన అంశాలయ్యాయి. వెదురు గడలు చాలా గొప్పవి కనుక అవి 1950 దాకా వాడుకలో ఉన్నాయి. ప్రస్తుతం ఫైబర్ గడలు వాడుతున్నారు. మొత్తానికి ఆటలలో సాంకేతిక శాస్త్రం ఒక భాగమయింది!

Friday, August 3, 2012

మన తీరు ఎలాగుంది?


నిషన్న తరువాత ఒక స్వభావం ఉండనే ఉంటుంది. ఎవరి స్వభావం వారికి బాగానే ఉందనిపిస్తుంది. మన తీరు ఎదుటివారికి నచ్చకపోవచ్చునన్న ఆలోచన మామూలుగా రాదు. మనం బాగానే పనిచేస్తుంటాము. మన పై అధికారులు కూడా మనుషులే. వారికీ స్వంత స్వభావాలు ఉంటాయి. అందరి స్వభావాలు ఒకేలాగ ఉండవన్నది జగమెరిగిన సత్యం. కనుకనే, మనం బాగా పనిచేస్తున్నా సరే, ఒక్కోసారి ఎదుటివారికి కోపం వస్తుంది. మనం వారిలాగా ఆలోచించలేము గనుక వారికి కోపం ఎందుకు వచ్చిందన్న ప్రశ్నకు సమాధానం దొరకదు. ఇలా కొనసాగితే, కొంత కాలానికి బాసుకు మనమీద ఒక ‘అభిప్రాయం’ ఏర్పడే ప్రమాదం వుంది. అది కనుక జరిగిందంటే, మనం ‘ఎక్కడ వేసిన గొంగడి’ అన్న మాటకు ఉదాహరణ అవుతాము! తమకు తెలియకుండానే, బాసులకు కోపం తెప్పించే వారి గురించి కూడా పరిశోధన జరిగిందంటే నమ్మగలరా? ఆ పరిశోధనలో అయిదు రకాల మనుషులను గుర్తించారు. ఆ అయిదుగురిలో మనమూ ఉన్నామేమో తెలుసుకుంటే బాగుంటుంది కదూ? మనం చేస్తున్నది తప్పు కాకపోవచ్చు. కానీ, ఎదుటివారికి నచ్చడం లేదన్న సంగతి అర్థమయితే, కొంత వరకు సర్దుకోవచ్చునేమో! ఈ అయిదు రకాల మనుషుల్లో మనమూ ఉన్నామేమో చూద్దాం మరి!

అన్నింటికీ అవుననే వారు:
ఎవరేం పని అప్పగించినా ‘ఓ ఎస్!’ అనేవారు ఈ రకంలోకి వస్తారు. తెలియకుండానే, అలవిమాలిన బరువును వీరు తలకెత్తుకుంటారు. ఇలాంటివారికి మాకు అన్ని పనులు చేతనవునన్న ధీమా ఉంటుంది. పనులు చేతనయి ఉండవచ్చు కూడా. కానీ అన్ని పనులూ తామే చేయడానికి తగిన సమయం, వెసులుబాటు కూడా ఉండాలి కదా? ఈ సంగతిని ఒక్క క్షణం మరిచిపోయి, ఎక్కువ పనిని ఎత్తుకుంటే, బాగా చేతనయిన పనులు కూడా చేయలేని స్థితి వస్తుంది. బాగా చేయడం పక్కన పెట్టి, అసలు ఒక మనిషి చేయగలిగే పనులకు ఒక పరిమితి ఉంది. ఎక్కువ పనులను తలకు ఎత్తుకుంటే, కొన్ని మిగిలిపోతాయి. చేసినవి అరకొరగా వస్తాయి. అసలు కొన్నింటిని మరిచిపోయినా ఆశ్చర్యం లేదు. ఇక్కడే ఆసర్టివ్‌నెస్ అనే లక్షణం కూడా కావాలి. బాసు చెప్పినందుకూ, మనకు చేతనయినందుకూ కాక, వీలు కూడా గమనించి పనికి ఒప్పుకోవాలి. కుదరకపోతే, ఆ సంగతి వినయంగా చెప్పిచూడాలి.

గోడమీది పిల్లి: చేయాలా, మానాలా? తేల్చుకోలేని పరిస్థితిలో ఎంతకాలమయినా ఉండిపోతే, మనకూ, ఎదుటివారికి కూడా తికమక. పని చేస్తామన్న నమ్మకం ఎదుటివారికి ఇచ్చేశాము. చేతనయ్యేది, బాగా చేసేది తరువాత! అసలు చేయాలా, వద్దా అన్న అనుమానంలో, ఇంకా ఇంకా సమాచారం సేకరిస్తూ కాలం గడుపుతారు కొందరు. ఇదొక్కటీ తేలితే చేయవచ్చునేమో అన్న భావం ఒకటి మనసులో ఒక మూలనుంచి తొంగిచూస్తూ ఉంటుంది. సరయిన నిర్ణయం ఒక నాటికి వీలుకాదు. చేశావా? అని ఎవరైనా అడిగితే, ‘ఇదుగో! మొదలు పెడుతున్నాను. అసలు మొదలయిందంటే ఎంతసేపు? చిటికెలో చేస్తాను’ అని జవాబు. కానీ ఆ స్టార్టింగ్ ట్రబుల్‌కు అంతం ఎక్కడ. గోడమీద పిల్లి అటో యిటో దూకేదెప్పుడు? ఈ సంగతి తేలేలోగా కొంప మునిగే పరిస్థితీ, పైవారికి కోపం రావడం ఖాయం. మరి ఈ సందిగ్ధం అవసరం లేకుండా, ముందే నిర్ణయించి, చటుక్కున మొదలుపెట్టి, ఇచ్చిన పనిని, చేతనయినంత బాగా చేసి పడేస్తే పోతుంది గదా?

ఊగిసలాట: ఒకరు అన్నీ చేస్తామంటారు, చేస్తారు. లేక చేయలేకపోతారు. మరొకరు అసలు ఏది ముందు? అసలు చేయాలా? అన్న సందిగ్ధంలో ఇరుక్కుని సమయం జారిపోతుంటే చూస్తూ ఉంటారు. ఇక మూడవ రకం వారు, మా పద్ధతి వేరు అంటారు. నేను పట్టుకున్నానంటే, పని ముగిసినట్లే అంటూ, మరీ నమ్మకంతో, ఒకటికన్నా ఎక్కువ పనులను ఒకేసమయంలో చేయాలనుకుంటారు. ఒకపొయ్యి మీద కూర ఉంటుంది. మరో పొయ్యిమీద పాలుంటాయి. ఒకదాన్ని పట్టించుకునే లోపల మరొకటి పాడవుతుంది. ఈలోపల మూడవపని తగిలితే, ఈ రెంటినీ వదిలేసి అటు వెళ్లిపోతారు. మొదటి రకంలాగా, అన్ని పనులూ తలకెత్తుకోరు గానీ, ఎత్తుకున్న పనులమీద సరైన శ్రద్ధ, ధ్యాస లేనందుకు వీళ్లు బాధపడతారు. పెడతారు!

ఇదుగో- ఇది అయింతరువాత: పని చేయక తప్పదు. కానీ, ఇప్పుడే చేయకపోతే కొంప మునగదు. చేతిలో పని పూర్తి కానిదే, మరో పని మొదలు పెట్టడం ఎందుకు, అనుకుంటే, నిజానికి అది మంచి పద్ధతి. కానీ, ఈ వాయిదా వారలకు చేతిలో పని ఒక మానాన తెమలదు. ఎందుకంటే ఆ తర్వాతి పని చేయడం, ఇష్టం లేదు గనుక. పని నచ్చకున్నా, కష్టమయినదయినా, దాన్ని పక్కన పెట్టడం, దాటవేయడం కొందరికి అలవాటు. దీంతో అందరికీ చిక్కే. ‘ఇది చాలా ముఖ్యమయిన విషయం!’ అని దాన్ని సొరుగులో దాచే అలవాటు చాలామందికి ఉంటుంది. ముఖ్యమయిన విషయాన్ని వీలయినంత త్వరగా తేల్చాలి. దాచితే అది మురుగుతుంది! ఆలస్యమయిన కొద్దీ, ముఖ్యం పోయి, అది సమస్యగా మారుతుంది. ఆ తరువాత ఒత్తిడిలో సరయిన నిర్ణయాలు కుదరవు. ఏది ముఖ్యం, ఏది ముందు తేల్చుకుని పని చేయగలిగితే సమస్య ఉండదు.

గజిబిజి: బాగా పనిచేసేవారి ముందు, పనికి సంబంధించిన కాగితాలు గానీ, మరో రకం వస్తువులు గానీ, చిందర వందరగా, కుప్పలుగా పడి ఉంటాయి. అందులోంచి ఏం కావాలన్నా వాళ్లకు సులభంగా దొరికినంత వరకు సమస్య లేదు.

అన్నీ జరుగుతున్నట్లే ఉంటాయి. ఏ ఒక్క సంగతి గురించి అడిగినా ఇక వెతుకులాట మొదలవుతుంది కొందరికి. ఇప్పటివరకు ముచ్చటించుకున్న నాలుగు రకాలలో మొదటి యిద్దరూ, ఈ అయిదవరకంలోకి జారుకునే ప్రమాదం ఉంది. అప్పుడిక ఏ పనీ ముందుకు సాగదు. తయారయిన గజిబిజి, మిగతా వారిని కూడా చికాకు పెడుతుంది.

ఇలాంటివారు, ఒకటి, అరా పని బాగా చేసినా, చేసినట్లు భావించినా ఎవరికీ సంతృప్తి ఉండదు. అందుకే పనుల వీలును గుర్తించడం, సమయం, వరుస నిర్ణయించడం, అవసరాన్ని గుర్తించి ఒక పద్ధతిగా పని చేయడం అలవాటు చేసుకోవాలి.
ఇదేదో వినడానికి బాగుంది, చేయడానికి ఏమీ మిగలని ఉపన్యాసం లాంటి వ్యవహారం కాదు. అందరమూ, ఇంట్లో, పనిలో అనుసరించడానికి వీలయ్యే వ్యవహారమే మరి!
....................................................
క్రమశిక్షణ
* అన్నీ సరిగ్గా ఉన్నాయా అని అఢపాదడపా చూడడం తప్పేమీ కాదు. అసలు మీకు అట్లా చూడాలని అనిపించడమే మంచి లక్షణం. అదొక్కటే పనయితేబాగుండదు. కానీ, ఒక పద్ధతిలో జరుగుతుంటే, అందరూ మీ మీద ఆధారపడే రోజు వస్తుంది. అనుమానం, అవసరం వచ్చిన వారంతా మిమ్మల్నే అడుగుతారు ‘ఏమిటి పరిస్థితి?’ అని!
* తప్పు చేసినట్లు అర్థమయితే, నిజంగానే బాధకలుగుతుంది. కొంతకాలం వరకు అదే మెదడులో తిరుగుతూ ఉంటుంది. నిక్కచ్చిగా, లెక్కగా ఉండటం అలవాటయితే చాలామంచిదే. కానీ, తప్పు చేసిన భావంలోనుంచి బయటపడి, సర్దుకుని ముందుకు నడవడం కూడా నేర్చుకోవాలి.
పనుల్లో ఒక చక్కని వరుస క్రమాన్ని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. వాటిని తు.చ తప్పక పాటించడం అలవాటవుతుంది. మనం, ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తామన్నది మనకే కాదు, చుట్టూవున్న వారందరికీ తెలిసిపోతుంది. అప్పుడు మన పనీ, వారి పని కూడా సులభమవుతుంది!
...........................................
అసలు మాట

గతంలో మనుషుల మధ్య వెట్టిచాకిరీ చేసే బానిసలుండేవారు. రానున్న కాలంలో మరి మర మనుషులు ఉంటాయి. తేడా లేదు!
-ఎరిక్ ఫ్రామ్
మనం మాత్రం బానిసలు కావద్దు. మర మనుషులమూ కావద్దు. మన బతుకు మన అవసరాల ప్రకారం సాగితే సుఖం!

మంచీ - చెడూ!

ముల్లా నస్రుద్దీన్‌కు కొంతకాలం బోలెడంత మంది శిష్యులుండేవారు. అస్తమానం ఏదో ఒకటి అడుగుతూనే ఉండేవారు. వాళ్లకు జవాబులు చెప్పడం ముల్లాకు అలవాటయింది.
‘అందరూ మిమ్మల్ని మంచివాళ్లంటున్నారు. అలాగని మీరు మంచి వాళ్లేనా?’ అడిగాడొక శిష్యుడు.
‘అలాగేమీ కానవసరం లేదు!’ అన్నాడు ముల్లా.
‘అందరూ మిమ్మల్ని చెడ్డవాడంటే, మరి మీరు చెడ్డవారి కిందకు లెక్కవుతారా?’ అడిగాడు అదే శిష్యుడు
‘అలాగేమీ కానవసరం లేదు!’ అన్నాడు ముల్లా.
శిష్యునికి యింతకూ మంచి చెడుల తీరు తెలియలేదు. గురువుగారిని వివరించమని వేడుకున్నాడు.
‘మంచివాళ్లందరూ నన్ను మంచి వాడంటే, నేను మంచివాడిని. చెడ్డవాళ్ళందరూ నన్ను చెడ్డవాడు అన్నారనుకో! అప్పుడు కూడా నేను మంచి వాడినే అవుతాను’ అన్నాడు ముల్లా.
శిష్యుడు తికమకగా గురువు వేపు చూచాడు. నస్రుద్దీన్‌కు కూడా కొంచెం తికమకగానే అనిపించింది. అతనొక నిమిషం ఆలోచించాడు. ఆలోచన రాక గడ్డాన్ని గోక్కున్నాడు కూడా.
‘అసలు సమస్య మరొకటి ఉందోయ్! ఇంతకూ ఈ అనే వాళ్లు ఉన్నారు గదా! వాళ్ళలో ఎవరు మంచివాళ్లు, ఎవరు చెడ్డవాళ్లు తేల్చి చెప్పడం మాత్రం పెద్ద చిక్కు!’ అన్నాడు ముల్లా.

-ముల్లా నస్రుద్దీన్ కథలు నుంచి