Saturday, September 24, 2016

నిప్పు చెప్పే నిజాలు




నిప్పు జీవంగలది. అది శ్వాసిస్తుంది, అందిన దాన్ని తింటుంది, అసహ్యించుకుంటుంది. మంటను గెలవాలంటే మనమూ దానిలాగే మెలగాలి. దానిలాగే ఎటుపడితే అటు కదలాలి. మండే పదార్థాలు ఉన్నాయని మంటకు తెలియదు. మంట ఉందని మండే పదార్థాలకు తెలియదు. మంట, నిప్పు కలిసి మన ప్రపంచాన్ని మార్చేశాయి. ఒకానొక సినిమాలో ఒకానొక పాత్ర అన్న మాటల ఆధారంగా.
* * *
చుట్ట వెలిగించడానికి చెన్నయ్య చెకుముకి రాయి కొట్టేవాడు. పొయ్యి వెలిగించడానికి పెద్దమ్మ పక్కింటి నుంచి పిడక మీద నిప్పు తెచ్చేది. అప్పుడు అగ్గిపెట్టె, కిరోసిన్ నూనె వచ్చి పద్ధతి మార్చాయి. అగ్గిపుల్ల ఎక్కడ గీచినా మండేది. ఓ సినిమాలో క్రూరుడయిన విలన్ ఎదుటి వాడి బట్టబుర్ర మీద పుల్లగీరి దాంతో చుట్ట వెలిగించుకోవడం చూచాను. అది తెలుగు సినిమా మాత్రం కాదు. అగ్గి పుల్లలను అంత క్రూరంగా ఉండని పద్ధతికి మార్చి భద్రత గలవి అని పేరు కూడా పెట్టారు. అగ్గిపెట్టెల మీద సేఫ్టీ మ్యాచెస్ అని ఉంటుంది. కనీసం ఈసారయినా గమనించి చూడండి. అదీ మీకు అగ్గిపెట్టె దొరికితేనే. ఇక ఆ తర్వాత కరెంటు వచ్చి కాలానే్న మార్చింది. ఇప్పుడు నిప్పు, పొగ, వేడి ఏదీ లేకుండానే మైక్రోవేవ్‌లో వంట జరుగుతోంది. మంటలేదు గానీ వంట మాత్రం అలాగే ఉంది. ఇంతకూ వంట, మంట ఎప్పుడు మొదలయ్యాయనేది అసలు ప్రశ్న.
తొలి రోజుల్లో మనిషి తెచ్చుకున్న కాయలు, పళ్లు గానీ వేటాడిన జంతువును గానీ పచ్చిగానే తినేవాడు. కాల్చి తినడం ఆ తర్వాత అలవాటయింది. చిన్నప్పుడొక కథ విన్నట్లు గుర్తు. తెచ్చిన మాంసం లేదా జంతువు అలా ఉండగానే అనుకోకుండా ఒకసారి అగ్నిప్రమాదం జరిగిందట. మంట ఆరిన తర్వాత జంతువేమయిందో వెదుకుతూ మనిషి ఉడికిన మాంసంలో వేలు పెట్టాడు. చురుక్కుమంది. అనుకోకుండా వేలిని నోట్లో పెట్టుకున్నాడు. మాంసం రుచి మారింది. బాగుంది కూడా! అలా తిండిని కాల్చి తింటే బాగుంటుందని తెలుసుకున్నారంటారు. ఇలాంటి కథలు, కథలుగా కూడా నిజంగానే వినిపిస్తాయి. అప్పట్లో అంటే ఆదిమానవుని కాలంలో ఏం జరిగిందీ అన్నది ఊహించి చెప్పవలసిందే తప్ప అందుకు ఆధారాలు లేవు కదా! కనుక కథకూ, సత్యానికి మధ్యన అంత తేడా లేదు.
పది లక్షల సంవత్సరాల క్రితం ‘హోమో ఎరెక్టస్’ అనే నిటారుగా నిలబడిన మానవులు వంటకు, వెలుగుకు ఇతర అవసరాలకు మంటను వాడుకున్నారని ఒక వాదం. రెండు లక్షల సంవత్సరాలకు ముందు మానవుడు అగ్నిని తన అవసరాలకు వాడుకున్న గుర్తులేవీ, కనిపించడం లేదంటారు మరి కొందరు పరిశోధకులు. అంటే, అప్పటికి ‘హోమో సాపియోన్స్’ అనే మనలాంటి మనుషులు వచ్చేశారు. అంతకు ముందు మనుషులకు వంట తెలియదంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. ఆ ఆశ్చర్యాన్ని కొంచెం తగ్గించే ఆధారాలు కొన్ని సంవత్సరాల క్రితం ఫ్రాన్సులో దొరికాయి. 4,65,000 సంవత్సరాల నాటిదిగా గుర్తించిన ఒక మానవ ఆవాస ప్రదేశంలో పొయ్యిలా మండిన చోటు ఒకటి దొరికింది. లెక్కలో ఎంత తప్పు ఉన్నా 65 వేల సంవత్సరాలకన్నా అటూ ఇటూ కావడానికి వీలులేదంటున్నారు పరిశోధకులు. అంటే నాలుగు లక్షల ఏళ్లనాడే మనుషులు పొయ్యి పెట్టి వంట చేసుకున్నారని భావం. ఆ కాలానికి నేడున్న మనలాంటి మానవ జాతి ఆవిర్భవించలేదు. నిటారు మనుషుల కాలమే అది!
ఎలెక్ట్రాన్ స్పిన్ రెసొనాన్స్ అనే పద్ధతితో ఎక్కువ వేడయిన క్వార్ట్‌జ్ వయసు గుర్తించడం వీలవుతుంది. గులకరాళ్లు, మట్టిలో ఈ క్వార్ట్‌జ్ ఉంటుంది. పొయ్యిలో నుంచి రాళ్లను, మట్టిని తీసి చూస్తే అవి లక్షల ఏళ్ల నాటివని తెలిసింది. మొదటి పరిశీలనలోని రాళ్లు 3,80,000 సంవత్సరాల నాటివి. అక్కడే పురాతత్వ పరిశోధన కోసం జరిపిన తవ్వకాలలో మరింత లోతున మరో పొయ్యి కనిపించింది. అందులోని రాళ్లను పరీక్షిస్తే అవి 4,65,000 నాటివని తెలిసింది. అయితే మానవులు ఆ కాలంలోనే మంటను వాడుకున్నారని చెప్పడానికి ముందు పరిశోధకులు ఒకటి రెండు సంగతులను తేల్చి చెప్పాల్సి ఉంటుంది. అందులో ఒకటి కాలం నిర్ణయించడానికి వాడుతున్న డేటింగ్ పద్ధతుల్లో పొరపాటు లేదని, రెండవది పరీక్షించిన రాళ్లు నిజంగా ఒక ‘పొయ్యి’లోవని, ఏదోవేరు రకంగా గురయినవి కావని తేలాలి!
పరిశోధనలో ఎప్పటికీ పొరపాట్లే జరుగుతాయంటే అన్యాయం. అలాగని పొరపాటు జరగవనడానికి కూడా లేదు. ఇక్కడ మరొక కథ గుర్తుకు వస్తుంది. ఇద్దరు గప్పాల రాయుళ్లు ముచ్చటాడుతున్నారట. ‘మా ఇంట్లో బావి కోసం వంద అడుగులు తోడితే, ఆ లోతులో తీగలు దొరికినయి. అంటే వెనకట మనవారు టెలిఫోను వాడుకున్నారనే గదా అర్థం!’ అన్నాడు మొదటి గప్పాలాయన. రెండవ ఆయన అందుకుని ‘మా ఇంట్లో నిజానికి రెండు వందల అడుగులు తోడినా ఏ తీగా దొరకలేదు. అంటే అప్పట్లో వారు వైర్‌లెస్, సెల్‌ఫోన్ వాడుకున్నారనేగా అర్థం!’ అన్నాడు. ఫలితాలను అందుకోవడం ఒక ఎత్తు. వాటిని అన్వయించి చెప్పడం మరో ఎత్తు! వేడెక్కిన రాళ్ల వయసు నిర్ధారించడానికి వాడే పద్ధతి గట్టిదే. అయితే అందులో అయిదు లక్షలకన్నా ఎక్కువ సంవత్సరాల వివరాలు తెలియడం కష్టం. పరిశీలిస్తున్న ఈ రాళ్లు ఇంచుమించు పరీక్షా పద్ధతుల అంచులను తాకుతున్నాయి. అలాంటి ఫలితాలను నమ్మడం కొంచెం కష్టమే. అందుకే పరిశోధకులు రాళ్లను థర్మోల్యుమినిసెన్స్ అనే మరో పద్ధతిలో కూడా పరీక్షించే ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఒక సమస్య తీరుతుంది. సాధారణంగా ఏ విషయాన్నయినా అనుమానం లేకుండా నిర్ణయించాలంటే, ఒకటికన్నా ఎక్కువ పద్ధతులతో పరిశీలించడం, పరిశోధనలోనే కాదు, మన బతుకుల్లోనూ అలవాటే. డాక్టర్‌లు తాము చెప్పింది కాక, మరో డాక్టర్‌కు చూపించి మరో అభిప్రాయాన్ని తీసుకోవడం అనే ఒక పద్ధతి ఉండనే ఉన్నది కదా!
ఇక రెండవ సమస్య, రాళ్లు నిజంగా మనుషులు ఏర్పాటు చేసుకున్న నెగడు లేదా పొయ్యిలో నుంచి వచ్చినవేనా? లేక మనిషి ప్రమేయం లేకుండానే మంటకు గురయినవా? అడవులు తగలబడడం మామూలే. అది కాకున్నా ఒక ఎండిన చెట్టు తగలబడి ఉండవచ్చు. ఇటువంటి మంటకు, మనిషి వేసుకున్న పొయ్యి మంటకు తేడా తెలియడం కష్టం. అయితే ఫ్రాన్సు తవ్వకాల్లో దొరికిన పొయ్యిలు మాత్రం చాలాకాలంపాటు మండిన దాఖలాలున్నాయి. సహజంగా తగలబడిన వస్తువులేవీ ఇంతకాలం మండవు.
హోమో ఎరెక్టస్ కాలంలోనే మంటను, నిప్పును వాడుకున్నారనేది నిర్ణయమయితే మానవజాతి పరిణామ చరిత్ర కొంచెం మారుతుంది. నిప్పు, చక్రం, వ్యవసాయం మానవ జాతి చరిత్రలో ఎంతో ప్రాధాన్యం గల అంశాలు. అవి మనిషికి బ్రతుకు నేర్పించాయి. నిప్పు నియంత్రణ జీవితానికి గుర్తు, చక్రం సాంకేతిక పరిజ్ఞానానికి, ప్రగతికి ఆధారం. వ్యవసాయం సాంఘిక పద్ధతికి సామూహిక జీవనానికి, అన్నిటికీ మించి ‘స్వంత’ భావానికి మొదలు, వంట స్వంతం. ఫలసాయం స్వంతం. అది తన వారికే అందాలి. అంటే ఇతరుల నుంచి కాపాడుకోవాలి. నిప్పు మాత్రం సంఘానికి గుర్తుగా ఉన్నాలేకున్నా స్వంతం కానవసరం లేదు.
మన గురించి మనం తెలుసుకోవడంలో ఒక వింత ఆనందం ఉంది. మానవులు ప్రస్తుతం ఈ రకంగానే ఎందుకున్నారని ప్రశ్నిస్తే, జవాబులందడానికి ఇటువంటి వివరాలు మరెన్నో తెలియాలి!
ఝలక్: నాన్న ఒక అనుభవం చెప్పేవాడు. కొత్తగా మంటినూనె వచ్చిన రోజులు. మంటి నూనె అంటే నేల నుంచి తీసిన నూనె. అదేమిటో మీకు అర్థమయి ఉండదు. పెట్రోలును భూమిలోనుంచి తీస్తారు. మంచి నూనెను నువ్వులు, పల్లీలు అనే వేరుశెనగలు లాంటి వృక్ష సంబంధ పదార్థాల నుంచి తీస్తారు. అంతకు ముందు తెలిసిన నూనెలన్నీ అంతే. ఎందుకోగానీ ఆముదాన్ని నూనె అనలేదు. అది వేరే కథ గానీ, కెరోసీన్ తెచ్చుకొని మా ఊళ్లో ఒకతను ఆముదం దీపం పద్ధతిలో మట్టి మూకుడులో పోసి వత్తి వేసి వెలిగించాడట. వత్తి ఒకటే కాదు, మొత్తం దీపమంతా వెలగడం మొదలయింది. గ్యాసు నూనె బుడ్డీ దీపాలు వడిన వాండ్లకు ఈ సంగతి తెలుస్తుంది. పాపం ఆ మనిషి పెట్టిన మంటతో పూరి గుడిసె అంటుకున్నది. తాగి ఉన్నాడేమో ఆర్పడం గురించి కూడా ఆలోచన రాలేదు. ఇంట్లోని డప్పు తెచ్చుకుని దరువు వాయిస్తూ ఆ మనిషి ఇంటి ముందు నాట్యం చేశాడట. నాన్న ఈ సంగతి నవ్వకుండా చెప్పేవాడు.

Friday, September 23, 2016

కుటుంబం- మిత్రులు- దేశం

గుయెన్ ది బిన్ (ఆత్మకథ) -ఆకెళ్ళ శివప్రసాద్,
పేజీలు: 220,
వెల: రూ.150/-
నవచేతన పబ్లిషింగ్ హౌస్,
బండ్లగూడ,
హైదరాబాద్- 68
ఫోన్: 24224453/4
**

హోచిమిన్ అనే పేరుతో పరిచయంగల వారికి ఈ పుస్తకం గురించి సులభంగా తెలుస్తుంది. ‘న్ గుయెన్ ది బిన్’ అనే వ్యక్తి వియెత్నాం దేశానికి ఒకప్పుడు ఉపాధ్యక్షురాలు. మామూలు కుటుంబంలో పుట్టిన ఈమె స్వయంకృషితో గొప్ప నాయకురాలుగా ఎదిగింది. 1995లో చైనాలో జరిగిన ఐక్యరాజ్యసమితి వారి సమావేశాలు తరువాత ఆమె పేరు ప్రపంచమంతటా మారుమోగింది. ‘కుటుంబం- మిత్రులు -దేశం’ అనే శీర్షికతో ఆమె ఆత్మకథ (400 పుటలలో) వస్తున్నదంటే హోబిమిన్ నగరంలో 2012 జూన్‌లో పెద్ద సంచలనం జరిగింది. అందరూ ఆమెను చూడాలని, పుస్తకం చదవాలని గుంపులుగా వచ్చారు. పుస్తకాన్ని ఇంగ్లీషులోకి అనువదించి ప్రచురించారు. ప్రస్తుతం అది తెలుగులో వచ్చింది.

గుయెన్ (సౌలభ్యంకొరకు ‘న్’ను వదిలేశారు) బాల్యం విశేషాలు, తిరుగుబాటు ఉద్యమంలో ఆమె పాత్ర, చివరికి ప్రభుత్వ అధికారిణిగా బాధ్యతలు చేపట్టడం లాంటి విశేషాలన్నింటినీ ఆమె కథల ధోరణిలో చక్కగా వివరించారు. 1973లో సంతకాలు జరిగిన పారిస్ శాంతి ఒప్పందంలో తమ దేశం బృందానికి ఆమె నాయకురాలుగా వెళ్లడంతో కథ తారస్థాయికి చేరుకుంది.

85 సంవత్సరాలలో చెప్పుకోవలసిన విశేషాలు ఎన్నో ఉన్నాయి. కనీసం వాటిని గురించి నోట్స్ రాసుకునేందుకు కూడా వ్యవధి లేదు. అయినా ఆ పెద్దవయసులో ఆమె ఈ రచనను అందించింది. దేశం స్వతంత్రంకొరకు జరిపిన పోరాటం గురించి ఆమె ఎంతో రాశారు. స్వతంత్రం తరువాత జీవితం ప్రశాంతంగా సాగిందని కూడా వివరిస్తారు. పోరాటం గురించి ఆమె వెలువరించిన భావాలు, అలనాటి యువత భావాలకు ప్రతీకలని సులభంగానే అర్థమవుతుంది. పటిష్టమయిన దేశాన్ని నిర్మించాలంటే చక్కని వ్యక్తిత్వం, ఆత్మగౌరవం, ఆదర్శాలుగల నమ్మకమయిన ప్రజల భాగస్వామ్యం అవసరం అంటారు గుయెన్.

ఈ రకం రచనలు ఇంగ్లీషులోకి రావడమే ఒక విచిత్రం. అనువాదం అనుకున్నంత సులభంగా కుదరదు. ఆ అనువాదం నుంచి తెలుగు రచన రావాలంటే అది మరొక ప్రయత్నం. అందుకు పూనుకున్న అనువాదకునిది గట్టి ధైర్యమే. అయితే విషయం, వాతావరణం, ఆయా దేశాలు, సంఘటనల గురించి అవగాహన ఉంటే, అనువాదం మరింత సులభంగా ముందుకు సాగేది. ‘ఎండలు విరగకాసేవి’లాంటి మాటలు, వింతగా రాసిన పేర్లు, మొత్తానికి అనువాదం మరింత బాగా ఉండవచ్చును అనిపిస్తుంది.
అనువాదం తరువాత, అర్థం చెడకుండా, భాషను చక్కబెట్టడం అవసరం!
- కె. బి. గోపాలం

Sunday, September 18, 2016

కథ చెపుతాను.. ఊ కొడతావా

వెయ్యి గొంతుల మధ్యన కూడా తెలిసిన గొంతు వెంటనే వినిపిస్తుంది. ఇష్టమున్న గొంతు మురిపిస్తుంది. - ఎవరన్నారో తెలియదు.
* * *

చాలామంది కథలు రాస్తారు. కానీ నిజానికి కథలు చెప్పడం అసలు పద్ధతి. పురాణం అన్నా, హరికథ అన్నా కథ చెప్పడమే. ఇక జానపద పద్ధతిలో జముకుల కథ, బయిండ్ల కథ, బుర్రకథ లాంటివి ఎన్ని చెప్పినా కథ చెప్పడమే కానీ ముందు రాసుకుని దాన్ని నోటికి నేర్చుకుని చెప్పే పద్ధతి లేనే లేదు. చుక్క సత్తయ్య ఒగ్గు కథ గురించి అందరికీ తెలుసు. తెలియని వాళ్లకు నమస్కారం. ఎన్ని కథలు చెపుతావు అని అడిగితే దండకంలాగ బోలెడన్ని పేర్లు ఒక లయలో చెప్పేసేవాడు. వాటన్నిటికీ పుస్తకాలు లేదా వ్రాతప్రతులు ఉన్నాయని అనుకునే వాళ్లకు నిరాశ ఎదురవుతుంది. సత్తయ్యకే కాదు, జానపద కథలు చప్పే వాళ్లకు ఎవరికీ ఒక స్క్రిప్టు ఉండదు. వాళ్లకు కథ తెలుస్తుంది. గతంలో తమ వంటి వారు చెప్పిన తీరు విని ఉంటారు. కనుక ఎప్పటికప్పుడు కథను తమ లయలో మాటలను పేరుస్తూ అందంగా చెప్పేస్తూ ఉంటారు. పురాణానికి పుస్తకం ఉంటుంది. హరికథకు కొంతవరకు ఒక రాత ప్రతి ఉంటుంది. కనీసం పాటలకయినా ప్రతి ఉంటుంది. మాటలకు మాత్రం కథకుల కౌశలాన్ని బట్టి ఎప్పటికప్పుడు కొత్త రూపం వస్తుంది.

మా ఇంట్లో బుడ్డన్న పనిచేసేవాడు. పాతకాలం పద్ధతిలో చెప్పాలంటే అతను మా జీతగాడు. వ్యవసాయం పనులను అన్నింటినీ తానే చేస్తుంటాడు. అవసరం కొద్దీ మిగతా వాళ్లు ఎప్పటికప్పుడు రోజు కూలీకి వస్తారు. బుడ్డన్న మాత్రం సంవత్సరమంతా మాతోనే ఉంటాడు. అట్లా అతను కొన్ని సంవత్సరాలపాటు మాతో ఉన్నాడు. నేను ప్రేమగా ‘బుడ్డడు’ అని పిలుచుకునే మా బుడ్డన్న గొప్ప గాయకుడు. ఆ సంగతి వానికి తెలియదు. ఆ కాలంలో నాకు అంతకన్నా తెలియదు. రేడియోలో వారు జానపద సంగీతాన్ని సేకరించి, దాన్ని లలిత సంగీతం వాళ్లచేత పాడించడం అప్పట్లో పద్ధతి. అది అన్యాయమని నాకు తరువాత అర్థమయింది. ఇప్పుడు కొన్ని టీవీ ఛానళ్లలో జానపద సంగీతాన్ని జానపదుల చేతే పాడిస్తూ ఉంటే నాకు బుడ్డన్న గుర్తుకు వస్తాడు. అయితే బుడ్డన్న గురించి చెపితే శాఖా సంక్రమణం అవుతుంది. నిజానికి వాని తమ్ముడు అడివన్న. వాడు నాకంటే వయసులో చిన్నవాడు. కనుక నాకు వాడు దోస్తు. వాడు మా పశువులను కాసేవాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన తరువాత అప్పుడప్పుడు నాతో కబుర్లతో గడిపేవాడు. వాడు కథల పుట్ట. ఎన్ని కథలు ఎంత బాగా చెప్పాడో గుర్తుకు తెచ్చుకుంటే నాకు కళ్లకు నీళ్లొస్తాయి. నీళ్లెందుకు? పాపం అడివన్న ఇప్పుడు లేడు. వాడు ఉంటే కూచోబెట్టి కథలు చెప్పించి పుస్తకాలకు, పత్రికలకు వాడి పేరుననే ఎక్కించేవాడిని కాదా? అది నా బాధ. అది ఇప్పుడు వీలుకాదు.

నేను కథలు రాయకూడదని నిర్ణయించు కున్నాను. వ్యాసాలు, అందునా సైన్స్ వ్యాసాలు రాయాలన్నది నా నిర్ణయం. అయినా సరే, ఆ వ్యాసాలలో నా రాత తీరు మాట్లాడుతున్నట్టే ఉంటుందని చాలామంది నాకు చెప్పారు. ఆ తరువాత నాకు కూడా ఆ విషయం తలకెక్కింది, అర్థమయింది కూడా. మనం ప్రపంచానికి చెప్పదలుచుకున్న సంగతిని మాటలతోనే చెపుతాము. ఆ మాటలను, పాటలను, రచనలను కనిపించే అక్షరాల ద్వారా అందించడం చాలా తరువాత వచ్చింది. కొంతమంది మాత్రమే కలం పట్టుకుని కూచుంటే, మాట తీరున కాకుండా మరో రకంగా రాస్తారు. ఆ రచన చదువుతుంటే రచయిత చెపుతున్న భావం వినిపించదు, కనిపించదు. రాతలో కనిపించిన అక్షరాలు శిలా శాసనాలయితే బాగుంటాయి. కథలు, కవితలయితే అవి చెప్పినట్టుగా ఉంటేనే బాగుంటాయి.

కొంతమంది ఉపన్యాసం చెప్పినా, ముందు రాసుకుని చెపుతున్నట్టు ఉంటుంది. అది బాగుండదు అనడానికి లేదు. చెప్పే తీరును బట్టి అది కూడా ఆకర్షణీయంగా ఉండవచ్చు. వేలుక్కుడి కృష్ణన్ అని ఒక తమిళ పండితుడు గొప్పగా ప్రవచనాలు చెపుతాడు. గంటలు మాట్లాడినా ఆయన ప్రవచనంలో అనవసరమయిన మాటలు గానీ, చెప్పిందే మళ్లీ చెప్పడంగానీ ఉండదు. మొదట్లో నాకు ఆయన పద్ధతి గొప్పగా ఉందనిపించింది. రానురాను అది కొంచెం బిగిసుకుపోయిన పద్ధతేమో అని అనిపించసాగింది. ఇక మరి కొందరు ఉపన్యాసం చెపితే ‘ఎందుకు చెపుతున్నాననంటే అండీ’ అంటూ మరీ పిచ్చాపాటి పద్ధతికి దిగుతారు. చెప్పిందే మళ్లీ చెప్పడం గురించి మళ్లీ మళ్లీ చెప్పడం ప్రస్తుతం అప్రస్తుతం. చెప్పవలసిన విషయాన్ని మరీ మనసు కెక్కించాలంటే ఒకసారి పునశ్చరణ చేయాలని పద్ధతి ఉందిగానీ అదే పనిగా రుబ్బుతూ ఉంటే దాన్ని పిండి పిసకడం అంటారు. ఈ మధ్యన పురాణాలు, ప్రవచనాలు వింటూ ఉంటే నాకు ఈ సంగతి క్షణక్షణం గుర్తుకు వస్తుంది. కథ ముందుకు సాగదు, విషయం బయటకు రాదు, మాటలు మాత్రం సాగుతూ నే ఉంటాయి.

ఇంతకూ ఈ విషయం ఎత్తుకుని ఎందుకు చెపుతున్నాను అని నన్ను నేనే ప్రశ్నించుకుంటాను. ఇన్నాళ్లుగా రాస్తున్నాను గానీ నన్ను ఎవరయినా రచయిత అంటే, ఒక్క క్షణం నాకు ఆశ్చర్యం అవుతుంది. నేను రాయడం లేదు, నాకు తెలిసిన సంగతులను, అర్థమయిన సంగతులను మళ్లీ చెపుతున్నాను. ఈ చెప్పడంలోని అనుభవం అది రాసే వాళ్లకు తెలిసినట్టే చదివే వాళ్లకు కూడా తెలుస్తుంది. గ్రాంథికంగా, లేకున్నా సరే పడికట్టు పద్ధతిలో రాసిన మాటలు చదువుతుంటే ఊపు ఉండదు. అందులో రచయిత గొంతు వినిపించదు. ఈ గొంతు అన్న మాటను అందరూ పట్టుకోవాలని నాకు గట్టి నమ్మకం. పుస్తకం చేతికి ఎత్తుకుంటే పేజీలో అక్షరాలు కాక, టీవీ తెర మీదలాగ ఆ విషయం చెప్పిన మనిషి కనిపించాలి. అక్షరాలు ఆయన మాటలయి వినిపించాలి. విశ్వనాథ సత్యనారాయణ గారి పద్ధతిలో అందరూ రచనలు చేసి ఉండకపోవచ్చు. ఆయనకు కూచుని రాయడం అలవాటు లేదట. ఆయన చెపుతూ ఉంటే పక్కన మరెవరో కూచుని రాసేవారట. పుట్టపర్తి వారి గురించి కూడా ఇదే మాట విన్నాను. వాళ్ల రచనల్లో మాటల ధోరణి వినిపించిందంటే ఆశ్చర్యం లేదు. అందరు రచయితలు అట్లా డిక్టేటర్స్ కాదు. ఎవరికి వారు కూచుని రాసుకున్నారు. ఈ మధ్య వరకు నేను కూడా అదే పద్ధతి. అయినా సరే తమ గొంతు పాఠకులకు వినిపించేలా రచయితలంతా రాయడానికి ప్రయత్నం చేశారు. చాలామంది ఆ పనిని విజయవంతంగా చేయగలిగారు.
సులభంగా అర్థం కావాలంటే ఒక చిన్న ప్రయత్నం చేద్దాం. వార్తాపత్రికను ఒకదాన్ని ఎత్తుకుని ఏ అంశాన్నయినా తీసుకుని చదివి చూడండి. వార్తలలో వ్యక్తి కనిపించకూడదు. కేవలం విషయం కనిపించాలి. కాబట్టి దాన్ని బొటాబొటిగా రాస్తారు. వ్యాఖ్య అయితే వెంటనే రాసిన మనిషి గొంతు వినిపిస్తుంది.

రచయితలందరూ మంచి మాటకారులు కాదు, బాగా ప్రసంగాలు చేయగలిగిన వారందరూ కూడా రాయలేకపోవచ్చు. ఇందుకు కారణం వారి గొంతు. కలం పట్టుకుని కూచుంటే గొంతులో గుండె వచ్చి ఇరుక్కుంటే రచన ముందుకు సాగదు. ఎదురుగా ఎవరో కూచున్నారని ఊహించుకుని వాళ్లకు చెపుతున్నట్టు రచన మొదలుపెడితే అది చాలా సులభంగా జరుగుతుంది. అడివన్న కథ చెపుతూ ఇంచుమించు అక్కడ ప్రత్యక్ష పురాణం పద్ధతిలో సీన్‌ను సృష్టించేవాడు. డైలాగు చెపితే దాన్ని రాసిన అక్షరాన్ని ఏ భావమూ లేకుండా చదివినట్టు చెప్పామనుకోండి అర్థం ఉండే మాటలు కూడా అర్థం లేనట్టు కనిపిస్తాయి. ‘అయ్యో! అంత పని జరిగిందా?’ అనే ఒక డైలాగును మా కుటుంబమంతా కలిసి ఒకనాడు టీవీలో విన్నాము. ఆ చెప్పిన అమ్మాయికి చేతులెత్తి నమస్కరించాలి. భావం ఏ మాత్రం పలకకుండా ఆమె చెప్పిన పద్ధతిలో ఆ డైలాగు చెప్పాలని మా ఇంట్లో వాళ్లమంతా ఇవాళటికీ పోటీ పడుతుంటాము. గొంతు! అచ్చు అక్షరంలో కూడా గొంతు! దాన్ని గురించి కాసేపు ఆలోచించండి. అప్పుడు నేను కథ చెపుతాను. మరి ఊ కొడతారా?
ఝలక్: చాలామంది ముందు కవిత రాసుకుని దాన్ని కవి సమ్మేళనంలో వినిపిస్తారు. నాకు తెలిసిన కొందరు చెప్పవలసినదంతా ముందు చెప్పేసి అప్పుడు దాన్ని అచ్చు రూపంలోకి మారుస్తారు. నేను కూడా ఇదే పద్ధతి పాటిస్తున్నాను. ఈ నాలుగు మాటలను కూడా నేను కలంతో రాయలేదు.

Saturday, September 10, 2016

మా ఊరు

........................................................
ఊళ్లో ఒక ఆంజనేయుని గుడి ఉన్నది. దాన్ని చిన్నప్పటి నుంచి హనుమాండ్ల గుడి అనడం అలవాటు. నేను కనీసం హ అనే అక్షరం వాడాను. మా ఊరి వాండ్లకందరికీ అది అన్మాండ్ల గుడి మాత్రమే. నాకు తెలిసి అందులో నిత్యం ధూప దీపం నడిచేది కదా. ఊళ్లో మాకున్న కొద్దిపాటి పొలం ఇనాం భూమి అని చెప్పారు. ఏం చేయడానికి ఆ ఇనాం ఇచ్చారో నా వరకు రాలేదు. ఆ గుడిలో దీపం పెట్టే బాధ్యత మాత్రం మాది కాదని, ఆ బాధ్యత ఎవరికీ లేదని అనుభవం వల్ల నాకు తెలిసింది. నేను చదువు పేర ఊరు వదిలి బయటకు వచ్చిన తరువాత ఆ గుడిని మరమ్మతు చేయించారు. నిత్యం పూజలు చేయగల కుటుంబాలు ఊళ్లో లేవు.

......................................................
పేర్లు పెట్టడం అనేది ఒక గోకుడు. అది ఆ వస్తువును స్వంతం చేసుకోవాలన్న గోకుడు లాంటిదే - ఎడ్వర్డ్ ఆబి
* * *

ఎప్పుడో ఒకసారి చెప్పడానికి ఏముంది అని ఓ కవిత రాశాను. ‘అందరితో కలిసి ఉంటున్నందుకు నేను ఉన్నాను’ అన్నాను. కనుక ప్రత్యేకంగా చెప్పడానికి ఏం లేదని కూడా అన్నాను. కానీ మనసు మారినట్టుంది, చెప్పడానికి చాలానే ఉంది అని కూడా అన్నాను. చెప్పదలచుకుంటే ఎంతయినా చెప్పవచ్చు. మూడు సంవత్సరాల నుంచి లోకాభిరామం పేరుతో చాలా సంగతులు చెపుతున్నాను. పెద్దలు, పిన్నలు, తెలిసిన వాళ్లు, తెలియని వాళ్లు చాలామంది బాగుందని కూడా అన్నారు. ఈ మధ్యన ఒకచోటికి వెళ్లవలసి వచ్చింది. అక్కడికి వచ్చిన చాలామందిలో నాకు పరిచయమున్న వాళ్లు నలుగురే. ఆ నలుగురితోనే నాలుగు మాటలు మాట్లాడి, మరో నలుగురితో పరిచయం చేసుకునే ప్రయత్నాలు చేసి చివరికి ఇంటి దారి పట్టే సందర్భంలో కళకళలాడుతున్న ఒక అమ్మవారు దగ్గరగా వచ్చారు. బాగా పరిచయమున్నట్టే పలకరింపులు కూడా లేకుండా ‘మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలండీ’ అన్నారు. ‘ఉన్నట్టుండి లోకాభిరామం వ్యాసాల్లో తెలంగాణం భాష ఎందుకని వస్తుంది?’ అని ఆమెగారి అనుమానం. అప్పుడు నాకు మా ఊరు మళ్లీ గుర్తుకు వచ్చింది. ఊరు గురించి, గతం గురించి, నా గురించి చెప్పినప్పుడంతా అలవాటుగా చిన్ననాటి నుంచి, నేటి వరకు ఇంట్లో మాట్లాడుకుంటున్న మాటల తీరు బయటికి వస్తుంది. అదే సంగతి ఆ అమ్మగారితో చెప్పాను. ఆవిడ నవ్వేసి వెళ్లిపోయారు. ఆలోగా నా వ్యాసాలను వాళ్లందరూ క్రమం తప్పకుండా చదువుతారని, అవెంతో బాగుంటాయని కూడా అభిమానం ఉట్టిపడే పద్ధతిలో చెప్పి మరీ వెళ్లారు. నాకు ఆనందమయిందా? ఏమో? అయ్యే ఉంటుంది!

మా ఊరు పేరు ఏనుగొండ. ఇంగ్లీషులో మాత్రం ‘వై’తో మొదలుపెట్టి రాస్తారు. మరిదాన్ని యేనుగొండ అనాలి కదా! కానీ అలా పలకడం అంత సులభంగా ఉండదు. కనుక అందరూ ఏనుగొండ అని మాత్రమే అంటారు. నన్ను ఇప్పటికీ మా వాండ్లందరు ఏనుగొండ గోపి అని మాత్రమే పిలుస్తారు. ఈ దేశంలో చాలా ఊళ్లున్నాయి. రాంపూర్ అనే ఊళ్లు మన దేశంలో 84 ఉన్నాయట. ఇది తపాలా శాఖ వారు చెప్పిన సమాచారం. నేను మాత్రం బల్లగుద్ది, మరి దేన్నయినా గుద్ది నమ్మకంగా చెప్పగలను, ఏనుగొండ అనే ఊరు మరొకటి లేదు. మా ఊరు పక్కనే పాల్కొండ లేదా పాలకొండ అనే ఊరు కూడా ఉంది. చారిత్రక ఆధారాలు తెలియవుగానీ, ఆ పాలకొండ నిజానికి పాలకుండ అని, మా ఊరేమో వెన్నకుండ అని పెద్దవాళ్లు చెప్పారు. ఆ పేర్లు రానురాను పాలకొండ, ఏనుగొండగా మారాయి. లోకాయపల్లి సంస్థానం అని ఒకటి ఉండేదట. ఆ సంస్థానం దొరలకు ఈ ఊళ్ల నుంచి పాలు, వెన్న అందేవట. ఇవన్నీ అట అన్న సంగతులేగానీ ఎంతవరకు నిజాలో నాకు తెలియదు. మా ఊరికి కొంతదూరంలో ఉన్న ఒకానొక గుట్టకు ఊరగుట్ట అని పేరు. దాని మీద ఒక విచిత్రమైన రాయి ఉంటుంది. మామిడికాయ ఆకారంలో ఉండే ఆ రాయి, ఎప్పుడు దొర్లి పడుతుందా అన్నట్టు ఒక పెద్దరాతి మీద కొంతమాత్రమే కింద రాతికి తగిలి నిలబడి ఉంటుంది. పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను, అది పడను మాత్రం పడలేదు. హైదరాబాద్ చుట్టూ ఇటువంటి రాళ్లను పరిశీలించే ఒక బృందం ఉంది. వాళ్లు మా రాతిని, మామిడికాయ రాతిని చూచింది, లేనిది తెలియదు.

ఏనుగొండ అనే మా ఊరు మొదట్లో ఆ గుట్ట కింద ఉండేదట. గుట్ట కింద అంటే గుట్ట ఉన్నచోట కాదు. దాని పక్కన అని అర్థం. అక్కడి నుంచి ఊరు రెండు అంచెలలో ప్రస్తుతం ఉన్నచోటికి వచ్చింది. ఇందుకు సాక్ష్యంగా గుట్ట ప్రాంతంలో, మధ్యలో ఉండే పొలాలలో తవ్వకాలు జరుగుతూ ఉంటే బూడిద, కాలిన మన్ను, కుండముక్కలు లాంటివి దొరికాయి. ఒకానొక పొలంలో ఏకంగా గణేశుని విగ్రహం దొరికింది. ఆ విగ్రహానికి ఎక్కడో ఒక చిన్న లోపం ఉన్నట్టు నేను గమనించాను. అవి నేను బడిలో చదువుకుంటున్న రోజులు. ఫలానా వాళ్ల పొలంలో దేవుడు దొరికాడు అని ఊళ్లో కలకలం మొదలయింది. అందరమూ కలిసి వెళ్లాము. గణేశుని విగ్రహాన్ని తవ్వి బండికి ఎత్తించి ఊళ్లోకి తెచ్చాము. అది భారీగానే ఉంది. దానికి పూజలు, పునస్కారాలు కూడా జరిగినట్టు గుర్తు. ఇటువంటి సందర్భాలలో నాన్న నిశ్శబ్దంగా ఉండేవాడు. ఊళ్లో బ్రాహ్మణ కుటుంబాలు రెండే రెండు. అందులో మాది ఒకటి. విగ్రహం దొరికినప్పుడు దాన్ని చూడడానికి నాన్న తప్పకుండా వచ్చి ఉండాలి. ఆయన వచ్చినట్టు నాకు గుర్తులేదు. తరువాత ఆయన ఒక సిద్ధాంతం చెప్పాడు. విగ్రహంలో లోపం ఏర్పడితే దాన్ని భూస్థాపితం చేయడం పద్ధతి అట. అట్లా చేసిన విగ్రహం ఏదో ఒక రకంగా మళ్లీ అందరి దృష్టికి వచ్చింది అని ఆయన అన్నారు. నాకూ నిజమే అనిపించింది. ఇన్ని సంవత్సరాల తరువాత ఆలోచిస్తే, ఆ విగ్రహం ఏమయింది అన్న ప్రశ్న నా మెదడులో ఇవాళ పుట్టింది. దానికి పూజలు ఎందుకు కొనసాగలేదు అన్న ప్రశ్న కూడా మనసులో తొంగి చూసింది. నేను ఈ మధ్యన మా ఊరికి వెళ్లడానికి కారణం కనిపించడం లేదు. ఈసారి వెళ్లి గణపతిని వెతకాలి.

ఊళ్లో ఒక ఆంజనేయుని గుడి ఉన్నది. దాన్ని చిన్నప్పటి నుంచి హనుమాండ్ల గుడి అనడం అలవాటు. నేను కనీసం హ అనే అక్షరం వాడాను. మా ఊరి వాండ్లకందరికీ అది అన్మాండ్ల గుడి మాత్రమే. నాకు తెలిసి అందులో నిత్యం ధూప దీపం నడిచేది కదా. ఊళ్లో మాకున్న కొద్దిపాటి పొలం ఇనాం భూమి అని చెప్పారు. ఏం చేయడానికి ఆ ఇనాం ఇచ్చారో నా వరకు రాలేదు. ఆ గుడిలో దీపం పెట్టే బాధ్యత మాత్రం మాది కాదని, ఆ బాధ్యత ఎవరికీ లేదని అనుభవం వల్ల నాకు తెలిసింది. నేను చదువు పేర ఊరు వదిలి బయటకు వచ్చిన తరువాత ఆ గుడిని మరమ్మతు చేయించారు. నిత్యం పూజలు చేయగల కుటుంబాలు ఊళ్లో లేవు. ఈ మధ్యన మరెవరో పై ఊరి పెద్ద మనిషి వచ్చి ఊళ్లో ఉంటున్నాడని, పౌరోహిత్యం సాగిస్తున్నాడని ఎవరో చెప్పగా విన్నాను. ఆయన ఏమయినా గుడిని పట్టించుకుంటున్నాడేమో తెలియదు.

కార్తీకమాసం వస్తే ఊళ్లో వాళ్లు రోజుకు ఒకరు చొప్పున కార్తీక పూజ అనే ఆకుపూజ చేయించేవారు. నాకే నమ్మకం కలగదు గానీ కొంతకాలం ఆ పూజలు చేసే బాధ్యత నా తల మీద పడింది. తెలిసిన కుటుంబాల వారు పొద్దునే్న సరంజామాతో వచ్చి ‘ఇవాళ కార్తీకం చెయ్యాలె! అన్మాండ్లకు చెండూరం పెట్టు, సాయంత్రం పూజ కూడ చేయించు’ అని అడిగేవారు. నాన్న ఎందుకో పౌరోహిత్యం చేయడు. కనుక నేను కాదనలేక పోయేవాడిని. సరంజామాలో సాహిత్యం ఉంటుంది. ఈ సాహిత్యానికి అక్షరాలకు సంబంధం లేదు. ఆ రోజున దేవుని నైవేద్యానికి, నా తిండికి సరిపడ బియ్యం, పప్పు, బెల్లం, కూరగాయలు లాంటివి కలిపితే దాని పేరు సాహిత్యం. సాహిత్యం అన్న మాటకు సరయిన అర్థమేమిటో ఇప్పటికయినా నేను వెతుక్కోవాలి. ఇక సింధూరం, నూనె కూడా ఉంటాయి. నూనె కలిపిన సింధూరాన్ని హనుమంతుని విగ్రహానికి పట్టించాలి. ఆ పని చేతులతోనే చేయాలి. చేతికి, గోళ్లలో పట్టిన రస సింధూరం నా శరీరానికి హాని కలిగిస్తుందని నాకు అప్పట్లో తెలియలేదు. తెలిసిన తరువాత ఎవరూ నన్ను కార్తీకం చేయించమని అడగలేదు. నేను అక్కడ ఉంటేగదా!

ఝలక్: ఈ ముక్క రాస్తూ ఇక్కడ ఆపాను. చిత్రంగా అనుకోకుండా మరునాడు మహబూబ్‌నగర్ అనే పాలమూరుకు వెళ్లాను. అదేదో జక్కడు జాతరకు పొయ్యొచ్చినట్టు, పాతి ముట్టిచ్చుకోని (అంటే ఏమో ఎవరికన్న తెలుసునా పోవలసిన చోటికి పొయ్యి, వంటల పొయ్యి కాదు, వెళ్లి, చేరి లాంటిదన్నమాట, దాన్ని తా వెనిక్కి వస్తే అది పాతి ముట్టిచ్చుకోవుడు) తిరిగి వచ్చిన నాకిప్పుడు ఏనుగొండలోకి పొయ్యే మనసు లేదు, సమయము అంతకన్నా లేదు. పోయేటప్పుడు తొందర, తిరిగి వచ్చేటప్పుడు అంతకన్నా తొందర. మొత్తానికి నాకొక చిత్రం అర్థమయింది. ఈ చిత్రము విచిత్రము గావచ్చును లేదా బొమ్మ గావచ్చును. పంచాయతి సమితిగా నాకు తెలిసిన మా ఊరు ఇప్పుడు, పట్నమయిన పాలమూరు అను మహబూబ్‌నగర్‌లోని ఒక వార్డు మాత్రమే.
ఊరి గుర్తింపు గంగలో పోయింది. అయినా సరే, మా ఊరి గురించి చెప్పుకోవలసిన సంగతులు నా మనసులో మాత్రం కావలసినన్ని ఉన్నయి.