Friday, September 27, 2013

నాకు సమ్మతమే

కొంత మంది నిత్యం రాస్తారట. నిత్యం ఆలోచనలు రావద్దూ. వాళ్లకు వస్తాయేమో. నిత్యం రాస్తే చెప్పనవసరం లేని సంగతులన్నీ ప్రపంచం ముందు ఉంచడమవుతుందేమోనని నా అనుమానం. ఒకనాడు, నేను లేనిదే ఈ ప్రపంచం ఎట్ల నడుస్తుంది అని అనుమానం వస్తుంది. కానీ క్షణం నిలబడి చూస్తే నీ గురించి పట్టించుకునే వారే లేరని అర్థమవుతుంది. ఒకనాడు అట్లా అనిపించక పోవచ్చు. ఇందాక ఒకాయన ఫోన్ చేసినడు. ఆయనకు మన వద్ద ఏదో దొరుకుతుందని నమ్మకం కలిగినట్టుంది. అందుకు వేరే వారు మరి కొందరు కారణమవుతరు. కొందరు మన మంచితనం రుచి చూచి ఉండే అవకాశం ఉందిగద. వాంఢ్లు మంచివాడులే అంటరు. ఈ కొత్త మనిషి ఆ ఆలోచనను వెంటబెట్టుకుని మన మీదికి దండయాత్ర చేస్తడు. మంచివాడులే అన్న మనిషి మనతో ఏ సందర్భంలో ఏ రకంగ మాట్లాడిందీ ఇక్కడ ప్రస్తుతం గాదు. ఆ మనిషికి మనం మంచి వాండ్లమేనన్న భావం కలిగింది. ఇవాళ మన కర్మ ఎట్లున్నదో ఆయన చూడవచ్చినడా. రాడుగద.



ఆయనకు కావలసిందేదో అడగడము చాతగావాలె. లేకుంటే అది దొరకదు. ఇంతకు ఆ వస్తువు నా దగ్గర ఉందన్న భావము ఎందుకు కలిగింది. మీ కొరకు తెగ వెతుకుతున్ననంటడు. అంత అబద్ధం. నేనేమన్న సూదినా ఎంత వెతికినా దొరకకుండ ఉండేందుకు. నన్ను చెట్టెక్కించాలె. మతలబ్ కీ దునియా అని ఒక మాట ఉన్నది. లోని అర్థము వేరని భావము. నోనెక్కడనో ఒక వ్యాసము రాసిన. రాసి ఊరుకుంటే కథే లేదు. అది పత్రికలో వచ్చింది. అందులో నేనేదో సంగతి రాసిన. అది చదివిన వారికి నా దగ్గర ఒక వస్తువు ఉన్నదన్న భావము కలుగుతుంది. వ్యాసము ఉద్దేశ్యము మాత్రము అది కాదు. మరేదో సంగతి గురించి చెప్పినా ఒక పదార్థము లేదా వస్తువు నా దగ్గర ఉందన్న భావము కలుగుతుంది.  ఆ వస్తువు కావాలనుకున్న వారంత నా మీదికి దండయాత్ర చేస్తే నేనేమవుత?

సరిగ్గ అదే జరిగింది. ఆ వస్తువు నా దగ్గర ఉన్నదా లేదా అన్నది ప్రశ్నే కాదు. ఒక పక్షాన ఉంటే అది నేను ఎంత మందికి ఇవ్వగలుగుతానన్నది ఇంకొక సంగతి.

మొత్తానికి నాగురించి పట్టించుకున్న వారు ఉన్నరని రుజువయింది. అయ్యా, దాని వలన ఎవరికి ఎంత ప్రయోజనము కలిగింది. అది ప్రశ్న.

నిత్యం రచనలు చెస్తుంటే ఇట్ల పిండి పిసికే సంగతులు తప్ప మతలబు గల మాటలు రావు. ఇంక ఆలోచనలను పంచుకోవడమని మరొక పద్ధతి ఉన్నది. అంటే రాయనవసరము లేకుండ, అంత దూరము పోకుండనే మాటలతోటి మందిని మప్పగించడము ఇక్కడ జరుగుతుంది. ఎప్పటికి మప్పగించడమే కాకపోవచ్చు. అప్పుడో ఇప్పుడో మంచి మాట రాక పోదు. ఎవ్వరు గూడ ఎప్పటికి మంచి మాటలనే చెప్పజాలరు. సైన్సులో ఏ విషయమయినా అండర్ ద గివన్ కండిషన్స్ మాత్రమే సత్యము. ఒక పరిస్థతిలో మాత్రమే అవి సత్యము. ఒకటి కూడ కాదు. కొన్ని పరిస్థతులు. తరువాత మరొకరు వచ్చి ఇది సత్యము కాదు, అని నిరూపించే వరకు మాత్రమే ఏదయినా సత్యము. మాటలు కూడ ఎటువంటి పరిస్థతిలో పలుకబడినవి అన్న ప్రశ్న పుడుతుంది గద. గొప్పవారు చెప్పినవన్ని గొప్ప మాటలేనా. అప్పుడప్పుడు వారు కూడ అనుమానాస్పదమయిన వంగతులు చెప్పే వీలు ఉన్నదిగద. అందుకు కొన్ని కారణములు టయి. వారొక మాటను ఒక సందర్భములో చెప్పి ఉంటరు. అది ఆ సందర్భములో సత్యమే. కాని సందర్భమును పక్కనబెట్టి మాటను మాత్రమే మనము ఉదహరించినప్పుడు దానికి వేరే అర్థములు తోచే ప్రమాదము ఉన్నది.

నిత్యము రాసే వారి మాటలు, గొప్పవారనిపించుకున్న వారి మాటలను కూడ తర్కించి గాని అంగీకరించ గూడదని తాత్పర్యము.

ఆలోచించండి. అవుననిపించినా కాదనిపించినా నాకు సమ్మతమే.

ఆ సంగతి మీరు కడుపులో దాచుకుంటే మాత్రము మాకు ఏ సంగతీ తెలియదు. అవునా, ఆలోచించండి.

Tuesday, September 17, 2013

ఎందుకో తెలుసా?

నేను మా ఆవిడతో పేకాడడం మానేశాను.
అసలు నేను మా ఆవిడతో పోటీ పడడమే మానేశాను.

ఎందుకో తెలుసా?

ఎన్ని సార్లు పేక ఆడినా ఆమే గెలిచింది. అట్లాగని నాకు కార్డు ముక్కలాట రాదనుకుంటున్నారేమో?
నేను పెద్ద ఎత్తున పైసలు పెట్టి ఆడే వారి మధ్యన కూడా బాగా ఆడతాడని పేరున్న మనిషిని. కానీ అదేమి చిత్రమో తెలియదు, మాయామెతో మాత్రం గెలిచింది తక్కువ. నిజం ఒప్పుకుంటున్నాను, మరీ పిచ్చిగా, ఇంట్లో ఉన్న మంచి డెక్కులన్నీ బయట పడేసి జన్మలో కార్డులాట ఆడ కూడదని నిర్ణయించుకున్నాను.

ఆటలో ఓడిపోతే ఎదుటి వారు ఎంత మిత్రులయినా గొంతు పిసికేయాలన్నంత కోపం వస్తుంది, నిజమే కదూ
నా భార్యకు రమ్మీ ఒకటే వచ్చు. నేను జాకీ మణేలా అనే తురుఫు ఆట మొదలు ఎన్నో రకాలు వచ్చు. ఆడి గెలిచినది అబదఅదం కాదు. కానీ ఇప్పుడు ఆడడం లేదు.

కొంత మందికి తెలియకుండానే మంచి కార్డులు పడుతుంటాయి.  అవి ఎప్పటికీ వాళ్లకే పడుతుంటాయి. అది విచిత్రం.

బతుకులోనూ అంతే. కొందరికి మంచి జరుగుతూనే ఉంటుంది. తెలియకుండానే జరుగుతూ ఉంటుంది. కొంత మందికి మంచి జరిగినా మంచిలాగ కనిపించదు. అసలది అర్థమే కాదు. దానితో ఒక రకమయిన భావన మనసులో నిలుస్తుంది. బలుస్తుంది. అదంతే అన్న భావం వచ్చిన తర్వాత మంచి జరిగినా కనిపించదు. అర్థం కాదు.


తాము పంచినా మరొకరు పంచినా కార్డులు ఒక్కరికే ఎప్పుడూ మంచివే పడుతున్నాయంటే, అక్కడేదో మోసం జరుగుతున్న భావం కలగడం సహజం. నేను ఇంటర్నెట్ మీద ఒక తెలివి పరీక్ష తీసుకున్నాను. నిజంగా నాకే ఆశ్చర్యం కలిగేటన్ని మార్కులు వచ్చినయి. నేను తెలివి గలిగిన మనిషినని ఎన్నో చోట్ల ఎన్నో సందర్భాలలో ఎందరో ఒప్పుకున్నారు. మామూలు చదువులోనూ మంచి గుర్తింపు సంపాయించుకున్నాను. కానీ, ఈ ఇంటర్నెట్ వారు మాత్రం, ఫలితం ఇస్తూ, నీవు మోసమైనా చేసి ఉండాలి (ఒక అసభ్యమయిన మాటతో సహా), లేదంటే నిజంగా గొప్ప తెలివి గలవాడవయినా అయ్యుండాలి అని రాశారు. వారి పరీక్ష పద్దతిలో అంతగా మోసం చేసే వీలు ఉన్నదీ లేనిదీ వారికే తెలియదా, లేక ఒకనికి మరీ అంత తెలివి ఉందని ఒక్క సారిగా ఒప్పుకునే ఇష్టం లేకనా వారు ఆ మాటలన్నది

వరుసగా ప్రశ్నలు, వాటికి వేగంగా జవాబులు. ఇక అక్కడ మోసానికి తావేదీ. పరీక్ష గడిచిన సమయం ఎంతో లెక్కించే వీలు అక్కడ ఉందా, నాకు గుర్తు లేదు. ఎందుకో నాకు అర్థం కాలేదు గానీ, వారు తెలివి గలవారిని అంత సులభంగా గుర్తించ దలుచుకోలేదని అనిపించింది. అదే పనిగా గెలుపు పొందే వారి మీద, (మాయావిడ గారిలాగన్నమాట) మనకు మోసం చేస్తున్నారేమోనని అనుమానం రావడం కూడా ఇట్లాంటిదేనా. వారు మోసం చేసే అవకాశం లేదని తెలిసి కూడా మనం అట్లా అనుకుంటాము, కదూ!

నేను సైన్సు చదువుతాను. అందరికీ అర్థం కావాలని  సంగతులను చేతయినంత సులభమయిన మాటల్లో మన భాషలో రాస్తాను. ఆ రకంగా నాకు కొన్ని ఆలోచనలు మనసులో పుట్టి ఎప్పటినుంచో నిలబడి ఉన్నయి.
ఉదాహరణకు మనమంతా ఈ భూమా మీద ఉన్నాము. అంతకు ముందునించీ ఈ భూమిఉన్నది.
ఈ భూమి సూర్యుని నుంచి ఒక ప్రత్యేకమయిన దూరములో ఉంది. అది ఇంకొంచెం దూరంగ ఉందనుకుందాము. భూమి మీద నీరు మంచవుతుంది. అదే , సూర్యునికి కొంచెం దగ్గరగ ఉందనుకుంటే నీరు ఆవిరయి పోతుంది. మొత్తానికి భూమి ఇప్పుడున్న దూరంలో ఉంది గనుకనే నీరు ఉండడమూ, జీవం పుట్టుకా వీలయింది. నీరు ఈ రకంగ కాక కొంచెం ఎక్కువగనో తక్కువగనో ఉంటే ఏమి పరిస్థతి ఉండేదో తెలియదు.

దూరమన్నది మన ఉనికికి ఆదారమయిన చాలా అంశాలలో ఒక్కటి మాత్రమే. వాతావరణం ఉన్నది. అందులో ఎన్నో అంశాలున్నయి. ఉదాహరణకు ఒత్తిడి. ఇదొక పరిస్థితి. దానికొక కొలత. ఈ కొలతలో ఏ మాత్రం తేడా వచ్చినా మనం ఇట్లా ఉండడము వీలుగాదు. వేడిమి సంగతి కూడ అంతే. ఒకటి రెండు డిగ్రీలు వేడిమి పెరిగిందంటే మనమంత గిలగిలలాడుతుంటము. ఇటువంటి కొలతలు మనకు తెలిసి, తెలియక ఎన్నో ఉన్నయి.

అన్నిటికన్న ఆశ్చర్యకరమయినది భూమికి ఉన్న ఆకర్షణ శక్తి.

భూమి పెద్దగ ఉండి ఒక వేగంతో తన చుట్టు తాను తిరుగుతూ సూర్యుని చుట్టు కూడ తిరుగుతున్నది. కనుక దానికి ఒక ఆకర్షణ శక్తి పుట్టింది. ఆ శక్తి ఇప్పుడున్నట్టు కాక ఇంకొక రకంగ ఉంటే మనం ఇక్కడ ఉండడం కుదరదు.
ఈ రకంగ చూస్తే, ఎన్ని సంగతులు అనుకూలంగ ఉంటే మనమున్నము అన్నది అన్నిటికన్న ఆశ్చర్యమయిన ప్రశ్నగా ఎదురవుతుంది.

అయినా మనము నిత్యము ఈ సంగతుల గురించి ఆలోచిస్తున్నమా? అది ప్రశ్న!
మనమే ఎంతో తెలివిగల వారలమనుకుని గర్వంగ బతుకుతున్నము.
ఈ ప్రపంచం గురించి మనకెంతో తెలుసునని విర్రవీగుతున్నము.
మన గురించి మనకే సరిగా తెలియదు. విశ్వం గురించి, నక్షత్రాల గురించి తెలుసుననుకుంటున్నము.
మనకొక తెలివి, మన అలోచనలకొక పద్దతి ఉన్నదని మన భావన.
ప్రపంచము, విశ్వము మన కను సన్నలలో ఉన్నయని ఒక భావన.
ఒక్క క్షణం ఆలోచించండి. ఈ విశ్వమన్న ఆలోచన మన మనసు, అంటే మెదడులో పుట్టింది కద
సైన్సు, సామాజిక శాస్త్రం, మిగతా తెలివి మొత్తం, మన మనసులో కలిగిన అవగాహనలు మాత్రమే గద
వీటిలో ఎక్కడన్న కొంచెం లెక్క తప్పి ఉండ కూడదా?

అలోచించండి.

ఎన్ని పరిస్థితులు అనుకూలిస్తే మనం ఇట్ల ఉండగలుగుతున్నము
మనకు ఎంత అర్థమయింది, ఎంత కాలేదు?
అయినా అంత బాగనే సాగుతున్నదన్న భావన మాతరం మనలో ఉండనే ఉన్నది.
మాయామెకు మంచి ముక్కలు పడి చీట్లాటలో గెలిస్తే, అందులో చీటింగ్ ఉందన్న భావన నాకెందుకు?
ఒటమి కలిగినప్పుడల్లా ఎదుటి వారిని చంపుదమన్నంత కసి ఎందుకు?
అంతా మన నమ్మకమే అయినప్పుడు, ఈ విశ్వం, ప్రపంచం, మనం, మన తెలివి అన్నీ నమ్మకాలే అయినప్పుడు, మన ఒక్కరి నమ్మకానికి విలువ ఎంత?

అలోచించండి, మీరు కూడా, నా లాగనే!!

Saturday, September 14, 2013

జిడ్డు కృష్ణమూర్తి నాకు తెలుసా?

జేకే మాటలు ఎందరి హృదయాల్లో నాటుకున్నాయో, ఎందరికి నిజంగా అర్ధమైనాయోనని ప్రసంగవశంగా రచయిత ఒకచోట అనుమానం వెలిబుచ్చి మనకు తెలియదు, అంటారు. కానీ, అందరూ ఆయన తమను ఆశీర్వదించాలనుకుంటారు. ఈ దండాలు, దాస్యాలు తప్ప మనకు ఆలోచనలు చేతగాలేదు. ‘మనకు చేతనయిందల్లా సేవ, పూజ, ఆరాధన, దీవెనలు అందుకోవడం మాత్రమే అయ్యుండాలి అంటారు రచయిత. జేకే చూపిన దారిని నడిచే సామర్థ్యం, కుతూహలం, సుముఖత మనలో లేవంటారీయన. అది జేకే దురదృష్టం అనేంతవరకు వెళతారు కూడా!
.................
............
జిడ్డు కృష్ణమూర్తి నాకు తెలుసా?
రచన: నీలంరాజు లక్ష్మీప్రసాద్
పుటలు: 250
వెల:150 రూ/-
ప్రతులకు: నవోదయ బుక్‌హౌస్,
కాచిగూడ, హైదరాబాద్-27
ఫోన్: 040-24652337
...............
పుస్తకం పేరులో ఒక ప్రశ్న. ఆ ప్రశ్న అడుగుతున్నది రచయిత అయితే, పుస్తకంలోని మొదటి ముప్ఫయిమూడు పేజీలు ప్రత్యక్షంగా, మిగతావి (ఈయన ఇతర రచనలతోబాటు) పరోక్షంగా జవాబు అందిస్తున్నాయి. కృష్ణమూర్తిగారిని ఆయన ‘కృ’ అన్న పేరుతో పిలిచారు. ‘కృ’కు నీలంరాజువారు బాగా తెలుసు. అయినా లక్ష్మీప్రసాద్‌లోని మంచితనం, మిగతా అంశాలను ‘తెలిసినంతమేరకు’ అన్న శీర్షిక కింద చేర్పించింది. ఈ రచయితకు తాను రాయదలచుకున్న అంశం తలకెక్కింది. వొంటబట్టింది. ఆయన సాయంతో పాఠకులు తమను తాము ప్రశ్న అడిగేసుకుని జవాబు వెదుకుతారు, ఈ పుస్తకం చదివితే!

మదనపల్లెలో పుట్టి చిన్నతనంలోనే ఇంగ్లండుకు తరలించబడిన జిడ్డు కృష్ణమూర్తి మనవాడు, తెలుగువాడు అని చెప్పుకోవడం మనలోని ఖాళీతనాన్ని చూపుతుంది. భారతీయుడివా అన్న ప్రశ్నకు ‘అవును. భారతదేశంలో పుట్టాను’ అని జవాబిచ్చాడు జె.కె. జె.కె అన్నపేరు ప్రపంచమంతటా తెలుసు. తెలియనిదల్లా మనకే. ఆయనేదో ప్రపంచానికి దారి చూపిస్తాడనుకుంటూ, అందరం ఆయన చుట్టూ మూగితే, అదేదో మీరే చేయాలి అని దారిచూపించాడాయన. శ్రీకృష్ణమూర్తిగారు, వారు లాంటి సంబోధనలను మించి ఎంతో ముందుకు సాగిన ఆ మనిషి ‘అర్థం కాడు!’ అనే స్థాయికి చేరుకున్నాడు. సమస్య అక్కడే ఉంది. జేకే మాటలు అర్థంకాకపోతే తప్పు ఆయనదా? లేక మనలో ఏదయినా లోపం ఉందా? ఈ రెండవ ప్రశ్నకు జవాబు చెప్పడానికి చేసిన ప్రయత్నమే లక్ష్మీప్రసాద్ రచనల్లో కనబడుతుంది. రచనలు కొన్ని ఒకచోటచేరి ఈ పుస్తకమయింది. దీన్ని నవల చదివినట్లు ఈ చివర నుంచి, ఆ చివర వరకు ఒక్కసారి చదివి, ‘అర్థం కాలేదు’ అని పక్కనబెడితే మాత్రం తప్పకుండా లోపం మనదే.

తెలివిగలవారు కూడా తెలివి అనే బరువు కింద నలుగుతుంటారు. ఆ బరువును తప్పించుకుంటే తప్ప, ఆలోచనలను స్వీకరించడం కుదరదు. ‘పాతది అంతమొందితే తప్ప నూ తన సృష్టి జరగదు’- అని ఈ పుస్తకం మొ దట్లోనే ఒకమాట కనబడుతుంది. దీన్ని గురించి చర్చకు అవకాశం ఉంది. జరగాలి. అందుకు మనం ప్రయత్నించాలి. జేకే చెప్పింది ఈ ప్రయత్నం గురించేననిపిస్తుంది.

జేకే మాటలు ఎందరి హృదయాల్లో నాటుకున్నాయో, ఎందరికి నిజంగా అర్ధమైనాయోనని ప్రసంగవశంగా రచయిత ఒకచోట అనుమానం వెలిబుచ్చి మనకు తెలియదు, అంటారు. కానీ, అందరూ ఆయన తమను ఆశీర్వదించాలనుకుంటారు. ఈ దండాలు, దాస్యాలు తప్ప మనకు ఆలోచనలు చేతగాలేదు. ‘మనకు చేతనయిందల్లా సేవ, పూజ, ఆరాధన, దీవెనలు అందుకోవడం మాత్రమే అయ్యుండాలి అంటారు రచయిత. జేకే చూపిన దారిని నడిచే సామర్థ్యం, కుతూహలం, సుముఖత మనలో లేవంటారీయన. అది జేకే దురదృష్టం అనేంతవరకు వెళతారు కూడా!

అందుకే కుతూహలం (మిగతా లక్షణాలు ఉండనివ్వండి) కలవారంతా ఈ పుస్తకం చదవాలి. ఇందులో మనకు ‘కృ’ ఆలోచనలమీద వ్యాఖ్యానాలు, అన్వయాలు కనబతాయి. భగవద్గీత విన్న తరువాత అర్జునుడు చప్పట్లుకొట్టలేదు. గొప్ప మాట విన్న తర్వాత చప్పట్లతో మన బాధ్యత తీరదు అంటారు ప్రసాద్. ఈయన మనకు సాయపడగలరనడానికి ఇంతకన్నా చక్కని ఉదాహరణ లేదేమో?

ఆనంద సామ్రాజ్యం తాళం చెవి, మనదగ్గరే ఉందన్నా, మనసులో శూన్యం కలిగితే, ఆ సంగతి, శూన్యంపోయిన తరువాత తెలుస్తుంది అన్నా, మనం (చప్పట్లు మాని) ఆలోచనలో పడిపోతాం. పడిపోవాలి. అదే ఈ పుస్తకం ఉద్దేశమనవచ్చు. కొన్ని విషయాలు చటుక్కున అర్థంకావు. అట్లాగని, అసలే అర్థంకావు, అనవచ్చా? సామూహిక అభిప్రాయాల బరువును కాసేపయినా దించుకుని, కనీసం తగ్గించుకుని ప్రయత్నిస్తే, కొత్త అభిప్రాయాలు అర్థమయ్యే వీలుంది. రచయిత ఈ బరువులతో నలిగినవారే. పడుకుని దండం పెడతారన్నారట. జేకే ‘వద్దని’ఆయనే వంగారట!
జేకే మతాలకు అతీతమయిన మాటలు చెప్పారని కూడా తెలియని వారున్నారు. అసలు ఆయన పేరుకూడా తెలియనివారి ప్రసక్తి ఇక్కడ రాదు. అనుకరణ, అనుసరణలు వద్దన్నారు. నేను గురువును కాను, నాకు శిష్యులు, అనుయాయులు లేరు అన్నారు. ఇంకా ఎన్నో అన్నారు! కొండ అద్దంలో లాగ ఆయన ఈ పుస్తకంలో కొంత కనిపిస్తారు.

చివరగా ఒక్క మాట. సామూహిక ఆలోచనల బరువులాంటిదే ఇంగ్లీష్ భాష బరువు కూడా. ఇంగ్లీషు మాటలకు సమానార్థాల పేరున్న పెద్ద మాటలు, ఇంగ్లీష్ పద్ధతి వాక్యాలు ఎదురవుతాయి ఈ పుస్తకంలో. కొంచెం ఓపికగా చదివితే అర్థమవుతాయి.

Friday, September 6, 2013

దేవదాసు - సినిమా 1955

ఈ నవల ఎన్ని భాషల్లో సినిమాగా వచ్చిందో గానీ, తెలుగులో వచ్చినంత బలంగా మిగతా వాటిల్లో రాలేదని ఒక అభిప్రాయం ఉంది.
కింది వ్యాఖ్య 1955 నాటి ఒక పత్రిక లో వచ్చింది.
అంటే సినిమా వచ్చినప్పుడే గదా!





Thursday, September 5, 2013

నవ్వాలి మరి

ఒకడు మాడిన రొట్టె తిని కడుపునొప్పి తెచ్చుకొనగా వైద్యుడాతని కంటికి మందు వేసెను - చమత్కార చంద్రిక అనే చాలా పాత పుస్తకంలోని ఒక జోకు.

* ‘ఆసుపత్రికి దారి చెప్పగలరా?’ అంటే ‘గలను’ అని వెళ్లిపోయాడొకతను. ముళ్లపూడి వారి ‘నవ్వితే నవ్వండి’లోని ఒక జోకు. వారీ జోకును మరింత ముందుకు లాగి నవ్విస్తారు.
* * *

‘పెళ్లాన్నేం చేస్తావురా బాళప్పా?’ ప్రశ్న. ‘గొంతు పిసికి బాయిలో ఏస్తాను!’ జవాబు. 

చీనన్న మా ప్రసాదుకు ఆ ప్రశ్న అడిగితే ఆ జవాబు చెప్పడం నేర్పించాడు. ఈ మాటలు ఎక్కడివి? అన్న అనుమానం అప్పట్లో నాకు రాలేదు. తరువాత మాత్రం చాలా కాలంగా అనుమానం తొలుస్తూనే ఉన్నది. ఇంతకూ అది జోకా? దానికి నవ్వాలా? నవ్వాలి మరి! చీనన్న అంటే మా చిన్నాయనగారి కుమారుడు. హాస్యప్రియుడు. ఒకరోజు అతను ముందు భోజనం ముగించినట్టున్నాడు. తరువాత తిన్న వారికి చారులో ఉప్పు లేదని అర్థమయింది. ‘అదేమి చీనూ! చెప్పనే లేదు?’ అన్నది. ‘అదీ ఒక రుచి అనుకున్నాను పెద్దమ్మా!’ చీనన్న జవాబు. చీనన్న నిజంగా మంచివాడు. అమాయకుడు అనాలేమో! కానీ ‘రుచి’ గురించి మాత్రం దశాబ్దాల తరువాత కూడా మా ఇంట్లో జోకుగా చెప్పుకుంటాము. ఒకసారి బంధువుల ఇంటికి పోతే వాడికి ఇడ్లీలు పెట్టినట్టున్నారు. ఇంటికి వచ్చిన తరువాత, తిండి పట్టదు అన్నాడు. ఎందుకంటే ‘ఉప్పిండి ఉంటలు (ఉండలు) తిన్న’ అని జవాబు. ఇదీ మాకు ఒక జోకుగా మిగిలింది. ఉండ అంటే గుండ్రంగా ముద్ద కట్టినది అనేనా అర్థం? దాన్ని మేము ‘ఉంట’ అంటాము. మా బావమరిది మరో చీనన్న. ఆయన అంతకన్నా హాస్యప్రియుడు. చేసిన లడ్డూలు మరురోజున ఉంటే, ఉంటలు, లేకుంటే ‘ఉండలు’ అన్నాడు. ‘ఉండను’ అనే మాటకు అర్థం తెలుసు గదా! ఈ ఇద్దరూ ఇప్పుడు లేరు. ఒకరు ప్రయత్నించి, మరొకరు నిజంగా అప్రయత్నంగా పై లోకాలకు చేరుకున్నారు. బతుకులో వెలుగు నీడలకు వీళ్లే ఉదాహరణలు!

గణపతి అని ఒక నాటకం. అది హాస్యం కింద లెక్క. విజయవాడ రేడియో వాళ్లు దాన్ని రేడియో నాటకంగానూ మలిచారు. చాలా ఏళ్ల క్రితమే. నేను పుస్తకం చదివాను. రేడియో డ్రామా విన్నాను. అప్పట్లో నా రియాక్షను ఏమిటో నిజంగా గుర్తు లేదు. శ్రీ రఘురామ, చారు తులసీదళ ధామ అన్న పద్యానికి, ఆ నాటకంలో ఒక పంతులుగారు, రాముల వారు చారు గాచుకున్నారు. కరియాపాకు లేకుంటే తులసి వేశారు అంటూ వ్యాఖ్యానం చెపుతారు. అది మాత్రం తప్పకుండా నవ్వించింది. కొంచెం తెలివి వచ్చింతర్వాత (ఆహా!) నాటకం వింటే అరికాలులో నుంచి మంట పుట్టింది. అది ఏ మాత్రమూ నవ్వవలసిన అంశం కాదు. గణపతి ఒక మొద్దబ్బాయి. ఎవరయినా మొద్దబ్బాయిగా పుడితే తప్పు తల్లిదండ్రులది. వారిది ఎంత మాత్రమూ కాదు. ఆ మొద్దబ్బాయిని తల్లి అమితంగా ప్రేమిస్తుంది. తల్లులకు మామూలు వారికన్నా, బలహీనులు, బుద్ధిహీనుల పట్ల కించిత్తు ఎక్కువ ప్రేమ సహజం కదా! ఈ విషయాన్ని హాస్యంగా వాడుకుంటే అంతకంటే క్రూరత్వం ఇంకొకటి ఉంటుందా? ఆలోచించాలి. అలాంటి వారి పట్ల సానుభూతి కలుగుతుంది. నవ్వు పుట్టదు, పుట్టగూడదు.

ప్రతి మనిషిలోనూ, పరిణామక్రమ ప్రభావంతో, ఒక అడవి మనిషి, మంచి చెడు చూడలేని మొరటు మనిషి దాగి ఉండటం సహజం! ఒకరెవరో జారి పడతారు. లేదా కట్టుకున్న గుడ్డ ఊడుతుంది. అందరూ ముందు నవ్వుతారు. అదుగో! ఆ మొరటు మనిషి పైకి వచ్చి నవ్వించినట్టు లెక్క! ఆ తరువాత సభ్య మానవుడు మేలుకుని సానుభూతిని కూడా పంచడం తెలుసు!

పుట్టపర్తి నాగపద్మిని గారు కొన్ని పుస్తకాలు, గోపాలకృష్ణ అన్నయ్యగారికి ఇమ్మని, ఒక అబ్బాయికి అప్పజెప్పారు. అతను, నేనే గోపాల‘కృష్ణ’ అనుకుని నాకు తెచ్చి ఇచ్చాడు. నిమిషాల్లో తిరిగి వచ్చి మళ్లీ పట్టుకుపోయి, అసలు చిరునామాలో వాటిని అందజేశాడు. ఈ మధ్య నిమిషాలలో నాకొక ‘యురేకా!’ క్షణం దొరికింది. ప్రసిద్ధ కన్నడ రచయిత ‘బీచి’ (వివరాలు మరోసారి!) ఆయన నవల సరస్వతీ పరిహారము. దాన్ని పుట్టపర్తి నారాయణాచార్యుల వారు తెనిగించారు. ‘పెళ్లాన్ని ఏం చేస్తావురా?’ డయలాగుతో ఆ పుస్తకం మొదలవుతుంది. నేను స్నానం చేస్తూ పుస్తకం చూడలేదు. లేకుంటే, నా యురేకా, మరో జోకయి ఉండేది. పద్మినిగారిని, ఫోను ద్వారా, పుస్తకం కొరకు అభ్యర్థించాను. ఆమె దయతో మొదటి పరిహారంలోని (సంహారం అంటే సమాహారమని, అంటే ఒక సేకరణ, గుంపు, కూడిక అని అర్థం ఉంది!) అన్నీ కాకున్నా, కొన్ని పుస్తకాలను నాకూ పంపించారు. వారికి ధన్యవాదాలు చెప్పాను. రుతు సంహారం అన్న కావ్యానికి రుతువుల వరుస అని అర్థం. మరి ఈ సరస్వతీ సంహారం ఏమిటని నా కుతూహలం. ఆచార్యుల వారి రచనలు, వారి గురించి రచనలున్న ‘త్రిపుటి’ని కూడా పక్కనబెట్టి ముందు ఈ చిన్న నవల చదివేశాను. దాని కోసం మీరు వెతికితే దొరకదు. అచ్చులో అదిప్పుడు దొరకడం లేదు. పద్మిని నాకు, మా అన్న గోపాలకృష్ణకు ఇచ్చినది ఫొటోకాపీ ప్రతి!

ఈ పుస్తకంలో నాయకుడు బాళప్ప అను బాలప్ప. వాడు గణపతికన్నా మరింత మొద్దబ్బాయి. వానికి ఆదర్శ మహిళకు ఆదర్శంగా ఒక అక్కగారు. ఆమె భర్త పండితుడు. తాత్వికుడు. వారి సంతానమయిన సరస్వతి, అపర సరస్వతి. అందగత్తె. మూర్త్భీవించిన మంచితనం. మనకు మేనరికం హక్కు అని ఒకటి ఏడిచింది గద. కనుక సరస్వతిని బాలప్పకిచ్చి పెళ్లి చేశారు. (ఇంకా నయం, గణపతి కథ ఇంత దూరం సాగదు!) ‘బాయిలో ఏస్తాను’ అదీ ‘గొంతు పిసికి’ అని చిన్నప్పుడు చెప్పిన మాటలను నిజం చేస్తాడు ఈ ‘నాయకుడు’. నిజంగా అది సరస్వతి సంహారమే. పుస్తకం చదివిన తరువాత నా మనసు కలత పడింది. ఎన్నిసార్లు, ఎంతకాలం దాని గురించి ఆలోచించానో? ఇది హాస్యమా? దీనికి నవ్వెట్లా వచ్చింది. ఒక అమాయక ప్రాణి, ఖర్మగాలి మూర్ఖుడయితే, అది మనకు నవ్వు పుట్టిస్తుందా? మనం మనుషులమయినట్లా? లేక ఇంకా పశువులుగానే మిగిలి ఉన్నామా?
మొక్కపాటి వారు బారిస్టరు పార్వతీశము అని ఒక రచనను మనకు అందించారు. అందులోని సన్నివేశాలు అన్నీ మనలను నవ్విస్తాయి. దాన్ని సిచువేషనల్ కామెడీ అంటారు. అందులోనూ ఎక్కడో కొంత అమాయకత్వం నక్కి ఉంటుంది. కానీ మొరటు హాస్యం కాదది. సందర్భంగా ఒక విషయం. మొక్కపాటి వారికి బహుశః బోదకాలు ఉండేదేమో? ఆయనను ఎవరో ‘గురుపాదులు’ అన్నారట. ఇది మళ్లీ గణపతి, బాళప్పలను తలపించే హాస్యం.
చిలకమర్తి వారి హాస్యములు అని ఒక పుస్తకం రెండవ చేతి (అదే సెకండ్‌హ్యాండ్) పుస్తకాలలో కనపడితే కొన్నాను. చదవటం మొదలుపెడితే, ముందుకు కదలలేదు. అందులోనూ మొరటు హాస్యమే. బ్రామ్మల గురించి జోకులు వేసి నవ్వడం మనకు బాగా అలవాటు. మాయాబజార్‌లో శర్మా శాస్ర్తిల మొదలు, కోడిని చూస్తే తినాలనిపిస్తోంది సినిమా, ఆ తరువాత నిరసనలూ, నినాదాలకు కారణమయిన మరో సినిమా దాకా, అంతటా ఇదే కదా (అప)హాస్యానికి ప్రాతిపదిక. పోలీసులను, బాపన వారిని గురించి జోకులేస్తే అడిగేవారు లేరనా? తెలంగాణ యాస మరో హాస్యం!
దేవుళ్లను గురించి జోకులు, కార్టూనులు వేయడం మనకు మరీమరీ బాగా చేతవును. గణపతి చవితి వచ్చిందంటే, పత్రికలన్నింటిలోనూ అవే కార్టూనులు. ఆయన బొమ్మను మురికిగుంటలో ముంచింది చాలక. దాని గురించి జోకు చేయడం!

చిన్నప్పుడు ఊళ్లో బోగమాట ఆడేవారు. అక్కడ బోగం వారెవరూ లేరు. అది వీధి నాటకం. తెల్లవార్లూ జరుగుతుంది. మధ్యలో కొంచెం తెరిపి, రిలీఫ్ కావాలి. ఒకాయన ‘మంచి మంచి పద్యాలు చెపుతాను వినండి’ అని మొదలుపెట్టి ‘చూడుము నీ సంసారపు నడకలు, దేవా ఈ ప్రజలు, ఎంతో మారిరి మానవులు’ అని పాట పాడేవాడు. దేఖ్ తేరీ సంసార్‌కి హాలత్ క్యా హోగయా భగవాన్? కిత్‌నా బదల్ గయా ఇన్సాన్’ అన్న సినిమా పాటకు అది స్వేచ్ఛానుకరణ. పద్యమని చెప్పి పాట పాడడం సంగతి అర్థమయిన వారికి జోకు. పారడీ కాకున్నా పాట మరో జోకు. ఆయన అప్పట్లో చేసిన ఒక ట్రిక్కును నేను ఇవాళటికీ, మానేజ్‌మెంట్ ట్రెయినింగ్‌లలో వాడుతున్నాను. ‘మిమ్మల్నందరినీ నా వెనుకకు తెప్పిస్తాను. కళ్లు మూసుకోండి’ అని మంత్రం చదువుతాడు. కళ్లు తెరవగానే, అతను అటు వేపి మళ్లి నిలబడడం కనపడుతుంది. ఎంత బాగుంది, అది జోకంటే?

నవ్వండి. కానీ, ఎందుకు నవ్వామో ఆలోచించండి. ఒకోసారి కళ్లు చెమర్చుతాయి!

* ‘అట్లు తింటారా?’ ప్రశ్న - ‘అట్లే కానీ’ జవాబు. అది మాటకారితనం.

* బాపుగారు గొప్ప కార్టూనిస్టు. ఆయనకు ఒక మానసిక గురువున్నారు. ఆయన పేరు గోపులు. గోపులు కార్టూనులు చూడదలచుకున్న ఇదే బ్లాగులో చూడవచ్చు.