Saturday, November 17, 2012

సలహాలు - సంప్రదింపులు

పని బాగా జరుగుతున్నంత కాలం పక్కవారి గురించి ఆలోచన కూడా రాదు. సమస్య ఎదురయితే మాత్రం, బాసునో, మరొకరినో సాయం అడగాలనిపిస్తుంది. సమస్యను మరొకరి ముందు పెట్టడం వరకే మన పని అనుకుంటే, అక్కడితో మన పెరుగుదల ఆగిపోతుంది. పైఅధికారులు మనకు సహాయం చేయడానికే ఉన్నారు. మరి మన దగ్గరకు ఎవరైనా సమస్యతో వస్తే ఏం చెప్తాము? తెలుసుననుకుని సులభంగా ఒక సమాధానం చెప్పి పంపిస్తామా? మన సమస్యలన్నింటికీ బాసులు సమాధానం చెప్పి పంపుతున్నారా? నిజంగా అట్లా జరుగుతున్నదంటే, ఎక్కడో లోపం ఉందని అర్థం! బాసుకు ఏదో అనుమానం వస్తుంది. అప్పుడు ఎవరిని అడగాలి? ఎవరు సమాధానం చెపుతారు?


సమస్యను తెచ్చి మన ముందు పడేస్తే, ఆ పడేసిన వారి బాధ్యత ముగిసినట్లు కాదు. మనమయినా సమస్యను మరొకరి ముందుకు నెట్టి, చేతులు దులుపుకోలేము. మనమయినా మరొకరయినా, సమస్యతో బాటు సలహాలను జోడించాలి. ‘మీరు చెప్పండి. మేము మీరు చెప్పినట్టు చేస్తాం!’ అంటారు చాలామంది. మరి చెప్పవలసిన వారికి సమస్య ఎదురయితే ఎవరు చెప్పాలి. ఏదో ఒకనాడు మనమూ ఆఫీసర్లవుతాము. బాసులవుతాము. ఇంట్లో పెద్దవాళ్లమవుతాము. బాధ్యత అంతా మన తలకెక్కినప్పుడు బరువు తెలుస్తుంది. ఈ సమస్య ఎందుకు వచ్చిందంటారు? నా స్థానంలో మీరుంటే ‘ఈ విషయంలో ఏం చేయాలనుకుంటారు? మీరే ఏదో ఒకటి చెప్పండి!’ అనే బాసు మీద కోపగించుకునేవారు చాలామంది ఉంటారు.

నిర్ణయాలు వేరు, సలహాలు వేరు. ఏం చేయాలో చెపితే, అది నిర్ణయమవుతుంది. ఇలా చేయవచ్చునేమో, అని చెపితే అది సలహా. సమస్యను ఎస్కలేట్ చేసిన వారు, అంటే పైవారి ముందు పెట్టిన వారు నిర్ణయం చేయలేకనే ఆపని చేస్తారు. నిర్ణయం సరయిందన్న నమ్మకం లేకపోతే ఆ పని చేస్తారు. అప్పుడు చెప్పే తీరులో ఈ సంగతి చక్కగా కనిపించాలి. ఇది సమస్య, ఇది నా నిర్ణయం అని చెప్పడం బాగుండదు. ఈ నిర్ణయం బాగుంటుందని అనుకుంటున్నాను, అంటే, అది సలహాగా మారుతుంది. సంప్రదింపుల ద్వారా, సమస్యకు గల సమాధానాలను వీలయినన్ని ముందు ఉంచుకుని, వాటిని చర్చించి, ఒకటి, రెండింటిని ఎంచుకోవచ్చు. అమలు చేసి చూడవచ్చు. సమస్యను ముందుంచిన వారే, నిర్ణయాన్ని సూచించడం అంతగా అలవాటు లేదు. ఎందుకొచ్చిన బెడద అనుకుంటారు చాలామంది. బాసులకు కూడా సరైన అవగాహన లేకుంటే ‘ఇక నేనెందుకు?’ అంటారు. ఇవి రెండూ తప్పు పద్ధతులే. సలహాలు, సంప్రదింపులు మాత్రమే సరయిన పద్ధతి. చిన్న చిన్న విషయాలలో కూడా ఈ పద్ధతిని పాటించవచ్చు. ఇంట్లో, మిత్రుల మధ్య కూడా ఈ పద్ధతిని పాటిస్తే, అందరికీ సంతృప్తిగా ఉంటుంది. ‘ఇడ్లీ తిందాం పదండి’ కన్నా ‘ఏం తిందాం?’ అన్నమాట బాగుంటుంది. అందరికీ తమ అభిప్రాయం చెప్పే వీలు కలుగుతుంది. చివరికి ఎవరిమాట నెగ్గినా, సలహా ఇచ్చినా సంతృప్తి మిగులుతుంది. ఈ సంతృప్తి, మరింత ఆలోచించడానికి, బాధ్యతతో ప్రవర్తించడానికీ, అవసరమయిన బలాన్ని ఇస్తుంది. దీనే్న ఎంపవర్‌మెంట్ అంటారు.

నిర్ణయాలు చేసే శక్తి కాకున్నా, నిర్ణయాల వరకు చేరుకునే కార్యక్రమంలో భాగం ఉంటే ఆ వ్యక్తులకు మానసిక బలం పెరుగుతుంది. అదే ఎంపవర్‌మెంట్. కూరలు కొనడం తనకు తెలియదు అనుకుంటే జీవితమంతా తెలియకుండానే పోతుంది. కూరలు కొనడంలోని మెళకువలు అర్థం అయే పరిస్థితిని కలిగిస్తే రేపు కూరలు కొనే బాధ్యతను పంచుకోవడానికి మనకే సాయం దొరుకుతుంది. ఎందుకు తెలియదు? ఏం తెలియదు? ఏ రకం కూరల గురించి తెలియదు? లాంటి ప్రశ్నలడిగితే, మరో వ్యక్తికి ఎంపవర్‌మెంట్ జరుగుతుంది. అలాగని ఎడ్డెం తెడ్డెం ప్రశ్నలడిగితే పని జరగదు. పైగా, ఆ మనుషులు మరింత కుంగిపోతారు. కొత్తగా ఆలోచించడానికి దారితీసే ప్రశ్నలుండాలి. విషయం గురించి ఎదుటివారి ఆలోచనలు మరింత పెరిగే రకంగా ప్రశ్నలు అడగాలి. ఇలాగే అడుగుతారు కూడా. మనకు ఆ సంగతి అర్థం కాకుంటే, ఆ ప్రశ్నలు ‘చొప్పదంటు ప్రశ్నలు’గా చికాకు ప్రశ్నలుగా కనిపించి, వినిపించి చికాకు కలుగుతుంది. అందుకే ఎవరైనా ప్రశ్నలు అడిగినా, మనం అడగవలసి వచ్చినా ఒక్క క్షణం ఆలోచించడం మంచిది. అప్పుడు విషయం మరింత సులువుగా అర్థమవుతుంది. రెండువేపుల నుంచి చక్కని సలహాలు వస్తాయి. సమస్యకు సమాధానం దొరుకుతుంది.

జాగ్రత్తగా గమనిస్తే, ఈ సందర్భంలోని ప్రశ్నలకు ఒక పద్ధతి ఉంటుంది. వాటికి సూటిగా ఒక జవాబు ఉండదు. ‘ఎందుకు?’ ఎట్లా?’ ‘ఏమయి ఉండవచ్చు?’ లాటి ప్రశ్నలకు జవాబులు కేవలం అభిప్రాయాలు. అవి రకరకాలుగా ఉంటాయి. ఉండాలి కూడా! సమస్య తెచ్చిన వారికి ఈ ప్రశ్నల కారణంగా, మరింత అవగాహన వీలవుతుంది. మరిన్ని జవాబులు మెదడులో మెరుస్తాయి. తమ మీద తమకు నమ్మకం పెరుగుతుంది. జవాబు నేనే యిచ్చానన్న ధీమా కలుగుతుంది. అసలిది సమస్యగా ఎందుకు కనిపించింది? అన్న అనుమానం కూడా రావచ్చు. కావలసింది కూడా అదే! ఈ ప్రపంచంలో ఏ సమస్యకూ, ఎవరివద్దా రెడీమేడ్ జవాబులు ఉండవు. ఉంటే, అసలివి సమస్యలు కావు! సరైన సమయంలో సరయిన ప్రశ్నలు అడిగితే, సమస్య మబ్బులాగా విడిపోతుంది. అందరికీ నచ్చే సమాధానాలు కనబడతాయి. అందరికీ నమ్మకం కలుగుతుంది. అది సలహా, సంప్రదింపులోని బలం!

బాసు మనలను అభిప్రాయం అడిగారంటే, మన తెలివిని, ఆలోచన శక్తిని వారు నమ్ముతున్నారని, గౌరవిస్తున్నారని అర్థం! అదే పద్ధతిని మనం కూడా మనవారిమీద, చివరకు పిల్లలమీద కూడా ప్రయోగించవచ్చు. అటువంటి ప్రశ్న ఎదురయిన మరుక్షణం మన బాధ్యత పెరుగుతుంది. కనుక మరింత జాగ్రత్తగా ఆలోచించే ప్రయత్నం మొదలవుతుంది. సమస్యకు సమాధానం మననుంచి వస్తే అది అప్పటికప్పుడు కనిపించే విలువ, లాభం. ఇక ముందు ఈ రకం సందర్భాలలో కూడా ముందే ఆలోచించి, సలహాలతో కూడా ముందుకు సాగే నమ్మకం కలుగుతుంది. అది ఎప్పటికైనా పనికివచ్చే మానసిక బలం. అది మరింత గొప్పలాభం!

అంతా నాకే తెలుసు, నీకేం అధికారం, అని మనం అనవచ్చు. మనమీదివారు మనల్ని అనవచ్చు! మనిషిని మానసికంగా కుంగదీయడానికి అంతకన్నా కావలసింది లేదు! ఎవరికీ ఎవరికన్నా ఎక్కువ తెలియదు. నాలుగు తలలు ఒక చోట చేరితే సలహాలు, సంప్రదింపులు సాగుతాయి. అది తెలివి!

No comments:

Post a Comment