పోట్లాడుకొని
స్నేహాన్ని వదులుకోవడం చాలా సులభం. స్నేహాన్ని
హద్దులు మీరకుండా కాపాడుకుంటూ రావడం కత్తిమీద సాము.
జ జ
జ జ
సెల్‌ఫోన్
మోగగానే అది హారికదే అని గమనించింది నీరజ. హారిక ఫోన్‌కు వచ్చే రింగ్‌టోన్
ప్రత్యేకంగా కేటాయించుకుంది నీరజ. నీరజ ఫోన్‌కు హారిక కూడా అలాగే స్పెషల్ రింగ్‌టోన్
పెట్టుకుంది. అది వారి ప్రత్యేక కోడ్. అందుకే ఫోన్ ఎత్తకుండానే గబగబా రెడీ అయి
సైకిల్ తీసుకొని హారిక ఇంటికి బయల్దేరింది. సైకిల్‌ను హారిక ఇంటి పోర్టికో గోడ
పక్కన ఒరిగించి లాక్ చేసి ఇంట్లోకి నడిచింది. అప్పటికి ఇంకా హారిక బాత్రూంలోనే
వున్నట్టుంది. అది బాత్రూంలోకి వెళ్తూ తనకు రింగ్ ఇవ్వడం చాలాసార్లు గమనించింది.
''చూడు ఆంటీ! నాకు రింగ్ ఇచ్చింది. అదేమో బాత్రూంలో
చొచ్చింది. కాలేజికి టైమ్ అయిపోతోంది'' అంటూ హారిక తల్లి లీలావతిని పలకరించింది నీరజ.
నవ్వుతూ ''అది అంతేలేవే!'' అంటూ నూడిల్స్ వేడివేడిగా తీసుకొచ్చి డైనింగ్ టేబుల్‌పై
ఉంచింది లీలావతి.
''అది రానీ!'' అంది నీరజ.
''అది వచ్చి నిన్ను కూడా పద పద అని తినకుండానే బయల్దేర
తీస్తుంది. నవ్వన్నా తినవే!'' అంది లీలావతి.
లీలావతికి నీరజ
అంటే తన కూతురు కన్నా ఎక్కువ. హారికకు ఇంట్లో కాస్త గారాబం, కాస్త మొండి. తనదే సాగాలంటుంది. దాంతో హారికతో ఏదైనా ఒప్పించాలంటే నీరజకు
చెపుతుంది లీలావతి.
నీరజకు ఆంటీ
అంటే భయం, భక్తి. ఆ పోష్ బిల్డింగ్‌లో తాను, హారిక కలిసి చదువుకోవడం గొప్ప అవకాశంగా భావిస్తుంది నీరజ.
హారిక సాధారణంగా కాలేజికి కారులో వెళుతుంది. డ్రైవర్ డ్రాప్ చేస్తుంటాడు.
అప్పుడప్పుడు హారిక కారును వద్దని కాలేజీ బస్సులో నీరజతో పాటు వెళ్తుంది. కాలేజీ
బస్సు కూడా వెళ్ళిపోయేదాకా చూసి ఆర్టీసి బస్సులో బయల్దేరతీస్తుంది. నీరజకేమో
ఆర్టీసీ ప్రయాణం విసుగు. కానీ హారిక ఆ ప్రయాణాన్ని బాగా ఎంజాయ్ చేస్తుంది. ఈ రోజు
కూడా కారును పంపించేసినట్టుంది. కాలేజీ బస్సు కూడా ఎత్తిపోయినట్టే. ఇది కావాలనే
ఇలాంటి ప్లాన్లు వేస్తుంది. ఈ రోజు ఆర్టీసీ బస్సులో పోక తప్పదు అనుకుంది నీరజ.
టిఫిన్ చేసి, టీ తాగిన తర్వాత కూడా హారిక ఇంకా బాత్రూంలోంచి బయటకు రాకపోవడంతో నీరజ విసుగ్గా
బాత్రూం తలుపు బాదింది.
హారిక కాసేపటికి
రెడీ అయి వచ్చింది. పూర్తిగా రెడీ అయి అందాల రాశిగా చిరునవ్వుతో నీరజను
పలకరించింది హారిక.
జ జ
జ జ
కార్తీక్
గురించి హారిక ఈ మధ్య సీరియస్‌గా ఆలోచిస్తోంది. ఏం చేయాలో తోచడం లేదు.
అవతలి వారి
స్నేహంలో చొరవ ఎక్కువై తనకు పరిమితులున్నప్పుడు ఇది మరీ కష్టం. హారిక ఎవరితో
చెప్పుకోవాలో కూడా కష్టంగా వుంది. ఏమనుకుంటారోనని సంకోచం.
నీరజకు హారిక
చెప్పకపోయినా అన్ని విషయాలు తెలుసని హారికకు తెలుసు. కానీ తన మనస్సులోని సంఘర్షణ
దానికి తెలియదు. నీరజ తన ప్రాణ స్నేహితు రాలు. అది తనను తన కన్నా బాగా అర్థం
చేసుకుంటుంది అనుకుంది హారిక.
అంతా విన్నాక
కూడా హారిక మనస్సులోని సంఘర్షణ నీరజ ఊహకు అందలేదు. నీరజకు ఆ విషయం కొత్త. హారిక
ద్వారా తనకే కొన్ని కొత్త అనుభవాలు, ఆలోచనలు. తనను అలా ప్రేమిస్తున్నానని స్నేహం పేరిట వెంటపడే
వారు ఎవరూ లేనందుకు కించిత్ బాధపడింది.
డబ్బు
చాలామందికి వుంటుంది. అందం కూడా చాలా మందికి వుండవచ్చు. వినయం, సంస్కారం చాలా మందికి వుండవచ్చు. కానీ ఈ మూడు కలిసి ఒక్కరిలో వుండడం చాలా
అరుదు. హారిక ప్రసన్నవదనంలోని ఆత్మవిశ్వాసం వెనుక గర్వం వుందేమోనని చాలాసార్లు
నీరజ చర్చల్లో గమనించింది. కానీ కించిత్ గర్వం ఉన్నట్టు అన్పించలేదు. స్నేహం
అన్ని తప్పులను, బలహీనతలను క్షమిస్తుంది. నీరజకు కూడా అలా స్నేహంలో
హారికలోని బలహీనతలు, లోపాలు కన్పించకుండా పోయాయేమో!
జ జ
జ జ
వేగంగా పోతున్న
సిటీ బస్సు అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో ప్రయాణికులంతా కుదుపుకు లోనయ్యారు. ఒకరి
మీద ఒకరు పడిపోయారు. కూర్చున్న వాళ్లు కుర్చున్నట్టే ముందు సీట్లకు తలలు, చేతులు తాకి అమ్మో అన్నారు. అందరూ డ్రైవర్‌ని రకరకాలుగా మాటలంటున్నారు. బస్సు
ముందు నుండి వేగంగా రాంగ్‌సైడ్‌లో క్రాస్ చేద్దామని అతి తెలివితో వేగం పెంచిన
యువకుడు బైక్ పై నుండి కింద పడ్డటున్నాడు.
''అఖల్ హై క్యా? బేవకూఫ్'' అని డ్రైవర్ ఆ యువకున్ని తిట్టిన తిట్టు తిట్టకుండా
అరుస్తున్నాడు.
నలుగురైదుగురు
కలిసి బైక్‌ను లేవనెత్తారు. ఆ యువకుడు గీరుకుపోయిన కాళ్లను, మోచేతులను చూసుకుంటూ దులుపుకున్నాడు.
''నేను చెబితే వినవు. బస్సులో పోదామంటవ్. ఎంత దెబ్బ తాకిందో
చూడు'' అంటూ నీరజ విసుక్కుంది.
''ఏమైందే! స్కూటీ మీద పోతే ఇంతకన్నా ఎక్కువ దెబ్బలు
తాకుతుంటయి. ఇప్పుడు చూల్లేదా బైకు మీద పోతే అతనికి ఎన్ని దెబ్బలు తాకినయో!'' అంటూ సముదాయించింది హారిక.
''స్కూటీ మీద పోవుడెందుకె?
నీకు కారుండంగ బస్సులో
పోవుడు ఏం షోకే!'' అంది నీరజ.
ఆ మాటతో లేడీస్
సీట్లో కుదురుగా కూర్చున్న ఆ యిద్దరి సంభాషణను వెనుకా ముందు వున్న వారి చెవిన
పడింది. ఆసక్తిగా ఒక చెవి ఇటు వేశారు.
''వారానికోసారి బస్సులో పోకపోతే లోకమెట్లా తెలుస్తుందే? కారులో పోయి కారులో వస్తే మనలోకం మనదే. మనకు ఇతరుల గురించి ఏం తెలుస్తుంది? నాకైతే కారంటే బోరు కొట్టింది.'' అంటూ హారిక నవ్వుతూ నుదురుకు తాకిన దెబ్బ బొడుసు కట్టిన
ఉబ్బును తడిమి చూసుకుంది.
''పైగా కాలేజీ బస్సులో కూడా ఎప్పుడూ చూసిన ముఖాలే. సిటీ
బస్సులో అయితే ఎప్పుడూ ప్రయాణం వెరైటీగా వుంటుంది. ఇలాంటి అనుభవం బస్సులోనే
సాధ్యమే!'' అంటూ నీరజ మెడచుట్టూ చేతులు వేసి ముందుకు ఊపింది హారిక.
''నాకు తెలుసులేవే. కార్తీక్‌ను తప్పించుకుందామని నీ
ప్రయత్నం.'' అంటూ బుగ్గమీద మెత్తగా ఎడం చేత్తో గిల్లింది నీరజ.
''నాకేం భయమే. కార్తీక్‌ను చూస్తే జాలి వేస్తుంది. నా
స్నేహాన్ని కన్సర్న్‌ను అలుసుగా తీసుకుంటున్నాడు. నా కన్సర్న్‌ను ప్రేమ అని భ్రమ
పడుతున్నాడు. అతని మేలు కోరి నేను తప్పించుకుంటున్నాను. నీకా విషయం తెలిసి కూడా
ఇట్ల మాట్లాడ్డం మంచిగ లేదు.'' అంటూ కార్తీక్ గురించిన ఆలోచనలో పడిపోయింది హారిక. మూడీగా
మారిపోవడం చూసి హారికను రకరకాల మాటలతో ఈలోకంలోకి రప్పించింది నీరజ. హారిక సుతారంగా
నవ్వింది.
''హమ్మయ్య! నీకెప్పుడు మూడ్ వస్తుందో, ఎప్పుడు మూడీ అవుతావో ఆ బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడే.''
''కార్తీక్‌కు తెలుసనుకుంటానే...'' అంటూ గుసగుసగా నవ్వింది హారిక.
''అంతగా ఇష్టపడే కార్తీక్‌ని తప్పించుకోవడం ఎందుకే. అంతగా
కావాలనిపిస్తే ఇద్దరం కలిసి కార్తీక్‌ను మస్త్ ఏడ్పించవచ్చు. ప్రిన్సిపాల్‌కు
రిపోర్ట్ చేయవచ్చు''.
''ఛ... ఛ... ప్రిన్సిపాల్‌కు రిపోర్ట్ చేస్తే ఇంకేమైనా
ఉందా! అతన్ని కాలేజినుండి తీసేయొచ్చు. నాకు అలాంటివి ఇష్టం లేదు. కార్తీక్
సున్నిత మనస్కుడు. కవిత్వం, కథలు అంటూ ఊహా లోకాల్లో విహరిస్తాడు. ఏ కాస్త విమర్శను, హేళనను భరించలేడు. ఎవరినైనా సరే ఆటపట్టించడం నాకిష్టం వుండదని నీకు తెలుసు.
అలాంటిది కార్తీక్‌ను ఎలా అంటానే!''
''అలాంటప్పుడు హాయిగా కార్తీక్‌ను ప్రేమించేసెయ్. నీకేం
తక్కువే. కో అంటే కోట్ల రూపాయలు. నువ్వు ఎవర్ని ప్రేమించినా వాళ్లు
కోటీశ్వరులైపోతారు.'' అంటూ నవ్వింది నీరజ.
''అసలు సమస్యే అక్కడ వచ్చింది. డబ్బున్న ఇంట్లో పుట్టడం
ఒకందుకు వరమైతే మరొకందుకు శాపమే. అది అనుభవిస్తే తప్ప తెలియదు.''
''ఎందుకే! పెట్టిపుట్టినోళ్లు గట్లనే మాట్లాడ్తరు. డబ్బు
విలువ నీకేం తెలుసు? నాలాంటి దానికి, కార్తీక్ లాంటి వాడికి డబ్బు ఎంటో, అది మనిషికి ఎంత అవసరమో తెలుసు. ఎంత తిన్నా దంగనంత డబ్బున్న నీకేం తెలుసే.'' అంది నీరజ.
బస్సులో ఆ చర్చ
ఎంత విందామనుకున్నా వాల్యూమ్ తగ్గించిన టీవీలా హావభావాలు తప్ప మాట సరిగా
వినిపించడం లేదు.
''కార్తీక్‌ను చూస్తే నిజంగా జాలేస్తన్నదే. దయచేసి నన్ను
ప్రేమించవద్దు అని చెప్పాలనిపిస్తున్నదే! అయితే ఆ మాట చెప్తే గాలీబ్లా, దేవులపల్లి కృష్ణశాస్త్రిలా రొమాంటిసిజమ్ భావకవిత్వంలో
ఊహాప్రేయసితో సంభాషిస్తున్నట్టు సాగే ఆయన కవితాధార ఇంకిపోతుందేమోనే! డిప్రెషన్‌లో
పడతాడేమోనని భయం. అతడు బాగుండాలి. బాగా చదువుకోవాలి. బాగా ఎదగాలి. కానీ ఈ ప్రేమ
జంజాటంలో పడితే మంచిది కాదని నా ఉద్దేశం. పైగా నాకతన్ని ప్రేమించే ఉద్దేశ్యం లేదు.''
''ప్రేమించే ఉద్దేశ్యం లేకపోతే అంతకన్సర్న్ దేనికే! ఆ మధ్య
నువ్వు అతని ఎకౌంట్లో నా చేత డబ్బు ఎందుకు జమ చేయించావు? కేవలం జాలి మాత్రమేనా? తన ఎకౌంట్లో ఎవరు డబ్బు జమ చేశారో తెలియక కార్తీక్ తల
బద్దలు కొట్టుకున్న విషయం నీకు తెలియదా?''
ఆ సంఘటన
గుర్తొచ్చి హారిక హాయిగా నవ్వుకుంది. ఈ దొంగపని తానే చేశానని కార్తీక్ తనవైపు
చూసిన చూపులో కేవలం కృతజ్ఞతనే కాకుండా మరేదో తళుక్కున మెరిసింది. ఓసారి తానే ఆ
ఎకౌంట్‌లో జమ చేసి కార్తీక్‌కు పరోక్షంగా దొరికిపోయింది.
దిగాల్సిన
స్టేజి రావడంతో గబగబా లేచి దిగి కాలేజీ వైపు నడిచారు.
జ జ
జ జ
తమకు ఫోన్ చేయడమంటే
కార్తీక్‌కు భయమని వారిద్దరికీ తెలుసు. కార్తీక్ ఫోన్ కాల్‌కు హారిక, నీరజ స్పెషల్ రింగ్ టోన్ పెట్టుకున్నారు. అందుకని ఆ ఫోన్ వాళ్ళు ఎత్తరు.
కాలేజీలో కార్తీక్‌ను తప్పించుకొని హారిక, నీరజలు ఎప్పుడూ ఎవరితోనో మాట్లాడుతూ అవకాశం లేకుండా
చూసుకుంటున్నారు.
రోజూ సాయంత్రం
ఇంటినుంచి కారు రావడంతో హారిక, నీరజ కారులో వెళ్లిపోతున్నారు.
కార్తీక్
నీరసపడిపోయాడు. వాళ్లు ఎప్పుడో ఒక్కసారైనా కాలేజీ బస్సులో ఎక్కుతారని, పలకరించవచ్చునని అనుకున్న ఆశ నిరాశ అవుతోంది. అదంతా హారిక, నీరజ గమనిస్తూనే వున్నారు.
కార్తీక్
ఏకపక్ష ప్రేమ ఎలానైనా హారికతో వ్యక్తం చేయాలని చూస్తున్న తీరును చూసి హారిక
ఏమనలేక బాధపడిపోయింది.
ఓ రోజు గుళ్లోకి
వెళ్లి దేవున్ని ప్రార్థిస్తూ ప్లీజ్ కార్తీక్ నన్ను ప్రేమించకుండా చూడు అంటూ
మనసులో మొక్కుకుంది.
ఇది అతన్ని
ప్రేమిస్తోంది. కానీ దాన్ని స్నేహమని ఇతరులకు చెబుతుంది. అనుకుంటోంది నీరజ.
అతనంటే పడిచచ్చే
హారిక అతడు తనను ప్రేమించవద్దనడం ఎమిటో నీరజకు అర్థం కావడం లేదు. అదే మాట
అడిగింది.
''స్నేహం వేరు... సహృదయత వేరు... తోటి వారికి సహాయం చేయడం
వేరు... ప్రేమ వేరు. వీటన్నిటి మధ్య అంతస్సంబంధం వుండవచ్చు గానీ దేనికవి
ప్రత్యేకమైంది. అతడు ఎడ్యుకేషన్‌లో ఫస్ట్ జనరేషన్. తల్లిదండ్రులు చాలా పేదలు.
వాళ్ళు కష్టపడి ఇక్కడిదాకా చదివించడమే గొప్ప. రిజర్వేషన్‌లో సీటు సంపాదించి
అందరికన్నా ఎక్కువగా ఎదగడం నన్ను బాగా ఆకర్షించింది. అలాంటి బ్యాక్‌గ్రౌండ్ నుంచి
వచ్చిన కార్తీక్ నేను స్వయంగా ఇస్తే తీసుకునే వాడంటావా? ఒకవేళ తీసుకుంటే అతనిలో మన పట్ల ఒక బెరుకు,
అల్పత్వ భావన పెరగదా!
అందుకని చేసే సహాయం వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి. సగర్వంగా వుండాలి తప్ప వారి
వ్యక్తిత్వాన్ని కించపరిచేదిగా వుండవద్దనేది నా ఉద్దేశ్యం.''
''నువ్వు ఇంత సున్నితంగా,
సెన్సిటివ్‌గా
ఆలోచించడం చాలా విచిత్రంగా వుంది. నీలాంటి వాళ్ళు చాలామంది కార్తీక్ లాంటి
వాళ్ళను బాగా లైట్‌గా తీసుకుంటారు. ఏడిపిస్తారు. కించపరుస్తారు. నిజానికి నువ్వు
నాలాంటి కుటుంబంలో పుట్టాల్సిందానివే. పొరపాటున పెద్దింట్లో పుట్టినవే.
పెద్దింట్లో పుట్టేవాళ్లకు దయాధర్మాలు, స్నేహం, ప్రేమ కన్నా అహంకారం ఎక్కువ కదా.'' అంది నీరజ.
''నువ్వు అలా అనుకోవడం తప్పు. పెద్దింట్లో పుట్టడం వల్లనే
నాకీ సంస్కారం అబ్బింది. నీలాంటి కుటుంబంలో పుట్టి వుంటే డబ్బు కోసమే తండ్లాట
ఉండేది. సహృదయత కోసం, సంస్కారం కోసం ఎంతో కష్టపడాల్సి వచ్చేది. కాదంటావా?'' అంది హారిక.
ఈ ప్రేమ ఏంటో, ఈ స్నేహం ఏంటో అర్థం కాక తలబద్దలుకొట్టుకుంది నీరజ. హారిక లాంటి కొత్త తరంలో
అన్నిటికీ అతీతంగా ఎదుగుతూ వస్తున్న స్నేహాలను,
ప్రేమలను, సంస్కారాన్ని అర్థం చేసుకోవడం ఎవరికైనా అంత సులభం కాదు.
హారిక వాళ్ల
నాన్న అతన్ని ఏదో చేస్తాడని భయమెందుకో! నిజంగా ఏమైనా చేస్తాడనుకుంటే ఇంటినుంచి
వెళ్లిపోయి ఎక్కడైనా హాయిగా బతకొచ్చు. హారికకి ఆ సంపద, సౌకర్యాలు వున్నాయి. వాటితో పాటు అమ్మానాన్నలను వదలుకోవాలని లేదేమో. అంటే
హారిక ప్రేమకన్నా ఆస్తి అంతస్తులకు, అమ్మానాన్నలకు ప్రాధాన్యత ఇస్తుందేమో! అదేమాట అంది
నీరజ.
''నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనావే!'' అని నిష్టూరాలాడింది హారిక.
జ జ
జ జ
హారిక, నీరజ ఆ రోజు కాలేజీ ఎగ్గొట్టినట్టున్నారు. ఐమాక్స్ థియేటర్‌లో ఏదో ఇంగ్లీష్
సినిమా చూసినట్టున్నారు. హుస్సేన్‌సాగర్ పడమటి తీరాన నెక్లెస్ రోడ్డులో పీపుల్స్
ప్లాజా గార్డెన్‌లో కూర్చుని హాయిగా మాట్లాడుకుంటున్నారు.
అంతదాకా చూసిన
సినిమా గురించి నీరజ ఏదో చర్చ మొదలు పెట్టింది. హారిక అందులోని ప్రేమను ఎలా అర్థం
చేసుకోవాలో తన అభిప్రాయాలు చెప్పింది. నీరజకు అదేమీ అర్థమైనట్టు లేదు. డైరెక్ట్‌గా అడగకుండా వుండలేకపోయింది నీరజ.
''కార్తీక్ గురించి అసలు నీ ఉద్దేశ్యం ఏంటిదే! ఈ సినిమాలాగే
అసలు నువ్వేంటో అర్థం కాక చస్తున్నా!'' అంటూ నిలదీసింది నీరజ.
హారిక సుతారంగా
నవ్వేసి ఊరుకుంది. ఆ నవ్వులో ఎన్నో భావాలు. ఆ భావాలు నీరజకు చదవడం వచ్చు.
''ఇందులో రహస్యమేమీ లేదే. నువ్వెందుకంత వర్రీ అవుతున్నావ్.
నేను ఆంతర్యంలో అతన్ని ప్రేమిస్తున్నది నిజమే. అయితే ఇరువురి ఆంతర్యాల్లో ఎంతో
అంతరం వుంది. నిజానికి నేను అతని శ్రేయస్సును ప్రేమిస్తున్నాను. అతని
వ్యక్తిత్వాన్ని ప్రేమిస్తున్నాను. అంతేగానీ అతన్ని ఫిజికల్‌గా ప్రేమించడం లేదు.
అంత చిన్న కుటుంబం నుంచి, చిన్న కులం నుంచి కష్టపడి పైకి వచ్చి సిన్సియర్‌గా
చదువుకోవడం, ర్యాంకులు తెచ్చుకోవడం, రచయితగా ఎదగడం, నన్ను హంట్ చేసింది. ఈ కాలంలో అంత స్వచ్ఛంగా, నిర్మలంగా ఉండే యువకులు ఎంతమంది వుంటారు'' అంది హారిక.
''ఔను! ఏవో వెకిలి చేష్టల ద్వారా, డర్జీ జోక్స్ ద్వారా, ర్యాగింగ్ ద్వారా ఆకర్షించాలని చూస్తారు. కానీ కార్తీక్
వ్యక్తిత్వం స్వయంగా ఇతరులను ఆకర్షిస్తుంది'' అంది నీరజ.
ఆమాటకు
అడ్డొస్తు హారిక...
''అది నిజమేలేవే! అయితే నేను అతనికి తగను. పైగా నా
వ్యక్తిత్వాన్ని అతడు తట్టుకోలేడు. పేదరికం నుంచి ఎదిగిన వ్యక్తిత్వం అతనిది.
సంపన్న కుటుంబం నుండి ఎదిగిన వ్యక్తిత్వం నాది. నేను సంపదకు, అంతస్తులకు అతీతంగా ఆలోచించగలను. అతడు ప్రతిదీ కులం రీత్యా, డబ్బు రీత్యా ఆలోచించే తీరులో వున్నాడు. ఏ మాట మాట్లాడినా దాని వెనుక మన
కులాధిక్యత, అహంకారం, డబ్బు వల్ల వచ్చిన గర్వం, వుందని ఫీలవుతుంటాడు. ఇలా మా ఇద్దరి జీవిత పరిణామాల మధ్య
ఎంతో అంతరం. అందువల్ల మా సంసారం సజావుగా సాగడం కష్టం.''
హారిక ఒకందుకు
చెప్తే నీరజ మరొకలా అర్థం చేసుకుంది. నవ్వుతూనే అక్కసు వెళ్ళగక్కింది.
''ఈ మాట ఎంతోమంది రచయితలు,
సినిమా దర్శకులు
ఎప్పుడో చెప్పారు. నువ్వు కొత్తగా చెప్పేదేందే! కులాంతర వివాహాలను
తప్పించుకోవడానికి, పేదవాళ్లను పెళ్లి చేసుకోవడాన్ని నిరాకరించడానికి ఇదో తొంపు.
నిజంగా నువ్వు ప్రేమించేదైతే కార్తీక్‌తో జీవితాంతం స్నేహం చేయాలని, కలిసుండాలని, అందుకు పెళ్ళి చేసుకోవాలని కూడా కోరుకుంటావు. అంతేగానీ
కేవలం వ్యక్తిత్వాన్ని ప్రేమించుకుంటూ అమలిన శృంగారంలాగా, ఊహా ప్రేయసీ ప్రియుల్లాగా మనసులోనే అనురాగాన్ని దాచుకోవడం వుండదు. నువ్వు ఏదో
షెల్లీ, కీట్స్, బైరన్ కాలంలోనో, మన తెలుగు భావకవుల కాలంలోనో పుట్టాల్సినదానివే.''
హారికకు
కోపానికి బదులుగా మరింత నవ్వొచ్చి బిగ్గరగా నవ్వేసింది.
''నీ బొంద! ఆ కాలంలో పుడితే అన్ని విషాదాంతాలేనే! అసలు నేను
కార్తీక్‌లాగా నీక్కూడా అలుసై పోయిన్నే! నేను వాస్తవికంగా ఆలోచిస్తున్నాను. నీకు
ముందే చెప్పిన. రిజర్వేషన్లో ఇంత దాకా వచ్చిన అతని చదువు ఇంకా సాగాలి. మేం పెళ్లి
చేసుకుంటే అతని చదువు ఆగిపోతుంది. మేమిద్దరం ఎక్కడ వున్నా మా నాన్న పట్టి
తెప్పిస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలుసు. ఇద్దరి జీవితాలు మధ్యాంతరంగా
ఆగిపోతాయి. ఈ విషయం మీదే నాకు బాధ. అంతేగానీ అతన్ని ప్రేమించడం లేదని కాదు. అతడు
చదువుకోవాలి. బాగా ఎదగాలి. నాకు దూరంగా వుండాలి. ఇండియా దాటి యూఎస్‌కు వెళ్లాలి.
అక్కడ స్థిరపడాలి. అప్పటికి అతనికి పెళ్లి కాకుండా వుంటే... నన్ను మా నాన్న తన సంస్థలకు
సీఈవోగా, ఎండీగా వుండాలని బలవంతం చేయకపోతే నేను కూడా యూఎస్‌ఏకు వెళ్ళాలి. అప్పటికీ మా
ఇద్దరి మధ్య ప్రేమ వుంటే అక్కడ పెళ్లి గురించి ఆలోచిస్తా.'' అంది హారిక.
''స్నేహాల్లాగే ప్రేమలు కూడా కాలం తెచ్చే మార్పులతో మార్పు
చెందుతుంటాయి. ఇది కేవలం ఆ ఇద్దరికి సంబంధించిన వ్యవహారం కాదు. ఇంత సంపద వుండగా
పొట్ట చేత పట్టుకొని అందరిలాగా అమెరికా పోవాల్సిన అవసరం మనకేమిటి అని డాడీ అడిగితే?'' అంది నీరజ. ''జీవితాన్ని వాయిదా వేయడమంటే ఇదేనే! ఎస్కేపిజాన్ని ఎంత
ముద్దుగా చెప్పినవే. అప్పటికి కార్తీక్‌కు నువ్వు నీ ప్రేమ అలుసైపోతుందేమో! నిన్ను
నిరాకరిస్తాడేమో!'' అంటూ ఎద్దేవా చేసింది నీరజ.
''నీ తలకాయ! నీ బుర్రకు అంతకన్నా ఎక్కువ ఏం తోస్తుంది? అప్పటికి గానీ నా ఆంతర్యం వ్యక్తం చేయలేను. మా మధ్య అంతరాలు తొలగవు. ఇది
జీవితానికి క్రమబద్దంగా వేసుకునే ప్లానింగ్. ''
అంటూ నీరజను
కౌగిలించుకుంది హారిక.
''అయినా మీ డాడీ నిన్ను సీఈఓగా,
ఎండీగా చేశాక నీకు
అడ్డేమిటి? ఇండియాలో కూడా కార్తీక్‌ని పెళ్ళి చేసుకోవచ్చుగా''. సాలోచనగా అంది నీరజ.
''నువ్వు అన్నది కూడా నిజమేలేవే! ఏమైనా కార్తీక్ చదువు
పూర్తి కావాలి. ఆయన ఏదైనా ఉద్యోగం సంపాదించాలి. ఆ తర్వాత ఆలోచిద్దాం'' అంది తన్మయత్వంతో హారిక.
''విష్ యూ బెస్ట్ ఆఫ్ ఫ్యూచర్'' అని నీరజ విష్ చేస్తూ ''నీ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో వుందే'' అంటూ వీపు చరుస్తూ అభినందించింది.
ఆ తరువాత
ఆలోచనలో పడి మళ్ళీ అంది నీరజ. ''అంత ఎదిగినాక కార్తీక్ అభిప్రాయాలు, వ్యక్తిత్వం కూడా మారిపోవచ్చు. ఇప్పుడున్న ఆరాధనా భావం అప్పుడు ఉండకపోవచ్చు.
నీ ప్రేమను చాలా లైట్‌గా తీసుకోవచ్చు. ఏమంటవే?''
''అది కూడా నిజమే కావచ్చు. కాలమే అన్ని అంతరాలను, ఆంతర్యాలను పరిష్కరిస్తుంది. సన్నిహితం చేస్తుంది. ఇప్పుడు మాత్రం స్టేటస్‌కోలోనే
కొనసాగుతాను. అంటే కార్తీక్‌ను ప్రస్తుతం నేను ప్రేమించేది లేదు, అతనితో స్నేహాన్ని వదులుకునేది లేదు.'' అంది హారిక.
''అలా కొనసాగడం చాలా చిక్కు సమస్య. బాగా సెన్సిటివ్
ప్రాబ్లమ్ కదనే.'' అంది నీరజ.
నీరజని
ఆత్మీయంగా కౌగిలించుకుని అంది హారిక.
''నాకు తెలుసులేవే! నేను ప్రేమ విషయంలో ఆంతర్యంలో అంతరాన్ని, స్నేహం విషయంలో ఆత్మీయతను డీల్ చేయలేనా?...'' ఆ మాటలో ఎంతో ఆత్మవిశ్వాసం,
గుండె నిబ్బరం.
''దట్స్ తెలుగు డాట్ కామ్'',
వన్ ఇండియా తెలుగు, జూన్ 2013.
'సలామ్ హైదరాబాద్' పక్ష పత్రిక, జులై 2013.
No comments:
Post a Comment