Showing posts with label ఆలోచన. Show all posts
Showing posts with label ఆలోచన. Show all posts

Sunday, September 18, 2016

కథ చెపుతాను.. ఊ కొడతావా

వెయ్యి గొంతుల మధ్యన కూడా తెలిసిన గొంతు వెంటనే వినిపిస్తుంది. ఇష్టమున్న గొంతు మురిపిస్తుంది. - ఎవరన్నారో తెలియదు.
* * *

చాలామంది కథలు రాస్తారు. కానీ నిజానికి కథలు చెప్పడం అసలు పద్ధతి. పురాణం అన్నా, హరికథ అన్నా కథ చెప్పడమే. ఇక జానపద పద్ధతిలో జముకుల కథ, బయిండ్ల కథ, బుర్రకథ లాంటివి ఎన్ని చెప్పినా కథ చెప్పడమే కానీ ముందు రాసుకుని దాన్ని నోటికి నేర్చుకుని చెప్పే పద్ధతి లేనే లేదు. చుక్క సత్తయ్య ఒగ్గు కథ గురించి అందరికీ తెలుసు. తెలియని వాళ్లకు నమస్కారం. ఎన్ని కథలు చెపుతావు అని అడిగితే దండకంలాగ బోలెడన్ని పేర్లు ఒక లయలో చెప్పేసేవాడు. వాటన్నిటికీ పుస్తకాలు లేదా వ్రాతప్రతులు ఉన్నాయని అనుకునే వాళ్లకు నిరాశ ఎదురవుతుంది. సత్తయ్యకే కాదు, జానపద కథలు చప్పే వాళ్లకు ఎవరికీ ఒక స్క్రిప్టు ఉండదు. వాళ్లకు కథ తెలుస్తుంది. గతంలో తమ వంటి వారు చెప్పిన తీరు విని ఉంటారు. కనుక ఎప్పటికప్పుడు కథను తమ లయలో మాటలను పేరుస్తూ అందంగా చెప్పేస్తూ ఉంటారు. పురాణానికి పుస్తకం ఉంటుంది. హరికథకు కొంతవరకు ఒక రాత ప్రతి ఉంటుంది. కనీసం పాటలకయినా ప్రతి ఉంటుంది. మాటలకు మాత్రం కథకుల కౌశలాన్ని బట్టి ఎప్పటికప్పుడు కొత్త రూపం వస్తుంది.

మా ఇంట్లో బుడ్డన్న పనిచేసేవాడు. పాతకాలం పద్ధతిలో చెప్పాలంటే అతను మా జీతగాడు. వ్యవసాయం పనులను అన్నింటినీ తానే చేస్తుంటాడు. అవసరం కొద్దీ మిగతా వాళ్లు ఎప్పటికప్పుడు రోజు కూలీకి వస్తారు. బుడ్డన్న మాత్రం సంవత్సరమంతా మాతోనే ఉంటాడు. అట్లా అతను కొన్ని సంవత్సరాలపాటు మాతో ఉన్నాడు. నేను ప్రేమగా ‘బుడ్డడు’ అని పిలుచుకునే మా బుడ్డన్న గొప్ప గాయకుడు. ఆ సంగతి వానికి తెలియదు. ఆ కాలంలో నాకు అంతకన్నా తెలియదు. రేడియోలో వారు జానపద సంగీతాన్ని సేకరించి, దాన్ని లలిత సంగీతం వాళ్లచేత పాడించడం అప్పట్లో పద్ధతి. అది అన్యాయమని నాకు తరువాత అర్థమయింది. ఇప్పుడు కొన్ని టీవీ ఛానళ్లలో జానపద సంగీతాన్ని జానపదుల చేతే పాడిస్తూ ఉంటే నాకు బుడ్డన్న గుర్తుకు వస్తాడు. అయితే బుడ్డన్న గురించి చెపితే శాఖా సంక్రమణం అవుతుంది. నిజానికి వాని తమ్ముడు అడివన్న. వాడు నాకంటే వయసులో చిన్నవాడు. కనుక నాకు వాడు దోస్తు. వాడు మా పశువులను కాసేవాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన తరువాత అప్పుడప్పుడు నాతో కబుర్లతో గడిపేవాడు. వాడు కథల పుట్ట. ఎన్ని కథలు ఎంత బాగా చెప్పాడో గుర్తుకు తెచ్చుకుంటే నాకు కళ్లకు నీళ్లొస్తాయి. నీళ్లెందుకు? పాపం అడివన్న ఇప్పుడు లేడు. వాడు ఉంటే కూచోబెట్టి కథలు చెప్పించి పుస్తకాలకు, పత్రికలకు వాడి పేరుననే ఎక్కించేవాడిని కాదా? అది నా బాధ. అది ఇప్పుడు వీలుకాదు.

నేను కథలు రాయకూడదని నిర్ణయించు కున్నాను. వ్యాసాలు, అందునా సైన్స్ వ్యాసాలు రాయాలన్నది నా నిర్ణయం. అయినా సరే, ఆ వ్యాసాలలో నా రాత తీరు మాట్లాడుతున్నట్టే ఉంటుందని చాలామంది నాకు చెప్పారు. ఆ తరువాత నాకు కూడా ఆ విషయం తలకెక్కింది, అర్థమయింది కూడా. మనం ప్రపంచానికి చెప్పదలుచుకున్న సంగతిని మాటలతోనే చెపుతాము. ఆ మాటలను, పాటలను, రచనలను కనిపించే అక్షరాల ద్వారా అందించడం చాలా తరువాత వచ్చింది. కొంతమంది మాత్రమే కలం పట్టుకుని కూచుంటే, మాట తీరున కాకుండా మరో రకంగా రాస్తారు. ఆ రచన చదువుతుంటే రచయిత చెపుతున్న భావం వినిపించదు, కనిపించదు. రాతలో కనిపించిన అక్షరాలు శిలా శాసనాలయితే బాగుంటాయి. కథలు, కవితలయితే అవి చెప్పినట్టుగా ఉంటేనే బాగుంటాయి.

కొంతమంది ఉపన్యాసం చెప్పినా, ముందు రాసుకుని చెపుతున్నట్టు ఉంటుంది. అది బాగుండదు అనడానికి లేదు. చెప్పే తీరును బట్టి అది కూడా ఆకర్షణీయంగా ఉండవచ్చు. వేలుక్కుడి కృష్ణన్ అని ఒక తమిళ పండితుడు గొప్పగా ప్రవచనాలు చెపుతాడు. గంటలు మాట్లాడినా ఆయన ప్రవచనంలో అనవసరమయిన మాటలు గానీ, చెప్పిందే మళ్లీ చెప్పడంగానీ ఉండదు. మొదట్లో నాకు ఆయన పద్ధతి గొప్పగా ఉందనిపించింది. రానురాను అది కొంచెం బిగిసుకుపోయిన పద్ధతేమో అని అనిపించసాగింది. ఇక మరి కొందరు ఉపన్యాసం చెపితే ‘ఎందుకు చెపుతున్నాననంటే అండీ’ అంటూ మరీ పిచ్చాపాటి పద్ధతికి దిగుతారు. చెప్పిందే మళ్లీ చెప్పడం గురించి మళ్లీ మళ్లీ చెప్పడం ప్రస్తుతం అప్రస్తుతం. చెప్పవలసిన విషయాన్ని మరీ మనసు కెక్కించాలంటే ఒకసారి పునశ్చరణ చేయాలని పద్ధతి ఉందిగానీ అదే పనిగా రుబ్బుతూ ఉంటే దాన్ని పిండి పిసకడం అంటారు. ఈ మధ్యన పురాణాలు, ప్రవచనాలు వింటూ ఉంటే నాకు ఈ సంగతి క్షణక్షణం గుర్తుకు వస్తుంది. కథ ముందుకు సాగదు, విషయం బయటకు రాదు, మాటలు మాత్రం సాగుతూ నే ఉంటాయి.

ఇంతకూ ఈ విషయం ఎత్తుకుని ఎందుకు చెపుతున్నాను అని నన్ను నేనే ప్రశ్నించుకుంటాను. ఇన్నాళ్లుగా రాస్తున్నాను గానీ నన్ను ఎవరయినా రచయిత అంటే, ఒక్క క్షణం నాకు ఆశ్చర్యం అవుతుంది. నేను రాయడం లేదు, నాకు తెలిసిన సంగతులను, అర్థమయిన సంగతులను మళ్లీ చెపుతున్నాను. ఈ చెప్పడంలోని అనుభవం అది రాసే వాళ్లకు తెలిసినట్టే చదివే వాళ్లకు కూడా తెలుస్తుంది. గ్రాంథికంగా, లేకున్నా సరే పడికట్టు పద్ధతిలో రాసిన మాటలు చదువుతుంటే ఊపు ఉండదు. అందులో రచయిత గొంతు వినిపించదు. ఈ గొంతు అన్న మాటను అందరూ పట్టుకోవాలని నాకు గట్టి నమ్మకం. పుస్తకం చేతికి ఎత్తుకుంటే పేజీలో అక్షరాలు కాక, టీవీ తెర మీదలాగ ఆ విషయం చెప్పిన మనిషి కనిపించాలి. అక్షరాలు ఆయన మాటలయి వినిపించాలి. విశ్వనాథ సత్యనారాయణ గారి పద్ధతిలో అందరూ రచనలు చేసి ఉండకపోవచ్చు. ఆయనకు కూచుని రాయడం అలవాటు లేదట. ఆయన చెపుతూ ఉంటే పక్కన మరెవరో కూచుని రాసేవారట. పుట్టపర్తి వారి గురించి కూడా ఇదే మాట విన్నాను. వాళ్ల రచనల్లో మాటల ధోరణి వినిపించిందంటే ఆశ్చర్యం లేదు. అందరు రచయితలు అట్లా డిక్టేటర్స్ కాదు. ఎవరికి వారు కూచుని రాసుకున్నారు. ఈ మధ్య వరకు నేను కూడా అదే పద్ధతి. అయినా సరే తమ గొంతు పాఠకులకు వినిపించేలా రచయితలంతా రాయడానికి ప్రయత్నం చేశారు. చాలామంది ఆ పనిని విజయవంతంగా చేయగలిగారు.
సులభంగా అర్థం కావాలంటే ఒక చిన్న ప్రయత్నం చేద్దాం. వార్తాపత్రికను ఒకదాన్ని ఎత్తుకుని ఏ అంశాన్నయినా తీసుకుని చదివి చూడండి. వార్తలలో వ్యక్తి కనిపించకూడదు. కేవలం విషయం కనిపించాలి. కాబట్టి దాన్ని బొటాబొటిగా రాస్తారు. వ్యాఖ్య అయితే వెంటనే రాసిన మనిషి గొంతు వినిపిస్తుంది.

రచయితలందరూ మంచి మాటకారులు కాదు, బాగా ప్రసంగాలు చేయగలిగిన వారందరూ కూడా రాయలేకపోవచ్చు. ఇందుకు కారణం వారి గొంతు. కలం పట్టుకుని కూచుంటే గొంతులో గుండె వచ్చి ఇరుక్కుంటే రచన ముందుకు సాగదు. ఎదురుగా ఎవరో కూచున్నారని ఊహించుకుని వాళ్లకు చెపుతున్నట్టు రచన మొదలుపెడితే అది చాలా సులభంగా జరుగుతుంది. అడివన్న కథ చెపుతూ ఇంచుమించు అక్కడ ప్రత్యక్ష పురాణం పద్ధతిలో సీన్‌ను సృష్టించేవాడు. డైలాగు చెపితే దాన్ని రాసిన అక్షరాన్ని ఏ భావమూ లేకుండా చదివినట్టు చెప్పామనుకోండి అర్థం ఉండే మాటలు కూడా అర్థం లేనట్టు కనిపిస్తాయి. ‘అయ్యో! అంత పని జరిగిందా?’ అనే ఒక డైలాగును మా కుటుంబమంతా కలిసి ఒకనాడు టీవీలో విన్నాము. ఆ చెప్పిన అమ్మాయికి చేతులెత్తి నమస్కరించాలి. భావం ఏ మాత్రం పలకకుండా ఆమె చెప్పిన పద్ధతిలో ఆ డైలాగు చెప్పాలని మా ఇంట్లో వాళ్లమంతా ఇవాళటికీ పోటీ పడుతుంటాము. గొంతు! అచ్చు అక్షరంలో కూడా గొంతు! దాన్ని గురించి కాసేపు ఆలోచించండి. అప్పుడు నేను కథ చెపుతాను. మరి ఊ కొడతారా?
ఝలక్: చాలామంది ముందు కవిత రాసుకుని దాన్ని కవి సమ్మేళనంలో వినిపిస్తారు. నాకు తెలిసిన కొందరు చెప్పవలసినదంతా ముందు చెప్పేసి అప్పుడు దాన్ని అచ్చు రూపంలోకి మారుస్తారు. నేను కూడా ఇదే పద్ధతి పాటిస్తున్నాను. ఈ నాలుగు మాటలను కూడా నేను కలంతో రాయలేదు.

Saturday, September 10, 2016

మా ఊరు

........................................................
ఊళ్లో ఒక ఆంజనేయుని గుడి ఉన్నది. దాన్ని చిన్నప్పటి నుంచి హనుమాండ్ల గుడి అనడం అలవాటు. నేను కనీసం హ అనే అక్షరం వాడాను. మా ఊరి వాండ్లకందరికీ అది అన్మాండ్ల గుడి మాత్రమే. నాకు తెలిసి అందులో నిత్యం ధూప దీపం నడిచేది కదా. ఊళ్లో మాకున్న కొద్దిపాటి పొలం ఇనాం భూమి అని చెప్పారు. ఏం చేయడానికి ఆ ఇనాం ఇచ్చారో నా వరకు రాలేదు. ఆ గుడిలో దీపం పెట్టే బాధ్యత మాత్రం మాది కాదని, ఆ బాధ్యత ఎవరికీ లేదని అనుభవం వల్ల నాకు తెలిసింది. నేను చదువు పేర ఊరు వదిలి బయటకు వచ్చిన తరువాత ఆ గుడిని మరమ్మతు చేయించారు. నిత్యం పూజలు చేయగల కుటుంబాలు ఊళ్లో లేవు.

......................................................
పేర్లు పెట్టడం అనేది ఒక గోకుడు. అది ఆ వస్తువును స్వంతం చేసుకోవాలన్న గోకుడు లాంటిదే - ఎడ్వర్డ్ ఆబి
* * *

ఎప్పుడో ఒకసారి చెప్పడానికి ఏముంది అని ఓ కవిత రాశాను. ‘అందరితో కలిసి ఉంటున్నందుకు నేను ఉన్నాను’ అన్నాను. కనుక ప్రత్యేకంగా చెప్పడానికి ఏం లేదని కూడా అన్నాను. కానీ మనసు మారినట్టుంది, చెప్పడానికి చాలానే ఉంది అని కూడా అన్నాను. చెప్పదలచుకుంటే ఎంతయినా చెప్పవచ్చు. మూడు సంవత్సరాల నుంచి లోకాభిరామం పేరుతో చాలా సంగతులు చెపుతున్నాను. పెద్దలు, పిన్నలు, తెలిసిన వాళ్లు, తెలియని వాళ్లు చాలామంది బాగుందని కూడా అన్నారు. ఈ మధ్యన ఒకచోటికి వెళ్లవలసి వచ్చింది. అక్కడికి వచ్చిన చాలామందిలో నాకు పరిచయమున్న వాళ్లు నలుగురే. ఆ నలుగురితోనే నాలుగు మాటలు మాట్లాడి, మరో నలుగురితో పరిచయం చేసుకునే ప్రయత్నాలు చేసి చివరికి ఇంటి దారి పట్టే సందర్భంలో కళకళలాడుతున్న ఒక అమ్మవారు దగ్గరగా వచ్చారు. బాగా పరిచయమున్నట్టే పలకరింపులు కూడా లేకుండా ‘మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలండీ’ అన్నారు. ‘ఉన్నట్టుండి లోకాభిరామం వ్యాసాల్లో తెలంగాణం భాష ఎందుకని వస్తుంది?’ అని ఆమెగారి అనుమానం. అప్పుడు నాకు మా ఊరు మళ్లీ గుర్తుకు వచ్చింది. ఊరు గురించి, గతం గురించి, నా గురించి చెప్పినప్పుడంతా అలవాటుగా చిన్ననాటి నుంచి, నేటి వరకు ఇంట్లో మాట్లాడుకుంటున్న మాటల తీరు బయటికి వస్తుంది. అదే సంగతి ఆ అమ్మగారితో చెప్పాను. ఆవిడ నవ్వేసి వెళ్లిపోయారు. ఆలోగా నా వ్యాసాలను వాళ్లందరూ క్రమం తప్పకుండా చదువుతారని, అవెంతో బాగుంటాయని కూడా అభిమానం ఉట్టిపడే పద్ధతిలో చెప్పి మరీ వెళ్లారు. నాకు ఆనందమయిందా? ఏమో? అయ్యే ఉంటుంది!

మా ఊరు పేరు ఏనుగొండ. ఇంగ్లీషులో మాత్రం ‘వై’తో మొదలుపెట్టి రాస్తారు. మరిదాన్ని యేనుగొండ అనాలి కదా! కానీ అలా పలకడం అంత సులభంగా ఉండదు. కనుక అందరూ ఏనుగొండ అని మాత్రమే అంటారు. నన్ను ఇప్పటికీ మా వాండ్లందరు ఏనుగొండ గోపి అని మాత్రమే పిలుస్తారు. ఈ దేశంలో చాలా ఊళ్లున్నాయి. రాంపూర్ అనే ఊళ్లు మన దేశంలో 84 ఉన్నాయట. ఇది తపాలా శాఖ వారు చెప్పిన సమాచారం. నేను మాత్రం బల్లగుద్ది, మరి దేన్నయినా గుద్ది నమ్మకంగా చెప్పగలను, ఏనుగొండ అనే ఊరు మరొకటి లేదు. మా ఊరు పక్కనే పాల్కొండ లేదా పాలకొండ అనే ఊరు కూడా ఉంది. చారిత్రక ఆధారాలు తెలియవుగానీ, ఆ పాలకొండ నిజానికి పాలకుండ అని, మా ఊరేమో వెన్నకుండ అని పెద్దవాళ్లు చెప్పారు. ఆ పేర్లు రానురాను పాలకొండ, ఏనుగొండగా మారాయి. లోకాయపల్లి సంస్థానం అని ఒకటి ఉండేదట. ఆ సంస్థానం దొరలకు ఈ ఊళ్ల నుంచి పాలు, వెన్న అందేవట. ఇవన్నీ అట అన్న సంగతులేగానీ ఎంతవరకు నిజాలో నాకు తెలియదు. మా ఊరికి కొంతదూరంలో ఉన్న ఒకానొక గుట్టకు ఊరగుట్ట అని పేరు. దాని మీద ఒక విచిత్రమైన రాయి ఉంటుంది. మామిడికాయ ఆకారంలో ఉండే ఆ రాయి, ఎప్పుడు దొర్లి పడుతుందా అన్నట్టు ఒక పెద్దరాతి మీద కొంతమాత్రమే కింద రాతికి తగిలి నిలబడి ఉంటుంది. పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను, అది పడను మాత్రం పడలేదు. హైదరాబాద్ చుట్టూ ఇటువంటి రాళ్లను పరిశీలించే ఒక బృందం ఉంది. వాళ్లు మా రాతిని, మామిడికాయ రాతిని చూచింది, లేనిది తెలియదు.

ఏనుగొండ అనే మా ఊరు మొదట్లో ఆ గుట్ట కింద ఉండేదట. గుట్ట కింద అంటే గుట్ట ఉన్నచోట కాదు. దాని పక్కన అని అర్థం. అక్కడి నుంచి ఊరు రెండు అంచెలలో ప్రస్తుతం ఉన్నచోటికి వచ్చింది. ఇందుకు సాక్ష్యంగా గుట్ట ప్రాంతంలో, మధ్యలో ఉండే పొలాలలో తవ్వకాలు జరుగుతూ ఉంటే బూడిద, కాలిన మన్ను, కుండముక్కలు లాంటివి దొరికాయి. ఒకానొక పొలంలో ఏకంగా గణేశుని విగ్రహం దొరికింది. ఆ విగ్రహానికి ఎక్కడో ఒక చిన్న లోపం ఉన్నట్టు నేను గమనించాను. అవి నేను బడిలో చదువుకుంటున్న రోజులు. ఫలానా వాళ్ల పొలంలో దేవుడు దొరికాడు అని ఊళ్లో కలకలం మొదలయింది. అందరమూ కలిసి వెళ్లాము. గణేశుని విగ్రహాన్ని తవ్వి బండికి ఎత్తించి ఊళ్లోకి తెచ్చాము. అది భారీగానే ఉంది. దానికి పూజలు, పునస్కారాలు కూడా జరిగినట్టు గుర్తు. ఇటువంటి సందర్భాలలో నాన్న నిశ్శబ్దంగా ఉండేవాడు. ఊళ్లో బ్రాహ్మణ కుటుంబాలు రెండే రెండు. అందులో మాది ఒకటి. విగ్రహం దొరికినప్పుడు దాన్ని చూడడానికి నాన్న తప్పకుండా వచ్చి ఉండాలి. ఆయన వచ్చినట్టు నాకు గుర్తులేదు. తరువాత ఆయన ఒక సిద్ధాంతం చెప్పాడు. విగ్రహంలో లోపం ఏర్పడితే దాన్ని భూస్థాపితం చేయడం పద్ధతి అట. అట్లా చేసిన విగ్రహం ఏదో ఒక రకంగా మళ్లీ అందరి దృష్టికి వచ్చింది అని ఆయన అన్నారు. నాకూ నిజమే అనిపించింది. ఇన్ని సంవత్సరాల తరువాత ఆలోచిస్తే, ఆ విగ్రహం ఏమయింది అన్న ప్రశ్న నా మెదడులో ఇవాళ పుట్టింది. దానికి పూజలు ఎందుకు కొనసాగలేదు అన్న ప్రశ్న కూడా మనసులో తొంగి చూసింది. నేను ఈ మధ్యన మా ఊరికి వెళ్లడానికి కారణం కనిపించడం లేదు. ఈసారి వెళ్లి గణపతిని వెతకాలి.

ఊళ్లో ఒక ఆంజనేయుని గుడి ఉన్నది. దాన్ని చిన్నప్పటి నుంచి హనుమాండ్ల గుడి అనడం అలవాటు. నేను కనీసం హ అనే అక్షరం వాడాను. మా ఊరి వాండ్లకందరికీ అది అన్మాండ్ల గుడి మాత్రమే. నాకు తెలిసి అందులో నిత్యం ధూప దీపం నడిచేది కదా. ఊళ్లో మాకున్న కొద్దిపాటి పొలం ఇనాం భూమి అని చెప్పారు. ఏం చేయడానికి ఆ ఇనాం ఇచ్చారో నా వరకు రాలేదు. ఆ గుడిలో దీపం పెట్టే బాధ్యత మాత్రం మాది కాదని, ఆ బాధ్యత ఎవరికీ లేదని అనుభవం వల్ల నాకు తెలిసింది. నేను చదువు పేర ఊరు వదిలి బయటకు వచ్చిన తరువాత ఆ గుడిని మరమ్మతు చేయించారు. నిత్యం పూజలు చేయగల కుటుంబాలు ఊళ్లో లేవు. ఈ మధ్యన మరెవరో పై ఊరి పెద్ద మనిషి వచ్చి ఊళ్లో ఉంటున్నాడని, పౌరోహిత్యం సాగిస్తున్నాడని ఎవరో చెప్పగా విన్నాను. ఆయన ఏమయినా గుడిని పట్టించుకుంటున్నాడేమో తెలియదు.

కార్తీకమాసం వస్తే ఊళ్లో వాళ్లు రోజుకు ఒకరు చొప్పున కార్తీక పూజ అనే ఆకుపూజ చేయించేవారు. నాకే నమ్మకం కలగదు గానీ కొంతకాలం ఆ పూజలు చేసే బాధ్యత నా తల మీద పడింది. తెలిసిన కుటుంబాల వారు పొద్దునే్న సరంజామాతో వచ్చి ‘ఇవాళ కార్తీకం చెయ్యాలె! అన్మాండ్లకు చెండూరం పెట్టు, సాయంత్రం పూజ కూడ చేయించు’ అని అడిగేవారు. నాన్న ఎందుకో పౌరోహిత్యం చేయడు. కనుక నేను కాదనలేక పోయేవాడిని. సరంజామాలో సాహిత్యం ఉంటుంది. ఈ సాహిత్యానికి అక్షరాలకు సంబంధం లేదు. ఆ రోజున దేవుని నైవేద్యానికి, నా తిండికి సరిపడ బియ్యం, పప్పు, బెల్లం, కూరగాయలు లాంటివి కలిపితే దాని పేరు సాహిత్యం. సాహిత్యం అన్న మాటకు సరయిన అర్థమేమిటో ఇప్పటికయినా నేను వెతుక్కోవాలి. ఇక సింధూరం, నూనె కూడా ఉంటాయి. నూనె కలిపిన సింధూరాన్ని హనుమంతుని విగ్రహానికి పట్టించాలి. ఆ పని చేతులతోనే చేయాలి. చేతికి, గోళ్లలో పట్టిన రస సింధూరం నా శరీరానికి హాని కలిగిస్తుందని నాకు అప్పట్లో తెలియలేదు. తెలిసిన తరువాత ఎవరూ నన్ను కార్తీకం చేయించమని అడగలేదు. నేను అక్కడ ఉంటేగదా!

ఝలక్: ఈ ముక్క రాస్తూ ఇక్కడ ఆపాను. చిత్రంగా అనుకోకుండా మరునాడు మహబూబ్‌నగర్ అనే పాలమూరుకు వెళ్లాను. అదేదో జక్కడు జాతరకు పొయ్యొచ్చినట్టు, పాతి ముట్టిచ్చుకోని (అంటే ఏమో ఎవరికన్న తెలుసునా పోవలసిన చోటికి పొయ్యి, వంటల పొయ్యి కాదు, వెళ్లి, చేరి లాంటిదన్నమాట, దాన్ని తా వెనిక్కి వస్తే అది పాతి ముట్టిచ్చుకోవుడు) తిరిగి వచ్చిన నాకిప్పుడు ఏనుగొండలోకి పొయ్యే మనసు లేదు, సమయము అంతకన్నా లేదు. పోయేటప్పుడు తొందర, తిరిగి వచ్చేటప్పుడు అంతకన్నా తొందర. మొత్తానికి నాకొక చిత్రం అర్థమయింది. ఈ చిత్రము విచిత్రము గావచ్చును లేదా బొమ్మ గావచ్చును. పంచాయతి సమితిగా నాకు తెలిసిన మా ఊరు ఇప్పుడు, పట్నమయిన పాలమూరు అను మహబూబ్‌నగర్‌లోని ఒక వార్డు మాత్రమే.
ఊరి గుర్తింపు గంగలో పోయింది. అయినా సరే, మా ఊరి గురించి చెప్పుకోవలసిన సంగతులు నా మనసులో మాత్రం కావలసినన్ని ఉన్నయి.

Monday, March 30, 2015

నా కొడుకు తెలుగు రచన

మిత్రులారా,
నా కొడుకు తెలుగులో రాసిన నాలుగు మాటలను చదవండి.
వీలయితే కామెంట్ చేయండి.

Link here!

Friday, October 25, 2013

కొలతలు - నిష్పత్తులు

తెలంగాణము ఏర్పడుతున్నది: ఏర్పడుతున్నది అన్న మాటకు వేరుగా పడుతున్నదని అర్థమనుకుంట. సరే, గాని మన మిత్రుడు, మంచి కవి. కవిత రాసి చూపించాడు. దాన్ని అచ్చు వేసేట్లయితే ఈ ప్రసక్తి వచ్చేది కాదు. చదివి వినిపించాలి. అందులో ఆయన రణము అన్న మాట వాడుకున్నాడు. చదువుతుంటే, అది రనము అయింది. మాట మార్చగూడదా అంటే యుద్ధము అన్నాడు. అది యుద్దము అయింది. ఎందుకొచ్చిన బాధ? పోరు అంటే పోతుంది గదా అనుకుని ఇద్దరమూ సర్దుకున్నాము. సంస్కృతం ప్రభావం పోయి మనమంతా తమిళులను తలదన్నుతున్నాము. ఈ నేపత్యంలో పరిస్తితి ఎవరికీ అర్తమవుతలేదు! కృష్ణ అన్న మాటను క్రిష్న, క్రుష్నగా మార్చేసుకున్నాము. ఆంద్రప్రదేశ్ అన్నది అలవాటయి పోయింది. వేరు పడుతున్న పది జిల్లాలను తెలుగునాడు, లేదా హైదరాబాద్ రాష్ట్రం అంటే పోతుందేమో? తెలుగుదేశం అందామంటే, ఆ అందమయిన మాటను కొందరు కబ్జాచేసి పెట్టుకున్నారు మరి. ఈ కబ్జా అనే మాటను కంప్యూటర్ తెలుగులో సరిగా రాయడం కుదరదు. అది సిసలయిన ఉరుదూ మాట! ఆక్రమణ అని అర్థం!

* కళల్లో: కలల్లో ఏం కనిపించినా సర్దుకుపోవచ్చు. అది మరెవరికీ కనిపించదు. మనం వర్ణించి, (వర్నించి కాదని మనవి!) చెప్పలేము. కాని ఇళ్లల్లో కనిపించేవి ఇంచుమించు సహజంగ ఉండాలి గద! మా ఇంట్లో ఒక పెయింటింగు ఉంది. (అదిప్పుడు ఎక్కడో దాగి ఉంది) అందులో గీతాబోధ దృశ్యం? అవును అదే! క్రుష్నుడు, ర్జనులకు సంబంధించినది. నా దృష్టి మాత్రం గుర్రాల (బండి ర?) మీద! ఎంత సేపు చూచినా, మొత్తం ఎన్ని గుర్రాలున్నయి, వాటన్నిటికీ కలిపి ఎన్ని కాళ్లున్నయి అర్థమయేది కాదు. పెయింటింగులంటే అట్లాగే ఉండాలి. సర్రియలిజం అనే స్వగోలజం, డాడాయిజం వరకు పోనవసరం లేదు గానీ, పెయింటింగులో కొలత తేడాలుంటేనే సృజనాత్మకత ఉన్నట్టు లెక్క. మామూలు ఫొటోగ్రాఫు వలె ఉంటే, ఆ పెయింటింగును నేను అంతసేపు గమనిస్తానా? గుర్తుంచుకుంటానా? ఇక్కడ ప్రస్తావిస్తానా? ఈ మధ్యన అంతర్జాతీయంగా పెయింటింగ్‌లో ఒక ట్రెండ్ వచ్చింది. మరీ ఫొటోగ్రాఫులాగ బొమ్మలు గీయడం ఒకటి. కంప్యూటర్ సాయంతో ఫొటోను, పెయింటింగ్ వలె కనిపించేలాగ చేయడం! ఒకటని రెండు సంగతులు చెప్పినట్లున్నాను. విశ్వనాథ వారి ప్రభావం.. ఇచ్చటనొక విషయమున్నది, ఒకటియనగా రెండు!అంటారాయన!

ప్రపంచమంతటా, కాలెండరు కొరకు బొమ్మలు గీయడం ఒక పెద్ద కళా విశేషం. (మల్యాగారు కాలెండరు భామలతో పడే కష్టాలు ఎన్‌డిటీవీ గుడ్‌టైమ్స్‌లో చూడగలరు!) గతంలో మందు కంపెనీల వారు గుడ్డలు తడిసిన అమ్మాయిల పెయింటింగులతో మాత్రమే సంతృప్తి పడేవారు. మరి కొందరు, మన దేశంలోని వివిధ దేశాల అందమయి స్త్రీల బొమ్మలను, సచేలలుగా, (అనగా గుడ్డలతో సహా!) బొమ్మలు గీసి కాలెండర్లు వేసేవారు. ఆ అమ్మాయిలకు, కావ్యాలలో వర్ణించిన, చేపల వంటి కన్నులు, శంఖం వంటి మెడ వగైరాలుంటాయి. సరదాకు నేను ఆ రకం బొమ్మలు కొన్ని సేకరించి, స్కాన్ చేసి, నా బ్లాగులో పెట్టి ఇలాంటి అందగత్తె నిజంగా ఉంటే, మీరేమంటారు లాంటి చితిని (చిలిపి) మాట ఒకటి రాశాను. ఎంట్రీకి ఇండియన్ బ్యూటీస్అని పేరు పెట్టాను. ఇంటర్‌నెట్‌లో ఈ-మేల్, ఫీమేల్ అనేవి ముఖ్యమయిన ఆకర్షణలని నా ఉవాచ! కావాలంటే ఉద్ఘాటిస్తాను, నొక్కి వక్కాణిస్తాను కూడా! అమ్మాయి బొమ్మలు చూడదలుచుకున్న వారంతా సెర్చ్లో ఇండియన్  బ్యూటీ అని కొట్టడం, నా బ్లాగుకు రావడం,  ఈ బొమ్మలను చూడడం! (నన్ను తిట్టుకుని వెళ్లిపోవడం!) అదొక సరదా! నా బ్లాగులో టాప్‌టెన్ పేజీల్లో ఇది కూడా ఒకటయిందంటే, సంగతేమిటో అర్థమయే ఉంటుంది!

ఈ నేపథ్యంలో మనం మాడరన్ ఆర్ట్ గురించి మాట్లాడుకుంటే పరిస్థితి తీవ్ర ఇబ్బందికరమవుతుందని చెప్పక తప్పినది కాదు!

* స్థాపత్యం అని ఒక శాస్త్రం ఉంది. అందులో నుంచే స్థపతి అనే మాట వస్తుంది. దేవుని విగ్రహాలను, గుడులకు సంబంధించిన మిగతా సంగతులను ఈ శాస్త్రంలో వివరిస్తారు. ఒక విగ్రహం ఎంత ఎత్తుంటే, ఏయే భాగంలో ఎంత వెడల్పు ఉండాలి. శరీర భాగాల కొలతల్లో ఉండే సాపేక్ష నిష్పత్తులేమిటి, తెలియడానికి లెక్కలుంటాయని చెపితే విన్నాను. తరువాత స్థాపత్యం గురించి తెలిసింది. ఈ లెక్కలు ఉన్నందుకే దేవుని విగ్రహాలన్నీ జీవకళతో, సహజంగా కనిపిస్తుంటాయని అర్థమయింది. ఇక్కడ నాకు ఒకటి, అనగా రెండు సంగతులు గుర్తొస్తుంటాయి. తిరుపతి ఎంకన్న, వెంకన్న (ఏదయినా ఒకటే) విగ్రహంలో మోకాళ్ల నుంచి కింది భాగంలో ఏదో తేడా కనపడుతుంది. అసలు కాళ్లు ఇంకొంచెం లోతులో ఉన్నాయని, కనిపించే వెండి పాదాలు, వేరుగా తగిలించినవని పెద్దలు చెప్పగా విన్నాను. అసలా విగ్రహం బాలాంబిక విగ్రహమనీ, వక్షంలో ఆ తేడా తెలుస్తుందని అన్నవారున్నారు. (చదువరీ మనము దారి తప్పక ముందే తిరిగి విషయములోనికి వెళ్లుదము!) అమ్మవారు, స్వామివారి పక్కన ఉన్నట్లు విగ్రహాలుంటే, వారిద్దరి ఆకారాలు, దామాషా పద్ధతిలోనే (ఎస్టిమేట్స్, ఉజ్జాయింపులకు) సరిగ్గా ఉంటాయి ఉదాహరణ సీతమ్మ, రామయ్యలు! అదే అమ్మవారు, స్వామివారి అంక భాగంలో ఉంటే, ఈ నిష్పత్తిలో కొంచెం తేడా కనపడుతుందని నా మెదడు(?)కు తోచింది. మాలోల నరసింహుల తొడ మీద ఆసీనులయిన అమ్మవారు మరీ చిన్నగుంటారు! కాదా!

రామప్ప గుడిలో నిలబడిన అమ్మాయిలు (శిల్పాలే!) ఏ క్షణంలోనయినా దిగి వచ్చి, ఓ చిరునవ్వు కూడా పడేస్తారేమోనని నేను ఎదురుచూస్తిని! నిజంగా అంత సహజంగా ఉంటాయి ఆ మూర్తులు! ఇంక మీరు, గతంలో చూచిన విగ్రహాలు ఏవి సహజంగ ఉన్నాయి, ఏవి లేవని ఆలోచిస్తారు. ఆలోగా, మరో కొన్ని మాటలున్నాయి.

కూడలిలో, దారి పక్కన నిలబడి మనకు మార్గదర్శనం చేస్తున్న (చేసిన కూడా) నాయకుల  తెలిసినవే. అవన్నీ లైఫ్ సైజ్ కన్నా పెద్దవయినా సరే, సౌష్ఠవం అంటే అసలు కొలతల నిష్పత్తులు మారవు! గమనించారా? ఒకప్పుడు హైదరాబాద్‌లో స్టేడియం దగ్గర ఒక నాయకుని విగ్రహం ప్రతిష్ఠించారు. భారీగా అనావరణం, అనగా తెర తొలగించుట కూడా అయ్యింది. తరువాత, ఆ బొమ్మ ఆయన నిజమూర్తి వలె లేదన్నారు. విగ్రహాన్ని మార్చారు. కేవలం సహజంగా కనపడాలనే గదా?

ట్యాంకుబండ్ మీద నిలిచిన విగ్రహాలలో కొన్ని కేవలం ఊహామూర్తులు. కృష్ణదేవరాయలు పొట్టివాడని చరిత్ర చెపుతుంది. ఇక్కడ మాత్రం భారీ మనిషి. అందుకు మాడల్ సాక్షాత్తు ఎన్‌టీఆర్ అన్నగారేనట తెలుసా?

ఇంకా ఉందా? ఏమో చూద్దాం.
...........................*


మా ఇంట్లో యింకో కుష్ణమూర్తి ఉన్నాడు. అంటే మొదలు ఒక కృష్ణమూర్తి ఉండనే ఉన్నాడని అర్థంగద. ఒకాయన వ్యత్యస్త పాదారవిందుడు. రెండో (ఈ మధ్యన టీవీలో రొండోఅని రాస్తున్నరు) ఆయన కాళ్లు పక్క పక్కననే వున్నాయి. ఈ రెండో ఆయన వెనక ఒక ఆవున్నది. లేక, లేగ, దూడనా? ఈ బొమ్మలు పొడవు వెడల్పులనే నిష్పత్తులు, అదే స్థాపత్య సూత్రాలు, మామూలు మాటల్లో సౌష్ఠవం, వాస్తవికత, సహజత్వం అసలు లేవని నాకనిపిస్తుంది. ఇంతకూ, శిల్పాలు, చిత్రాలలో మూర్తులు సహజంగా ఉండవలెనా? లేక అవి ప్రతీకలు మాత్రమే గనుక ఎట్లాగయినా ఉండవచ్చునా? ఈ అనుమానం నాకు చిన్నప్పటి నుంచీ ఉంది. రానురాను అది మరింత అనుమానమవుతున్నదే తప్ప, విడిపోయే వీలు కనపడటం లేదు. మీరేమంటారూ?

Sunday, October 20, 2013

కాలం కదులుతుందా?

లీ చైల్డ్ అనే రచయిత జాక్ రీచర్ అనే పాత్రను సృష్టించాడు. ఈ రీచర్ నిజంగా విచిత్రమయిన మనిషి. రీచర్ సినిమాలు కూడా వస్తున్నాయి. రీచర్ నిద్రకు ఉపక్రమించి సరిగ్గా గంట యాభయి నిమిషాలకు లేవాలనుకుంటాడు. లేస్తాడు. వీలవుతుందా. మీకు వీలవుతుందా. అసలు మీరది ప్రయత్నించారా. కొందరికి వీలవుతుందనిపిస్తుంది. ఇక్కడ విషయం కాలం కదలిక గురించి. తరువాత ఆ కదలిక మనకు తెలియడం గురించి.

చాలా కాలం గడిచింది అనడం మనకు మామూలయింది. ఇప్పుడున్నది ఇంకో క్షణంలో ఉండదన్నది మన అనుభవం. ఆ క్షణమే ఉండదు. అనుక్షణం ఆ క్షణం గతమవుతుంది. కనుకనే కాలం గడిచింది, కదిలింది అన్న భావం మనకు కలుగుతుంది. ఇక్కడ ఏం కదిలింది. ఎట్లా కదిలింది. కాలమంటే ఒక పదార్థం కాదు, వస్తువు కాదు. ఇప్పుడిక్కడ ఉండి ఇంకో క్షణం ఇంకో చోట ఉండడం కాలానికి చేతగాదు. మరి కాలం కదిలిందంటే ఏం కదిలింది. ఎట్లా కదిలింది. ఎక్కడినుంచి ఎక్కడికి కదిలింది. కాలం ముందుకే కదులుతుందట. వెనక్కు కదలదట. ఇది మరో విచిత్రం.

ఏం కదిలింది, ఎట్లా కదిలింది తెలియకుండా, ఎంత వేగంగా కదిలిందన్న లెక్క కుదురుతుందా. ఎండలో నిలబడ్డది ఇష్టమయిన వారితోనయితే, వారి కొరకయితే, ఎండ తెలియదు, కాలం కూడా తెలియదంటారు. ఎదురుచూపులో ఎద బరువు కారణఁగా క్షణమొక యుగమయిందంటారు. వేరే ఊరికి పోతుంటే కాలం బరువుగా సాగుతుందట. తిరిగి ఇంటికి వస్తుంటే మాత్రం చాలా సులభంగా సాగుతుందట. అంటే కాలానికి ఒక నిర్ణీతవేగం లేదా

సైన్సు ప్రకారం భూమి 365 దినాలకు ఒక సారి సూర్యుని చుట్టు తిరుగుతుంది. 24 గంటలలో తన చుట్టు తాను తిరుగుతుంది. ఇక్కడ నుంచి లెక్కవేసి గడియారాలు తయారు చేశారు. అంతా అర్థమయిపోయిందనుకుని మరీ నిక్కచ్చిగా పనిచేసే అణుగడియారాలను కూడా తయారు చేశారు. అప్పుడప్పుడు గడియారానికి ఒక్క క్షణం కలిపి సరిచేస్తున్నామంటున్నారు. ఇంతకూ ఈ గడియారాలు ఏం కొలుస్తున్నయి. కాలం గడియారం ప్రకారం కదులుతుందా, గడియారం కాలం ప్రకారం కదులుతుందా.

కాలం ఒక అనుభవం. దాని కదలిక కూడా అనుభవం. దానికి ఒక వేగం ఉందా. దాన్ని గడియారాలు లెక్కబెడుతున్నాయా. లేనేలేదు. గడియారాలు కదులుతున్నాయి. మనం కాలం కదిలిందని అనుకుంటున్నాము.

ప్రపంచంలో ఎన్నో వస్తువులు ఉన్నాయి. వాటి మధ్యన పరస్పరం ఒక సంబంధం ఉంది. ఆ సంబంధం మారుతూ పోతుంది. గడియారాన్ని చూస్తుంటే ఎప్పుడూ ఒకే టైం కనబడదు. ఇప్పుడొక టైం ఉంటుంది. కొంచెం సేపయిన తరువాత చూస్తే, టైం కదిలి కనబడుతుంది. నాలుగు నిమిషాలు కదిలి కనబడింది అనుకుందాము. నాలుగు నిమిషాలు అంటే ఏమిటి. నిమిషాల ముల్లు వేగంగా కదులుతుంది. గంటల ముల్లులో ఆ వేగం అంత సులభంగ కనిపించదు. సెకండ్ల ముల్లు ఉంటే అది మరింత వేగంగ కదులుతూ కనబడుతుంది. మనం రెండవసారి గడియారం చూచినప్పుడు కొంత మార్పు, కదలిక కారణంగా వచ్చిన మార్పు కనబడుతుంది. అక్కడ అయిదు నిమిషాల తేడా కనబడితే, అయిదు నిమిషాల కాలం గడిచిందన్న భావం మనకు కలుగుతుంది. ఈలోగా మన మెదడు, మనసు వందల మైళ్లు తిరిగి వచ్చేసి ఉంటుంది. ప్రపంచంలో అన్ని సంగతులు అట్లాగే వేగంగా కదిలి ఉండవచ్చుగదా. అప్పుడూ గడిచిన కాలం అయిదు నిమిషాలేనా. లేదా ప్రపంచం మందకొడి అయ్యుండవచ్చు కూడా. ఈ తేడాలు పాపం గడియారానికి తెలియవు. అది తన మానాన తను పని చేస్తూ పోతుంది. ఇంట్లో ఉన్న ఏ రెండు గడియారాలూ ఒకే టైం చూపించవు. అసలవి చూపించేది కాలాన్ని కానే కాదు. మనం వాటికి ఒక కదలిక నేర్పించాము. వాటి కదలికతో కాలం కదులుతున్నదని అనుకుంటున్నాము.

ఒక్కసారి కళ్లు మూసుకుని ఈ ప్రపంచంలో మనం గానీ, మరో జీవిగానీ మరే వస్తువులూ, పదార్థాలూ లేవని ఊహించండి. అప్పుడు కాలం కదులుతుందా. గడియారం కదలికకూ కాలం కదలికకూ సంబంధం లేదనుకున్నాము. కాలం కదిలితే, తనంత తాను కదులుతుందని గదా. కనుక ఖాళీ ప్రపంచంలోనూ కాలం కదులుతుండాలి మరి. గుర్తుంచుకోండి. అది ఖాళీ ప్రపంచం. అక్కడ ఏ వస్తువులూ లేవు. అంటే అక్కడ ఏమీ జరగడం లేదు. అంటే ఏమీ కదలడం లేదు. సంఘటనలు లేవు. సంగతులు లేవు. మరిక కదలిక ఎక్కడిది. కాలం కదలిక మాత్రం ఎక్కడిది.


చదువుతుంటే కాలం కదిలినట్టు తెలియనే లేదు, అంటారేమో. ఆలోచించండి. మీకు సంతోషమయితే నాకూ సంతోషమే. మీకు బుర్ర తిరిగి తలనొప్పి మొదలయితే అంతకన్నా సంతోషం. సంతోషంలో నా కాలం వేగంగా గడుస్తుంది. తలనొప్పితో మీ కాలం ఆగిపోతుంది. కుంటి నడకలు నడుస్తుంది. అయినా గడియారం మాత్రం తన వేగంతో తాను నడుస్తుంది. ఇంతకూ కాలం కదులుతుందా, ఆలోచించండి.

Wednesday, October 9, 2013

మనిషి తీరు

మనిషి తీరే అంత
చేయలేని పనులను చేస్తూ, పడుతూ లేస్తూ
అసాధ్యమయిన పనులను అలవోకగా సాధిస్తూ
ఆలోచనలకు అందని దూరాలకూ, తీరాలకూ చేరుకోవడం

నక్షత్రాల మధ్యన పుట్టిన మనిషి
నక్షత్రమయ్యే దాకా నలిగి పోతుంటాడు
నక్షత్రాలను తాకుతాడు, వాటితో ఆడుకుంటాడు
కలలు కంటాడు, కల్లలు కంటాడు

తోకచుక్కల మీద ఎక్కి గెలాక్సీలు దాటుతుంటాడు
అంతా చూడాలని, అంతా తెలుసుకోవాలని తపన
అనంతమయిన ప్రశ్నలకు ఆన్సర్ వెతకాలని తపన
అందినా అందకున్నా అసంతృప్తి మిగిలే ఉండాలి

అగాధాలను, అత్యున్నత శిఖరాలను
స్థల కాలాలలోని వంపులను
తెలియని సంగతుల సొంపులను
కళ్ల ముందు చూడగలగాలన్నది ఒకటే గమ్యం
అది ఒక మంట
ఆలోచనల గురించిన మంట
మనసులో మంట

మనిషి తీరు అంతే
(పై బొమ్మ చాలా పెద్దది. వాల్ పేపర్ గా పనికి వస్తుంది. సేవ్ చేసి వాడుకోండి)

Friday, September 27, 2013

నాకు సమ్మతమే

కొంత మంది నిత్యం రాస్తారట. నిత్యం ఆలోచనలు రావద్దూ. వాళ్లకు వస్తాయేమో. నిత్యం రాస్తే చెప్పనవసరం లేని సంగతులన్నీ ప్రపంచం ముందు ఉంచడమవుతుందేమోనని నా అనుమానం. ఒకనాడు, నేను లేనిదే ఈ ప్రపంచం ఎట్ల నడుస్తుంది అని అనుమానం వస్తుంది. కానీ క్షణం నిలబడి చూస్తే నీ గురించి పట్టించుకునే వారే లేరని అర్థమవుతుంది. ఒకనాడు అట్లా అనిపించక పోవచ్చు. ఇందాక ఒకాయన ఫోన్ చేసినడు. ఆయనకు మన వద్ద ఏదో దొరుకుతుందని నమ్మకం కలిగినట్టుంది. అందుకు వేరే వారు మరి కొందరు కారణమవుతరు. కొందరు మన మంచితనం రుచి చూచి ఉండే అవకాశం ఉందిగద. వాంఢ్లు మంచివాడులే అంటరు. ఈ కొత్త మనిషి ఆ ఆలోచనను వెంటబెట్టుకుని మన మీదికి దండయాత్ర చేస్తడు. మంచివాడులే అన్న మనిషి మనతో ఏ సందర్భంలో ఏ రకంగ మాట్లాడిందీ ఇక్కడ ప్రస్తుతం గాదు. ఆ మనిషికి మనం మంచి వాండ్లమేనన్న భావం కలిగింది. ఇవాళ మన కర్మ ఎట్లున్నదో ఆయన చూడవచ్చినడా. రాడుగద.



ఆయనకు కావలసిందేదో అడగడము చాతగావాలె. లేకుంటే అది దొరకదు. ఇంతకు ఆ వస్తువు నా దగ్గర ఉందన్న భావము ఎందుకు కలిగింది. మీ కొరకు తెగ వెతుకుతున్ననంటడు. అంత అబద్ధం. నేనేమన్న సూదినా ఎంత వెతికినా దొరకకుండ ఉండేందుకు. నన్ను చెట్టెక్కించాలె. మతలబ్ కీ దునియా అని ఒక మాట ఉన్నది. లోని అర్థము వేరని భావము. నోనెక్కడనో ఒక వ్యాసము రాసిన. రాసి ఊరుకుంటే కథే లేదు. అది పత్రికలో వచ్చింది. అందులో నేనేదో సంగతి రాసిన. అది చదివిన వారికి నా దగ్గర ఒక వస్తువు ఉన్నదన్న భావము కలుగుతుంది. వ్యాసము ఉద్దేశ్యము మాత్రము అది కాదు. మరేదో సంగతి గురించి చెప్పినా ఒక పదార్థము లేదా వస్తువు నా దగ్గర ఉందన్న భావము కలుగుతుంది.  ఆ వస్తువు కావాలనుకున్న వారంత నా మీదికి దండయాత్ర చేస్తే నేనేమవుత?

సరిగ్గ అదే జరిగింది. ఆ వస్తువు నా దగ్గర ఉన్నదా లేదా అన్నది ప్రశ్నే కాదు. ఒక పక్షాన ఉంటే అది నేను ఎంత మందికి ఇవ్వగలుగుతానన్నది ఇంకొక సంగతి.

మొత్తానికి నాగురించి పట్టించుకున్న వారు ఉన్నరని రుజువయింది. అయ్యా, దాని వలన ఎవరికి ఎంత ప్రయోజనము కలిగింది. అది ప్రశ్న.

నిత్యం రచనలు చెస్తుంటే ఇట్ల పిండి పిసికే సంగతులు తప్ప మతలబు గల మాటలు రావు. ఇంక ఆలోచనలను పంచుకోవడమని మరొక పద్ధతి ఉన్నది. అంటే రాయనవసరము లేకుండ, అంత దూరము పోకుండనే మాటలతోటి మందిని మప్పగించడము ఇక్కడ జరుగుతుంది. ఎప్పటికి మప్పగించడమే కాకపోవచ్చు. అప్పుడో ఇప్పుడో మంచి మాట రాక పోదు. ఎవ్వరు గూడ ఎప్పటికి మంచి మాటలనే చెప్పజాలరు. సైన్సులో ఏ విషయమయినా అండర్ ద గివన్ కండిషన్స్ మాత్రమే సత్యము. ఒక పరిస్థతిలో మాత్రమే అవి సత్యము. ఒకటి కూడ కాదు. కొన్ని పరిస్థతులు. తరువాత మరొకరు వచ్చి ఇది సత్యము కాదు, అని నిరూపించే వరకు మాత్రమే ఏదయినా సత్యము. మాటలు కూడ ఎటువంటి పరిస్థతిలో పలుకబడినవి అన్న ప్రశ్న పుడుతుంది గద. గొప్పవారు చెప్పినవన్ని గొప్ప మాటలేనా. అప్పుడప్పుడు వారు కూడ అనుమానాస్పదమయిన వంగతులు చెప్పే వీలు ఉన్నదిగద. అందుకు కొన్ని కారణములు టయి. వారొక మాటను ఒక సందర్భములో చెప్పి ఉంటరు. అది ఆ సందర్భములో సత్యమే. కాని సందర్భమును పక్కనబెట్టి మాటను మాత్రమే మనము ఉదహరించినప్పుడు దానికి వేరే అర్థములు తోచే ప్రమాదము ఉన్నది.

నిత్యము రాసే వారి మాటలు, గొప్పవారనిపించుకున్న వారి మాటలను కూడ తర్కించి గాని అంగీకరించ గూడదని తాత్పర్యము.

ఆలోచించండి. అవుననిపించినా కాదనిపించినా నాకు సమ్మతమే.

ఆ సంగతి మీరు కడుపులో దాచుకుంటే మాత్రము మాకు ఏ సంగతీ తెలియదు. అవునా, ఆలోచించండి.

Tuesday, September 17, 2013

ఎందుకో తెలుసా?

నేను మా ఆవిడతో పేకాడడం మానేశాను.
అసలు నేను మా ఆవిడతో పోటీ పడడమే మానేశాను.

ఎందుకో తెలుసా?

ఎన్ని సార్లు పేక ఆడినా ఆమే గెలిచింది. అట్లాగని నాకు కార్డు ముక్కలాట రాదనుకుంటున్నారేమో?
నేను పెద్ద ఎత్తున పైసలు పెట్టి ఆడే వారి మధ్యన కూడా బాగా ఆడతాడని పేరున్న మనిషిని. కానీ అదేమి చిత్రమో తెలియదు, మాయామెతో మాత్రం గెలిచింది తక్కువ. నిజం ఒప్పుకుంటున్నాను, మరీ పిచ్చిగా, ఇంట్లో ఉన్న మంచి డెక్కులన్నీ బయట పడేసి జన్మలో కార్డులాట ఆడ కూడదని నిర్ణయించుకున్నాను.

ఆటలో ఓడిపోతే ఎదుటి వారు ఎంత మిత్రులయినా గొంతు పిసికేయాలన్నంత కోపం వస్తుంది, నిజమే కదూ
నా భార్యకు రమ్మీ ఒకటే వచ్చు. నేను జాకీ మణేలా అనే తురుఫు ఆట మొదలు ఎన్నో రకాలు వచ్చు. ఆడి గెలిచినది అబదఅదం కాదు. కానీ ఇప్పుడు ఆడడం లేదు.

కొంత మందికి తెలియకుండానే మంచి కార్డులు పడుతుంటాయి.  అవి ఎప్పటికీ వాళ్లకే పడుతుంటాయి. అది విచిత్రం.

బతుకులోనూ అంతే. కొందరికి మంచి జరుగుతూనే ఉంటుంది. తెలియకుండానే జరుగుతూ ఉంటుంది. కొంత మందికి మంచి జరిగినా మంచిలాగ కనిపించదు. అసలది అర్థమే కాదు. దానితో ఒక రకమయిన భావన మనసులో నిలుస్తుంది. బలుస్తుంది. అదంతే అన్న భావం వచ్చిన తర్వాత మంచి జరిగినా కనిపించదు. అర్థం కాదు.


తాము పంచినా మరొకరు పంచినా కార్డులు ఒక్కరికే ఎప్పుడూ మంచివే పడుతున్నాయంటే, అక్కడేదో మోసం జరుగుతున్న భావం కలగడం సహజం. నేను ఇంటర్నెట్ మీద ఒక తెలివి పరీక్ష తీసుకున్నాను. నిజంగా నాకే ఆశ్చర్యం కలిగేటన్ని మార్కులు వచ్చినయి. నేను తెలివి గలిగిన మనిషినని ఎన్నో చోట్ల ఎన్నో సందర్భాలలో ఎందరో ఒప్పుకున్నారు. మామూలు చదువులోనూ మంచి గుర్తింపు సంపాయించుకున్నాను. కానీ, ఈ ఇంటర్నెట్ వారు మాత్రం, ఫలితం ఇస్తూ, నీవు మోసమైనా చేసి ఉండాలి (ఒక అసభ్యమయిన మాటతో సహా), లేదంటే నిజంగా గొప్ప తెలివి గలవాడవయినా అయ్యుండాలి అని రాశారు. వారి పరీక్ష పద్దతిలో అంతగా మోసం చేసే వీలు ఉన్నదీ లేనిదీ వారికే తెలియదా, లేక ఒకనికి మరీ అంత తెలివి ఉందని ఒక్క సారిగా ఒప్పుకునే ఇష్టం లేకనా వారు ఆ మాటలన్నది

వరుసగా ప్రశ్నలు, వాటికి వేగంగా జవాబులు. ఇక అక్కడ మోసానికి తావేదీ. పరీక్ష గడిచిన సమయం ఎంతో లెక్కించే వీలు అక్కడ ఉందా, నాకు గుర్తు లేదు. ఎందుకో నాకు అర్థం కాలేదు గానీ, వారు తెలివి గలవారిని అంత సులభంగా గుర్తించ దలుచుకోలేదని అనిపించింది. అదే పనిగా గెలుపు పొందే వారి మీద, (మాయావిడ గారిలాగన్నమాట) మనకు మోసం చేస్తున్నారేమోనని అనుమానం రావడం కూడా ఇట్లాంటిదేనా. వారు మోసం చేసే అవకాశం లేదని తెలిసి కూడా మనం అట్లా అనుకుంటాము, కదూ!

నేను సైన్సు చదువుతాను. అందరికీ అర్థం కావాలని  సంగతులను చేతయినంత సులభమయిన మాటల్లో మన భాషలో రాస్తాను. ఆ రకంగా నాకు కొన్ని ఆలోచనలు మనసులో పుట్టి ఎప్పటినుంచో నిలబడి ఉన్నయి.
ఉదాహరణకు మనమంతా ఈ భూమా మీద ఉన్నాము. అంతకు ముందునించీ ఈ భూమిఉన్నది.
ఈ భూమి సూర్యుని నుంచి ఒక ప్రత్యేకమయిన దూరములో ఉంది. అది ఇంకొంచెం దూరంగ ఉందనుకుందాము. భూమి మీద నీరు మంచవుతుంది. అదే , సూర్యునికి కొంచెం దగ్గరగ ఉందనుకుంటే నీరు ఆవిరయి పోతుంది. మొత్తానికి భూమి ఇప్పుడున్న దూరంలో ఉంది గనుకనే నీరు ఉండడమూ, జీవం పుట్టుకా వీలయింది. నీరు ఈ రకంగ కాక కొంచెం ఎక్కువగనో తక్కువగనో ఉంటే ఏమి పరిస్థతి ఉండేదో తెలియదు.

దూరమన్నది మన ఉనికికి ఆదారమయిన చాలా అంశాలలో ఒక్కటి మాత్రమే. వాతావరణం ఉన్నది. అందులో ఎన్నో అంశాలున్నయి. ఉదాహరణకు ఒత్తిడి. ఇదొక పరిస్థితి. దానికొక కొలత. ఈ కొలతలో ఏ మాత్రం తేడా వచ్చినా మనం ఇట్లా ఉండడము వీలుగాదు. వేడిమి సంగతి కూడ అంతే. ఒకటి రెండు డిగ్రీలు వేడిమి పెరిగిందంటే మనమంత గిలగిలలాడుతుంటము. ఇటువంటి కొలతలు మనకు తెలిసి, తెలియక ఎన్నో ఉన్నయి.

అన్నిటికన్న ఆశ్చర్యకరమయినది భూమికి ఉన్న ఆకర్షణ శక్తి.

భూమి పెద్దగ ఉండి ఒక వేగంతో తన చుట్టు తాను తిరుగుతూ సూర్యుని చుట్టు కూడ తిరుగుతున్నది. కనుక దానికి ఒక ఆకర్షణ శక్తి పుట్టింది. ఆ శక్తి ఇప్పుడున్నట్టు కాక ఇంకొక రకంగ ఉంటే మనం ఇక్కడ ఉండడం కుదరదు.
ఈ రకంగ చూస్తే, ఎన్ని సంగతులు అనుకూలంగ ఉంటే మనమున్నము అన్నది అన్నిటికన్న ఆశ్చర్యమయిన ప్రశ్నగా ఎదురవుతుంది.

అయినా మనము నిత్యము ఈ సంగతుల గురించి ఆలోచిస్తున్నమా? అది ప్రశ్న!
మనమే ఎంతో తెలివిగల వారలమనుకుని గర్వంగ బతుకుతున్నము.
ఈ ప్రపంచం గురించి మనకెంతో తెలుసునని విర్రవీగుతున్నము.
మన గురించి మనకే సరిగా తెలియదు. విశ్వం గురించి, నక్షత్రాల గురించి తెలుసుననుకుంటున్నము.
మనకొక తెలివి, మన అలోచనలకొక పద్దతి ఉన్నదని మన భావన.
ప్రపంచము, విశ్వము మన కను సన్నలలో ఉన్నయని ఒక భావన.
ఒక్క క్షణం ఆలోచించండి. ఈ విశ్వమన్న ఆలోచన మన మనసు, అంటే మెదడులో పుట్టింది కద
సైన్సు, సామాజిక శాస్త్రం, మిగతా తెలివి మొత్తం, మన మనసులో కలిగిన అవగాహనలు మాత్రమే గద
వీటిలో ఎక్కడన్న కొంచెం లెక్క తప్పి ఉండ కూడదా?

అలోచించండి.

ఎన్ని పరిస్థితులు అనుకూలిస్తే మనం ఇట్ల ఉండగలుగుతున్నము
మనకు ఎంత అర్థమయింది, ఎంత కాలేదు?
అయినా అంత బాగనే సాగుతున్నదన్న భావన మాతరం మనలో ఉండనే ఉన్నది.
మాయామెకు మంచి ముక్కలు పడి చీట్లాటలో గెలిస్తే, అందులో చీటింగ్ ఉందన్న భావన నాకెందుకు?
ఒటమి కలిగినప్పుడల్లా ఎదుటి వారిని చంపుదమన్నంత కసి ఎందుకు?
అంతా మన నమ్మకమే అయినప్పుడు, ఈ విశ్వం, ప్రపంచం, మనం, మన తెలివి అన్నీ నమ్మకాలే అయినప్పుడు, మన ఒక్కరి నమ్మకానికి విలువ ఎంత?

అలోచించండి, మీరు కూడా, నా లాగనే!!

Wednesday, May 1, 2013

పిల్లల పాట


చింతా దీక్షితులు గారి పేరు చెపితే ఎంత మందికి తెలుస్తుందో మరి.
ఆయన రాసిన పిల్లల కథలూ, పాటలూ చాలాతాలా బాగుంటాయి.
సూరీ, సీతీ వెంకీ అనే క్రమంమలో కథలు అప్పటి వారికి ఎంతో నచ్చాయి.
అలాగే ఆయన రాసిన పిల్లల నవలలు కూడా.

ఆయన ఎన్నో గేయాలు రాశారు.
అందులో ఇది కూడా ఒకటి.


బూచాడు



చీకటి అమ్మా, చీకటి అమ్మా
చీకటి చూస్తే భయమే
ఇంట్లో చీకటి, దొడ్లో చీకటి
అంతా చీకటి మయమే

చీకట్లోనూ బూచీవాడూ
దాక్కొన్నాడమ్మా
బూచీవాడిని చూస్తే నాకూ 
భయమేస్తుందమ్మా

నల్లటి వళల్లూ, ఎర్రటి కళ్లూ
ఊచల్లా కాళ్లూ
చేత్తో కత్తీ పట్టుకు వచ్చీ
ముక్కూ కోస్తాడూ

బూచీవీడూ బుట్టాతెచ్చీ
ఎత్తుకుపోతాడు.
బూచీవాడిని పొమ్మని చెప్పే 
బబ్బుంటానమ్మా

అమ్మా నేనూ నీ వళ్లోనూ 
బబ్బుంటా కానీ
నీ వళ్లోనూ బబ్బుంటేనూ
బూచాడొస్త్డాడా

బబ్బున్నాక మంచీ మంచీ 
కథలూ చెప్పవుటే
బబ్బున్నాకా మంచీ జోలా
పాటలు పాడవుటే

కథలూ జోలా పాటలు వింటూ
నిద్దర పోతాను
బబ్బుని నేనూ అల్లరి చేయక 
నిద్దర పోతానూ

నిద్దర పోయీ తెల్లారాకా
కళ్లు తెరుస్తాను
చీకటి పోయి అంతా తెల్లని
వెలుతురు వస్తుంది 

బూచీవాడూ బుట్టా పట్టుకు 
వెళ్లి పోతాడు
అప్పుడు బొమ్మల తోటీ నేనూ
ఆడుకుంటాను

ఈ పాట నాకెందుకో కొంచెం బాధను కలిగించింది.
"ఎందుకని ఆ కాలంలో ఇట్లా పిల్లలకు పిరికి మందు నూరి పోసే వారు?" అనిపించింది.
మీరేమంటారు?

Tuesday, December 18, 2012

ఎవరికివారే ప్రత్యేకం!

ఏం వాయ్, మై డియర్, మొఖం వేలవేశావ్? అంటాడొకాయన. ఆ ముఖం వేలవేసిన బాబు సంవత్సరం పరీక్షలో ఫెయిలయ్యాడు. సెలవులకు ఇంటికి పోతే, తండ్రి తంతాడని భయం. ఈ అడిగినతను, ఆ బాబుకు చదువు చెప్పవలసిన ట్యూషన్ గురువు. చుట్ట కాల్చడం నేర్పించాడు, అంతేగానీ, చదువు చెప్పినట్టు లేదు. గురజాడ వారు సృష్టించిన వేల ముఖం వెనక ఎంతో కథ ఉంది. ఆ బాబు ముఖం వెలగమంటే ఎట్లా వెలుగుతుంది?

తన మీద తనకు గౌరవం ఉన్న మనిషి ముఖం వెయ్యి వాట్ల బల్బులా వెలుగుతుంది. తన మీద తనకున్న గౌరవం, హద్దులు మీరితే కూడా మంచిది కాదని గుర్తుంచుకోవాలి. గౌరవంతోనే బతుకు ముందుకు సాగుతుంది. నీకు ప్రపంచంలో ఎన్నో కావాలి. అందులో కొన్ని తప్పకుండా కావాలి. అవి నీకు అందాలంటే, అందుకు తగిన యోగ్యత, నీ దగ్గర ఉండాలి. అందుకే కొందరికి తమకు కావలసిందేదో అడగాలన్నా భయంగా ఉంటుంది. ‘కావాలి. నిజమే! కానీ, అందుకు నీవు చేసింది ఏమిటి?’ ఎందుకని నీకు ఏ విషయమయినా అందాలి? అందుకు నీవు తగినవానివని రుజువేమిటి? సీటు కోసం, ఉద్యోగం కోసం, చివరకు జీవిత భాగస్వామి కోసం వెతుకుతుంటే, ఎదురయేవి ఈ ప్రశ్నలే గదా!


మన గురించి, మన కోరికల గురించి, మనం ధైర్యంగా చెప్పగలగాలంటే, మనకు మన మీద గౌరవం ఉండాలి. మనమే సాధించి ఉండాలి. మనకు కొంతయినా, ప్రత్యేకత, గుర్తింపు ఉండాలి. నీకు ఉద్యోగం అవసరం గనుక ఉద్యోగం ఇవ్వాలా? లేక నీవల్ల ఎదుటివారికి కొంత ఉపయోగం ఉంటుంది గనుక ఇవ్వాలా? ఇదేనా సమస్య? ఈ గౌరవం ఎంత ఉండాలని ప్రశ్నించుకుని చూడండి. ఆత్మగౌరవాన్ని కొలవడం కుదరదు. అన్ని సందర్భాలలోనూ ఒకంతే గౌరవం ఉండడం కూడా కుదరదు. సందర్భాన్ని బట్టి గౌరవం అవసరం మారుతుంది. కొన్ని చోట్ల. ఉదాహరణకు నిన్ను అర్థం చేసుకున్న పెద్దవారి ముందు, ఈ ఆత్మగౌరవం ప్రదర్శించకుండా ఉంటేనే మంచిది.

ముఖం వేల వేసిన వెంకటేశం తండ్రికి, బోలెడంత కోపం, మరింత మొండితనం ఉన్నాయి. ఆయన ఏ విషయంలోనూ ఎవర్నీ సంప్రదించడు, నమ్మడు. తల్లి మాత్రం అమాయకురాలు. ఆ కాలం పరిస్థితులు, అనుకుని సర్దుకుపోవచ్చు. ఈ కాలంలో కూడా, చాలా కుటుంబాలలో పరిస్థితి పిల్లల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేదిగా ఉండటం లేదు. బయట సంఘంలోనూ, ‘నువ్వెందుకూ కొరగావు’ అని చిన్నచూపు చూచేవారే. ‘నీవు కూడా ఏదో సాధించగలుగుతావు’ అని ధీమా చెప్పిన తల్లిదండ్రులు, ఇరుగు పొరుగువారూ ఉన్న వారు అదృష్టవంతులు.


ఈ ప్రపంచంలో మనకంటే గొప్పవారు ఎంతోమంది ఉన్నారు. మనకంటే తక్కువ తెలివితేటలూ, పనితనం గలవారు కూడా ఉన్నారు. సరిగ్గా మనలాంటి మనుషులు మాత్రం లేరు. అందుకే ఎవరికివారే ప్రత్యేకం! ఈ సంగతి మీకు ఇంతవరకు ఎవరైనా చెప్పి ఉంటే మీరు ఇక ధైర్యంగా, గౌరవంగా ముందుకు సాగుతారు. ‘ఆ అమ్మాయిని చూడు, ఈ బాబును చూడు! మరి నువ్వూ ఉన్నావు’ అన్న సాధింపులు చిన్ననాడు మొదలవుతాయి. అదే భావం మనసులో నాటుకుంటుంది. ఎన్ని నాళ్లయినా వెంటాడుతూ ఉంటుంది. ప్రపంచం భయపెడుతుంటే, ఈ భావం బలపడుతుంది. భయపెడుతుంది. మనమీద మనకు గౌరవం అడుగంటుతుంది.


అద్దంలేని కాలంలో ఒకానొక పౌరాణిక పురుషుడు, నీళ్లలో తననుతాను చూసుకుని ‘నేనెంత అందంగా ఉన్నాను!’ అనుకునేవాడట. ఇవాళటికీ ఆ రకం వ్యక్తులు చాలామందే ఉంటారు. కానీ తనలో ఎక్కడో ఏదో లోపం కూడా ఉందని తెలుసుకున్నవారు కాళ్లు నేలమీద ఆనుకుంటాయి. సరిగా నడుస్తాయి. మనకున్న శక్తియుక్తులను గుర్తించటం అవసరం. అంతకన్నా ఎక్కువ శక్తియుక్తులు కూడా ఉంటాయని గుర్తించడం, అంతకన్నా అవసరం. నిద్రలేచిన వెంటనే అద్దంలో ముఖం చూచి మనలను మనమే ‘శభాష్!’ అనుకుంటే, ఆ రోజు బాగా గడుస్తుందా? నిన్నటికీ, ఇవాళటికీ మనలో వచ్చిన మార్పులను గుర్తించి, మంచిని పెంచి, చెడును తుంచితే రోజు బాగా గడుస్తుందా? ఈ రెండవ పద్ధతి మనకు చేతనవుతుందని అర్థమయిననాడు, మన మీద మనకు, మరింత మందికీ, తెలియకుండానే గౌరవం ఎక్కువవుతుంది. అసలు, ఈ సంగతి పట్టించుకోకుండా, మంచి మార్గంలో మరింత వినయంగా, ముందుకు సాగుతూ ఉంటే, మరింత సౌకర్యంగా ఉంటుంది. మనం సాధించిన చిన్న చిన్న విషయాలను అందరూ గుర్తించకపోవచ్చు. అందుకు కుంగిపోవనవసరం లేదు. వాటిని మనం లెక్కవేసుకుని గుర్తించుకుంటే చాలు. గుర్తు ఉంచుకోకున్నా ఫరావాలేదు. మన గౌరవం కొనసాగుతుంది. మంచి మార్గం సాగుతుంది.



మంచిదారిలో నడవడం అలవాటయిన తరువాత, చెడు దారిని గుర్తించడం సులభంగా వీలవుతుంది. మంచిదారి మనకు ఇష్టమయిన దారిగా మారుతుంది. మనకు ఇష్టమయిన పనులను మాత్రమే మనం చేస్తుంటే, అంతకన్నా ఆనందమే లేదు. అందులో మనకు మనమీద, ఇతరులకు మనమీద గౌరవం పెరుగుతుందని అర్థమవుతుంది. మనం ఇష్టం వచ్చిన మంచి పనులను, మనకు ఇష్టం గనుక చేస్తాము. గౌరవం కొరకు మాత్రం కాదు. పదుగురి మెప్పుకోసం చేసే పనులు, చెప్పకుండానే తెలిసిపోతాయి. తేలిపోతాయి. ఇష్టపడిన పనిని చేయడం ఒక ఎత్తు. చేస్తున్న, చేయవలసిన పనులను ఇష్టపడటం మరొక ఎత్తు. ఇది కూడా అలవాటయితే, గౌరవం కన్నా దృష్టి ఆనందం మీదకు మారుతుంది. ఉత్సాహం ఉరకలు వేస్తుంది.

చేస్తున్న పని నచ్చింది గనుక, అందులో మెళకువలు నేర్చుకునే ప్రయత్నాలు అవే మొదలవుతాయి. మనం పెరుగుతాము. మన పనులు, నిర్ణయాలు మరింత మెరుగుగా వస్తుంటాయి. అది గౌరవంగానూ, ఆనందంగానూ ఉంటుంది. నిర్ణయాలు వస్తున్నాయంటే, అవి మరికొందరిని ప్రభావితం చేస్తాయి. వారికి మనతో సంబంధ బాంధవ్యాలు మొదలవుతాయి. అక్కడో ఇక్కడో మనలను ప్రశ్నించి విమర్శించి, తికమకపెట్టేవారు ఎదురవుతారు. వారు నిజానికి మనకు సాయం చేస్తున్న వారిలో లెక్క. మన దారి, పనులు, నిర్ణయాలు మంచివేనని తేల్చుకోవడానికి వీరు మనకు ఎంతో సాయం చేస్తారు. ఆ సంగతి వారికీ అర్థమయితే, మిత్రులవుతారు. అభిమానులవుతారు. అనుయాయులవుతారు. అంటే మన వెంట వస్తారు!


ఈ ప్రపంచంలో లోపం లేని మనుషులు లేరు. ఈ ఒక్కటీ గుర్తుంచుకుని ముందుకు సాగుతుంటే, మనకు గౌరవంలోగాని, ఆనందంలోగానీ లోపం ఉండవలసిన అవసరం లేదు!