Showing posts with label పుస్తకం. Show all posts
Showing posts with label పుస్తకం. Show all posts

Friday, September 23, 2016

కుటుంబం- మిత్రులు- దేశం

గుయెన్ ది బిన్ (ఆత్మకథ) -ఆకెళ్ళ శివప్రసాద్,
పేజీలు: 220,
వెల: రూ.150/-
నవచేతన పబ్లిషింగ్ హౌస్,
బండ్లగూడ,
హైదరాబాద్- 68
ఫోన్: 24224453/4
**

హోచిమిన్ అనే పేరుతో పరిచయంగల వారికి ఈ పుస్తకం గురించి సులభంగా తెలుస్తుంది. ‘న్ గుయెన్ ది బిన్’ అనే వ్యక్తి వియెత్నాం దేశానికి ఒకప్పుడు ఉపాధ్యక్షురాలు. మామూలు కుటుంబంలో పుట్టిన ఈమె స్వయంకృషితో గొప్ప నాయకురాలుగా ఎదిగింది. 1995లో చైనాలో జరిగిన ఐక్యరాజ్యసమితి వారి సమావేశాలు తరువాత ఆమె పేరు ప్రపంచమంతటా మారుమోగింది. ‘కుటుంబం- మిత్రులు -దేశం’ అనే శీర్షికతో ఆమె ఆత్మకథ (400 పుటలలో) వస్తున్నదంటే హోబిమిన్ నగరంలో 2012 జూన్‌లో పెద్ద సంచలనం జరిగింది. అందరూ ఆమెను చూడాలని, పుస్తకం చదవాలని గుంపులుగా వచ్చారు. పుస్తకాన్ని ఇంగ్లీషులోకి అనువదించి ప్రచురించారు. ప్రస్తుతం అది తెలుగులో వచ్చింది.

గుయెన్ (సౌలభ్యంకొరకు ‘న్’ను వదిలేశారు) బాల్యం విశేషాలు, తిరుగుబాటు ఉద్యమంలో ఆమె పాత్ర, చివరికి ప్రభుత్వ అధికారిణిగా బాధ్యతలు చేపట్టడం లాంటి విశేషాలన్నింటినీ ఆమె కథల ధోరణిలో చక్కగా వివరించారు. 1973లో సంతకాలు జరిగిన పారిస్ శాంతి ఒప్పందంలో తమ దేశం బృందానికి ఆమె నాయకురాలుగా వెళ్లడంతో కథ తారస్థాయికి చేరుకుంది.

85 సంవత్సరాలలో చెప్పుకోవలసిన విశేషాలు ఎన్నో ఉన్నాయి. కనీసం వాటిని గురించి నోట్స్ రాసుకునేందుకు కూడా వ్యవధి లేదు. అయినా ఆ పెద్దవయసులో ఆమె ఈ రచనను అందించింది. దేశం స్వతంత్రంకొరకు జరిపిన పోరాటం గురించి ఆమె ఎంతో రాశారు. స్వతంత్రం తరువాత జీవితం ప్రశాంతంగా సాగిందని కూడా వివరిస్తారు. పోరాటం గురించి ఆమె వెలువరించిన భావాలు, అలనాటి యువత భావాలకు ప్రతీకలని సులభంగానే అర్థమవుతుంది. పటిష్టమయిన దేశాన్ని నిర్మించాలంటే చక్కని వ్యక్తిత్వం, ఆత్మగౌరవం, ఆదర్శాలుగల నమ్మకమయిన ప్రజల భాగస్వామ్యం అవసరం అంటారు గుయెన్.

ఈ రకం రచనలు ఇంగ్లీషులోకి రావడమే ఒక విచిత్రం. అనువాదం అనుకున్నంత సులభంగా కుదరదు. ఆ అనువాదం నుంచి తెలుగు రచన రావాలంటే అది మరొక ప్రయత్నం. అందుకు పూనుకున్న అనువాదకునిది గట్టి ధైర్యమే. అయితే విషయం, వాతావరణం, ఆయా దేశాలు, సంఘటనల గురించి అవగాహన ఉంటే, అనువాదం మరింత సులభంగా ముందుకు సాగేది. ‘ఎండలు విరగకాసేవి’లాంటి మాటలు, వింతగా రాసిన పేర్లు, మొత్తానికి అనువాదం మరింత బాగా ఉండవచ్చును అనిపిస్తుంది.
అనువాదం తరువాత, అర్థం చెడకుండా, భాషను చక్కబెట్టడం అవసరం!
- కె. బి. గోపాలం

Saturday, September 14, 2013

జిడ్డు కృష్ణమూర్తి నాకు తెలుసా?

జేకే మాటలు ఎందరి హృదయాల్లో నాటుకున్నాయో, ఎందరికి నిజంగా అర్ధమైనాయోనని ప్రసంగవశంగా రచయిత ఒకచోట అనుమానం వెలిబుచ్చి మనకు తెలియదు, అంటారు. కానీ, అందరూ ఆయన తమను ఆశీర్వదించాలనుకుంటారు. ఈ దండాలు, దాస్యాలు తప్ప మనకు ఆలోచనలు చేతగాలేదు. ‘మనకు చేతనయిందల్లా సేవ, పూజ, ఆరాధన, దీవెనలు అందుకోవడం మాత్రమే అయ్యుండాలి అంటారు రచయిత. జేకే చూపిన దారిని నడిచే సామర్థ్యం, కుతూహలం, సుముఖత మనలో లేవంటారీయన. అది జేకే దురదృష్టం అనేంతవరకు వెళతారు కూడా!
.................
............
జిడ్డు కృష్ణమూర్తి నాకు తెలుసా?
రచన: నీలంరాజు లక్ష్మీప్రసాద్
పుటలు: 250
వెల:150 రూ/-
ప్రతులకు: నవోదయ బుక్‌హౌస్,
కాచిగూడ, హైదరాబాద్-27
ఫోన్: 040-24652337
...............
పుస్తకం పేరులో ఒక ప్రశ్న. ఆ ప్రశ్న అడుగుతున్నది రచయిత అయితే, పుస్తకంలోని మొదటి ముప్ఫయిమూడు పేజీలు ప్రత్యక్షంగా, మిగతావి (ఈయన ఇతర రచనలతోబాటు) పరోక్షంగా జవాబు అందిస్తున్నాయి. కృష్ణమూర్తిగారిని ఆయన ‘కృ’ అన్న పేరుతో పిలిచారు. ‘కృ’కు నీలంరాజువారు బాగా తెలుసు. అయినా లక్ష్మీప్రసాద్‌లోని మంచితనం, మిగతా అంశాలను ‘తెలిసినంతమేరకు’ అన్న శీర్షిక కింద చేర్పించింది. ఈ రచయితకు తాను రాయదలచుకున్న అంశం తలకెక్కింది. వొంటబట్టింది. ఆయన సాయంతో పాఠకులు తమను తాము ప్రశ్న అడిగేసుకుని జవాబు వెదుకుతారు, ఈ పుస్తకం చదివితే!

మదనపల్లెలో పుట్టి చిన్నతనంలోనే ఇంగ్లండుకు తరలించబడిన జిడ్డు కృష్ణమూర్తి మనవాడు, తెలుగువాడు అని చెప్పుకోవడం మనలోని ఖాళీతనాన్ని చూపుతుంది. భారతీయుడివా అన్న ప్రశ్నకు ‘అవును. భారతదేశంలో పుట్టాను’ అని జవాబిచ్చాడు జె.కె. జె.కె అన్నపేరు ప్రపంచమంతటా తెలుసు. తెలియనిదల్లా మనకే. ఆయనేదో ప్రపంచానికి దారి చూపిస్తాడనుకుంటూ, అందరం ఆయన చుట్టూ మూగితే, అదేదో మీరే చేయాలి అని దారిచూపించాడాయన. శ్రీకృష్ణమూర్తిగారు, వారు లాంటి సంబోధనలను మించి ఎంతో ముందుకు సాగిన ఆ మనిషి ‘అర్థం కాడు!’ అనే స్థాయికి చేరుకున్నాడు. సమస్య అక్కడే ఉంది. జేకే మాటలు అర్థంకాకపోతే తప్పు ఆయనదా? లేక మనలో ఏదయినా లోపం ఉందా? ఈ రెండవ ప్రశ్నకు జవాబు చెప్పడానికి చేసిన ప్రయత్నమే లక్ష్మీప్రసాద్ రచనల్లో కనబడుతుంది. రచనలు కొన్ని ఒకచోటచేరి ఈ పుస్తకమయింది. దీన్ని నవల చదివినట్లు ఈ చివర నుంచి, ఆ చివర వరకు ఒక్కసారి చదివి, ‘అర్థం కాలేదు’ అని పక్కనబెడితే మాత్రం తప్పకుండా లోపం మనదే.

తెలివిగలవారు కూడా తెలివి అనే బరువు కింద నలుగుతుంటారు. ఆ బరువును తప్పించుకుంటే తప్ప, ఆలోచనలను స్వీకరించడం కుదరదు. ‘పాతది అంతమొందితే తప్ప నూ తన సృష్టి జరగదు’- అని ఈ పుస్తకం మొ దట్లోనే ఒకమాట కనబడుతుంది. దీన్ని గురించి చర్చకు అవకాశం ఉంది. జరగాలి. అందుకు మనం ప్రయత్నించాలి. జేకే చెప్పింది ఈ ప్రయత్నం గురించేననిపిస్తుంది.

జేకే మాటలు ఎందరి హృదయాల్లో నాటుకున్నాయో, ఎందరికి నిజంగా అర్ధమైనాయోనని ప్రసంగవశంగా రచయిత ఒకచోట అనుమానం వెలిబుచ్చి మనకు తెలియదు, అంటారు. కానీ, అందరూ ఆయన తమను ఆశీర్వదించాలనుకుంటారు. ఈ దండాలు, దాస్యాలు తప్ప మనకు ఆలోచనలు చేతగాలేదు. ‘మనకు చేతనయిందల్లా సేవ, పూజ, ఆరాధన, దీవెనలు అందుకోవడం మాత్రమే అయ్యుండాలి అంటారు రచయిత. జేకే చూపిన దారిని నడిచే సామర్థ్యం, కుతూహలం, సుముఖత మనలో లేవంటారీయన. అది జేకే దురదృష్టం అనేంతవరకు వెళతారు కూడా!

అందుకే కుతూహలం (మిగతా లక్షణాలు ఉండనివ్వండి) కలవారంతా ఈ పుస్తకం చదవాలి. ఇందులో మనకు ‘కృ’ ఆలోచనలమీద వ్యాఖ్యానాలు, అన్వయాలు కనబతాయి. భగవద్గీత విన్న తరువాత అర్జునుడు చప్పట్లుకొట్టలేదు. గొప్ప మాట విన్న తర్వాత చప్పట్లతో మన బాధ్యత తీరదు అంటారు ప్రసాద్. ఈయన మనకు సాయపడగలరనడానికి ఇంతకన్నా చక్కని ఉదాహరణ లేదేమో?

ఆనంద సామ్రాజ్యం తాళం చెవి, మనదగ్గరే ఉందన్నా, మనసులో శూన్యం కలిగితే, ఆ సంగతి, శూన్యంపోయిన తరువాత తెలుస్తుంది అన్నా, మనం (చప్పట్లు మాని) ఆలోచనలో పడిపోతాం. పడిపోవాలి. అదే ఈ పుస్తకం ఉద్దేశమనవచ్చు. కొన్ని విషయాలు చటుక్కున అర్థంకావు. అట్లాగని, అసలే అర్థంకావు, అనవచ్చా? సామూహిక అభిప్రాయాల బరువును కాసేపయినా దించుకుని, కనీసం తగ్గించుకుని ప్రయత్నిస్తే, కొత్త అభిప్రాయాలు అర్థమయ్యే వీలుంది. రచయిత ఈ బరువులతో నలిగినవారే. పడుకుని దండం పెడతారన్నారట. జేకే ‘వద్దని’ఆయనే వంగారట!
జేకే మతాలకు అతీతమయిన మాటలు చెప్పారని కూడా తెలియని వారున్నారు. అసలు ఆయన పేరుకూడా తెలియనివారి ప్రసక్తి ఇక్కడ రాదు. అనుకరణ, అనుసరణలు వద్దన్నారు. నేను గురువును కాను, నాకు శిష్యులు, అనుయాయులు లేరు అన్నారు. ఇంకా ఎన్నో అన్నారు! కొండ అద్దంలో లాగ ఆయన ఈ పుస్తకంలో కొంత కనిపిస్తారు.

చివరగా ఒక్క మాట. సామూహిక ఆలోచనల బరువులాంటిదే ఇంగ్లీష్ భాష బరువు కూడా. ఇంగ్లీషు మాటలకు సమానార్థాల పేరున్న పెద్ద మాటలు, ఇంగ్లీష్ పద్ధతి వాక్యాలు ఎదురవుతాయి ఈ పుస్తకంలో. కొంచెం ఓపికగా చదివితే అర్థమవుతాయి.

Saturday, August 17, 2013

‘చంద్రయానం’

భారత చంద్రయానం
- రచన: డా.టి.వి. వెంకటేశ్వరన్,
అనువాదం: ఎ.జి.యతిరాజులు,
ప్రజాశక్తి బుక్‌హౌస్,
ఎం.హెచ్. భవన్,
ఆజమాబాద్, హైదరాబాద్- 20, 040- 27660013.

తెలుగులో సైన్సు పుస్తకాలు వస్తున్నాయంటేనే ఆనందం. అం దునా ఏవో పాత విషయాలను గురించి కాకుండా, ఇటీవలి చంద్రమండల పరిశీలనల గురించి పుస్తకమంటే అంతకన్నా ఆనందం ఏముంటుంది. వెంకటేశ్వరన్‌ఈ పుస్తకాన్ని తమిళంలో రాశారు. ఆయన బహుశః పరిశోధకుడై ఉండాలి. చంద్రయానం ఒక్కటే గాక, చంద్రుని గురించి కూడా సరళంగా తెలియజేయడం తన రచన ఉద్దేశమని సూటిగా చెప్పారు. సైన్సులో ఒక అధునాతన విషయాన్ని గురించి, అందరికీ అర్థం కావాలంటే, ఆ విషయం గురించిన పూర్వాపరాలు తెలిసి ఉండడం నిజంగా అవసరం. ఈ పద్ధతిని అందరూ పాటించాలి.

ఇందులో కవితా ధోరణిలో పెట్టిన శీర్షికలు చంద్ర వదనం, మాటున ఉండి చూచే మర్మమేమి?, నీవులేక నేనులేను, బుగ్గపై గాయం లాంటివి పాఠకుడిని పట్టి చదివిస్తాయి. కథనం కూడా అంత బాగానూ నడుస్తుంది. చంద్ర బింబంలోని మచ్చల గురించి చెప్పిన వివరాలు బాగున్నాయి. చంద్రగోళం గురించి సవివరంగా చెప్పడమే కాదు, సాంకేతిక విషయాలూ అందించారు. చంద్రగోళం నిర్మాణం గురించి, అది పుట్టిన నాటినుంచి ఈ నాటి వరకు వచ్చిన మార్పుల గురించి శాస్ర్తియ విశేషాలతో వివరించారు. చంద్ర గ్రహాన్ని పరిశీలించడానికి, దూరం నుంచి అక్కడ దిగి చేసిన ప్రయత్నాల వివరాలు కూడా ఉన్నాయి. 125వ పేజీలో మన పరిశోధకులు చేసిన చంద్రయానం వివరాలు మొదలవుతాయి. చంద్రయాన్ సాధించిన విజయాలతో పుస్తకం ముగుస్తుంది. ఈ తరహా పుస్తకంలో బొమ్మలు ఉంటే మరింత సులభంగా అర్థమవుతుందనే భావనతో అవసరమైన చోటల్లా కావలసినన్ని ఫొటోలు, రేఖాచిత్రాలు వేశారు. అచ్చు టెక్నాలజీ బాగా పెరిగిన ఈ కాలంలో ఫొటోలు మరింత బాగావేసి ఉండవచ్చుననిపించింది.

అనువాదం చాలా సులభంగానే సాగింది. సాంకేతిక వివరాలు ఎక్కువగా ఉన్నందుకు చదివించే సౌలభ్యం కొంత తగ్గిన భావన కలిగింది. అనువాదకులు తెలుగులో వాడుకలో ఉన్న పదజాలంతో అంతగా పరిచయంగలవారు కారు. సూర్యుని చుట్టూ తిరిగేది గ్రహం. దాని చుట్టూ తిరిగే మూన్స్‌ని మనం ఉపగ్రహాలంటున్నాము. పుస్తకంలో సహాయక గ్రహాలు అనే మాట వాడారు. గ్రహాలను గోళాలు అన్నారు. అంతెందుకు చిత్రా నక్షత్రాన్ని చైత్రం నక్షత్రం అన్నారు. వికీర్ణం- వికిరణంల మధ్య తేడా ఉంది. ఇంత మంచి పుస్తకానికి, ఒక సంపాదకుని సాయం తోడయితే, మరింత బాగా వచ్చి, మరింత బాగా చదవడానికి వీలుండేది. పత్రికలకే కాదు, అన్ని ప్రచురణలకూ విషయం తెలిసిన సంపాదకులుండాలన్న సంగతిని మనవారు గుర్తిస్తే కాస్త బాగుండేదేమో!

Sunday, June 16, 2013

యోగీశ్వర విలాసము

యోగీశ్వర విలాసము
నందికొటుకూరు సిద్ధయోగి ద్విపద కావ్యము
పరిష్కర్త: వైద్యం వేంకటేశ్వరాచార్యులు,
అక్షరార్చన ప్రచురణలు- కర్నూలు
ప్రతులకు: పరిష్కర్త, ప్లాట్: 167,
శ్రీకృష్ణ నిలయం, రెవెన్యూ కాలనీ, కర్నూలు
పేజీలు: 220, వెల: 120 రూ.

నందికొటుకూరు సిద్ధయోగీంద్రుడు 1700- 1770 మధ్య కాలమున జీవించిన శివయోగి. కూచిపూడి సిద్ధేంద్రయోగి, బ్రహ్మంగారి శిష్యుడు సిద్ధప్పలకు పేరులో మాత్రమే వీరితో పోలిక. వారిద్దరు వేరు. ఈ విషయాన్ని పరిష్కర్త సవివరంగా చూపించారు. నిజానికి ఈ రచనను ప్రపంచానికి అందించిన వైద్యం వేంకటేశ్వరాచార్యుల గురించి రెండు మాటలు చెప్పుకోవాలి. ఈయన పండితుడు. పరిశోధకుడు. వైష్ణవ సాంప్రదాయ అవలంబి. అయినా ఎన్నో శైవ గ్రంథాలను కూడా వెదికి, పరిష్కరించి ప్రపంచానికి అందజేశారు. నలభయికి పైబడిన ఈయన పుస్తకాలన్నీ పరిశోధన పద్ధతిలోనివే. 1923లోనే లింగైక్యం చెందిన చింతలేని సూగూరప్పలేదా నిశ్చింత సూగూర సూరిరాతప్రతినుంచి ప్రస్తుత గ్రంథాన్ని పరిష్కరించారు.

సిద్ధయోగి కవి మాత్రమే కాదు, యోగి కూడా. ఆయన జీవితం, మహిమల గురించి, సుమారు 20 పేజీల రచన ఒకటి పుస్తకం చివరలో ఉంది. అందులోని విశేషాలు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక పీఠికలో పరిష్కర్త అందించిన వివరాలు, విశే్లషణ మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. సిద్ధయోగి గాజులమ్మేవారు. ఊరూరు తిరుగుతూ, అలంపురంలో ఒక గురువును గుర్తించి, వారివద్ద శిక్షణ పొందిన వివరాలు కథలకన్నా బాగున్నాయి. శైవ సిద్ధాంత ప్రవర్తకులు, పండితులుగాక మామూలు మనుషులుగా బతికిన వారన్న సంగతి చరిత్రలో చూడవచ్చు. అటువంటి ఒకానొక మహాయోగిని అక్క మహాదేవి. యోగీశ్వర విలాపములో ఆమెకథ ఉన్నట్లు లెక్క. ఆ కథ కేవలము సూత్రము. ఆ దారంతో శైవ సిద్ధాంతంలోని వివిధ అంశాలను పూలుగా మార్చి పేర్చినది ఈ రచన.

ప్రాచీన శైవ సాహిత్యం ద్విపదల్లో ఉండడము కూడా జగమెరిగిన సత్యం. సిద్ధయోగి ద్విపద మరింత కట్టుబాట్లకు లొంగి నడిచిందని పరిష్కర్త పేర్కొన్నారు. అసలు రచన 159 పుటలలో మూడు ఆశ్వసాలుగా సాగింది. మొదటి ఆశ్వాసంలో రకరకాల విమర్శనములు. శుశ్రూష, వైరాగ్యము, పంచముద్రలు, పంచకోశము, పంచ భూతములు మొదలయిన వాటి తీరున వివరించడమే ఈ విమర్శనములు. పంచభూతముల గురించిన వివరణము పండితుల మెదళ్ళకు పనిపెట్టేదిగా ఉంది. రెండవ ఆశ్వాసంలో అక్క మహాదేవి కథ కూడా ఎన్నో మార్మిక విషయాల చర్చతోబాటుగా కొనసాగుతుంది. వీరశైవ రహస్యము ఇందులో ప్రత్యేకమయిన అంశము.

ఇక మూడవ ఆశ్వాసము మరింత గహనమయిన అంశాలను ముందుకు తెస్తుంది. జనన దిన ఫల వివేకము మొదలు, తానుతానగు వివేకము వరకు ఇక్కడ వరుసగా ఎన్నో వివేకములున్నాయి. యతిచంద్రవినుమునే- సంతధనంబు/ క్షితి పుట్టినపుడు తె- చ్చెడు నది కాదు/ తరలి గిట్టినవేళ- దనము రమంత/ పొరలి తాగైకొని- పోవుటలేదుచెప్పినది మామూలు విషయమయినా, తాత్విక వివేకమయినా భాష, పదముల నడక మాత్రము గొప్ప జిగితో సాగుతుంది.
పుస్తకంలో ఆ తరువాత సిద్ధయోగి రచనలు చిన్నచిన్నవి కూడా చేర్చారు. వేదాంత సూత్రము, షట్‌స్థల దర్పణము, నవ పద్య పుష్పమాలిక, పంచరత్నములు, సప్తచక్ర తత్వము అన్నవి పద్య రచనలు. ఒక తత్వము, మంగళహారతి కూడా ఉన్నాయి.


ఇది కథకొరకు, కాలక్షేపంకొరకు చదవవలసిన పుస్తకం కాదు. పండితులు, ఆర్ష, శైవ విజ్ఞానంలో ఆసక్తిగలవారు శ్రద్ధగా అనుసంధానం చేయవలసిన గ్రంథం ఇది. ఓపిక ఉండి చదివితే మాత్రం, అందరికీ ఎన్నెన్నో విశేషాలు తెలుస్తాయి. భాష మీద కాసింత పట్టున్న వారికి మరెన్నో మర్మాలు కనబడతాయి. రచనా కాలం ప్రకారం ఇది నిజంగా ప్రాచీనగ్రంథం. ఇంత మంచి పుస్తకాన్ని, పరిష్కరించి అందించిన పరిష్కర్త అభినందనీయులు.

Tuesday, March 26, 2013

ఎ సెయిలర్స్ స్టోరీ (ఇంగ్లీష్)



ఎ సెయిలర్స్ స్టోరీ (ఇంగ్లీష్)
రచన: వైస్ అడ్మిరల్ ఎన్ కృష్ణన్
పుణ్య పబ్లిషింగ్ హౌస్ వారి ప్రచురణ, పేజీలు: 400 +
వెల: రూ.695
ప్రతులకు: www.punyapublishing.com


ఫద్మభూషణ్, పివిఎస్‌ఎమ్ కృష్ణన్ భారతీయ నౌకాదళ చరిత్రలోనే ముఖ్యమయిన వ్యక్తి నౌకాదళానికి 1967లోనే వైస్ చీఫ్‌గా ఆయన బాధ్యతలను నిర్వహించారు. 1971లో ఈస్టర్న్ నేవల్ కమాండ్‌కు రూపుపోసి కమాండర్-ఇన్-చీఫ్‌గా పనిచేశారు. 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధంలో ఆయన వహించిన పాత్రకు గాను, దేశం ఆయనను పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది. 1971లో కృష్ణన్ నేవీనుంచి రిటైర్ అయ్యారు. నౌకాదళానికి ప్రధానాధికారి మాత్రం కాలేదాయన! కొచ్చిన్ షిప్‌యార్డ్ చైర్మన్‌గా కూడా పదవీ విరమణ చేసిన తర్వాత కృష్ణన్ హైదరాబాద్‌లో ఉన్నారు. ఆ తరువాతే ఆయన తన అనుభవాలకు అక్షర రూపం యిచ్చారు. ఆ రచన ప్రచురణకు నోచుకోకముందే, ఆ మహనీయుడు 1982లో కన్నుమూశాడు. ఇనే్నళ్ల తరువాత ఆయన కుమారుడు అర్జున్ ఈ పుస్తకాన్ని మన ముందుకు తెచ్చారు. ఒక వ్యక్తి జీవితాన్ని గురించి మాత్రమేగాక, మన దేశం గురించి, ప్రపంచం గురించి, సైన్యం గురించి, అక్కడి తీరు గురించి అందరమూ తెలుసుకునే అవకాశం మనకు అందింది.

ఆయన ఆ నౌకకు ఉన్నత అధికారి. స్నానం చేస్తుండగా, బయట ఏదో గోల వినిపించింది అంతే, అందరికి ఆదేశాలనిస్తూ ఆయన క్షణంలో కార్యరంగంలోకి దూకాడు. అక్కడ మరొక అధికారి అంత ఆదుర్దాలోనూ ఒక టవల్ పట్టుకుని ఆయన దగ్గరకు పరుగునవచ్చాడు. ‘ఏమిటి?’అని ఆశ్చర్యంగా చూస్తున్న ఆ ఉన్నతాధికారికి అప్పుడు అర్ధమయింది, తను కనీసం తుడుచుకోకుండా, తువాలు కట్టుకోకుండా, పనిలోకి పరుగెత్తుకు వచ్చానని’అదీ కృష్ణన్‌లోని కార్యదీక్ష!

అసలు దేశానికి నౌకదళమంటూ ఒకటి లేని కాలంలోనే, బ్రిటిష్ నౌకాదళంలో చేరి కృష్ణన్, స్వాతంత్య్రం తరువాత దేశరక్షణ, సైన్య నిర్వహణ విషయాలలో ఎంతో ప్రభావవంత మయిన పాత్రను పోషించారు. కాబినెట్ సబ్ కమిటీ గురించి, సర్దార్‌పటేల్ గురించి ఆయన రాసిన తీరు కథ లాగ ఉంటుంది కానీ, నిజానికి, అది చరిత్ర, రాజనీతి లాంటి విషయాలలో పాఠం! ఒక్క తుపాకీ కూడా పేలకుండా గోవా, డమన్, డయిలను స్వతంత్ర భారతంలో భాగంగా మార్చిన ఘనత కృష్ణన్ కే దక్కింది.

మన దేశ సైన్య చరిత్రలో మహామహులు ఎందరో ఉన్నారు.

అయినా, తమ జీవితం గురించి, సైన్యం సంగతులను గురించి, ఇంత అందంగా వర్ణించి చెప్పినవారు మాత్రం అరుదు. ఈ పుస్తకంలో నౌకాదళం, అందులోనూ ఇతరత్రా తాను కలిసి పనిచేసిన గొప్పవారు, మామూలు వారు, సంఘటనల గురించి ఈ మహామహుడు చెప్పిన తీరు గొప్పది. పుస్తకమంతా వెతికినా, స్వంత గోల ఎక్కడా కనిపించదు తండ్రిగారు, భార్య, పిల్లలు తన అనుభవాలు, చూచిన స్థలాల గురించి చెప్పాలన్న ఆతురత అసలు కనబడదు. ఇది నావికుడి కథ, అని కొన్నిసార్లు, గుర్తుచేసి వివరణను ముందుకు నడుపుతారు కృష్ణన్. అలాగని
ఈ ‘రచన’ ఆసక్తికరంగా ఉండదన్న అనుమానం ఎవరికీ అవసరం లేదు.

చెప్పేది ఏ విషయమయినా సరే, ఆసక్తికరంగా చెప్పడం కృష్ణన్‌కు చేతయినంత బాగా చాలామంది రచయితలకు కూడా కుదరదు.


మన దేశ సైన్య చరిత్రలో మహామహులు ఎందరో ఉన్నారు. అయినా, తమ జీవితం గురించి, సైన్యం సంగతులను గురించి, ఇంత అందంగా వర్ణించి చెప్పినవారు మాత్రం అరుదు. ఈ పుస్తకంలో నౌకాదళం, అందులోనూ ఇతరత్రా తాను కలిసి పనిచేసిన గొప్పవారు, మామూలు వారు, సంఘటనల గురించి ఈ మహామహుడు చెప్పిన తీరు గొప్పది పుస్తకమంతా వెతికినా, స్వంత గోల ఎక్కడా కనిపించదు తండ్రిగారు, భార్య, పిల్లలు తన అనుభవాలు, చూచిన స్థలాల గురించి చెప్పాలన్న ఆతురత అసలు కనబడదు. ఇది నావికుడి కథ, అని కొన్నిసార్లు, గుర్తుచేసి వివరణను ముందుకు నడుపుతారు కృష్ణన్. అలాగని ఈ ‘రచన’ ఆసక్తికరంగా ఉండదన్న అనుమానం ఎవరికీ అవసరం లేదు. చెప్పేది ఏ విషయమయినా సరే, ఆసక్తికరంగా చెప్పడం కృష్ణన్‌కు చేతయినంత బాగా చాలామంది రచయితలకు కూడా కుదరదు.

కృష్ణన్ జీవితం, నౌకాదళంలోని విశేషాలు, వివరాలు, వింతలు ఎలాగూ ఆసక్తికరంగా ఉంటాయి అన్నిటికన్నా, ఆయన ఇంగ్లీషు భాష మరింత ఆసక్తికరంగా ఉంది. ఆ వాక్య నిర్మాణం, మాటతీరు, అరుదయిన అందాలను మన ముందుంచుతాయి. ఆయన వాడిన కొన్ని పదాలు మొదటిసారి మన ముందుకు వచ్చినట్లు తోచినా ఆశ్చర్యంలేదు.

భయంకరమయిన సంగతులను, జోకులను, ఇంచుమించు ఒకే రకంగా వివరించే నైపుణ్యంగల రచయిత ఈ ‘వైస్-అడ్మిరల్’. ఈయనే రచయితగా మారి ఉంటే ఎంత బాగా రాసేవారోననిపిస్తుంది. బ్రిటిష్ రాజ కుటుంబం, మవుంట్ బేటన్ మొదలు, పటేల్, కృష్ణమీనన్ మరెందరో గొప్ప వారితో తాను జరిపిన చర్చలు, చేసిన నిర్ణయాల గురించి చెపుతూనే, బట్టతల మీద వెంట్రుకల కోసం తాను పడిన కష్టాలనూ వర్ణించారాయన. జీవితం పట్ల కృష్ణన్‌కున్న దృక్పథం మనకు ‘పర్సనాలిటీ’ పాఠంలాగ వినిపించినా ఆశ్చర్యం లేదు. పని లేకుంటే పడే చికాకు గురించి ఆయన రాసినప్పుడల్లా, అదొక హెచ్చరికలాగ వినిపించింది నాకయితే.

ఇంతా రాసిన తర్వాత, పుస్తకం గురించి మాత్రమేగానీ, అందులోని విషయం గురించి సరిగాచెప్పలేదన్న భావం కలిగింది. కొందరు వ్యక్తులను, వారి అభివ్యక్తిని పరిచయం చేయడం కష్టంగా ఉంటుంది. ఇంగ్లీషులో ఉన్న ఈ పుస్తకాన్ని, ఇంగ్లీషుకొరకు కన్నా జీవితం గురించి తెలుసుకోవడానికి అందరూ చదవాలి’.





Saturday, September 1, 2012

ఆంగ్లంలో మనుచరిత్ర


‘అల్లసాని పెద్దన’ మనుచరిత్ర- ఆంగ్లం.
అనువాదకులు: శిష్ట్లా శ్రీనివాస్
పేజీలు:404;
వెల: రూ.495/-
దృశ్యకళా దీపిక ప్రచురణలు;
లాసన్స్ బేకాలనీ, విశాఖపట్నం

తెలుగులో కావ్యాలు అనగానే, అందరికీ ముందు గుర్తుకువచ్చేది మనుచరిత్ర. మనుచరిత్ర అనగానే అందరికీ ముందు గుర్తుకు వచ్చేది ప్రవర వరూధినులు. కానీ, ఈ కథలో ప్రవరునికి పాత్ర లేదు. వరూధినికి స్వరోచి, అతనికి స్వారోచిషుడనే మనువు పుట్టాలి. అది మనుచరిత్ర. కథను తెలుగు చదవలేనివారికి కూడా అందించే పద్ధతిలో శిష్ట్లా శ్రీనివాస్‌గారు ఈ ఇంగ్లీషు అనువాదాన్ని స్వయంగాచేసి, ప్రచురించారు. ఇంతకుముందు ఈయనే ఆముక్తమాల్యదను ఆంగ్లంలో అందించారు.

శ్రీనివాస్, ఆంధ్ర విశ్వవిద్యాలయం కళల విభాగంలో కళాచరిత్ర బోధకులు. శిల్పం, చిత్రకళ మీద జరిపే పరిశీలనలు, పరిశోధనలతో వారి దృష్టి సారస్వతంవేపు మళ్లింది. భూమి గుండ్రంగా ఉందని చూపే బొమ్మలు, శిల్పాల ప్రేరణతో ఆయన ‘కపిత్థాకార భూగోళ’అనే పుస్తకం రాశారు. శ్రీకృష్ణదేవరాయలు, గురజాడవారు వీరిని ఎంతో ప్రభావితం చేశారు. రాయల రచనను ఆంగ్లంలోకి అనువదించడానికి అదే ప్రేరణ అనవచ్చు. రాయలను సాక్షాత్తు శ్రీమహావిష్ణువుగా భావించి తన కావ్యాన్ని అంకితమిచ్చిన పెద్దన మనుచరిత్ర, క్రమంలో తరువాత వచ్చింది.

కృష్ణదేవరాయలకు తాను దాసీపుత్రుడన్న జనవాక్యం, బాధాకరంగా తోచడం సహజం. రాయల వ్యాసంగంలో ‘స్వారోచిష మను సంభవం’ తగిలింది. ఆ మనువుకూడా రాణికి పుట్టినవాడు కాదు. కనుక రాయలు ఆ కథను పెద్దన చేత తెలుగులో వ్రాయించాడు. అందులో ప్రయత్నంగా పెద్దన కొన్ని మార్పులుచేర్పులతో కథను మలిచి మహత్తర కావ్యంగా రాయలకు అంకితం చేశాడు. మనువుల కథ సంస్కృతంలో మార్కండేయ పురాణంలో వస్తుంది. దాన్ని మారన తెలుగు కావ్యంగా మలిచాడు. రాయలు కూడా రచన అదే మార్గంలో ఉండాలని పెద్దనకు సూచించాడు. అల్లసాని కవి మాత్రం మారన పేరు కూడా ఎత్తకుండా కథను మహా రంజకంగా వెలయించాడు. ఆంధ్ర(!) కవితా పితామహుడనిపించుకున్నాడు. ఆ కావ్యాన్ని శ్రీనివాస్ ప్రస్తుతం, పద్యానికి పద్యం, పాదానికి పాదంగా ఆంగ్లంలో అందించాడు.

శ్రీనివాస్ స్వతహాగా పరిశోధకుడు. తాను తెలుగు, సంస్కృతాలలో పండితుడిని కానని తానే చెపుతాడు. కానీ, కావ్యం ముందు వెనుకల గురించి ఎంతో పరిశీలించి ఎనె్నన్నో అంశాలను కూడా ఈ పుస్తకంలో అందించాడు. కథను సూక్ష్మంగా అందించడం అవసరం. దాన్ని మరీ సూక్ష్మంగా అందించి మరెన్నో విషయాలను మాత్రం చాలా వివరంగా, 100 పేజీలకు పైన వ్యాసాల రూపంలో ఇచ్చాడు. అనువాదం పద్ధతి, అక్నాలెజ్‌మెంట్స్ తర్వాత, ప్రవేశికలో ప్రారంభించి, పురాణాలు, మూడుసార్లు వచ్చిన మనుకథలలో తేడాలు, రాయలు, అల్లసాని, వారి గురించి కావ్యం గురించి ఇచ్చిన సమాచారం తెలిసిన వారికి కూడా కొత్త ఆలోచనలను అందజేసే తీరులో ఉంది. కళాదృష్టితో చూచి ఈ అనువాదకుడు, కథ ఔట్‌డోర్, ఇన్‌డోర్‌లలో నడిచిన తీరు గురించి చేసిన వ్యాఖ్యానం చాలా బాగుంది.
కృష్ణరాయలు, పెద్దనలిద్దరూ వైష్ణవ గురువుల శిష్యులు. ఆముక్త మాల్యద అనువాదం నాటికి శ్రీనివాస్‌కు అంతగా అందని వైష్ణవం విశేషాలు ఈ పుస్తకంలో సవివరంగా కనిపిస్తాయి. కావ్యం అయిన తరువాత యిరవయి పుటలలో ఇచ్చిన వివరాలు, గొప్ప పరిశోధన దృష్టికి నిదర్శనాలు.

అల్లసాని పెద్దన గురించి చెప్పేవారంతా ‘అల్లిక జిగిబిగి’గురించి వ్యాఖ్యానిస్తారు. పెద్దన రచనలో సంస్కృతం ఎక్కువ. అయినా మాటలు మంచి పట్టుగల నడకలో సాగుతాయని చెప్పక తప్పదు. ‘లంబమాన రవి రథతురగ చారుచామర’ లాంటి మాటలు ఎందరికో కలకాలంగా గుర్తున్నాయి. ప్రవరుడు హిమాలయాలకు వెళ్లి (అపజనించె)న, తరువాత పద్యమంతా సంస్కృతమే. అంబర చుంబి శిరస్సరజరీ అంటూ పద్యం జలపాతంలాగే సాగుతుంది. దాన్ని శ్రీనివాస్ ఆంగ్లంలో ఎట్లా రాశారు? నిజమే, ఈ పద్యంలోనే కాదు, మొత్తం కావ్యంలోనే, ఆంగ్లంలో, అల్లిక జిగిబిగి కానరాదు. ఇది వ్యాఖ్యానాలమీద ఆధారపడి చేసిన అనువాదమని శ్రీనివాస్ స్వయంగా చెప్పాడు. ఇంగ్లీషులో కావ్యాన్ని చదివే వారికి, మూలం నడక తెలియదుకానీ, ఏ భావమూ, అభివ్యక్తీ జారకుండా అనువాదం సాగింది. మూలం చదివి, అర్థంచేసుకున్న వారయినా, ఈ విషయాన్ని సహృదయతతో ‘బాగుందం’టారు.

అనువాదకుని అసలు ఆసక్తి శిల్పంలో! ఆముక్తమాల్యద అనువాద గ్రంథంలోలాగే ఈ పుస్తకంలో కూడా, ఎన్నో ఫొటోలు పొందుపరిచారు మరి. ఈ చిత్రాలన్నింటికీ కథలోని సందర్భంతో సంబంధం ఉందా? కొంతవరకు ఉంది. చాలావరకు లేదు. కానీ అరుదయిన శిల్పకళను చూచిన ఆనందం మాత్రం పాఠకునికి మిగులుతుంది.
అల్లసానివారి అల్లిక ‘జిగి బిగి’అంటే ‘విగరస్ అండ్ టైట్’అనే విశేషణాలను వాడారు వ్యాసంలో. ముక్కు తిమ్మనార్య ముద్దుపలుకులను, పదాలు ముద్దులవలె ఉన్నాయని అర్థం వచ్చే మాటలతో అనువదించారు. ముద్దుపలుకులంటే, ముద్దొచ్చే పలుకులేమో? ముఖ పత్రం మీద కృష్ణరాయల బొమ్మ (శిల్పం) ఉంది అల్లసాని పెద్దన, శిష్ట్లా శ్రీనివాస్‌ల పేర్లున్నాయి. రెండు పేర్లలోని స,శ,ష లకు ఒకే ఎస్‌ను వాడారు. ఈ పద్ధతిని గురించి అందరూ ఆలోచించాలి.

ఈ అనువాదంతో శ్రీనివాస్ ఆంధ్ర సాహిత్యానికి గొప్ప ఉపకారం చేశారు. వారింకా ఏయే కావ్యాలను అందిస్తారోనని అంతా ఎదురుచూస్తారు. పుస్తకంలో అచ్చుతప్పులు (అక్కడక్కడ) ఉన్నాయి. పాయసంలో పుడకల్లాగ!

Saturday, June 30, 2012

తలకెక్కే తత్వాలు


తత్వగీతం: దీవి సుబ్బారావు
(తత్వగీతాల సంకలనం)
పేజీలు: 166,
వెల: రూ.100/-
ప్రతులకు: నవోదయ,
విశాలాంధ్ర పుస్తకాలయాలు;

పోతులూరి వీరబ్రహ్మంగారి పేరు చెప్పగానే అందరికీ ‘కాలజ్ఞానం’ముందు గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత బ్రహ్మంగారి తత్వాలు తలపునకు వస్తాయి. దీవి సుబ్బారావుగారు శ్రమకోర్చి బ్రహ్మంగారి తత్వాలను సేకరించి, పరిష్కరించి ప్రచురించారు. ఈ సేకరణలో వారికి మరి కొందరు పండితులు సాయం చేశారు. బ్రహ్మంగారి దారిలోనే తత్వాలు పాడిన సిద్దయ్య, లక్ష్మప్పల రచనలు కూడా ఈ సంకలనంలో చేర్చడం బాగుంది. వీటితోబాటు అజ్ఞాత గీత రచయితల తత్వాలు కూడా కొన్ని, సంకలనం చివరలో చేర్చారు. చదవడానికే కాక పాడడానికి కూడా అనువయిన తత్వాల రాగ తాళాల వివరాలను ప్రచురించడం మరింత ఉచితంగా ఉపయోగకరంగా ఉంది.

బ్రహ్మంగారి తత్వాలు వినడానికి ఎంతో సులభంగా ఉంటాయి. కాని వాటిలో యోగ విద్యకు సంబంధించిన వివరాలు సూచనలు నిండుగా ఉంటాయి. ఉదాహరణకు చాలా తత్వాలలో ‘బయలు’అనే మాట కనబడుతుంది. ఈ మాట అర్థాన్ని వివరింపబూనితే కొన్ని పేజీల గ్రంథమవుతుంది. ‘బయలూరికి పోవలెరా’ అంటారు బ్రహ్మము. అది మోక్షానికి గుర్తు. కుక్కను పట్టవలె, మూడు మూతల పెట్టెలో భూతము, పాము చిర్రున లేచుట, ఆరు కొమ్ముల ఏనుగు, అయిదు కోతులు, అయిదు మేకలు మొదలయినవన్నీ లోతయిన ప్రతీకలు. ‘నీళ్లలో మునిగి గొణుగుచు ఉంటే నిలకడ చెడును’ అంటారు బ్రహ్మము. చిల్లర రాళ్లకు మొక్కుచు ఉంటే అనే ఈ పాట వేరువేరు రకాలుగా అందరికీ పరిచయమయినదే.

ఊర్థ్వమూలం, అధశ్శాఖం అన్న మాటను సులభంగా ‘మొదలు మీదుగ, తలలు క్రిందగ’ వర్ణిస్తారు మరొక పాటలో. ఇక సిద్దయ్య పాటలలో ఏ కులమని నను వివరమడిగితే’అన్నది చాలా ప్రసిద్ధము. లక్ష్మప్ప తత్వం ‘ఎరిగినందుకు గురుతు ఎరుకయే సాక్షి’ ఆ తర్వాత అమరనారాయణ కైవారయోగి నోట కూడా ‘తెలిసినందుకు గురుతు’గా ప్రతిధ్వనించింది. ఇల్లు ఇల్లనియేవు, జీవులెనుబది నాల్గు లక్షల, ‘గూట చిలుక’ లాంటి తత్వాలు కూడా ఈ సంకలనంలో ఉన్నాయి.

ఇంకా బ్రహ్మంగారు, ఆయన శిష్యుల తత్వాలు మిగిలి ఉండవచ్చునంటారు సంపాదకులు సుబ్బారావు. తత్వాలంటే నిజానికి పాటలు. ఈ ప్రచురణలోని తత్వాలలో చాలాచోట్ల లయ (వరుస) కుదరడం లేదు. మూలంలో అట్లా ఉండడానికి వీలు లేదేమో? అర్థం పేరిట పరిష్కరణ కారణంగా ఈ తేడా వచ్చిందా? తత్వాలను పల్లవి, చరణాలుగా వేసినట్టు కనబడదు. ప్రతి చరణం తర్వాత పల్లవి రావాలి. చివరలో మాత్రం ఇచ్చారు. ఏమయినా, విషయంలో ఆసక్తిగల వారందరికీ ఈ పుస్తకం అవశ్యం పఠనీయం.

Friday, June 8, 2012

ఆంగ్లంలో రాయల ఆముక్తమాల్యద


తెలుగునుంచి ఇంగ్లీషులోకి అనువాదమవుతున్న సాహిత్యమే తక్కువ. అందునా ఒక తెలుగు కావ్యాన్ని యథాతథంగా ఇంగ్లీషులో చెప్పే ప్రయత్నాలు జరగనేలేదు. విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం, లలిత కళల విభాగంలో, అధ్యాపకులు శిష్ట్లా శ్రీనివాస్ ఏకంగా శ్రీకృష్ణదేవరాయల ‘ఆముక్తమాల్యద’ను ఎంచుకుని ఆంగ్లంలోకి అనువదించారు. ‘తాను ధరించిన పూమాలను శ్రీరంగనాధునికి సమర్పించిన’ శూడికుడుత్తు నాచ్చియార్ అనే గోదాదేవికి ఆముక్తమాల్యద అని పేరు. చెప్పడానికి గోదమ్మ గురించి నిజానికి పెద్ద కథ లేనేలేదు. కానీ శ్రీ కృష్ణదేవరాయలు, వైష్ణవ సాంప్రదాయానికి చెందిన మరెన్నో అంశాలు కావ్యంలో ఉండవలసిన వర్ణనలు కలిపి ఈ పేరున కావ్యాన్ని వెలయించాడు.

తెలుగు కావ్యాలలో ‘ఆముక్తమాల్యద’కున్న స్థానం విశిష్టమయినది. విచిత్రమయినది. కవిత్వంలో రెండు లక్షణాలుంటాయని, మొదటిది శబ్దం, కూర్పు, బిగింపు, గడుసుదనము, పలుకుబడి కలిగి ఉంటే, రెండవ దానిలో భావము, కల్పన, అలంకారములు, కథన శైలి ముఖ్యమయినవి. ఆముక్తమాల్యద ‘ఈ రెండు మార్గములలోను దానికదే సాటి’ అని విశ్వనాధ సత్యనారాయణగారి విశే్లషణ. పైగా ఈ కావ్యం సులభంగా నములుడుపడని నారికేళ పాకంలో నడుస్తుందని అందరూ అంగీకరించిన విషయం.

శ్రీనివాస్‌గారు ఇంతకుముందు కళా విషయాలను గురించి మంచి పుస్తకాలను రచించి, ప్రచురించారు. మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయనచూపు కావ్యాలను అనువాదం చేయడంవేపు మళ్లింది. మొదటి ప్రయత్నంగా తాము రాయల ఆముక్తమాల్యదను ఎంపిక చేసుకోవడానికి ఎన్నో కారణాలున్నాయంటూ శ్రీనివాస్‌గారు ఒక చక్కని నోట్ రాశారు. ముందు పుస్తకం గురించి పరిశోధన మొదలైంది. ప్రతులు, వ్యాఖ్యానాలు, చరిత్ర అన్నింటినీ సేకరించి సవివరంగా పరిశీలించారు. అనువాదం కూడా చేశారు. ఇంతకు ముందు రాసిన పుస్తకాలకు లాగే, ఈ ఆంగ్లానువాదానికి కూడా తానే ప్రచురణకర్త, సంపాదకుడు కూడా!

కావ్యంయొక్క అనువాద భాగం 325 పేజీలపైన ఉంది. ముందొక 125 పేజీలు, చివర మరొక కొన్నిపేజీలు, ఆసక్తికరమయిన విశేషాలతో నిండి ఉన్నాయి. చిత్రంగా ఈ పుస్తకంలో బోలెడన్ని బొమ్మలున్నాయి. బొమ్మలెందుకు అన్న ప్రశ్నకు కూడా శ్రీనివాస్ చక్కని వివరణ ఇచ్చి ఉన్నారు. కృతజ్ఞతల పేజీలో కొందరి పేర్లున్నాయి. నిజమే కానీ, పుస్తకమంతా శ్రీనివాస్‌గారి త్రివిక్రమావతారం కనిపిస్తుంది. ఇందులో ఒక వెసులుబాటు ఉంది. కొన్ని కష్టాలూ ఉన్నాయి.

పరిశోధకుడు, అనువాదకుడు, ఫ్రచురణకర్త తానే అయిన శ్రీనివాస్ ఒక కళాజీవిగా, కథకుడుగా చక్కనిపుస్తకాన్ని అందించారు. ముద్రణ కూడా చాలా బాగుంది. అట్టమీద బొమ్మ అందంగా ఉంది. గానీ ఆ బొమ్మనే ఎందుకు వాడిందీ అర్ధం లేదు. మొత్తానికి ఈ పుస్తకం ప్రచురణలో మరెవరిదైనా ప్రమేయం ఉంటే, దాని తీరు మరోరకంగా ఉండేదన్న భావం కలిగింది.

పరిశోధన చేసి రాసిన ప్రవేశిక, పండితులను ఆకర్షించేదిగా ఉంది. రాయల ఆముక్తమాల్యద వ్రాసిన తీరు గురించి, కథాక్రమం గురించి విడిగా చెప్పారు.ఆ తరువాత రియాలిటీ అండ్ మిత్ అనే పేరుతో కావ్యానికి సంబంధించిన సాహిత్య,రాజకీయ, మతపరమైన విశేషాలను ఎన్నో ఉపశీర్షికల కింద తర్కించారు. ఇందులోని చాలా అంశాలు (శ్రీనివాస్‌వల్ల కాదుగానీ) చర్చనీయమైనవే. రకరకాల విషయాలను ఒక చోటి చేర్చి చూడాలని శ్రీనివాస్ చేసిన ప్రయత్నం చాలా బాగుంది.

గోదమ్మ, పన్నిద్ధరాళ్వారులలో ఒకరు. కనుక కావ్యమంతటా వైష్ణవమే. కనుక శ్రీనివాస్‌గారు వైష్ణవం గురించి తర్కించడం సమంజసం,. అవసరం కూడా. కానీ మరింత వివరంగా ఈ విషయం గురించి సమాచారం చేరి ఉంటే బాగుండును. అహోబిల మఠాన్ని స్థాపించినవారు ఆదివణ్ శఠకోపయతి. ప్రస్తుతం ఉన్న ఇరువురు జియ్యర్లతో సహా, మఠానికి అధిపతులయిన యతీంద్రులు అందరి పేరులోను ముందు ఈ శఠకోప శబ్దం ఉంటుంది. ఈ పదానికి గల అర్ధం గురించి ప్రసక్తి సరిగా లేదని అనుమానం. శఠమనే దుర్లక్షణాన్ని దూరం చేసేది శఠగోపమని సంప్రదాయం. తమిళ భాషలో క,గలలకు ఒకటే అక్షరం గనుక అది శఠకోపమయిందా? తరువాత ‘వణ్ శఠకోప’ అని ఒక మాట వాడారు. శ్రవణ్ శఠకోప అని ఉండాలేమో! శ్రీమాన్ వంటి శబ్దమది.

‘చాలా తక్కువగా ఉన్న అచ్చు తప్పుల లాగే, ఏవో చిన్న ప్రశ్నలు తప్ప, శ్రీనివాస్ అందించిన పరిశోధనాంశాలు, కావ్యాలతో పోటీపడి చదివించేవిగా ఉన్నాయి. అనువాదానికి పడ్డ శ్రమకు సూచనగా పాఠభేదాలు, వ్యాఖ్యానాలతో తేడాల గురించి చేసిన చర్చ ఆసక్తికరంగా ఉంది. ‘పొరి విళంగాగ గములు’ అన్న మాటకు అర్ధం వెదికిన తీరు, ఆ వివరాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. తమిళంతో, అలనాటి తమిళంతో మంచి పరిచయమున్న వారు ఈ విషయాలను వివరిస్తే బాగుండును. పొరి అంటే పొడి అని అర్ధం ఉంది. లడ్డూలవంటి మధుర పదార్ధాలను ‘కాయలుగా వర్ణించే పద్ధతి కూడా ఉంది. గమి అన్నా గములు అన్నా సమూహమే! బాగుంది.

రాయల రచన చిత్రంగా సాగుతుంది. అది పండితులకే తప్ప మామూలు పాఠకులకు సులభంగా లొంగదు. మాతృక శైలి నారికేళమయితే, అనువాదశైలి కూడా అదే దారిని నడవాలా? నడవకూడదు. నడవలేదు. ఫలితంగా కావ్యం ఇంగ్లీషులో చదివితే అర్ధమయ్యేదిగా వచ్చింది. మూలంలోని ’జిగి’, ’బిగి’ అందవు. ఒకరకంగా అది లోపం. కానీ విషయం అందుతుంది. అది గుణం!

రెండవ అశ్వాసంలోనే విష్ణుచిత్తుడు ‘నాకు చదువురాదు!’ అని చెప్పడానికి ఒక పద్యం! ‘స్వామీ నన్ను’ అని ఆరంభమయే ఆ పద్యం అందరికీ తెలిసి ఉంటుంది. అందులో రెండు పాదాల నిడివికి పైన ఒక దీర్ఘమయిన సమాస పరంపర. దాన్ని ఇంగ్లీషులో మాత్రం చాలా సులభగ్రాహ్యమైన మాటలలో రాశారు. (ఈ పద్యం అనువాదంలో 91-ఎమెస్కో వారి మూలంలో 90-పాఠభేదమని అర్ధం!

అట్లాగే మూడవ ఆశ్వాసంలో 85 పద్యం ఒక సీసం. అది రాయల రచనకు మచ్చుతునక. మొదటి పాదంలోని మొదటి భాగం సంస్కృత సమాసం. రెండవ భాగం, (దొడ్డ కెందమ్మ కన్‌దోయి వాలి) అచ్చతెనుగు. ఆంగ్లంలో ఈ శైలిని ప్రతిబింబించడం సాధ్యమా? రాయల రచన ఎంత గహనంగా సాగుతుందో, శ్రీనివాస్ అనువాదం అంత సరళంగా సాగింది. మూలంలోని తీరు కనపడకపోవడం, లోపమయితే ఇది లోపం! అశోక్ బ్యాంకర్ అనే రచయిత ఆంగ్లంలో రామాయణం రాశాడు. అది నవల చదివినట్టు ఉంటుంది. అది లోపమా?

శ్రీనివాస్ కథను పద్యాల ప్రకారం వచనంగా చెప్పలేదు. పాదాల ప్రకారం అనువాదం చెప్పారు. అది కవిత మాత్రం కాదు. తన మాటలలో లయ ఉందని ఆయనే అన్నారు. తెలుగు పద్యాలలో ఎక్కడా కనిపించని ‘కొటేషన్’ మార్కులు ఎమెస్కో తెలుగు ప్రతిలో ఉన్నాయి. ఆశ్చర్యం మార్కులు అనువాదంలో ఉన్నాయి. అవి విషయంలో అనువాదకుడు పొందిన అనుభూతికి గుర్తులు!

కళా పరిశోధకుడు, పరిశీలకుడు శ్రీనివాస్, ఈ ‘కావ్యం’లో వాడిన ఫోటోలను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ‘సచిత్ర’ కావ్యం ఒక కొత్త పద్ధతి. పద్యం చదువుతుంటే, తన కనుల ముందు మెదలిన చిత్రాలను, (అక్కడకక్కడ నేరుగా సంబంధం లేకున్నా) వాడిన తీరు ఆసక్తికరంగా ఉంది.

‘తలిరింగైదువుజోదునానతి’ (వి.95)లో ఆయుధాల ప్రసక్తి. అక్కడ బొమ్మ లియోనార్డో దావించీ ఫిరింగి! భలే!
తెలుగు, ఇంగ్లీషు భాషలతో సమానంగా పరిచయమున్నవారు రెండు ‘వర్షన్స్’ను తులనాత్మకంగా చదివి ఆనందించవచ్చు. తెలుగు తెలియనివారు గోదమ్మ కథను, మిగతా అంశాలను మరింత బాగా ఆనందించవచ్చు. ఆనందించవలె! ఈ పుస్తకాన్ని అంతర్జాతీయ సంస్థలవారు (ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్) అందుకుని ఉంటే, తెలుగులోని రచనల తీరు ప్రపంచానికి ‘మరింత’ బాగా అందేదని అనిపించింది. ఇప్పుడు అందనిది లేనే లేదు. మంచిపనికి మంచి ప్రాచుర్యం రావాలి. శ్రీనివాస్‌గారు ‘సేల్స్’ అన్న కార్యకమాన్ని కూడా తామే తలకెత్తుకుంటే తర్వాతి సృజనాత్మక కార్యక్రమం సాగదు. పుస్తకం అందవలసిన దూరాలకు అందదు!

అందంగా ఆసక్తికరంగా రూపొందించిన ‘ఆముక్తమాల్యద’ గ్రంథానికి అయిదు తక్కువ అయిదువందలు. తక్కువే ధర!

-కె.బి.గోపాలం

ఈ రచయిత ఈ మధ్యనే మనుచరిత్ర ఆంగ్లానువాదం కూడా ప్రచురించారు.

వివరాలకు:

శ్రీనివాస్ శిష్ట్లా
దృశ్యకళాదీపిక
4-61-7, లాసన్స్ బే కాలనీ,
విశాఖపట్నం - 530017

ఫోన్ - 09395345431

sistlasrini@gmail.com 

Friday, May 18, 2012

పలుకుబడి- వ్యాస సంకలనం


పలుకుబడి- వ్యాస సంకలనం,
రచన- తెలిదేవర భానుమూర్తి,
లిఖిత ప్రెస్, బాగ్‌లింగంపల్లి,
హైదరాబాద్- 44,
పేజీలు: 169, వెల: రూ.100/-

మాండలికం యాసలో కవితలు, కథలు రావడమే కరువయింది. దానికి రాజకీయ, సాంఘిక కారణాలు ఉన్నాయని అనిపిస్తుంది. భాషాపరంగా కూడా కారణాలున్నాయి. మాండలికంలో రచనలు ఆ ప్రాంతం వారికి తప్ప మిగతా వారికి మింగుడు పడవు. మాండలికం మనుషుల నోళ్లలో ఉంటుంది. దాన్ని కాయితం మీద పెట్టడమే ఒక ప్రయత్నం. నిజంగా పలికే తీరుకు అక్షర రూపం యిస్తే, ఆ అక్షరాలు, ఆ మాండలికం వారే కూడబలుక్కుని చదవవలసి వస్తుంది. ఇగ సమఝకు అచ్చుడు సంగతే ఏర్పాటుగుంటది! అది ఏ యాసయినా ఇదే పరిస్థితి.

తెలంగాణ మాండలికమని ఒక భాష లేదు. తెలంగాణంలో ఒకే జిల్లాలో బోలెడన్ని యాసలుంటయి. మారిన మాటలకు అర్థాలు తోచనుకూడ తోచవు. అటువంటి వాతావరణంలో తెలిదేవర భానుమూర్తిగారు పత్రికలో పనిచేశారు గనుక, ఏకంగా కాలం రాశారు. అది పొలిటికల్ సెటైర్! ఈ సంకలనంలోని వ్యాసాలు ‘చంద్రబాబునాయుడు రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ప్రహసనంపై భానుమూర్తీయమయిన పరిహాసమ’ని ప్రచురణకర్తలే ప్రకటించారు.

పుస్తకం నిండా చంద్రబాబునాయుడే! అజరుద్దీనూ, వాజ్‌పేయి సర్కార్, చంద్రశేఖరూ, దేవేంద్రగౌడూ అక్కడక్కడ తొంగి చూస్తారు. ఇదంతా గతం కథ! అయినా తెలంగాణ మాండలికం చదవాలనుకున్న వారికిది బాగానే ఉంటుంది! ఏ మాండలికమయినా హుషారుగా ఉంటుంది. రాజకీయం మీద చెణుకులు మరింత బాగుంటాయి. అయినా, మందులకన్నా శ్రేష్టం (!) ఉత్తమం, రోగాలు మటుమాయమవుతాయి లాంటి మాటలు మాత్రం, అసలు రచనను పోలి అన్నవేమోననిపిస్తుంది.

మురికి కాల్వలు మంచివి. కమస్కం గండ్లనన్న నీల్లుండయి! (కమ్‌సే కమ్, కనీసం! మన్సుకొచ్చిందా?) ఆత్మ నీల్లల్ల నానదు, నిప్పులల్ల గాలదు, ఆత్మహత్య ఎట్ల జెయ్యొస్తది లాంటి మాటలు నిజంగా కితకితలు పెడతాయి. అప్పులు దెచ్చే కళ, పిలగాడు పరీక్ష ఫేలయినందుకు దావతు, దేవుళ్లమీద విసుర్లు కూడా ఆలోచింపజేస్తాయి. ‘బైరూపులోండ్లు’ రకరకాల అంశాల మీద ఆటలాడి అందించే వ్యాఖ్యానాలు చదివిస్తాయి.

ఇంతకూ చంద్రబాబునాయుడు ఈ వ్యాసాలు చదివి ఉంటారా? నవ్వుకుని ఉంటారా? తప్పక చదివే ఉంటారు. మీరుకూడా చదవండి. అర్ధమయినా కాకున్నా నవ్వు మాత్రం వస్తుంది. గింతకు, తెలంగాణముల గింతగానము ‘గ’కారం వాడుతరా? గట్లనే వాడుతరేమొ? గెవనికెరుక?

Tuesday, May 8, 2012

జిడ్డు కృష్ణమూర్తి -


జిడ్డు కృష్ణమూర్తి
-అబ్బూరి ఛాయాదేవి
సి.పి.బ్రౌన్
అకాడమి,నాగార్జునహిల్స్,
పంజగుట్ట,
హైదరాబాద్- 82
పేజీలు: 150;
వెల: రూ.95/-

అర్థమయిన వాళ్లకూ, అర్థంకాని వాళ్లకు ఒక ప్రశ్నగా మిగిలి గుర్తుండిపోయే జిడ్డు కృష్ణమూర్తి పేరులోనే తప్ప మరెందులోనూ జిడ్డుతనం లేదు. తెలుగువాళ్లంతా ఆయనను ‘మనవాడు’ అంటారు. ఆయన నిజంగా భారతీయుడా? అని అనుమానం వచ్చినవారున్నారు. అందరికీ ఆ అనుమానం ఉంది, అన్నా తప్పుగాదు. ఆయన ప్రపంచ పౌరుడు. ‘నేను గాలిలాంటి మనిషిని!’ అనగలిగిన మనిషిని పట్టుకుని ఒక పద్ధతికి, ప్రాంతానికి కట్టివేయడం అమాయకత్వం. జేకే గురించి తెలుగులో పుస్తకాలు తక్కువ. వందలకొద్దీ ఉన్న ఆయన పుస్తకాల అనువాదాలు కూడా తక్కువే. ఆయన గురించి తెలుసుకోవాలంటే, మేరీ లుటెన్స్, ప్రపుల్ జయకర్‌లు రాసిన పుస్తకాలు చదవాలి!


అబ్బూరి ఛాయాదేవిగారు రాసిన ఈ పుస్తకం అట్టమీద జీవనమార్గం- జీవితం, బోధనలు అని ఉపశీర్షిక ఇచ్చారు.
అరవయి సంవత్సరాలపాటు ప్రపంచమంతా తిరిగి, నిత్యం తన భావాలను పంచిన ఒక తాత్వికుని గురించి, ఒక చిన్న పుస్తకంలో చెప్పడం వీలుకాని పని! ప్రయత్నం చేయడంలో తప్పులేదు. మంచి పుస్తకమే వచ్చింది. కానీ ఈ పుస్తకంలో కృష్ణమూర్తికన్నా ఆయన ఆలోచనలు ఎక్కువగా కనిపిస్తాయి. ప్రపంచానే్న ‘మార్పు’వేపు మరల్చిన ఒక ప్రఖ్యాత తాత్వికుని ఆలోచనలను, ఒకసారి కథలాగ చదివితే లాభం ఉండదు. ప్రతి నాలుగు వాక్యాల తరువాత, ఒక ప్రశ్న అడగాలనిపిస్తుంది.


ఆయన వెంట తిరిగినవారు, ఆయననుంచి మెప్పు ఆశించారు. అది దొరకనందుకు వారంతా దూరంపోయారు, అంటారు రచయిత్రి ఒకచోట. కృష్ణమూర్తిని మత బోధకుడు అన్నారు కొందరు. ఆయన ఒక మతానికి, సంస్థకు, దేశానికి కట్టుబడినవాడు కాదు. ఆయన మాటలు గురువు బోధనలుగా ఉండవు. ఆయనలో ఒక మిత్రుని చూడగలిగినవారు ఎక్కువ సంతృప్తిపొందారు.


జె.కె. గురించి తెలియని తెలుగు పాఠకులకు ఈ పుస్తకం ఒక మిత్రునిగా వచ్చింది. ‘కొంత’తెలిసిన వారికి కూడా ఈ పుస్తకంలో మంచి మెటీరియల్ ఉంది. పుస్తకంలో వేసిన బొమ్మల కింద, వివరాలు వేస్తే మరింత బాగుండేది. ఇంగ్లీషు పుస్తకాల మీద ఆధారపడినందుకేమో కొన్ని వాక్యాలు, ఇంగ్లీషు సింటాక్స్‌లో వచ్చాయి. విషయం గురించిన ఆసక్తిలేనివారిని కూడా చదివించగల రచనా పద్ధతి, ఇంత చిన్న పుస్తకంలో వీలవుతుందా? ప్రతి విషయంమీద కొంచెం వివరణ ఉంటే ఎంత బాగుండును, అనిపించింది. సీరియస్‌గా చదవవలసిన పుస్తకాలలో ఇదొకటి!

Saturday, April 28, 2012

పురాతన సమాజం - పుస్తక సమీక్ష


పురాతన సమాజం
రచన: లూయీ హెన్రీ మోర్గన్
అనువాదం: మహీధర రామమోహనరావు
విశాలాంధ్ర
పబ్లిషింగ్ హౌస్,
బ్యాంక్ స్ట్రీట్,
హైదరాబాద్-1


పేజీలు: 384
వెల: రూ.200/-


సమాజ పరిణామ క్రమాన్ని నిశితంగా, సవివరంగా, సశాస్ర్తియంగా పరిశీలన చేసి మోర్గన్ రాసిన పుస్తకానికి ఇది తెలుగు అనువాదం. ఈ పుస్తకం మార్క్స్, ఎంగెల్స్‌లను ఎంతో ప్రభావానికి గురిచేసింది. ఎంగెల్స్ తన ‘ఆరిజిన్ ఆఫ్ ఫ్యామిలీ, ప్రైవేట్ ప్రాపర్టీ, అండ్ ద స్టేట్’ అన్న పుస్తకాన్ని, మోర్గన్ రచన ప్రభావంతోనే చేశాడు. అమెరికన్ ప్రాచీన సమాజాలలో సాంఘిక పరిణామాలు, బంధుత్వాల గురించి మోర్గన్ రాసిన అంశాలను ఆంత్రోపాలజీ, (మానవీయ శాస్త్రం) రంగంలో గొప్ప గౌరవంతో అధ్యయనం చేయడం ఈనాటికీ కొనసాగుతున్నది.

వామపక్ష భావజాలాన్ని ఎంతో ప్రభావితం చేసిన మోర్గన్ రచన, డార్విన్, మార్క్స్, ఎంగెల్స్‌ల కృషితో కలిసి మానవజాతి ఆలోచనలను శాస్ర్తియ మార్గంలో నడిపించాయి అంటారు, విశాలాంధ్ర ప్రచురణల సంపాదకులు ఏటుకూరి ప్రసాద్. పాత విశ్వాసాలను మార్చగల ఈ పుస్తకాన్ని తెలుగులో ప్రచురించాలని విజ్ఞాన వికాస సమితి పేరున కొందరు పెద్దలు పడిన శ్రమ విషయాలను యథాతధంగా, ఈ ప్రచురణ లోనూ అందించారు. 1987లో మొదటిసారి వచ్చిన పుస్తకానికి ఇది మలి ప్రచురణ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ప్రాచ్యప్రపంచంలో కూడా మానవ సమాజ పరిణామాన్ని, వర్ణించిన రచనలు లేకపోలేదు. కానీ, అవి శాస్ర్తియ పద్ధతిలో వచ్చిన పరిశోధన గ్రంథాలుగా లేవు. కనుకనే, తరువాతి కాలానికి చెందిన ఈ రకం పుస్తకాలకు గౌరవం ఎక్కువ. మనుషులకందరికీ, ఈ మధ్యన నేనేమిటి, నా గతం ఏమిటి అన్న ప్రశ్నలు బలంగా ఎదురవుతున్నాయి. జవాబుగా మొదటి ప్రశ్నకు ఎక్కువగా, రెండవ ప్రశ్నకు అరుదుగా రచనలు వస్తున్నాయి. అరుదయిన క్రమంలో వచ్చిన ఈ ‘పురాతన సమాజం’ అన్న రచనను అందరూ చదవాలి! వీలయినవారు, ప్రాక్పశ్చిమ ధోరణుల దృష్టితో తులనాత్మకంగా కూడా చదవాలి.

మోర్గన్ స్వతహాగా పరిశోధకుడు కాదు. ప్రభుత్వ అధికారి కావాలని ప్రయత్నించాడు కూడా 1840లో అతను ఆటవిక జాతుల వారితో స్నేహం కలిపాడు. ఇరోకో లాంటి తెగల వారితో కలిసి బతికి, వారి సమాజంలో చిత్రంగా తోచిన బంధుత్వాలు, పద్ధతులను గమనించాడు. వాటి గురించి విస్తృతంగా రాశాడు కూడా!

సమకాలికుడయిన డార్విన్ ప్రతిపాదించిన పరిణామసిద్ధాంతం ముందు, ఈ సాంఘిక పరిణామ సిద్ధాంతం కొంత వెలతెలబోయిన మాట వాస్తవం. కానీ అది, సరయిన వారిని ఆకర్షించింది. లూరుూ మోర్గన్ 1879లో అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ సైనె్సస్‌కు అధ్యక్షుడయ్యాడు.

ఈ రచనలో మోర్గన్ వర్ణించిన సాంఘిక పరిణామం ఆసక్తికరంగా ఉంటుంది. ఉబుసుపోకకు చదువుకునే గ్రంథం, నవల కాదు గానీ, మానవ చరిత్రలో ఆసక్తిగలవారికి, అంతకన్నా ఆకర్షణ గలిగిన రచన. ఆటవిక దశలో మూడు, అనాగరిక దశలో మూడు అంచెలను దాటి నాగరికతకు చేరిన సమాజాల తీరును గురించి చదవడం, అందరికీ ఆసక్తికరంగానే ఉంటుంది. మనిషి ఆలోచనే పరిణామానికి దారితీసిందని మోర్గన్ అభిప్రాయం. పర్యావరణ ప్రభావంవల్ల మానవవర్గాలు వేరువేరుచోట్ల చేరి వేరుగా ఆలోచించాయన్న ఆలోచనను ఈయన పక్కనబెట్టినట్లు కనబడుతుంది. ప్రపంచం అంతటా సమాజాలు ఒకే మూసలో ముందుకు సాగలేదు. ఈ సంగతి విజ్ఞులు అంగీకరించినదే.

అధికారం, ప్రభుత్వం అన్న ఆలోచనల బీజాలను గురించి ఈ రచనలో ఎంతో సమాచారం ఉంది. అది మరింత చర్చకు దారితీసింది, తీస్తుంది కూడా. అంతకన్నా ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ వచ్చి క్రమంగా మారిన తీరు వర్ణన మరింత ఆసక్తికరంగా సాగుతుంది. ఒక వ్యక్తి మరణిస్తే, అతని ఆస్తి ఆ వర్గానికి చెందేదని స్ర్తిస్వామ్యంగా బలంగా కొనసాగేదని చదివితే, యువతరం వారికి చిత్రంగా తోచవచ్చు. ఆస్తి, వారసత్వం లాంటి విషయాలన్నీ పరిచితంగా కనిపిస్తాయి. కానీ, వాటి వెనుక ఎంతో చరిత్ర ఉంది. ఆ చరిత్ర, దానికి కారణమయిన పరిస్థితులు ఈ పుస్తకంలో వివరంగా ఉన్నాయి.
జీవ పరిణామం, సాంఘిక పరిణామం, సులభమయిన పరిస్థితి నుంచి గజిబిజి లేదా క్లిష్టపరిస్థితికి దారితీసిందని ఒక నమ్మకం. కొన్నిచోట్ల తలకిందులు వర్ణనలు ఎదురవుతాయి. పరిశోధకులకు అది పట్టించుకోవలసిన అంశంగా కనబడుతుంది.

అన్నా-తమ్ముడు, అక్కా-చెల్లెలు లాంటి మాటలు, సంబంధాలకు మారుతూ వచ్చిన అర్థాలు, పెళ్లి, కుటుంబం లోతులు తెలుసుకునేందుకు మొదలుపెట్టి ఈ పుస్తకాన్ని ‘సీరియస్’గా చదవాలి! మరెన్నో సంగతులు తెలిసి ఆశ్చర్యంలో మునుగుతాము!

Monday, April 16, 2012

నేను తిరిగిన దారులు - సమీక్ష


రచన: వాడ్రేవు చినవీరభద్రుడు
ప్రతులకు:
విజయశ్రీ, 96, నవోదయ కాలనీ,
మెహదీపట్నం,
హైదరాబాద్ -28.
పేజీలు: 208,
వెల : రూ.100/-

తెలుగులో యాత్రా ఛరిత్రలు కొత్త కాదు. ఏనుగుల వీరాస్వామయ్య కాశీ యాత్రాచరిత్ర నుండి ఇటీవలి దాకా చాలాకాదు గానీ, కొన్ని రచనలు ఈ పంథాలో వచ్చాయి. వస్తున్నాయి. ఇతర దేశాలు తిరిగి చూచిన వారు ఈ రకం రచనలు ఎక్కువగా చేస్తున్నారనవచ్చు.

‘నీవు స్వగృహాన్ని వదిలిన ప్రతిసారీ యాత్రీకుడివయినట్టే!... పోయి రాగానే నీలో ఎంత కొత్త రక్తం ప్రవహిస్తుందని!... మళ్లా గృహోన్ముఖుడివయినప్పుడు ఒట్టి మనిషిగాకాక మహా మానవుడిగా తిరిగి వస్తావు’ అంటారు ఈ పుస్తకం రచయిత ఒక వ్యాసంలో. ఇంతటి భావుకుడు, కవి, రచయిత, ప్రపంచం గురించి బాగా చదివిన మనిషి, బయలుదేరితే, ఆలోచనలు అలలుగా వస్తాయి. వచ్చాయి. వాటికి అక్షర రూపమే ఈ వ్యాసాలు. కలిసి ఈ ‘నేను తిరిగి దారులు’. ఇంగ్లండ్‌లో, దిల్లీలో, మన రాష్ట్రంలోని క్షేత్రాలు, ప్రదేశాలలో తిరిగి తర్వాత రచయిత తమ భావాలను, యాత్రావర్ణనలుగా పాఠకులకు అందించారు. యాత్రాచరిత్రలు వ్యక్తి స్వీయ అనుభవాలు. మరి ఒకటిరెండుచోట్ల రచయిత, కథ పద్ధతిలో మరెవరి నోటనో తమ అనుభవాలను పలికించారు. అది ఒకందుకు బాగుందేమో గానీ, మొత్తం రచన, భావాలలో కథకున్న కాల్పనికత అనే లక్షణం మారుతుందేమో? సాధారణంగా రచయితలెవరూ కథను పూర్తి వాస్తవమని చెప్పరు. చదివే వారికి మాత్రమే వాస్తవంగా కనిపిస్తుందది! ఇక్కడ రచనలోని బలమే బాగా ముందుకు వచ్చింది! అంతా వాస్తవమని తెలుస్తూనే ఉంది. అన్ని వ్యాసాలూ కథల లాగ నడవలేదనేది మరో అంశం.

ఈ పుస్తకంలో యాత్రాకథనాలు మూడు. నిజంగా కథనాలవి. వాటిని చదివిన తర్వాత ఆ ప్రదేశాలకు బయలుదేరాలన్న కోరిక పాఠకులలో బలంగా కలుగుతుంది. అరకు, శ్రీశైలం, పాపికొండల గురించి ఎనె్నన్ని విశేషాలు. ప్రదేశం భౌగోళిక విశేషాలకన్నా, మనుషుల గురించి చేసిన పరిశీలన, వ్యాఖ్యలు రచయిత వ్యక్తిత్వాన్ని మనముందు ఉంచుతాయి. ఆయన సాహిత్యప్రేమ, అభినివేశాలు అక్కడ అదనపు బలంగా, మరింత ఆసక్తి కలగడానికి కారణాలవుతాయి. పాతాకొత్తా మేలుకలయిక, అజేయమయిన మానవ జీవితేచ్ఛ అంటూ భారతీయ అనుభవాన్ని వర్ణించారు రచయిత!

తరువాతి ఆరు రచనలు ‘యాత్రానుభవాలు’అనే శీర్షిక కింద వస్తాయి. వీటిలో కథనం కొంత సూటిగా సాగినా, నాటకీయతకు లోటు రాలేదు. గోదావరి ఎక్కడ అని వెతికి, నిరాశకు గురయినా, అమ్మవారి గుళ్లో దర్శనం సరిగ్గా జరగకున్నా, మధురలో మానవత గురించి మనసులో మెదిలినా రచనలు పట్టుగా చదివించేవిగా సాగాయి. ఇక ఇంగ్లాండ్ గురించిన రచన కవితాత్మకంగా మొదలవుతుంది. కానీ, సంస్కృతి, సాహిత్యం, కళలు మొదలయిన అంశాలతో, అదొక సమాచార పూరిత పరిశోధన వ్యాసంలాగ సాగుతుంది. నిడివి కూడా మిగతా వాటికన్నా ఎక్కువ. బిగుసుకుపోతారనుకున్న ఇంగ్లీషువారిలోనూ ఈ రచయితకు చాలా మంచితనం ఎదురయింది. ఆసక్తిగల వారికి ఈ వ్యాసంలోనూ ఎన్నెన్నో విశేషాలు!

దిల్లీ లేదా ఢిల్లీ, మధుర, తుల్జాపూర్, త్రయంబకం లాంటి చోట్ల తిరుగుతుంటే హిందీ తెలియకపోవడం గుర్తుకువచ్చిందీ రచయితకు. నిజం కదూ! అదొక సమస్యే మరి!

టూరిజంలో ఒక చిక్కు, ట్రిక్కు ఉన్నాయి. ప్రదేశాలను గురించి పుస్తకాలలో చదివి, బొమ్మలు చూచి, ఏవేవో ఊహించుకుని అక్కడికి వెళితే, చాలాసార్లు నిరాశ కలుగుతుంది. కొన్నిచోట్ల అనుకున్నదానికి మించి ఏదో ఎదురవుతుంది. ఈ విషయాలు ఈ రచనల్లో చెప్పకుండానే మనముందుకు వస్తాయి. అరుణగిరి దర్శనంలో స్థలంకన్నా ‘చలం’ (గుడిపాటి వెంకటచలం) ఎక్కువగా కనిపించడం, రచయిత గురించి మనకెంతో చెపుతుంది.
వీరభద్రుడుగారు చేయితిరిగిన రచయిత. యాత్రీకులు, అలమికుంటుండగా, మర్మరధ్వని, వెయ్యికాళ్ల కొండచిలువ, ఓస్మానాబాద్, అమరుశతకం, దివాన్ అయ్యాడు లాంటి మాటలు ఎందుకు వాడుకున్నారో అర్థంకాలేదు.

నదీనదాలు, అడవులు, కొండలు అని ఉపశీర్షికగా అచ్చువేశారు. కానీ వాటికన్నా బలంగా ఈ పుస్తకంలో మనుషులు ఎదురయి పలకరిస్తారు. మీరూ వారిని పలకరించండి!

- గోపాలం కె.బి.

Tuesday, February 7, 2012

ప్రొఫెసర్ నాయుడమ్మ - పుస్తకం


విశిష్టం.. శాస్తజ్ఞ్రుడి జీవన చిత్రం

డా.వై.నాయుడమ్మ
రచన: డా. సోమరాజు సుశీల
సి.పి.బ్రౌన్ అకాడమి 53,
నాగార్జునహిల్స్,
పంజగుట్ట, హైదరాబాద్-82
పేజీలు: 134;

వెల: రూ.95/-


సి.పి.బ్రౌన్ అకాడమీవారు విరివిగా చేస్తున్న పుస్తక ప్రచురణలో 25కు పైగా పుస్తకాలు వివిధ రంగాలకు చెందిన మహనీయుల జీవిత చిత్రాలు. వాటిలో ఒక సైంటిస్టు గురించి వచ్చిన పుస్తకం ఇదేననవచ్చు. నాయుడమ్మగారు కేవలం ఒక సైంటిస్టు కాదు. గొప్ప మానవతావాది. అట్టడుగు వర్గాల మేలుకొరకు పాటుపడిన ఆదర్శమూర్తి. ఈ ప్రపంచంలో చాలా కొద్దిమంది జీవితాలు మాత్రమే అందరూ అనుసరించవలసిన బాటలుగా సాగుతాయి. అటువంటి అరుదయిన వ్యక్తులలో నాయుడమ్మగారి పేరు ముందు వస్తుంది.


‘నేను పుట్టుకతో రైతును! వృత్తిద్వారా అంటరాని వాడిని, రెండింటి గురించి నేను చాలా గర్వపడతాను!’ అన్నారు డాక్టర్ యెలవర్తి నాయుడమ్మ. ఆయన తమ పరిశోధనకొరకు ఎంచుకున్న రంగం తోలు పరిశ్రమ. ఎన్ని రకాల పదవులు, అవకాశాలు వచ్చినా ఆయన ఈ రంగాన్ని మాత్రం వదలలేదు. భారతదేశంలో శాస్త్ర పరిశోధనలు, మామూలు ప్రజలకు పనికివచ్చేలా సాగవు. నిజానికి అవి ఎవరికీ పనికిరావు అన్న విమర్శ ఉంది. వౌలిక పరిశోధనలు కొంతవరకు ఆ రకంగా ఉంటే ఉండవచ్చు. వ్యవసాయం, ఆరోగ్యం, పరిశ్రమల విషయంలో మన దేశంలో జరిగిన పరిశ్రమ మామూలువారికి కూడా అందుబాటులోకి వచ్చే విప్లవాలకు కారణమని చాలామంది గమనించరు. నాయుడమ్మగారి నేతృత్వంలో దేశంలో జరిగిన ‘తోలు’ గురించిన పరిశోధనకు ప్రపంచస్థాయిలో ఎంతో గుర్తింపు ఉంది. అంతేగాదు బడుగు చర్మకారులకు సాయపడింది!


నాయుడమ్మగారి జీవిత చిత్రాన్ని డా.సోమరాజు సుశీలగారు రాయడం ఎంతో ఉచితంగా ఉంది. ఆమె నాయుడమ్మగారిని స్వయంగా ఎరిగినవారు. నాయుడమ్మగారి పరిశోధనలు, నిర్వహణ విధానాలవల్ల లాభపడినవారు కూడా. అందుకే, స్వయంగా కెమిస్ట్రీ పరిశోధకులయిన సుశీలగారు నాయుడమ్మగారి పరిశోధనల గురించి, దేశంలో సైన్సు, పరిశోధన, సంస్థలు, పరిశ్రమల గురించి బాగా రాయగలిగారు.


నాయుడమ్మగారు మద్రాసులోని చర్మ పరిశోధన సంస్థలో తమ కృషిని ప్రారంభించి, ఆ సంస్థకు నిర్దేశకులయ్యారు. భారతదేశంలో చర్మ పరిశ్రమకు కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. శాస్త్ర, సాంకేతిక పరిశోధనలను నడిపించే సి.ఎస్.ఐ.ఆర్‌కు ఆయన డైరెక్టర్ జనరల్ అయ్యారు. ‘నేను రిటైర్‌మెంట్‌దాకా ఆ పదవిలో ఉండను. అయిదు సంవత్సరాల తర్వాత వచ్చి, నా పరిశోధన చేసుకుంటాను, మీకు అంగీకారమయితేనే వస్తాను!’ అని దేశ ప్రధానమంత్రికే సూటిగా చెప్పగలిగారు నాయుడమ్మ. ఆయనకు తమ పరిశోధన మీద గల అంకితభావం, అక్కడ ప్రపంచానికి కనబడుతుంది. నిర్వహణదక్షుడయిన నాయుడమ్మగారు, చర్మ పరిశోధన సంస్థలో ఒక ఎకనామిక్స్ శాఖను కూడా ఏర్పాటుచేసి, పరిశోధనలను వాడడం వేపు చూసిన దృష్టి ఆశ్చర్యం కలిగిస్తుంది.
‘కాయబోయే కాయలకన్నా, పండిన ఫలాలను పంపిణీ చేయడంపై ఆయన దృష్టి ఉండేదని’ సుశీలగారు రాశారు. అన్ని రంగాలలోనూ ఈ రకం ఆలోచన ధోరణి కొంత ఉన్నా, దేశం ప్రపంచం ఎంతో బాగుపడతాయి.


నాయుడమ్మగారిని ప్రఖ్యాత జెఎన్‌టియుకు వైస్ ఛాన్సలర్‌గా ఏరికోరి నియమించారు. అక్కడ తనకు కుదరదని, ఆయన తిరిగి పరిశోధనలోకి వచ్చేశారు. ప్రతి అనామకుడూ అధికారంకొరకు పాకులాడుతుండడం అందరికీ తెలిసిందే.
ఈ పుస్తకంలో నాయుడమ్మగారు తమ కార్యదర్శులకు రాసి ఇచ్చిన పనె్నండు సూత్రాలు, అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్‌కు రాసిన లేఖ లాంటి కొన్నింటిని అనువదించి పొందుపరిచారు. నాయుడమ్మగారు అమలుచేసిన కరీంనగర్ ప్రాజెక్టు వివరాలు కూడా ఇందులో ఉన్నాయి. వీటిని, మొత్తంమీద ఈ పుస్తకాన్ని అందరూ చదవాలి. చేతనయితే దీన్ని ఇంగ్లీషులోకి అనువాదం చేయించి దేశంలోని శాస్త్ర పరిశోధకులందరికీ అందజేయాలి!


కేవలం రెండుమూడు గంటలు మాట్లాడినంత మాత్రాన, ఒక వ్యక్తి జీవితమంతా గుర్తున్నారంటే, ఆ వ్యక్తి నిజంగా ఆదర్శమూర్తి. అటువంటి అనుభవం ఈ సమీక్షకునికి మిగిలించారు నాయుడమ్మగారు. ఆంగ్ల చిత్రాల నటుడు గ్రెగరీపెక్ లాగ కనిపించే నాయుడమ్మగారు, ‘ఫీడ్, ఫాడర్, ఫెర్టిలైజర్’ అనేవి మూడు కుదిరితే ఆంధ్ర దేశం మరింత ముందుకు సాగుతుందని రేడియో పరిచయంలో చెప్పిన మాటలు యింకా చెవుల్లో గింగురుమంటున్నాయి
.
హాస్యప్రియులు, జీవితాన్ని ప్రేమించిన వ్యక్తిఅయిన నాయుడమ్మగారి ఆసక్తికరమయిన జీవితానికి ఈ పుస్తకం ‘కొండను అద్దంలో చూపించే’ ప్రయత్నం. అయినా జీవన చిత్రంలో ఉండవలసినవన్నీ ఇందులో ఉన్నాయి. కనుక, ఈ పుస్తకాన్ని అందరూ చదవాలి. అందరిచేత చదివింపజేయాలి.

Tuesday, January 24, 2012

‘భమిడిపాటి’ రచనలు - సమీక్ష


నవ్వడం నేర్పించే ‘భమిడిపాటి’ రచనలు


భమిడిపాటి
కామేశ్వర రావు
రచనలు - 4
నాటకాలు
పేజీలు: 230
వెల: రూ. 110/-
ప్రతులకు: విశాలాంధ్ర
పబ్లిషింగ్ హౌస్, బ్యాంక్ స్ట్రీట్, హైదరాబాద్-1.

భమిడిపాటి కామేశ్వరరావుగారి పేరు చెపితేనే నవ్వేతరం ఒకటి ఉండేది. ఆ తరువాత ఆయన కుమారుడు రాధాకృష్ణ కూడా హాస్యరచనలతో పేరు సంపాదించుకున్నారు. విశాలాంధ్ర వారు కామేశ్వర రావుగారి రచనలను సేకరించి సంగ్రహాలుగా వేయటం ఎంతో సంతోషించదగ్గ విషయం. ఇంకా కొన్ని రచనలు మాకూ అందలేదు. మీ దగ్గర ఉంటే పంపించండి. అని అడగడం మరింత బాగుంది.


నాలుగవ సంపుటమయిన ఈ పుస్తకంలో నాలుగు స్టేజి నాటకాలున్నాయి. వాటిలో మూడు అనువాదాలు. చివరిది నేరుగా వారి రచన.
ప్రణయరంగం ఈడూ-జోడూ అన్న నాటకాలు ప్రసిద్ధ ఆంగ్లవక్త, రూపకకర్త, రిచర్డ్ బ్రిన్‌స్లీ షెరిడన్ నాటకాలకు తెలుగు రూపాలు. పాశ్చాత్య నాటక ప్రపంచంలో షెరిడన్, మోలియర్‌లకు ఉన్న పేరు చాలా గొప్పది. వాళ్ల రచనలను కామేశ్వర రావు గారు తెలుగు చేయడంలో ఆశ్చర్యం లేదు. అందులో ఆయన ఎంపిక చేసిన నాటకాలు మరీ ప్రత్యేకమయినవి.
షెరిడన్ సృష్టించిన ఒక పాత్ర, భాషాప్రయోగంలో ఒక సిద్ధాంతానికి ఆధారమయింది. ఆ నాటకం పేరు ‘రెవల్స్’. అందులో మిసెస్ మ్యాలప్రాల్ అని ఒకావిడ ఉంటుంది. ఆవిడ పదాలను బాగా వాడాలన్న కోరికతో అర్థంలేని పదప్రయోగాలు చేస్తుంది. ఆ పద్ధతికి ఆంగ్లంలో, ఆ పాత్ర పేరున ‘మ్యాలప్రాసిజం’ అని పేరు వచ్చింది. ఈ ప్రణయరంగంలో కూడా ఒక రాంబాణమ్మ గారిని రచయిత సృష్టించారు. ఆమె, అర్థంలేని పదప్రయోగాలతో నవ్వులు పండించారు.


షెరిడన్ 1816లో మరణించాడు. అంటే ఈ నాటకాలు అంతకన్నా ముందు కాలానివి. అలనాటి ఆంగ్ల సమాజంలో అమ్మాయిలను పెళ్ళిళ్ళను, అపార్థాలనూ వాడి హాస్యం పండించే పద్ధతి ఉండేది. ఈ సంప్రడంలో రెండవ నాటకం ‘ఈడూ - జోడూ’ కూడా షెరిడన్‌దే ఈ నాటకం సంగీత నాటకంగా నేటికీ ప్రపంచాన్ని ఊపేస్తున్న డ్యూయెన్నాకు తెలుగు రూపం.


సంకలనంలో మూడవ నాటకం, మరో ప్రసిద్ధ రచయిత ఆలివర్ గోల్డ్‌స్మిత్ రచనకు అనువాదం గోల్డ్‌స్మిత్ 18వ శతాబ్దం మధ్యకాలం నాటి రచయిత చివరి నాటకం, చెప్పలేం మాత్రం కామేశ్వర రావుగారి స్వంత రచన. కానీ అది మొదటి మూడు నాటకాల తీవ్ర ప్రభావం ప్రతిఫలించిన రచన.


నాటకాలు నాలుగింటిలోనూ, అమ్మాయిలు, అబ్బాయిలు, వాళ్ళ తండ్రులు, అత్తలు, మిత్రులు, పనివాళ్ళు, చిత్ర విచిత్ర మనస్తత్వాలతో మన ముందుకు వస్తారు. ప్రణయ రంగంలో నాయిక నవలలు చదివి, అలాగే నవల పద్ధతిలో పెళ్ళి చేసుకోవా లను కుంటుం ది. అక్కడ నాయకు డు మారు వేషంతో ఆమె మనసు కాజేసే ప్రయ త్నం చేస్తాడు. మరొక నాటకం లో అమ్మాయి తాను పనిమనిషినన్న నాటకమాడి నచ్చిన వాడిని మెప్పిస్తుంది. అంతటా ఒక అమ్మాయి కొరకు పోటీపడే మనుషులు ఎదురవుతారు. నిజం చెప్పాలంటే ఈ రకం హాస్యం తెలుగు పాఠకులకు, ప్రేక్షకులు, ఆనాడు, ఈనాడూ కొత్తే! పుస్తకంలో పాత్రలు రంగం మీదకు వచ్చి, వెళ్ళిపోయే సూచనలను, ఇంకా ఉంచడం అవసరమేమో! నాటకాలు, ఆసక్తిగలవారు ఓపికగా చదివితే, చేతయితే, నవ్వుకోవచ్చు! అవునుమరి. కాలక్రమంలో మనం నవ్వుకునే పద్ధతులు కూడా మారిపోయినాయి.


కామేశ్వర రావుగారి భాష, సంభాషణ, శైలి గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అక్కడక్కడ డయలాగులు మరీ ఇంగ్లీషుగా తోచవచ్చు. కానీ అనువాదంలో కూడా అంతటి తెలుగుదనాన్ని పలికించినందుకు రచయిత గుర్తుండి పోతాడు. ‘రహస్యం చెప్పావా?’ అన్న ప్రశ్నకు ‘అక్షరం తలకట్టు కూడా చెప్పలేదండీ’ అనిపించగలిగిన ‘ఈజ్!’ ఆశ్చర్య పరుస్తుంది. అలాంటి తెలుగు ఏమయింది? అన్న ప్రశ్న అందరికీ ఒక్క క్షణం ఎదురవుతుంది. ఆ తెలుగు కోసమయినా ఈ నాటకాలను చదవాలి. చేతనయితే ప్రదర్శించాలి.


పాత్రలకు పేరు పెట్టడంలో ఈ రచయిత పద్ధతి ఎవరికీ చేతగాలేదు. కుమార సేనం, జ్వాలారంగం, నభోమణి, మండోదరం, కరాళం, తంపటి లాంటి పేర్లు ఏ పుస్తకంలోనూ చూచి ఉండలేదు.


ఈ తరం పాఠకులకు భమిడిపాటి వారి పేరుతో కూడా పరిచయం లేకపోవచ్చు. కానీ వారి రచన ఒకటి చదివినా, మిగతావన్నీ చదవాలనిపిస్తుంది.!

-కె.బి. గోపాలం

Friday, January 13, 2012

కళ్ల ముందు అమెరికా అంతరంగం


కళ్ల ముందు అమెరికా అంతరంగం



అమెరికా ప్రజల చరిత్ర-
హొవార్డ్ జిన్ రచన
అనువాదం: కె.సత్యరంజన్, బి.భాస్కర్
ప్రజాశక్తి బుక్‌హౌస్, ఆజమాబాద్, హైదరాబాద్- 20,
వెల: రూ.150/-,
పేజీలు: 294.

ఏ దేశం చరిత్ర చదివినా, అంతా అభ్యుదయ పరంపరగా జరిగిందనే చెపుతుంటాయి. అమెరికా అందుకు వేరుగా ఉండవలసిన అవసరం లేదు. అంకుల్ శాం నేటికీ అందరి మీదా పెత్తనం చేయాలనుకుంటాడే తప్ప, మంచితనం చూపుదామన్న పద్ధతి లేదు. అమెరికా చరిత్ర పుస్తకాలు తెలుగులో ఎన్ని వచ్చాయో తెలియదు. కానీ ఆ దేశం అసలు రూపాన్ని అందరి ముందు ఉంచే పనిని ప్రజాశక్తి బుక్‌హౌస్ వారు ఈమధ్యన చేపట్టారు. ఆ క్రమంలో మరో పుస్తకం ఈ అనువాదం.
ఇది అమెరికా చరిత్ర కాదు. అమెరికా ప్రజల చరిత్ర. అందునా శ్రామిక వర్గం వారి చరిత్ర. రచయిత జిన్ రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న వ్యక్తి. తరువాత ప్రొఫెసర్ అయ్యాడు. మామూలుగా అందరూ చూడని, చరిత్రను చెపుతూ, నిరసనలలో పాల్గొంటూ ప్రభుత్వ వ్యతిరేకిగా గుర్తింపు పొందాడు. ఎన్నో రచనలు చేశాడు. ‘అమెరికా ప్రజల చరిత్ర’ అన్న ఈ పుస్తకం మూల రచనకు సంక్షిప్త రూపం మాత్రమే తరువాత వచ్చిన అభిప్రాయ మాలికల పుస్తకం నుంచి కూడా, ఈ అనువాదం చివరలో చేర్చారు.

మామూలు చరిత్ర పుస్తకాలలో ఒక రకమయిన ఏకపక్ష ధోరణి ఉంటుంది. కానీ జిన్ తన పుస్తకంలో కూడా ఏకపక్ష ధోరణి ఉందని నిస్సందేహంగా అంగీకరించాడు. నా రచన ఒక వేపునకు మొగ్గుచూపింది. ఇందులో నాకేమీ బాధ లేదు. అంటాడు రచయిత. మరీ ఏకపక్షంగా చెప్పిన చరిత్రలో అసలే కనిపించని అంశాలను గురించి చెప్పి ఒక రకమయిన సమతూకం కొరకు ఈ రచయిత శ్రమించినట్లు మనకూ అర్థమవుతుంది. ప్రభుత్వం విధానాలు బీదవారు, స్ర్తిలు తెల్లతోలు లేని వారి మీద చూపిన ప్రభావం గురించి ఈ పుస్తకంలో సవివరంగా తెలుసుకోవచ్చు. కార్మికుల పోరాటాలు, సమానత్వం కొరకు జరిగిన సంఘర్షణలు, ఇంత అన్యాయంగా జరిగినట్లు తెలిసిన తర్వాత అమెరికా దేశం పట్ల ఒక రకమయిన ఏవగింపు పెరిగినా ఆశ్చర్యం లేదు. అయినా వాస్తవం తెలియకుండా, ఒక దేశాన్ని ఆకాశానికెత్తి ‘ప్రామిస్‌డ్ ల్యాండ్’గా చూడడం తప్పుగదా! ఈ పుస్తకంలో ఇటీవలి చరిత్ర కూడా ఉండడం గమనించదగిన అంశం!

చరిత్ర పుస్తకాలు చదవడమే తలనొప్పి. అందునా మనకు పరిచయం లేని ఘటనలు మనుషులు, వాతావరణం గురించి చదవడం అందునా అసౌకర్యంగా ఉంటుంది. ఈ పుస్తకం చదవడంలో మరొక చిక్కు ఉంది. అసలు చరిత్రను చదవకుండా, ఈ మరో పార్శ్వం చదువుతూ ఉంటే, మరింత వివరం తెలిస్తే బాగుండునన్న భావం మిగులుతుంది.
ఆసక్తికరమయిన అంశం గనుక ఇంగ్లీషులో ఈ పుస్తకం లక్షల కాపీలు అమ్ముడయింది. ఏకబిగిన, ఒక నవల చదివినట్లు, చదివించే పుస్తకం కాదిది. అయినా ఆసక్తికరంగా సాగింది. తెలుగు అనువాదం మరింత సులభంగా సాగితే బాగుండును. ఇంగ్లీషులోని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లు తెలుగులోకి తెచ్చే ప్రయత్నం జరిగింది.
‘‘చరిత్ర పుస్తకాల గుట్టల బరువు కింద కుంగిపోతూ, దేశము దేశ భక్తులు చూపిన మార్గంలో గౌరవంగా వణికిపోతూ, లొంగిపోయేలా కుంగదీయబడే క్రమంలో మనం నిలదొక్కుకుని వెన్ను నిటారుగా నిలుపుకుని నిలబడాలంటే, అనుద్దేశ పూర్వకంగా ఇంతకాలం ఈషణ్మాత్రం గౌరవించని ప్రజా ఉద్యమాల ఆసరానే కావాలి!’’ ఈ వాక్యానికి జీన్ మూలం ఇంత గజిబిజిగానూ ఉంది. అందులో మరో నాలుగు మాటలున్నాయి.

ఆపుతూ ఆపుతూ సీరియస్‌గా చదవవలసిన పుస్తకం ఇది. ఇంగ్లీషులో నయినా తెలుగు అయినా! విషయం మీద ఆసక్తి ఉంటే చాలు, చదవ వచ్చు!

Monday, January 2, 2012

హద్దులు దాటని యాత్రా చరిత్ర


హద్దులు దాటని యాత్రా చరిత్ర

బియాండ్ ద బార్డర్ ఆన్ ఇండియన్ ఇన్ పాకిస్తాన్ (ఆంగ్లం)
రచన: యోగిందర్ సికంద్ పెంగ్విన్ బుక్స్,
వెల: రూ.350/-,
పేజీలు 297+

భారత-పాకిస్తాన్‌ల మధ్య క్రికెట్ పోటీ జరిగినా సరే, ప్రపంచ యుద్ధం జరుగుతున్నట్లు అందరూ ఊపిరి బిగబట్టుకుని చూస్తారు. పాకిస్తాన్ గెలిస్తే పండుగ చేసుకునే వారు భారతదేశంలో ఉన్నారు. కానీ, భారతదేశం మీద ప్రేమ వదులుకోలేక, తమ చరిత్ర, మతం, నమ్మకాలను వదులుకోలేక బతుకుతున్నవారు ‘సరిహద్దులకు ఆవల’ అంటే పాకిస్తాన్‌లో ఉన్నారని ఎంతమందికి తెలుసు.

యోగిందర్ సికంద్, పరిశోధకుడు, పాత్రికేయుడు పాకిస్తాన్ నుంచి పారివచ్చిన వారి సంతతి వ్యక్తి. అతనికి పాకిస్తాన్ అంతా తిరిగి చూడాలన్నది, చిన్న నాటి నుంచీ బలంగా ఉన్న కోరిక. పరిశోధన పేరున మరో రకంగా అక్కడి వారితో మైత్రి పెంచుకున్నాడు అయినా అక్కడికి వెళ్లడానికి అన్నీ అడ్డంకులే. వీసా ఇవ్వడానికి అధికారులు కనబరిచిన వైమనస్యం ఆశ్చర్యం కలిగిస్తుంది. ‘నువ్వు తిరిగి వచ్చిన తర్వాత మా దేశం గురించి నెగెటివ్‌గా రాయకూడదు!’ అన్నారంటే అక్కడే మనకు అనుమానం మొదలవుతుంది. సికంద్ కూడా అలాంటి భావాలతోనే బయలుదేరతాడు. మొదట్లో చదువుతుంటే పాఠకులకు విసుగు అనిపిస్తుంది. వాడెవడో ముక్కు గెలుక్కుంటే, దాని గురించి వర్ణించాల్సిన అవసరం ఏమిటి అనిపిస్తుంది.

ఈ యాత్రాచరిత్ర రచన నిజంగా సరిహద్దులను దాటి జరిగింది అనవసరం అనిపించేంత ఉత్సాహంతో, ఓపికతో సికంద్ పాకిస్తాన్ దేశమంతటా కలియదిరుగుతాడు. ఆ విశేషాలను కళ్లముందుంచినట్టు కాకపోయినా వివరంగా చెపుతాడు (ఇతను కథారచయిత కూడా అయి ఉంటే రచన మరోలాగుండేదని అనిపిస్తుంది) మతం తప్ప మరోటి తెలియని ఒక ముల్లా ఇంట్లో సికంద్‌కు ఆతిథ్యం దొరుకుతుంది ఒక రోజు. దేశంలోనికి వెళ్లడం లాగే, అక్కడికి వెళ్లడం కూడా అనుమానంతోనే. అది విడిదికి భయం! కానీ నోరు తెరిచిన తర్వాత ఆ పెద్దాయన, ‘ముస్లిములు కానివారంతా శత్రువులు అనడం తప్పు’ అంటాడు. భోజనానికి కూచుంటే, వాళ్లు ఇతని కోసం ప్రత్యేకంగా శాకాహారం వండిపెడతారు ఆ దేశంలో శాకాహారం గురించి పడిన పాట్ల తర్వాత ఈ ఆచరణ, కంటతడికి కారణమయేలాగుంది.
సికంద్ ఎందరో వ్యక్తులను కలుస్తాడు. అందులో హైందవ సంతతి వారు కొందరు, అవసరం కొద్దీ మతం మారిన వారు కొందరు భారతీయుడని తెలుసుకున్న మరుక్షణం, అక్కడ ముస్లింల పరిస్థితి ఏమి అని అడిగేవారు చాలామంది. ఇందులోని మొదటిరకం వారంతా ‘ఇంకెక్కడికయినా వెళ్లి మాట్లాడుకుందాం’ అన్నవారే! అంటే వారి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలో అందరికీ పాకిస్తాన్ గురించి వివరం తెలియకుండానే ఒక రకమయిన భావం ఉంది. పాత చరిత్ర రేఖామాత్రంగా తెలుసు. అందులో నిజంగా తెలియవలసిన అంశాలు మాత్రం తెలియవు. సికంద్ చూచిన స్థలాలు, కలిగినవ్యక్తులు చేసిన సంభాషణలు, కలిగిన అనుభవాలు కలిపి, చివరకొక బలమైన భావానికి దారి తీస్తాయి. ఈ రెండు దేశాలు, అందులోని తరాల ప్రజలు, వారి ఆలోచనల మధ్యగల సామాన్యులను, తేడాలను, మరోసారి నిర్వచించాలన్న గట్టి ఆలోచన మనలో కలుగుతుంది. సికంద్ యాత్ర చరిత్ర అందుకే, అందరూ, నిజంగా అందరూ (ఓపికగా) చదవదగిన పుస్తకం.

ఇది నవల కాదు ఇందులో కథ, డ్రామా లేవు కానీ, అంతకన్నా బలమయిన సమాచారం ఉంది. ఇస్లాం అంటే శరణాగతి సిఖ్ అంటే శిష్యుడు లాంటి మామూలు విషయాల గురించి చాలా మందికి ఇక్కడే మొదటిసారి తెలిస్తే ఆశ్చర్యం లేదు. సూఫీలు, భాయి మర్దానా లాంటి, మరికొందరు గురునానక్ శిష్యులు బాబా ముల్లేషా విశేషాలు, అక్కడి మ్యూజియంలో కనిపించే తీరు, ఇస్లాం పుచ్చుకున్న భిల్లులు, హిందువులు ముస్లిములూ కాని కైంఖానీలు, కాశ్మీరు యువకులకు శిక్షణ, ఆ పేరున వచ్చి ఇరికి పోయిన యువకులు మొయెంజోదరో, ఇలా ఎనె్నన్ని విశేషాలు.. ఎంతమంది వ్యక్తులు;

పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యం లేదు కనుక అందరూ రాజకీయం గురించి మాట్లాడతారు. మన దేశంలో ప్రజాస్వామ్యం ఉంది కనుక, అందరూ రాజకీయం మాట్లాడతారు! ఎంత వింత పరిస్థితి? అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయానికి శంకుస్థాపన లేదా పునాదిరాయి వేసింది ఒక పాకిస్తానీ సూఫీ మహానుభావుడంటే ఎంత ఆశ్చర్యం!
ఈ పుస్తకం చదువుతుంటే మొదట్లో విసుగనిపిస్తుంది. కానీ ముందుకు పోయిన కొద్దీ ఆసక్తి పెరుగుతుంది. పుస్తకమంతా సికంద్ మొదటి ప్రయాణం గురించిన వివరాలు. చివరల్లో ఒక పదిహేను పేజీలు రెండవ విజిట్ గురించి వివరాలు! ఈ రెంటిలో తేడా, ఆ దేశం గురించిన పూర్తి చిత్రాన్ని మన ముందు ఉంచుతుంది. సులభంగా చదవగల ఇంగ్ల్లీషులో రచన నడిచిన తీరు కూడా బాగుంది.

ఒక పాకిస్తానీ పెద్దమనిషి మాటలు పుస్తకం వెనుక అట్టమీద ఉన్నాయి. ‘‘నేను భారతదేశంలో పుట్టాను. మీ గ్రాండ్ పేరెంట్స్, ప్రస్తుతం పాకిస్తాన్ అంటున్న ప్రాంతంలో పుట్టిన వారు వాళ్లు భారతదేశంలో వరించారు నేను పాకిస్తాన్‌లో ఉన్నాను విచిత్రం కదూ!’ అని ఇలాంటి మాటలు పుస్తకంలో చాలా చోట్ల కనబడతాయి. ‘పాకిస్తాన్‌లో ఉండే చాలామంది హిందువులు పాకిస్తాన్‌ను తమ దేశంగా భావించరు. వీలయితే భారతదేశానికి వలస వెళ్లాలని మాలో చాలామందిమి రహస్యంగా కోరుకుంటాము. భారతదేశం మా మాతృభూమి పవిత్రదేశం, హిందువుల దేశం. అయితే ఈ విషయం బాహాటంగా చెప్పలేమనుకోండి’ అంటాడు ఒక అజయ్. క్రికెట్ పోటీలో పాకిస్తాన్ గెలిస్తే, మిఠాయిలు పంచుకునే వారు గుర్తుకు వచ్చారా? ‘బియాండ్ ద బార్డర్’ చదివిన తర్వాత, ఆ సరిహద్దులు దాటి వెళ్లి చూడాలనిపిస్తే ఆశ్చర్యం లేదు!

-గోపాలం కె.బి.