Showing posts with label వికాసం. Show all posts
Showing posts with label వికాసం. Show all posts

Saturday, December 8, 2012

కాస్త తెలివిగా..

ఒక రైతు ఇంట్లో ఒక కుక్క, ఒక కోడి ఉన్నాయి. కుక్క కాపలా కాస్తుంది. కోడి ఉదయానే్న కూస్తుంది. గుడ్లుకూడా పెడుతుంది. వాటి బతుకు మొత్తానికి బాగానే నడుస్తున్నది. కానీ, కొంత కాలానికి వాటికి బయట ప్రపంచం కూడా చూడాలి గదా, అనిపించింది. ఉన్నచోటిని వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నాయవి. ఒకానొకనాడు ఆనందంగా బయలుదేరి, ఉల్లాసంగా నడుస్తూ అవి చాలా దూరం నడిచాయి. దారిలో అనుకోని సంగతులేమీ ఎదురుకాలేదు. తిండికి కూడా కష్టం కాలేదు.

నడుస్తుండగా రాత్రయింది. ఇక ఎక్కడో విశ్రాంతి తీసుకోవాలి. కోడి చుట్టూ వెతికింది. ఒక పెద్ద చెట్టులో మంచి బొరియ ఉంది. కుక్కను బొరియలో పడుకొమ్మని, కోడి తాను మాత్రం చెట్టు ఎక్కి, కొమ్మల నడుమ సేద దీరింది. అలసి ఉన్నాయి గనుక హాయిగా నిద్రపట్టింది వాటికి.

తూర్పున సూర్యుడు కనిపించకముందే, వెలుగులు మాత్రం పరుచుకున్నాయి. అలవాటు కొద్దీ కోడి నిద్రలేచింది. తానింకా రైతు పొలంలోనే ఉన్నాననుకుని, నిద్రలేపడం బాధ్యత గదా అని, అలవాటు కొద్దీ గట్టిగా కూసింది. రెక్కలు టపటపలాడించింది కూడా. రైతు చుట్టుప్రక్కల లేనేలేడు. కానీ, పొదల్లో పడుకున్న నక్కకు మెలుకువ వచ్చింది. దానికి, వెంటనే ఈ పూటకు ఆహారం దొరికిందన్న ఆనందం కలిగింది. అది చెట్టు దగ్గరికి వచ్చేసింది.


‘అయ్యా! ఎప్పుడు వచ్చారు? ఎంత సంతోషం మీరు రావడం. కిందకు రండి, ఏదయినా తిందాం’ అన్నది.
కోడికి సంగతి అర్థమయింది. గాభరా పడితే లాభం లేదు. ‘అదేమిటి? పెద్దలు, మీరే పైకి రండి. అదుగో, ఇంటి తలుపుదగ్గర మా పనివాడున్నాడు. దారి చూపిస్తాడు, రండి!’ అన్నది కోడి తెలివిగా.


నక్కకు కోడి గురించి మాత్రమే ఆలోచన. అది చెట్టు దగ్గరకు వచ్చింది. విషయం గమనించిన కుక్క, దాని మెడను పట్టేసుకున్నది!


మారాలనుకుంటే సరిపోదు. అందుకు తెలివిని సాయంగా తెచ్చుకోవాలి.
-ఈసప్ కథలనుండి

Saturday, November 17, 2012

సలహాలు - సంప్రదింపులు

పని బాగా జరుగుతున్నంత కాలం పక్కవారి గురించి ఆలోచన కూడా రాదు. సమస్య ఎదురయితే మాత్రం, బాసునో, మరొకరినో సాయం అడగాలనిపిస్తుంది. సమస్యను మరొకరి ముందు పెట్టడం వరకే మన పని అనుకుంటే, అక్కడితో మన పెరుగుదల ఆగిపోతుంది. పైఅధికారులు మనకు సహాయం చేయడానికే ఉన్నారు. మరి మన దగ్గరకు ఎవరైనా సమస్యతో వస్తే ఏం చెప్తాము? తెలుసుననుకుని సులభంగా ఒక సమాధానం చెప్పి పంపిస్తామా? మన సమస్యలన్నింటికీ బాసులు సమాధానం చెప్పి పంపుతున్నారా? నిజంగా అట్లా జరుగుతున్నదంటే, ఎక్కడో లోపం ఉందని అర్థం! బాసుకు ఏదో అనుమానం వస్తుంది. అప్పుడు ఎవరిని అడగాలి? ఎవరు సమాధానం చెపుతారు?


సమస్యను తెచ్చి మన ముందు పడేస్తే, ఆ పడేసిన వారి బాధ్యత ముగిసినట్లు కాదు. మనమయినా సమస్యను మరొకరి ముందుకు నెట్టి, చేతులు దులుపుకోలేము. మనమయినా మరొకరయినా, సమస్యతో బాటు సలహాలను జోడించాలి. ‘మీరు చెప్పండి. మేము మీరు చెప్పినట్టు చేస్తాం!’ అంటారు చాలామంది. మరి చెప్పవలసిన వారికి సమస్య ఎదురయితే ఎవరు చెప్పాలి. ఏదో ఒకనాడు మనమూ ఆఫీసర్లవుతాము. బాసులవుతాము. ఇంట్లో పెద్దవాళ్లమవుతాము. బాధ్యత అంతా మన తలకెక్కినప్పుడు బరువు తెలుస్తుంది. ఈ సమస్య ఎందుకు వచ్చిందంటారు? నా స్థానంలో మీరుంటే ‘ఈ విషయంలో ఏం చేయాలనుకుంటారు? మీరే ఏదో ఒకటి చెప్పండి!’ అనే బాసు మీద కోపగించుకునేవారు చాలామంది ఉంటారు.

నిర్ణయాలు వేరు, సలహాలు వేరు. ఏం చేయాలో చెపితే, అది నిర్ణయమవుతుంది. ఇలా చేయవచ్చునేమో, అని చెపితే అది సలహా. సమస్యను ఎస్కలేట్ చేసిన వారు, అంటే పైవారి ముందు పెట్టిన వారు నిర్ణయం చేయలేకనే ఆపని చేస్తారు. నిర్ణయం సరయిందన్న నమ్మకం లేకపోతే ఆ పని చేస్తారు. అప్పుడు చెప్పే తీరులో ఈ సంగతి చక్కగా కనిపించాలి. ఇది సమస్య, ఇది నా నిర్ణయం అని చెప్పడం బాగుండదు. ఈ నిర్ణయం బాగుంటుందని అనుకుంటున్నాను, అంటే, అది సలహాగా మారుతుంది. సంప్రదింపుల ద్వారా, సమస్యకు గల సమాధానాలను వీలయినన్ని ముందు ఉంచుకుని, వాటిని చర్చించి, ఒకటి, రెండింటిని ఎంచుకోవచ్చు. అమలు చేసి చూడవచ్చు. సమస్యను ముందుంచిన వారే, నిర్ణయాన్ని సూచించడం అంతగా అలవాటు లేదు. ఎందుకొచ్చిన బెడద అనుకుంటారు చాలామంది. బాసులకు కూడా సరైన అవగాహన లేకుంటే ‘ఇక నేనెందుకు?’ అంటారు. ఇవి రెండూ తప్పు పద్ధతులే. సలహాలు, సంప్రదింపులు మాత్రమే సరయిన పద్ధతి. చిన్న చిన్న విషయాలలో కూడా ఈ పద్ధతిని పాటించవచ్చు. ఇంట్లో, మిత్రుల మధ్య కూడా ఈ పద్ధతిని పాటిస్తే, అందరికీ సంతృప్తిగా ఉంటుంది. ‘ఇడ్లీ తిందాం పదండి’ కన్నా ‘ఏం తిందాం?’ అన్నమాట బాగుంటుంది. అందరికీ తమ అభిప్రాయం చెప్పే వీలు కలుగుతుంది. చివరికి ఎవరిమాట నెగ్గినా, సలహా ఇచ్చినా సంతృప్తి మిగులుతుంది. ఈ సంతృప్తి, మరింత ఆలోచించడానికి, బాధ్యతతో ప్రవర్తించడానికీ, అవసరమయిన బలాన్ని ఇస్తుంది. దీనే్న ఎంపవర్‌మెంట్ అంటారు.

నిర్ణయాలు చేసే శక్తి కాకున్నా, నిర్ణయాల వరకు చేరుకునే కార్యక్రమంలో భాగం ఉంటే ఆ వ్యక్తులకు మానసిక బలం పెరుగుతుంది. అదే ఎంపవర్‌మెంట్. కూరలు కొనడం తనకు తెలియదు అనుకుంటే జీవితమంతా తెలియకుండానే పోతుంది. కూరలు కొనడంలోని మెళకువలు అర్థం అయే పరిస్థితిని కలిగిస్తే రేపు కూరలు కొనే బాధ్యతను పంచుకోవడానికి మనకే సాయం దొరుకుతుంది. ఎందుకు తెలియదు? ఏం తెలియదు? ఏ రకం కూరల గురించి తెలియదు? లాంటి ప్రశ్నలడిగితే, మరో వ్యక్తికి ఎంపవర్‌మెంట్ జరుగుతుంది. అలాగని ఎడ్డెం తెడ్డెం ప్రశ్నలడిగితే పని జరగదు. పైగా, ఆ మనుషులు మరింత కుంగిపోతారు. కొత్తగా ఆలోచించడానికి దారితీసే ప్రశ్నలుండాలి. విషయం గురించి ఎదుటివారి ఆలోచనలు మరింత పెరిగే రకంగా ప్రశ్నలు అడగాలి. ఇలాగే అడుగుతారు కూడా. మనకు ఆ సంగతి అర్థం కాకుంటే, ఆ ప్రశ్నలు ‘చొప్పదంటు ప్రశ్నలు’గా చికాకు ప్రశ్నలుగా కనిపించి, వినిపించి చికాకు కలుగుతుంది. అందుకే ఎవరైనా ప్రశ్నలు అడిగినా, మనం అడగవలసి వచ్చినా ఒక్క క్షణం ఆలోచించడం మంచిది. అప్పుడు విషయం మరింత సులువుగా అర్థమవుతుంది. రెండువేపుల నుంచి చక్కని సలహాలు వస్తాయి. సమస్యకు సమాధానం దొరుకుతుంది.

జాగ్రత్తగా గమనిస్తే, ఈ సందర్భంలోని ప్రశ్నలకు ఒక పద్ధతి ఉంటుంది. వాటికి సూటిగా ఒక జవాబు ఉండదు. ‘ఎందుకు?’ ఎట్లా?’ ‘ఏమయి ఉండవచ్చు?’ లాటి ప్రశ్నలకు జవాబులు కేవలం అభిప్రాయాలు. అవి రకరకాలుగా ఉంటాయి. ఉండాలి కూడా! సమస్య తెచ్చిన వారికి ఈ ప్రశ్నల కారణంగా, మరింత అవగాహన వీలవుతుంది. మరిన్ని జవాబులు మెదడులో మెరుస్తాయి. తమ మీద తమకు నమ్మకం పెరుగుతుంది. జవాబు నేనే యిచ్చానన్న ధీమా కలుగుతుంది. అసలిది సమస్యగా ఎందుకు కనిపించింది? అన్న అనుమానం కూడా రావచ్చు. కావలసింది కూడా అదే! ఈ ప్రపంచంలో ఏ సమస్యకూ, ఎవరివద్దా రెడీమేడ్ జవాబులు ఉండవు. ఉంటే, అసలివి సమస్యలు కావు! సరైన సమయంలో సరయిన ప్రశ్నలు అడిగితే, సమస్య మబ్బులాగా విడిపోతుంది. అందరికీ నచ్చే సమాధానాలు కనబడతాయి. అందరికీ నమ్మకం కలుగుతుంది. అది సలహా, సంప్రదింపులోని బలం!

బాసు మనలను అభిప్రాయం అడిగారంటే, మన తెలివిని, ఆలోచన శక్తిని వారు నమ్ముతున్నారని, గౌరవిస్తున్నారని అర్థం! అదే పద్ధతిని మనం కూడా మనవారిమీద, చివరకు పిల్లలమీద కూడా ప్రయోగించవచ్చు. అటువంటి ప్రశ్న ఎదురయిన మరుక్షణం మన బాధ్యత పెరుగుతుంది. కనుక మరింత జాగ్రత్తగా ఆలోచించే ప్రయత్నం మొదలవుతుంది. సమస్యకు సమాధానం మననుంచి వస్తే అది అప్పటికప్పుడు కనిపించే విలువ, లాభం. ఇక ముందు ఈ రకం సందర్భాలలో కూడా ముందే ఆలోచించి, సలహాలతో కూడా ముందుకు సాగే నమ్మకం కలుగుతుంది. అది ఎప్పటికైనా పనికివచ్చే మానసిక బలం. అది మరింత గొప్పలాభం!

అంతా నాకే తెలుసు, నీకేం అధికారం, అని మనం అనవచ్చు. మనమీదివారు మనల్ని అనవచ్చు! మనిషిని మానసికంగా కుంగదీయడానికి అంతకన్నా కావలసింది లేదు! ఎవరికీ ఎవరికన్నా ఎక్కువ తెలియదు. నాలుగు తలలు ఒక చోట చేరితే సలహాలు, సంప్రదింపులు సాగుతాయి. అది తెలివి!

Thursday, November 8, 2012

అదీ తెలివి....

ఒక పెద్దాయన పాపం, దేశాంతరం వెళ్లి అక్కడే కాలం చేశాడు. వీలునామా కింద తన ఊరి వారికి ఒక వర్తమానం పంపించాడు. ఊరివారు నా ఆస్తిలో తమకు కావలసింది తీసుకోవచ్చు. తమకు యిష్టమయినంత భాగం, అమాయకుడయిన నా కుమారుడు ఆరిఫ్‌కు ఇవ్వవలెను అన్నది ఆ వర్తమానంలో సమాచారం. ఆ సమయానికి ఆరిఫ్ యింకా చిన్నవాడు. అంతమందిలో నోరెత్తి మాట్లాడగలశక్తి కూడా లేని అమాయకుడు. ఇంకేముంది? పెద్దలంతా చేరి పెద్దాయన ఆస్తిని పంచుకున్నారు. ఎందుకూ పనికిరాని బంజరు ఏదో మిగిలితే అది ఆరిఫ్‌కు యిచ్చామన్నారు. ఆ బంజరు ఎవరికీ అవసరం లేదు మరి!

ఏళ్లు గడిచాయి. ఆరిఫ్ పెరిగి పెద్దవాడయ్యాడు. బలవంతుడయ్యాడు. తెలివిగలవాడూ అయ్యాడు. ఊరి పెద్దలను కలిసి, తన తండ్రి ఆస్తి తనకు తిరిగి ఇవ్వమని అడగసాగాడు. ఎవరికివారు ‘అదేం ఆలోచన’ కుదరదు పొమ్మన్నారు. ‘వీలునామా ప్రకారం నీకు యివ్వవలసింది యిచ్చేశా’మన్నారు. అమాయకుని ఆస్తిని అప్పగించామన్న ఆలోచన ఎవరికీ కలిగినట్లు లేదు. ఎవరికి కావలసింది వారిని తీసుకొమ్మన్నది మీ నాయనే!’ అని కూడా అన్నారు. అందరినీ పోగేసి సలహాలడుగుదాం అన్నాడు ఆరిఫ్. తమ తప్పు లేదనుకున్న పెద్దలు సంప్రదింపులకు ఒప్పుకున్నారు. సమావేశం మొదలయింది. ఎవరి అభిప్రాయం వారు చెపుతున్నారు. ఒకతను మాత్రం ఏదో తప్పదుగనుక వచ్చానన్నట్టు మొగం వేలవేసుకుని కూచుని ఉన్నాడు. అతని వంతు వచ్చింది. 'మీకు వీలునామా మాటలకు అర్థం తెలియలేదు. తమకు ఇష్టమయినంత భాగం కొడుక్కు యిమ్మన్నాడు పెద్దాయన.అది ఇవ్వడానికి యిష్టమయినంత కాదు. మీరు తీసుకోవడానికి యిష్టమయినంత! మీకు బాగనిపించింది అతనికి ఇస్తే, పిల్లవాడు బాగా బతుకుతాడని తండ్రి నమ్మకం’! అన్నాడు. అందరూ మంచివాళ్లే. అసలు సంగతి అర్థమయి నోళ్లు వెళ్లబెట్టారు. 

ఇష్టమయినంత అన్నమాటకు అర్థం తెలిసింది వారికి. ‘అతను దూరాభారంలో మరణించాడు. ఆస్తి అమాయకుడయిన కొడుకు చేతిలో పెడితే, అతనికి ఏమీ మిగుల్చుకునే శక్తి లేదని తెలుసు. అందుకే ఆస్తిని మీకు అప్పగించాడు. మీదేననుకుని మీరు దాన్ని యినే్నళ్లూ కాపాడారు. కొడుకు పెరిగి, పెద్దవాడయి తెలివి తెలుసుకుంటాడన్న నమ్మకం ఆ తండ్రికి ఉంది. అదే జరిగింది. గౌరవంగా ఆస్తిని అతనికి ఇవ్వడం మంచిది’, అని కూడా వివరించాడు వేలమొగం మనిషి! ఆరిఫ్‌కు ఆస్తి అందింది. పెద్దలు నిజం చూడగలిగారు.

-సయ్యద్ గౌస్ అలీషా (1881)

=============
అసలు మాట

‘జాగ్రత్తగా ఉంటూ నెమ్మదిగా మాట్లాడడమే సద్గుణం అన్నాడు మాస్టర్. ‘అదెట్లా’గన్నాడు శిష్యుడు. ‘ఏం చేయాలో తోచనప్పుడు జాగ్రత్తగా ఉంటూ నెమ్మదిగా మాట్లాడడమే మంచిది గదా!’అన్నాడు మాస్టర్.

-కన్ఫ్యూషియస్ ఆనలెక్ట్స్ నుంచి

Thursday, October 25, 2012

లుఖ్మాన్ కథ!

లుఖ్ మాన్ గొప్ప పండితుడు. సన్యాసికూడా. అయితే వికారంగా ఉంటాడు. స్నానం, గుడ్డలుతకడం లాంటి పనుల పట్ల ఆయనకు ఆసక్తి తక్కువ. కనుక మురికిగా కనబడతాడు. అతడిని బానిసగా పొరబడి బాగ్దాద్ నగరంలో కందకాలు తవ్వేపనిలో పెట్టారు. 

సంవత్సరం గడిచింది. ఎవరికీ అనుమానం రాలేదు. నిజం తెలిసిన తరువాత ఖలీఫా, అతని కాళ్లమీద పడి క్షమాపణ కోరాడు.

సన్యాసి చిరునవ్వుతో ‘నీ క్షమాపణ నాకెందుకు? ఏడాదిపాటు నీ కింద తొత్తుగా నలిగాను. ఒక గంటలో మరవడం వీలవుతుందా? అయినా నిన్ను క్షమిస్తాను. నీకు లాభం జరిగిందేమో కానీ, నాకు నష్టం మాత్రం లేదు కదా! నీ పని జరిగింది. నాకు తెలివి పెరిగింది. నాకూ ఒక పనివాడుండేవాడు. వాడిని నేను కష్టాలకు గురిచేసేవాడిని. ఇకమీద ఆ తప్పు చేయను. నేను పడ్డ కష్టాలు గుర్తుంచుకుంటాను’ అన్నాడు లుభ్‌మాన్!

Saturday, October 20, 2012

తాకితే తప్పు కాదు!

సెషన్ జరుగుతుండగా, ఒక అమ్మాయిని చూపించి, ఆమెకు ఆరోగ్యం బాగుండలేదని చెప్పారు. నేను జాలిగా దగ్గరకు వెళ్లి, తల మీద చెయ్యి పెట్టి ‘వెళ్లి రెస్ట్ తీసుకొ’మ్మన్నాను. ఆ అమ్మాయి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అక్కడ మిగతా ఒకరిద్దరికి మాత్రం నేను ఆ అమ్మాయిని తాకడం తప్పుగా తోచిందని తరువాత తోచింది.

మన దేశంలో, మరిన్ని దేశాలలోనూ తాకడానికి అందరికీ ఒకే అర్థం తోచదు. ఒకరిని ఒకరు తాకడంలో ఒక నమ్మకాన్ని ఇవ్వడం, ఒక మైత్రీ బంధాన్ని ప్రదర్శించడంలాంటి అర్థాలు ఉన్నాయి. మన మద్దతు, ప్రోత్సాహం తెలియజేయడానికి మన దేశంలో వెన్నుతట్టడం అని పేరుంది. అంటే వీపు మీద తట్టి ‘్ఫరవాలేదు! మేమున్నాం’ అనడమని అర్థం. కానీ కొందరు ఎదుటివారు మాట్లాడుతుంటే తాకుతారు. ఆ తాకడానికి, మాటలకు అడ్డు రావాలన్నది అర్థం. ఇక ఏదో ఆనందం ప్రదర్శించే సందర్భం వచ్చినా షేక్‌హాండ్‌లూ, ఒకరినొకరు దగ్గరకు తీసుకోవడం, చరుచుకోవడం లాంటివి చేస్తుంటారు. అందుకు పూర్తి వ్యతిరేకమయిన శోక సందర్భాలు, మొదలయిన సమయాల్లో కూడా తాకి సాంత్వన చెప్పడం ఉంది. ఒకరిని మరొకరు తగలడంలో ఎన్నో రకాలున్నాయి. ఎన్నో అర్థాలున్నాయి. ఆ పనేదో సరిగా చేస్తే, సరిగా అర్థం చేసుకుంటే, చాలా మంచి కమ్యూనికేషన్ జరుగుతుంది. మాటలలో చెప్పలేని భావాలను ఒక్క స్పర్శతో చెప్పగల సందర్భాలున్నాయి. అదే స్పర్శ సరిగా ఉండకపోతే మాత్రం రకరకాల అపార్థాలు వస్తాయి. ఈ సరిగా అన్న పద్ధతికి నిర్వచనం ఇద్దరిలోనూ చెడే అవకాశం ఉంది. మామూలుగా తాకినా తప్పుడు అర్థం తోచవచ్చు. పనిగట్టుకుని తగిలినా ఫరవాలేదనిపించవచ్చు. ఇక్కడ ఏం చేశారన్నది ముఖ్యం కాదు. ఎట్లా చేశారు, ఎట్లా అర్థం చేసుకున్నారు అన్నది అసలు విషయం!

సాంప్రదాయికంగానే మన దేశంలో ఒకరినొకరు ముట్టుకుని పలకరించే పద్ధతి లేదు. షేక్‌హ్యాండ్ పద్ధతిని మనం ప్రయత్నించి నేర్చుకున్నాము. స్నేహంగా ముందుకువచ్చిన చేతికి ‘నమస్కారం’ ఎదురయిన సంఘటనలు ఇటీవలి వరకు కనబడ్డాయి. కరచాలనం కన్నా ఎక్కువ ‘తాకడం’ అట. పడమటి ప్రపంచంలో కూడా అనాగరికమే! సపోర్ట్‌లాంటి మంచి భావంతో తాకినా యుకె, యుఎస్ దేశాలలో అదేదో తప్పుడు భావంతో తాకుతున్నారనుకోవడం ఈనాటికీ ఉంది? ఇది ఎవరికి వారికే సంబంధించిన విషయం. కొంతమంది ఊరికే పక్కవారిని తాకుతుంటారు. తమను ఎవరయినా తాకినా తప్పుగా భావించరు. మరికొందరికి తాకడం పెద్ద తప్పుగా కనబడుతుంది. అందుకే ఎదుటివారి సంగతి అర్థమయితేగాని, ఎవరూ చెయ్యి కదిలించరు. అదే మంచి పద్ధతి.


కరచాలనం చేసేవారు కొంతమంది ప్రేమగా చేతిని నొక్కి వదులుతారు. కొన్ని దేశాలవారు చేతులు కలిపి కొంతవరకు నిజంగా షేక్ చేస్తుంటారు. కొంతమంది మాత్రం షాక్ తగులుతున్నంత త్వరగా చేతిని వెనక్కు లాక్కుంటారు. దీంతో వారి వారి మనస్తత్వాలు మనకు అర్థమవుతాయి. ఎందుకొచ్చిన సందడి అన్నట్లు, చేతిని చెక్కలాగా అందించి, అంతే చల్లగా వెనక్కు తీసుకునేవారున్నారు. వారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకరు ఎదురవుతారు. మాటలు సాగుతాయి. భావాలు, మాట తీరు నచ్చుతాయి. అప్పుడు సూచనగా మనం వారి చేతిని ఒకసారి తాకడం అనుకోకుండానే జరుగుతుంది. తొలిపరిచయం జరిగినప్పుడు కూడా మామూలుగా కలిసిన చేతులు ఒక క్షణం ఎక్కువగానే కలిపి ఉంటాయి. కదులుతాయి. అది సహజం. ఒక గొప్ప మాట చెప్పిన భావం కలిగినవారు, మరొకరిని తాకడం, చరచడం లాంటివి మన దేశంలో మామూలుగా జరుగుతుంటాయి. దేశ సంప్రదాయాలను బట్టి ఈ తాకడం శరీరంలోని భాగాలు కొన్నింటికి పరిమితమవుతుంది. చేతిమీద, భుజం, వెన్నుమీద తట్టడం మనకు మామూలే. చిన్నపిల్లలను పలకరించడానికి మనం తలమీద తాకుతాము. కొన్ని దేశాల్లో మిత్రులు ప్రేమగా ఒకరి జుట్టును మరొకరు వేళ్లతో కదిలిస్తారు. థాయ్‌లాండ్ దేశంలో ఈ రెండు పనులను తప్పుగా భావిస్తారు! స్పర్శతో మనుషుల మధ్య కొత్త బంధాలు ఏర్పడతాయి. తలిదండ్రులు పిల్లలను, మిత్రులు ఒకరినొకరిని, డాక్టర్లు పేషెంట్లను తాకుతారు. అందులో ఎనె్నన్నో మంచి భావాల ప్రకటన జరుగుతుంది. వ్యాపారం, పాలిటిక్స్ లాంటి రంగాలలో ఉండేవారికి, తాకి, మైత్రిని మొదలుపెట్టడం, బలపరచడం బాగా తెలిసి ఉండాలి. ఎదుటి మనిషి చేతిని రెండు చేతులతోనూ పట్టుకుని మాట్లాడడం మనం చూసే ఉంటాము. షేక్ హ్యాండ్ చేస్తూనే మరో చేత్తో మనం ఎదుటి మనిషి చేతిని, పట్టుకున్నామంటే మన మధ్య బంధం మామూలు రకం కాదు సుమా!’ అని చెప్పడమే గదా!


ఈమారు కొత్తగా ఎవరితోనయినా పరిచయం జరిగినప్పుడు, కరచాలనం చేస్తూనే ఎడమ చేతితో కూడా వారిని చేతిమీద తాకుతూ వారి పేరును మరోసారి అని చూడండి. మీకు పేరు మరింత బాగా గుర్తుంటుంది. వారికి మీరెంతో స్నేహభావం గలవారన్న సందేశం అందుతుంది! ఒకే స్థాయి మనుషులమధ్య స్పర్శ సులభంగా జరుగుతుంది. మిత్రులను వీపుమీద చరిచినా అది ప్రేమ! కౌగిలించుకున్నా, చేతిని గట్టిగా నొక్కినా, మరింత ప్రేమ ప్రదర్శించినట్టు లెక్క! అదే పని కొత్తవారితో చేస్తే వెకిలిదనమవుతుంది. కొత్తవారితో కరచాలనం సెకండ్లపాటు మాత్రమే. నిడివి ఏమాత్రం ఎక్కువయినా అందులో మరేవో అర్థాలు తోచే ప్రమాదం ఉంది! మనకంటే పెద్దవారితో, పైస్థాయి వారితో గౌరవంగా క్షణాల షేక్ హ్యాండ్ వరకే పరిమితం కావాలి.


పెద్దవారు, ముఖ్యంగా పై ఆఫీసర్లు, అందరినీ భుజంమీద తట్టి తమ మన్నన తెలియచేస్తారు. డాక్టర్లు తమ పేషంటుకు భరోసా ఇవ్వడానికి తాకుతారు. టీచర్లు పిల్లలను మెచ్చుకుంటూ తాకుతారు. పెద్దలు ఆశీస్సులిస్తూ తలను తాకుతారు. ఈ రకంగా తాకడానికి ఎన్నో అర్థాలున్నాయి. ఎన్ని చేసినా, మన దేశంలో యింకా స్పర్శ విషయంలో ఆడా, మగ, తేడా ఎక్కువగా ఉంది. ఉంటుంది. ఈ తేడా మిగతా దేశాలలో లేదని కాదు. ఇందులో వయసు పాత్ర కూడా ఉంది. పెద్ద వయసుగలవారు ఎవరినయినా ప్రేమగా భుజంమీద తట్టవచ్చు!


స్పర్శ నిజానికి బలమయిన సందేశాలనిస్తుంది. విషయాన్ని, సమయాన్ని, సందర్భాన్ని బట్టి స్పర్శ అర్థాలు మారుతుంటాయి. హద్దులు మీరనంతవరకు తప్పులేదు.

Sunday, September 2, 2012

కవిత

ఈ కథ గ్రీసు దేశంలో వేలాది సంవత్సరాలకు ముందు ఎపుడో జరిగింది.

ఎథెన్స్ నగరానికి వెళ్ళే దారిలో ఇద్దరు కవులు కలుసుకున్నారు. కలుసుకున్నందుకు సంతోషంగా ఉందని చెప్పుకున్నారు. నమస్కారాలు, క్షేమ సమాచారాలు మామూలుగానే సాగాయి.


కవులు గనుక సంభాషణ సహజంగా, కవితల వేపునకు మరలింది. ఒక కవి మరొక కవిని అడిగాడు గదా! ‘అయ్యా! ఈ మధ్యన తాజాగా ఏమి వ్రాశారు? తప్పకుండా ఏదో రాసే ఉంటారుగా’ అని!


మొదటి కవి సంతోషంగా ముఖం పెట్టి ‘ఇప్పుడిప్పుడే ఒక మహత్తరమయిన కవిత రాయడం ముగిసింది.
అది నా కవితల్లోకెల్లాగొప్పది. అంతేగాదు, మన భాషలోనే గొప్ప కవిత అదే. అది నేను దేవుడి గురించి స్తుతిస్తూ రాశాను’ అన్నాడు.


కవి అంతే సంతోషంగా తన ముల్లెలోనుంచి కవిత రాసిన పార్చ్‌మెంట్ తీశాడు. ‘ఇదుగో! కవిత! నాతోనే ఉంది. చదివి వినిపిస్తాను. వింటారుగదా! రండి! ఆ సైప్రస్ చెట్టు కింద నీడలో చేరి కవిత అందాన్ని అనుభవిద్దాం!’ అన్నాడు.
కవితాగానం సాగింది. అది మరీ పొడుగాటి కవిత


‘గొప్ప కవితండీ! ఇది కలకాలం నిలిచి ఉంటుంది. తమ కీర్తిని నిలబెడుతుంది!’ అన్నాడు విన్న కవి.
ప్రశాంతంగా విని మొదటి కవి లాంఛనంగా ‘మరి తమరేమి వ్రాశారో? వినవచ్చునా అంటూ అడిగాడు.
‘నేను నిజంగా అంతగా ఏమీ వ్రాయలేదంటే నమ్మండి. తోటలో ఆడుతున్న కుర్రవాడి గురించి సరిగ్గా ఎనిమిదంటే ఎనిమిది పంక్తుల కవిత ఒకటి మాత్రం రాశాను’ అంటూ ఆ కవిత వినిపించాడు.


‘్ఫరవాలేదు. బాగానే ఉంది’ అన్నాడు మొదటి కవి.
తరువాత వారు ఎవరిదారిన వారు పోయారు.


తరాలు గడిచాయి. రెండు వేల సంవత్సరాలయింది. కవి రాసిన ఎనిమిది పంక్తుల కవిత ప్రపంచ భాషలన్నింటిలోకీ అనువదింపబడింది. ఆ కవిత తెలియని మనుషులు ఉండరంటారు.
మొదటి కవిగారి దీర్ఘకవిత కూడా నిలిచి ఉంది. కానీ అది గ్రంథాలయంలో, పండితుల సేకరణలలో మాత్రమే ఉంది. దాన్ని ఇష్టపడేవారు లేకపోలేదు. కానీ చదివినవారు మాత్రం తక్కువ.


-ఖలీల్ జిబ్రాన్ నుంచి

Thursday, August 30, 2012

ఇంకా కొంచెం

‘చదువు బాగానే సాగింది. ఉద్యోగం కూడా దొరికింది. లేదంటే త్వరలోనే దొరికేట్లు ఉంది. కానీ, ఏవో కొన్ని పనులు మాత్రం అనుకున్నట్లు జరగడంలేదు’. ఎక్కడుంది చిక్కు? మీరుకూడా ఈ ప్రశ్న మిమ్మల్ని మీరు అడుగుతున్నారా? ఈ ప్రశ్న అడగనివారు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరంటే ఆశ్చర్యం లేదు. చాలా విజయవంతంగా బతుకుతున్నారన్న వారిని కూడా అడిగితే, చాలాసార్లు, ఆ విజయం ఎట్లా వీలయిందీ చెప్పలేకపోతారు. వారికి కూడా, అందని సంగతులు కొన్ని ఉండనే ఉంటాయి. ఈ ప్రపంచంలో ఎవరికైనా సరే, కొన్ని పనులు చేతవుతాయి. కొన్ని కావు! తెలివిగల వారందరికీ చదువు అంటదు. బాగా చదువుకున్నవారందరూ గొప్పవారు కాలేరు.


మనకు ఏం కావాలి?

సంతోషంగా ఉన్నాను, అంటే, ఎంత సంతోషంగా ఉన్నారో చెప్పగలరా? అని అడిగిన పెద్దమనిషి, నిజంగా గొప్పవాడనిపించేది. కానీ, తరువాత ఆయనకు పట్టిన గతి మాత్రం మరెవరికీ రాకూడదు. అందరూ విజయాన్ని కోరేవారే. మీ దృష్టిలో విజయమంటే ఏమిటి? అన్న ప్రశ్నకు జవాబు కష్టం. డబ్బు సంపాదించడం చాలా సులభమూ, ఫాషనబుల్ అయిపోయింది. అదే విజయానికి గుర్తింపుగా మారింది. అందులో కూడా ఒక నిర్దుష్టత లేదు. డబ్బు కావాలి, నిజమే, కానీ, ఎప్పటిలోగా ఎంత డబ్బు సంపాదించదలుచుకున్నదీ తెలిస్తే, పథకం సులభమవుతుంది. ఎక్కడికి చేరాలో తెలిస్తే, నడక బాగా సాగుతుంది. చేరిన తరువాత గమ్యాన్ని మరింత ముందుకు నెట్టవచ్చు. నిద్ర సరిపోవడం లేదు. మరింతసేపు నిద్రపోతే బాగుండును, అనుకుంటాము. అది కుదరదేమో? ఇవాళ పది గంటలకు, పడకమీద ఉండాలి, అనుకుంటే, అనుకున్నది సాధించామా? లేదా తెలుస్తుంది.

ఒకే గమ్యం కాదు!

ఒకాయన కోసం యమదూతలు వచ్చారట. ‘పోండి అవతలకి! నేనొక వేపు పని తెమలక ఛస్తుంటే, మీ గోల ఏమిటి?’ అన్నాడట ఆయన. నిజమేనేమో అనుకుని, వచ్చినవారు వెళ్లిపోయారట! ఈ మధ్యన ఎవరికీ, ఏ పనికీ తీరిక ఉండడంలేదు. వంద పనులు తలకెత్తుకుని బతుకుతుంటాము. ఒక పనిలో మునిగి ఉంటాము. మరేదో పనిలో విజయం అందే అవకాశం వస్తుంది. పనిలో ఉండి, దాన్ని గుర్తించలేకపోతాము. నిద్రపోవాలని గుర్తురాక, నవల చదువుతూ కూచుంటాము అని చెపితే, పరిస్థితి మరింత బాగా అర్థమవుతుందేమో? వికాసం అంటే, బాగా సంపాదించడం, బాగా బతకడం అని భావం. ఈ బాగా అన్నమాటలో ఎన్ని అంశాలున్నాయి. ఒక కాగితం మీద రాసుకుంటే బాగుంటుంది. వాటన్నిటినీ, ఒక పద్ధతిలో చేస్తూ, ముందుకు సాగే రకంగా బతుకును తీర్చుకోవచ్చు. అనుకున్న పనులను, ఎక్కడ, ఎప్పుడు చేస్తాము అన్న పథకం, కళ్లముందుండాలి. అందులోనూ మళ్లీ లెక్కలుండాలి. బుధవారం యువ చదవాలని నిర్ణయించుకుంటే, అందుకు సమయాన్ని మెదడే కనుక్కుని ఏర్పాటు చేసే వీలు ఉంటుందని పరిశోధకులు చెపుతున్నారు.


అన్నీ అనుకున్నట్లు జరగవు!


కనుకనే నిర్ణయాలు, పథకాలు, ప్రణాళికలు కావాలంటున్నాము. ఏ పని, జరగవలసిన సమయానికి జరగలేదు? బుద్ధిగా లెక్క చూస్తే, విషయం తెలిసిపోతుంది. మరెవరో వచ్చి, ‘నీవు ఈ పూట అన్నం తినలేదని చెప్పే వీలు లేకపోవచ్చు. మనమే, ఆ సంగతిని (కూడా) పట్టించుకోవాలి. ఎందుకు తినలేకపోయిందీ తెలిస్తే, కార్యక్రమాలను, పద్ధతులను ఇంకా కొంచెం జాగ్రత్తగా ఏర్పాటు చేయవచ్చు. చదువు, పని, వ్యాయామం మిత్రులు, మనవారు, ముందు జరగవలసిన పనులు అన్నింటిలోనూ, ఏం జరిగిందీ లెక్క తెలిస్తే ఇక ముందు జరగవలసిన కార్యక్రమాలు, మారవలసిన అవసరం, అనవసరం అర్థమవుతాయి. కొన్ని సంగతులను నిత్యం లెక్క చూడాలి. కొన్నింటిని వారానికి ఒకసారి చూడాలి. ఈ తేడా కూడా తెలిసి ఉండాలి. పథకం వేయాలంటే, ముందు, గతం గురించి తెలిసి ఉండాలి గదా!


ఇంతకంటే ఏం చేయగలము?

అంతా సంతోషంగా సాగుతున్న వారి ముందు కూడా ఈ ప్రశ్న ఉండి తీరాలి. ఇంత చాలు అనుకుంటే, అది సులభంగానే దొరుకుతుంది. కానీ, అంతటితో బతుకు తెల్లవారిందన్న భావం మాత్రం కలగకూడదు. గమ్యాన్ని మరింత ముందుకు కదిలించడమని ఒక పద్ధతి ఉంది. ఆకాశాన్ని అందుకుందామని ఎగిరితే, అందకపోవచ్చు. చెట్టుమీది పండు మాత్రం సులభంగానే అందవచ్చు. పండు అందుకున్నందుకు సంతోషం సరయినదే, కానీ ఆ తరువాత మరో గమ్యం ఉండాలి. ఆ తరువాతి గమ్యాన్ని కూడా అందుకుంటామన్న నమ్మకం సులభంగా వీలవుతుంది. అందుకు కావలసినదేదో మనలో ఉందన్న నమ్మకం ఎంతో ముఖ్యం. ఆ ‘ఏదో’ నిలిచి ఉండి, పని ముగిసేదాకా సాయంగా రావడం, వచ్చేలా పని చేయడం, అంతకన్నా ముఖ్యం.


నాకు ఇంతే వచ్చు!

అనుకుంటే, ఆ తరువాతి సంగతి గురించి ఆలోచనే రాదు. వంద మీటర్ల పరుగును పది సెకండ్లకన్నా తక్కువలో ఎవరూ పూర్తి చేయలేరు అనుకున్నారు. అందరూ ఆ గమ్యంతోనే పరుగెత్తారు. ఎవరో ఒకతను, తక్కువ సమయంలో పరుగెత్తి చూపించాడు. మిగతా వారికి కూడా నమ్మకం కలిగి, అందరూ ‘అసాధ్యాన్ని సాధించారు’. ఉసేన్ బోల్ట్, తన రికార్డును తానే పడగొట్టగలిగాడు. నేను మారగలను, అనుకున్న తరువాత, మారవలసిన సంగతులు కళ్లముందు నాట్యమాడతాయి. ఆ ఆలోచన రానంతవరకు అంతా శూన్యంగానే కనబడుతుంది. బెస్ట్ తర్వాత కూడా ఏదో ఒకటి ఉండి తీరుతుంది!
అటునుంచి నరకడం అని ఒక పద్ధతి ఉంది. వంద, అనుకున్నాము. ఒకటి నుంచి మొదలుపెట్టాము. 90 తర్వాత, మనసు ‘చాల్లే!’ అంటుంది. కనుక, వందతో మొదలుపెట్టి, తగ్గింపు పద్ధతిలో లెక్కపెడుతుంటే, సున్నా వచ్చిన దాకా, ఆగకూడదని, ఆ మనసే చెపుతుంది. మరుసటి నాడు నూట ఇరవై నుంచి తగ్గిస్తూ వచ్చే వీలు కూడా ఉంటుంది.


మాటలతో కుదరదు!

కొన్ని మాటలు వినడానికి, చదవడానికి బాగుంటాయి. ‘నిజం!’ అనిపిస్తాయి. పక్కకు కదిలిన తరువాత, ఆ మాటలు కూడా, మనసు తెరమీద నుంచి మరలిపోతాయి. కనుకనే మననం అనే పద్ధతిని అలవాటు చేసుకోవాలి. నచ్చిన పద్ధతులను, అమలు చేసుకోవాలి. ఒక్క అంశంలో మంచి ఫలితాలు కనిపిస్తే, దాన్ని బట్టి ఆ పద్ధతిని మన స్వభావంగా మార్చుకోవాలి.


తెలిస్తే బాగుండేది, అనుకుంటే ఏదీ తెలియదు. తెలిసింది కొంతయితే, ఇంకా కొంచెం తెలుసుకునే ప్రయత్నంలో ఉందాము! కొంతయినా తెలుస్తుంది!

Tuesday, August 21, 2012

అంతే మరి!


ఒక రైతు ఉండేవాడు. అతగానికి రకరకాల జంతువులను, పశువులనూ పెంచడం ఇష్టం. ఒకప్పుడు అతను ఒక గుర్రాన్ని కొన్నాడు. ఆ గుర్రం అన్ని గుర్రాల వంటిది కాదు. చాలా అరుదయిన రకం. గుర్రాన్ని రైతు చాలా అపురూపంగా చూచేవాడు. కొన్నాళ్లకు గుర్రం జబ్బుపడింది. పరుగెత్తదు. తిండి తినదు. పాపం రైతు కుదేలు పడిపోయాడు. వైద్యుడిని పిలిపించాడు. వైద్యుడు రకరకాల పరీక్షలు చేసి, ‘మూడుదినాలు మందివ్వాలి. పరుగెత్తిందా సరేసరి! లేదంటే గుర్రాన్ని చంపడమే మంచిది. లేకుంటే, దాని జబ్బు మిగతా అన్నింటికీ అంటుకుంటుంది’ అన్నాడు.

ఈ మాటలు చెప్పడం, అక్కడ ఉండే కోడి విన్నది.

వైద్యుడు మందు యిచ్చి వెళ్లిపోయాడు. కోడి, తరువాత గుర్రం దగ్గరకు వెళ్లి ‘సంగతి తెలుసా? నీవుగాని పరుగెత్తలేదంటే, నిన్ను చంపుతారట! ఏదో తిను! కాస్త బలం తెచ్చుకో!’ అని చెప్పింది.

రెండవరోజు మందుయిచ్చారు గుర్రానికి! కోడి వచ్చి గుర్రానికి బుద్ధి చెప్పి సాగింది. ‘‘ఊరికే ఛస్తావు! తిన్నావుగా! కదులు మరి! కావాలంటే నేను నీతో వస్తా! ఏదీ పద! అదీ! అదీ!’ అంటూ హుషారు చేసింది.

మూడవనాడు మందు యిచ్చిన వైద్యుడు, ‘రేపటితో సంగతి తెలుస్తుంది’ అంటూ వెళ్లిపోయాడు. కోడి తిరిగి ‘సిగ్గులేదూ! ఛస్తే ఏమొస్తుంది?’ అని గుర్రాన్ని ఎంతో హుషారు చేసింది. మరునాడు తెల్లవారుతుండగానే కూసిన కోడి, వెంటనే గుర్రం దగ్గరకు వచ్చింది! ‘అన్నా! రా! నాతో రా! మాట విను! పరుగెత్తు! దాణా తిను! పరిగెత్తు!’ అంటు రకరకాలుగా హుషారు చేసి చివరకు గుర్రాన్ని పరుగెత్తించింది!

అలికిడి విన్న రైతు బయటకు వచ్చాడు. గుర్రం పరుగెత్తుతూ కనిపించింది. అతను సంబరపడిపోయాడు. అందరినీ కేకలేసి పిలిచాడు. ‘చూడండిరా! నా గుర్రం! ఎంత బాగా పరుగెత్తుతున్నదో చూడండి! నాబాధ తీరింది! ఏమిటో అనుకున్నాను. ఇవాళ పండగ చేయాల్సిందే! ఏదీ! ఆ కోడిని పట్టుకోండి! పలావు వండుకుందాం!’ అన్నాడు.

Tuesday, August 7, 2012

అదీ.. మనిషి స్వభావం

ఒక పోలీసాయన ఉంటాడు. చాలా మొరటుగా ప్రవర్తిస్తుంటాడు. ఇంట్లోకూడా అట్లాగే ఉంటాడేమో తెలియదు. తన పనిలో మాత్రం చాలా మొరటుగా ఉంటాడు. ఆయనకు ప్రపంచంలోని అందరూ నేరస్తులలాగా కనబడతారు. వాళ్లతో తాను మొరటుగానే ఉండాలని ఆయన అభిప్రాయం. నేరం చేసిన వారి మీద జాలి ఎందుకని భావం. తనకు అధికారం ఉంది గనుక, తన స్వంత అభిప్రాయాలు తనకున్నాయి గనుక, మొరటుగా ప్రవర్తిస్తున్నానని ఆయనకు తోచదు. తన అధికారాన్ని అనవసరంగా వాడుతున్నాననీ, ఆ అమాయకులు తనను ఎదిరించలేక పోతున్నారనీ ఆలోచన రాదు. తనకు తాను న్యాయంగా బాధ్యతాయుతంగా ఉన్నాననే అనుకుంటాడు. తానెంతో క్రూరుడినన్న సంగతి తోచనే తోచదు. మొరటుగా ఉండే ఆడ పోలీసులున్నారంటే, అనుమానం అవసరం లేదు.

అదీ మనిషి తీరు. మనకందరికీ, రకరకాలస్థాయిలో స్వంత స్వభావాలు, అభిప్రాయాలు, అనవసరంగా పుట్టిన యిష్టాయిష్టాలు ఉన్నాయి. వాటిలో కూరుకుపోయి మనం అందరినీ ఏమారుస్తుంటాము. మంచితనం, సత్యం మనలోనే ఉన్నాయనుకుంటాము. అందరూ ఇలాగే అనుకుంటారు గనుక మనం కూడా అడుగడుగునా మోసానికి, వంచనకు గురవుతాము. అయితే అన్నిసార్లూ పరిస్థితి ఒకేరకంగా ఉండదు. మనలో ఎవరికీ నిజంగా సరైన ఆలోచనలు ఉండవు. పర్‌ఫెక్షన్ ఉండదు. కానీ, మనం మరింత మంచి ఆలోచనలు చేయగలుగుతాము. ఈ సంగతిని మాత్రం మరువకూడదు.

అందరూ ఆలోచించనవసరం లేకుండా, ఆలోచించకుండా బతుకుతున్నారు. అందులో మనం కూడా ఉన్నాము. ఇది ఒకరకంగా అబద్ధం. మనకు తెలియకుండానే మనలోపల ఆలోచనలు సాగుతూ ఉంటాయి. ఉదయం లేవాలంటే ఆలోచన. మరేదో పని చేయాలన్నా, మానుకున్నా ఆలోచన ఉంటాయి. ఈ ఆలోచనలు మామూలుగా మనకు తెలియకుండానే (అచేతనలో) జరుగుతుంటాయి. వాటిని చేతనలోకి అంటే తెలిసి జరిగే స్థితికి మనమే తేగలగాలి. ఈ పని ఒకసారి జరిగితే చాలదు. ఒకనాడు జరిగితే చాలదు. అలవాటు చేసుకుంటే, మన ఆలోచనలన్నీ మనకు తెలిసి జరుగుతాయి. సమస్యలు సంతోషాలు ఎదురవుతాయి. అవన్నీ ఆలోచనల్లో ఉంటాయి. సమస్య అన్నా, సంతోషం అన్నా ఆలోచనలే! వాటన్నింటినీ మనం గుర్తించగలగాలి. ఇది చేతనయితే మన ఆలోచనల్లోనూ మన బతుకులోనూ మార్పులు వీలవుతాయి. గిరి గీసుకుని అందులోనే బతకడం, ఆలోచించడం మనిషికి మామూలే. కానీ, అందులోంచి బయటకు వచ్చి, ఎత్తులకు ఎగిసి, గొప్ప ఆలోచనలు చేయగలగడం మనిషికి చేతనవుతుంది. మనముందే ఎంతోమంది ఈ పని చేస్తుంటారు. మనం వాళ్లను గుర్తించలేకపోతాము. మనం మన మెదడు సాయంతో మన మెదడుకు పాఠాలు నేర్పగలుగుతాము. ఆలోచనలను వాడుకుని ఆలోచనలను మార్చగలుగుతాము. మనం ఇప్పుడున్న తీరునుంచి మరో తీరులోకి మారగలుగుతాము. అందుకు మనకు ఆలోచనలే ఆధారం. మారాలన్న పట్టుదల, కోరిక అవసరం. ఇదిమరెవరో చేయగల పని కాదు. ఇది మనకు మనం చేసుకోగల, చేసుకోవలసిన ఉపకారం.

ఆలోచన మనసులో ఉంటుంది. మనసు మెదడులో ఉంటుంది. వీటి బలం పెరగాలి.

ప్రతి విషయం గురించి ఏం జరుగుతున్నదీ మనం ఆలోచించగలగాలి. జరగవలసిన దాన్ని గురించి ఆలోచించగలగాలి. ఈ రెంటిలో ఏదో ఒకటే మనకుకావాలి. మరోదాన్ని మనం వదులుకోవాలి. రానివ్వకుండా ఎదుర్కోవాలి. మన ఆలోచన బలంగా సాగితే, విషయంలోని రెండువైపులూ మనకు చక్కగా కనబడతాయి. మనకు అనవసరమైనవి సులభంగా తెలుస్తాయి. మనకు తెలియకుండానే ఎన్నో పనులు మనమే చేస్తుంటాము. వాటి గురించి ఆలోచన ఉండదు. కనుక, ఆ పనుల ప్రభావానికి మనం తెలియకుండానే గురవుతుంటాము. ఆలోచిస్తే మాత్రం సంగతి అర్థమవుతుంది. కనుక ఆలోచన అలవాటుగా మార్చుకోవాలి.

*మనం మనలాగా ఆలోచించేవారి మధ్యన బతుకున్నాము. కనుక మన తీరును ఎవరూ తప్పు పట్టరు.
*ఎవరో ఒకరు మనలను తప్పుపట్టారని అనుకుందాము. మనం దుఃఖంలో మునిగిపోతాము. నిరాశకు గురవుతాము. ‘నువ్వు కూడా ఇట్లాగంటావని నేననుకోలేదు! నీవు నాకు కావలసిన మనిషివనుకున్నాను’ లాంటి అర్థంలేని మాటలు అంటాము. కొంతమంది అదేపనిగా తప్పులు పడుతుంటారు. వారిని వదిలేద్దాము. కానీ మనం మంచి కోరేవారు మనల్ని తప్పుపడితే గుర్త్తించగలుగుతున్నామా? మనకు అంత ఆలోచనా శక్తి ఉందా? ఎవరేమన్నా, ముందు ‘కాదు’ అంటుంది మనసు. కానీ, క్షణం ఆలోచించి ‘అవునా?’, ‘అవునేమో?’ అనుకోగలిగితే, అంటే ఆలోచించగలిగితే ఎంత బాగుంటుంది. అనవసరమైన మనస్తాపాలుండవు. వాదాలు ఉండవు. పైగా, ఆలోచించి మనం కాదనవలసినదేదో, మనలో ఉందని తెలుసుకుంటే, దాన్ని వదులుకునే వీలుంటుంది. ఒక్క క్షణం బాధ కలుగుతుంది! నిజమే! కానీ, మనం ఆలోచించడంలేదని అర్థమయి, విషయం తెలిస్తే మాత్రం, పశ్చాత్తాపం, మార్పు, ఆనందం వరుసగా వస్తాయి గదా!

* తప్పుడు మాటలంటాము. తప్పుడు పనేదో చేస్తాము. వెంటనే, మనలను మనం సమర్థిచుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ‘అది కాదు నేననదలచుకున్నది’ అని తర్వాత అంటే లాభం లేదు. మన మాటలను, మన చేతలను మాత్రమే ఎదుటివారు అర్థం చేసుకుంటారు. మన భావాలు వారికి అర్థం కావు. కనుక తప్పు తప్పుగానే తోస్తుంది. వారికి మనం తప్పుడు మనుషులుగా గుర్తుండిపోతుంది. ఆలోచన లేని పనులవల్ల ఇలాంటి పర్యవసానాలుంటాయి. పోలీసాయనకూడా మనిషే. అతనూ కొందరితో ప్రేమగా, స్నేహంతో ప్రవర్తిస్తాడు. కొన్నిచోట్ల మొరటుగా ఉండవలసి వస్తుంది. కానీ అది స్వభావంగా మారుతుంది. దొంగతనాలు చేసే మనిషి, తన యింట్లోకి కూడా కన్నం వేసి దూరితే బాగుండదు మరి!

* బ్రతుకు భారంగా, జగము చీకటిగా కనబడవచ్చు. ఆలోచన అటువైపే ఉంటే ఇక వెలుగు ఉంటుందని కూడా తోచదు. ఇక్కడే మనిషి, సత్యాసత్యాలను, చీకటి వెలుగులను చూడగలగాలి. ఇవన్నీ ఆలోచనల నుంచి వస్తాయి. నాకు కావలసింది నాకు తెలుసు అని ముందే నిర్ణయించుకుంటే అది చీకటి అని తెలియదు. కావలసింది ఒకటి ఉంటే, కాకూడనిది, అనవసరమయినది కూడా ఒకటి ఉండాలి. ఈ వైరుధ్యాలను గురించి ఆలోచన కలిగితే, వాటిలో మనకు కావలసింది అర్థమవుతుంది. మొరటు ప్రవర్తన కూడా అవసరమే. కానీ, దానికి సమయం, సందర్భం ఉంటాయి ఆ సందర్భం తెలియాలి. మన మీద మనం నిఘా వేసుకోవాలి. ఒక సందర్భంలో మన మీద మనం మొరటుగా ప్రవర్తించాలి. ఏం జరిగినా అది ఆలోచన మీద జరగాలి! ఆలోచించండి!

Monday, August 6, 2012

మన గురించి మనం


ప్రశ్నలడగడం తెలుసు
ప్రయాణం సంగతి తెలుసు
కలల గురించి తెలుసు
మనసు గురించీ తెలుసు
అయితే ఏంటట?
పోదురూ విసిగించక అంటారా? అవును మరి. ఇప్పుడవన్నీ ఎవరికి కావాలి అసలే పని తెమలక ఛస్తుంటే అంటారా అక్కడే మొదలవుతుంది అసలు కథ ఎన్ని తెలిసినా, ఎంత చేతనయినా మనసులో ఉత్సాహం లేనిదే ఏమీ చేయాలనిపించదు. మెదడులో తెలివి ఉన్నా మనసులో మరేదో ఉండాలంటారు అందుకే. రెపటి రూపం తెలియాలంటే మనసులో అందుకు సంబంధించి కోరిక ఉండాలి. తెలుసుకోవాలన్న ఉత్సాహం ఉండాలి.
నా బతుకింతే అనుకుంటే నిజంగా అంతే. మరేమీ లేదా అంటే మరేమయినా ఉండవచ్చు. ఉందా అంటే ఎవరూ వెతికి పెట్టరు. మనమే వెతుక్కోవాలి. ఈ జీవితం ఒక సినిమా. ఇందులో మీరే ముఖ్యపాత్ర. మరెవరి సినిమాలోనో వెనుక కనిపించే పాత్ర కాదది.
మనం లేకున్నా అంతా బాగానే సాగుతుందంటారు కని రెడ్డిగారు. సవినయంగా వారి మాటను నేను కాదంటాను. మనం లేకుంటే మనం లేని లోటు కనబడి తీరుతుంది. మనం లేకుంటే మనం చెప్పవలసిన మాటలు మరెవరూ చెప్పరు.
  
మనం చెయ్యవలసిన పని మనమే చేయాలి. మనం చెప్పవలసిన మాట మనమే చెప్పాలి.
చెప్పిన మాట ఎవరూ వినరని తెలిసినా సరే మన పని మనం చేస్తూ ముందుకు సాగాలి.
మనకిష్టం వచ్చింది చేద్దామా?
పదుగురికి నికి వచ్చేది చేద్దామా?
మన కొరకు బతుకుదామా?
మనవారి కొరకు బతుకుదామా?
మధ్యలో చేతనయితే కాస్త బాలెన్సు చూపుదామా?
మన సంతోషం పది మంది సంతోషంలో ఉందన్న సంగతి మనం మరిచి పోతుంటాము.
అట్లాగని తెల్లవార్లూ ప్రజాసేవలో బతకడం కుదరదు.
అక్కడే ఉంది అసలు కిటుకు.
సర.న దారి అని అందరూ సులభంగా చెపుతారు. ఎలాగుంటుంది సర.న దారి
మీకు తెలుసా?
తెలిస్తే అంతకన్నా కావలసింది లేదు!
తెలుసన్న సంగతి తెలిస్తే అటువంటి మనుషులకు సాగిలబడి మొక్కవచ్చు.

ఈ ప్రపంచంలో మంచి జరుగుతూ ఉంటుంది. కానీ అది కనబడే లాగ జరగదు. దానం చేశారనుకోండి. ఒకరు ఇవ్వడమూ, మరొకరు పుచ్చుకోవడమూ కనబడుతుంది. కానీ అందులోని మంచితనం కనబడదు. కాని వారికి దానం చేసినా చేసినప్పుడు అర్థం కాదు. మనం డబ్బులిచ్చిన మనిషి తరువాత కల్లుపాకలో కనబడితే ప్రాణం ఉసూరుమంటుంది. ఆకలిగా ఉన్న మనిషికి అన్నం పెడితే ఆ కళ్లల్లో సంతృప్తి కనబడితే, ఆ పూట అన్నం తినకున్నా నిద్ర సుఖంగా పడుతుంది. అక్కడా మంచితనం కనబడదు. అనుభవంలోకి వస్తుంది అంతే.
కళ్లకు వెలుగులు కనబడతాయి. రంగులు కనబడతాయి. మంచితనం కనబడదు. తప్పూ, ధర్మం తేడా కనబడదు. అలాగని అవి లేవందామా మనకు కనిపించనివన్నీ లేవంటే మనవాళ్లందరబ ప్రతి క్షణం మనకు కనబడుతూ ఉన్నారా పోయినవాళ్లు కనబడరు. భావం మాత్రం ఉంటుంది. వాళ్లు ఉన్నారనుకుంటే ఉన్నట్టేనా? ఉన్నవాళ్లు, ఉన్న సంగతులు లేవనుకుంటే లేకుండా పోతాయా?

ఏ వస్తువయినా మనం చూచినప్పుడు ఉన్నట్టే ఉండి పోతుందా? మన మనసులో మాత్రం ఆ పాత బొమ్మ ఒకటే నిలిచి ఉంటుంది. మంచితనమ సంగతి వేరు. అది ఏ సంగతిఎట్లా ఉంటే బాగుంటుంది అన్న భావానికి రూపం. అది మనసులో మాత్రమే ఉంటుంది.
దానగుణం మంచిది అని మనకు అనిపిస్తే, అందరూ దానం చేస్తూ ఉండాలను మనం అనుకుంటామని అర్థం. కళ్లకు అది కనిపించదు. జరిగినా ప్రతి సందర్భాన్నీ మనం చూడలేము.

తెలిసి జరిగిన మంచితనమం మన దృష్టికి వస్తుంది. తెలి.నిది తెలియకుండానే ఉండిపోవచ్చు. తెలి.కుండా జరిగే చెడ్డతనమయినా అంతే. అనుకోని ఘాతుకం మన కళ్ల ముందు డరిగితే అది తప్పు అని మనకు వెంటనే తెలుస్తుంది. అందులోని తప్పిదాన్ని మనం చూడలేమన్న సంగతి ఆ క్షణాన గుర్తుకు కూడా రాదు. బల్ల గుద్ది అది తప్పు అని వాదించడానికి కూడా మనం సిద్ధమవుతాము. శరీరానికి అంటే కళ్లకు, చెవులకూ అందని సంగతి గురించి మనం నిరణ.లు ఎందుకని అంత సులభంగా చేయ గలుగుతాము.

అందులోని మంచి చెడుల గురించి మనం ఎందుకు, ఎట్లా నిర్ణయానికి రాగలుగుతాము.

అంటే మంచి చెడుల తేడా మనకు తెలియకుండానే మనకు తెలుసన్న మాట. దానం మంచిది. దొంగతనం చెడ్డది. ఇవి సులభమయిన సంగతులు. ఇంతకన్నా గట్టి. సంగతుల గురించి కూడా మనకు గట్టి అభిప్రాయాలు ఉంటాయి. ఏది మంచి ఏది చెడు అంటే వెంటనే ఉపన్యాసానికి లంకించుకుంటాము. ఎట్లా అవి మంచి తెడులయిన. అని ఎవరన్నా ఎదురు అడిగితే మాత్రం మన నుంచి సమాధానం అంత నమ్మకంగా రాదు.

నమ్మకంగా మీరు మంచి వేపు ఉన్నారా?
ఎదుటివారి గురించి వ్యాఖ్యానించే చోటికి మీరు చేరుకున్నారా?
మంచి చెడుల తేడా తెలుసా?
గట్టిగా మంచి వేపున నిలిచి పోరాడగలరా?
ఆలోచించండి!!

Friday, August 3, 2012

మన తీరు ఎలాగుంది?


నిషన్న తరువాత ఒక స్వభావం ఉండనే ఉంటుంది. ఎవరి స్వభావం వారికి బాగానే ఉందనిపిస్తుంది. మన తీరు ఎదుటివారికి నచ్చకపోవచ్చునన్న ఆలోచన మామూలుగా రాదు. మనం బాగానే పనిచేస్తుంటాము. మన పై అధికారులు కూడా మనుషులే. వారికీ స్వంత స్వభావాలు ఉంటాయి. అందరి స్వభావాలు ఒకేలాగ ఉండవన్నది జగమెరిగిన సత్యం. కనుకనే, మనం బాగా పనిచేస్తున్నా సరే, ఒక్కోసారి ఎదుటివారికి కోపం వస్తుంది. మనం వారిలాగా ఆలోచించలేము గనుక వారికి కోపం ఎందుకు వచ్చిందన్న ప్రశ్నకు సమాధానం దొరకదు. ఇలా కొనసాగితే, కొంత కాలానికి బాసుకు మనమీద ఒక ‘అభిప్రాయం’ ఏర్పడే ప్రమాదం వుంది. అది కనుక జరిగిందంటే, మనం ‘ఎక్కడ వేసిన గొంగడి’ అన్న మాటకు ఉదాహరణ అవుతాము! తమకు తెలియకుండానే, బాసులకు కోపం తెప్పించే వారి గురించి కూడా పరిశోధన జరిగిందంటే నమ్మగలరా? ఆ పరిశోధనలో అయిదు రకాల మనుషులను గుర్తించారు. ఆ అయిదుగురిలో మనమూ ఉన్నామేమో తెలుసుకుంటే బాగుంటుంది కదూ? మనం చేస్తున్నది తప్పు కాకపోవచ్చు. కానీ, ఎదుటివారికి నచ్చడం లేదన్న సంగతి అర్థమయితే, కొంత వరకు సర్దుకోవచ్చునేమో! ఈ అయిదు రకాల మనుషుల్లో మనమూ ఉన్నామేమో చూద్దాం మరి!

అన్నింటికీ అవుననే వారు:
ఎవరేం పని అప్పగించినా ‘ఓ ఎస్!’ అనేవారు ఈ రకంలోకి వస్తారు. తెలియకుండానే, అలవిమాలిన బరువును వీరు తలకెత్తుకుంటారు. ఇలాంటివారికి మాకు అన్ని పనులు చేతనవునన్న ధీమా ఉంటుంది. పనులు చేతనయి ఉండవచ్చు కూడా. కానీ అన్ని పనులూ తామే చేయడానికి తగిన సమయం, వెసులుబాటు కూడా ఉండాలి కదా? ఈ సంగతిని ఒక్క క్షణం మరిచిపోయి, ఎక్కువ పనిని ఎత్తుకుంటే, బాగా చేతనయిన పనులు కూడా చేయలేని స్థితి వస్తుంది. బాగా చేయడం పక్కన పెట్టి, అసలు ఒక మనిషి చేయగలిగే పనులకు ఒక పరిమితి ఉంది. ఎక్కువ పనులను తలకు ఎత్తుకుంటే, కొన్ని మిగిలిపోతాయి. చేసినవి అరకొరగా వస్తాయి. అసలు కొన్నింటిని మరిచిపోయినా ఆశ్చర్యం లేదు. ఇక్కడే ఆసర్టివ్‌నెస్ అనే లక్షణం కూడా కావాలి. బాసు చెప్పినందుకూ, మనకు చేతనయినందుకూ కాక, వీలు కూడా గమనించి పనికి ఒప్పుకోవాలి. కుదరకపోతే, ఆ సంగతి వినయంగా చెప్పిచూడాలి.

గోడమీది పిల్లి: చేయాలా, మానాలా? తేల్చుకోలేని పరిస్థితిలో ఎంతకాలమయినా ఉండిపోతే, మనకూ, ఎదుటివారికి కూడా తికమక. పని చేస్తామన్న నమ్మకం ఎదుటివారికి ఇచ్చేశాము. చేతనయ్యేది, బాగా చేసేది తరువాత! అసలు చేయాలా, వద్దా అన్న అనుమానంలో, ఇంకా ఇంకా సమాచారం సేకరిస్తూ కాలం గడుపుతారు కొందరు. ఇదొక్కటీ తేలితే చేయవచ్చునేమో అన్న భావం ఒకటి మనసులో ఒక మూలనుంచి తొంగిచూస్తూ ఉంటుంది. సరయిన నిర్ణయం ఒక నాటికి వీలుకాదు. చేశావా? అని ఎవరైనా అడిగితే, ‘ఇదుగో! మొదలు పెడుతున్నాను. అసలు మొదలయిందంటే ఎంతసేపు? చిటికెలో చేస్తాను’ అని జవాబు. కానీ ఆ స్టార్టింగ్ ట్రబుల్‌కు అంతం ఎక్కడ. గోడమీద పిల్లి అటో యిటో దూకేదెప్పుడు? ఈ సంగతి తేలేలోగా కొంప మునిగే పరిస్థితీ, పైవారికి కోపం రావడం ఖాయం. మరి ఈ సందిగ్ధం అవసరం లేకుండా, ముందే నిర్ణయించి, చటుక్కున మొదలుపెట్టి, ఇచ్చిన పనిని, చేతనయినంత బాగా చేసి పడేస్తే పోతుంది గదా?

ఊగిసలాట: ఒకరు అన్నీ చేస్తామంటారు, చేస్తారు. లేక చేయలేకపోతారు. మరొకరు అసలు ఏది ముందు? అసలు చేయాలా? అన్న సందిగ్ధంలో ఇరుక్కుని సమయం జారిపోతుంటే చూస్తూ ఉంటారు. ఇక మూడవ రకం వారు, మా పద్ధతి వేరు అంటారు. నేను పట్టుకున్నానంటే, పని ముగిసినట్లే అంటూ, మరీ నమ్మకంతో, ఒకటికన్నా ఎక్కువ పనులను ఒకేసమయంలో చేయాలనుకుంటారు. ఒకపొయ్యి మీద కూర ఉంటుంది. మరో పొయ్యిమీద పాలుంటాయి. ఒకదాన్ని పట్టించుకునే లోపల మరొకటి పాడవుతుంది. ఈలోపల మూడవపని తగిలితే, ఈ రెంటినీ వదిలేసి అటు వెళ్లిపోతారు. మొదటి రకంలాగా, అన్ని పనులూ తలకెత్తుకోరు గానీ, ఎత్తుకున్న పనులమీద సరైన శ్రద్ధ, ధ్యాస లేనందుకు వీళ్లు బాధపడతారు. పెడతారు!

ఇదుగో- ఇది అయింతరువాత: పని చేయక తప్పదు. కానీ, ఇప్పుడే చేయకపోతే కొంప మునగదు. చేతిలో పని పూర్తి కానిదే, మరో పని మొదలు పెట్టడం ఎందుకు, అనుకుంటే, నిజానికి అది మంచి పద్ధతి. కానీ, ఈ వాయిదా వారలకు చేతిలో పని ఒక మానాన తెమలదు. ఎందుకంటే ఆ తర్వాతి పని చేయడం, ఇష్టం లేదు గనుక. పని నచ్చకున్నా, కష్టమయినదయినా, దాన్ని పక్కన పెట్టడం, దాటవేయడం కొందరికి అలవాటు. దీంతో అందరికీ చిక్కే. ‘ఇది చాలా ముఖ్యమయిన విషయం!’ అని దాన్ని సొరుగులో దాచే అలవాటు చాలామందికి ఉంటుంది. ముఖ్యమయిన విషయాన్ని వీలయినంత త్వరగా తేల్చాలి. దాచితే అది మురుగుతుంది! ఆలస్యమయిన కొద్దీ, ముఖ్యం పోయి, అది సమస్యగా మారుతుంది. ఆ తరువాత ఒత్తిడిలో సరయిన నిర్ణయాలు కుదరవు. ఏది ముఖ్యం, ఏది ముందు తేల్చుకుని పని చేయగలిగితే సమస్య ఉండదు.

గజిబిజి: బాగా పనిచేసేవారి ముందు, పనికి సంబంధించిన కాగితాలు గానీ, మరో రకం వస్తువులు గానీ, చిందర వందరగా, కుప్పలుగా పడి ఉంటాయి. అందులోంచి ఏం కావాలన్నా వాళ్లకు సులభంగా దొరికినంత వరకు సమస్య లేదు.

అన్నీ జరుగుతున్నట్లే ఉంటాయి. ఏ ఒక్క సంగతి గురించి అడిగినా ఇక వెతుకులాట మొదలవుతుంది కొందరికి. ఇప్పటివరకు ముచ్చటించుకున్న నాలుగు రకాలలో మొదటి యిద్దరూ, ఈ అయిదవరకంలోకి జారుకునే ప్రమాదం ఉంది. అప్పుడిక ఏ పనీ ముందుకు సాగదు. తయారయిన గజిబిజి, మిగతా వారిని కూడా చికాకు పెడుతుంది.

ఇలాంటివారు, ఒకటి, అరా పని బాగా చేసినా, చేసినట్లు భావించినా ఎవరికీ సంతృప్తి ఉండదు. అందుకే పనుల వీలును గుర్తించడం, సమయం, వరుస నిర్ణయించడం, అవసరాన్ని గుర్తించి ఒక పద్ధతిగా పని చేయడం అలవాటు చేసుకోవాలి.
ఇదేదో వినడానికి బాగుంది, చేయడానికి ఏమీ మిగలని ఉపన్యాసం లాంటి వ్యవహారం కాదు. అందరమూ, ఇంట్లో, పనిలో అనుసరించడానికి వీలయ్యే వ్యవహారమే మరి!
....................................................
క్రమశిక్షణ
* అన్నీ సరిగ్గా ఉన్నాయా అని అఢపాదడపా చూడడం తప్పేమీ కాదు. అసలు మీకు అట్లా చూడాలని అనిపించడమే మంచి లక్షణం. అదొక్కటే పనయితేబాగుండదు. కానీ, ఒక పద్ధతిలో జరుగుతుంటే, అందరూ మీ మీద ఆధారపడే రోజు వస్తుంది. అనుమానం, అవసరం వచ్చిన వారంతా మిమ్మల్నే అడుగుతారు ‘ఏమిటి పరిస్థితి?’ అని!
* తప్పు చేసినట్లు అర్థమయితే, నిజంగానే బాధకలుగుతుంది. కొంతకాలం వరకు అదే మెదడులో తిరుగుతూ ఉంటుంది. నిక్కచ్చిగా, లెక్కగా ఉండటం అలవాటయితే చాలామంచిదే. కానీ, తప్పు చేసిన భావంలోనుంచి బయటపడి, సర్దుకుని ముందుకు నడవడం కూడా నేర్చుకోవాలి.
పనుల్లో ఒక చక్కని వరుస క్రమాన్ని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. వాటిని తు.చ తప్పక పాటించడం అలవాటవుతుంది. మనం, ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తామన్నది మనకే కాదు, చుట్టూవున్న వారందరికీ తెలిసిపోతుంది. అప్పుడు మన పనీ, వారి పని కూడా సులభమవుతుంది!
...........................................
అసలు మాట

గతంలో మనుషుల మధ్య వెట్టిచాకిరీ చేసే బానిసలుండేవారు. రానున్న కాలంలో మరి మర మనుషులు ఉంటాయి. తేడా లేదు!
-ఎరిక్ ఫ్రామ్
మనం మాత్రం బానిసలు కావద్దు. మర మనుషులమూ కావద్దు. మన బతుకు మన అవసరాల ప్రకారం సాగితే సుఖం!

మంచీ - చెడూ!

ముల్లా నస్రుద్దీన్‌కు కొంతకాలం బోలెడంత మంది శిష్యులుండేవారు. అస్తమానం ఏదో ఒకటి అడుగుతూనే ఉండేవారు. వాళ్లకు జవాబులు చెప్పడం ముల్లాకు అలవాటయింది.
‘అందరూ మిమ్మల్ని మంచివాళ్లంటున్నారు. అలాగని మీరు మంచి వాళ్లేనా?’ అడిగాడొక శిష్యుడు.
‘అలాగేమీ కానవసరం లేదు!’ అన్నాడు ముల్లా.
‘అందరూ మిమ్మల్ని చెడ్డవాడంటే, మరి మీరు చెడ్డవారి కిందకు లెక్కవుతారా?’ అడిగాడు అదే శిష్యుడు
‘అలాగేమీ కానవసరం లేదు!’ అన్నాడు ముల్లా.
శిష్యునికి యింతకూ మంచి చెడుల తీరు తెలియలేదు. గురువుగారిని వివరించమని వేడుకున్నాడు.
‘మంచివాళ్లందరూ నన్ను మంచి వాడంటే, నేను మంచివాడిని. చెడ్డవాళ్ళందరూ నన్ను చెడ్డవాడు అన్నారనుకో! అప్పుడు కూడా నేను మంచి వాడినే అవుతాను’ అన్నాడు ముల్లా.
శిష్యుడు తికమకగా గురువు వేపు చూచాడు. నస్రుద్దీన్‌కు కూడా కొంచెం తికమకగానే అనిపించింది. అతనొక నిమిషం ఆలోచించాడు. ఆలోచన రాక గడ్డాన్ని గోక్కున్నాడు కూడా.
‘అసలు సమస్య మరొకటి ఉందోయ్! ఇంతకూ ఈ అనే వాళ్లు ఉన్నారు గదా! వాళ్ళలో ఎవరు మంచివాళ్లు, ఎవరు చెడ్డవాళ్లు తేల్చి చెప్పడం మాత్రం పెద్ద చిక్కు!’ అన్నాడు ముల్లా.

-ముల్లా నస్రుద్దీన్ కథలు నుంచి

Sunday, July 8, 2012

పెద్దవారయినా పిల్లలే!


బ్రతుకును దుర్భరంగా మార్చుకోవచ్చు. దాన్ని ఎంతో ఫలవంతంగానూ మార్చుకోవచ్చు. రెంటికీ పడవలసిన కష్టం మాత్రం సమానమేనంటాడు కార్లోస్ డాస్టెనెడా. అతనొక రచయిత, తత్వవేత్త. ప్రపంచం అనవసరమంటూ ఏకాంతంలో బతికిన మనిషి. ఈ మాటలను మాత్రం ప్రపంచంలో ఉన్నప్పుడే అన్నాడు. ఈ ప్రపంచంలో కొంతమంది కావలసిన తెలివి, పనితనం ఉండి కూడా బతుకు పోరాటంలో ఓడిపోతుంటారు. పెద్దవారయి కూడా పిల్లలలాగా ప్రవర్తిస్తారు. పిల్లవాడు ఏడ్చి పనులు సాధించుకుంటాడు. పెద్దవారు ఏడిస్తే, ఆ ఏడుపు ఒకటే మిగులుతుంది.

భావాలను, ఆవేశకావేశాలను మనం నియంత్రణలో పెట్టడం ఒక పద్ధతి. వాటి ప్రభావానికి గురికావడం మరొక పద్ధతి. మనదారిని మనం నిర్ణయించడం, ప్రవాహంలో పడి కొట్టుకుపోడం ఇలాంటివే. సంతృప్తి, సంతోషాల దారిలో ముందుకు సాగవచ్చు. పిల్లతనంలో ఉండిపోయి పశ్చాత్తాపాలు, మనస్తాపాలలో మునగవచ్చు. దీనికి తెలివి, పనితనాలతో సంబంధం లేదు! ఇందుకు కావలసిన తెలివి మరో రకం! పిల్లవానిగా ఉన్నప్పుడు పిల్లవానివలె మాట్లాడాను, ఆలోచించాను. పెద్దవాడినయిన తరువాత ఆ తీరు మార్చుకున్నాను’ అని బైబిల్‌లో ఎక్కడో ఒక మాట వస్తుంది.

మనలో ఇంకా పిల్లతనం మిగిలి ఉందనడానికి ఎన్నో గుర్తులున్నాయి.

*ప్రతి మాటా, విషయం మన గురించేననుకోవడం, మరీ ఎక్కువగా స్పందించడం. విమర్శను భరించలేకపోవడం. ఇవన్నీ పిల్లతనానికి మొదటి గుర్తులు. ‘అది కాదు!’ అనకుండా, విమర్శను గురించి ఆలోచించాలి.

*చేసిన పనికి వెంటనే ప్రతిఫలం ఆశించటం. అందినదానికి పొంగిపోవడం, అనుకూలం కాని పనులను తప్పించుకోవడం తెలివికి సంబంధించినవి కావు. ఇవి స్వభావానికి సంబంధించినవి. ఈ రెండు లక్షణాలుంటే, ఏ పనయినా ముగిసేదాకా ఓపిక ఉండదు.
శమన బతుకు బాధ్యత మనదన్న సంగతి మరిచి, అందరిమీద ప్రపంచంమీద నింద వేయడం, ప్రపంచం తన కొరకు ఏమీ చేయలేదన్న బాధను వ్యక్తం చేయడం బలహీనతకు గుర్తు.

*బలహీనత మనసును ఆవరించిన వారికి తమలో లోపాలు తెలియవు. ఎదుటివారి లోపాలను ఎత్తిచూపడం సులభంగా చేతనవుతుంది. ఎదుటివారు బాధపడతారన్న చింత అసలే ఉండదు.

*మనకు అన్యాయం జరిగింది అనుకోవడంలో అంతగా తప్పులేదేమో? సమస్యను అర్థం చేసుకోవడం, వీలయితే లేదా తప్పదనుకుంటే వదిలేయడం, ప్రయత్నించి సమస్యకు సమాధానం వెతకడం ఒక దారి. ఈ దారిని మరిచి కొందరు కక్ష పెంచుకుని ప్రతీకారానికి దిగుతారు. చిన్నబాబు కిందపడతాడు. అది తన తప్పేనని అర్థం కాదు. నేలను ఒక దెబ్బ వేస్తే, వాడికి సంతోషం! ఇక అంతేనా బతుకంతా?

*ఇంకా కావాలి, అనేది పిల్లల మనస్తత్వం. చిన్న గ్లాసయినా అర్థం కాదు. కానీ అది నిండా ఉండాలి. వీలయితే మరింత కావాలి. కడుపు సంగతి తెలియదు. ఈ రకం భావాలలో ఇరుక్కుపోయిన వారు, జేబులో డబ్బును ఖర్చుపెట్టకుండా ఉండలేరు. ‘చాలినంత’ అంటే ఏమిటో వారికి తెలియదు. పథకం, ప్రణాళికల గురించి ఆలోచనే రాదు!

*ప్రతిదాన్నీ బాగుండలేదనడం, పని జరిగినదాకా ఓపిక పట్టలేకపోవడం, మిగతావారికి కూడా అవసరాలుంటాయని గుర్తించలేకపోవడం, ఎంతసేపూ తమ అవసరాలు, సంతృప్తి గురించే ఆలోచన పిల్లతనం లక్షణాలు. పెరిగి కూడా పిల్లలుగా మిగిలిన వారిలో ఈ లక్షణాలు ఉంటాయి. వారికి పని ఇచ్చి, జరుగుతుందనుకుంటే కష్టం. అనుక్షణం వాళ్లను గమనిస్తూ ఉండాలి
.
*ఎదురయిన ప్రతి సమస్యను ‘బూచీ’గా చూచి భయపడడం పిల్లతనం చేష్టలలో మరొకటి. ఎవరో వచ్చి తమను గట్టెక్కించాలనుకునేవారు మనకు అడుగడుగునా కనబడతారు. ‘టీ తాగుతాను, రెండు రూపాయలివ్వండి’ అంటూ అడిగేవారు అడుగుడుగునా ఎదురవుతున్నారు. రెండు రూపాయలు ఉన్నా మనకే ఎందుకు ఇవ్వాలన్న ఆలోచన వారికి రాదు. ఈ ఉదాహరణ రంగులు, షేపులు మారి ఎక్కడ చూచినా ఎదురవుతుంది. తమ ప్రవర్తన, అభ్యర్థనల ప్రభావం ఎలాగుంటుందని వారు ఆలోచించలేరు!

*ఏం చేస్తే, ఏమవుతుందోనన్న అనుమానం, ఆతురత, కలగలిసి ఉన్న తెలివి తెరమరుగు కావడం చాలామందిలో కనబడుతుంది. బాగుంది, బాగుండలేదు అనేవి రెండే తెలుసు. నాకు పనికివస్తుంది, పనికిరాదు అనే రెండు నిర్ణయాలు ఈ రెంటిమధ్యన కూడా కొన్ని పరిస్థితులు ఉంటాయి. ఒక పరిశీలన మనకు కొంత నష్టం జరిగినా, మరికొందరికి లాభం జరుగుతుంది గనుక దాన్ని చేయాలి, చేయవచ్చునన్న ఆలోచన పిల్లలకురాదు! పెద్దయినా ఈ రకం ఆలోచనలో బిగుసుకుపోయేవారు కనబడుతూనే ఉంటారు.

*అందరూ ననే్న ఎత్తుకోవాలి. అందరూ నాతోనే ఆడుకోవాలి. అందరూ ననే్న పట్టించుకోవాలి. పట్టించుకునే వారు ఒక్కరు, ఒక్కక్షణం కనిపించకపోయినా, జగము చీకటాయెనే అన్న భావం! మార్పును ఏ మాత్రం భరించలేము. అనుమానం అసలే ఉండకూడదు. అంతా కళ్లముందు ఉండాలి. అనుక్షణం భద్రత గురించిన భరోసా ఉండాలి! ఇవన్నీ పసిపిల్లల భావాలు కదా! మనలోనూ ఇంకా ఈ భావాలే ఏదో ఒక రూపంలో ఉన్నాయంటే, మనం పెరిగినట్లేనా? పెద్దవాళ్లమయినట్లేనా?

*నా అవసరాలు, నా పరిధులు నావి. వాటిలో ఏమాత్రం సడలింపు లేదు. మీరు మాత్రం మీ అవసరాలను, హద్దులను దాటి నాకు సాయం చేయాలి అనుకుంటే అన్యాయం కాదా? అందరూ అట్లాగే అనుకుంటే, ఎవరికివారు సాయం చేయగలుగుతారు.
ఈ లక్షణాలలో కొన్ని మనలోనూ ఉంటాయి. అంతోకొంతో ఉంటాయి. అప్పుడప్పుడయినా తల ఎత్తుతుంటాయి. వాటిని అర్థం చేసుకుని దారిలో పెట్టగలగాలి. ఇష్టంలేని పనులు, వీలుగావనుకున్న పనులు ముందు చేసి, ఆ తరువాత ఇష్టమయిన, సులభమయిన పనులు చేయాలంటారు.

మన భావాలను, అంటే మనలను మనం అదుపు చేసి, ముందుకు నడిపించడం ఇక్కడి ట్రిక్కు. అది అసాధ్యమేమీ కాదు. అది మనకూ వచ్చును. దానే్న మనం అలవాటుగా, లక్షణంగా మార్చుకుంటే అంతా సుఖంగా సాగుతుంది!
====

అందం.. ఆనందం

ఆ యువకుడు బజారులో నిలిచి, అందరినీ పిలిచాడు. ‘నా గుండె చూడండి! ఎంతో అందంగా, బలంగా ఉంది!’ అన్నాడు. అందరూ అతని గుండెను పరీక్షించారు. అది అందంగా, బలంగా ఉంది. ఆనందంగా కొట్టుకుంటున్నది. అందరూ, ‘ఆహా’ ఏమి గుండె?’ అన్నారు. యువకుని గుండె పొంగిపోయింది. పిసరంత గర్వమూ పెరిగింది. ‘గుండె అంటే నాదే గుండె!’ అన్నాడతను.
అక్కడికి ఒక మసలతను వచ్చాడు. ‘ఏం బాబూ? నా గుండెకంటే గొప్పదా? నీ గుండె? అంటూ ప్రశ్నించాడు. యువకుడు, గుంపులోని వారందరూ ముసలతని గుండెను పరిశీలించారు. అది గట్టిగా కొట్టుకుంటున్నది. కానీ అతుకులు, గతకులుగా ఉంది. గుంటలు మిట్టలుగా ఉంది. కొన్ని చోట్ల మరీ అన్యాయంగా గుంటలున్నాయి కూడా! అందరూ ఆ సంగతే గట్టిగా చెప్పారు.
అప్పుడు ముసలతను చెప్పసాగాడు. ‘అబ్బాయి గుండె అందంగా ఉండవచ్చు. అది నాకిస్తానన్నా నేను ఒప్పుకోను. నా గుండెలోని అతుకులు నాతో ప్రేమను పంచుకున్న వారి గుర్తులు. నేను నా గుండెలోనుంచి ఒక ముక్క వారికి ఇచ్చాను. వారూ బదులుగా నాకొక ముక్క యిచ్చారు. కానీ ఆ ముక్క నా గుండెలో సరిగా కుదరలేదు. అందుకే నా గుండె అతుకులు, గతుకులుగా ఉంది. అయినా నాకు ఫరవాలేదు. నేను కొందరికి నా గుండెలోనుంచి ఒక ముక్క ఇచ్చినా, వారు మరో ముక్కను తిరిగి ఇవ్వలేకపోయారు. అందుకే నా గుండెలో గుంటలున్నాయి. అదనంగా వచ్చిన ముక్కలేమో మిట్టలయ్యాయి. ఇప్పుడర్థమయిందా? అందమయిన గుండె అంటే ఏమిటో?’ అన్నాడతను. మాటలు వింటున్న యువకుని కళ్ల వెంట నీళ్లు కారుతున్నాయి. తన గుండె నుంచి పెద్ద ముక్క తీసి వణికేచేతులతో ముసలతనికి అందించాడు. ముసలతనూ అదేపని చేశాడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు హత్తుకున్నారు. అందరి కళ్ల వెంటా నీరు చుక్కలుగా జారింది.

అసలు మాట
ఏపనయినా ముందు కష్టంగా కనబడుతుంది. అర్థమయిన తరువాత ఇంతేనా అనిపిస్తుంది. అంటే సులభమవుతుంది -అజ్ఞాత విజ్ఞుడు
ఆలోచన అన్నిటికన్నా కష్టమనిపిస్తుంది. కానీ, అందులోని రుచి తెలిసిన తరువాత అంతకన్నా సులభం మరొకటి లేదనిపిస్తుంది. ఈ ప్రపంచం ఇంధనాల సాయంతో కాదు, ఆలోచనల సాయంతో నడుస్తున్నది. ఇంధనాలు కూడా ఒకప్పుడు ఆలోచనలు మాత్రమే!
===

*ఈ ప్రపంచానికి నీవు కేవలం ఒక మనిషివి. కానీ ఒక మనిషికి మాత్రం నీవే ప్రపంచానివి!
*ఎండలో నడుస్తుంటే, నీడలు మన వెంట ఉంటాయి. నీడలోకి రాగానే మాయమవుతాయి. కొంతమంది మనుషులు కూడా అలాగేచేస్తారు!
*కొందరు కళాఖండాలను సేకరిస్తారు. నేను మిత్రులను సేకరిస్తాను.
*విజయం, సంతోషానికి దారి కాదు. సంతోషం విజయానికి దారి. చేసేదేదో సంతోషంగా చేద్దాం!

Tuesday, July 3, 2012

మనలో ఎవరు బెస్ట్?

'ఎలాగున్నారు?’ అని ఎవరినయినా ఒక ప్రశ్న అడిగి చూడండి. ‘ఆఁ! ఏదో! బాగానే ఉన్నాం!’ అంటారు గానీ, ఎవరూ సంతోషంగా ఉన్నామని చెప్పరు. కానీ, వ్యాపారాలు చేసే సంస్థల్లో మాత్రం బెస్ట్, గ్రేట్ లాంటి మాటలు ఊరికే వినపడుతుంటాయి. ఏదో ఒక పరికరం, అందులోని భాగం గురించి వ్యాపార పరంగా చర్చ జరుగుతూ ఉంటుంది. అందులో ‘మీరు ఇవ్వగల బెస్ట్ ప్రైస్ (ధర) చెప్పండి!’ అని ఒక డయలాగ్ ఉంటుంది. ఆ ధర కొనేవారికి తక్కువగానూ, అమ్మేవారికి లాభకరంగానూ ఉండాలి. అక్కడ బెస్ట్ అంటే అన్నింటికన్నా మంచి అనే అర్థం! అదే మరి మనుషులు, ఉద్యోగులు, వారి పని గురించి మాట్లాడుతుంటే మాత్రం ఈ మాటల అర్థాలు మారిపోతాయి. అవి ఒక్కొక్కరికి ఒక రకంగా అర్థమవుతాయి. అక్కడే సమస్యలు మొదలవుతాయి.
మనతో బాటు, మరెందరో పనిచేస్తుంటారు. అందరిలోనూ కలిసి బెస్ట్ ఎవరని వెతకవలసిన అవసరం వస్తుంది. అక్కడ అభిప్రాయాలలో చాలా తేడా కనబడుతుంది. మీరుండేస్థాయిని బట్టి పని నాణ్యత, వ్యక్తుల క్లాసు గురించిన అవగాహన మారుతుంది. ఆఫీసులో ఏదో ఒక పని చేయవలసిన అవసరం వస్తుంది. ‘దీనికి ఎవరు బెస్ట్?’ అని ప్రశ్న మొదలవుతుంది. తగినవారు ఎవరైనా ఉన్నారా, అనే ప్రశ్న కూడా పుడుతుంది. ఉన్నవాళ్లంతా మంచివాళ్ళే. కానీ, కొత్త అవసరం వచ్చేదాకా దానికి సరిపడే వారు ఉన్నారా? అన్న సంగతి తెలియదు!


‘నీవు కోరిందేదో నీ దగ్గర ఉందన్న సంగతి, ఆ కోరిందేదో తెలిసేదాకా తెలియదు’ అని ఒక మాట ఉంది. మనుషులయినా అంతే! ఆఫీసులో, కంపెనీలో ‘బెస్ట్’ గురించిన వెదుకులాట చాలా రకాలుగా ఉంటుంది. మనుషుల గురించయితే, అందుకు కొన్ని పద్ధతులున్నాయి. అందరికీ తెలిసిన ‘పనె్నండు ప్రశ్నల పరీక్ష’ ఒకటి ఉంది. అది కాపీ రైటు కింద వస్తుంది. ఉద్యోగి భావాలను గుర్తించే ప్రయత్నంలో మామూలుగా కొన్ని ప్రశ్నలుంటాయి.


* కంపెనీ నమ్మే విలువలనే ఇంచుమించుగా నేను కూడా నమ్ముతాను.
* నేను, నా కంపెనీ భవిష్యత్తు బాగుంటుందనుకునేవారిలో ఒకడిని.
* కంపెనీ గమ్యాలను చేరడంలో, నా పాత్ర ఏమిటో నాకు బాగా అర్థమయింది-లాంటి కొన్ని పడికట్టు భావాల గురించి సర్వే చేస్తుంటారు. కానీ, ఈ రకం ప్రశ్నలు అన్ని సందర్భాలలో, అన్ని డిపార్టుమెంట్లలో సంతృప్తికరమయిన ఫలితాలను ఇవ్వవు. మరింత సూటిగా, ఒక్కొక్క ఉద్యోగికి చేతనయిన పనులు, పనులు చేయడంలోనూ, కంపెనీ పట్ల వారు చూపించే విధేయత మొదలయినవి మరీ లోతుగా చూడవలసిన అవసరం వస్తుంది. అట్లా, ప్రశ్నల సంఖ్య ఎక్కువవుతుంది. సర్వే, చాలా చికాకు అవుతుంది. ఒకానొక కంపెనీ వారు సర్వే కోసం నాలుగు వందల ప్రశ్నలు సిద్ధం చేశారు. ఇక ఆ సర్వేలోనుంచి, అనుకున్న ఫలితాలు రావని వేరుగా చెప్పనవసరం లేదు.


మీరు ఎంతగా ‘బెస్ట్’కు దగ్గరవుతున్నారన్న సంగతి ముందు మీకు తెలుస్తుంది. కానీ, మీ చేత పని చేయిస్తున్న వారి ఎక్స్‌పెక్టేషన్స్ మరోరకంగా ఉంటాయి. మీ సూపర్‌వైజర్, ‘కానీ’ అని ఒక పుల్ల వేస్తాడు. మీది మేనేజర్ అగ్గిపుల్ల గీచి ఈ పుల్లను వెలిగిస్తాడు. కనుక ఎవరు బెస్ట్ అన్న ప్రశ్నకు జవాబు, ఉద్యోగుల మధ్య నుంచి రాదు. మేనేజర్ల నుంచి వస్తుంది. మేనేజర్లకు తమ సిబ్బందితో ఉండే మంచి సంబంధాల ఆధారంగా నిర్ణయం వస్తుంది. మనం మనుషులం. మేనేజర్లు కూడా మనలాగే మనుషులు. కనుక, కొన్ని సందర్భాలలో నిజమయిన ‘బెస్ట్’ బయటపడకుండా, నిరాశకు లోనవుతారు. అదనంగా పని చెప్పడానికి, బెస్ట్ గురించి వెతికితే మాత్రం, అక్కడి ప్రశ్నలు మరోరకంగా ఉంటాయి. పనిని బెస్ట్‌గా చేయగలిగిన వారికన్నా, బెస్ట్‌గా మాట వినేవారికి భారం అప్పగించే వీలు ఎక్కువ. అందులో అందరికీ సులువుంది. ఉద్యోగులలో నిజంగా బెస్ట్ ఎవరన్నది, చిక్కు ప్రశ్న. ఒక్కొక్క విషయానికి, సందర్భానికి ఒకరు బెస్ట్‌గా ఉంటారు. కొంతమందిలోని మంచీ చెడు లక్షణాలను మేనేజర్లు గమనించరు. ఒక పెయింటింగ్ ఉంటుంది. అందులో అక్కడక్కడ ఖాళీలు ఉంటాయి. ఆ ఖాళీలలో కూడా రంగులు పులిమితే, పెయింటింగ్ అందం, ఆకర్షణ తగ్గుతాయి. ఒక పూల గుత్తిలో, ఒక పువ్వు తగ్గినా, ఎక్కువయినా దాని రూపం మారుతుంది. బాపు బొమ్మలో ఒక గీత తగ్గినా ఆ బొమ్మ అసంపూర్తి అవుతుంది అంటారు. మనుషుల వ్యక్తిత్వాలు కూడా అలాంటివే. 



మనమయినా, మన మేనేజర్లయినా, వ్యక్తిత్వంలోని ఖాళీలను అదనపు లక్షణాలను ఈరకంగా గుర్తించగలగాలి. మన దృష్టిలో కొన్ని లక్షణాలు మాత్రమే వచ్చి, మిగతావి రాకుంటే, ఆ వ్యక్తి మనమే అయినా సరే, చిత్రం అసంతృప్తి అవుతుంది. కొంపలు మునుగుతున్నా సరే, నిత్యం ఆఫీసుకు సమయానికి వచ్చేవారు మంచి ఉద్యోగులా? చెప్పిన పనిని నిజంగా ధ్యాస పెట్టి ముగించేవారా? కంపెనీ, సంస్థ గమ్యాల గురించి అవగాహన ఉండి, అందుకు తమ వంతు కృషి చేసేవారిని ఏమనాలి? పని చేసినా, చేయకున్నా, సరైన సమయంలో మంచి సలహాలు, అభిప్రాయాలు, ఆలోచనలు అందజేసేవారుంటారు. వారినేమనాలి? కొందరికి సమస్యలను విడదీయడంలోని మెళకువలు తెలిసి ఉంటాయి. కొందరు పని సాధించడంలో పట్టుదలగలవారుంటారు. ఈ లక్షణాలు అన్నీ ఒకరిలో దొరకవు. కొంతమందిలో ఈ లక్షణాలే కనిపించవు. అన్ని మంచి గుణాలే, కానీ, జాగ్రత్తగా గమనిస్తే, మంచి గుణాలు రెండింటి మధ్యన వైరుధ్యం కనబడుతుంది. ఒక్కొక్క గుణం గురించి ఆలోచించినా, వాటిలో మంచితో బాటు కొంచెం చెడు కూడా కనిపించే వీలుంది. ఎవరికివారికే ఈ అభిప్రాయాలు వేరువేరుగా ఉంటాయి. మొత్తంమీద ఎవరి అభిప్రాయం కూడా పూర్తిగా తప్పుకాదు, పూర్తిగా సరయింది కాదని గుర్తుంచుకుంటే బాగుంటుంది. సందర్భాన్ని బట్టి, మనుషుల విలువ తెలుస్తుంది. ‘తగినవారు’ ఉంటారు. ఆ సమయానికి వారే బెస్ట్! మొత్తంమీద ఎవరి అభిప్రాయం కూడా పూర్తిగా తప్పుకాదు, పూర్తిగా సరయింది కాదని గుర్తుంచుకుంటే బాగుంటుంది.

సందర్భాన్ని బట్టి మనుషుల విలువ తెలుస్తుంది. ‘తగినవారు’ ఉంటారు. ఆ సమయానికి వారే బెస్ట్! మొత్తంమీద బెస్ట్ అనే వారుండరు!


ఇంతా జరిగిన తరువాత, మేనేజర్ల మీద కూడా బాసులుంటారు. వారి అభిప్రాయాలను కాదనగలిగే శక్తి, తక్కువగా ఉంటుంది. అందరిమధ్యన జరిగిన నిర్ణయాలను, అక్కడ, అవుననిపించుకుంటే, అనిపించగలిగితే, ఆ సందర్భంలో ఆ మేనేజర్ బెస్ట్! అవునన్న పెద్ద బాసు బెస్ట్! ఆ బాసు మేనేజర్‌ని బెస్ట్ అంటారు. మేనేజరు మనందరినీ బెస్ట్ అంటారు! అప్పుడు మాటకు అర్థం ఉంటుంది!




నాకు నచ్చని సంగతులు!




టైమెంత అని అడగటానికి చేతిని చూపించడం! నా గడియారం ఎక్కడుందో నాకు తెలుసు? గడియారం లేనిది నీకు గదా? బాత్‌రూం ఎక్కడ అని అడగడానికి ఏం చూపిస్తావ్? (సారీ)

సినిమా చూస్తున్నాము. ‘చూశావా? చూశావా? అంటాడు పక్కతను! బోలెడు డబ్బు పెట్టి సినిమాకు వచ్చింది, చూడటానికి కాకపోతే, గోళ్లుగిల్లుకోవడానికా?

నిన్నొక ప్రశ్న అడగనా?’ అనే ప్రశ్న! అప్పుడే ఒక ప్రశ్న అడిగావు. మరోకటి ఎలాగూ అడుతావిక!

‘జీవితం చిన్నది’ అనే మాట! ఏమిటర్థం? మనకు చేతయిన పెద్ద సంగతి అదొకటే! దానికంటే ఎక్కువ కాలం మరేమి సాధించగలం గనుక?

సందర్భం!
అదొక నగరం. అక్కడొక కుటుంబం. కుటుంబమే, కానీ ఉండేది ఇద్దరే! ఒక తల్లీ, ఒక కూతురు. మరో దిక్కులేని వారయినా, వారుకూడా కుటుంబమే. సుఖంగా బ్రతుకుతున్నారు. ఒకరిమీద ఒకరికి ప్రేమ కూడా బోలెడుంది. కానీ, వాళ్లిద్దరికీ నిద్రలో నడిచే అలవాటు ఉంది. అదొక పెద్ద సమస్యలా కనిపించలేదు వారికి. ఒకరు లేస్తే మరొకరికి మెలుకవవుతుంది. ఎలాగో సర్దుకుంటున్నారు.

ఒకానొక రాత్రి, ప్రపంచమంతా నిశ్శబ్దంగా నిద్రలో ఉంది. తల్లీ కూతుళ్లిద్దరూ ఒకేసారి, నిద్రలో నడక మొదలుపెట్టారు. ఇద్దరికీ మెలుకువ రాలేదు. నడుస్తూ, నడుస్తూ రాళ్ల తోటలోకి చేరుకున్నారు. అక్కడ పొగ మంచు నిండి ఉంది. ఇద్దరూ ఒకరొకరికి ఎదురుపడ్డారు.

‘‘ఆహా! రాక్షసీ! చివరికి ఎదురయ్యావా? నీ వల్లే గదా నా బతుకంతా నాశనమయింది, ఆ శిథిలాల మీద నీవు నీ బతుకు బంగళా కట్టుకున్నావు! నిన్ను చంపగలిగితే బాగుండును!’ అన్నది తల్లి ఆవేశంగా!

‘‘నువ్వొక ఆడదానివా? ఆశపోతు ముసలిపీనుగా! నా బతుకుకూ నాకూ మధ్య అడ్డుగోడగా నిలబడ్డావు! నాబతుకు కూడా నీ బతుకులాగా తెల్లవారుతుంటే, నేనూరుకుంటానా? నువ్వు చస్తే, నా పీడ విరుగడవుతుంది!’’ అన్నది కూతురు.
అంతలో కోడి కూసింది. తల్లికీ, కూతురికీ మెలుకువ వచ్చింది.

‘నువ్వేమిటి బంగారు తల్లీ! ఇక్కడున్నావు?’ అంది తల్లి. ‘నీవేమిటమ్మా ఇక్కడ?’ అంది కూతురు. ఇద్దరూ కలిసి ఇంట్లోకి వెళ్లారు.

-ఖలిల్ జిబ్రాన్ ఆధారంగా!

అసలు మాట
నోరు విప్పకుండా ఉంటే, చవటలమని ఎలాగూ అర్థమవుతుంది! నోరు విప్పి, ఇక సందేహం లేకుండా చేయడమెందుకు?
-రామీ బెల్సన్

ఏదో ఎగురుతూ వస్తున్నది. ఏమిటా అని చూస్తున్నాను. అదొక రాయి. అది నాకే తగిలింది!

Saturday, June 23, 2012

అవకాశం అందుకోవాలి!

పని దొరకడం లేదని ఏడుస్తూ కూచునే వారి సంఖ్య రాను రాను తగ్గుతున్నట్టు తోస్తుంది. అవకాశాలను అందుకోవాలని అందరూ అనుక్షణం ప్రయత్నిస్తున్నారు. అవకాశాలు ఉన్నాయి, లోపమంతా నీ ప్రయత్నంలోనే! అంటూ అందరూ మనల్ని ముందుకు తోస్తుంటారు కూడా! అవకాశాలున్నాయి, కానీ, అవి మనకు సరిపడేవిగా ఉన్నాయా? మన పరిస్థితులను, శక్తియుక్తులను కూడా లెక్కించాలి కదా! అక్కడే ప్రయాణం మొదలవుతుంది. వెతుకుతూ బయలుదేరితే, ఇంతకుముందు ఊహించని గమ్యాలకు చేరే వీలుంది. అందుకు ఓపిక, పట్టుదల, ప్రయత్నం అవసరం!


చదువులోగానీ, మరేదయినా పనిలోగానీ పడిన శ్రమ ఊరికే పోదు. చదువుకున్న సంగతి పోయి, సరదాగా నేర్చుకున్నదేదో మనకు దారి చూపించగలదు. అందులో మనం బాగా రాణించగలం కూడా. ఇలాంటి పరిస్థితులు వచ్చినపుడు, ఆలోచనతో, నిలకడగా నిర్ణయాలు చేయవలసి ఉంటుంది. ఎక్కడో ఒక రంగంలో మన సత్తా చూపించగలిగితే, ఆ అవసరం కలిగిన వారంతా మన గురించి ఆలోచించే పరిస్థితి రావాలి. అందుకు మన కృషి మాత్రమే ఆధారం. నాణ్యత అంతకన్నా ముఖ్యం. చేయగలిగే పనులను మరింత బాగా చేసే చోటికి మనం ఎదగాలి. కొత్త పనులు నేర్చుకోవాలి. ఒక సమయంలో ఎవరికీ కంప్యూటర్ గురించి తెలిసేది కాదు. ప్రస్తుతం కాల్ లెటర్స్ కూడా ఈ-మెయిల్‌లో పంపుతున్నారు. అవకాశాలను వెదకడంలో అవసరమయిన శ్రమ నిజానికి శ్రమ కాదు. అది మనకోసం మనమే పడుతున్న ప్రయాస!

*కళ్లు మూసుకుని ఉంటే అవకాశాలు కనబడవు. కళ్లు తెరిచిన తర్వాత అవి కరిగిపోతాయి. నిత్యం పనిగట్టుకుని వెతుకుతూనే ఉండాలి. కనిపించిన అవకాశాల గురించి అదేపనిగా ఆలోచిస్తూ కూచుంటే లాభం లేదు. అప్లై చేయడమా, మానడమా? అన్న ఆలోచనలోనే కాలమంతా గడిస్తే చివరి రోజున ఆదరాబాదరాగా, అరకొరగా అప్లికేషన్ పంపవలసి వస్తుంది. బాగుంది, అనిపిస్తే చాలు, కాగితం పంపడమే మంచిది. నచ్చకపోతే, ఇంటర్వ్యూకే వెళ్లము! తర్వాత, బాధపడడంకన్నా ఇది మంచి పద్ధతి కదా!

*కొన్ని అవకాశాలు, రారమ్మంటూ పిలవకుండా దాగి ఉంటాయి. చాలా ఉద్యోగాల గురించి ఎక్కడా ప్రకటనలు రావు. ఈ మధ్యన రెఫరల్ పద్ధతి ద్వారా ఉద్యోగులను ఎంచుకోవడం ఎక్కువయింది. అలా మన పేరు పదిమంది గుర్తుంచుకుని రెఫర్ చేసేలాగా, పరిచయాలు, నెట్‌వర్కింగ్ సిద్ధం చేసుకోవాలి. ఒక ఉద్యోగిని పరిచయం చేసిన తర్వాత, అతను ఉద్యోగానికి ఎంపికయి, చేరితే, రెఫర్ చేసినవారికి కూడా ఇనె్సంటివ్ ఇస్తున్నారు. రెఫర్ చేసినవారు మంచి నెట్‌వర్కింగ్ గలవారుగా లెక్కలోకి వస్తున్నారు.

*చిన్న ఉద్యోగంలో ఉన్నవారు అదే కంపెనీలో పెద్ద ప్రాజెక్టులలోకి దూకడం మామూలయింది. సంస్థ పెరుగుతున్నదంటే, వెయ్యి కళ్ళతో, మనకు సరిపడే ఖాళీల గురించి చూస్తుండాలి. పనిచేసేచోట మన ‘పనితనాన్ని’ చూపుతుంటే, కొత్త అవకాశాలు మరింత సులభంగా అందుతాయి. ఒకే కంపెనీలోని వేరు వేరు విభాగాలలో అవకాశాలు వస్తుంటాయి. అక్కడ రెఫరల్ మరింత బాగా పనిచేస్తుంది.

*అన్నింటికన్నా ముందు మన గురించి మనకు తెలిసి ఉండాలి. అవకాశాలు ఉంటాయిగానీ, అందుకు మనకు ఎంతవరకు అర్హత ఉందన్నది ప్రశ్న. చేస్తున్న పనిలో ఏ అంశాలు మనకు నచ్చుతున్నాయి? ఏ పనులను మనం బాగా చేయగలుగుతున్నాము? మిగతా వారికంటే మనం ఎక్కడ పైచెయ్యిగా ఉన్నాము? మిగతావారికి చేతగాని పనులు, తెలియని విశేషాలు మనకు ఎంతవరకు పట్టులో ఉన్నాయి? మనకు తెలిసిన పెద్దవారిలో, మన గురించి మంచి మాట చెప్పగలవారు ఎవరున్నారు? లాంటి ప్రశ్నలన్నీ మన మెదడులో తిరుగుతూ ఉండాలి. ప్రశ్నలతోనే సరిపెట్టుకుంటే చాలదు. ఈ ప్రశ్నలన్నింటికీ పాజిటివ్ సమాధానాలు వచ్చేదిశగా మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి.

*మనకు చేతనయిన సంగతులతో బాటు, చేతగానివీ ఉంటాయి. బలహీనతలను కూడా గుర్తించి వాటిని గురించి కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సాగాలి. మనంకొన్ని పనులు ఇష్టం లేక, చేతగాక తప్పించుకుంటాము. అది తప్పుకాకపోవచ్చు కానీ, ఆ సంగతి మనకు తెలిసి ఉండాలి. తోటివారు, పై అధికారులు, పెద్దలు మనలోని బలహీనతలు, లోపాల గురించి ఏమనుకుంటున్నారు? సాధారణంగా, మన సమాజంలో ఎవరూ ఇలాంటి విషయాలను చెప్పరు. కానీ వాటిని కూడా చెప్పగల వారు మన సర్కిల్‌లో ఉండాలి. లోపం గురించి మనకు తెలియకపోవచ్చు. తెలుసుకోవాల్సిన అవసరమూ రాకపోవచ్చు. తెలిస్తే మాత్రం, వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది.

శఅసలు మన మీద మనకు నమ్మకం ఉందా? ఆత్మస్థైర్యం ఉందా? పనులను పక్కనపెడుతూ తప్పించుకు తిరుగుతున్నామా? మనమే ఆలోచించి తెలుసుకుంటే మేలు గదా!

*కొత్త అవకాశం కనిపించిన వెంటనే దూకడం కూడా మంచిది కాదు. గోడ దొరికిన తరువాత తడికను తన్నమన్నాడు ఒకాయన! అసలు మనకు జీవితంలో ఏం కావాలి? తేల్చుకుని ముందుకు సాగాలి. ఊరు మారవలసి వస్తే కుదురుతుందా? జీతం భత్యాల విషయంలో తేడా రాదు గదా? కొత్త ఉద్యోగం నిలకడగా ఉంటుందా? అసలు అక్కడ మనం సుఖంగా కొనసాగగలుగుతామా? అక్కడ మరింత ముందుకుపోయే అవకాశాలు ఉంటాయా? అసలు అన్నింటికంటే ముందు కొత్త అవకాశం ఆసక్తికరంగా ఉందా? ఎన్నో ప్రశ్నలు! మనలో మనం, మరొకరితో వీలయితే అక్కడా చర్చించుకుని ముందుకు కదలాలి.

*కొంత అనుభవం కలిగినవారికి, చాలా అవకాశాలు కనిపించే వీలు కూడా ఉంటుంది. అప్పుడు వాటన్నిటి గురించీ వివరాలు సేకరించాలి. ఎక్కడ మనకు అనుకూలంగా ఉంటుంది? పని ఆనందం ఎక్కడ వీలవుతుంది? సంతృప్తికి వీలు ఎక్కడ? అన్నింటికీ మించి, సులభంగా అందుకోగలిగిన అవకాశాలు ఏవి? లాంటి ప్రశ్నలు ఎదురవుతాయి. కొన్ని ఉద్యోగాలలో చిక్కులుంటాయి. కానీ ముందు కనబడవు. వెళ్లిన తరువాత, తప్పు చేసిన భావం మిగులుతుంది. వెనక్కురావడానికీ ఉండదు.
అవకాశాల వేట, ఈ కాలంలో ఒకచోటికి ముగిసేదికాదు. ఉద్యోగాలు మారినందుకు మనుషుల విలువ పెరుగుతున్నది. ఒకప్పుడు పనిచేసిన చోటికే, పెద్ద స్థాయిలో తిరిగివచ్చేవారున్నారు. జాగ్రత్తగా, పట్టుదలగా, విశాల దృక్ఫథంతో ముందుకుసాగడమే! అవకాశాలు పిలిచినప్పుడు రావు. తెలిసేలా రావు. దూకుతూనే ఉండాలి. ఒకసారి అవకాశంలోకి దూకామని తర్వాత అర్థమవుతుంది.



సంగతి తెలిసింది!


ఒక దేశం ఉంది. ఆ దేశంలో గాడిదలు లేవు. ఒకతను ప్రయత్నంగా మరెక్కడినుంచో ఒక గాడిదను తెచ్చుకున్నాడు. కొంతకాలం దాన్ని బాగానే సాకాడు. కానీ, దాన్ని ఏరకంగా వాడుకోవాలో అర్థం కాలేదు. తిండి దండగ అంటూ గాడిదను ఒక కొండ పక్కన అడవిలో వదిలేసివచ్చాడు. అతని బాధ తీరింది. గాడిద, దొరికిందేదో తింటూ బాగానే బతుకుతున్నది. ఆ అడవిలో ఒక పులి కూడా ఉంది. అది ఒకనాడు గాడిదను చూచింది. అంత ఎత్తున్న కొత్త జంతువును చూసి కొంచెం భయపడింది. ఎక్కడినుంచి వచ్చిందో అనుకుంటూ కంటబడకుండా తప్పించుకుని తనదారిన తాను పోయింది. ఆ తరువాత పులి, దొంగచాటుగా గాడిదను పరిశీలిస్తూ కాలం గడిపింది. కొన్నాళ్లకు కొంచెం ధైర్యం కలిగి గాడిదకు దగ్గరగా వచ్చింది. అయినా తప్పించుకుని తిరిగింది. ఒకనాడు పులి వచ్చిన సమయానికి గాడిద ఓండ్రపెట్టింది. తన సంగతి తెలిసిపోయిందేమోనని జడుసుకుని పులి పరుగుతీసి దాక్కుంది. కొంచెం సేపటికి దొంగచాటుగా వచ్చి గాడిదగారిని రహస్యంగా పరికించింది. పెద్ద శరీరం, పెద్ద గొంతు తప్పితే మరేమీ ప్రత్యేకంగా కనిపించలేదు. పైగా, గాడిద గడ్డీగాదం తింటున్నది! పులికి, గాడిద అరుపులు అలవాటయి, నిర్లక్ష్యం మొదలయింది. అది వచ్చి గాడిద చుట్టు తిరిగి చూచింది కూడా! దానికి ధైర్యం పెరిగింది. గాడిద ముందుకు వెళ్లి, కావాలనే దాన్ని కుమ్మింది. గాడిదకు కోపం వచ్చింది. అది వెనుక కాళ్ళతో పులిని తన్నింది! పులికి విషయం అర్థమయింది! ఇంతేనా ప్రతాపం! అనుకుంది. అమాంతం పైనబడి, పులి గాడిదను చంపి తినేసింది!

పని - సమయం



నటుడు నసీరుద్దీన్ షా నాటకాల్లో, మామూలు సినిమాల్లో, ప్యారలల్ సినిమాలో పని చేస్తాడు. ‘రోజులో 24 గంటలున్నాయి. ఎనిమిది గంటలు పని. ఎనిమిది గంటలు నిద్ర. అయినా మరో ఎనిమిది గంటలు ఉండనే ఉన్నాయి. చేయదలచుకున్న పనికోసం సమయాన్ని వాడుకోవడం నా పద్ధతి’ అంటాడు ఈ 61 ఏళ్ళ యువకుడు. అతనింకా సినిమాల్లో నటిస్తున్నాడు. నాటకాలలో పాల్గొంటున్నాడు.
===

అసలు మాట
అవకాశాలలో అపార్థాలను, అనర్థాలను చూచేవారు నిరాశావాదులు. అనర్థాలలో కూడా అవకాశాలను వెదికేవారు
ఆశావాదులు -హ్యారీ ట్రూమన్

స్వతహాగా స్వభావం మంచిదయితే, ప్రపంచంలో వెలుగులే కాదు, మరెన్నో కనబడతాయి. అనుకోకుండానే, మంత్రం వేసినట్టు, అవకాశాలన్నీ మన ముందుకు వచ్చేస్తాయి. అప్పటివరకు కనిపించని ప్రపంచమంతా, మార్పు తరువాత ఎదుట నిలుస్తుంది.
-అర్ల్ నైటింగేల్