Showing posts with label సైన్స్. Show all posts
Showing posts with label సైన్స్. Show all posts

Saturday, September 24, 2016

నిప్పు చెప్పే నిజాలు




నిప్పు జీవంగలది. అది శ్వాసిస్తుంది, అందిన దాన్ని తింటుంది, అసహ్యించుకుంటుంది. మంటను గెలవాలంటే మనమూ దానిలాగే మెలగాలి. దానిలాగే ఎటుపడితే అటు కదలాలి. మండే పదార్థాలు ఉన్నాయని మంటకు తెలియదు. మంట ఉందని మండే పదార్థాలకు తెలియదు. మంట, నిప్పు కలిసి మన ప్రపంచాన్ని మార్చేశాయి. ఒకానొక సినిమాలో ఒకానొక పాత్ర అన్న మాటల ఆధారంగా.
* * *
చుట్ట వెలిగించడానికి చెన్నయ్య చెకుముకి రాయి కొట్టేవాడు. పొయ్యి వెలిగించడానికి పెద్దమ్మ పక్కింటి నుంచి పిడక మీద నిప్పు తెచ్చేది. అప్పుడు అగ్గిపెట్టె, కిరోసిన్ నూనె వచ్చి పద్ధతి మార్చాయి. అగ్గిపుల్ల ఎక్కడ గీచినా మండేది. ఓ సినిమాలో క్రూరుడయిన విలన్ ఎదుటి వాడి బట్టబుర్ర మీద పుల్లగీరి దాంతో చుట్ట వెలిగించుకోవడం చూచాను. అది తెలుగు సినిమా మాత్రం కాదు. అగ్గి పుల్లలను అంత క్రూరంగా ఉండని పద్ధతికి మార్చి భద్రత గలవి అని పేరు కూడా పెట్టారు. అగ్గిపెట్టెల మీద సేఫ్టీ మ్యాచెస్ అని ఉంటుంది. కనీసం ఈసారయినా గమనించి చూడండి. అదీ మీకు అగ్గిపెట్టె దొరికితేనే. ఇక ఆ తర్వాత కరెంటు వచ్చి కాలానే్న మార్చింది. ఇప్పుడు నిప్పు, పొగ, వేడి ఏదీ లేకుండానే మైక్రోవేవ్‌లో వంట జరుగుతోంది. మంటలేదు గానీ వంట మాత్రం అలాగే ఉంది. ఇంతకూ వంట, మంట ఎప్పుడు మొదలయ్యాయనేది అసలు ప్రశ్న.
తొలి రోజుల్లో మనిషి తెచ్చుకున్న కాయలు, పళ్లు గానీ వేటాడిన జంతువును గానీ పచ్చిగానే తినేవాడు. కాల్చి తినడం ఆ తర్వాత అలవాటయింది. చిన్నప్పుడొక కథ విన్నట్లు గుర్తు. తెచ్చిన మాంసం లేదా జంతువు అలా ఉండగానే అనుకోకుండా ఒకసారి అగ్నిప్రమాదం జరిగిందట. మంట ఆరిన తర్వాత జంతువేమయిందో వెదుకుతూ మనిషి ఉడికిన మాంసంలో వేలు పెట్టాడు. చురుక్కుమంది. అనుకోకుండా వేలిని నోట్లో పెట్టుకున్నాడు. మాంసం రుచి మారింది. బాగుంది కూడా! అలా తిండిని కాల్చి తింటే బాగుంటుందని తెలుసుకున్నారంటారు. ఇలాంటి కథలు, కథలుగా కూడా నిజంగానే వినిపిస్తాయి. అప్పట్లో అంటే ఆదిమానవుని కాలంలో ఏం జరిగిందీ అన్నది ఊహించి చెప్పవలసిందే తప్ప అందుకు ఆధారాలు లేవు కదా! కనుక కథకూ, సత్యానికి మధ్యన అంత తేడా లేదు.
పది లక్షల సంవత్సరాల క్రితం ‘హోమో ఎరెక్టస్’ అనే నిటారుగా నిలబడిన మానవులు వంటకు, వెలుగుకు ఇతర అవసరాలకు మంటను వాడుకున్నారని ఒక వాదం. రెండు లక్షల సంవత్సరాలకు ముందు మానవుడు అగ్నిని తన అవసరాలకు వాడుకున్న గుర్తులేవీ, కనిపించడం లేదంటారు మరి కొందరు పరిశోధకులు. అంటే, అప్పటికి ‘హోమో సాపియోన్స్’ అనే మనలాంటి మనుషులు వచ్చేశారు. అంతకు ముందు మనుషులకు వంట తెలియదంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. ఆ ఆశ్చర్యాన్ని కొంచెం తగ్గించే ఆధారాలు కొన్ని సంవత్సరాల క్రితం ఫ్రాన్సులో దొరికాయి. 4,65,000 సంవత్సరాల నాటిదిగా గుర్తించిన ఒక మానవ ఆవాస ప్రదేశంలో పొయ్యిలా మండిన చోటు ఒకటి దొరికింది. లెక్కలో ఎంత తప్పు ఉన్నా 65 వేల సంవత్సరాలకన్నా అటూ ఇటూ కావడానికి వీలులేదంటున్నారు పరిశోధకులు. అంటే నాలుగు లక్షల ఏళ్లనాడే మనుషులు పొయ్యి పెట్టి వంట చేసుకున్నారని భావం. ఆ కాలానికి నేడున్న మనలాంటి మానవ జాతి ఆవిర్భవించలేదు. నిటారు మనుషుల కాలమే అది!
ఎలెక్ట్రాన్ స్పిన్ రెసొనాన్స్ అనే పద్ధతితో ఎక్కువ వేడయిన క్వార్ట్‌జ్ వయసు గుర్తించడం వీలవుతుంది. గులకరాళ్లు, మట్టిలో ఈ క్వార్ట్‌జ్ ఉంటుంది. పొయ్యిలో నుంచి రాళ్లను, మట్టిని తీసి చూస్తే అవి లక్షల ఏళ్ల నాటివని తెలిసింది. మొదటి పరిశీలనలోని రాళ్లు 3,80,000 సంవత్సరాల నాటివి. అక్కడే పురాతత్వ పరిశోధన కోసం జరిపిన తవ్వకాలలో మరింత లోతున మరో పొయ్యి కనిపించింది. అందులోని రాళ్లను పరీక్షిస్తే అవి 4,65,000 నాటివని తెలిసింది. అయితే మానవులు ఆ కాలంలోనే మంటను వాడుకున్నారని చెప్పడానికి ముందు పరిశోధకులు ఒకటి రెండు సంగతులను తేల్చి చెప్పాల్సి ఉంటుంది. అందులో ఒకటి కాలం నిర్ణయించడానికి వాడుతున్న డేటింగ్ పద్ధతుల్లో పొరపాటు లేదని, రెండవది పరీక్షించిన రాళ్లు నిజంగా ఒక ‘పొయ్యి’లోవని, ఏదోవేరు రకంగా గురయినవి కావని తేలాలి!
పరిశోధనలో ఎప్పటికీ పొరపాట్లే జరుగుతాయంటే అన్యాయం. అలాగని పొరపాటు జరగవనడానికి కూడా లేదు. ఇక్కడ మరొక కథ గుర్తుకు వస్తుంది. ఇద్దరు గప్పాల రాయుళ్లు ముచ్చటాడుతున్నారట. ‘మా ఇంట్లో బావి కోసం వంద అడుగులు తోడితే, ఆ లోతులో తీగలు దొరికినయి. అంటే వెనకట మనవారు టెలిఫోను వాడుకున్నారనే గదా అర్థం!’ అన్నాడు మొదటి గప్పాలాయన. రెండవ ఆయన అందుకుని ‘మా ఇంట్లో నిజానికి రెండు వందల అడుగులు తోడినా ఏ తీగా దొరకలేదు. అంటే అప్పట్లో వారు వైర్‌లెస్, సెల్‌ఫోన్ వాడుకున్నారనేగా అర్థం!’ అన్నాడు. ఫలితాలను అందుకోవడం ఒక ఎత్తు. వాటిని అన్వయించి చెప్పడం మరో ఎత్తు! వేడెక్కిన రాళ్ల వయసు నిర్ధారించడానికి వాడే పద్ధతి గట్టిదే. అయితే అందులో అయిదు లక్షలకన్నా ఎక్కువ సంవత్సరాల వివరాలు తెలియడం కష్టం. పరిశీలిస్తున్న ఈ రాళ్లు ఇంచుమించు పరీక్షా పద్ధతుల అంచులను తాకుతున్నాయి. అలాంటి ఫలితాలను నమ్మడం కొంచెం కష్టమే. అందుకే పరిశోధకులు రాళ్లను థర్మోల్యుమినిసెన్స్ అనే మరో పద్ధతిలో కూడా పరీక్షించే ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఒక సమస్య తీరుతుంది. సాధారణంగా ఏ విషయాన్నయినా అనుమానం లేకుండా నిర్ణయించాలంటే, ఒకటికన్నా ఎక్కువ పద్ధతులతో పరిశీలించడం, పరిశోధనలోనే కాదు, మన బతుకుల్లోనూ అలవాటే. డాక్టర్‌లు తాము చెప్పింది కాక, మరో డాక్టర్‌కు చూపించి మరో అభిప్రాయాన్ని తీసుకోవడం అనే ఒక పద్ధతి ఉండనే ఉన్నది కదా!
ఇక రెండవ సమస్య, రాళ్లు నిజంగా మనుషులు ఏర్పాటు చేసుకున్న నెగడు లేదా పొయ్యిలో నుంచి వచ్చినవేనా? లేక మనిషి ప్రమేయం లేకుండానే మంటకు గురయినవా? అడవులు తగలబడడం మామూలే. అది కాకున్నా ఒక ఎండిన చెట్టు తగలబడి ఉండవచ్చు. ఇటువంటి మంటకు, మనిషి వేసుకున్న పొయ్యి మంటకు తేడా తెలియడం కష్టం. అయితే ఫ్రాన్సు తవ్వకాల్లో దొరికిన పొయ్యిలు మాత్రం చాలాకాలంపాటు మండిన దాఖలాలున్నాయి. సహజంగా తగలబడిన వస్తువులేవీ ఇంతకాలం మండవు.
హోమో ఎరెక్టస్ కాలంలోనే మంటను, నిప్పును వాడుకున్నారనేది నిర్ణయమయితే మానవజాతి పరిణామ చరిత్ర కొంచెం మారుతుంది. నిప్పు, చక్రం, వ్యవసాయం మానవ జాతి చరిత్రలో ఎంతో ప్రాధాన్యం గల అంశాలు. అవి మనిషికి బ్రతుకు నేర్పించాయి. నిప్పు నియంత్రణ జీవితానికి గుర్తు, చక్రం సాంకేతిక పరిజ్ఞానానికి, ప్రగతికి ఆధారం. వ్యవసాయం సాంఘిక పద్ధతికి సామూహిక జీవనానికి, అన్నిటికీ మించి ‘స్వంత’ భావానికి మొదలు, వంట స్వంతం. ఫలసాయం స్వంతం. అది తన వారికే అందాలి. అంటే ఇతరుల నుంచి కాపాడుకోవాలి. నిప్పు మాత్రం సంఘానికి గుర్తుగా ఉన్నాలేకున్నా స్వంతం కానవసరం లేదు.
మన గురించి మనం తెలుసుకోవడంలో ఒక వింత ఆనందం ఉంది. మానవులు ప్రస్తుతం ఈ రకంగానే ఎందుకున్నారని ప్రశ్నిస్తే, జవాబులందడానికి ఇటువంటి వివరాలు మరెన్నో తెలియాలి!
ఝలక్: నాన్న ఒక అనుభవం చెప్పేవాడు. కొత్తగా మంటినూనె వచ్చిన రోజులు. మంటి నూనె అంటే నేల నుంచి తీసిన నూనె. అదేమిటో మీకు అర్థమయి ఉండదు. పెట్రోలును భూమిలోనుంచి తీస్తారు. మంచి నూనెను నువ్వులు, పల్లీలు అనే వేరుశెనగలు లాంటి వృక్ష సంబంధ పదార్థాల నుంచి తీస్తారు. అంతకు ముందు తెలిసిన నూనెలన్నీ అంతే. ఎందుకోగానీ ఆముదాన్ని నూనె అనలేదు. అది వేరే కథ గానీ, కెరోసీన్ తెచ్చుకొని మా ఊళ్లో ఒకతను ఆముదం దీపం పద్ధతిలో మట్టి మూకుడులో పోసి వత్తి వేసి వెలిగించాడట. వత్తి ఒకటే కాదు, మొత్తం దీపమంతా వెలగడం మొదలయింది. గ్యాసు నూనె బుడ్డీ దీపాలు వడిన వాండ్లకు ఈ సంగతి తెలుస్తుంది. పాపం ఆ మనిషి పెట్టిన మంటతో పూరి గుడిసె అంటుకున్నది. తాగి ఉన్నాడేమో ఆర్పడం గురించి కూడా ఆలోచన రాలేదు. ఇంట్లోని డప్పు తెచ్చుకుని దరువు వాయిస్తూ ఆ మనిషి ఇంటి ముందు నాట్యం చేశాడట. నాన్న ఈ సంగతి నవ్వకుండా చెప్పేవాడు.

Wednesday, October 9, 2013

మనిషి తీరు

మనిషి తీరే అంత
చేయలేని పనులను చేస్తూ, పడుతూ లేస్తూ
అసాధ్యమయిన పనులను అలవోకగా సాధిస్తూ
ఆలోచనలకు అందని దూరాలకూ, తీరాలకూ చేరుకోవడం

నక్షత్రాల మధ్యన పుట్టిన మనిషి
నక్షత్రమయ్యే దాకా నలిగి పోతుంటాడు
నక్షత్రాలను తాకుతాడు, వాటితో ఆడుకుంటాడు
కలలు కంటాడు, కల్లలు కంటాడు

తోకచుక్కల మీద ఎక్కి గెలాక్సీలు దాటుతుంటాడు
అంతా చూడాలని, అంతా తెలుసుకోవాలని తపన
అనంతమయిన ప్రశ్నలకు ఆన్సర్ వెతకాలని తపన
అందినా అందకున్నా అసంతృప్తి మిగిలే ఉండాలి

అగాధాలను, అత్యున్నత శిఖరాలను
స్థల కాలాలలోని వంపులను
తెలియని సంగతుల సొంపులను
కళ్ల ముందు చూడగలగాలన్నది ఒకటే గమ్యం
అది ఒక మంట
ఆలోచనల గురించిన మంట
మనసులో మంట

మనిషి తీరు అంతే
(పై బొమ్మ చాలా పెద్దది. వాల్ పేపర్ గా పనికి వస్తుంది. సేవ్ చేసి వాడుకోండి)

Friday, August 23, 2013

సి సి ఎమ్ బి - ప్రారంభం - లోకాభిరామమ్

సైన్స్ అందించిన అందమయిన మత్తులో హాయిగా గడుస్తున్న దినం కాదిది. ఆ రోజు గడిచింది. ఇది మరుసటి రోజు. అవగాహనకు అందని అంశాలను, అనర్థాలకు దారి తీస్తున్న అంశాలను, మరింత సులభంగా పరిశీలించడానికి, ఇప్పటి వరకూ వచ్చిన సైన్సు, కొత్త వెసులుబాటు మాత్రమేనని, అందరికీ అర్థమైంది, అంటాడు ఆల్డస్ హగ్జ్‌లే

* సైన్సుకు స్వంతంగా విలువలు ఉండవు. విలువలు మనుషులకుంటాయి. సైంటిస్టులు మనుషులు. సైన్సును వాడుకునే వాళ్లు మనుషులు.


సైన్సు పండుగ
* ‘పుష్పా! ఈ సదస్సులో నేను పాల్గొనడానికి పద్ధతేమిటి?’ ఇంచుమించు ఈ అర్థం వచ్చే ప్రశ్న ఏదో అడిగాను. ‘అదేమిటి? నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను’ అన్నాడు పుష్పా. అవును పుష్ప అమ్మాయి కాదు. పుష్పమిత్ర భార్గవ అనే పి.ఎమ్.భార్గవ. జంటనగరాల్లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ’ అనే గొప్ప సంస్థను ప్రారంభించిన డైరెక్టర్ ఆయన. ఆ సంస్థ అప్పటివరకు ఆర్‌ఆర్ ల్యాబ్‌లోనే భాగంగా ఉండేది. స్వంత భవనాలు, మిగతా సౌకర్యాలు వచ్చిన తరువాత, ప్రారంభోత్సవానికి ప్రపంచంలోని గొప్ప శాస్తవ్రేత్తలను చాలామందిని పోగేసి రెండు వారాల పాటు సదస్సులు నిర్వహించారు. నేను అడిగింది, ఆ సదస్సులో పాల్గొనడం గురించే. నేను మాలిక్యులర్ బయాలజీ చదువుకున్నాను. పిహెచ్‌డి కూడా చేశాను. కానీ సదస్సుల నాటికి కేవలం సైన్సు జర్నలిస్టును! సైంటిస్టును కాదు! సదస్సుల వివరాలను, పాల్గొంటున్న వారి వివరాలను కలిపి ఒక పెద్ద పుస్తకం వేశారు. దేశ విదేశాలలోని వారెంతోమంది, పాల్గొనడానికి అప్లికేషన్స్ పంపారు. వారిలోంచి ఎంపికయిన వారు రెండు మూడు వర్గాలతో సెలెక్టెడ్ పార్టిసిపెంట్స్. ‘చాలా ముఖ్యమయిన వ్యక్తులు’ మాత్రం ఆహ్వానాలు అందుకుని వచ్చారు. పెద్ద సంస్థల డైరెక్టర్లు, ప్రభుత్వంలో సెక్రటరీల లాంటి వారితో సమానంగా, ఆ లిస్టులో నా పేరుఉంది. అప్పట్లో దేశంలో ఉండిన రెండు సైన్సు పత్రికల ఎడిటర్లు కూడా వచ్చారు. ఆరుగురు నోబెల్ బహుమతి గ్రహీతలు వచ్చారు. డిఎన్‌ఏ నిర్మాణం కనుగొన్న ఫ్రాన్సిస్ క్రిక్, టెస్ట్‌ట్యూబ్ బేబీలను ప్రారంభించిన ఎడ్వర్డ్స్ లాంటివారు అక్కడ ఉన్నారు. కానీ, సమావేశంలో మొదటి ఉపన్యాసం ఎఫ్రాయిమ్ కచాల్‌స్కీ అనే పరిశోధకుడు సమర్పించారు. దీన్ని ప్రోటోకాల్ అంటారు. అంటే మర్యాదలు పాటించడమని అర్థం!

ఎఫ్రాయిమ్ కచాల్‌స్కీ అనే ఆ భారీ మనిషి, ఇజ్రాయెల్ దేశానికి అధ్యక్షుడు, మన భాషలో రాష్టప్రతిగా పనిచేశాడు. ఆ దేశంలో గొప్ప సైంటిస్టులను, పండితులను ప్రెసిడెంట్ చేసే సంప్రదాయం ఉంది. ఒకప్పుడు, ఐన్‌స్టయిన్‌ను అడిగారు. కానీ ఆయన ఒప్పుకోలేదు. బహుశః ఆ మార్గంలోనే మన దేశంలో అవ్వల్ ఫకీర్ జైనులాబుదీన్ అబ్దుల్ కలామ్‌గారు అధ్యక్షులయ్యారు. కచాల్‌స్కీ పేరున్న జన్యుశాస్తవ్రేత్త. మంచి ప్రసంగం చేసినట్టు గుర్తుంది. వివరాలు గుర్తుకు రావడంలేదు. మొత్తానికి ఆయన మృదుభాషి. స్నేహశీలి. అంతకు ముందు నా పరిశోధన పత్రమొకటి, ఇజ్రాయెల్‌లో జరిగిన కాన్ఫరెన్సులో అంగీకరించబడింది. కానీ మన దేశానికీ, ఆ దేశానికీ సంబంధాలు సరిగా ఉండనందుకు నేను వెళ్లలేకపోయాను. ఒక మధ్యాహ్నం కచాల్‌స్కీ గారితో చాలాసేపు కబుర్లు గడిచాయి. ఒక ఇంటర్వ్యూ రికార్డు చేశాను. అంతా ముగిసి బయటకు వచ్చిన తర్వాత ఆయనను అనుక్షణం ఇంటిలిజెన్సు వారు పహరా కాస్తున్నారన్న సంగతి అర్థమైంది. ఒకాయన వచ్చి, నా రికార్డర్ లాక్కున్నాడు. ఆయనతో ఏం మాట్లాడావని గట్టిగా అడిగాడు. ‘నేను సైన్సు మాట్లాడాను. కావాలంటే, ఆ కాసెట్ పట్టుకుపో అన్నాను. అతను ఊరుకున్నాడు. మిగతా పాత్రికేయులను ఆయన దరిదాపులకు పోనివ్వలేదట! ఆ దేశంనుంచి మైకేల్ సేలా అని మరో గొప్ప ప్లాంట్ జెనెటిసిస్ట్ వచ్చాడు. ఆయనతో మాట్లాడితే ఎవరూ పట్టించుకోలేదు.


జెనెటిక్స్‌ను ఎంతో ప్రేమగా చదువుకున్న నాకు ‘ఫ్రాన్సిస్ హారీ క్రాంప్టన్ క్రిక్’ మరీ గొప్పవాడుగా కనిపించాడు. నాకు కొంతమంది పట్ల మరీ ఆరాధనా భావం ఉంటుంది. అవకాశం ఉన్నా వారికి మరీ దగ్గరగా పోవడానికి మనసు ఒప్పుకోదు. క్రిక్‌తో గుంపులో మాట్లాడడమే కానీ ఒంటరిగా కబుర్లు చెప్పే సాహసం చేయలేదు అందుకనే.
కార్ల్‌టన్ గాజుసేక్ అని మరో నోబెల్ లారేట్ వచ్చారు. ఆయన విశృంఖల భావాలు గల మనిషిగా పేరున్న వ్యక్తి. కొండజాతుల వారు, జెనెటిక్స్‌లో వారి పద్ధతుల పాత్రల గురించి గొప్ప పరిశోధనలు చేసినా, ఎందుకో అందరూ ఆయనను చూచి జంకుతారనిపించింది. నేను మాత్రం ఆయనను టైం అడిగాను. ‘నీవేమీ రికార్డు చేయనంటే ఎంతసేపయినా మాట్లాడవచ్చు!’ అన్నాడాయన. మేమిద్దరం గంటకన్నా ఎక్కువసేపు ఎన్నో సంగతులు మాట్లాడుకున్నాము. స్ర్తి పురుష సంబంధాల గురించి, ఆయనకు, కొండ జాతుల వారిలాగే, కొన్ని విచిత్రమైన అభిప్రాయాలున్నాయని అర్థమైంది. అది తప్పుకాదేమోననిపించేలాగ మాట్లాడారాయన. మేమంత సేపు మాట్లాడడం ఆశ్చర్యంగా కనిపించింది లాగుంది. సిసిఎంబీ వారి అఫీషియల్ ఫోటోగ్రాఫర్ మా ఫోటో తీసి మరునాడు ఉదయానికి నోటీసు బోర్డులో పెట్టాడు. నేను కాపీ తీసుకున్నాను. నేను రాసిన మరో వ్యాసంతోపాటు, అది ఒక దినపత్రికలో అచ్చయింది. కానీ, అదిప్పుడు నా దగ్గర మాత్రం లేదు.


జెర్మనీనుంచి వచ్చిన మరో నోబెల్ బహుమతి గ్రహీత యువకుడు. అతను బంజారా హోటేల్‌నుంచి సైకిల్‌మీద తార్నాక రావడానికి ప్రయత్నించాడు. మన మ్యాపుల కారణంగా, ఊరంతా తిరిగి తిరిగి చివరికి రానేవచ్చాడు. అప్పట్లో అదొక సంచలన వార్త! సైంటిస్టులు, పరిశోధకులు కూడా మనుషులే అనడానికి మరెన్నో ఉదాహరణలను ఈ సదస్సు సందర్భంగా నేను చూడగలిగాను.


ఇంగ్లండ్‌నుంచి ఎడ్విన్‌డాస్ దంపతులు వచ్చారు. డాస్ గారిని ఎడ్డీ అని పిలుస్తున్నారందరూ. ఆయన ‘అయామ్ ఎడ్డీ!’ అని పరిచయం చేసుకుంటున్నాడు. కరిగే ప్లాస్టిక్‌లను కనుగొని వాటి గురించి మరింత కృషి చేస్తున్న గొప్ప పరిశోధకుడాయన. వింత ఏమిటంటే, ఆయనకు ఇంద్రజాలికుడు అంటే మెజీషియన్‌గా కూడా ప్రపంచమంతటా మంచి పేరుంది! మాజిక్ అంతా సైన్స్ అనడానికి ఆయన నిలువెత్తు ఉదాహరణ. ఒకనాటి సాయంత్రం, సతీమణి సాయంతో ఆయన చక్కని ప్రదర్శన చేశారు. అందరికీ ఆయనంటే వున్న గౌరవం నాలుగింతలైంది. ఈ సందర్భంగా సీసీఎంబీ ఆస్థాన మెజీషియన్, మ్యుజీషియన్ మధుసూదన్ వామన్ పండిత్ గురించి చెప్పకపోతే అన్యాయమే అవుతుంది. పరిశోధకుడు పండిత్ మంచి మెజీషియన్. అంతకన్నా హార్మోనియం మీద హిందుస్తానీ సంగీతంలో దిట్ట. దేశంలోని ప్రసిద్ధ గాయకులెందరితో బాటు సహకార వాద్యం వాయించాడు. పండిత్ ఆ తర్వాత మంచి మిత్రుడయ్యాడు.


గొప్ప పరిశోధకులంతా వేరు దేశాల వారే అనుకుంటున్న నాకు, పెట్రోలును తినే సూక్ష్మ జీవులను కనుగొన్న ఆనంద చక్రబర్తి, ఎయిడ్స్ పరిశోధకుడు శార్ఞరవన్ (ఈ పేరును అచ్చువేయడం కుదరదేమో శారంగ రవన్ అనవచ్చు!) మరో టాటా (నిజంగా ఒక టాటా పరిశోధకుడున్నాడు!) కనిపించి, మిత్రులయి, భుజాలు పొంగేలా చేశారు. ఈ సదస్సుల సందర్భంగా కళలను గురించి ఒక సెషన్ జరిగింది. మన చిత్రకారులు పీవీ రెడ్డి, ఎమ్.ఎఫ్.హుస్సేన్, కవి విక్రంసేఠ్, ప్రసిద్ధ నిర్మాణ నిపుణుడు చార్ల్స్ కొరియా మరెందరో ఆ సెషన్‌లో పాల్గొన్నారు.
సమాపన కార్యక్రమంలో ప్రధాని రాజీవ్‌గాంధీ పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత మేమంతా భోజనాలకు బయలుదేరాము. ‘ప్రధాని మనతో భోజనం చేయనున్నారు. ఆయన కొరకు వేచి ఉండాలి!’ అని వార్త వచ్చింది. తాంక్స్‌గివింగ్‌డే, టర్కీ డిన్నర్‌లో రాజీవ్‌గాంధీ గారితో మాట్లాడే అవకాశం కూడా దొరికింది. ఆకర్షణగల అందగాడతను! ప్రధాన మంత్రి ఉండగా, ఫ్రాన్సిస్ క్రిక్ ‘జెనెటిక్స్ అంటే ఏమిటి?’ అని ఒక పాపులర్ ప్రసంగం చేశారు. నోబెల్ బహుమతి గ్రహీత, విషయాన్ని సులభంగా చెప్పిన తీరు అందరికీ నచ్చింది. సైన్స్ ఏజ్ అనే సైన్సు మాసపత్రిక సంపాదకుడు సురిందర్‌ఝా ఆ ప్రసంగ పాఠాన్ని పత్రికలో అచ్చు వేయాలనుకున్నాడు. రికార్డింగు కోసం భార్గవను అడిగాడు. సిసిఎంబీ వారు అన్ని ప్రసంగాలను రికార్డు చేశారు. క్రిక్ ఉపన్యాసాన్ని వదిలేశారు. భార్గవ, అంటే పుష్పా నన్ను అడిగాడు నేను రికార్డింగ్ ఇచ్చాను. ప్రసంగ పాఠం అచ్చయింది.


సంగీతోత్సవాలు, నాటకోత్సవాలు జరుగుతుంటాయి. సీసీఎంబీలో జరిగింది సైన్సు పండుగ. అంత ఎత్తున కాకున్నా, అడపా దడపా సైన్సు ఉత్సవాలు జరిగితే ప్రజలకు, సైన్సుకు మధ్యన ఉందనుకుంటున్న దూరం తగ్గుతుంది!

Tuesday, December 11, 2012

పరిణామం- బరువు

ప్రతి మనిషికీ స్వంత ఆలోచనలు, ఆశలుంటాయి. అందరి ఆలోచనలు ఒకే రకంగా ఉండవు. కొన్ని ఆలోచనలు మాత్రం ఒక వర్గానికి, ప్రాంతానికి, దేశానికి గుర్తింపుగా నిలుస్తాయి. నాది అన్న భావన ఆలోచనతో ముగియదు. వస్తువులతో మొదలయి అది విస్తరిస్తూ పోతుంది.

మనుషుల తీరు ఇట్లాగే ఎందుకుంది? ఈ స్థితి ఎక్కడికి దారితీస్తుంది? మానవ జాతి గురించి, పరిణామం గురించి పరిశీలించేవారు చెప్పే సమాధానం, సంతృప్తికన్నా ఆశ్చర్యాన్ని ఎక్కువగా కలిగిస్తుంది. మనిషి జాతి పుట్టి లక్షల సంవత్సరాలయింది. అందులో 99 శాతం సమయంలో నాగరికత తెలియకుండానే గడిచింది. మనుషులు గూడు లేకుండా బతుకుతూ తిండి వెతుకుతున్నారని అర్థం. ఈ గతం మనకు తెలియకుండానే మనలను వెంటాడుతున్నది. అవునా, అని ఆశ్చర్యపడవలసినంత సత్యమిది. రక్షణ లేకుండా, తిండికి గ్యారంటీ లేకుండా బతికినందుకు, మనిషికి, ముఖ్యంగా రెండు లక్షణాలు అలవడినయి. మొదటిది రెండు కాళ్లమీద నడక. రెండవది మెదడు సైజులో పెరుగుదల. ఈ లక్షణాలు ఎప్పుడు ఎందుకు వచ్చాయని ఆలోచిస్తే అసలు సంగతి మన ముందుకు వస్తుంది. రెండు కాళ్లమీద నడిచినందుకు ప్రస్తుత ప్రపంచంలో మనకు ఒరిగింది వెన్నునొప్పి తప్ప మరో లాభం లేదు! ఇక మెదడు పెరిగినందుకు వచ్చిన కష్టాలు ఇన్ని అని చెప్పడానికి లేదు. ఆలోచన పెరిగింది. అసలు ఈ బతుకు ఎందుకు? లాంటి ప్రశ్నలు కూడా పుట్టాయి, పుడుతున్నాయి. కాలక్రమంలో మనిషి పరిణామాన్ని ఒక గీతగా భావిస్తే, ఈ లక్షణాలు, గీత మొదట్లో ఎప్పుడో పుట్టాయి. సహాయంగా నిలిచాయి. సందేహం లేదు. మనం మాత్రం గీత చివరల్లో ఉన్నాము. ఇప్పుడా లక్షణాలు మనకు సాయం చేస్తున్నాయి, చేయడంలేదు!

మనం మన బతుకును ప్రపంచాన్ని చాలా మార్చుకున్నాము. నిజానికి మన శరీరం, మెదడు తీరు ఇప్పటి ప్రపంచానికి అనువుగా పెరిగినవి, మారినవి కావు. తిండికోసం మనం పనిచేస్తున్నాము. కానీ, నిజంగా పరుగులు పెట్టి జంతువును తరమడం లేదు. కాయలు, పండ్లు వెతకడం లేదు. ‘పండించిన’ తిండిని ‘వండుకుని’ తింటున్నాము. ఆ వంటయినా అందరూ చేయడంలేదు. కూచుని, తింటూ కాలం గడిపేవారు ఎక్కువగా ఉన్నారు. అందరూ కలిసి గుంపులుగానే బతుకుతూ ఉన్నాం. కానీ, ఎవరితోనూ కలిసి గడపటానికి సమయం లేదు. మాటలు నేరుగా జరగవు. మనుషులు నేరుగా కనిపించరు. అంటే మొత్తానికి మన శరీరం, మనసు ఒక రకంగా ఉంటే, మన ప్రపంచం మరో రకంగా ఉందని అర్థమయింది. కానీ, ఆలోచన మనిషిని, అనుకూలం గాని పరిస్థితులలో ఉండనివ్వదు.


పరిణామం, అంటేనే మార్పు. నాగరికత తెలియక బతికిన మనిషికి, అనువయిన రకం లక్షణాలు, చిటికెవేస్తే రాలేదు. ప్రస్తుతం మన బతుకు తీరుకు, అనుకూలంగా ఉండే లక్షణాలు కూడా అంత సులభంగా రావు. పరిణామం బరువును మానవజాతి మొత్తం మోస్తున్నది. కనుకనే, ఆ బరువుతో సహా మరింత వేగంగా, తెలివిగా ముందుకుసాగే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పాత మనిషి బుర్రను తిండి సంపాదించడం కొరకుమాత్రమే వాడలేదు. కనుకనే, మనం ఇవాళ ఇప్పటి పరిస్థితిలో ఉన్నాము. కానీ, మొత్తం పరిణామ చరిత్రని చిత్రంగా గీస్తే, అందులో ఈ పద్ధతి ఒక మూలన కూడ కనబడనంత చిన్నది. మంచికో, చెడుకో మనిషికి ‘సైన్సు’ అనే ఆలోచన కలిగింది. సమస్యలతో పోరాడడం ఒకటే కాదు ప్రస్తుతం మనిషికి వాటికున్న సమాధానాలను వెతకడం అలవాటయింది. ఉన్న తీరు కన్నా మరింత బాగా బతకాలన్న కోరికతో మనిషి చేస్తున్న ప్రయత్నాలు పరిణామం సాగే పద్ధతిని మారుస్తున్నాయి.


మనుగడ కొరకు సాగే సమరంలో నెగ్గిన లక్షణాలు గెలుస్తాయి. జాతులు నిలుస్తాయి ఇదే కదా డార్విన్ మహాశయుడు చెప్పిన పరిణామ క్రమంలోని సూత్రం! మైదానాల్లో ఎన్నో రకాల జంతువులు, అందులో కొన్ని మనలాంటివి కూడా ఉండేవి. వాటిలోనుంచి మనుషులం మాత్రం ఇంత దూరం రాగలిగాం. అడవుల్లో బతుకు వేరు, మైదానంలో తీరు వేరు. మైదానంలో ఎండలు ఎక్కువ, తిండినిచ్చే చెట్లు తక్కువ. అందుకే మన ఒంటిమీది వెంట్రుకలు పోయినయి. పంటి వరుసలో మార్పులు వచ్చినయి. శరీరానికి తిండిని దాచుకునే శక్తి అలవాటయింది. ఇప్పుడేమో అనవసరంగా తినడం అలవాటయింది. కనుకనే చక్కెర వ్యాధి మొదలయ్యింది. ప్రపంచమంతా ఒకటయింది నిజమే కానీ, తుమ్మితేచాలు, వైరసు, ప్రపంచమంతా వ్యాపించే వీలు కూడా మొదలయింది. ఇలాంటి బరువులు, మానవ జాతి బతుకు నిండా వేలాడుతున్నాయి. ప్రకృతిని కాదని, మరింత ముందుకు, మరింత ఎత్తుకు, లోతులకుపోవడం మనిషికి మొదటి స్వభావంగా మారింది, ఈ బరువు కారణంగానే. ఈ నడకకు, ప్రగతిని అసలయిన సాయం అందింది, ఒక్క సైన్సు నుంచి మాత్రమే. ఏం జరుగుతున్నా, ఎందుకు జరుగుతున్నదో తెలుసుకోవడం మనకు తెలిసింది. ఈ సైన్సు ఆధారంగా మానవుడు, ప్రపంచాన్ని తనకు అనుకూలంగా మారుస్తూ ముందుకు వెళ్లిపోతున్నాడు. మొదట్లో మొక్కలను, పశువులను తమ అదుపులోకి తెచ్చుకున్నవారు మనకు ఆదర్శప్రాయులు. దాంతో తిండి, పంట, రక్షణలు మనిషికి వీలయినయి. కానీ, బాగున్నాయనుకున్న ఆలోచనలు ప్రస్తుతం మనకు శత్రువులుగా నిలిచి భయపెడుతున్నాయి. సైన్సులో విచిత్రం ఇక్కడే ఉంది. ఇక్కడ ఏదీ శాశ్వత సత్యం కాదు. మనం అనుకుంటున్న ప్రతి అంశాన్నీ, ప్రశ్నించమంటుంది సైన్సు.


ఆ అంశం సైన్సులోనుంచి పుట్టిందయినా చర్చకు లొంగనిది కాకూడదు. కాదు. సైన్సు, మనలను నిలదీసి, ‘నీవెవరు?’ అని అడుగుతుంది. పరిశోధనలు, వాటి ఆధారంగా జరిగిన మార్పుల ఆధారంగా, మనిషి బతుకు తీరు మారింది. సగటు వయస్సు, ఎత్తు, తెలివి అన్నీ పెరుగుతున్నాయి. రికార్డులు పడిపోతూనే ఉన్నాయంటే, అది సైన్సువల్ల గానీ, మనిషివల్ల గాదు. సైన్సు మన తీరును మార్చింది. కానీ, పరిణామం బరువు మిగిలే ఉంది. ఎక్కువ కాలం బతికినందుకు లాభమా? నష్టమా చెప్పలేము. చావక తప్పదు, అది మారొక సత్యం! ఎవరో ఒకరు ఎత్తులు ఎగిరితే, వేగంగా పరుగిడితే అది నిజంగా పరిణామం అనడానికి లేదు. సగటున అందరికీ ఆ శక్తి ఉండాలి. మనిషి ఎంత వేగంగా పరిగెత్తినందుకు, ఏం లాభం జరుగుతుంది? ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే, పక్కవాడికన్నా వేగంగా పరుగెత్తితే చాలు!


ప్రశ్నలు అడగడం కొనసాగితే, సైన్సు కొనసాగుతుంది. ప్రగతి కొనసాగుతుంది. పరిణామం బరువు తరగడం కూడా వీలవుతుంది. పరిణామం ప్రకారం మనిషికి పరిధులు ఏవయినా ఏర్పడి వుంటే, వాటిని ప్రశ్నించడానికి, ఎదిరించడానికి, అధిగమించడానికి, మనకు ఒక సాయం సిద్ధంగా ఉంది. అదే- సైన్సు!

Thursday, November 29, 2012

పిట్టల గురించి పట్టదా?

‘ఇంత ఛిన్న పిట్టవు. ప్రపంచానికి పట్టవు’-అని అరుణగారు తమ కవితలో పిట్టల గురించి పట్టించుకున్నారు. పిట్టలు, వాటి గూళ్లు నేడు కనబడడం లేదు. పట్నాలలో పావురాలు కూడా తరిగిపోతున్నాయి. పిట్ట కనబడితే పండగ చేసుకోవచ్చు! పిట్టను ఊరపిచ్చుక అని కూడా అంటారు. జంతు శాస్త్రం ప్రకారం దాని పేరు పిట్టా సటైవా. ఇందులోని పిట్ట అనే మాట, అసలయిన మన తెలుగుమాట. సటైవా అంటే మనుషుల మధ్యన, ఇండ్ల మధ్యన, ఇండ్లలో ఉంటుందని అర్థం. మరేమయింది ఈ పిట్ట? పిట్ట గూడు కట్టే పద్ధతి మనిషికి చేతగాదు. అంత సౌకర్యంగా, సురక్షితంగా, అందంగా ఇల్లుకట్టుకోవడం పిట్టకే చేతనయింది. అంత చిన్న పిట్టకు తనకన్నా ఎంతో పెద్ద గూడు కట్టడమంటే కొన్ని రోజులపాటు కొనసాగే కార్యక్రమం. నగరాలలో కాదు, పల్లెల్లో కూడా పిచుకలు లేవిప్పుడు. అందుకు కారణాలు వెదుకుతూ జూలియా అనే షెఫీల్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకురాలు పట్నాలు వదిలి కనీసం రోడ్లు కూడా లేని పల్లె ప్రాంతాలకు వెళ్లిపోయారు. గడచిన దశాబ్దాలలో మన మధ్య నుంచి పిట్టలు పారిపోవడానికి, తరిగిపోవడానికి గల కారణాలు, ఆమెకు అక్కడ అర్థమయినయి.

అరుదయిన జంతువులను గురించి పరిశోధించాలనుకునేవారు సాధారణంగా తమ కృషిని కొనసాగించడానికి దీవులను ఎంచుకుంటారు. అక్కడయితే జంతువులు అక్కడే ఉండిపోతాయి. దీవి ప్రకృతి సిద్ధమయిన పరిశోధనశాలగా మారి పరిశీలనలు సులభంగా సాగేందుకు సాయం చేస్తుంది. పిచుకలకు మనం చేసే గోల సహించడం వీలుగావడం లేదని కొంతవరకు గమనించారు. జూలియా ప్రోడర్ ఈ సిద్ధాంతాన్ని మరింత పరిశీలించడానికి ఇంగ్లండ్ తీరంలోని లుండీ అనే పల్లె ప్రాంతానికి చేరుకున్నారు. కానీ, అక్కడ ఆమెకు ఆశ్చర్యం ఎదురయింది. దీవి అంతా ప్రశాంతంగా ఉంది. ఒక చోట మాత్రం పొలంలో కట్టుకునే గుడిసెలాంటి బార్న్ ఉంది. అక్కడ ఉండే జెనరేటర్ అదేపనిగా చప్పుడు చేస్తున్నది. అయినా పిట్టలు ఆ బార్న్‌లోకి వస్తున్నాయి. గుడ్లు కూడా పెడుతున్నాయి. గుడ్లనుంచి పుట్టే పిల్లలపైన గోల ప్రభావం గురించి అక్కడ పరిశీలన సాగింది. గోల లేని చోట, ఉన్న చోట పిల్లల సంఖ్యలో పెద్ద తేడా లేదు. కానీ ఉన్న తేడాలో ఏవో అర్థాలు తోచాయి.

గోలగా ఉండే చోట పిల్లలకు, తల్లి పిట్టకూ మధ్యన సమాచార వినిమయం తక్కువగా ఉంటుంది. అందుకని తల్లి తన పిల్లలకు సరిగా తిండి అందించదని గమనించారు. పిల్లలకు తలిదండ్రులు రావడం తెలియడం లేదు గనుక అవి అరవడం లేదా? లేక పెద్ద పిట్టలకు పిల్లల ధ్వనులు వినిపించడం లేదా? అన్న విషయంలో ఇంకా అనుమానాలు ఉన్నాయి. ఇంతకు ముందు కేట్ వినె్సంట్ లాంటి మరికొందరు పరిశోధకులు పిట్ట పిల్లల తిండి గురించి పరిశోధించారు.

పిట్టలు ముఖ్యంగా పురుగులను తింటాయి. పరిసరాలలో ఆ రకం తిండి, అంటే పురుగులు సరిగా అందకుంటే, పిట్ట పిల్లలు బతికి పెద్దవిగా పెరగడం కష్టమని గమనించారు. ఇక వాతావరణంలో నైట్రోజెన్ డై ఆక్సైడ్ ఎక్కువగా ఉన్నా పిల్లలు సరిగా పెరగవని తెలిసింది కూడా. అంటే ట్రాఫిక్ ఉండే రోడ్ల పక్కన పిట్టలు గూడు కట్టి పిల్లలను కంటే, అవి మిగతా చోట్లలో పిల్లలవలే బలంగా పెరగడం కుదరదని అర్థం. కనుక పిల్లలు పెరగకపోవడానికి కాలుష్యంతో బాటు, గోల కూడా కారణమవుతుందని ప్రస్తుతం పరిశోధనలతో అర్థమవుతున్నది.

మనుషుల మనుగడే కష్టంగా ఉంది గనుక, మన దగ్గర పిచ్చుకల గురించి పట్టించుకునేంత మంచితనం లేదు. సందర్భం వచ్చిందని పిట్టల బొమ్మలను నగరాలలో రోడ్లమీద నిలిపితే వాటికి రక్షణ దొరకదు. ప్రపంచమంతటా, అంతరించిపోతున్న జంతుజాతులను గుర్తిస్తున్నారు. వాటిని రక్షించాలని మాట్లాడుతున్నారు. వరిపొలాల్లో కనిపించే నత్తలు, అంతటా కనిపించే కప్పలు, పిచుకలు వెతికినా కనిపించని కాలం వచ్చింది. ఇంగ్లండ్‌లో కూడా పిచుకలను రెడ్ లిస్టులో చేర్చారు. కానీ, అక్కడ ఇంకా కావలసినన్ని పిట్టలున్నాయని లెక్క చెపుతున్నారు. సుమారు అరవయి లక్షల జతల పిచుకలున్నాయని వారు లెక్క చెపుతున్నారు కూడా!

మనిషికి, ప్రకృతికి మధ్యన వారధిగా ఊరపిచ్చుకలను గురించి చెప్పుకునేవారు. మనకు అన్నింటికన్నా ఎక్కువగా, తరచుగా కనిపించే పక్షులలో అవే మొదటివిగా ఉండేవి. ఒక్కసారిగా 15-20 సంవత్సరాల కాలంలో పిట్టల సంఖ్య తొంభై శాతం వరకు తగ్గిపోయిందంటే ఆశ్చర్యం. ఆ తరుగుదల మొదలయినప్పుడే బ్రిటన్ లాంటి చోట్ల పరిశోధకులు, పరిస్థితిని గుర్తించారు. మనం ఆ అవకాశాన్ని వదులుకున్నట్టు తోస్తుంది. ఒకప్పుడు నగరాలలో పావురాల సంఖ్య మరీ ఎక్కువగా ఉంటూ కొంత సమస్యకు కారణమయేది. ఈ మధ్యన వాటి సంఖ్య కూడా వేగంగా తరిగిపోతున్నది.
పిచ్చుకలు తగ్గడానికి కొన్ని కారణాలు ముందుగా కనబడతాయి. మనం ఇళ్లు కట్టుకునే తీరు మారింది. నేడు పూరిళ్లు పల్లెల్లో కూడా లేవు. మన ఇళ్లు, పరిసరాలు మరింత పరిశుభ్రం, ఆధునికం అయినయి. తోటలు కూడా మరీ మరీ శుభ్రంగా ఉంటున్నాయి. కనుక గతంలో వలే పిచుకలకు తలదాచుకునే చోటు లేదు. తిండి అంతకన్నా లేదు. పిచ్చుకలకు మనుషుల మధ్యనే పచ్చని ప్రాంతాలుండాలి. పొదలుండాలి, పురుగులు ఉండాలి. అవన్నీ మనకు అనాగరికంగా కనిపించే లక్షణాలుగా మారాయి.

నిజానికి మనుషులు ఎక్కువగా తిరగని, పాడుబడిన బంగళాలలో, అపరిశుభ్రంగా, ఎవరూ పట్టించుకోక వదిలిన పార్కులలో పిట్టలు కనబడుతున్నాయట. అక్కడ పిట్టలకు పుష్కలంగా పురుగులు దొరుకుతాయి. ఇళ్లు అందంగా, శుభ్రంగా కట్టుకోవడం అవసరమే కానీ పిట్టలుంటే చుట్టూ ఉండే పురుగులను తింటాయి. మన పరిసరాలు మరింత పరిశుభ్రంగా ఉంటాయి. కొంతమంది పిచుకలు ఉండడానికి అనువుగా గూళ్లను ఏర్పాటుచేస్తుంటారు.

అందులో వాటికి కొంత తిండి కూడా దొరికే ఏర్పాటు ఉంటే పిచుకలు తిరిగి వస్తాయి. ఎక్కడో ఒక మూల చెత్త చేరడం మామూలే. అందులో పురుగులు దొరుకుతాయి గనుక పిచుకలు మరింతగా పెరుగుతాయి. కానీ, నగరాలలో, పల్లెలలో కూడా గోల బాగా ఎక్కువయింది. మిగతా పరిస్థితులు అనుకూలంగా వున్నా, గోల కారణంగా పిచుకలు తరిగిపోతున్నాయి. గోల చేయకుండా బతకడం మనకు చేతనవుతుందన్న నమ్మకం పోయింది. ప్రశాంత వాతావరణం పక్షులకే కాదు, మనకు కూడా మంచిది! ఈ సంగతి అర్థమయితే.. పిట్టలను మనం పట్టించుకున్నట్టే!

Tuesday, October 30, 2012

సమయం కుదిరితే...

ఎవర్ని ఏ పని సాయం అడిగినా సమయం లేదంటారు. నిద్ర గురించి కూడా ఆలోచించకుండా, పనిచేసినా సమయం సరిపోవడం లేదు. ఇక సైన్సులోకి వెళ్లి అడిగితే- వాళ్లకు సమయం సమస్య మరో రకంగా ఎదురవుతుంది. రెండు రసాయన పరమాణువులు కలిసి ఒక అణువు పుట్టడానికి పట్టే సమయం ఒక పికో సెకండ్. అది నిజంగా ఎంత నిడివి ఉన్న మాట మనకు తోచదు. కన్ను రెప్పపాటు- మనకు తెలిసిన చిన్న కొలత. ఒక కొండ పుట్టడానికీ, రెండు గెలాక్సీలు కొట్టుకోవడానికి పట్టే సమయం ముందు మన కనురెప్ప పాటు అలాంటిదే. నిజానికి సైన్సు అనుకుంటున్న విషయాలు జరగడానికి పట్టే కాలం మనిషి జీవనకాలానికన్నా చాలా ఎక్కువ. పరిశోధకులు తరతరాలుగా ఒకే అంశం గురించి పరిశోధిస్తున్నారంటే ఆశ్చర్యం లేదు. 1920 ప్రాంతంలో మొదలయిన కొన్ని పరిశోధనలు అక్కడే, ఆ పరిశోధన శాలల్లోనే ఇంకా కొనసాగుతున్నాయి. ఆ ఆలోచన మొదలుపెట్టిన వారు పోయారు. చరిత్రలో ఒక అంశం గురించి మరీ చాలా కాలంపాటు సమాచారం సేకరించి పరిశీలించిన సందర్భానికి ఉదాహరణ బహుశః ఖగోళ శాస్త్రంలో ఉంది. ప్రాచీన నాగరికతలయిన బాబిలోన్ లాంటి చోట్ల మొదలయిన సమాచార సేకరణ ఇంకా సాగుతున్నది. సాంకేతిక శక్తి మారిందని, ఆ తరువాత వచ్చిన సమాచారాన్ని పాత పద్ధతి సమచారానికి కలపడానికి వీలు లేదన్నా సరే, కనీసం ఆరు వందల సంవత్సరాలపాటు పాత పద్ధతి సమాచార సేకరణ జరిగింది. గ్రహణాలు మొదలయిన సంగతులను గురించి మన దేశంలో, ఆసియా దేశాలలో కూడా ఈ రకమయిన సమాచార సేకరణ జరిగింది.

ఇప్పటికీ పరిశోధకులు కొన్ని ప్రయోగాలకు తమ జీవితకాలం సరిపోదు అంటారు. నిజంగా సమయం సమస్య కాకుండా ఉంటే, ఏ రకం పరిశోధనలు వీలవుతాయని వారిని ప్రశ్నించారు. మీరే వెయ్యి, పదివేల సంవత్సరాలు ఉండగలిగితే, ఏ రకం ప్రయోగాలు చేస్తారని ప్రశ్న. జవాబు రావడానికి ఒక చిక్కు ఎదురవుతుంది. అంతకాలం గడిచేలోగా సాంకేతిక వనరులు, పద్ధతులు మారిపోతాయి. అవి మారకనే ఇప్పటి సదుపాయాలతో, ఎక్కువ కాలం జరగవలసిన పరిశోధనలు ఎన్నో ఉన్నాయని తెలిసింది.

* జీవం పుట్టుక: మిల్లర్, ఉరే అనే పరిశోధకులు 1950 దశకంలో జీవం పుట్టుక గురించి ఒక సిద్ధాంతం చేశారు. పరిస్థితులు అనుకూలంగా ఉంటే జీవం పుట్టుకకు అవసరమయిన అమైనో ఆమ్లాల వంటి రసాయనాలు వాటంతటవే పుడతాయన్నారు. ఈ రకం రసాయనాలు అంతరిక్షం నుంచి వచ్చాయన్నవారు కూడా ఉన్నారు. వాటంతటవే పుట్టడం గురించి పరిశోధించాలంటే తగిన పరిస్థితులు కల్పించి, తగిన రసాయనాలను చేర్చి, తేలికగా వాటిని పరిశీలించాలి. అది అనుకున్నంత సులభం కాదు. పదివేల సంవత్సరాలు వేచి చూస్తే, నిజంగానే జీవ రసాయనాలు పుట్టవచ్చు. మొదట్లో జీవం పుట్టడానికి అంతకన్నా ఎక్కువ కాలమే పట్టి ఉండవచ్చు. తమంత తాము పుట్టి, తమ వంటి రసాయనాలను తయారుచేయగలగడం జీవ రహస్యమన్నది అర్థమయిన విషయమే.

భూమి, దాని మీద పరిస్థితులు, రసాయనాలు, గతంలో ఎప్పుడో ఉన్నప్పటి తీరుగా ఏర్పాటుచేయాలి. భూమి మీద అలనాటి పరిస్థితులలో లక్షల రకాల రసాయనాలు ఉండి ఉంటాయి. అవి అంతులేని రకాలుగా కలిసి, ఎన్నో ప్రయోగాలు జరిగి ఉంటాయి. ఆ రసాయనాలు తగినంతగా ఉంటే, అవి కలవడానికి వీలు కలుగుతుంది. తక్కువగా ఉంటే, అవి ఒక్క చోటికి రావడానికి మరింత కాలం కావాలి. జీవ రసాయనాలు రాళ్లమీద పుట్టినట్టు ఒక ఆలోచన ఉంది. అక్కడి తేమలో అంతులేని రసాయన చర్యలు జరిగి ఉంటాయి. వాటి సంఖ్య ఒకటి పక్కన ముప్ఫయి సున్నాలు వేసినంత- అని అంచనా ఉంది. ఆ కార్యక్రమం వందల మిలియనుల సంవత్సరాల పాటు సాగి ఉండవచ్చు.

ఇప్పుడు ఒక పరిశోధన, పరిశోధనశాల పదివేల సంవత్సరాలపాటు కొనసాగే వీలుంటే, జీవం పుట్టుక ప్రయోగాన్ని కొంతవరకయినా పరిశీలించవచ్చు. అప్పుడు జరిగిన రకం రసాయన ప్రయోగాలను ఇప్పుడు జరిపి చూడవచ్చు. వాటి సంఖ్య ఎంత ఎక్కువ ఉంటే, అంత త్వరగా, సంతృప్తికరంగా ఫలితాలు అందుతాయి. గదుల నిండా రకరకాల రసాయనాలు కలిసిన పాత్రలు, తగిన తేమ, ఒత్తిడి, వేడి లాంటి పరిస్థితులతోబాటు ఏర్పాటయి ఉంటాయి. ఇప్పుడు మనకు కంప్యూటర్ అందుబాటులో ఉంది గనుక పాత్రలు నిజంగా ఏ గాజు పాత్రలో కాక, కంప్యూటర్ చిప్స్ రూపంలో ఉంటాయి. తగిన పరిస్థితులు అక్కడ కలిగించడం, అవసరం కొద్దీ మార్చడం సులభమవుతుంది. వీటిని చిప్ పరిశోధనశాలలు అనవచ్చునేమో! వాటిలో ఎక్కడో ఏదో ఒక రసాయనం, తనలాంటి రసాయనాన్ని తయారుచేస్తే క్షణాల్లో తెలిసిపోతుంది.

సాంకేతిక పద్ధతులను వాడుతున్నాము గనుక పరిశోధనకు పట్టే సమయాన్ని కూడా తగ్గించే ప్రయత్నాలు జరుగుతాయి. ఎక్కడో ఒక రసాయన చర్య మనమనుకున్న రకంగా జరుగుతున్నాయని సూచన వస్తే, అక్కడి పరిస్థితులను మరింత అనుకూలంగా మార్చవచ్చు. ప్రయోగాలు సాగితే, అసలు ప్రకృతిలో రసాయనాలు కలిసి, రకరకాల మార్పులకు దారితీసే పద్ధతులు అర్థం కావచ్చు! ఇంతకూ ఈ పరిశోధన వీలవుందా? అవసరమా ?-అని అడిగితే మాత్రం జవాబు లేదు.
* భౌతిక ప్రపంచం, సిద్ధాంతాలు: జెరాల్డ్ గాబ్రియెన్స్ హార్వార్డ్ యూనివర్సిటీలో భౌతిక శాస్త్రంలో పరిశోధనలు చేస్తుంటారు. పదివేల సంవత్సరాలు దొరికితే తాము చేయగలిగిన పరిశోధన గురించి ఆయన చెప్పిన అంశాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి.
భౌతిక శాస్త్రంలో కొన్ని సిద్ధాంతాలు, నియమాలు శాశ్వతమయినవని అనుకుంటున్నాము. అన్ని ప్రొటానులకు ఒకే రకమైన ఛార్జ్ ఉందంటున్నారు. కాంతి ఎప్పుడయినా ఒకే వేగంతో కదులుతుందంటారు. ఇలాంటివే మరెన్నో విషయాలున్నాయి. వాస్తవంగా చూచి పరిశీలించినవారు కొందరు ఈ రకం సిద్ధాంతాలలో మార్పు ఉండే వీలుందంటున్నారు. అంతరిక్ష పరిశోధనలో ఇటువంటి మార్పులను గమనించామన్న వారు కూడా ఉన్నారు. వారిని అందరూ అంగీకరించకపోవడమన్నది మరో సంగతి. పరిశోధనలన్నీ ఈ సిద్ధాంతాల ఆధారంగానే నడుస్తున్నాయి. జెరాల్డ్ పరిశోధనశాలలో ఎలెక్ట్రానుకు గల అయస్కాంత శక్తిని కొలిచారు. ఈ రకం కణాల అసలు లక్షణాలను గురించి చేసిన పరిశోధనల్లో, వేసిన కొలతల్లో ఇంతకంటే కచ్చితమయినది మరొకటి లేదంటారు. ఈ పరిశీలనలను వేల సంవత్సరాలపాటు చేస్తూపోతే, కొలతలో మార్పు కనబడుతుందేమోనంటారు జెరాల్డ్.

ఒక్క ఎలక్ట్రాను అయస్కాంత శక్తిని కొలవడమే నిజంగా ఆశ్చర్యకరమయిన సంగతి. అది జరగాలంటే, విద్యుత్తు అయస్కాంత లక్షణాలు స్థిరంగా ఉండే పరిస్థితిలో ఎలక్ట్రాను ఒకే తలంలో కదిలే విధంగా ఏర్పాటుచేయాలి. అది వృత్తాకార మార్గంలో గుండ్రంగా తిరిగేట్లు చేయాలి. దాని శక్తి మరే కారణంగా పెరగడం లేదని స్థిరం చేసుకోవాలి. అట్లా తిరుగుతుండే కణాన్ని తిరగబడేలా బలాలను ఉపయోగించాలి. ఇన్ని జరిగిన తరువాత ఫలితం తెలుస్తుంది. దాని శక్తి- ఒకటి పక్కన పదమూడు సున్నాలు వేసిన కొలతలో మూడవ వంతులు మాత్రమేనని!

ఇదంతా ఎవరికి అర్థమవుతుందని, ఎందుకు ఉపయోగపడుతుందని అడిగితే లాభం లేదు. ప్రపంచంలో జరుగుతున్న సైన్సు మొత్తం, మనకు నేరుగా పనికివచ్చేకాలం పోయింది. కొంత సైన్సు- కేవలం సైన్సుకొరకు జరుగుతుంది. అసలు కాలానికి, ఈ కొలతకు సంబంధం ఏమిటని మనం అడగడానికి వీలుంది. ఈ కొలత వెయ్యి సంవత్సరాల కాలంలో, ఒక్క భాగం పెరగడమో, తరగడమో జరిగి ఉండవచ్చు గదా! అది తెలియాలంటే, ఈ కొలతలను సంవత్సరాలపాటు పరిశీలించాలి. సైన్సులో ఏదీ శాశ్వతం కాదు. మార్పు వేగం మరీ నెమ్మదిగా జరుగుతుంటే, ఆ సంగతి తెలిసే వరకు మాత్రమే సిద్ధాంతం నిలబడుతుంది. ఆ మార్పు పరిశోధనశాలలో కొన్ని సంవత్సరాల కాలంలో చూపడం, చూడడం కుదరదు. భౌతిక, రసాయనిక, జైవిక విషయాలలో మార్పులు, ఒకప్పుడు జరిగిన వేగం, ఇప్పుడు జరుగుతున్న వేగం ఒకేలాగ ఉండవు. అందుకే ప్రయోగాలు వేల సంవత్సరాలపాటు సాగితే సంగతి తెలుస్తుంది. సాంకేతిక నైపుణ్యం పెరిగినకొద్దీ ఫలితాలు తొందరగా తెలిసే అవకాశాలు కూడా ఉన్నాయి.
................................
ఇలాంటివే మరికొన్ని ఆలోచనలు
...................................
కోతులు రాను రాను మారి.. మానవులు వచ్చారని సిద్ధాంతం. వేల సంవత్సరాలుపాటు, రకరకాల కోతులను పెంచి వాటి తెలివి తేటలను, మిగతా పద్ధతులను పరిశీలిస్తే, మార్చగలిగితే ఏ రకం జీవులు వస్తాయని పరిశీలించాలంటారు- షికాగో యూనివర్సిటీ జెనెటిసిస్ట్ బ్రూస్ లాన్.

నక్షత్రాలు పేలిపోవడం గురించి పరిశీలించడానికి పదివేల సంవత్సరాల పథకంతో సిద్ధంగా ఉన్నారు మేరీలాండ్ పరిశోధకులు కోల్‌మిల్లర్. నక్షత్రాలు పేలడం, సూపర్ నోవాలు పుట్టడం అరుదయిన విషయం. మన గెలాక్సీలో సూపర్‌నోవా క్రీ.శ.1604లో పుట్టిందని కెప్లర్ గమనించాడు. ఇటీవలివన్నీ మరీ దూరంలో గల గెలాక్సీలలో పుట్టాయి. సమయం ఉంటే అక్కడ బ్లాక్‌హోల్స్ గురించి పరిశీలించవచ్చు.

మనిషి తినే తిండి మారుతుంది. మార్పుల కారణంగా డయాబెటిస్ వంటి వ్యాధులు మొదలవుతాయి. వేల సంవత్సరాలలో మన తిండి, ఆరోగ్యం మారే తీరును పరిశోధించాలి, అంటారు శారా టిస్క్ఫా.

త్వరలోనే ప్రపంచంలోని చమురు నిక్షేపాలు అడుగంటుతాయి. అయిపోతాయి. వాటి స్థానంలో మరో రసాయన ఇంధనం దొరికే వీలు లేదు. అంటే మనుషులు బతికే తీరు పూర్తిగా మారిపోతుంది. అప్పుడు మనిషి, గతంలోని ఆటవిక మానవునివలే మారి, వనరుల కోసం కీచులాడుకుంటాడా? ఇది లారెన్స్ స్మిత్ ప్రశ్న!

జీవులలో ఒక కొత్త జాతి (స్పీసీస్) పుట్టడానికి లక్ష సంవత్సరాలు పడుతుంది. ఇదిమనకు తెలిసిన కాలం తీరు కాదు. భౌగోళిక కాలం అని మరొకటి ఉంది. లక్ష సంవత్సరాలు ఒక పరిశీలన సాగించే వీలుంటే, జీవుల పరిణామాన్ని గమనించవచ్చునంటారు- జెర్రీ కోయిన్.

Monday, October 22, 2012

అనుకరణ - అనుసరణ


ఎవరయినా కంటికి ఫురుగులాగా కనబడుతున్నారంటే- అలుసయినట్లు కదా అర్థం!
పురుగులు బోలెడుంటాయి. ఊరికే చనిపోతాయి. అయినా బోలెడుంటాయి. ఈ ప్రపంచంలో అన్నింటికన్నా ఎక్కువ సంఖ్యలో ఉండే జీవులు కీటకాలే. అంతగా విజయవంతంగా బతుకున్నాయంటే, వాటి నిర్మాణంలో, బతుకు తీరులో ఎంతో పరిణతి, వైవిధ్యం ఉంటుందని అర్థం. హెలికాప్టర్‌ను చూస్తే తూనీగలాగా కనబడుతుంది. వెస్పా అనే స్కూటర్‌కు కందిరీగ పేరు  పెట్టారని అందరికీ తెలియకున్నా తప్పులేదు. పురుగులను, వాటి నిర్మాణాన్ని మనిషి అనుకరించి రకరకాల అవసరాలకు  వాడుతున్నాడు. ఒక్క పురుగులేగాక ఎన్నో జంతువులు, మొక్కలు మనిషి తెలివికి పదునుపెట్టాయి. ఆ పదును కారణంగా బయో మిమిక్రీ అనే రంగం పుట్టింది.

పరిణామక్రమంలో జంతు, వృక్షాలు మారుతూ మారుతూ బతుకు సుఖంగా సాగడానికి అనువయిన క్షణాలను పెంచుకున్నాయి. పక్షుల ముక్కులు, పురుగులు, పక్షి రెక్కలు మొదలు ఎన్నో లక్షణాలు మనిషి సాంకేతిక ప్రగతికి

ఆధారాలయినాయి. మార్క్ మైల్స్ అనే యువ పరిశోధకుడు మైక్రో ఎలెక్ట్రో మెకానికల్ అండ్ మెటీరియల్ ప్రాసెసింగ్ అనే రంగంలో పనిచేస్తున్నాడు. అదేమిటో అర్థం చేసుకోవడానికి మనకు సమయం పడుతుంది. పదార్థం నిర్మాణంలో సూక్ష్మ వివరాలు అనుకుని ముందుకుసాగుదాం. అతను పరిశోధన పత్రికలను సీరియస్‌గా చదువుతున్నాడు. సీతాకోకచిలుక రెక్కలు, వాటిలో రంగులను గురించిన వ్యాసం ఒకటి అతడిని ఆకర్షించింది. కొన్ని సీతాకోకచిలుకల రెక్కలు నీలం రంగుతో మెరిసిపోతుంటాయి. రంగులు ఎక్కడ కనిపించినా వాటికి ఆధారంగా కొన్ని రసాయనాలు ఉంటాయని అందరికీ తెలిసే ఉంటుంది. ఈ నీలం రంగు మాత్రం రసాయనంలో నుంచి రావడం లేదు. ఇక్కడ భౌతిక శాస్త్రం ఉంది. ఈ రకం రంగులు పదార్థం నిర్మాణం కారణంగా వస్తాయి. సీతాకోక చిలుక రెక్కలమీద చాలా చాలా చిన్న పలకలు అమర్చి ఉంటాయి. వాటి ఆకారం, వరుస, మధ్య దూరం అన్నీఒక పద్ధతిలో ఉంటాయి. వెలుగు వాటి మధ్యన ప్రతిఫలిస్తూ రంగులు కనబడడానికి కారణమవుతుంది. ఇక్కడ ఆ రంగు నీలంగా ఉంది! రసాయనం అంటే పిగ్మెంట్ ఆధారంగా ఈ రకం నీలం తళతళ పుట్టాలంటే ఎంతో శక్తి అవసరమవుతుంది. అరుదుగా దొరికే శక్తిని సీతాకోక చిలుక తన రంగుల ప్రదర్శనకు వాడటంలేదు. ఆ శక్తి ఎగరడానికి తిండి వెదకటానికీ, పిల్లలను కనడానికి పనికివస్తుంది. అందుకే అది రంగు కోసం ఫిజిక్సును పట్టుకుంది.

ఈ పద్ధతితో మనం కూడా రంగులను పుట్టించవచ్చునని మైల్స్‌కు ఆలోచన పుట్టింది. ఎలెక్ట్రానిక్స్ రంగంలో పలుచని పరికరాల్లో రంగులు అవసరమవుతాయి. మైల్స్ వెంటనే రంగు పరికరాలను తయారుచేసే కంపెనీ పెట్టాడు. త్వరలోనే క్వాల్‌కామ్ అనే కంపెనీవారు దాన్ని కొన్నారు. ‘మిరాసోల్ డిస్‌ప్లే’ అనే పరికరంలో రంగు పద్ధతిని వాడుకుంటున్నారు. ఆప్టికల్ ఇంటర్‌ఫీరెన్స్ అనే పద్ధతితో గాజుపలకల కింద, కదిలే చిన్న చిన్న అద్దాలను ఏర్పాటు చేస్తారు. అద్దాలు పదినుంచి యాభయి చదరపు మైక్రాన్లు మాత్రమే ఉంటాయి. అవి కిందకు, మీదకూ కదులుతూ మైక్రో సెకెండ్స్‌లో రకరకాల రంగులు కనిపించడానికి కారణమవుతాయి. సీతాకోకచిలుక రెక్కలలోని పలకలమీద ఏ రంగూ లేని కాంతి పడుతుంది. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఆ సూర్యకాంతి చూస్తుండగా రకరకాల రంగులను వెదజల్లుతుంది. మనకు తెలిసిన ఎల్‌సీడీ డిస్‌ప్లేలో కూడా రంగులు కనబడతాయి. ఈ రకం టెలివిజన్‌లు, మానిటర్‌లు మామూలయిని. కానీ, వీటిలో కరెంటు సాయంతో రంగు, వెలుగు పుట్టాలి. మిరాసోల్‌లో మాత్రం స్వంత వెలుగు లేదు. ఉన్నది సూర్యకాంతి మాత్రమే. బయట వెలుగు ఎంత బలంగా ఉంటే, అందులోని రంగులు కూడా అంతగా తళతలాడతాయి. ఎల్‌సీడీకి అయ్యే కరెంటు ఖర్చులో పదవ వంతుతో ఇక్కడ, ఇంకా మంచి రంగులు కనబడతాయి. ఈ పద్ధతినివాడి క్వాల్‌కామ్ వారు ఈ-రీడర్ (కిండిల్ లాంటి పుస్తకాలు చదివే పరికరం) తయారుచేశారు.


టెక్నాలజీని మిగతా వారికి అందజేస్తున్నారు కూడా. జీవుల శరీర నిర్మాణం ఆధారంగా పరికరాలు రావడం కొత్త మాత్రం కాదు. కొన్ని రకాల మొక్కల విత్తనాలు మన శరీరానికి, దుస్తులకు అంటుకుపోతుంటాయి.వాటిని తీయడానికి వేళ్ళతో ప్రయత్నిస్తే వేళ్లకు పట్టుకుంటాయి. వీటిలో వంకర తిరిగిన ముళ్లలాంటి భాగాలుంటాయని గమనించారు. వాటి ఆధారంగా 1955లోనే ‘వెల్‌క్రో’ పుట్టింది. సంచులు, దుస్తులు, షూస్‌లో బెల్టులు, జిప్‌ల బదులు చిరచిరలాడుతూ ఊడివచ్చి, అదిమితే మళ్లీ అతుక్కునే ‘వెల్‌క్రో’ అందరికీ తెలుసు. దాని వెనుక కథ మాత్రం తెలియదు. కొన్ని రకాల గడ్డి మొక్కలు గాలిలో కదిలే తీరునూ, నిటిలస్ అనే సముద్ర జంతువు శంఖం నిర్మాణాన్ని ఆధారంగా, పారిశ్రామిక పంఖాలను తయారచేశారు. ఒంటె తన ముక్కులో తేమను సేకరించుకునే తీరు ఆధారంగా, ఖతార్ దేశంలో ఒక గ్రీన్‌హౌస్‌ను పనిచేయిస్తున్నారు. పదార్థ నిర్మాణం మరీ చిన్నదయిన నానోస్కేల్‌కు చేరుతున్నది గనుక ఇప్పుడు మరెన్నో విచిత్రాలు రానున్నాయి.

బయో మిమిక్రీ అన్నది ఒక పదార్థం కాదు. అదొక పద్ధతి. మన దేశంలోనే కొండ ప్రాంతాలలో కడుతున్న ఒక ఆధునిక నగరంలో వర్షాలను ఆకర్షించే పద్ధతిలో ఆకురాలు చెట్లను నాటారు. అక్కడ వర్షం రాకపోవడమనే ప్రశ్న ఉండదంటున్నారు. మర్రి ఆకుల ఆదర్శంగా ఇంటి పైకప్పు మీద పెంకులను అమర్చి, వర్షం నీటిని సేకరించే ప్రయత్నం జరుగుతున్నది. చీమల పుట్టలు ఆదర్శంగా తడవని గోడలు కడుతున్నారు. లవాసా అనే ఈ నగరం 2020 నాటికి పూర్తి అవుతుంది. అది మూడులక్షల మందికి ఆశ్రయమిస్తుంది.


మనిషి కారణంగా వాతావరణం పాడవుతున్నదని అందరూ గుర్తించారు. ఆ రకం ప్రభావం తగ్గించాలన్న ఆలోచన మొదలయింది. ప్రకృతివల్ల పడే ప్రభావం మరొకరికి సాయంగా ఉంటుంది. మన నగరాలు కూడా ఆ రకంగా ఉండవచ్చునన్న ఆలోచన ఈ మధ్యన మొదలయింది. నగరాల్లో కురిసిన వర్షం, అక్కడి మురికి, చెత్తలను వెంట తీసుకునిపోయి, ఏదో ప్రవాహంలో కలుస్తుంది. ఆ నీరు మరింత పరిశుభ్రంగా, ప్రవాహంలో కలిస్తే బాగుంటుందన్న ఆలోచన, అందుకు తగిన ప్రయత్నాలు సాగుతున్నాయి.

అడవులు తగలబడుతుంటే పైన్ చెట్లు, యూకలిప్టస్ చెట్లు విచిత్రంగా తప్పించుకుంటాయి. యూకలిప్టస్ బెరడు ఊడి పడిపోయి బోదెను కాపాడుతుంది. ఈ పద్ధతి ఆధారంగా మంటకు తట్టుకునే గుడ్డను తయారుచేశారు. పీతలు, రొయ్యల శరీరంలోనుంచి ఒక రసాయనాన్ని గమనించి, అదే పద్ధతిలో మరో గుడ్డను తయారుచేశారు. ఇందులోని ఒక రసాయనం పొర మంటను అడ్డుకుంటుంది. పక్షులు, పురుగుల నుంచి నేర్చుకోవలసింది మరెంతో ఉందంటారు సైంటిస్టులు. సీతాకోకచిలుకల నుంచే మరెన్నో పాఠాలు అందుతున్నాయి. ఒక రకం సీతాకోకచిలుక రెక్కల మీద నల్లని మచ్చలుంటాయి. అవి సూర్యరశ్మిని బాగా పీల్చుకుంటాయి. వాటి నిర్మాణాన్ని గమనించి, అనుకరించి మరింత బాగా పనిచేసే సోలార్ టెక్నాలజీని సిద్ధం చేస్తున్నారు.

ప్రస్తుతం నకిలీ వస్తువులను తయారుచేసి మోసగించే ప్రయత్నాలకు సమాధానంగా, మంచి ఉత్పత్తుల మీద హోలోగ్రామ్‌లను పెడుతున్నారు. అదే రకమయిన హోలోగ్రామ్‌లను దొంగచాటుగా తయారుచేయడం కుదరదు. సీతాకోకచిలుకల రెక్కల నిర్మాణం ఆధారంగా, త్వరలోనే, హోలోగ్రామ్స్‌కన్నా మంచి పద్ధతి రానున్నదని చెపుతున్నారు. అందంగా దుస్తులు వేసుకున్న అమ్మాయిలను సీతాకోక చిలుకలు అనడం తెలుసు. ఇప్పుడు సిడ్నీలో ఒక ఫాషన్ డిజైనర్, రంగులులేని మార్ఫోటెక్స్ అనే గుడ్డను  తయారుచేయించాడు. అది వెలుగులో రకరకాల రంగులతో మెరుస్తుంది. ఇంతకంటే చక్కని మిమిక్రీ ఇంకేముంటుంది?

Thursday, September 13, 2012

మనిషి - దాయాదులు

మానవ పరిణామం గురించిన చర్చలో కో తుల ప్రసక్తి రావడం సహజం. ‘కోతులు, మన తాతల తాతలు’ అన్నమాట అందరికీ తెలిసిందే. మరి మన దాయాదులంతా ఏమయినట్టు? కోతి (ఏప్) జాతి నాలుగు భాగాలుగా విడిపోయింది.

హోమో (ఈ జీనస్‌లోనే మనుషులనే మనమూ ఉన్నాము): హోమో జాతిలోని మిగతా ఉపజాతులు లేదా ప్రజాతులు అన్నీ అంతరించిపోయినయి. శాపియెన్స్ అనే మనం మాత్రం మిగిలి ఉన్నాము. ఈ జాతి 24 లక్షల సంవత్సరాల నాడు మొదలయిందని అంచనా. హోమో శాపిమెన్స్ అనే ఆధునిక మానవజాతి మాత్రం రెండు లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో మొదలయిందని పరిశోధకులు లెక్కతేల్చారు. గ్రేట్ ఏప్స్ జాతిలో బాగా సంఖ్య పెరిగిన ఉపజాతి ఇది ఒక్కటే. ప్రపంచంలో వీరి సంఖ్య ఏడు బిలియన్లు దాటింది.


పాన్ (చింపాంచీలు, బూనోబోలు ఉండే జాతి లేదా జీనస్): గ్రేట్ ఏప్స్‌లో మానవుల జాతితో చాలా ఎక్కువ పోలికలు గల జాతి ఇది. చింపాంజీలు, మనుషుల జన్యు పదార్థం (డిఎన్‌ఎ)లో తొంభయి తొమ్మిదిశాతం ఒకే రకంగా ఉంటుందని 1973లోనే కనుగొన్నారు. ఈ జాతిలో చింపాంజీలు, బోనోబోలు అనే రెండు ఉపజాతులున్నాయి. అవి పది లక్షల సంవత్సరాల నాడు వేరు వేరు ఉప జాతులయ్యాయి. ప్రస్తుతం మాత్రం ఈ రెండు రకాలు కూడా అంతరించే దశకు చేరుకున్నాయి.


పోంగో (ఒరాంగుటాన్‌ల జాతి): గ్రేట్ ఏప్స్‌లోని ఒరాంగుటాన్స్ అనే జాతి ఒక్క ఆసియా ఖండంలో మాత్రమే ఉంది. ఇరవయి సంవత్సరాల కింద కూడా ఈ జంతువులన్నీ ఒకే జాతిగా లెక్కింపబడుతూ ఉండేవి. జన్యువుల పరిశీలన, సీక్వెన్సింగ్ తర్వాత ఒరాంగుటాన్‌లో రెండు ఉప జాతులు ఉన్నట్టు తెలిసింది. బోన్నియాలో ఉండే జాతి పోంగో పిగ్మేయియన్ ఒకటి. సుమత్రాలోని పోంగో ఎబెలియై మరొకటి.


గొరిల్లా (గొరిల్లాల జాతి): గొరిల్లాలన్నీ ఒకే జాతి అనే భావన చాలా కాలం వరకు ఉండేది. కానీ, ఈ జాతిలో అంతకుముందు అనుకున్నట్టు మూడు ఉప జాతులు కాక, రెండు జాతులు, వాటిలో నాలుగు (ఒక్కొక్క జాతిలో రెండు) ప్రజాతులు ఉన్నాయని గుర్తించారు. పడమటి గొరిల్లా, తూర్పు గొరిల్లా అనేవి రెండు జాతులు. వీటిలో రెండు ఉపజాతులు ఉన్నాయి. తూర్పు గొరిల్లాలో మూడవరకం కూడా ఉందని ఈ మధ్యన పరిశోధకులు గమనించారు.


తాతగారు బూనోబో: కోతుల్లో అందరికన్నా దగ్గరి చుట్టం మనకు ఈ బూనోబోగారే! మూడు అడుగులకు మించని ఎత్తు, 40కిలోలకు మించని బరువు ఈ తాతగారి లక్షణాలు. పండ్లు, గింజలు, ఆకులు, పూలు మాత్రమే తింటారు. అప్పుడప్పుడు మాంసం కూడా తింటారు. చూడడానికి చింపాంజీలాగే ఉన్నా, ముఖం మరింత చదునుగా, నల్లగా ఉంటుంది. కనుబొమలు కూడా చదునుగా ఉంటాయి. శరీరం, సన్నగా ఉంటుంది. వర్షారణ్యాలు, చిత్తడి అడవులకు ఈ జాతి పరిమితమయి ఉంది. మొత్తం సంఖ్య 5 నుంచి 50వేల మధ్య ఎంతయినా ఉండవచ్చు. మనిషి కారణంగా వీటికి తగిన జాగా మిగలడం లేదు. మనుషులు పట్టి పెంచుతున్నారు కూడా. కనుక, ఈ జాతి అంతరించే స్థితికి వచ్చింది.

Wednesday, August 29, 2012

మనుషులంతా ఒక్కటే(నా?)


చుట్టూ చూడండి. మీవంటి స్వభావం గలవారు ఎక్కడోగాని ఉండరు. మీవంటి రూపం గలవారు అసలే కనపడరు. ఇక నూటికి నూరుశాతం మీ వంటివారు ఉండరుగాక ఉండరు. ఇంతమంది మనుషులు కనబడుతుంటారు. అయినా అందరూ అన్నిరకాలుగానూ ఉంటారు. ముఖాలు, శరీరాలు, నడవడి, తీరు అన్నీ ఎవరి తీరు వారిదిగానే ఉంటాయి. ప్రపంచంలోని మనుషులందరినీ ఒకచోట చేర్చినా లెక్క అంతే! ఈ భూ ప్రపంచంలో ఈ క్షణాన మనుషుల సంఖ్య 705 కోట్లపైన ఎక్కడో ఉందని అంచనా. గడిచిన 50 వేల సంవత్సరాలలో పదివేల కోట్లమంది పుట్టి గతించారని లెక్క చెపుతున్నారు. మరి అంతమందికీ ఎవరి ప్రత్యేకత వారికి ఉండేది. ఇకమీద పుట్టే వారందరూ కూడా అదే రకంగా ఉంటారు. ప్రతి తల్లీ- పుట్టిన ప్రతి సంతునూ ‘చుక్కల్లో చంద్రుడ’నే అంటుంది మరి!

ఆశ్చర్యంగా అందరూ మనుషులే. కానీ అందరూ ప్రత్యేకత గలవారే. జీవ వైవిధ్యం చాలా గొప్పది అనుకుంటే, శతకోటి జీవాలలో ఒకటయిన మానవజాతిలోని వైవిధ్యం అంతకన్నా ఎంతో గొప్పదని అర్థం. ఇందరిలోనూ ఎవరి గుర్తింపు వారిదిగా ఉండడానికి, ఆధారాలను వెదుకుతూ లోతులకు పోవచ్చు. అక్కడ మనకు డిఎన్‌ఏ, వేలి ముద్రలు, కంట్లో గీతలు మొదలయినవి ముందు కనబడతాయి. ఇంకొంచెం లోతుకు పోతే మరెన్నో సంగతులు ఆశ్చర్యం కలిగిస్తాయి.


జన్యు పదార్థం- డిఎన్‌ఏ
వైవిధ్యం మొత్తానికి మూలకారణమంతా ఇందులోనే ఇమిడి ఉంది. ఇదొక గట్టి నిజం. మనం మనంగా, మీరు మీరుగా ఉండడానికి ఆధారం ఈ జన్యు పదార్థమే. ఇక్కడ కూడా కొన్ని లెక్కలున్నాయి. 2001లో మానవుల డిఎన్‌ఏ మొత్తాన్ని మ్యాపింగ్ చేశారు. మనుషులందరిలోనూ 99.9 శాతం డిఎన్‌ఏ ఒకేరకంగా ఉంటుంది, అన్నారు. అంటే, ఇప్పటివరకూ మనం లెక్కించిన వైవిధ్యానికి కారణం 0.1 శాతం మాత్రమేనని అర్థం. గడిచిన పదేళ్ళలో లెక్కలు వేసి తేడాను 0.5 శాతంగా పెంచారు. వైవిధ్యం దృష్టితో చూస్తే అది కూడా తక్కువే మరి! లెక్కను మరింత ముందుకు నడిపితేగాని సంగతి అర్థం కాదు. మనిషి డిఎన్‌ఏ- అనే పుస్తకంలో 320 కోట్ల అక్షరాలుంటాయి. అందులో 0.5 శాతం అంటే సుమారు కోటి అరవయి లక్షలు. వాటిలో మళ్లీ రకరకాల కలయికలు. ఒకటి, రెండు అన్న రెండు అంకెలుంటేనే, 1, 2, 12, 21, 122, 111, 121.. ఇలా కొన్ని అంకెలు వీలవుతాయి. ఇక కోటి అరవయి లక్షల అక్షరాలుంటే ఎన్నో రకాల కలయికలు వీలవుతాయని ఊహించడం కూడా కష్టం. ఇప్పటివరకు పుట్టి, చనిపోయిన వారి సంఖ్య ఆ వీలయ్యే రకాలలో ఎంతమాత్రమూ కాదని తేలిపోతుంది. అంతమందిలో కూడా ఒకే రకం జన్యు అక్షర క్రమం ఉండే వీలు ఇంచుమించు సున్నా మాత్రమే. కవలలో కూడా ఆ వీలు లేదు. అందుకే కవలలను గుర్తించడం వీలవుతుంది. మొదట్లోవారు ఒకే రకం జన్యు పదార్థంతో మొదలవుతారు. పెరిగిన కొద్దీ తేడా పెరుగుతుంది. జన్యు పదార్థం కాపీ జరిగితేనే కణాలు పెరుగుతాయి. శరీరం పెరుగుతుంది. ఈ కాపీ జరిగే సమయంలో మ్యుటేషన్స్ అనే చిన్న మార్పులు జరుగుతాయి. కవలల మధ్య తేడా రావడానికి ఈ మార్పులు చాలు. ఇక జన్యువులు పనిచేసే తీరును అదుపు చేసే మార్కర్ జన్యువులలో మార్పు వస్తుంది. కవలలుగానీ మిగతావారు గానీ, ఎవరిదారిన వారు పెరగడానికి ఈ మార్పులు కారణాలవుతాయి. జరిగే మార్పులన్నింటికీ ప్రభావం బయటకు కనిపించదు. కానీ, చిన్న మార్పుల ప్రభావం పెద్ద ఎత్తున కనబడుతుంది. మీరు మీలాగే ఉన్నారంటే, అందుకు మీ జన్యువులే ఆధారం. జన్యువులు మాత్రమే ఆధారం కావు. వాతావరణం, అమ్మ కడుపులో వాతావరణం లాంటివి కూడా ఈ ఆధారాలలో కొన్ని.

అసలయిన గుర్తింపు- వేలి ముద్రలు
వేలిముద్రలు ఎవరివి వారివేనని అందరికీ తెలుసు. వీటి వెనక జన్యువులు కారణంగా ఉంటాయని తెలియకపోవచ్చు. కనీసం వాటి సైజు, ఆకారాలు జన్యువుల మీద ఆధారపడతాయి. కానీ, అమ్మ కడుపులో ఉండగా- శిశువు మీద ఉమ్మ సంచి ఒత్తిడి పెడుతుంది. అందులోని నీరు కదులుతూ కుదుపుతుంది. వీటి ప్రభావంతో వేలి ముద్రలు మారతాయంటే నమ్మగలరా? నమ్మక తప్పదు. ఒకే రకంగా ఉండే కవలల్లో కూడా వేలిముద్రలలో కొంతవరకు తేడాలుంటాయి. లోపలి వాతావణం వారిమీద, అంత సమానంగా ఉండకపోవడం అందుకు కారణం. ఒక గీత రెండుగా విచ్చుకునే చోటులో తేడా, శంఖం, చక్రాలలో గీతల మధ్య బాగా వేరుగా ఉంటాయి. కాలి గీతల్లో కూడా ఈ తేడాలు కనబడతాయి.
నేర పరిశోధనలో వాడుకుంటారుగానీ, నిజానికి మనకు వేలిముద్రలవల్ల ప్రయోజనం ఉందా? ఉంటే ఏమిటి? అన్నసంగతి ఇప్పటికీ అర్థం కాలేదు. అందరూ సులభంగా ‘ఆ గీతల వల్ల పట్టు దొరుకుతుంది!’ అంటారు. కానీ వాటివల్ల పట్టు సడలుతుందని పరిశోధకులు గుర్తించారు. చర్మం విస్తారం పెరుగుతుందనీ, చర్మానికి సాగే శక్తి వస్తుందని, స్పర్శ బాగా తెలుస్తుందనీ ఎన్నో చెప్పుకున్నారు. వీటిలో ఏది ఎంత నిజమని తేలలేదు. మొత్తానికి వేలిముద్రలు లేకుండా కూడా మనం బతకగలుగుతామని తెలిసిపోయింది. జన్యువులలో అనుకోని మార్పుల కారణంగా అయిదు కుటుంబాలలో కొందరు వేలిముద్రలు లేకుండా పుట్టారు. వాళ్లందరూ బాగానే బతుకుతున్నారట.

ముఖం చూడు..
ఎవరి ముఖం వారికి గుర్తింపు. శరీరంలోని భాగాలన్నింటినీ చూడడం ఒక ఎత్తు. మనిషిని గుర్తించడానికి ముఖం చూడడం మరో ఎత్తు. అయినా ముఖాలలో నిజానికి అంతగా తేడా ఉండదట. మీ లాంటి ముఖం పోకడలు, పోలికలు గలవారు అక్కడో ఇక్కడో ఉండనే ఉంటారు. మనమనుకుని మరెవరినో పలకరించిన వారు, కనీసం అనుకున్నవారు మనకు ఆ సంగతి చెప్పి ఉంటారు కూడా. కంప్యూటర్‌లో ముఖాన్ని గుర్తించే సాఫ్ట్‌వేర్ వచ్చింది. ప్రపంచంలోని మనుషులలో 92శాతం మందికి ఒకరయినా ఈ సాఫ్ట్‌వేర్‌ను కూడా తికమక పెట్టేంత పోలికలున్నవారు ఉంటారని పరిశోధనలో తెలిసింది.
ఒకేవ్యక్తి రెండు ఫొటోలను చూపిస్తే, ఈ సాఫ్ట్‌వేర్, మనుషులు తికమకపడిన సందర్భాలను పరిశోధకులు గమనించారు. ఆ ఫొటో తెలిసిన వారిదయితే గుర్తించడం కొంచెం సులభమవుతుంది. తెలియని వారిలో వయసుతో, కోణంతో వచ్చే తేడాలు తికమకపెడతాయి. అంటే, మనం ముఖం మనకు గుర్తింపు అన్న విషయంలో అనుమానం ఉందని అర్థమేమో?

నడక తీరులో తేడా
మనిషి కూడా మొదట్లో నాలుగు కాళ్లమీద నడిచేవాడు. పదిహేను లక్షల సంవత్సరాల క్రితం నిటారుగా నడవడం నేర్చుకున్నాడు. నాటినుంచి నేటివరకు అందరూ ఒకే తీరుగా నడుస్తున్నారు. ఒక కాలు ఎత్తి, మరో కాలు కన్నా ముందుకు వేయడం, తుటి నుంచి మడమ, కాలివేళ్ల వరకు ఒక రకమయిన కదలికలు కలకాలంగా సాగుతున్నాయి. కానీ, ఆ కదలికల్లో ఎక్కడో ‘కొంత’ తేడా ఉంటుంది. ఎవరి నడక తీరు పూర్తిగా వారికే ప్రత్యేకమని చెప్పడానికి లేదు. కానీ, కేవలం నడక ఆధారంగానే మనుషులను గుర్తించడానికి 90 శాతం వరకు వీలుందని 70 దశకంలోనే నిరూపించారు.
పిల్ల వయసులో నడక తీరు మారుతూ పోతుంది. శరీరం పెరుగుదల ఆగేసరికి నడక తీరు స్థిరమవుతుంది. కాళ్ల పొడుగు, తుంటి వెడల్పు, శరీరం బరువు, కండరాల తీరు లాంటి లక్షణాలు ఆధారంగా నడకకు ఒక ప్రత్యేకత వస్తుంది. ఆ నడక తీరును అందరూ గుర్తిస్తారు. వర్ణించడం మాత్రం సులభంగా కుదరదు. ఇది నడక గురించి పరిశోధకులు అంటున్న మాట. కాళ్లు, చేతులు కదిలే మార్గాన్ని గీతలలో గుర్తించి, పిరుదులు, మోకాళ్లు, పాదాలు కదలికలను లెక్కించి, ఒక దాంతో మరొక దానికి గల సంబంధాలను లెక్కించి కంప్యూటర్లు నడకను గుర్తించగలిగాయి. కాలిగుర్తుల తీరు, వాటిలో పడిన ఒత్తిడి ఆధారంగా కూడా నడక తీరును గుర్తించారు. జపాన్‌లో ఈ రకమయిన పద్ధతిలో మనుషులను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
స్మార్ట్స్ ఫోన్స్‌లో కదలికలను గుర్తించే సెన్సర్స్ మామూలయినాయి. వాటి ఆధారంగా నడక తీరును గుర్తించే ప్రయత్నాలు కూడా ఈ మధ్యనే మొదలయినయి. సెన్సర్స్‌ను కాలికి కడితే వేగం, కదలిక లాంటివన్నీ తెలుస్తాయి. అది తెలిసిన ఫోన్- మరెవరో వాడితే పలకదు!

చెవులను గమనించారా?
మనుషులను గుర్తించడానికి వేలిముద్రలు, కంటిపాపలను వాడినట్టే చెవి తీరును వాడవచ్చు! పైగా, కాళ్లలాగే, కుడి, ఎడమ చెవులు రెండూ ఒకే రకంగా ఉండవు! ఏ ఇద్దరి చెవులూ ఒకే రకంగా ఉండవు. అమ్మ కడుపులో ఒక వ్యక్తి ఉనికి మొదలయిన తర్వాత అయిదు వారాల వరకు చెవులుండవు. అప్పుడు తలకు ఇరువేపులా ఆరేసి బుడిపెలు పుడతాయి. అవి పెరుగుతూ కలిసి చెవులవుతాయి. వాటి ఆకారానికి జన్యువులలో సమాచారం ఉంటుంది. అయినా వేలిముద్రలలాగా చెవులు కూడా అక్కడి ఒత్తిడి, ఒరిగిన దిక్కులాంటి సంగతులను బట్టి పెరుగుతాయి. మనుషుల శరీరంతోపాటు, చెవులు కూడా పెరుగుతాయి కానీ, వాటి ఆకారం మాత్రం మారదు!
చెవి గుర్తుల ఆధారంగా నేరస్తులను పట్టుకున్న సందర్భాలు అమెరికా, నెదర్లాండ్స్ దేశాలలో నమోదయి ఉన్నాయి. అయితే, ముద్రలు పడిన తీరు ఒత్తిడి కారణంగా మారుతుంది గనుక, దీన్ని పూర్తిగా నమ్మదగిన పద్ధతిగా అందరూ అంగీకరించలేదు. ముఖాన్ని చూచి తికమకపడినట్లే, చెవి విషయంలోనూ కొంత తికమక ఉంది. ఈ మాటను అడ్డుగా పెట్టుకుని యుఎస్‌లో ఒక నేరగాడు శిక్షను తప్పించుకున్నాడు కూడా!

కళ్ళలో తేడా ఉంటుంది
యుకె, యుఎస్, కెనడా లాంటి దేశాలలో మనుషులను గుర్తించడానికి కంటి పాపలను కంప్యూటర్ సాయంతో స్కాన్ చేస్తున్నారు. ‘అచ్చం అమ్మ కళ్లే’ అనడం మనం వింటూనే ఉంటాము. మరి కళ్లసాయంతో మనుషులను గుర్తించడం ఎట్లా కుదురుతుంది? కంటి పాపలో రకరకాల కండరాలు చిక్కులు పడినట్టు ఉంటాయి. వాటి మధ్యన లిగమెంట్స్, రక్తనాళాలు, రంగు కణాలు కూడా ఉంటాయి. వీటన్నింటి కారణంగా కళ్లలో రంగు, లోతు, ఎత్తులు, చుక్కలు మొదలయిన తేడాలు ఏర్పడి ఉంటాయి.
మామూలుగా కంటిపాప రంగు జన్యుపరంగా వస్తుంది. అందుకే అమ్మ కళ్లు, నాన్న కళ్లు అంటారు. కుడి, ఎడమ కనుపాపల రంగు ఒకే రకంగా ఉంటుంది. అందుకే కంప్యూటర్ సాయంతో కళ్లను స్కాన్ చేసే చోట రంగు లాంటి అంశాలను పట్టించుకోరు. ఎత్తులు, పల్లాలు, గీతలను మాత్రమే చూస్తారు. కంటిలోని ఐరిస్- వ్యక్తి పుట్టకముందే తయారవుతుంది. దాని నిర్మాణానికి జన్యువులకు సంబంధం లేదు. కనుక వాటిలోని కండరాలు, లింగమెంట్స్, రంగు కణాలు రకరకాలుగా పరచుకుంటాయి. అంటే ఏ ఇద్దరి కళ్లూ ఒకే రకంగా (పాప విషయంలో) ఉండవు.

గొంతు అంటే ధ్వని
గొంతులోనుంచి మాట బయటకు రావాలంటే ఎంతో ఫిజిక్సు జరగాలి. స్వరపేటికలోనుంచి గాలి వస్తూ ధ్వనికి కారణమవుతుంది. అది నోరు, ముక్కులలో చాలా రకాలుగా కొట్టుకుంటుంది. అంగిలి, నాలుక, పెదవులు, దవడల కారణంగా ‘మాట’వుతుంది. స్వరపేటిక, నోరు, ముక్కు, దంతాలు, కండరాలు, అన్నీ ఏ ఇద్దరిలోనూ ఒకే రకంగా ఉండవు మరి! అందుకే ఎవరి మాట ధ్వని వారిదిగానే ఉంటుంది.
వేలిముద్రలను, కంటిపాపలను మార్చ డం కదురదు. కానీ, కండరాల సాయంతో స్వరపేటికను, మిగతా భాగాలను వేరుగా కదిలించి గొంతుకను మాత్రం మార్చవచ్చు. మిమిక్రీ కళాకారుల విజయ రహస్యం అదే! కొందరి గొంతు అనుకోకుండానే మారుతుంది. మనకు తెలియకుంటే మనం గొంతును మార్చి మాట్లాడుతుంటాము.
మిమిక్రీ ఎలా వీలవుతుందని పరిశోధించారు, పరిశోధిస్తున్నారు. అందరికీ ఆ విద్య వీలుగాదు. అంటే మొత్తానికి, గొంతు, ధ్వనుల ఆధారంగా వ్యక్తులను గుర్తించడం వీలుగాదని అర్థం. గొంతును గుర్తించే పద్ధతితోబాటు మరేదో గుర్తించి కూడా ఉండాలి. మిమిక్రీ ఫెయిల్ కావచ్చు!

వాసనలు వేరుగా ఉంటాయా?
వాసనల ఆధారంగా నేరగాళ్లను పట్టడానికి కుక్కలు అవసరం. ఎవరి కంపు (కంపు అన్న మాటకు అసలు అర్థం వాసన అని మాత్రమేనని గమనించాలి!) వారిదే. అయితే ఏడు వందల కోట్ల వాసనలున్నాయా? ఉన్నాయి అని అంటున్నారు పెన్సిల్వేనియా పరిశోధకులు. డిఎన్‌ఏలో ఉండే మూల అక్షరాలు నాలుగు. మనిషి బాహుమూలంలో 20కిపైగా వాసన రసాయనాలున్నాయి. ఇంకా ఎక్కువగా కూడా ఉన్నాయి. వాటిని రకరకాల కలయికలు, మోతాదులుగా చూస్తే ఎన్ని రకాల వాసనలయినా ఉండవచ్చు.
మనిషి శరీరంలో వేరు వేరు భాగాలలో వేరు వేరు స్రావాలు పుడుతుంటాయి. అక్కడ రకరకాల సూక్ష్మజీవులుంటాయి. వాసనలేని స్రావాలకు కూడా వాటివల్ల వాసన పుడుతుంది. ఒక వ్యక్తి శరీరంలో మొత్తం ఐదు వేల రకాల రసాయనాలు వాసనలకు ఆధారాలు. ఆమ్లాలు, ఆల్కహాల్స్, కీటోన్‌లు, ఆల్డీహైడ్‌లు ఈ రసాయనాలలో రకాలు. వాటిలో కనీసం 44 మాత్రం వేరువేరుగా ఉంటూ, వేలిముద్రలలాగే రకరకాల వాసనలకు కారణమవుతాయి. ఈ రసాయనాలకు వాసన కలిగించడం తప్ప మరో పని లేదని కూడా గుర్తించారు. ఈ వాసనల ఆధారంగా మనుషులను గుర్తించడం ఒక సహజమయిన పద్ధతి అని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
శరీరం మొత్తంమీది వాసనలను సేకరించి, వ్యక్తిని గుర్తించే పద్ధతి ఇంకా రాలేదు. ఆ ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయి

లబ్-డబ్ లేదా హృదయలయ
కవులు, గాయకులు గుండె చప్పుడు గురించి ఊహించారు. నిజంగా కూడా ఏ రెండు గుండెలు ఒకే రకంగా కొట్టుకోవు. వింటే తేడా తెలియదు కానీ, విద్యుత్తు తరంగాలుగా చూస్తే మాత్రం తెలుస్తుంది. ఇసీజీలో గుండెలోని మూడు రకాల కదలికలు తెలుస్తాయి. ప్రతి గుండె పరిమాణం, ఎత్తు, పొడుగు, ఆకారం వేరువేరుగా ఉంటాయి. వేగం మారినా గుండెలయ మాత్రం మారదు. దీన్ని మన ఇష్టప్రకారం మార్చడం కుదరదు. గుండె ఆధారంగా మనుషులను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మెదడు నుంచి పుట్టే తరంగాలు
ఆలోచనలు ఎవరివి వారికి వేరంటే కొత్తేమీ లేదు. వాటినుంచి వచ్చే తరంగాలను గుర్తించి తేడా చూపవచ్చునని మాత్రం ఈ మధ్యే తెలిసింది. మెదడులో లెక్కలేనన్ని కణాలు మారి మారి, చివరికి ఒక వ్యక్తిత్వం ఏర్పడుతుంది. ఇఇజీ అనే యంత్రం మెదడు తరంగాలను చూపగలుగుతుంది. రామన్ పరాంజపే అనే పరిశోధకుడు కెనడాలో పరిశోధనలు జరిపి ఆలోచనా తరంగాల మధ్య తేడాను బయటకు చూపించాడు. అందరూ ఒకే పనిచేస్తున్నా, మెదడు పనిలో తేడా ఉందని నిరూపించాడు. అయితే, ఈ బ్రెయిన్ వేన్స్ ఎన్ని రోజులయినా, ఏ పరిస్థితిలోనయినా ఒకే రకంగా ఉంటాయా? ఈ ప్రశ్నకు జవాబు యింకా రాలేదు. ఆలోచనలు, వేలిముద్రల వంటివి కావని మాత్రం తెలుసు!

మనం కాని మనం
మనిషిని గుర్తించడానికి అన్నింటికన్నా ఆశ్చర్యకరమయిన ఆధారం- ఆ వ్యక్తిలోని సూక్ష్మజీవుల తీరు, కలయికలు. ఒక వ్యక్తి శరీరం బయట లోపల కలిసి వంద ట్రిలియనుల (అంటే ఎన్ని?) సూక్ష్మజీవులుంటాయి. శరీరం కణం ఒక్కింటికి 10 సూక్ష్మజీవి కణాలుంటాయి. (మనం అంటే మనం కాదని, మన సూక్ష్మజీవులని అనాలేమో?) మన జన్యువులు 23,000 మాత్రమే. మనలోని సూక్ష్మజీవుల జన్యువులు 33 లక్షలు. మనం 0.7 శాతం మాత్రమే మనం అంటారు పరిశోధకులు. ఈ సూక్ష్మజీవులను బట్టి మనుషులను గుర్తించడం చాలా సులభం అనాలి!

ఇప్పుడు చుట్టూ చూడండి, మీలాటివారు మరెవరయినా ఉన్నారేమో వెదకండి! మనుషులంతా నిజానికి ఒక్కటే. అందరిలోనూ అదే రక్తం పారుతున్నది. కానీ...!

Thursday, August 16, 2012

పరిశోధన - పద్ధతి

కలడు కలండనెడివాడు కలడో లేడో? అని అనుమానం. ఉన్నాడని చెప్పేవారే గానీ, చూచినవారులేరు. అదే పద్ధతిలో పీటర్ హిగ్స్, సత్యేంద్రనాధ్‌బోస్ లాంటివారి ‘మరికొందరు’ ఒక పార్టికల్ ఉండి తీరాలని అన్నారు! ఇప్పుడేమో మరికొందరు- ఆ పార్టికల్ ‘కనిపించినట్టు ఉంది!’ అన్నారు. నాలుగురోజులు పాటు ప్రపంచమంతటా అందరూ చిందులు వేశారు. పరిశోధకులు ఎవరూ ఆ కణాన్ని- కనిపించని, కలడో లేడో అనే అనుమానం గలవానికి ముడిపెట్టినట్టు కనబడదు. మీడియా వాళ్లుమాత్రం ‘గాడ్‌ పార్టికల్’ అనేశారు. మనవారు మరో అడుగు ముందుకువెళ్లి దాన్ని ‘గాడ్‌లీ పార్టికల్’ చేసేశారు.

హిగ్స్ బోసాన్ కనిపించదు. కనుక, అది ఉందనేందుకు సూచనలను వెదికారు. గాలి కనిపించదు. కానీ గాలి ఉందనడానికి సూచనలు కనబడతాయి. అదే తీరులో హిగ్స్ బోసాన్ కూడా ఉందనడానికి ఆధారాలు కనబడ్డాయి. అవి అంతకుముందే ఒకసారి కనిపించాయన్నారు. కానీ, కనిపించలేదేమోనని అనుమానం కూడా కనిపించింది.

పొరపాట్లు లేకుండా పని చేయడానికి సిక్స్ సిగ్మా అని ఒక విశ్లేషణ పద్ధతి ఉంది. ఇక్కడా దాని ఫైవ్ సిగ్మాగా మార్చి, ప్రమాణంగా పెట్టుకున్నారు. కనుగొన్నది- మనం అనుకుంటున్న కణం కాకుండా పోవడానికి అవకాశం 0.00006 శాతం మాత్రమేనన్నారు. అందుకే పరిశోధకులు కూడా ఒళ్ళు దగ్గరబెట్టుకుని ‘మామూలు మనిషిగా చెపుతున్నాను (పరిశోధకుడిగా కాదు అని గదా అర్థం!) ఉన్నట్లే ఉంది!’ అన్నారు. ఆ కొద్ది మాటకే ప్రపంచమంతా పొంగిపోయి, కలడో లేడో అన్న అనుమానం తీరిపోయినంత గగ్గోలు చేశారు. సిఇఆర్‌ఎన్ వారి ప్రకటనను విశే్లషించి, తరువాత ఏమి కావచ్చునని సీరియస్‌గా వచ్చిన వ్యాసాలను, అభిప్రాయాలను ఎవరూ పట్టించుకోలేదు. ‘మేము కనుగొన్న పార్టికల్ ‘హిగ్స్ బోసాన్’గా తేలే అవకాశం (సంభావ్యత- ప్రాబబులిటీ) ఎక్కువగా ఉందని సెర్న్ వారు చేసిన ప్రకటన, చాలా ముఖ్యమయినది అంటున్నది అలాంటి ఒక వ్యాసం! పదార్థం నిర్మాణానికి ఆధారమయిన కణాలు, ఏ కొలతలూ లేని (రవ్వ) రూపంలో గాక పోగులు, దండలుగా ఉందన్న అంశాన్ని గురించి కొంతకాలమే ప్రతిపాదనలు వచ్చాయి. ఈ పద్ధతిలో చూస్తే కొలతలు పది ఉండాలని కూడా సూచనలు వచ్చాయి. ఐన్‌స్టైన్ మాత్రం స్థలం మూడు కొలతలు, కాలం ఒకే కొలత గురించి చెప్పి అందరినీ ఆలోచింపచేశాడు. అతనితో బాటే పనిచేసిన ‘మన’ సత్యేంద్రనాథ్ బోస్ చెప్పిన ‘బోసాన్’ గురించి ఆలోచించాలంటే, పది కొలతలు కూడా పనికిరావంటే, మనమంతా ఏదో అర్థమయినట్లు పండగ చేసుకుంటున్నాము. క్వాంటం ఫిజిక్స్ అంత సులభంగా పరిశోధకులకే అర్థం కాదు. అందులో ఏదో కొత్త ఆలోచనకు దారి దొరికితే సీరియస్ పరిశోధకులు బుర్ర తిరిగేలా ఆలోచిస్తున్నారు. అర్థం చేసుకుని ముందుకు సాగడానికి ప్రయత్నిస్తున్నారు. మిగతా వారందరూ మాత్రం ఈ దెబ్బతో ప్రపంచంలోని సమస్యలన్నిటికీ జవాబు దొరికిందన్నంత గొప్పగా గోల చేస్తున్నారు.


హిగ్స్-బోస్ అనేవారిలో పీటర్ హిగ్స్ ఇంకా బతికే ఉన్నాడని చాలామందికి తెలియకపోవచ్చు. ఆయనను ‘మీరేమంటారు?’ అని అడిగితే, ‘అనేందుకు ఏముంది’ లాంటి సమాధానమిచ్చాడు. ‘ఈ బోసాన్‌కు తండ్రులు బోలెడంత మంది ఉన్నారుగదా, మరి నోబేల్ బహుమతి ఎవరికిస్తారు?’ అని కూడా అడిగారు ఆయనను. ‘అలాంటి నిర్ణయాలు నేను కాదు గదా చేసేది’ అన్నాడాయన. అటు పాకిస్తాన్‌లో అబ్దుస్ సలాంగారికి (ఈయనకు మన కలాం గారికి సంబంధం లేదని గుర్తుంచుకోవాలి) ఇటు మన దేశంలో సత్యేంద్రనాధునికి అన్యాయం జరిగిపోయిందని, వ్యాసాలు వచ్చేశాయి. బోసాన్ కణం ఉందని కనుగొనడానికీ, బోస్‌కు సంబంధం లేదు. హిగ్స్‌కు అంతకన్నా సంబంధం లేదు. ఇంకా ఆ పార్టికల్‌ను హిగ్స్ బోసాన్ అంటున్నారంటే, వారిద్దరినీ గౌరవించినట్లే లెక్క. ఫెర్మియానులు, బోసానులు, వాటిలో రకాల గురించి, ఇక్కడ చర్చ మొదలుపెడితే, ఎవరికీ ముక్క తోచదని, అర్థంకాదని అంటే తప్పుకాదు. నిజానికి హిగ్స్‌తో బాటు పనిచేసిన టామ్ కిబెల్ అనే సైంటిస్టును ఈ క్షణంలో అందరూ గుర్తు తెచ్చుకోవాలి అంటారు నిజంగా సంగతి తెలిసినవారు. సలాంను, బోస్‌ను ఎవరూ మరిచిపోలేదు. వాళ్లు గొప్ప పరిశోధకులు. కానీ ఇప్పుడు జరిగిన పరిశోధనలో వారికి సంబంధం లేదు, అంటున్నారు కూడా!
ప్రపంచానికి నిత్యం ఒక సంచలన వార్త కావాలి. ఇవాళటి కొత్త సంచలనం రాగానే, నిన్నటి మహా సంచలనం మరుగున పడిపోతుంది. కానీ సైన్సు ప్రపంచం పద్ధతి వేరు. అక్కడ సంచలనాన్ని సంచలనంగా కాక, మరింత కృషికి మార్గంగా భావిస్తారు. మరింత సీరియస్‌గా ముందుకు సాగుతారు. లాజికల్‌గా ముందుకు సాగుతారు. ఈ లాజిక్ అన్న అంశం పరిశోధకులను కొన్ని అభిప్రాయాలనుంచి సత్యాలవరకు నడిపిస్తుంది.


ఒకటి ఉంది గనుక రెండు కూడా ఉంటుంది. కలిసి మూడవుతాయి అన్నది భావన. నిజంగానే లాజిక్‌లో లెక్కలుంటాయి. అది లెక్క ప్రకారం ముందుకు సాగుతుంది. మొదలు అనుకున్న అభిప్రాయం లేదా భావన నిజమే అయితే, ఆ తరువాతి లెక్కలు కూడా నిజాలవుతాయి. కానీ, సైన్సులో కూడా అభిప్రాయాలు సమగ్రంగా అవసరమయినవి అన్ని ఉండి, పరిశోధన మొదలయ్యే స్థితి ఉండదు. అందుకే లాజిక్- లెక్క ప్రకారం వచ్చిన ఫలితాలను కూడా పూర్తి చివరి సత్యాలు అనడానికి ఉండదు. బోసూ, హిగ్స్ మరి కొందరు, ఇలాంటి కణాలు ఉండితీరాలి అన్నారు. ఇవాళ ఉన్నట్టే ఉంది అంటున్నారు. మరెన్నో ప్రయోగాలు, పరిశీలనలు జరగాలి. అందరికీ ఒకే తీరు ఫలితాలు రావాలి. అప్పుడు గానీ ఒక సిద్ధాంతం ముందుకు రావటనికి వీలు కలుగుతుంది.


లెక్కలున్నంత మాత్రాన పని జరగదు. కవి, చిత్రకారుడులాగే, సైంటిస్టు కూడా ఒక భావనను కల్పించుకోవాలి. బోస్‌లాంటి వారంతా అదే చేశారు. బోసాన్ ఉందని తేలిననాడు, బోస్‌కు సన్మానం జరిగినట్లే లెక్క. ఆ సంగతి తెలుసు గనుకనే పీటర్ హిగ్స్ నిక్షిప్తంగా మాట్లాడింది! మన మాట నిజమని రుజువయితే, అంతకంటే ఏం కవాలి? అన్నది ఆయన భావం!


స్టేజిమీద తెర ఇప్పుడే లేచింది! నాటకం మొదలు కాలేదు. అప్పుడే చప్పట్లు కొడితే ఎట్లా?

Sunday, August 5, 2012

ఆటలు - పోటీలు - సైన్సు

నిషి ఆలోచన మొదలయిన నాటినుంచి సదుపాయాలు కొరకు వెతికాడు. రాళ్లతోనే గొడ్డళ్ళను, కత్తులను తయారుచేసుకున్నాడు. కడుపు నిండిన తరువాత మరి కాలక్షేపం కావాలి. సరదా కావాలి. అందుకని ఆటలు మొదలయినయి. ఆటల్లో కొన్ని శరీర శక్తి మీద ఆధారపడినవి. కొన్ని మెదడు మీద ఆధారపడినవి. మరికొన్ని రెండూ కలిపిన రకం. టెక్నాలజీలో కూడా ఈ రెండూ ఉన్నాయి. వేటకొరకు బాణం కడితే అది అవసరం. బాణాన్ని ఎంత దూరం వరకు వేయగలమని పోటీపడితే అందులో సరదా కూడా ఉంది. బాణాన్ని ఎక్కువ దూరం వేయగలగాలంటే విల్లు, అమ్ములను మరింత ‘బాగా’ తయారుచేయాలి. అట్లా టెక్నాలజీ పుడితే అది ‘ఆట’ మాత్రం కాదు. ఆటలోకూడా రూల్స్‌ను దాటనంతవరకు ఎంత టెక్నాలజీ వాడినా తప్పులేదు. చిత్రంగా, మిగతా రంగాలకన్నా ఆటలో ఎక్కువగా ఈ టెక్నాలజీ వాడకం మొదటినుంచి జరిగింది.

మనుషుల నాగరికత నడకలో ఒలింపిక్స్‌ను ఒక మలుపుగా గుర్తించారు. క్రీస్తు పూర్వం 776లో గ్రీస్‌లోని ఒలింపియా నగరంలో మొదటి ఆటల పోటీలు జరిగాయి. అప్పుడు ఒకే ఒక పోటీ జరిగింది. దాని పేరు స్టేడియాన్. సుమారు రెండు వందల మీటర్ల నిడివి గల ట్రాక్ వెంట పరుగుపెట్టి వెనక్కు రావాలి. త్వరలోనే ఆ పోటీకి కొన్ని రూల్స్ వచ్చాయి. అంటే కొంత టెక్నాలజీ కూడా వచ్చిందనవచ్చు. పరుగు మొదలయ్యే చోట, కాళ్లకు ఆధారంగా గుంటలు, అటు చివర కొయ్యలువచ్చాయి. ఆ తరువాత ఒలింపియాడ్స్ వందల ఏళ్లు కొనసాగినయి. క్రీస్తుశకం నాలుగవశతాబ్దం నాటికి రథాల పరుగులు, బల్లెం విసరడం, అస్తశ్రస్త్రాలన్నీ మోస్తూ పరుగు తీయడం లాంటి రకరకాల పోటీలు అందులోకి వచ్చి చేరుకున్నాయి. అన్నింటిలోనూ ఎన్నో నియమాలు, ఎంతో టెక్నాలజీ కూడా వచ్చాయి.

ఒక్కసారిగా పారిశ్రామిక విప్లవకాలం నాటికి కప్పదాటు వేస్తే, అదంతా సాంకేతికత కాలం. పనివారికంతా, తీరిక, సరదాలు కావాలి. అందరికీ హాయిగా తిండి దొరుకుతున్నది. ఆటలకు కావలసిన సరంజామా అందరికీ అందుబాటులోకి వచ్చింది. అప్పటివరకు ఆట పోటీల్లో కర్ర, చర్మం లాంటి పదార్థాలను మాత్రమే వాడుతున్నారు. అవి సులభంగా, అందరికీ దొరుకుతాయి. అప్పుడప్పుడే హాన్‌కాక్, గుడ్‌యియర్, మాకింటాష్‌లు రబ్బరు తయారీని కనుగొన్నారు. సహజంగా దొరికే రబ్బరుకు గంథకం కలిపి ఉడికిస్తే, మన్నికగల రబ్బరు వచ్చింది. దానితో 1800 ప్రాంతంలో ఆటలలో వాడుకునే బంతుల తీరు మారింది. జంతు చర్మంతో తయారుచేసిన బంతులు అన్నీ ఒకే రకంగా ఉండవు. రబ్బరు బ్లాడర్లు అన్నీ ఒకేరకంగా, ఎన్నయినా తయారుచేయవచ్చు. రబ్బరుతో షూస్, దుస్తులు కూడా తయారుచేయడం వీలవుతుంది. డన్‌లాప్ తయారుచేసిన టైర్ల కారణంగా మంచి బైసికిళ్లు, మిగతా వాహనాలు వచ్చేశాయి. ఈ రకంగా ఒకవేపు బతకడానికి సదుపాయాలు పెరుగుతున్నాయనుకుంటే, అవన్నీ ఆటల పోటీలోనూ మార్పులను తెచ్చాయి.

ఇంత జరిగిన తరువాత ఆటలనే తమ పనిగా ఎంచుకునే వారు రావడంతో ఆశ్చర్యం లేదు. పోటీలో కాలాలు, నిడివి లాంటి వాటిని సరిగ్గా కొలతవేసే పద్ధతులు అవసరమయ్యాయి. 1885 ఫొటో ఫిల్మ్ వచ్చింది. గుర్రాలు, మనుషుల పరుగులలో ‘్ఫటోఫినిష్’ అనే మాట వచ్చింది. కంటిచూపు కాక, ఫొటోల ఆధారంగా గెలుపు నిర్ణయాలు చేయడం అసలయిన స్పోర్ట్స్ టెక్నాలజీ! అక్కడితో ఆగక, క్రీడాకారుల శిక్షణలో కూడా ఫొటోలు, ఫిల్ముల వాడకం అప్పుడే మొదలయింది. బొమ్మలను చూచి, పద్ధతులను మార్చుకుని అందరూ, ‘మరింత బలంగా, మరింత ఎత్తులకు, మరింత వేగంగా’ చేరడం నేర్చుకున్నారు.
పరుగులలో సమయం నిడివి చాలా ముఖ్యం. 1930లోనే సెకండులో పదవ భాగాన్ని లెక్కించడం మొదలయింది. 1970లో గెలుపులు, సెకండులో వందవ భాగం ప్రకారం నిర్ణయం చేయడం మొదలయింది. పరుగు మొదలయే చోట పిస్టల్ పేలుతుంది. దానికీ క్వార్ట్స్ క్రిస్టల్ గడియారానికి లంకె ఉంటుంది. పరుగు ముగిసే చోట లేజర్ కన్ను ఉంటుంది. రెంటినీ కలిపి పరుగు సాగిన సమయాన్ని లెక్కవేస్తారు. ఈ లెక్కలు చెప్పడానికి సులభంగా కనబడతాయి. కానీ వాటి గురించి ఎంతో పరిశోధన జరిగింది. చిక్కులు వచ్చాయి కూడా.

పరికరాలు, పదార్థాలు: ఆటల పోటీలలో, సాంకేతిక శాస్త్రం తెచ్చిన మార్పులు అంతులేనివి. ఉదాహరణగా టెన్నిస్ రాకెట్లగురించి చెప్పవచ్చు. శతాబ్దాలుగా వాటిని కర్రతో చేసి వాడుకున్నారు. గ్రాఫైట్‌తో రాకెట్లు తయారుచేయవచ్చునని తెలిసిన తరువాత ఆట మారిపోయింది. రాకెట్లు మరింత పొడుగయ్యాయి. వెడల్పు కూడా పెరిగింది. అందులో బంతి తగిలే ‘స్వీట్ స్పాట్’ ఏరియా పెరిగింది. అంతకుముందు రాకెట్లలో, బంతి గనుక అంచున తగిలితే, రాకెట్, చేతిలో తిరిగేది. ఇప్పుడు ఆ సమస్య లేదు. దీంతో ఆట నేర్చుకునే వారు ఎక్కువయ్యారు. నేర్చిన వారి ఆటలో వేగం పెరిగింది. గోల్ఫ్‌లో టైటేనియం వాడుకలోకి వచ్చింది. అంతకన్నా మించిన మార్పులు బైసికిల్ విషయంలో వచ్చాయి. బ్రిటీష్ డిజైనర్, మైక్ బరోస్, కార్బన్ ఫైబర్ ఫ్రేమ్‌తో కొత్త రకం సైకిల్‌ను తయారుచేశాడు. 1992 బార్సెలోనా ఒలింపిక్స్‌లో క్రిస్ బోర్డ్‌మన్ అనే క్రీడాకారుడు, ఆ సైకిల్‌ను వాడి నాలుగువేల మీటర్ల పోటీని సునాయాసంగా గెలిచాడు. సైకిలు చూడడానికి అందంగా ఉండడం అటుంచి, దాని బరువు తగ్గింది. స్ట్ఫినెస్ పెరిగింది. గాలిలో సైకిలు కదిలే ఏరోడైనమిక్ ఎఫిషియెన్సీ పెరిగింది. రైడర్‌కు ఇవన్నీ అదనపు సౌకర్యాలు!

రకరకాల ఆటవస్తువుల కొరకు వాడడానికి ఎన్నో పదార్థాలున్నాయి. వాటన్నింటి గురించి గొప్ప పరిశోధన మొదలయింది. రకరకాల పదార్థాలను కలిపి వాడినందుకు వచ్చే లాభాల ఛార్ట్‌లు దొరుకుతున్నాయంటే ఆశ్చర్యం. బోటు నడపడంలో తెడ్లు, పోల్‌వాల్ట్‌లోని గడకర్ర అన్నీ పరిశోధన అంశాలయ్యాయి. వెదురు గడలు చాలా గొప్పవి కనుక అవి 1950 దాకా వాడుకలో ఉన్నాయి. ప్రస్తుతం ఫైబర్ గడలు వాడుతున్నారు. మొత్తానికి ఆటలలో సాంకేతిక శాస్త్రం ఒక భాగమయింది!