Tuesday, December 13, 2011

జగ్ జీత్ సింగ్ గురించిన నా వ్యాసం

ఈ వ్యాసం ఆంధ్రభూమి దినపత్రికలో వచ్చింది.


తేరి జీత్ అమర్ హోగీ
- కెబి గోపాలం
October 12th, 2011

"తు ఇత్‌న జో ముస్కురా రహే హో, క్యా గమ్‌హై జిన్‌కో చుపా రహేహో" - అంటూ మొదలయే పాట, సినిమా పాట, విని ఆదిలాబాద్‌లోని సదాశివగారికి ఉత్తరం రాశాను. మొత్తం గజల్ దొరికితే బాగుండును అన్నారాయన. గమ్, గజల్ అన్న మాటలలోని ‘గ’ అనే అక్షరం అసలయిన రూపాన్ని తెలుగులో రాయడం కుదరదు. అది ఒక విచిత్రమయిన ధ్వని ఉరుదూ, కాదు ఉర్దూ భాష తీరే అంత. ఇత్న అనగూడదు, ఇత్‌న అనాలి, జిస్‌కో అనాలి. గజల్ పాడడంలో వచ్చిన చిక్కే ఇది. అందుకేనేమో శాస్ర్తియ సంగీతంలో గజల్‌కు సరయిన స్థానం అందలేదు. ఠుమ్రీ, ఠప్పా, దాద్రా, చెయితీలు హిందుస్తానీ కచేరీలో వినిపించాయి గానీ, గజల్‌లో వినిపించలేదు. అటు కవితా ప్రపంచంలోనూ, ఇటు సంగీతంలోనూ గజల్‌ది ప్రత్యేకమయిన స్థానం! కొందరికే అర్థమవుతుంది. పాడడం కూడా కొందరికే చేతనవుతుంది అనుకున్న గజల్‌ను అందరికీ పంచిన జగ్‌జీత్ సింగ్, తన దుఃఖాన్ని దాచుకుని, అందరికీ ఆనందం పంచాడు. ఇంతగా చిరునవ్వుచుంటివేల, దాచదలచిన దుఃఖమదేమి చెప్పను!’ అనిగదూ పైన పేర్కొన్న గజల్ ప్రారంభం మాటలకు అర్థం.


జగ్‌జీత్ అసలు సిసలయిన పంజాబీ సిఖ్ సంప్రదాయంలో పెరిగాడు. అసలు పేరు జగ్‌మోహన్. తండ్రి పేరును జగ్‌జీత్‌గా మార్చాడు. జగ్‌జీత్ కూడా ముందు పండిట్ ఛగన్‌లాల్ శర్మ, తర్వాత సేనియా ఘరానా గాయకుడు ఉస్తాద్ జమాల్‌ఖాన్‌ల వద్ద శాస్ర్తియ సంగీతం నేర్చుకున్నాడు. ఖయాల్, దుఖ్రా, ధ్రుపద్‌ల లోతులను రుచి చూచాడు. ‘‘సంగీతం ప్రేరణ కలిగించేదిగా ఉండాలి. అంతేగాని, అందులో పోటీ ఏమిటి?’’ అని ఇటీవల ప్రశ్నించాడా మహా గాయకుడు. మన సంగీతంలో గొప్ప లెక్కలు, వ్యాకరణం ఉన్నాయి. వాటి గురించి తెలియకుండానే పాడడం తప్పు అని ఆయన అభిప్రాయం.


జగ్‌జీత్ సినిమా రంగంలో గాయకుడుగా చేరాలని ప్రయత్నించాడు. కానీ, అక్కడ సరయిన ఆదరణ అందలేదు. అదే మంచిదయింది. అతని చూపు గజల్ వేపు మళ్లింది. 70 దశకంలో కూడా గజల్ సిసలయిన శాస్ర్తియ సంగీతం ఆధారంగా నడిచేది. భాష తెలియదు, అర్థం కాదు. శాస్ర్తియ సంగీతం, అందరికొరకు కాదన్న భావం మనదేశంలో నాటి నుంచి నేటి దాకా బలంగా సాగుతూనే ఉంది. జగ్‌జీత్ సింగ్, ఆ పరిస్థితిని మార్చి మరోదారి పట్టించాడు. సంగీతయాత్ర ప్రారంభంలోనే అతనికి చిత్రాతో పరిచయం అయింది. అది పరిణయానికి దారి తీసింది. జగ్‌జీత్, చిత్రాలు గజల్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించడం మొదలయింది. ‘‘పత్తా పత్తా, బూటా బూటా, హాల్ హమారా జానేహై? లాంటి వారి యుగళగీతాలు నేటికీ అందరికీ గుర్తున్నాయి. తామున్నచోట విజయం సాధించి, తలలో నాలుకగా నిలిస్తే అప్పుడు సినిమావారు జగ్‌జీత్‌ను ఆహ్వానించారు. జగ్‌జీత్ సినిమాలో కూడా పాడాడని చెప్పాలి. అతను కేవలం గజల్ గాయకుడు. చివర కాలంలో శబద్ - కీర్తన్‌లు పాడినా అతను గజల్ గాయకుడే.


జగ్‌జీత్ మొత్తం 80 ఆల్బమ్‌లు రికార్డ్ చేశాడు. గజల్ వినే వారున్న ప్రతిచోటా పాడి అందరినీ మైమరపించాడు. అతనికి కాదనడం చేతగాదు. ఆ మధ్య ఢిల్లీ పక్కన గుడ్‌గాఁవ్‌లో ఒక కచేరీ చేశాడతను. మన పంజాబీ గాయకుడన్న అభిమానం తప్పితే, అక్కడివారికి సీరియస్ సంగీతం తలకెక్కదు. ఆ ప్రాంతమంతా దుమ్ముగానూ, గోలగానూ ఉందట. అయినా ఓపికగా జగ్‌జీత్, వారందరికీ నచ్చేతీరులో కార్యక్రమాన్ని సాగించాడు. అది అతని పద్ధతి. మిత్రుడు, క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ, మనవాడుగదా, అన్న భావంతో పంజాబీ గాయకుడుగా గుర్తింపు పొందడం గురించి వ్యాఖ్యానించాడు. ‘ఎవ్రీ డాగ్ హావ్ ఇట్స్ డే!’ (ప్రతి కుక్కకు కూడా ఒకరోజు అవకాశం వస్తుంది) అని జగ్‌జీత్ జవాబు.


జగ్‌జీత్ పాడిన హిట్ పాటలను ఏకరవు పెట్టడం అర్థంలేని మాట. అతను పట్టిందల్లా బంగారమే. గీత రచయిత నిదా షాజ్లీ లాంటి వారు తమ గజల్‌ను జగ్‌జీత్ పాడితేనే అర్థం, భావం, సరిగా పలుకుతాయని భావించారంటే అర్థం చేసుకోవచ్చు. భాష, ఉచ్చారణ, కవి భావం సరిగ్గా అర్థం చేసుకుని పాడడం జగ్‌జీత్‌కు గుర్తింపు. ఒక్కమాట మీద అనుమానం వచ్చినా, నేరుగా రచయితనే సంప్రదించి, కనీసం ఫోన్‌లో నయినా దాన్ని సరిగ్గా పలికిన దాకా ప్రాక్టీస్ చేసిన సందర్భాలు ఎన్నో. ‘అలాంటివారికి పద్మభూషణ్‌లు మరేవో గౌరవాలు ఒక వేపయితే, ప్రపంచమంతటా అభిమానుల పరంపర ఇంకోవేపు. పాక్, ఆప్ఘాన్ దేశాల అభిమానులు, ఇంటర్‌నెట్‌లో అందిస్తున్న సంతాప సందేశాలు వెల్లువ అందుకు సాక్ష్యం’!


దుఃఖాన్ని వెనక్కు తోసి, చిరునవ్వులు పంచడం అందరికీ చేతగాదు. చిత్రా జగ్‌జీత్‌ల జీవితం పాటలాగా సాగుతూ ఉంది. ‘హోంధోంసే భూలో తుమ్, మేర గీత్ అమర్ కర్‌దో, బన్‌జాఓ మీత్ మెరే, మేరి ప్రీత్ అమర్ కర్‌దో! (నీ పెదవులతో తాకి, నా పాటకు అమరత్వాన్నివ్వు! నా స్నేహాన్ని అంగీకరించి, నా ప్రేమకు అమరత్వాన్నివ్వు!) లాంటి పాటలు ఆ జీవితాలకు బాటలయ్యాయి కానీ, చిత్ర మొదటి వివాహం ద్వారా కలిగిన బిడ్డడు పోయాడు. 1990లో చిత్రా, జగ్‌జీత్‌ల బిడ్డడు వివేక్ పోయాడు. ఆ ప్రణయ స్వరాలు ఒక్కసారిగా మూగవయ్యాయి. చిత్ర నేటికీ గొంతు విప్పలేదు. అభిమానుల ప్రోద్బలం మీద జగ్‌జీత్ మాత్రం బరువుగా పాటను సాగించాడు. అతని గొంతుకలో ధ్వనించే ‘మాయూసీ’ అనే లక్షణం గీతాలకు కొత్త అర్థాలు తోచేలా చేసింది. భక్తి సంగీతంతో మొదలయిన గీతార్చన తిరిగి అదే దారికి చేరింది.
జగ్‌జీత్ గురించి ఎంత చెప్పినా తక్కువే!


‘జగ్‌నే ఛీనా ముఝ్ సే, ముఝే జో భి లగా ప్యారా!’ నాకిష్టమయినదాన్నంతా ఈ ప్రపంచం అపహరించింది! ప్రపంచం తీరే అంత!

మంచి పాటే ఉంటే ప్రపంచమెందుకు?
సుగానం యద్యస్తి విశ్వేన కిం?

Monday, December 12, 2011

పచ్చబొట్టు - సైన్సు


పచ్చబొట్లు, గాయం మచ్చలు సమసిపోకుండా ఎలాగుంటాయి?

నిజమే! రక్తకణాలలాగే చర్మం కణాలు కూడా పాతవిపోయి ఎప్పటికప్పుడుకొత్తవి పుడుతూ ఉంటాయి. అయినా ‘పచ్చబొట్టు చెదిరిపోదులే’ అనేపాట ఎలా వచ్చింది?

సులభంగా చెప్పాలంటే చర్మం అంతా ఒకే పొర కాదు. అందులో అన్నింటికన్నా వెలుపలిపొర ఎపిడెర్మిస్. అందులో మాత్రమే పాత కణాలుపోయి కొత్తవి పుడుతూ ఉంటాయి. మన పడక బట్టలలో, ఇంట్లో ఉండే దుమ్ములో సగం, చనిపోయిన ఈ కణాలే ఉంటాయంటే నమ్మగలరా? ఇక డెర్మిస్ అనే లోపలి పొరలో కూడా కణాలు విభజన చెందుతూంటాయి కానీ, అక్కడ పాత కణాలు పోవడం అనే పద్ధతి లేదు. అందుకే పచ్చబొట్టు పేరున లోపలికి చేరిన రంగుగా, లోతయిన గాయం గానీ అట్లాగే ఉండిపోతాయి.

చర్మమంతా, కొలాజెన్ అనే ప్రొటీన్ పదార్థంతో తయారై ఉంటుంది. ఈ కొలాజెన్, ఫైబ్రోబ్లాస్ట్స్ అనే కణాలలో పుడుతుంది. గాయం తగిలి, మానుతుంటే కొత్త కొలాజెన్, ఆ గాయంలోనే ఫైబ్రోబ్లాస్ట్‌లు ఉండి, వాటిలో నుంచి పుడుతుంది. అది మామూలు కొలాజెన్‌లాగుండదు. అందుకే గాయం మానిన చోట చర్మం, మిగతా చర్మంలా కాక బాగా నునుపుగా ఉంటుంది. చర్మంలో మిగతా కణాలు, లోపలి పొరలలోవి కూడా పెరుగుతున్నా ఈ గాయం కొలాజెన్ మాత్రం అట్లాగే ఉండిపోతుంది.

శిశువుకు, గర్భంలో ఉన్నపుడు గాయాలు తగిలితే మాత్రం మామూలు చర్మం వచ్చేస్తుంది. అంటే అక్కడ గాయం కణాలు, అందులో కొలాజెన్ తయారీ లాంటివి ఉండవు.

పచ్చబొట్టు విషయాని వస్తే, మరో ఆసక్తికరమయిన విషయం ఉంది. శరరంలో ప్రవేశించిన ఇతర రసాయనాలను సాధారణంగా తెల్ల రక్త కణాలు మింగేస్తూ ఉంటాయి కానీ పచ్చబొట్టు పేరున శరరంలోకి పంపబడుతున్న, రంగు రసాయనాల కణాలు పెద్దవిగా ఉంటాయి. తెల్లరక్తకణాలు వాటిని మింగజాలవు. అందుకే పచ్చబొట్టు చెరగకుండా, చెదరకుండా ఉండిపోతుంది. ఎవరన్నా పచ్చబొట్టును నిజంగా తుడిపి వేయాలనుకుంటే అందుకు పద్ధతులున్నాయి. లేజర్ కిరణాలతో ఈ రంగు రసాయనాన్ని పొడిగా చేయవచ్చు. అప్పుడు తెల్ల రక్తకణాలు ఈ పొడిని మింగేస్తాయి. పచ్చబొట్టు మాసిపోతుంది.

Sunday, December 11, 2011

ఒక జోకు - పాత పత్రిక నుంచి

లవ్వితే లవ్వండి.
లాకు జలుబు. అత్తే!


బాగుల్దల్టారా?

Saturday, December 10, 2011

గుర్రాలు - నాడాలు


గుర్రాలు-నాడాలు

వ్యవసాయం కన్నా బహుశా ముందే మనిషి జంతువులను మచ్చిక చేసి పెంచడం మొదలుపెట్టాడు. వ్యవసాయంతోబాటు, కొన్ని జంతువులు పశువులయి మనిషికి సాయంగా నిలిచాయి. బండి, పశువుల కాళ్ళకు నాడాలు వేయడంతో ఒకరకం సాంకేతికత మొదలయింది. ప్రస్తుతం పశువులు, పాడికేగానీ, పంటకు కాదనే ధోరణి వచ్చింది. వ్యవసాయంలో మాత్రమే వాడుకునే ఎద్దులకు నాడాలు ఎందుకు అవసరమయ్యాయన్నది ప్రశ్న. రోడ్డుమీద నడవవలసి రావడంతో ‘నాడా’లు వచ్చి ఉండాలి.

నాడాల చరిత్రను గమనిస్తే చాలా విచిత్రమయిన విషయాలు బయటపడ్డాయి. అమెరికాలోని ‘కౌబాయ్స్’ (పశువుల కాపరులు), తమ గుర్రాలకు నాడాలు వేశారు. కానీ స్థానిక అమెరికనులు తమ గుర్రాలకు మాత్రం నాడాలు వేయలేదు (ఈ సందర్భంగా ఒక విశేషం! ఎద్దులు, ఎనుముల కాలి గిట్టలు రెండు భాగాలుగా ఉంటాయి. గుర్రం గిట్ట మాత్రం ఒకే భాగంగా ఉంటుంది!).

ఏ గుర్రాలకు నాడాలు అవసరమయ్యాయి? ఏ రకానికి వాటి అవసరం లేదు? అన్న ప్రశ్నలకు జవాబు వెతికితే, పరిణామక్రమం అనే డొంకంతా కదులుతుంది. ఇది జీవ పరిణామం మాత్రమే కాదు సాంకేతిక, సాంఘిక పరిణామాలకుకూడా ఇందులో పాత్ర ఉంది. గుర్రాలు, పశువులు పెరిగిన ప్రాంతాలకూ ప్రమేయం ఉంది.

గుర్రాలు మధ్య ఆసియాలోని గడ్డి మైదానాలులో పుట్టినాయనవచ్చు. అడవిగాడిదల జాతి మొదలయింది అక్కడే. చారల గుర్రం అనే జీబ్రా, అంతరించిపోయిన క్వాగా లాంటి జాతులు ఆఫ్రికాలోని గడ్డి మైదానాల్లో పుట్టాయి. ఇక్వస్ గుర్రాలు ఉత్తర అమెరికాలో పుట్టాయి. కానీ ఈ అమెరికా గుర్రాలు, వాతావరణ కారణాలవల్లా, మనుషుల వేట మూలంగా 7600 సంవత్సరాల క్రితమే అంతరించిపోయాయి. మళ్లీ గుర్రాలు అమెరికాలోకి స్పెయిన్ వారి వెంట మాత్రమే వచ్చాయి. 1540 ప్రాంతంలో, కొన్ని గుర్రాలు తప్పించుకుని ఉత్తర అమెరికా మైదానాలకు చేరుకున్నాయి. మిసిసిపీ ప్రాంతంలో వ్యవసాయం జరుగుతున్న రోజులవి. గుర్రాల మీదస్వారీ చేయవచ్చునని అక్కడి రైతులకు నిజానికి తెలియదు. అయినా వారు 1680 నాటికి గుర్రం స్వారీ, గుర్రాల మీద రవాణా నేర్చుకున్నారు. వంద సంవత్సరాల కాలంలో గుర్రం కారణంగా నార్త్ అమెరికనుల బతుకు తీరుమారింది. అక్కడి ప్రజలకు, ముఖ్యంగా మైదానాలలో వారికి, వేట, తిండి వెతకడం తప్ప సాంకేతిక విషయాలమీద పట్టు లేదు. లోహాలు కావాలంటే, యూరోపియనుల మీద ఆధారపడేవారు. కనుక గుర్రానికి నాడాలు వేయడం అందుబాటులో లేని పని. ఖర్చుతో కూడుకున్నపని! వారి గుర్రాలకు నాడాల అవసరం రాలేదుకూడా. గడ్డి మైదానాలలో తిరిగే గుర్రాల గిట్టలు అరిగే అవకాశమే లేదు.

గుర్రం నాడాలు వాడడం మొదలయింది యూరపులోని వాయవ్య భాగాలలోనే అనవచ్చు. అయిదవ శతాబ్ది నాటికే గౌల్స్, ఫ్రాంక్స్ జాతివారు తమ పెంపుడు గుర్రాలకు నాడాలు వేసినట్టు ఆర్కియాలజికల్ ఆధారాలు చెపుతున్నాయి. అక్కడి శీతోష్ణ పరిస్థితులు, భూమి లక్షణాలుకలిసి నాడాల అవసరానికి దారి తీశాయి. అక్కడ వాతావరణం తేమగా ఉంటుంది. మట్టి మెత్తగా ఉంటుంది. కనుక గుర్రం గిట్టలుకూడా మెత్తబడతాయి. అంతకన్నా ముఖ్యంగా అక్కడి వారు గుర్రాలను ప్రయాణాలకు, రవాణాకు, యుద్ధాలకు మాత్రమే వాడుకున్నారు. పెద్ద బరువులు మోస్తూ గుర్రాలు చాలా వేగంగా పరుగ్తెవలసివచ్చేది. నాడా లేకుంటే గిట్టలు అరిగి, గుర్రాలు కుంటివవుతాయి.

గడ్డి మైదానాలలోని ‘ఇండియన్స్’ వాడిన గుర్రాల వాడకం, ఇంచుమించు అడివి గుర్రాల బతుకుకు దగ్గరగా ఉండేది. అడవిగుంపులుగా, నెమ్మదిగా, గడ్డిమీద తిరుగుతూ ఉండేవి. అంతా పొడి ప్రాంతమది. ఎగుడు, దిగుళ్లుకూడా ఎక్కువగా ఉండవు. గిట్టలు అరిగినా ఒకే రకంగా, తిరుగుతాయి. అంతకన్నా విచిత్రంగా, అక్కడ అందరికీ ఒకటికన్నా ఎక్కువ గుర్రాలుండేవి. రెండు వేల మంది సైనికులున్న ఒక బృందానికి 15 వేల గుర్రాలు అందుబాటులో ఉండేవి.

యూరోపియనులకు ఈ పరిస్థితి లేదు. పైగా పశుపోషణ, నిర్వహణకు వారికి తగిన తీరిక లేదు. నైపుణ్యం అంతకన్నా లేదు. యుద్ధాలలో మునిగి తేలే సైనికులకు తమ క్షేమం ఎక్కువ ముఖ్యం. గుర్రం సంగతి అంతగా పట్టేదికాదు.

మైదానంలో వీరుడు కూడా యుద్ధం చేశాడు. కానీ, తన గుర్రాలను ఒక గౌరవం, ఒక ఆస్తిగా గమనించి గర్వంగా వాటిని ప్రదర్శించేవాడు. అప్పట్లో గుర్రాన్ని దొంగిలించడం అన్నది అతి హీనమయిన నేరం! అది హత్యకు సమానమనుకునే వారు అప్పట్లో! అందుకే అక్కడి వారు తమ గుర్రాలను జాగ్రత్తగా చూచి, నాడాల అవసరాన్ని గుర్తించారు. కౌబాయ్‌లు వాడిన గుర్రాలు చాలా వేగంగా పరుగెత్తేవి. కానీ, అవి ఎక్కువ దూరం వెళ్ళవలసిన అవసరం ఉండేది కాదు! కావలసినచోటికి క్షణాల్లో చేరగలుగుతారు. వారి అవసరం అంతవరకే. అక్కడినుంచి ముందుకువెళ్ళనవసరం లేదు. అయినా, ఆ నేల తీరు కారణంగా నాడాలు అవసరమయ్యాయి.

భారతదేశంలోనూ సాంతం ఎక్కువగా పొడి నేలలే. ఇక్కడా గుర్రాలను రవాణా, యుద్ధాలకే వాడారు. ఇక్కడా నాడాలు వాడుకున్నారు. వ్యవసాయంలో వాడే పశువులకు నాడాలు అవసరం లేదు అనే ఎద్దులు బండ్లను లాగుతూ గట్టి దారుల మీద చాలా దూరం వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు వాటికీ నాడాలు వచ్చాయి. ఈ నాడా ఎద్దులు బురద సేద్యానికి దిగితే కష్టం. ప్రస్తుతం ఎద్దులూ తరిగిపోతున్నాయి, నాడాలూ తరిగిపోతున్నాయి మరి. *

Friday, December 9, 2011

Cartoon - Computer

నవ్వితే నవ్వండి
లేదంటే ఊరుకోండి
నన్ను మాత్రం తిట్టకండి.


ఈ కార్టూను ఎట్లా తయారయిందో ఊహించగలరా?

Saturday, December 3, 2011

సినారె కవితా సంకలనం - నా సమీక్ష


జ్ఞాపకాల నిధులు
నా చూపు రేపటి వైపు (కవితా సంకలనం) రచన: డా. సి. నారాయణ రెడ్డి వెల: రూ. 150/-, ప్రచురణ: వరేణ్య క్రియేషన్స్, హైదరాబాద్ ప్రతులకు: విశాలాంధ్ర, నవోదయ
-గోపాలం కె.బి., October 30th, 2011

పద్మభూషణులు, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డా. సి. నారాయణరెడ్డి కవితా కృషీవలులు. ఆయన జీవితమే కవిత. ఒక విశ్వంభర, కర్పూర వసంతరాయలు లాంటి కావ్యాన్ని వెలయించినంత తీవ్రతతోనే ఆయన సినీగేయాన్ని కూడా రాస్తారు. ఆయన ఆలోచనే కవితగా సాగుతుంది. అందుకే ప్రతి జన్మదినానికి ఒక కొత్త కవితా సంపుటి కూడా పుడుతుంది. ఎనభయి వసంతాలు గడిచిన పండుగనాడు ఈ సంకలనం వచ్చింది. ఇందులో కవితలు 80 మాత్రమే. వీటన్నింటిలోనూ ఒక తలపండిన తాత్వికుడుగా సినారె మనలను పలకరిస్తారు.


కవికి మనసు మాత్రమే ఉంటుంది. వయసు ఉండదు. తలపండినదన్న భావం తలపులలో రాదు. అందుకే ‘ఎదుట నిలిచే సుదూర గమ్యం’ అన్న కవితలో ఆయన ‘గిరి శిఖరాలపై నుంచి దూకే జలపాతాలు, మోకాళ్ళు విరిగి పోతాయేమోనని శంకించవు’ అంటారు. అంతటి ఉత్సాహంతో మస్తకంలోని ఆలోచనలను పుస్తకంగా మనముందు పరిచారాయన.


శీర్షిక - నా చూపు రేపటి వైపు - అని ఇందులో వయసు వాసన ఏమయినా కనబడుతుందా?
‘గతం నిష్క్రమించింది. అమూల్య జ్ఞాపకాల విధులను నాకు మిగిలించి, అది నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది’’. - అంటారు మొదట్లో. కానీ వెంటనే ‘‘వర్తమానం నాతో చేయి కలిసి నడుస్తున్నది’’ అంటారు. అక్కడ నుంచి కవి ముళ్ళబాటలో నడిచి, భవిష్యత్తును చేరుకుంటే అది ఆయన పాదాల ముందు వాలుతుంది!


ఈ శీర్షిక కవితను 85వ పేజీలో వేశారు. అక్కడ దాని భావం బాగా పండుతుందని కావచ్చు. జ్ఞాపకాల నిధులు సాధారణంగా ఎవరినయినా నాస్కార్జియాలోకి లాక్కుపోతాయి. కానీ ఆలోచనా శీలులయిన ఈ కవి మొదటి కవితలోనే ‘ఆలోచనలకు పదును పెడుతూ కూచున్నాను’ అని ప్రకటించారు. సినారెలోని కవి తత్వం ఆ ఒక్కమాటతో ఆవిష్కరింపబడుతుంది. మొదటి కవితలోనే (సృజనయాగం). ఈ మాట రావడం యాదృచ్ఛికమా? పథకం ప్రకారం వచ్చిందా? శీర్షికకు అనుగుణంగా, రేపటివైపు చూపులు సంకలనం అంతటా కనిపిస్తాయి. బలమయిన ఆశాభావం అడుగడుగునా ఎదురవుతుంది.


చాలా కవితల్లో కాలగమనం గురించిన ప్రసక్తి ఉంది. ‘ఇలా ఎంతకాలం అవిశ్రాంతంగా సాగిపోతావు’ అని కవి గడియారాన్ని అడిగారొక చోట (కాల సూచిక). ‘ఎగిరిపోయిన జ్ఞాపకం’ అన్న కవితలో ముందుకు సాగిపోతున్న జలధార, వెనకవైపు తిరిగి చూస్తుందా? అంటారు. ‘నీ ప్రయాణం ఎంతకాలమని? అంటూ జీవితానే్న ప్రశ్నిస్తారొక చోట. వయసు వాలిపోతున్నా, మనిషి నిటారుగా నిల్చోవాలి అంటారు మరోచోట.


సంకలనంలోని కవితల్లో ముఖ్యంగా కనిపించే మరో అంశం స్మృతులు. అయినా ఎక్కడో వాటిని గురించిన బాధ కనిపించదు. స్మృతులలో నుంచి బలమయిన సమస్యలు బయటపడతాయి. తలుపులు మూసుకుని ‘కలగన్న గది’ కలలోని సన్నివేశాలను నెమరు వేసుకుంటూ, తలుపులు తెరుస్తుంది.


ఇన్ని కవితల్లోనూ మనుషులు కనిపించరు. పక్షులు, చెట్లు, కొండలు, కళ్ళు, చెవులు, ముక్కు లాంటివి ఎక్కువగా భావాలకు ఆలంబనలయి ముందుకు నడిపిస్తాయి. ఆలోచనలకు పదును పెడుతూ కూర్చున్న కవికి ఒంటరితనంలోనూ, చూపులు రేపటిపైనే. కానీ గమనించవలసిన మరో అంశం. అక్కడక్కడ మరణం. శూన్యం లాంటి బలమయిన భావాలు! శూన్యాన్ని వెళ్ళి కలిసినప్పుడు అది ‘నాలో కలిసిపో!’ అని పిలిచిందట. కవి మాత్రం ‘మానవాళికి దూరమయి, అస్తిత్వాన్ని కోల్పోవడం, కుదరదంటారు. చదువుతూ ముందు సాగితే చివరకు ఏకాంతం గురించి కవిత రానే వచ్చింది.


‘కాలం గీసిన రేఖ’, ‘ఈ పూట’, ‘నడుస్తూ నడిపించే కాలం’, ‘కాలజ్ఞత’, ‘తిరిగి చూసుకుంటే’, ఇవన్ని చివరి భాగంలో ఇంచుమించు వరుసగా వచ్చిన కవితలు. అలా సాగుతూనే ఒకచోట ‘సూర్యోదయం సరియైన సమయానికే జరిగిందని సంతృప్తీ కనబడుతుంది.


‘సత్తా ఉన్నంత మాత్రాన విత్తనాలన్నీ మొలకెత్తవు’ అంటూ సాగే కవిత ప్రశ్నల ఆంతర్యం’ కవిగారు తమను తాము అడుగుతున్న ప్రశ్నలకు నికషోపలం!


జాగ్రత్త! ప్రాసలు కనబడవు. మాటకారి తనం కనబడదు. కాలం గడిచింది గదా! పాత సినారె కనబడరు! ఈయన మరెవరో. తలపండిన తాత్వికుడు!


కవితే తన చిరునామా అన్న ఈ కవిగారి మరో సంకలనం కొరకు ఎదురు చూద్దాం.

-గోపాలం కె.బి.

Friday, December 2, 2011

ప్రశ్న - జవాబు


వైరస్‌లు చనిపోతాయా?

ప్రశ్న - జవాబు

Q వైరస్‌లు చనిపోతాయా?
A సూటిగా జవాబు చెప్పాలంటే, వైరస్‌లకు మరణం లేదు. ఎందుకంటే వాటికి జీవం లేదు. జీవంలేని వైరస్‌లు మరి జీవులు ఎట్లా అయినవని ప్రశ్న పుడుతుంది. అదే విచిత్రం. వాటిలో డిఎన్‌ఏ, లేదా ఆర్‌ఎన్‌ఏ అనే న్యూక్లిక్ ఆమ్లాలు ఉంటాయి. వాటి పని తీరును నిర్థారించే సమాచారం ఆ ఆసిడ్‌లలో ఉంటుంది. జీవులన్నింటిలోనూ ఇదే పద్ధతి గనుక, వైరస్‌లను జీవులుగా అంగీకరించక తప్పదు. కానీ, అవిసంపూర్ణ, స్వతంత్ర జీవులు కావు. తమంత తాముగా మనుగడ సాగించలేవు. మరేదో జీవిలో ఉన్నంత కాలమే వాటి మనుగడ సాగుతుంది. అక్కడ అవి తామున్న ప్రాణినుంచి జన్యుసమాచారాన్ని దొంగిలిస్తాయి.
ఇక్కడ ఇంకొకప్రశ్న పుడుతుంది. స్వంత జీవం, ఉనికి లేని ఈ వైరస్‌లు, చావు లేకుండా ఎంతకాలం కొనసాగుతాయి. ఎంతకాలం ఇన్‌ఫెక్షన్ కొనసాగుతుంది? అన్నవి అనుమానాలు. ఒక శరీరంలోకి ప్రవేశించకుండా బయటి వాతావరంలో గనుక ఉండిపోతే, హెచ్‌ఐవి (ఎయిడ్స్), ఇన్‌ఫ్లుయెంజా లాంటి వైరస్‌లు కొన్ని గంటలకన్నా ఎక్కువ కాలం ఉండవు. అవి చనిపోతాయని కాదు గానీ, పని చేయలేకుండా సమసిపోతాయి. పరిశోధకులు, వాటిని పట్టి ఉంచి పరిశీలించడానికి చాలా కష్టపడతారు. అదే మశూచి (స్మాల్‌పాక్స్) వైరస్, ఎక్కడ పడి ఉన్నా సంవత్సరాలపాటుండి, అవకాశం దొరికితే చాలు తిరిగి ఇన్‌ఫెక్షన్‌కు కారణం కాగలుతుంది. 1787లో బ్రిటిష్ డాక్టర్ల కారణంగా ఈ వైరస్ ఆస్ట్రేలియాకు చేరిందట. అది అక్కడ రెండు సంవత్సరాలపాటు పడి ఉండి, ఆ తరువాత స్థానిక అబూరిజిన్స్‌లో ప్రవేశించి పెద్దఎత్తున మశూచి రావడానికి కారణమయిందట!

-----
Q కార్లు, స్కూటర్లు, మోటార్ సైకిళ్లకు వేసే ఎర్రరంగు
మిగతా రంగులకంటే త్వరగా వెలిసిపోతుంది.. ఎందుకు?
A ఎర్రరంగులు మామూలుగా వెలుగుకు ఎక్కువ ప్రభావితమవుతాయి. ఎండలోని యువి కిరణాల కారణంగా ఎర్రరంగు ముందు విరిగిపోతుంది. ఈ విషయం ఒక్క వాహనాలలోనే కాక పుస్తకాలు, పెయింటింగులు మొదలైన ఎన్నో చోట్ల కూడా కనబడుతుంది. ప్రస్తుతం కార్లకు, మిగతా వాహనాలకు వేస్తున్న రంగులు బాగా అభివృద్ధి చెందిన రకం. కనుక ప్రస్తుతం ఎర్రరంగు అంతగా వెలిసిపోవటం లేదు. నీలం రంగు తొందరగా పాడవుతుందన్న భావం కూడా ఉందిప్పుడు. రంగుల మీద ఎండ ప్రభావాన్ని బట్టి వాటి మన్నిక ఉంటుంది.