Friday, February 10, 2012

మన గురించి మనం - 6


మెదడుందా? తెలివి ఉందా?
మనసు ఉందా? భావాలు ఉన్నాయా?
గుండె ఉందా? ధైర్యం ఉందా?

మెదడు లేదు అనడం కూడా కుదరదు. లేదు అన్నమాట ఎక్కడినుంచి రావాలి ఆలోచనలో నుంచి కదా మెదడు లేకుండా ఆలోచన ఎట్లా వీలయింది మనం ఉన్నమన్న భావం ఉందంటే మెదడు ఉందని కదా అర్థం కనుక ఎవరయినా మెదడు లేదు అంటే వారు తమకు మెదడు  ఉందని చెప్పినట్టు లెక్క. తెలివి సంగతి మరోలాగ ఉంటుంది. ముందు మెదడు ఉంది అంటే ఏమని అర్థం పురంరె ఉంది. అందులో మెదడు ఉంది. అంటే ఏదో పదార్థం ఉందని అర్థం. మన బుర్రలో మెదడు ఉందని మనం చూడలేము. ఈ మధ్యన డాక్టర్లు మన మెదడును చూడగలుగుతున్నారు మనిషికి మత్తు కూడా ఇవ్వకుండానే మెదడుకు చికిత్స చేస్తున్నారు. కనుక మనకూ మెదడు ఉండే ఉంటుంది అని ఒక నమ్మకం. మరి మెదడు ఉంటే తెలివి ఉన్నట్టేనా?
మెదడు తెలివి ఒకటేనా?

ఒకటేమో కనిపించే పదార్థం. ఇంకొకటి కనపడని అలోచన.
అవి రెండూ ఒకటి కానే కావు!

పదార్థానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. అవి కొంత స్థలాన్ని ఆక్రమించుకుంటాయి. వాటికి కొలతలు ఉంటాయి. ఆకారాలూ ఉంటాయి. ఒక చోటు కూడా ఉంటుంది మెదడు తలలో ఉంటుంది కొంత బరువు ఉంటుంది. ఆకారమూ ఇంచుమించు తెలుసు. మరి తెలివికి ఇవేవీ లేవుగదా!

ఆలోచనలు ఎట్లాగున్నాయని అడగ వచ్చు కానీ ఎంత ఉన్నాయని అడిగితే అర్థం ఉండదు. ఉన్నామన్న భావనకు పొడవు వెడల్పులుండవు. ఈ ఆలోచన ఎక్కడ ఉందన్నా అర్థం ఉండదు.

నాహృదయంలో నిదురించే చెలీ అని పాట పాడితే బాగానే ఉంది కానీ, ఈ చెలి ఎక్కడ నిదురించింది. ఆలోచనల్లో కదా ఎక్కడున్నాయి ఆ ఆలోచనలు. మనసులోనా మెదడులోనా. ఇంగ్లీషులో బ్రెయిన్, మైండ్ అని రెండు మాటలున్నాయి. మనకా బాధ లేదు. రెండూ ఒకటేనన్న భావం కలిగే విధంగా మాట ఉంది. కానీ మనం దానితోనూ తికమక పడుతున్నాము.
గట్టి గుండె గల మనిషి అంటే డాక్టర్లు ఆ మనిషికి బతికే అవకాశాలు తక్కువంటారు. అంటే రక్తం పంపించే గుండె, ధైర్యం ప్రదర్శించే గుండె వేరువేరన్నమాట.

ఇవన్నీ కలిసి మెదడులోనే ఉన్నాయని చెప్పడానికి ఇంత గందరగోళం.
ఈ మనసు, మెదడు, గుండె కాంప్లెక్స్ విచిత్రమయినది. స్వంతదారునికే తప్ప మిగతా వారికి వాటి లోతులు తెలియవు. ఉనికి కూడా తెలియదనవచ్చునేమో.

ఎవరి అలోచన వారికే తెలుస్తుంది. మిగతా వారికి దాని చాయలు కూడా తెలియవు. కొండొకచో చెప్పినా అర్థం కావు. మన చేతులు, కాళ్లు, తల. నాలుక లాంటి వాటి సంగతి అట్లా కాదు. మెదడులోకి వైద్యులు కళ్లతో తొంగి చూడ గలుగుతారు. ఇతరుల మెదడును చూడ గలిగిన ఈ డాక్టర్లు మనసులోకి మాత్రం చూడలేరు. వారికి మెదడు కనిపిస్కుంది. అందులోని మనసు, గుండె కనిపించవు. అవి ఎవరివి వారికే స్వంతం.

ఇంత చెప్పినా ఈ మనసంటే ఏమిటో తెలియలేదు. తెలియదు.
అది మెదడులో ఉందంటే నమ్మకం కుదరదు.
కనుకనే దాన్ని మనం పట్టుకోవాలి. అదుపులో పెట్టుకోవాలి.
ఆలోచించండి. వీలవుతుందా?

Thursday, February 9, 2012

అవునంటారా? ఆలోచించండి!

బతుకు బంఢి దానంతటది ముందుకు సాగుతున్నదా? లేక మనం నడపదలుచుకున్న దారిలో నడుస్తున్నదా? మనమనుకున్న దారిన సాగాలంటే మనం అప్పుడప్పుడు నిర్ణయాలు చేసి బండిని పక్కకు మళ్లించవలసి ఉంటుందేమో? ఏ పక్కకు మళ్లవలసిందీ మనకు తెలుసునంటే మనం నిర్ణయాలు చేస్తున్నామని అర్థం. మంచి చెడ్డలను గమనించి నిర్ణయం చేస్తున్నామంటే, మనం ఆలోచిస్తున్నామని అర్థం! అవునా? ఆలోచిస్తున్నామా?

ఎందుకు ఆలోచన? అంతా బాగానే నడుస్తున్నప్పుడు దేని గురించి ఆలోచన? ఈ ఆలోచనలతో మనమేమైనా బాగుపడే పద్ధతి ఉందంటారా? జవాబు చెప్పడం సులభం. ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారంటే ఆలోచన చేసినందుకే కదా? అది బతుకు దారిగానీ మరో విషయంగానీ తెలిసీ, తెలియకుండా మన మెదడులో ఆలోచనలు సాగుతూనే ఉంటాయి. వాటి ప్రభావం మనకు అర్థమయి, మార్పులు చేర్పులు చేయగలగడం, అది తర్వాతి మెట్టు. కొన్ని పనులు మాత్రం అలవాటయిపోతాయి. వాటి గురించి ఆలోచన అవసరం ఉండదు. ఉదాహరణకు చేతిలోకి తీసుకున్న తిండి పదార్థాన్ని నోట్లో బదులు ఎప్పుడయినా ముక్కులో పెట్టుకున్నారా? కానీ ఏం తినాలనేది మాత్రం గొప్ప ఆలోచన, చర్చ! దానిమీద రకరకాల నిర్ణయాలుంటాయి. ఆలోచన లేనిది ఈ నిర్ణయాలన్నీ జరగవు.


మనిషి అన్న తర్వాత మెదడులో నిరంతరం ఆలోచనలు సాగుతూనే ఉంటాయి. నిజానికి మనకు ఆలోచనకన్నా సులభంగా చేతనయిన పని ఇంకొకటి లేదు. అయితే చాలావరకు ఈ ఆలోచనలను మనం వాటిదారిన వదిలేస్తుంటాము. అందుకే వీలు దొరికితే చాలు, మనకు ప్రమేయం, మన మీద ప్రభావం లేని విషయాలను గురించి ఆలోచిస్తాము. వాటి గురించి మాట్లాడతాము కూడా. (బుచ్చిబాబుగారు, నవీన్‌గారు లాంటి కథా రచయితలు అదుపు లేకుండా సాగే ఈ ఆలోచనలను కథలుగా, నవలగా రాశారు. దాన్ని స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్‌నెస్ అన్నారు). నిద్రలేచిన మరుక్షణం ఆలోచనలు మొదలవుతాయి. నిద్రలో కలలకు మన ఆలోచనలే కారణం. మెలుకువ ఉన్నంతసేపు ఏదో ఆలోచిస్తూనే ఉంటాము. మరో పనిలో ఉన్నా కూడా ఆలోచనలు సాగుతూనే ఉంటాయి. ఈ నాలుగు అక్షరాలు చదువుతూ మీరు, ‘ఏమిటీ ఈ మాటలకు అర్థం? వీటిని పట్టించుకోవాలా? పోనివ్వాలా?’ అని ఆలోచిస్తున్నారు. ఈ రకంగా, మనకు తెలియకుండానే, ఆలోచనలు సాగుతుంటాయి. కనుకనే మనకు స్వంత భావాలుంటాయి. ఇష్టాలు, అయిష్టాలు ఉంటాయి. మనకు, మన ప్రవర్తనకు ఒక తీరు ఉంటుంది. మనం చేయదలుచుకున్న పని, ఉద్యోగం, వ్యాపారం మొదలయిన వాటి గురించి ఆలోచన జరుగుతుంది. నిర్ణయాలు జరుగుతాయి. బతుకు బండి ముందుకు సాగుతుంది. సీరియస్‌గా ఆలోచించటం మాని, జరుగుతున్న పనులను జరగనిస్తే అసంతృప్తి మిగులుతుంది. ‘ప్రవాహంలో కొట్టుకుపోవడమే నరకం, ఈది మన దారిన పోవడం స్వర్గం’ అన్నారొకాయన.

ఆలోచించడం ఇంత సులభంగా జరిగేదయితే, దాని గురించి అంత ఆలోచించడం ఎందుకు, అని అనుమానం ఎవరికయినా రావచ్చు! అందరూ సరిగా ఆలోచించి తమ బతుకు బండి పగ్గాలు తమ చేతులో ఉంచుకుంటే, సమస్య ఏముంది? మనిషి మనసు తన దారిలో ఆలోచిస్తుంది. దాన్ని ఆలోచించే మెదడు, అదుపులో ఉంచుకోవాలి. సైకాలజీ, సమస్యలు మొత్తం ఈ మనసు, మెదడులో పోటీలోనుంచే పుట్టుకు వస్తాయి.


తెలిసి కూడా తప్పులు చేస్తున్నవారి గురించి మనకు తెలియదా? ‘నేను సిగరెట్లు ఎన్నిసార్లు మానివేశానో నాకే గుర్తులేదు!’ అన్న వ్యక్తి ఎంత చిత్రమయిన మనిషయి ఉండాలి? ఆలోచన అనుకున్నట్లు నడవదు. అందులోనుంచి సమస్యలు పుడతాయి. బతుకులోనూ సమస్యలు పుడతాయి. అప్పుడు కూడా చాలామందికి అర్థం కాదు. నేను ఇలాగెందుకు ఉన్నాను? అన్న ఆలోచన చాలామందికి కలగదు. ఈ ప్రపంచంలోని సమస్యలన్నింటికీ మూలం మనిషి ఆలోచన పద్ధతి! ‘అయితే ఏంటి?’ ‘నీకెందుకు?’ లాంటి ప్రశ్నలు తెలిసినవే! ‘నేను బాగానే ఉన్నాను. నా ఆలోచనలు అందరికంటే గొప్పవి’ అనుకుంటారు చాలామంది. మనుషులకు మొదటినుంచీ, ఆలోచనతో పనిలేకుండా బతకడం అలవాటయింది. నాకు సమస్య ఉంది అనుకోగలగడం ఒక మెట్టు. నా పరిస్థితికి, నా ఆలోచనలే కారణం అనుకోగలగడం ఆ తరువాతి మెట్టు! అందుకే మనం సీరియస్‌గా, ఆలోచించడం అలవాటు చేసుకోవాలి!


మంచివిగా గుర్తింపు పొందిన ఆలోచనలతో మన ఆలోచనలను సరిపోల్చుకోవాలి! అక్కడ అసలు కథ మొదలవుతుంది!

Tuesday, February 7, 2012

ప్రొఫెసర్ నాయుడమ్మ - పుస్తకం


విశిష్టం.. శాస్తజ్ఞ్రుడి జీవన చిత్రం

డా.వై.నాయుడమ్మ
రచన: డా. సోమరాజు సుశీల
సి.పి.బ్రౌన్ అకాడమి 53,
నాగార్జునహిల్స్,
పంజగుట్ట, హైదరాబాద్-82
పేజీలు: 134;

వెల: రూ.95/-


సి.పి.బ్రౌన్ అకాడమీవారు విరివిగా చేస్తున్న పుస్తక ప్రచురణలో 25కు పైగా పుస్తకాలు వివిధ రంగాలకు చెందిన మహనీయుల జీవిత చిత్రాలు. వాటిలో ఒక సైంటిస్టు గురించి వచ్చిన పుస్తకం ఇదేననవచ్చు. నాయుడమ్మగారు కేవలం ఒక సైంటిస్టు కాదు. గొప్ప మానవతావాది. అట్టడుగు వర్గాల మేలుకొరకు పాటుపడిన ఆదర్శమూర్తి. ఈ ప్రపంచంలో చాలా కొద్దిమంది జీవితాలు మాత్రమే అందరూ అనుసరించవలసిన బాటలుగా సాగుతాయి. అటువంటి అరుదయిన వ్యక్తులలో నాయుడమ్మగారి పేరు ముందు వస్తుంది.


‘నేను పుట్టుకతో రైతును! వృత్తిద్వారా అంటరాని వాడిని, రెండింటి గురించి నేను చాలా గర్వపడతాను!’ అన్నారు డాక్టర్ యెలవర్తి నాయుడమ్మ. ఆయన తమ పరిశోధనకొరకు ఎంచుకున్న రంగం తోలు పరిశ్రమ. ఎన్ని రకాల పదవులు, అవకాశాలు వచ్చినా ఆయన ఈ రంగాన్ని మాత్రం వదలలేదు. భారతదేశంలో శాస్త్ర పరిశోధనలు, మామూలు ప్రజలకు పనికివచ్చేలా సాగవు. నిజానికి అవి ఎవరికీ పనికిరావు అన్న విమర్శ ఉంది. వౌలిక పరిశోధనలు కొంతవరకు ఆ రకంగా ఉంటే ఉండవచ్చు. వ్యవసాయం, ఆరోగ్యం, పరిశ్రమల విషయంలో మన దేశంలో జరిగిన పరిశ్రమ మామూలువారికి కూడా అందుబాటులోకి వచ్చే విప్లవాలకు కారణమని చాలామంది గమనించరు. నాయుడమ్మగారి నేతృత్వంలో దేశంలో జరిగిన ‘తోలు’ గురించిన పరిశోధనకు ప్రపంచస్థాయిలో ఎంతో గుర్తింపు ఉంది. అంతేగాదు బడుగు చర్మకారులకు సాయపడింది!


నాయుడమ్మగారి జీవిత చిత్రాన్ని డా.సోమరాజు సుశీలగారు రాయడం ఎంతో ఉచితంగా ఉంది. ఆమె నాయుడమ్మగారిని స్వయంగా ఎరిగినవారు. నాయుడమ్మగారి పరిశోధనలు, నిర్వహణ విధానాలవల్ల లాభపడినవారు కూడా. అందుకే, స్వయంగా కెమిస్ట్రీ పరిశోధకులయిన సుశీలగారు నాయుడమ్మగారి పరిశోధనల గురించి, దేశంలో సైన్సు, పరిశోధన, సంస్థలు, పరిశ్రమల గురించి బాగా రాయగలిగారు.


నాయుడమ్మగారు మద్రాసులోని చర్మ పరిశోధన సంస్థలో తమ కృషిని ప్రారంభించి, ఆ సంస్థకు నిర్దేశకులయ్యారు. భారతదేశంలో చర్మ పరిశ్రమకు కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. శాస్త్ర, సాంకేతిక పరిశోధనలను నడిపించే సి.ఎస్.ఐ.ఆర్‌కు ఆయన డైరెక్టర్ జనరల్ అయ్యారు. ‘నేను రిటైర్‌మెంట్‌దాకా ఆ పదవిలో ఉండను. అయిదు సంవత్సరాల తర్వాత వచ్చి, నా పరిశోధన చేసుకుంటాను, మీకు అంగీకారమయితేనే వస్తాను!’ అని దేశ ప్రధానమంత్రికే సూటిగా చెప్పగలిగారు నాయుడమ్మ. ఆయనకు తమ పరిశోధన మీద గల అంకితభావం, అక్కడ ప్రపంచానికి కనబడుతుంది. నిర్వహణదక్షుడయిన నాయుడమ్మగారు, చర్మ పరిశోధన సంస్థలో ఒక ఎకనామిక్స్ శాఖను కూడా ఏర్పాటుచేసి, పరిశోధనలను వాడడం వేపు చూసిన దృష్టి ఆశ్చర్యం కలిగిస్తుంది.
‘కాయబోయే కాయలకన్నా, పండిన ఫలాలను పంపిణీ చేయడంపై ఆయన దృష్టి ఉండేదని’ సుశీలగారు రాశారు. అన్ని రంగాలలోనూ ఈ రకం ఆలోచన ధోరణి కొంత ఉన్నా, దేశం ప్రపంచం ఎంతో బాగుపడతాయి.


నాయుడమ్మగారిని ప్రఖ్యాత జెఎన్‌టియుకు వైస్ ఛాన్సలర్‌గా ఏరికోరి నియమించారు. అక్కడ తనకు కుదరదని, ఆయన తిరిగి పరిశోధనలోకి వచ్చేశారు. ప్రతి అనామకుడూ అధికారంకొరకు పాకులాడుతుండడం అందరికీ తెలిసిందే.
ఈ పుస్తకంలో నాయుడమ్మగారు తమ కార్యదర్శులకు రాసి ఇచ్చిన పనె్నండు సూత్రాలు, అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్‌కు రాసిన లేఖ లాంటి కొన్నింటిని అనువదించి పొందుపరిచారు. నాయుడమ్మగారు అమలుచేసిన కరీంనగర్ ప్రాజెక్టు వివరాలు కూడా ఇందులో ఉన్నాయి. వీటిని, మొత్తంమీద ఈ పుస్తకాన్ని అందరూ చదవాలి. చేతనయితే దీన్ని ఇంగ్లీషులోకి అనువాదం చేయించి దేశంలోని శాస్త్ర పరిశోధకులందరికీ అందజేయాలి!


కేవలం రెండుమూడు గంటలు మాట్లాడినంత మాత్రాన, ఒక వ్యక్తి జీవితమంతా గుర్తున్నారంటే, ఆ వ్యక్తి నిజంగా ఆదర్శమూర్తి. అటువంటి అనుభవం ఈ సమీక్షకునికి మిగిలించారు నాయుడమ్మగారు. ఆంగ్ల చిత్రాల నటుడు గ్రెగరీపెక్ లాగ కనిపించే నాయుడమ్మగారు, ‘ఫీడ్, ఫాడర్, ఫెర్టిలైజర్’ అనేవి మూడు కుదిరితే ఆంధ్ర దేశం మరింత ముందుకు సాగుతుందని రేడియో పరిచయంలో చెప్పిన మాటలు యింకా చెవుల్లో గింగురుమంటున్నాయి
.
హాస్యప్రియులు, జీవితాన్ని ప్రేమించిన వ్యక్తిఅయిన నాయుడమ్మగారి ఆసక్తికరమయిన జీవితానికి ఈ పుస్తకం ‘కొండను అద్దంలో చూపించే’ ప్రయత్నం. అయినా జీవన చిత్రంలో ఉండవలసినవన్నీ ఇందులో ఉన్నాయి. కనుక, ఈ పుస్తకాన్ని అందరూ చదవాలి. అందరిచేత చదివింపజేయాలి.

Monday, February 6, 2012

అంతరిక్షంలో కొవ్వొత్తి వెలిగిస్తే మండుతుందా?


అంతరిక్షంలో కొవ్వొత్తి వెలిగిస్తే మండుతుందా?


ఒక అబ్బాయి మందుల కంపెనీ రిప్రెజెంటేటివ్ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్ళాడు. అక్కడ అతడిని భూమి నుంచి చంద్రుడు ఎంత దూరం? అని అడిగారు. ‘ఏమండీ మన మందులు చంద్రునిమీద కూడా అమ్ముతారా?’ అని గడుసుగా ఎదురుప్రశ్న వేశాడు అబ్బాయి. అంతరిక్షంలో చీకటి ఉంటుందా? అక్కడ కొవ్వొత్తి ఉంటుందా? వెలిగిస్తే మండుతుందా? ఇలాంటి ప్రశ్నలు పుట్టిన బుర్ర గొప్పది! ప్రశ్నలకు జవాబులు ఆలోచించిన బుర్రలు అంతకన్నా గొప్పవి. ఈ రకం సంగతులను కూడా చదవాలనుకునే బుర్రలు మరింత గొప్పవి!


ముందుగా అంతరిక్షంలోకి మనుషులు లేకుండానే నౌకలను పంపారు. అందులో మన వాతావరణంలోలాగా అన్ని వాయువులు కలిపిన గాలికి బదులు, అంతా ప్రాణవాయువే ఉంటే ఎలాగుంటుందని చూడదలుచుకున్నారు. ఆక్సిజన్‌తో అగ్ని ప్రమాదాలు జరుగుతాయని అనుమానం వచ్చింది. అందుకే అక్కడ కొవ్వొత్తి వెలిగించి చూశారు. నిజంగా కొవ్వొత్తి మంటా? లేక మరో మంటనా? అన్న ప్రశ్నను పక్కన ఉంచితే, అంతరిక్షంలో మంట తన కారణంగా తాను ఆరిపోతుందని అర్థం చేసుకున్నారు!

కొవ్వొత్తి వెలిగిస్తే, వెలుగు, వేడి, కార్బన్ డై ఆక్సైడ్, నీటి ఆవిరి పుడతాయి. వేడివల్ల అవి వ్యాకోచం చెందుతాయి. అంటే వాటి సాంద్రత (చిక్కదనం) తగ్గుతుంది. కనుక అవి తేలికయి పైవేపు బయలుదేరతాయి. కనుక మంట పైకి సాగుతుంది. ఎక్కువ సాంద్రతగల గాలిలోనుంచి ఆక్సిజన్ తక్కువ సాంద్రతలోకి ప్రవహిస్తుంది. మంట కొనసాగుతుంది. సాంద్రతలో తేడావచ్చి మంట పైకి సాగడానికి ముఖ్యకారణం భూమిక గల గురుత్వాకర్షణ శక్తి, అంతరిక్షంలో ఈ లక్షణం ఉండదు. అందుకే అక్కడ బరువు తెలియదు. కనుక సీఓటూ, నీటి ఆవిరులు పైకి పోకుండా మంట చుట్టూ జమగూడుకుంటాయి. ఆక్సిజన్‌ను అడ్డుకుంటాయి. మంట ఆరిపోతుంది.
గురుత్వాకర్షణలేని వాతావరణం లో మంట కొనసాగాలంటే, అందులోకి ఆగకుండా ఆక్సిజన్ పంపుతూ ఉండాలి. లేదా వత్తిలో నూనెలాగా డిఫ్యూజన్ అనే పద్ధతిలో వాయువు అందాలి. గాలి కదలకుండా ఉండి కూడా గదిలో సువాసనలు వ్యాపించే పద్ధతి ఇది. వాసన గాలిలో కలిసి అంతటా సమంగా వ్యాపించే ప్రయ త్నం చేస్తుంది. కానీ ఈ పని చాలా నెమ్మదిగా సాగుతుంది గనుక మంట ను నిలబెట్టజాలదు.

అంతరిక్ష నౌకలో మంటలు రేగుతాయన్న అనుమానంతో ఈ ప్రయో గం జరిగింది. కానీ 1967లో అపోలో-1లో మంటలు రేగాయి. ముగ్గురు వ్యోమగాములు మరణించారు. అదెట్లా? అని అనుమానం కలిగింది కదూ! ప్రమాదం జరిగినపుడు నౌక ఇంకా భూమిమీదనే ఉంది మరి! ఆ ప్రమాదం అంతరిక్షంలో జరిగే అవకాశం లేదు

.

మందులకు లొంగని క్షయ

ఇది ఆంద్రభూమిలో వచ్చిన నావ్యాసం


పెద్దిగా చూడడానికి చిత్రం మీద క్లిక్ చేయండి

Saturday, February 4, 2012

నీరు - విశేషాలు


* భూమి మీద నీరున్నందుకే జీవం ఉంది. మనం ఉన్నాము. నీటి లక్షణాలు చిత్రమయినవి.

*మానవ శరీరంలో ఎక్కువ శాతం నీరే ఉంటుంది. యుక్తవయసుగల స్ర్తి, పురుషుల శరీరంలో శరీరం బరువులో 55 శాతం, 60 శాతం నీరు ఉంటుంది. అమ్మాయిల శరీరంలో కొవ్వు పదార్థం ఎక్కువ గనుక కొంత నీరు తక్కువగా ఉంటుంది.

* నీటి శాతం: స్ర్తిలు 55 శాతం పురుషులు 60 శాతం, శిశువులు 78 శాతం, క్రీడాకారులు 60-65 శాతం.

* ఒక్క టెన్నిస్ క్రీడాకారుని శరీరం నుంచి గంటకు 10 నుంచి 11 కప్పులు చెమట రావడంలో వింత లేదు!

* నీరు తాగకుండా ఒక మనిషి 7రోజులవరకు బతకవచ్చునంటున్నారు.

* తిండి లేకుండా నెల రోజులు కూడా మనం ఉండగలుగుతాము.

* మనిషి మెదడు 70 శాతం నీటితోనే నిండి ఉంటుంది. అంటే నీరు వేరుగా మాత్రం ఉండదు మరి!

*ఎండ బాగా ఉండే రోజున ఒంటె 53 గాలన్ల నీరు తాగగలుగుతుంది.

* ఒంటె తాగిన నీరు దాని రక్తంలో ఉంటుంది. మూపురంలో మాత్రం కాదు.

*వాన నీటి చుక్కలు 2-3 మి.మీ దాకా ఉంటాయి. గాలి తాకిడి ఎక్కువయితే అవి చిన్న చుక్కలుగా విడిపోతాయి.

*ఈ ప్రపంచంలో 88.4 కోట్లమందికి తాగడానికి మంచినీరు అందడంలేదు!

*వ్యర్థం: మీ ఇంట్లోగానీ, మరోచోటగానీ కుళాయి నుంచి సెకండుకు ఒక చుక్క ప్రకారం నీరు లీక్ అవుతున్నదనుకోండి. ఒక సంవత్సరంలో 2,642 గాలన్ల నీరు వ్యర్థంగా పోతుంది!

Friday, February 3, 2012

తర్కమంటే అంతే


అవును మరి,
తర్కమంటే అంతే.


కానీ ఇందులో మరో విషయం కూడా ఉంది.
చెప్పిన మాట నచ్చకుంటే
"శేషం కోపేన పూరయేత్"
అని సిద్ధాంతమట.


వినే మనసుంటే అందరి మాటా నిజమనిపిస్తుంది
జాగ్రత్త!