Monday, April 22, 2013

గోపాల చక్రవర్తి కవిత

ఈయన తనను తాను గోల చక్రవర్తి అనేవాడంటారు నిజమా
నేను ఈయనను చూచాను.
పెద్ద పర్సనాలిటీ.
అన్ని రకాలుగానూ
అయినా మంచి సరస హృదయం

కవిత చదవండి
ఆయన తీరు తెలుస్తుంది.


Saturday, April 20, 2013

చిత్రం - విచిత్రం 1

ఈ బొమ్మ మన దేశానిది కాదు.
ఆఫ్రికాది.


చిత్రం కదూ?

Friday, April 12, 2013

నారాయణ్ శ్రీధర్ బేంద్రే

స్వర్గీయ శ్రీ పైడిమర్రి రాజా రామచంద్రరావు గారు కళా తపస్వి.
ఆయన బహుముఖ ప్ఱజ్ఞ గురించి చెప్పడాలికి ఒక పుస్తకం రాయాలి.
ఆయన రాసిన ఒక పుస్తకాన్ని తెలుగు చేసే అవకాశం నాకు దక్కింది.
అందులో నుంచి ఒక్క పేజీ మాతరం ఇక్కడ పంచుకుంటున్నాను.
ఇది భారతీయ కళల గురించిన పుస్తకం. 
అందులోని చివరి భాగంలో ప్రఖ్యాత చిత్రకారుడు బేంద్రే గురించి రాశారు.

నారాయణ్ శ్రీధర్ బేంద్రే




వాస్తవికత యొక్క ప్రాముఖ్యాన్ని గుర్తించే ప్రయత్నంలో నారాయణ్ శ్రీధర్ బేంద్రే నైరూప్య చిత్రకళ అనే గమ్యం దాకా పయనించాడు. అంతకు ముందే అతను భారతీయ లఘుచిత్రకళల మీద అకడమిసిజమ్, ఇంప్రెషనిజమ్, క్యూబిజమ్, ప్రాచ్యభావాలను ముఖ్యంగా గమనించాడు. అతనికి వస్తు నిర్మాణ వైచిత్రిలోని వివరాల పట్ల అత్యంత శ్రద్ధ. అందుకే రంగులు సాధించగల ప్రేరణావకాశాల గురించి ఎంతో తరచి చూచాడు. అనుకోకుండా అలవోకగా కుంచె కొన్ని రూపాలను ముందుంచింది. పసుపు, నారింజ, నీలం, ముదురుగోధుమ లాంటి రంగుల వరుసలతో ఒక కదలిక కనిపించింది. అందులోనే స్థలం కదిలి చిందులు వేసింది. అతను ఈ కళా సమన్వయాన్ని ఫ్రెంచి ప్రవీణుడు ఎమిలీ బోనార్డ్ నుంచి నేర్చుకున్నాడు. ఆ రంగులలోనే ఆకారాలు ఆవిష్కరింపబడ్డాయి. చుట్టు హద్దులుగా ఉండే గీతల అవసరం తీరి పోయింది. బేంద్రే ఆ తరువాతి కాలంలో వేసిన చిత్రాలలో ఒక ఔద్ధత్యం కనబడుతుంది. రంగులు వాటి గట్లు తెంచుకుని విలయతాండవం చేస్తాయి. అంతకు ముందేమో, రూపాలు ముందే ఊహించి సమన్వయ పరిచినట్లు ఉండేవి. ఆ తరువాతి నైరూప్య కళా ప్రయోగం పూర్తిగా మరో తీరు. ఆక్షన్ చిత్రాలూ అలాంటివే. అంటే, సౌందర్య పిపాసలో అతను తెరిపి లేకుండా తపించి, తనకు తాను కొత్త పద్ధతిలోకి మారగలిగాడని చెప్పడానికి ఇదొక ప్రమాణం.

బేంద్రేలోని అశ్చర్యకరమైన వైవిధ్యాన్ని బరోడాలో ఎందరో చిత్రకారులు అనుసరించారు. బరోడా విశ్వవిద్యాలయం వారి ఫైన్ ఆర్ట్స్ విభాగానికి బేంద్రే అధిపతిగా ఉన్నాడు మరి. అక్కడ అడ్డు లేని స్వాతంత్ర్యంతో కొత్త సృజన తల ఎత్తింది. జ్యోతి భట్, శాంతి దవే, జి.ఆర్. సంతోష్,  గులాం ముహమ్మద్ షేఖ్ అందుకు ఉదాహరణలు.
 

కొట్టవచ్చినట్టి వైవిధ్యంగల చిత్రకారుడు బేంద్రే. అతను ఎన్నో శైలులు, పద్ధతులతో ప్రయోగాలు చేశాడు. ఒక మూసలో ఇరుక్కు పోయేది లేదన్నాడు. అతని మీద మాత్రం బాంబే పద్ధతి ప్రబావం కొంతవరకు ప్రసరించింది.ముఘల్, రాజపుత్ లాంటి స్థానిక సంప్రదాయాల ప్రభావంతో బాటు, బెంగాల్ పునరుద్ధరణ ఉద్యమం, సెజాన్, గాగిన్ ల పోస్ట్ ఇంప్రెషనిజంల ప్రభావాలు కొంత పడ్డాయి. అతని విస్తృతమయిన కళాసృష్టికి భారతీయతే ముఖ్యాధారం. అతని చుట్టూ ఉన్న వాతావరణమే అందులో ప్రతిబింబించింది. ఎంతో వ్యక్తిగతమయిన సమగ్ర దృష్టికి అతని చిత్రాలు సమగ్రమయిన ఉదాహరణలు. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురయినా అతనిలో మాత్రం నిరంతర అన్వేషణ కొనసాగింది. అది జీవితంలోని మానవత వెచ్చదనం, వర్ణాలకు స్పందించింది.

Monday, April 8, 2013

తలిశెట్టి రామారావు - కార్టూనిస్టు

తెలుగు వారిలో ఈయనే మొదటి కార్టూనిస్టు


ఈ కార్టూను 1936 నాటిది. ఈయన 1931 నుంచీ కార్టూనులు వేశారు.




ఆరుద్ర గారు రామారావు గారి గురించి రాసిన కూనలమ్మ పదాలు.

Sunday, March 31, 2013

చలం - కాలం


గుడిపాటి వెంకటచలం గారు టైం ట్రావెల్ లాంటి కథ ఒకటి రాశారంటే ఆశ్చర్యం.
ఒకాయన జులూలాండ్ అనే చోట రాయబారిగా పని చేసి తిరిగి వస్తాడు.
నిజానికి అక్కడి వారికి ఇండియా అని ఒక దేశం ఉందా అని అనుమానం వస్తుంది కథ మొదట్లో.
మరి అక్కడ ఆయన రాయబారిగా ఏం చేశాడని అడగ కూడదు.


కథ చివర్లోని కాస్త భాగం చదివితే మాత్రం ఆయన చెప్పదలుచుకున్నదేమిటో కొంచం అర్థమవుతుంది.
చదవండి మరి.....

భోజనమైనాక వరండాలో కూచున్నాము నేనూ మా బావా. కొత్త మార్పుల్ని గురించి చెపుతున్నాడు దిగులుగా. కుర్రాడు కూచున్నాడు రోడ్డుకేసి చూస్తో. ఇంతలో ఒకాయన వచ్చాడు. ఆయన ఈ ఊరికంతటికీ అధికారి. కొత్తగా నేను వచ్చాను గనుక నా సంగతి రాసుకోడానికి వచ్చాడు. దేశానికి వచ్చిన ఈ మార్పు సంగతి చాలా సేపు మాట్లాడుకున్నాము. పూర్వకాలం ఉండే శారీరక మానసిక వ్యాధులు చాలా వరకు తగ్గాయి. ఈర్ష్యలూ, పోటీలు, ముందు ఎట్లా బతకడమనే భయం, పిల్లలేమవుతారనే ఆదుర్దా, ధనార్జన, ధనం కూడబెట్టడం, ఆస్తి సంపాయించడం ఇటువంటి బాధలన్నీ పోయినాయి నిశ్చయంగా. అధికారులకి బానిసత్వం, ప్రభుత్వభయం, నీచత్వం, మోసం మొదలైనవి లేనేలేవు.
అంటే రామరాజ్యం – భూలోక స్వర్గమన్న మాట అన్నాను
అని మూలిగాడు.
ఏం అన్నాను
స్వర్గం కూడా ఇట్లానే ఉంటుందేమోనని భయం అన్నాడు మా బావ.
ఏమీ? అదే కాదా మనం కలలుగన్నది? మతాలన్నీ ఆశ పెట్టింది? నిరంతర శాంతి. ఈ భూమి మీద జీవితపు  జ్వరం తరవాత ఆ లోకంలో శాంతి అనేకద! ఆ శాంతి ఇక్కడే కలిగితే ఇంకేం కావాలి?”
అవును. ఇక్కడ ఈ లోకంలో అశాంతి, తీరని కోర్కెలూ ఉన్నంతకాలం, అవన్నీ ఆ లోకంలో ఉండవనీ సత్యం, శాంతి, సౌఖ్యం, ఇవన్నీ అక్కడ ఉంటాయనీ కలలు కన్నాము. కానీ అవన్నీ ఈ లోకంలోనే లభ్యమైతే, కలలుగనడానికి ఇంకేమీ మిగలలేదు.
నేను చూసిందేమంటే, ఇంత శాంతి, ధర్మం ఏర్పడినా మనుషుల్లో ఉత్సాహం, కళా కనపడవేం? ఏదో నిద్రపోతున్నట్టూ, ఏం చాతగాక అటూఇటూ వెతుకుతున్నట్టూ పదేళ్లమట్టి పంజరంలో బతుకుతున్న పిట్టల్లాగ కనపడతారేం మనుషులు ఎంత కాలం నుంచి కలలుగన్నాం ఈ శాంతి కోసం?”
కాని పని భారం. పొద్దస్తమానం పని
ఎక్కువ పని ఉన్నట్టులేదు అన్నాను.
లేదు. కాని ఉన్న పని భారం. పనిలోనుంచి పని తప్పించుకునే అశ ఉండాలి. గానుగ ఎద్దులాగ బతుకంతా ఇదే పని అనుకుంటే, పని భారమవుతుంది. .......
మానవ స్వభావం విచిత్రం. దానిని అంకెలలోకీ, ఫార్ములాలకీ మార్చి యోచించడం బుద్ది తక్కువ. పని కావాలి. పనీ అక్కర లేదు. ఇప్పుడు మనిషికి పని తక్కువ పని కావాలని ఉంటుంది. కాని ఉన్న పని భారం.

ఇంతకూ ఈ కథ పేరు 1690 అనో 1960 అనో ఉండాలి.
తెలుగు అంకెల్లో రాశారు. ఎవరికి తెలుస్తాయి ఆ అంకెలూ

Tuesday, March 26, 2013

ఎ సెయిలర్స్ స్టోరీ (ఇంగ్లీష్)



ఎ సెయిలర్స్ స్టోరీ (ఇంగ్లీష్)
రచన: వైస్ అడ్మిరల్ ఎన్ కృష్ణన్
పుణ్య పబ్లిషింగ్ హౌస్ వారి ప్రచురణ, పేజీలు: 400 +
వెల: రూ.695
ప్రతులకు: www.punyapublishing.com


ఫద్మభూషణ్, పివిఎస్‌ఎమ్ కృష్ణన్ భారతీయ నౌకాదళ చరిత్రలోనే ముఖ్యమయిన వ్యక్తి నౌకాదళానికి 1967లోనే వైస్ చీఫ్‌గా ఆయన బాధ్యతలను నిర్వహించారు. 1971లో ఈస్టర్న్ నేవల్ కమాండ్‌కు రూపుపోసి కమాండర్-ఇన్-చీఫ్‌గా పనిచేశారు. 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధంలో ఆయన వహించిన పాత్రకు గాను, దేశం ఆయనను పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది. 1971లో కృష్ణన్ నేవీనుంచి రిటైర్ అయ్యారు. నౌకాదళానికి ప్రధానాధికారి మాత్రం కాలేదాయన! కొచ్చిన్ షిప్‌యార్డ్ చైర్మన్‌గా కూడా పదవీ విరమణ చేసిన తర్వాత కృష్ణన్ హైదరాబాద్‌లో ఉన్నారు. ఆ తరువాతే ఆయన తన అనుభవాలకు అక్షర రూపం యిచ్చారు. ఆ రచన ప్రచురణకు నోచుకోకముందే, ఆ మహనీయుడు 1982లో కన్నుమూశాడు. ఇనే్నళ్ల తరువాత ఆయన కుమారుడు అర్జున్ ఈ పుస్తకాన్ని మన ముందుకు తెచ్చారు. ఒక వ్యక్తి జీవితాన్ని గురించి మాత్రమేగాక, మన దేశం గురించి, ప్రపంచం గురించి, సైన్యం గురించి, అక్కడి తీరు గురించి అందరమూ తెలుసుకునే అవకాశం మనకు అందింది.

ఆయన ఆ నౌకకు ఉన్నత అధికారి. స్నానం చేస్తుండగా, బయట ఏదో గోల వినిపించింది అంతే, అందరికి ఆదేశాలనిస్తూ ఆయన క్షణంలో కార్యరంగంలోకి దూకాడు. అక్కడ మరొక అధికారి అంత ఆదుర్దాలోనూ ఒక టవల్ పట్టుకుని ఆయన దగ్గరకు పరుగునవచ్చాడు. ‘ఏమిటి?’అని ఆశ్చర్యంగా చూస్తున్న ఆ ఉన్నతాధికారికి అప్పుడు అర్ధమయింది, తను కనీసం తుడుచుకోకుండా, తువాలు కట్టుకోకుండా, పనిలోకి పరుగెత్తుకు వచ్చానని’అదీ కృష్ణన్‌లోని కార్యదీక్ష!

అసలు దేశానికి నౌకదళమంటూ ఒకటి లేని కాలంలోనే, బ్రిటిష్ నౌకాదళంలో చేరి కృష్ణన్, స్వాతంత్య్రం తరువాత దేశరక్షణ, సైన్య నిర్వహణ విషయాలలో ఎంతో ప్రభావవంత మయిన పాత్రను పోషించారు. కాబినెట్ సబ్ కమిటీ గురించి, సర్దార్‌పటేల్ గురించి ఆయన రాసిన తీరు కథ లాగ ఉంటుంది కానీ, నిజానికి, అది చరిత్ర, రాజనీతి లాంటి విషయాలలో పాఠం! ఒక్క తుపాకీ కూడా పేలకుండా గోవా, డమన్, డయిలను స్వతంత్ర భారతంలో భాగంగా మార్చిన ఘనత కృష్ణన్ కే దక్కింది.

మన దేశ సైన్య చరిత్రలో మహామహులు ఎందరో ఉన్నారు.

అయినా, తమ జీవితం గురించి, సైన్యం సంగతులను గురించి, ఇంత అందంగా వర్ణించి చెప్పినవారు మాత్రం అరుదు. ఈ పుస్తకంలో నౌకాదళం, అందులోనూ ఇతరత్రా తాను కలిసి పనిచేసిన గొప్పవారు, మామూలు వారు, సంఘటనల గురించి ఈ మహామహుడు చెప్పిన తీరు గొప్పది. పుస్తకమంతా వెతికినా, స్వంత గోల ఎక్కడా కనిపించదు తండ్రిగారు, భార్య, పిల్లలు తన అనుభవాలు, చూచిన స్థలాల గురించి చెప్పాలన్న ఆతురత అసలు కనబడదు. ఇది నావికుడి కథ, అని కొన్నిసార్లు, గుర్తుచేసి వివరణను ముందుకు నడుపుతారు కృష్ణన్. అలాగని
ఈ ‘రచన’ ఆసక్తికరంగా ఉండదన్న అనుమానం ఎవరికీ అవసరం లేదు.

చెప్పేది ఏ విషయమయినా సరే, ఆసక్తికరంగా చెప్పడం కృష్ణన్‌కు చేతయినంత బాగా చాలామంది రచయితలకు కూడా కుదరదు.


మన దేశ సైన్య చరిత్రలో మహామహులు ఎందరో ఉన్నారు. అయినా, తమ జీవితం గురించి, సైన్యం సంగతులను గురించి, ఇంత అందంగా వర్ణించి చెప్పినవారు మాత్రం అరుదు. ఈ పుస్తకంలో నౌకాదళం, అందులోనూ ఇతరత్రా తాను కలిసి పనిచేసిన గొప్పవారు, మామూలు వారు, సంఘటనల గురించి ఈ మహామహుడు చెప్పిన తీరు గొప్పది పుస్తకమంతా వెతికినా, స్వంత గోల ఎక్కడా కనిపించదు తండ్రిగారు, భార్య, పిల్లలు తన అనుభవాలు, చూచిన స్థలాల గురించి చెప్పాలన్న ఆతురత అసలు కనబడదు. ఇది నావికుడి కథ, అని కొన్నిసార్లు, గుర్తుచేసి వివరణను ముందుకు నడుపుతారు కృష్ణన్. అలాగని ఈ ‘రచన’ ఆసక్తికరంగా ఉండదన్న అనుమానం ఎవరికీ అవసరం లేదు. చెప్పేది ఏ విషయమయినా సరే, ఆసక్తికరంగా చెప్పడం కృష్ణన్‌కు చేతయినంత బాగా చాలామంది రచయితలకు కూడా కుదరదు.

కృష్ణన్ జీవితం, నౌకాదళంలోని విశేషాలు, వివరాలు, వింతలు ఎలాగూ ఆసక్తికరంగా ఉంటాయి అన్నిటికన్నా, ఆయన ఇంగ్లీషు భాష మరింత ఆసక్తికరంగా ఉంది. ఆ వాక్య నిర్మాణం, మాటతీరు, అరుదయిన అందాలను మన ముందుంచుతాయి. ఆయన వాడిన కొన్ని పదాలు మొదటిసారి మన ముందుకు వచ్చినట్లు తోచినా ఆశ్చర్యంలేదు.

భయంకరమయిన సంగతులను, జోకులను, ఇంచుమించు ఒకే రకంగా వివరించే నైపుణ్యంగల రచయిత ఈ ‘వైస్-అడ్మిరల్’. ఈయనే రచయితగా మారి ఉంటే ఎంత బాగా రాసేవారోననిపిస్తుంది. బ్రిటిష్ రాజ కుటుంబం, మవుంట్ బేటన్ మొదలు, పటేల్, కృష్ణమీనన్ మరెందరో గొప్ప వారితో తాను జరిపిన చర్చలు, చేసిన నిర్ణయాల గురించి చెపుతూనే, బట్టతల మీద వెంట్రుకల కోసం తాను పడిన కష్టాలనూ వర్ణించారాయన. జీవితం పట్ల కృష్ణన్‌కున్న దృక్పథం మనకు ‘పర్సనాలిటీ’ పాఠంలాగ వినిపించినా ఆశ్చర్యం లేదు. పని లేకుంటే పడే చికాకు గురించి ఆయన రాసినప్పుడల్లా, అదొక హెచ్చరికలాగ వినిపించింది నాకయితే.

ఇంతా రాసిన తర్వాత, పుస్తకం గురించి మాత్రమేగానీ, అందులోని విషయం గురించి సరిగాచెప్పలేదన్న భావం కలిగింది. కొందరు వ్యక్తులను, వారి అభివ్యక్తిని పరిచయం చేయడం కష్టంగా ఉంటుంది. ఇంగ్లీషులో ఉన్న ఈ పుస్తకాన్ని, ఇంగ్లీషుకొరకు కన్నా జీవితం గురించి తెలుసుకోవడానికి అందరూ చదవాలి’.





Sunday, March 24, 2013

లేపాక్షి బసవయ్య - బాపిబావ పాట

అడివి బాపిరాజు గారి రచన ఇది.


శీలా సుభద్ర గారి వల్ల నాకు దొరికింది.
అందరూ వింటారన్న మంచి భావంతో ఇక్కడ దాన్ని పంచుకుంటున్నాను.
ఎవరికీ అభ్యంతరం ఉండదనే నమ్మకం.