Sunday, January 15, 2012

దోమకాటుకు..


దోమకాటుకు..

మనిషి బతుకు మొదటినుంచీ, సదుపదాయాలువెదకడం, సమస్యలకు సమధానాలు వెదకడంతోనే సాగుతున్నది. ఎయిడ్స్ వ్యాధికి చికిత్స గురించి గడిచిన 30 సంవత్సరాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవి కుదిరేపని కాదు, అన్నారు ఇంచుమించు అందరూ! అంత నిరాశ అవసరం లేదు అనడానికి 2011లో సూచనలు అందాయి.
కొన్ని సమస్యలకు సమాధానాలు ‘యురేకా!’ పద్ధతిలో ఒక్క ఆలోచనతో అందవు! ఈ ప్రపంచంలో సమస్యలకు అంతం లేదు. అందుకే పరిశోధనలకూ అంతం లేదు. ఆ పరిశోధనలు పెద్దపెద్ద విశ్వవిద్యాలయాలు, సంస్థలోనే జరగనవసరం లేదు. పట్టుదలతో ముందుకు సాగితే గట్టి సమస్యలకు కూడా సమాధానాలు అందుతాయి. అందుకు ఉదాహరణ దోమల సమస్య! దానికి సమాధానాలు.

సమస్య: దోమలు సమాధానం: రసాయనం స్ప్రే!

1940 నుంచి మొదలు రసాయనాలు సాయంతో దోమలను దూరం తోలే పద్ధతులు వాడుకలో ఉన్నాయి. ఈ రసాయనాలు ఎంతమందికి అందుబాటులో ఉంటాయి? ఉన్నవాళ్ళు ఎన్నిసార్లని వాడతారు? అందుకే కాలిఫోర్నియా యూనివర్సిటీలో పరిశోధకులు ఆనంద శంకర్ రేగారు ఒకకొత్త రసాయనాన్ని తయారుచేశారు. ఇది దోమలకు వాసనలు తెలియకుండా చేస్తుంది. ఇక మనుషులు వాటికి అందరు!

దోమలు కార్బన్‌డై ఆక్సైడ్ వాసన ఆధారంగా, జీవులను చేరుకుంటాయి. అక్కడ వాటికిగాను ఆహారం సిద్ధంగా ఉందని ఈ సీఓటూ ఒక సిగ్నల్‌గా పనిచేస్తుంది. ఈ వాసనను పట్టడానికి దోమలకు ఉండే శక్తిని, కొన్ని రసాయనాలు ఆపగలవు. రే ఈ రకం రసాయనాలను యాభయ్యింటిని పోగుచేసి పరిశోధించారు. ఈ ప్రయత్నంలో దోమలను పట్టుకుని వాటికి నేరుగా రసాయనాలు ఇంజెక్షన్‌గా ఇచ్చే వరకు వెళ్లారు. ప్రయోగాల కారణంగా 2-బ్యుటనోన్ అనే రసాయనం సీఓటూకు ఇమిటేటర్‌గా పనిచేస్తుందని తెలిసింది. మరో బ్యునాల్ కూడా మంచి ప్రభావం చూపించింది. ఇక మరో రసాయనం 2, 3 బ్యుటేన్ డయోన్, దోమల వాసన శక్తిని పూర్తిగా గజిబిజి చేస్తుందని తెలిసింది.

ఇక్కడ విచిత్రం ఏమిటంటే, ఈ రసాయనాలును మనం రాసుకోనవసరం లేదు. రాత్రి మొత్తం వాటి మధ్యన ఉండనవసరం కూడాలేదు. మనుషులు ఉండే చోట్ల ఈ రసాయనాలను పక్కన ఉంచితే, దోమలు, మనుషుల బదులు అక్కడికి ముందు పోతాయి. ఆ తర్వాత రసాయనం ప్రభావంతో వాటికిక వాసనలు తెలియకుండా పోతాయి.
ఈ రసాయనాల వాసనలు, మనుషులుండే ప్రాంతాలలో, ఆ చుట్టుప్రక్కల దుప్పటిగా పరచుకుని, దోమలను ఆపేస్తాయి. కానీ, ఈ రసాయనాలు మనం కూడా వాడే పరిస్థితి రావడానికి మరి కొన్ని సంవత్సరాలు పడుతుంది, అంటున్నారు.

‘‘దోమలు ఏటా 70 కోట్లమందిని రోగాలకు గురిచేస్తున్నాయి. ఒక్క మలేరియాతోనే సంవత్సరానికి 8 లక్షలమంది మరణిస్తున్నారు’’.

సైన్స్ విశేషాలు



విశేషాలు!

ఈ పేరును ఇంగ్లీషులో రాస్తే, అందులో వర్షం ఉండదు. ప్రేమ అంతకన్నా ఉండదు! ఇవి దుప్పి జాతి జంతువులు. వీటినే కరీబూ అని కూడా అంటారు. జీవశాస్త్రంలో వీటిపేరు రాంజిఫర్ టరెండస్. ఇవి భూగోళంలోని ఉత్తర ప్రాంతాలలోని చెట్లుగల అడవులు, టండ్రా గడ్డి మైదానాలు, ఆర్క్‌టిక్ దీవులలో ఉంటాయి. ఇవి అంగులేట్స్ (గిట్టలు చీలి ఉండే) జంతు రకాలు. వీటిలో నాలుగు రకాలున్నాయి. ఆర్క్‌టిక్ దీవిరకం, అడవిరకం, కొండరకం, గడ్డి మైదానాలలో వలసలుపోయే రకం. ఇవన్నీ వేరు వేరు జీవన విధానాలు గలవని సులభంగానే అర్థమవుతుంది.
సంఖ్య ప్రకారం వలస రకం అన్నింటికన్నా ఎక్కువగా ఉంటాయి. ఇవి 22 గుంపులు ఉన్నాయని గమనించారు. ఇందులో రష్యాలోని తైమీర్ పెనిన్సులా గుంపులో ఏడు లక్షల కరీబూలు ఉన్నాయి. ఇవి నిజానికి 2000 సంవత్సరంలో పది లక్షలు ఉండేవి. కానీ తరిగిపోయాయి. క్యుబెక్‌లోని లీఫ్ నది ప్రాంలోని మరో గుంపులో 12 లక్షల జంతువులుండేవి. వాటి ప్రస్తుత సంఖ్య లెక్కింపు ప్రస్తుతం జరుగుతున్నది. ఈ రెండు గుంపుల మధ్య ఒక రకమయిన పోటీ ఉంది. అది కేవలం మనుగడ కొరకు మాత్రమే. మిగతా గుంపులలో రెండు లక్షల కంటే ఎక్కువ జంతువులు వుండవు.
ప్రతి 40-50 సంవత్సరాలలో రెయిన్ డియెర్‌ల సంఖ్య పెరుగుతూ తరుగుతూ కనబడుతుందట. వలస గుంపులు 22లోనూ ఎక్కువ జంతువులు ఒకేసారి ఉంటే మొత్తం సంఖ్య 50 లక్షలకు చేరుతుంది. అన్నీ కలిసి అథమపక్షం, 10లక్షలయినా ఉంటాయి. అంటే అన్ని గుంపులూ తరిగిపోయినప్పుడన్నమాట
.
==============
డేమ్ మిరియం రాత్స్ చైల్డ్ (1908-2005):
ఆవిడ ప్రత్యేకంగా ఏదీ చదువుకోలేదు. కానీ బ్యాంకింగ్ రంగంలో అందెవేసిన రాత్స్‌చైల్డ్ కుటుంబంలో పుట్టింది. ఆమె ఎండమాలజీ (కీటకాల పరిశీలన), పారాసైటాలజీ, బాటనీ, ఆర్నితాలజీ (పక్షుల పరిశీలన), పర్యావరణ శాస్త్రం, శరీర ధర్మశాస్త్రం, పురాతన వస్తువులను సంరక్షించే రంగం, చివరకు క్రిప్టోగ్రఫీ (రహస్య కోడ్‌లను విడదీసే విద్య) ఇన్నింటిలో నిపుణురాలుగా పేరు పొందింది. ఇవన్నీ గురువు లేకుండా, ఆమె స్వంతంగా నేర్చుకున్న విద్యలంటే ఆశ్చర్యం!

మిరియం మొత్తం పదకొండు పుస్తకాలు రాసింది. వివిధ వైజ్ఞానిక పత్రికలలో 300కు పైగా పరిశోధన పత్రాలను ప్రచురించింది. అందులో చివరి పత్రం వచ్చినపుడు ఆమె వయసు 95 ఏళ్లు. మిణ్ణల్లులను గురించి ఆమె చేసిన పరిశోధనలు ప్రపంచ పరిశోధకులను అందరినీ ఆకర్షించాయి.
మానసికరోగులు, జీవకారుణ్య సంఘాల విషయంలో మిరియం సేవలు కొనియాడదగినవి

Saturday, January 14, 2012

మబ్బులొచ్చినయ్!


*తేమగా ఉండే గాలి వెచ్చగా కూడా ఉంటే ఎత్తులకు చేరుతుంది. అక్కడ చల్లదనం ఉంటుంది.

*ఆ కారణంగా తేమ దుమ్ము, బూడిద, సూక్ష్మజీవుల వంటి పదార్థాల మీద చేరి దట్టంగా మారుతుంది. నీరు పdలస్ ఆధారం (దీన్ని సీడ్ లేదా విత్తనం అంటారు) ప్లస్ పైపైకి లాగే శక్తి కలిస్తే మేఘం లేదా మబ్బుపుడుతుంది.

*నీరు లేదా తేమ ఎక్కువగా ఉంది. సీడ్స్ మాత్రం తక్కువగా ఉన్నాయి. అప్పటికే తయారయిన మంచు కణాలుకూడా సీడ్‌గా పనిచేస్తాయి. ఒకేచోట తేమ సమకూరిన కొద్దీ, పైకి లాగే శక్తికి వీలుగానంత బరువుగా మారతాయి నీటి చుక్కలు. అంటే, అవిక కిందికి వర్షంగా పడక తప్పదు!

*మబ్బులు మరీ ఎక్కువగా ఉంటే, వేడిమీ ఈ లోపలే చిక్కుబడి వాతావరణం వేడెక్కుతుంది!
*మబ్బులలో కొన్ని మరీ ముత్యాల్లా మెరిసిపోతుంటాయి. వాటిని ముత్యం మేఘాలనే అంటారు. వాటిలోని మంచు స్ఫటికాలు మరీ సన్నవిగా ఉంటాయి. వెలుగును మరింత ప్రతిఫలింపజేసినందుకు ఆ తళతళ కనబడుతుంది. ఈ రకం మబ్బులు 10నుంచి 15 మైళ్ల ఎత్తులో ఉంటాయి.

*ఈ ముత్యం మేఘాల కారణంగా, ఓజోన్ పొరకు నష్టం ఏర్పడుతుంది.

*వాతావరణంలో మబ్బులను పైకి లాగే శక్తికి సమంగా, గాలివాటూ కిందకు కూడా లాగుతుంటే మేఘాలు గుండ్రంగా కదులుతాయి. ఆ తరువాత తుఫానువచ్చే వీలుంటుంది. కానీ ఈ రకంగా రోల్ అయ్యే మేఘాలు ఎంతో అందంగా, ఆసక్తికరంగా కనబడతాయి.
*భూమి నుంచి 50 మైళ్ల ఎత్తున కూడా మబ్బులు ఏర్పడతాయి. రాత్రిపూట మెరుస్తుండే ఈ మబ్బులు నీలం కలిసిన తెలుపు రంగులో ఉంటాయి. ఇవి పగటి పూట కనబడవు. సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత, ఆ క్రింద నుంచి వచ్చే వెలుగులో ఇవి తళతళలాడతాయి.
*1853లో క్రకటోవా అగ్నిపర్వతం పేలిన తరువాత ఈరాత్రి మబ్బులు కనబడడం మొదలయింది.

*2010 జూన్‌లో, దక్షిణ డకోటా (యు.ఎస్)లో వడగళ్ళవాన కురిసింది. అంతగా పెద్ద వడగళ్లు ముందెన్నడూ కురవలేదు. అప్పుడు పడ్డ ఒక మంచు ముద్ద రెండు పౌండ్ల బరువుంది. ఫుట్‌బాల్ కన్నా కొంచెం పెద్దదిగా ఉందది!

*ఎత్తులో మేఘాలుండేచోట, గాలివాటు, ఒత్తిడి విచిత్రంగా ఉంటాయి. 2007లో జర్మన్ పారాగ్లైడింగ్ చాంపియన్ ఈవా విస్నియేర్స్‌కా గ్లైడింగ్ చేస్తూ క్యుములోనింబస్ మబ్బులకు దగ్గరగా ఎగిరింది. గాలి ఆమెను 32,000 అడుగుల ఎత్తుకు లాక్కుపోయింది. ఆక్సిజన్ అందకుండా పోయినందుకు ఆమె మూర్ఛపోయింది. 23,000 అడుగుల ఎత్తున ఆమెకు తిరిగి తెలివి వచ్చింది!

*క్యుములోనింబస్ మేఘాలు తక్కువ ఎత్తులో ఉంటాయి. వాటి చుట్టు గాలివాటం చెప్పరాని రకంగా క్షణానికొక తీరుగా మారుతుంటాయి. సాధారణంగా విమానం పైలట్లు అందుకే ఈ రకం మేఘాలగుండా ప్రయాణించడానికి ఇష్టపడరు!

*నిజానికి విమానాలు వాటికన్నా ఎత్తులో ఎగురుతుంటాయి!

Friday, January 13, 2012

కళ్ల ముందు అమెరికా అంతరంగం


కళ్ల ముందు అమెరికా అంతరంగం



అమెరికా ప్రజల చరిత్ర-
హొవార్డ్ జిన్ రచన
అనువాదం: కె.సత్యరంజన్, బి.భాస్కర్
ప్రజాశక్తి బుక్‌హౌస్, ఆజమాబాద్, హైదరాబాద్- 20,
వెల: రూ.150/-,
పేజీలు: 294.

ఏ దేశం చరిత్ర చదివినా, అంతా అభ్యుదయ పరంపరగా జరిగిందనే చెపుతుంటాయి. అమెరికా అందుకు వేరుగా ఉండవలసిన అవసరం లేదు. అంకుల్ శాం నేటికీ అందరి మీదా పెత్తనం చేయాలనుకుంటాడే తప్ప, మంచితనం చూపుదామన్న పద్ధతి లేదు. అమెరికా చరిత్ర పుస్తకాలు తెలుగులో ఎన్ని వచ్చాయో తెలియదు. కానీ ఆ దేశం అసలు రూపాన్ని అందరి ముందు ఉంచే పనిని ప్రజాశక్తి బుక్‌హౌస్ వారు ఈమధ్యన చేపట్టారు. ఆ క్రమంలో మరో పుస్తకం ఈ అనువాదం.
ఇది అమెరికా చరిత్ర కాదు. అమెరికా ప్రజల చరిత్ర. అందునా శ్రామిక వర్గం వారి చరిత్ర. రచయిత జిన్ రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న వ్యక్తి. తరువాత ప్రొఫెసర్ అయ్యాడు. మామూలుగా అందరూ చూడని, చరిత్రను చెపుతూ, నిరసనలలో పాల్గొంటూ ప్రభుత్వ వ్యతిరేకిగా గుర్తింపు పొందాడు. ఎన్నో రచనలు చేశాడు. ‘అమెరికా ప్రజల చరిత్ర’ అన్న ఈ పుస్తకం మూల రచనకు సంక్షిప్త రూపం మాత్రమే తరువాత వచ్చిన అభిప్రాయ మాలికల పుస్తకం నుంచి కూడా, ఈ అనువాదం చివరలో చేర్చారు.

మామూలు చరిత్ర పుస్తకాలలో ఒక రకమయిన ఏకపక్ష ధోరణి ఉంటుంది. కానీ జిన్ తన పుస్తకంలో కూడా ఏకపక్ష ధోరణి ఉందని నిస్సందేహంగా అంగీకరించాడు. నా రచన ఒక వేపునకు మొగ్గుచూపింది. ఇందులో నాకేమీ బాధ లేదు. అంటాడు రచయిత. మరీ ఏకపక్షంగా చెప్పిన చరిత్రలో అసలే కనిపించని అంశాలను గురించి చెప్పి ఒక రకమయిన సమతూకం కొరకు ఈ రచయిత శ్రమించినట్లు మనకూ అర్థమవుతుంది. ప్రభుత్వం విధానాలు బీదవారు, స్ర్తిలు తెల్లతోలు లేని వారి మీద చూపిన ప్రభావం గురించి ఈ పుస్తకంలో సవివరంగా తెలుసుకోవచ్చు. కార్మికుల పోరాటాలు, సమానత్వం కొరకు జరిగిన సంఘర్షణలు, ఇంత అన్యాయంగా జరిగినట్లు తెలిసిన తర్వాత అమెరికా దేశం పట్ల ఒక రకమయిన ఏవగింపు పెరిగినా ఆశ్చర్యం లేదు. అయినా వాస్తవం తెలియకుండా, ఒక దేశాన్ని ఆకాశానికెత్తి ‘ప్రామిస్‌డ్ ల్యాండ్’గా చూడడం తప్పుగదా! ఈ పుస్తకంలో ఇటీవలి చరిత్ర కూడా ఉండడం గమనించదగిన అంశం!

చరిత్ర పుస్తకాలు చదవడమే తలనొప్పి. అందునా మనకు పరిచయం లేని ఘటనలు మనుషులు, వాతావరణం గురించి చదవడం అందునా అసౌకర్యంగా ఉంటుంది. ఈ పుస్తకం చదవడంలో మరొక చిక్కు ఉంది. అసలు చరిత్రను చదవకుండా, ఈ మరో పార్శ్వం చదువుతూ ఉంటే, మరింత వివరం తెలిస్తే బాగుండునన్న భావం మిగులుతుంది.
ఆసక్తికరమయిన అంశం గనుక ఇంగ్లీషులో ఈ పుస్తకం లక్షల కాపీలు అమ్ముడయింది. ఏకబిగిన, ఒక నవల చదివినట్లు, చదివించే పుస్తకం కాదిది. అయినా ఆసక్తికరంగా సాగింది. తెలుగు అనువాదం మరింత సులభంగా సాగితే బాగుండును. ఇంగ్లీషులోని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లు తెలుగులోకి తెచ్చే ప్రయత్నం జరిగింది.
‘‘చరిత్ర పుస్తకాల గుట్టల బరువు కింద కుంగిపోతూ, దేశము దేశ భక్తులు చూపిన మార్గంలో గౌరవంగా వణికిపోతూ, లొంగిపోయేలా కుంగదీయబడే క్రమంలో మనం నిలదొక్కుకుని వెన్ను నిటారుగా నిలుపుకుని నిలబడాలంటే, అనుద్దేశ పూర్వకంగా ఇంతకాలం ఈషణ్మాత్రం గౌరవించని ప్రజా ఉద్యమాల ఆసరానే కావాలి!’’ ఈ వాక్యానికి జీన్ మూలం ఇంత గజిబిజిగానూ ఉంది. అందులో మరో నాలుగు మాటలున్నాయి.

ఆపుతూ ఆపుతూ సీరియస్‌గా చదవవలసిన పుస్తకం ఇది. ఇంగ్లీషులో నయినా తెలుగు అయినా! విషయం మీద ఆసక్తి ఉంటే చాలు, చదవ వచ్చు!

Thursday, January 12, 2012

శూన్యంలో ఏముంది?


శూన్యంలో ఏముంది?

‘తెల్లోడు ఎర్రోడా (వెర్రివాడా?) ఏంటి, గొట్టాలెట్టి సూట్టానికి?’ అనిపించాడు గురజాడ తన కన్కాశుల్కంలో. ఆకాశం శూన్యం కాదని చెప్పడానికి, ఆ మాట వాడుకున్నారాయన! లెక్కల్లో శూన్యం, పూజ్యం లేదా సున్నా ఉంది. ఆ సున్నా ఒక్కటే ఉంటే ఏమీ లేదని అర్థం. 2012 సంవత్సరంలోని సున్నా లేకుంటే, లేక దానికి విలువ లేకుంటే, లెక్క తలకిందులవుతుంది కదా? ఇక్కడ సున్నా విలువ దాని స్థానాన్ని బట్టి తేలుతుంది.

ప్రకృతిలోనూ శూన్యం ఉందంటారు. ప్రకృతిలో శూన్యం ఏమిటి? అన్నారు గ్రీకు తత్వవేత్తలు రెండున్నర వేల సంవత్సరాల క్రితమే! రెండు వస్తువుల మధ్యన శూన్యం ఉంటుందా? ఉంటే రెండు వస్తువుల మధ్యన సంబంధానికి ఆధారం ఎలాగవుతుంది? ఖాళీకి ఆకారం, పరిధులు ఎలా ఉంటాయి? ఈ ప్రశ్నలు అడగనంతవరకు బాగానే ఉంటాయి గానీ, అడిగిన తర్వాత అవును గదా, అనిపించక మానదు. క్రీ.పూ. అయిదవ శతాబ్ది నాటి గ్రీకు తత్వవేత్త పార్మెనిడిస్, ఆ తర్వాత అతని దారిలోనే ఆలోచించిన అరిస్టాటిల్, శూన్యంలో కూడా కంటికి కనిపించని పదార్థమేదో ఉండాలి అన్నారు. లుసిప్పస్, డెమొక్రిటస్ లాంటి వారు, అప్పుడది శూన్యం ఎలాగయింది? అన్నారు. 17వ శతాబ్ది నాటికి ఆధునిక విజ్ఞానం మొదలయింటారు. అప్పుడు కూడా శూన్యం గురించిన అవగాహనలో పెద్ద మార్పులేమీ రాలేదు. న్యూటన్ కూడా, అరిస్టాటిల్ కూడా, శూన్యంలో, కనపడని, రాపిడి కలిగించని ‘మాథ్యమం’ ఏదో ఉందన్నాడు.

న్యూటన్ చలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అందుకే రాపిడి గురించి ఆలోచింపగలిగాడు. భూమిలాంటి గ్రహం శూన్యంలో తిరుగుతుంటే, అక్కడ రాపిడి ఉంటే, లెక్క మరోరకంగా ఉంటుంది. సమకాలీన జెర్మన్ పరిశోధకుడు గాట్‌ఫ్రీడ్ లైబ్నిజ్ ఈ మాటను కొట్టిపడేశాడు. కదలిక, అది భూమి తన చుట్టు తాను తిరగడం లాంటి రొటేషన్ అయినా సరే, విశ్వంలోని మిగతా అంశాలతో సాపేక్షంగా చూచి మాత్రమే అర్థం చేసుకోవలసినది అన్నాడతను. 19వశతాబ్దపు జెర్మన్ ఇంజనియర్, తత్త్వవేత్త ఆర్న్‌స్ట్ మాక్, విశ్వంలోని ఇతర అంశాల ఆకర్షణతో మాత్రమే రాపిడి వంటి మెకానికల్ ప్రభావాలు ఉంటాయన్నాడు. ఐన్‌స్టైన్, ఈ సిద్ధాంతాన్ని అంగీకరించలేక, వదలలేక తికమకకు గురయ్యాడు.
19వ శతాబ్దం పరిశోధకులకు విశ్వం గురించి, అందులోని శూన్యం గురించి కొత్త సమస్యలు, అవగాహనలు ఎదురయ్యాయి. అయస్కాంతాలు, లేదా ఛార్జ్‌లు (ధన, రుణ ఆవేశాలు) ఎలా పనిచేస్తాయి. అవి ఒకదానిని మరొకటి ఆకర్షించడం, వికర్షించడానికి మాథ్యమం ఏమిటన్న సమస్య వీరిని ఆలోచింపజేసింది. మైకేల్ ఫారడే క్షేత్రాలు (ఫీల్డ్స్) అనే కొత్త ఆలోచనను ప్రతిపాదించాడు. అయస్కాంతం, విద్యుత్తుల విషయంలో ఈ క్షేత్రాల కారణంగా, బలాలు తెలుస్తాయని ఆతని ఆలోచన! మరి ఈ క్షేత్రాలంటే ఏమిటి? మరోసారి కంటికి కనబడని మాథ్యమం గురించి ఆలోచన సాగింది. ఈతర్ అనే మాట అప్పట్లో అందరినీ ఎంతో కుదిపిందని శాస్త్ర చరిత్ర చెపుతుంది!
ప్రేతాత్మలు కూడా ఈ ఈతర్‌లో ఉంటాయన్న వారున్నారు. తరువాత జేమ్స్ మాక్స్‌వెల్ విద్యుతు,్త అయస్కాంతాల మధ్యగల సంబంధాన్ని 1860ల్లో వర్ణించాడు. విద్యుదయస్కాంత తరంగాలు, రేడియోతరంగాలు, వెలుగు కూడా ఈతర్ ద్వారా ప్రవహిస్తాయని ఒక అవగాహన మొదలయింది.

ఆ వెంటనే తిరిగి కదలిక, సాపేక్షంగా, అంటే ఒకదానితో పోల్చి చూపినప్పుడుగానీ కదలిక తెలియదనడం లాంటి సిద్ధాంతాలు మళ్లీ తెరమీదకు వచ్చాయి. గ్రహాల కదలిక, వెలుగు వేగం గురించి చర్చ మొదలయింది. మరోసారి ఐన్‌స్టైన్ ప్రమేయం మొదలయింది. 1905లో సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఆయన, కదలికను, శూన్యంతోగాక, మిగతా పదార్థాలకు దూరం, దిశలలో మార్పుగానే నిర్వచించాలి, అన్నాడు. ఆ లెక్కలతో ఈతర్ కొంచెం అనుమానాస్పదమయింది. శూన్యంలో ఏదో ఉండాలి, ఉంటుంది. కానీ, మనం పదార్థంగా అనుకుంటున్న లాంటిది మాత్రం కాదు అది అన్నారు అందరూ!
పది సంవత్సరాలు తరువాత అణువులోపలి సంగతులను చర్చించే క్వాంటమ్ మెకానిక్స్ వచ్చింది. న్యూటన్ వర్ణించిన ప్రపంచం, కదలికలు మొదలయినవి తెరమరుగయ్యాయి. అణువులోపలి ఎలెక్ట్రాను కదులుతూ ఉంటుంది గానీ, ఒక ప్రత్యేక క్షణాన అది ఎక్కడుండేదీ చెప్పడం వీలుగాదన్నారు. అదే నిజమయితే, క్షేత్రాలు, మిగతా వాటి విషయంలో కూడా ఈ మాట పనిచేయాలి! క్వాంటం అనిశ్చితత అనేమాట వచ్చింది.

ఒక పెట్టె ఉందనుకుందాం. అందులో ఏ రకమయిన విద్యుత్తు ఛార్జ్స్‌లూ లేవు. ఆ లోపలికి వెలుపలనుంచి మరే రకమయిన ఆవేశాలు వచ్చే వీలు కూడా లేదు. అంటే, అందులో శూన్యం మాత్రమే ఉంది అన్నమాట. అయినా సరే క్వాంటమ్ మెకానిక్స్ సిద్ధాంతం ప్రకారం మాత్రం, ఆ పెట్టెలో తరగని విద్యుత్తు క్షేత్రం ఉండి తీరుతుంది! దాని కదలిక అనిశ్చితంగా ఉంటుంది. మనకు చేతయిన పద్ధతిలో అందులోని విద్యుత్తును కొలిచే ప్రయత్నం చేస్తే అది అందదు. ఆ కొలత అణువుల స్థాయిలో ఉంటేనే కొలత తెలుస్తుంది.

విద్యుత్తు క్షేత్రంలోని బలం సున్నా లేదా శూన్యం అయినంత మాత్రాన, ఆ శక్తి అక్కడ లేదనడానికి లేదు, అంటారు పరిశోధకులు. ఇప్పుడు ఒక ప్రశ్న పుడుతుంది. ఒక పరిమాణం గల భారీ పెట్టెలో ఎంత శక్తి ఉంటుంది? తెలిసిన పద్ధతులతో లెక్కగడితే అర్థంలేని ఒక జవాబు కూడా దొరుకుతుంది. శక్తికి అంతం లేదు. శూన్యం అంటే ఖాళీ కాదు. అందులో అంతులేని శక్తి ఉంటుంది.

ఇంత చదివిన తరువాత, నాలాగే మీకూ ఈ సంగతి అర్థం కాలేదన్న భావమూ, ఖాళీ భావమూ మిగిలితే, ఆశ్చర్యం లేదు. ఒకానొక ప్రసిద్ధ వేద పండితుడు ఈమధ్యన నన్ను అడిగిన ప్రశ్నల కారణంగా ఈ విషయాలన్ని లెక్కించుకోవలసి వచ్చింది. ఈ ప్రపంచంలో చాలా సంగతులు అర్థం కావు. మనకు అర్థంకానంతమాత్రాన వాటి గురించి ఆలోచన ఆగిపోదు. మనమూ ఆలోచించాలి. మరింత తెలుసుకోవాలి. శూన్యంలోనుంచి ఏదో బయటకు వస్తుంది! *

Wednesday, January 4, 2012

మన గురించి మనం - 4


మీరు కలలుకంటారా?
కలలు బాగుంటాయా, భయంకరంగా ఉంటాయా?

కలలు సాధారణంగా బాగుంటాయి గదూ? నిజం కానిదంతా, కాలేనిదంతా కలలో కనిపించినట్లు ఉంటుంది కదూ?
తెల్లవారుతుండగా కమ్మని కలలో కరుగుతుంటాము. ఎందుకో గానీ మధ్యలో మెలుకువ వస్తుంది. అందమయిన కల తెగిపోతుంది. ఎప్పుడయినా కల గురించి ఆలోచించి గుర్తు చేసుకోవాలనే ప్రయత్నం చేసారా తప్పక చేసే ఉంటారు. కల తెగుతుంది. తెల్లవారిందని తెలుస్తుంది. కలలోనుంచి నిజంలోకి మారాలన్న భావంతో బతుకు మళ్లీ పాత పద్ధతిలో మొదలవుతుంది. ప్రయత్నించినా కలలో సంగతి గుర్తు రాదు. కలలన్నీ గుర్తుకు వచ్చి ఉంటే ఇప్పటికి అందరికన్నా మంచి రచయిత అనిపించుకునే వాళ్లమేమో?
కల కరుగుకుంది, బతుకు మొదలవతుంది అనుకున్నాం గదా! నిజంగా బతుకు మొదలవుతుందా? లేక అది కూడా కలేనా?
నిజంగా బతుకంతా కలలాగ సాగుతుందన్న మాట గురించి అలోచించారా ఎప్పుడయినా?
మీరు చదువుతున్నామనుకుంటున్నారు. కల గంటున్నారేమో? గమనించండి ఈ క్షణం, గడిచిన క్షణం, రానున్న క్షణం అన్నీ కలలేనేమో?

ఇది నిద్ర మత్తు ప్రశ్న మాత్రం కాదు సుమా!
బతుకులో మనం నమ్ముతున్నవన్నీ నిజంగా ఉన్నాయా? జరుగుతున్నాయా? కలలాగే మనం వాటిని భావించుకుంటున్నామా?
అంతా కలేనేమో?

కల కాదనడానికి మనల్ని మనం గిల్లుకుని చూడాలంటారు. గిల్లుకున్నాము సరే. గిల్లుకోవడం కూడూ కలేనేమో? అది మరో కలలోకి మనలను కదిలిస్తుందేమో?

నాకు కథలు కథలే కలలుగా వస్తాయి. వాటన్నిటినీ గుర్తుంచుకుంటే బాగుంటుందన్న ఆలోచన వచ్చిన మాటా వాస్తవమే. అప్పుడు పడుకుని తీరికగా తెల్లవారిన తరువాత రాసుకుందామంటే అసలేమీ గుర్తుండదు. కనుక కల ముగిసిన వెంటనే నిద్ర లేవాలి. గుర్తున్నంత వరకు రాసుకోవాలి. అదీ ప్రయత్నం. రాసుకున్నాననే అనుకున్నాను. మరుసటి ఉదయం చూస్తే కాగితం మీద అక్షరం ముక్క లేదు. అంటే రాసుకోవడం కూడా కలేనన్న మాట.
ఏదో ఓడిపోయిన భావం కలిగింది. అందులో ఓటమి గెలుపులెక్కడివి అన్న ప్రశ్న కూడా కలిగింది.
ఇప్పుడు మాత్రం నేను మెలుకువగానే ఉన్నాను గదా! మెలుకువగా ఉన్నందుకే రాస్తున్నాను గదా!!
ఇది కలగాదు. నా ఆలోచన కలగాదు. నా రాత కలగాదు. నా ఇల్లూ, ఇల్లాలూ, పిల్లలూ కలగాదు. నా కలం, కాయితాలూ కలగాదు. అన్నీ కనిపిస్తున్నాయి. వినిపిస్తున్నాయి. కలలోనూ అన్నీ కనిపిస్తాయి. వినిపిస్తాయి. తేడా ఎక్కడుంది మరి?
కలలో నా రాత కూడా అంత నిజంగానూ అనిపించింది. కాగితం మాత్రం ఖాళీగా ఉంది!
చూడండి. ఎంత గజిబిజి?

అలోచనలతో ఇదే కష్టం.
ప్రపంచమంతా ఉంది అనుకుంటే నిజం. లేదంటే అంతా అబద్ధం.
నా ఇల్లు లేదా? పిల్లలు ఎక్కడ? అంతా నిజమనుకుంటున్నానే! కాదా?
అక్కడే అసలు తెలివిని వాడుకోవాలి. బతుకును కలగా సాగనిస్తే అట్లాగే ఉంటుంది. నిజం చూడడం నేర్చుకుంటే మరో లాగ ఉంటుంది.
ఆలోచిస్తే గాని తేడా తెలుస్తుంది! కనుక ఆలోచించండి!!