నేను తెలుగులో చాలా రాశాను. పుస్తకాలు కూడా. ఇంకా రాస్తూనే ఉన్నాను. సైన్సు,సాహిత్యం, సంగీతం, కళలు నా హాబీలు.
Friday, September 6, 2013
Thursday, September 5, 2013
నవ్వాలి మరి
ఒకడు మాడిన రొట్టె తిని కడుపునొప్పి తెచ్చుకొనగా వైద్యుడాతని కంటికి మందు వేసెను - చమత్కార చంద్రిక అనే చాలా పాత పుస్తకంలోని ఒక జోకు.
* ‘ఆసుపత్రికి దారి చెప్పగలరా?’ అంటే ‘గలను’ అని వెళ్లిపోయాడొకతను. ముళ్లపూడి వారి ‘నవ్వితే నవ్వండి’లోని ఒక జోకు. వారీ జోకును మరింత ముందుకు లాగి నవ్విస్తారు.
* * *
‘పెళ్లాన్నేం చేస్తావురా బాళప్పా?’ ప్రశ్న. ‘గొంతు పిసికి బాయిలో ఏస్తాను!’ జవాబు.
చీనన్న మా ప్రసాదుకు ఆ ప్రశ్న అడిగితే ఆ జవాబు చెప్పడం నేర్పించాడు. ఈ మాటలు ఎక్కడివి? అన్న అనుమానం అప్పట్లో నాకు రాలేదు. తరువాత మాత్రం చాలా కాలంగా అనుమానం తొలుస్తూనే ఉన్నది. ఇంతకూ అది జోకా? దానికి నవ్వాలా? నవ్వాలి మరి! చీనన్న అంటే మా చిన్నాయనగారి కుమారుడు. హాస్యప్రియుడు. ఒకరోజు అతను ముందు భోజనం ముగించినట్టున్నాడు. తరువాత తిన్న వారికి చారులో ఉప్పు లేదని అర్థమయింది. ‘అదేమి చీనూ! చెప్పనే లేదు?’ అన్నది. ‘అదీ ఒక రుచి అనుకున్నాను పెద్దమ్మా!’ చీనన్న జవాబు. చీనన్న నిజంగా మంచివాడు. అమాయకుడు అనాలేమో! కానీ ‘రుచి’ గురించి మాత్రం దశాబ్దాల తరువాత కూడా మా ఇంట్లో జోకుగా చెప్పుకుంటాము. ఒకసారి బంధువుల ఇంటికి పోతే వాడికి ఇడ్లీలు పెట్టినట్టున్నారు. ఇంటికి వచ్చిన తరువాత, తిండి పట్టదు అన్నాడు. ఎందుకంటే ‘ఉప్పిండి ఉంటలు (ఉండలు) తిన్న’ అని జవాబు. ఇదీ మాకు ఒక జోకుగా మిగిలింది. ఉండ అంటే గుండ్రంగా ముద్ద కట్టినది అనేనా అర్థం? దాన్ని మేము ‘ఉంట’ అంటాము. మా బావమరిది మరో చీనన్న. ఆయన అంతకన్నా హాస్యప్రియుడు. చేసిన లడ్డూలు మరురోజున ఉంటే, ఉంటలు, లేకుంటే ‘ఉండలు’ అన్నాడు. ‘ఉండను’ అనే మాటకు అర్థం తెలుసు గదా! ఈ ఇద్దరూ ఇప్పుడు లేరు. ఒకరు ప్రయత్నించి, మరొకరు నిజంగా అప్రయత్నంగా పై లోకాలకు చేరుకున్నారు. బతుకులో వెలుగు నీడలకు వీళ్లే ఉదాహరణలు!
గణపతి అని ఒక నాటకం. అది హాస్యం కింద లెక్క. విజయవాడ రేడియో వాళ్లు దాన్ని రేడియో నాటకంగానూ మలిచారు. చాలా ఏళ్ల క్రితమే. నేను పుస్తకం చదివాను. రేడియో డ్రామా విన్నాను. అప్పట్లో నా రియాక్షను ఏమిటో నిజంగా గుర్తు లేదు. శ్రీ రఘురామ, చారు తులసీదళ ధామ అన్న పద్యానికి, ఆ నాటకంలో ఒక పంతులుగారు, రాముల వారు చారు గాచుకున్నారు. కరియాపాకు లేకుంటే తులసి వేశారు అంటూ వ్యాఖ్యానం చెపుతారు. అది మాత్రం తప్పకుండా నవ్వించింది. కొంచెం తెలివి వచ్చింతర్వాత (ఆహా!) నాటకం వింటే అరికాలులో నుంచి మంట పుట్టింది. అది ఏ మాత్రమూ నవ్వవలసిన అంశం కాదు. గణపతి ఒక మొద్దబ్బాయి. ఎవరయినా మొద్దబ్బాయిగా పుడితే తప్పు తల్లిదండ్రులది. వారిది ఎంత మాత్రమూ కాదు. ఆ మొద్దబ్బాయిని తల్లి అమితంగా ప్రేమిస్తుంది. తల్లులకు మామూలు వారికన్నా, బలహీనులు, బుద్ధిహీనుల పట్ల కించిత్తు ఎక్కువ ప్రేమ సహజం కదా! ఈ విషయాన్ని హాస్యంగా వాడుకుంటే అంతకంటే క్రూరత్వం ఇంకొకటి ఉంటుందా? ఆలోచించాలి. అలాంటి వారి పట్ల సానుభూతి కలుగుతుంది. నవ్వు పుట్టదు, పుట్టగూడదు.
ప్రతి మనిషిలోనూ, పరిణామక్రమ ప్రభావంతో, ఒక అడవి మనిషి, మంచి చెడు చూడలేని మొరటు మనిషి దాగి ఉండటం సహజం! ఒకరెవరో జారి పడతారు. లేదా కట్టుకున్న గుడ్డ ఊడుతుంది. అందరూ ముందు నవ్వుతారు. అదుగో! ఆ మొరటు మనిషి పైకి వచ్చి నవ్వించినట్టు లెక్క! ఆ తరువాత సభ్య మానవుడు మేలుకుని సానుభూతిని కూడా పంచడం తెలుసు!
పుట్టపర్తి నాగపద్మిని గారు కొన్ని పుస్తకాలు, గోపాలకృష్ణ అన్నయ్యగారికి ఇమ్మని, ఒక అబ్బాయికి అప్పజెప్పారు. అతను, నేనే గోపాల‘కృష్ణ’ అనుకుని నాకు తెచ్చి ఇచ్చాడు. నిమిషాల్లో తిరిగి వచ్చి మళ్లీ పట్టుకుపోయి, అసలు చిరునామాలో వాటిని అందజేశాడు. ఈ మధ్య నిమిషాలలో నాకొక ‘యురేకా!’ క్షణం దొరికింది. ప్రసిద్ధ కన్నడ రచయిత ‘బీచి’ (వివరాలు మరోసారి!) ఆయన నవల సరస్వతీ పరిహారము. దాన్ని పుట్టపర్తి నారాయణాచార్యుల వారు తెనిగించారు. ‘పెళ్లాన్ని ఏం చేస్తావురా?’ డయలాగుతో ఆ పుస్తకం మొదలవుతుంది. నేను స్నానం చేస్తూ పుస్తకం చూడలేదు. లేకుంటే, నా యురేకా, మరో జోకయి ఉండేది. పద్మినిగారిని, ఫోను ద్వారా, పుస్తకం కొరకు అభ్యర్థించాను. ఆమె దయతో మొదటి పరిహారంలోని (సంహారం అంటే సమాహారమని, అంటే ఒక సేకరణ, గుంపు, కూడిక అని అర్థం ఉంది!) అన్నీ కాకున్నా, కొన్ని పుస్తకాలను నాకూ పంపించారు. వారికి ధన్యవాదాలు చెప్పాను. రుతు సంహారం అన్న కావ్యానికి రుతువుల వరుస అని అర్థం. మరి ఈ సరస్వతీ సంహారం ఏమిటని నా కుతూహలం. ఆచార్యుల వారి రచనలు, వారి గురించి రచనలున్న ‘త్రిపుటి’ని కూడా పక్కనబెట్టి ముందు ఈ చిన్న నవల చదివేశాను. దాని కోసం మీరు వెతికితే దొరకదు. అచ్చులో అదిప్పుడు దొరకడం లేదు. పద్మిని నాకు, మా అన్న గోపాలకృష్ణకు ఇచ్చినది ఫొటోకాపీ ప్రతి!
ఈ పుస్తకంలో నాయకుడు బాళప్ప అను బాలప్ప. వాడు గణపతికన్నా మరింత మొద్దబ్బాయి. వానికి ఆదర్శ మహిళకు ఆదర్శంగా ఒక అక్కగారు. ఆమె భర్త పండితుడు. తాత్వికుడు. వారి సంతానమయిన సరస్వతి, అపర సరస్వతి. అందగత్తె. మూర్త్భీవించిన మంచితనం. మనకు మేనరికం హక్కు అని ఒకటి ఏడిచింది గద. కనుక సరస్వతిని బాలప్పకిచ్చి పెళ్లి చేశారు. (ఇంకా నయం, గణపతి కథ ఇంత దూరం సాగదు!) ‘బాయిలో ఏస్తాను’ అదీ ‘గొంతు పిసికి’ అని చిన్నప్పుడు చెప్పిన మాటలను నిజం చేస్తాడు ఈ ‘నాయకుడు’. నిజంగా అది సరస్వతి సంహారమే. పుస్తకం చదివిన తరువాత నా మనసు కలత పడింది. ఎన్నిసార్లు, ఎంతకాలం దాని గురించి ఆలోచించానో? ఇది హాస్యమా? దీనికి నవ్వెట్లా వచ్చింది. ఒక అమాయక ప్రాణి, ఖర్మగాలి మూర్ఖుడయితే, అది మనకు నవ్వు పుట్టిస్తుందా? మనం మనుషులమయినట్లా? లేక ఇంకా పశువులుగానే మిగిలి ఉన్నామా?
మొక్కపాటి వారు బారిస్టరు పార్వతీశము అని ఒక రచనను మనకు అందించారు. అందులోని సన్నివేశాలు అన్నీ మనలను నవ్విస్తాయి. దాన్ని సిచువేషనల్ కామెడీ అంటారు. అందులోనూ ఎక్కడో కొంత అమాయకత్వం నక్కి ఉంటుంది. కానీ మొరటు హాస్యం కాదది. సందర్భంగా ఒక విషయం. మొక్కపాటి వారికి బహుశః బోదకాలు ఉండేదేమో? ఆయనను ఎవరో ‘గురుపాదులు’ అన్నారట. ఇది మళ్లీ గణపతి, బాళప్పలను తలపించే హాస్యం.
చిలకమర్తి వారి హాస్యములు అని ఒక పుస్తకం రెండవ చేతి (అదే సెకండ్‌హ్యాండ్) పుస్తకాలలో కనపడితే కొన్నాను. చదవటం మొదలుపెడితే, ముందుకు కదలలేదు. అందులోనూ మొరటు హాస్యమే. బ్రామ్మల గురించి జోకులు వేసి నవ్వడం మనకు బాగా అలవాటు. మాయాబజార్‌లో శర్మా శాస్ర్తిల మొదలు, కోడిని చూస్తే తినాలనిపిస్తోంది సినిమా, ఆ తరువాత నిరసనలూ, నినాదాలకు కారణమయిన మరో సినిమా దాకా, అంతటా ఇదే కదా (అప)హాస్యానికి ప్రాతిపదిక. పోలీసులను, బాపన వారిని గురించి జోకులేస్తే అడిగేవారు లేరనా? తెలంగాణ యాస మరో హాస్యం!
దేవుళ్లను గురించి జోకులు, కార్టూనులు వేయడం మనకు మరీమరీ బాగా చేతవును. గణపతి చవితి వచ్చిందంటే, పత్రికలన్నింటిలోనూ అవే కార్టూనులు. ఆయన బొమ్మను మురికిగుంటలో ముంచింది చాలక. దాని గురించి జోకు చేయడం!
చిన్నప్పుడు ఊళ్లో బోగమాట ఆడేవారు. అక్కడ బోగం వారెవరూ లేరు. అది వీధి నాటకం. తెల్లవార్లూ జరుగుతుంది. మధ్యలో కొంచెం తెరిపి, రిలీఫ్ కావాలి. ఒకాయన ‘మంచి మంచి పద్యాలు చెపుతాను వినండి’ అని మొదలుపెట్టి ‘చూడుము నీ సంసారపు నడకలు, దేవా ఈ ప్రజలు, ఎంతో మారిరి మానవులు’ అని పాట పాడేవాడు. దేఖ్ తేరీ సంసార్‌కి హాలత్ క్యా హోగయా భగవాన్? కిత్‌నా బదల్ గయా ఇన్సాన్’ అన్న సినిమా పాటకు అది స్వేచ్ఛానుకరణ. పద్యమని చెప్పి పాట పాడడం సంగతి అర్థమయిన వారికి జోకు. పారడీ కాకున్నా పాట మరో జోకు. ఆయన అప్పట్లో చేసిన ఒక ట్రిక్కును నేను ఇవాళటికీ, మానేజ్‌మెంట్ ట్రెయినింగ్‌లలో వాడుతున్నాను. ‘మిమ్మల్నందరినీ నా వెనుకకు తెప్పిస్తాను. కళ్లు మూసుకోండి’ అని మంత్రం చదువుతాడు. కళ్లు తెరవగానే, అతను అటు వేపి మళ్లి నిలబడడం కనపడుతుంది. ఎంత బాగుంది, అది జోకంటే?
నవ్వండి. కానీ, ఎందుకు నవ్వామో ఆలోచించండి. ఒకోసారి కళ్లు చెమర్చుతాయి!
* ‘అట్లు తింటారా?’ ప్రశ్న - ‘అట్లే కానీ’ జవాబు. అది మాటకారితనం.
* బాపుగారు గొప్ప కార్టూనిస్టు. ఆయనకు ఒక మానసిక గురువున్నారు. ఆయన పేరు గోపులు. గోపులు కార్టూనులు చూడదలచుకున్న ఇదే బ్లాగులో చూడవచ్చు.

Friday, August 23, 2013
సి సి ఎమ్ బి - ప్రారంభం - లోకాభిరామమ్
సైన్స్ అందించిన అందమయిన మత్తులో హాయిగా గడుస్తున్న దినం కాదిది. ఆ రోజు గడిచింది. ఇది మరుసటి రోజు. అవగాహనకు అందని అంశాలను, అనర్థాలకు దారి తీస్తున్న అంశాలను, మరింత సులభంగా పరిశీలించడానికి, ఇప్పటి వరకూ వచ్చిన సైన్సు, కొత్త వెసులుబాటు మాత్రమేనని, అందరికీ అర్థమైంది, అంటాడు ఆల్డస్ హగ్జ్‌లే
* సైన్సుకు స్వంతంగా విలువలు ఉండవు. విలువలు మనుషులకుంటాయి. సైంటిస్టులు మనుషులు. సైన్సును వాడుకునే వాళ్లు మనుషులు.
సైన్సు పండుగ
* ‘పుష్పా! ఈ సదస్సులో నేను పాల్గొనడానికి పద్ధతేమిటి?’ ఇంచుమించు ఈ అర్థం వచ్చే ప్రశ్న ఏదో అడిగాను. ‘అదేమిటి? నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను’ అన్నాడు పుష్పా. అవును పుష్ప అమ్మాయి కాదు. పుష్పమిత్ర భార్గవ అనే పి.ఎమ్.భార్గవ. జంటనగరాల్లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ’ అనే గొప్ప సంస్థను ప్రారంభించిన డైరెక్టర్ ఆయన. ఆ సంస్థ అప్పటివరకు ఆర్‌ఆర్ ల్యాబ్‌లోనే భాగంగా ఉండేది. స్వంత భవనాలు, మిగతా సౌకర్యాలు వచ్చిన తరువాత, ప్రారంభోత్సవానికి ప్రపంచంలోని గొప్ప శాస్తవ్రేత్తలను చాలామందిని పోగేసి రెండు వారాల పాటు సదస్సులు నిర్వహించారు. నేను అడిగింది, ఆ సదస్సులో పాల్గొనడం గురించే. నేను మాలిక్యులర్ బయాలజీ చదువుకున్నాను. పిహెచ్‌డి కూడా చేశాను. కానీ సదస్సుల నాటికి కేవలం సైన్సు జర్నలిస్టును! సైంటిస్టును కాదు! సదస్సుల వివరాలను, పాల్గొంటున్న వారి వివరాలను కలిపి ఒక పెద్ద పుస్తకం వేశారు. దేశ విదేశాలలోని వారెంతోమంది, పాల్గొనడానికి అప్లికేషన్స్ పంపారు. వారిలోంచి ఎంపికయిన వారు రెండు మూడు వర్గాలతో సెలెక్టెడ్ పార్టిసిపెంట్స్. ‘చాలా ముఖ్యమయిన వ్యక్తులు’ మాత్రం ఆహ్వానాలు అందుకుని వచ్చారు. పెద్ద సంస్థల డైరెక్టర్లు, ప్రభుత్వంలో సెక్రటరీల లాంటి వారితో సమానంగా, ఆ లిస్టులో నా పేరుఉంది. అప్పట్లో దేశంలో ఉండిన రెండు సైన్సు పత్రికల ఎడిటర్లు కూడా వచ్చారు. ఆరుగురు నోబెల్ బహుమతి గ్రహీతలు వచ్చారు. డిఎన్‌ఏ నిర్మాణం కనుగొన్న ఫ్రాన్సిస్ క్రిక్, టెస్ట్‌ట్యూబ్ బేబీలను ప్రారంభించిన ఎడ్వర్డ్స్ లాంటివారు అక్కడ ఉన్నారు. కానీ, సమావేశంలో మొదటి ఉపన్యాసం ఎఫ్రాయిమ్ కచాల్‌స్కీ అనే పరిశోధకుడు సమర్పించారు. దీన్ని ప్రోటోకాల్ అంటారు. అంటే మర్యాదలు పాటించడమని అర్థం!
ఎఫ్రాయిమ్ కచాల్‌స్కీ అనే ఆ భారీ మనిషి, ఇజ్రాయెల్ దేశానికి అధ్యక్షుడు, మన భాషలో రాష్టప్రతిగా పనిచేశాడు. ఆ దేశంలో గొప్ప సైంటిస్టులను, పండితులను ప్రెసిడెంట్ చేసే సంప్రదాయం ఉంది. ఒకప్పుడు, ఐన్‌స్టయిన్‌ను అడిగారు. కానీ ఆయన ఒప్పుకోలేదు. బహుశః ఆ మార్గంలోనే మన దేశంలో అవ్వల్ ఫకీర్ జైనులాబుదీన్ అబ్దుల్ కలామ్‌గారు అధ్యక్షులయ్యారు. కచాల్‌స్కీ పేరున్న జన్యుశాస్తవ్రేత్త. మంచి ప్రసంగం చేసినట్టు గుర్తుంది. వివరాలు గుర్తుకు రావడంలేదు. మొత్తానికి ఆయన మృదుభాషి. స్నేహశీలి. అంతకు ముందు నా పరిశోధన పత్రమొకటి, ఇజ్రాయెల్‌లో జరిగిన కాన్ఫరెన్సులో అంగీకరించబడింది. కానీ మన దేశానికీ, ఆ దేశానికీ సంబంధాలు సరిగా ఉండనందుకు నేను వెళ్లలేకపోయాను. ఒక మధ్యాహ్నం కచాల్‌స్కీ గారితో చాలాసేపు కబుర్లు గడిచాయి. ఒక ఇంటర్వ్యూ రికార్డు చేశాను. అంతా ముగిసి బయటకు వచ్చిన తర్వాత ఆయనను అనుక్షణం ఇంటిలిజెన్సు వారు పహరా కాస్తున్నారన్న సంగతి అర్థమైంది. ఒకాయన వచ్చి, నా రికార్డర్ లాక్కున్నాడు. ఆయనతో ఏం మాట్లాడావని గట్టిగా అడిగాడు. ‘నేను సైన్సు మాట్లాడాను. కావాలంటే, ఆ కాసెట్ పట్టుకుపో అన్నాను. అతను ఊరుకున్నాడు. మిగతా పాత్రికేయులను ఆయన దరిదాపులకు పోనివ్వలేదట! ఆ దేశంనుంచి మైకేల్ సేలా అని మరో గొప్ప ప్లాంట్ జెనెటిసిస్ట్ వచ్చాడు. ఆయనతో మాట్లాడితే ఎవరూ పట్టించుకోలేదు.
జెనెటిక్స్‌ను ఎంతో ప్రేమగా చదువుకున్న నాకు ‘ఫ్రాన్సిస్ హారీ క్రాంప్టన్ క్రిక్’ మరీ గొప్పవాడుగా కనిపించాడు. నాకు కొంతమంది పట్ల మరీ ఆరాధనా భావం ఉంటుంది. అవకాశం ఉన్నా వారికి మరీ దగ్గరగా పోవడానికి మనసు ఒప్పుకోదు. క్రిక్‌తో గుంపులో మాట్లాడడమే కానీ ఒంటరిగా కబుర్లు చెప్పే సాహసం చేయలేదు అందుకనే.
కార్ల్‌టన్ గాజుసేక్ అని మరో నోబెల్ లారేట్ వచ్చారు. ఆయన విశృంఖల భావాలు గల మనిషిగా పేరున్న వ్యక్తి. కొండజాతుల వారు, జెనెటిక్స్‌లో వారి పద్ధతుల పాత్రల గురించి గొప్ప పరిశోధనలు చేసినా, ఎందుకో అందరూ ఆయనను చూచి జంకుతారనిపించింది. నేను మాత్రం ఆయనను టైం అడిగాను. ‘నీవేమీ రికార్డు చేయనంటే ఎంతసేపయినా మాట్లాడవచ్చు!’ అన్నాడాయన. మేమిద్దరం గంటకన్నా ఎక్కువసేపు ఎన్నో సంగతులు మాట్లాడుకున్నాము. స్ర్తి పురుష సంబంధాల గురించి, ఆయనకు, కొండ జాతుల వారిలాగే, కొన్ని విచిత్రమైన అభిప్రాయాలున్నాయని అర్థమైంది. అది తప్పుకాదేమోననిపించేలాగ మాట్లాడారాయన. మేమంత సేపు మాట్లాడడం ఆశ్చర్యంగా కనిపించింది లాగుంది. సిసిఎంబీ వారి అఫీషియల్ ఫోటోగ్రాఫర్ మా ఫోటో తీసి మరునాడు ఉదయానికి నోటీసు బోర్డులో పెట్టాడు. నేను కాపీ తీసుకున్నాను. నేను రాసిన మరో వ్యాసంతోపాటు, అది ఒక దినపత్రికలో అచ్చయింది. కానీ, అదిప్పుడు నా దగ్గర మాత్రం లేదు.
జెర్మనీనుంచి వచ్చిన మరో నోబెల్ బహుమతి గ్రహీత యువకుడు. అతను బంజారా హోటేల్‌నుంచి సైకిల్‌మీద తార్నాక రావడానికి ప్రయత్నించాడు. మన మ్యాపుల కారణంగా, ఊరంతా తిరిగి తిరిగి చివరికి రానేవచ్చాడు. అప్పట్లో అదొక సంచలన వార్త! సైంటిస్టులు, పరిశోధకులు కూడా మనుషులే అనడానికి మరెన్నో ఉదాహరణలను ఈ సదస్సు సందర్భంగా నేను చూడగలిగాను.
ఇంగ్లండ్‌నుంచి ఎడ్విన్‌డాస్ దంపతులు వచ్చారు. డాస్ గారిని ఎడ్డీ అని పిలుస్తున్నారందరూ. ఆయన ‘అయామ్ ఎడ్డీ!’ అని పరిచయం చేసుకుంటున్నాడు. కరిగే ప్లాస్టిక్‌లను కనుగొని వాటి గురించి మరింత కృషి చేస్తున్న గొప్ప పరిశోధకుడాయన. వింత ఏమిటంటే, ఆయనకు ఇంద్రజాలికుడు అంటే మెజీషియన్‌గా కూడా ప్రపంచమంతటా మంచి పేరుంది! మాజిక్ అంతా సైన్స్ అనడానికి ఆయన నిలువెత్తు ఉదాహరణ. ఒకనాటి సాయంత్రం, సతీమణి సాయంతో ఆయన చక్కని ప్రదర్శన చేశారు. అందరికీ ఆయనంటే వున్న గౌరవం నాలుగింతలైంది. ఈ సందర్భంగా సీసీఎంబీ ఆస్థాన మెజీషియన్, మ్యుజీషియన్ మధుసూదన్ వామన్ పండిత్ గురించి చెప్పకపోతే అన్యాయమే అవుతుంది. పరిశోధకుడు పండిత్ మంచి మెజీషియన్. అంతకన్నా హార్మోనియం మీద హిందుస్తానీ సంగీతంలో దిట్ట. దేశంలోని ప్రసిద్ధ గాయకులెందరితో బాటు సహకార వాద్యం వాయించాడు. పండిత్ ఆ తర్వాత మంచి మిత్రుడయ్యాడు.
గొప్ప పరిశోధకులంతా వేరు దేశాల వారే అనుకుంటున్న నాకు, పెట్రోలును తినే సూక్ష్మ జీవులను కనుగొన్న ఆనంద చక్రబర్తి, ఎయిడ్స్ పరిశోధకుడు శార్ఞరవన్ (ఈ పేరును అచ్చువేయడం కుదరదేమో శారంగ రవన్ అనవచ్చు!) మరో టాటా (నిజంగా ఒక టాటా పరిశోధకుడున్నాడు!) కనిపించి, మిత్రులయి, భుజాలు పొంగేలా చేశారు. ఈ సదస్సుల సందర్భంగా కళలను గురించి ఒక సెషన్ జరిగింది. మన చిత్రకారులు పీవీ రెడ్డి, ఎమ్.ఎఫ్.హుస్సేన్, కవి విక్రంసేఠ్, ప్రసిద్ధ నిర్మాణ నిపుణుడు చార్ల్స్ కొరియా మరెందరో ఆ సెషన్‌లో పాల్గొన్నారు.
సమాపన కార్యక్రమంలో ప్రధాని రాజీవ్‌గాంధీ పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత మేమంతా భోజనాలకు బయలుదేరాము. ‘ప్రధాని మనతో భోజనం చేయనున్నారు. ఆయన కొరకు వేచి ఉండాలి!’ అని వార్త వచ్చింది. తాంక్స్‌గివింగ్‌డే, టర్కీ డిన్నర్‌లో రాజీవ్‌గాంధీ గారితో మాట్లాడే అవకాశం కూడా దొరికింది. ఆకర్షణగల అందగాడతను! ప్రధాన మంత్రి ఉండగా, ఫ్రాన్సిస్ క్రిక్ ‘జెనెటిక్స్ అంటే ఏమిటి?’ అని ఒక పాపులర్ ప్రసంగం చేశారు. నోబెల్ బహుమతి గ్రహీత, విషయాన్ని సులభంగా చెప్పిన తీరు అందరికీ నచ్చింది. సైన్స్ ఏజ్ అనే సైన్సు మాసపత్రిక సంపాదకుడు సురిందర్‌ఝా ఆ ప్రసంగ పాఠాన్ని పత్రికలో అచ్చు వేయాలనుకున్నాడు. రికార్డింగు కోసం భార్గవను అడిగాడు. సిసిఎంబీ వారు అన్ని ప్రసంగాలను రికార్డు చేశారు. క్రిక్ ఉపన్యాసాన్ని వదిలేశారు. భార్గవ, అంటే పుష్పా నన్ను అడిగాడు నేను రికార్డింగ్ ఇచ్చాను. ప్రసంగ పాఠం అచ్చయింది.
సంగీతోత్సవాలు, నాటకోత్సవాలు జరుగుతుంటాయి. సీసీఎంబీలో జరిగింది సైన్సు పండుగ. అంత ఎత్తున కాకున్నా, అడపా దడపా సైన్సు ఉత్సవాలు జరిగితే ప్రజలకు, సైన్సుకు మధ్యన ఉందనుకుంటున్న దూరం తగ్గుతుంది!

Saturday, August 17, 2013
‘చంద్రయానం’
భారత చంద్రయానం
- రచన: డా.టి.వి. వెంకటేశ్వరన్,
అనువాదం: ఎ.జి.యతిరాజులు,
ప్రజాశక్తి బుక్‌హౌస్,
ఎం.హెచ్. భవన్,
ఆజమాబాద్, హైదరాబాద్- 20, 040- 27660013.
- రచన: డా.టి.వి. వెంకటేశ్వరన్,
అనువాదం: ఎ.జి.యతిరాజులు,
ప్రజాశక్తి బుక్‌హౌస్,
ఎం.హెచ్. భవన్,
ఆజమాబాద్, హైదరాబాద్- 20, 040- 27660013.
తెలుగులో సైన్సు పుస్తకాలు వస్తున్నాయంటేనే ఆనందం. అం దునా ఏవో పాత విషయాలను గురించి కాకుండా, ఇటీవలి చంద్రమండల పరిశీలనల గురించి పుస్తకమంటే అంతకన్నా ఆనందం ఏముంటుంది. వెంకటేశ్వరన్‌ఈ పుస్తకాన్ని తమిళంలో రాశారు. ఆయన బహుశః పరిశోధకుడై ఉండాలి. చంద్రయానం ఒక్కటే గాక, చంద్రుని గురించి కూడా సరళంగా తెలియజేయడం తన రచన ఉద్దేశమని సూటిగా చెప్పారు. సైన్సులో ఒక అధునాతన విషయాన్ని గురించి, అందరికీ అర్థం కావాలంటే, ఆ విషయం గురించిన పూర్వాపరాలు తెలిసి ఉండడం నిజంగా అవసరం. ఈ పద్ధతిని అందరూ పాటించాలి.
ఇందులో కవితా ధోరణిలో పెట్టిన శీర్షికలు చంద్ర వదనం, మాటున ఉండి చూచే మర్మమేమి?, నీవులేక నేనులేను, బుగ్గపై గాయం లాంటివి పాఠకుడిని పట్టి చదివిస్తాయి. కథనం కూడా అంత బాగానూ నడుస్తుంది. చంద్ర బింబంలోని మచ్చల గురించి చెప్పిన వివరాలు బాగున్నాయి. చంద్రగోళం గురించి సవివరంగా చెప్పడమే కాదు, సాంకేతిక విషయాలూ అందించారు. చంద్రగోళం నిర్మాణం గురించి, అది పుట్టిన నాటినుంచి ఈ నాటి వరకు వచ్చిన మార్పుల గురించి శాస్ర్తియ విశేషాలతో వివరించారు. చంద్ర గ్రహాన్ని పరిశీలించడానికి, దూరం నుంచి అక్కడ దిగి చేసిన ప్రయత్నాల వివరాలు కూడా ఉన్నాయి. 125వ పేజీలో మన పరిశోధకులు చేసిన చంద్రయానం వివరాలు మొదలవుతాయి. చంద్రయాన్ సాధించిన విజయాలతో పుస్తకం ముగుస్తుంది. ఈ తరహా పుస్తకంలో బొమ్మలు ఉంటే మరింత సులభంగా అర్థమవుతుందనే భావనతో అవసరమైన చోటల్లా కావలసినన్ని ఫొటోలు, రేఖాచిత్రాలు వేశారు. అచ్చు టెక్నాలజీ బాగా పెరిగిన ఈ కాలంలో ఫొటోలు మరింత బాగావేసి ఉండవచ్చుననిపించింది.
అనువాదం చాలా సులభంగానే సాగింది. సాంకేతిక వివరాలు ఎక్కువగా ఉన్నందుకు చదివించే సౌలభ్యం కొంత తగ్గిన భావన కలిగింది. అనువాదకులు తెలుగులో వాడుకలో ఉన్న పదజాలంతో అంతగా పరిచయంగలవారు కారు. సూర్యుని చుట్టూ తిరిగేది గ్రహం. దాని చుట్టూ తిరిగే మూన్స్‌ని మనం ఉపగ్రహాలంటున్నాము. పుస్తకంలో సహాయక గ్రహాలు అనే మాట వాడారు. గ్రహాలను గోళాలు అన్నారు. అంతెందుకు చిత్రా నక్షత్రాన్ని చైత్రం నక్షత్రం అన్నారు. వికీర్ణం- వికిరణంల మధ్య తేడా ఉంది. ఇంత మంచి పుస్తకానికి, ఒక సంపాదకుని సాయం తోడయితే, మరింత బాగా వచ్చి, మరింత బాగా చదవడానికి వీలుండేది. పత్రికలకే కాదు, అన్ని ప్రచురణలకూ విషయం తెలిసిన సంపాదకులుండాలన్న సంగతిని మనవారు గుర్తిస్తే కాస్త బాగుండేదేమో!
Wednesday, August 14, 2013
Sunday, August 11, 2013
నాన్నను (నన్ను) గురించి
తినే తిండిని ఆనందంగా అనుభవించాలని, ఆదరా బాదరాగా తినగూడదని మాకు తెలియకుండానే అలవాటయింది. నాన్న బడిపంతులు! స్థితిపరులం కాదనే చెప్పాలి! కానీ తిండి సంగతిలో మాత్రం, ఎప్పుడూ లోటు లేదు. నాన్న వంటకు ఉపక్రమిస్తే, ఇక పండగే. ఒకసారి అమ్మ ఊళ్లో లేనప్పుడు, నూగులు, కొత్తిమీర, పచ్చిమిర్చిలతో నాన్న చేసిన పచ్చడి నాకు ఇవాళటికీ గుర్తుందంటే నమ్మండి. మాకంతా, ‘వంటొచ్చిన మగవాళ్లు’ అని పేరుంది! ఇక్కడ, ఎక్కువ తినడం గురించి కాదు సంగతి. ఇష్టంగా తినడం గురించి.
యూనివర్సిటీ రోజుల్లో ననుకుంటాను. ఎవరో నన్ను, నీకిష్టమయిన విషయాలు ఏమిటి? అని అడిగారు. ‘అమ్మాయిలు, స్వీట్లు, పుస్తకాలు, శాస్ర్తియ సంగీతం’ అన్నాను. ‘నాట్ నెససరిలీ ఇన్ దట్ ఆర్డర్’ అని కూడా అన్నాను. వరుస అదే కానవసరం లేదని భావం! ‘జిహ్వోపస్థ పరిత్యాగీ’ అని మొదలుపెట్టి నాన్న ఒక శ్లోకం చెప్పారు. నా యిష్టాలలో మొదటి రెండింటి మీద ఆసక్తి లేని వాడి బతుకు దండగ అని శ్లోక భావం మాత్రం గుర్తుంది. నేను పెళ్లి చేసుకోను దేశాన్ని ఉద్ధరిస్తాను! అన్నప్పుడు ఈ సంగతి చెప్పినట్లు నా అనుమానం. సందర్భం సరిగా గుర్తు రావడంలేదు.
నాన్న ఒక ట్రాన్సిస్టర్ రేడియో కొని తెచ్చాడు. నేను దాన్ని ‘సన్నవిల్లలాగ’ (చంటిపాపలాగ) చంకనేసుకుని తిరుగుతానని అందరూ అనేవారు. రకరకాల కార్యక్రమాలు వింటూ కాలం గడపడం అలవాటయింది. సిలోన్, వివిధ భారతి స్టేషన్ల నుంచి వచ్చే హిందీ సినిమా పాటలు పిచ్చిగా వినడం అలవాటయింది. తెలుగు పాటలు వారానికి రెండు అరగంటలూ, సాయంత్రం సిలోన్‌లో కొన్నీ వినిపించేవి అంతే. మా ప్రాంతంలో శాస్ర్తియ సంగీతం వినడం నిజానికి ఎవరికీ అలవాటు లేదు. నాన్న మాత్రం గద్వాల సంస్థానంలో బాల్యం, ఆ తరువాత కూడా చదువుకున్నారు. అక్కడ నాటకం, సాహిత్యం, సంగీతం లాంటి రుచులన్నీ ఆయనకు తగిలాయి. అప్పుడప్పుడు పాత పద్ధతిలో ఆయన పాడుతూ ఉండేవారు కూడా! నన్నొకసారి పిలిచి ‘నాన్నా! ఊరికే అస్తమానం ఆ సినిమా పాటలు వింటున్నావు. అప్పుడో ఇప్పుడో సంగీతం (శాస్ర్తియం) విని చూడగూడదా?’ అన్నారు. నిజం చెపుతున్నాను. ఆయన మాత్రం ప్రయత్నంగా సంగీతం విన్నట్లు నాకు గుర్తులేదు.
నాన్న ఈ మాటలన్నది నవంబరు, డిసెంబరు రోజులనుకుంటాను. రేడియో సంగీత్ సమ్మేళన్ అని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కచ్చేరీలు వచ్చేవి. మద్రాసు ‘సంగీతోత్సవం’ కచేరీలను హైదరాబాద్ రేడియో వారు కూడా ‘రిలే’ చేసేవారు. (తమిళంలో అనౌన్స్‌మెంట్లు వస్తాయని మానేశారట!) మొత్తానికి కారుకురుచ్చి అరుణాచలం, టి.ఆర్.మహాలింగం, చెంబై వైద్యనాథ భాగవతార్ వంటి మహామహుల సంగీతం విన్నాను. ‘సంగీతమంటే ఇది గదా!’ అన్న భావం ఒకటి బలంగా నాటుకుపోయింది.
నాకు ఇష్టమని చెప్పుకున్న విషయాల్లో మొదటి రెండింటి మీద, అంత ప్రేమ లేదు! నిజం! పుస్తకం, సంగీతం లేనిదే రోజు గడవదు. ఇది అంతకన్నా నిజం!
* ‘అత్త పత్తెమయితే, ఇల్లల్ల పత్తెమ’ని మాకొక మాట ఉన్నది. ఇక్కడ పత్తెమంటే, పథ్యం. తిండిలో నిబంధన. నాకు ఇష్టమయిన సంగతులు, అందరికీ ఇష్టముండాలని ఎక్కడా లేదు. కానీ, బతుకంటే ఇష్టం లేనివాళ్లు ఉండరు, ఉండగూడదని నా నమ్మకం. అమ్మ, నాన్న నాకు బతుకు నేర్పించినట్లే, బతుకు మీద ప్రేమ నేర్పించి, వారి దారిన వారు వెళ్లిపోయారు. అమ్మా, నాన్నా పెద్దవాళ్లయి, పోవడం సహజం! అయినా, వాళ్లు ఉన్నారనుకునే బతుకుతున్నాను. మన వాళ్లందరూ, అనుక్షణం మన కళ్ల ముందు ఉన్నారు గనుకనా?
* మాత, పిత, గురుదేవులు, హితులు - వీళ్లే దేవుళ్లనుకుంటే ఎంత బాగుంటుంది? అంతా కనిపించే దేవుళ్లు! కనిపిస్తారు, పలకరిస్తారు, కనికరిస్తారు!
* కోతి రాగమ్మ - చింతకాయ తొక్కు
‘కోతి రాగమ్మ చింతకాయ తొక్కు’ అన్న మాట వినగానే మీకేమయినా తోచి ఉండాలి. చాలామందికి తోచదు. కొన్ని మాటలు, జోకులు, కథలు, ఒకో ప్రాంతం, వర్గంలో మాత్రమే ప్రచారంలో ఉంటాయి. రాఘవులు, రాగడవుతాడు.. రాఘవమ్మ రాగమ్మవుతుంది. దంచడం, తొక్కడం, నూరడం సమానార్థకాలు కాకున్నా ఇంచుమించు ఒకే పనిని సూచిస్తాయి. పచ్చడి అని కొందరనే పదార్థాన్ని మేము ‘తొక్కు’ అంటాము. తొక్కింది తొక్కు. చింతకాయలు అందరికీ తెలిసినవే. ఇంత తెలిసినా, శీర్షిక అర్థం మాత్రం తెలియదు.
రాగమ్మ ముందే కోతివంట మనిషి. పనులను తన పద్ధతిలో చేసుకుంటుంది. ఆమె చింతకాయ తొక్కు పెట్టడానికి ఉద్యమించింది. పెట్టడమంటే, నిలువతొక్కు తయారుచేసి కాగు (బాన) నింపడమని భావం. ఎవరికో పెట్టడం కాదు. సరే, చింతకాయలు దంచి, నారలు కొంతవరకు తీసి పడేయాలి. పసుపు, మెంతుల పొడి, జిలకర మొదలయినవి కలపాలి. ఇక పచ్చిమిర్చి, ఉప్పు ముఖ్యంగా చేర్చాలి. అంతా అయింతర్వాత రుచి చూస్తే, కారం ఎక్కువయింది. కనుక కొంత ఉప్పు చేర్చింది. ఈసారి రుచి చూస్తే ఉప్పు మరీ ఎక్కువయింది. కనుక ఈసారి మరిన్ని చింతకాయలు దంచి కలిపింది రాగవ్వ! రుచి చూస్తే ఉప్పు తక్కువయింది. మళ్లీ సర్దుబాటు చర్యలు!
మొత్తానికి ఒక్క కాగు అనుకోని మొదలుపెట్టిన తొక్కు మూడు కాగులయింది.
అదీ కథ! అందుకే, ఎవరన్నా పనులను ఈ పద్ధతిలో సర్దడానికి ప్రయత్నిస్తే కోతి రాగమ్మ చింతకాయ తొక్కు అంటారు మా వాళ్లు!
* జొన్న చేనుకు పోయి, సొగసుకత్తెను చూచి, నిన్న మాపటి నుంచి నిద్ర లేదు. దాన్ని నన్ను గూర్చి దయ చేయి మాధవా! పొన్న పూలతోటి పూజసేతు!
పద్యం హృద్యంగా ఉంది కదూ! ఈ పద్యాన్ని మాకు సంగతేమిటో అర్థంకాని చిన్న వయసులోనే నేర్పించారు. నాట్యం పేరున చిన్నచిన్న పిల్లలు, ‘రాడాయెనే స్వామి’ అనీ, ‘స్వామిరార!’ అనీ గుప్పిగంతులు వేస్తుంటే నాకు ఈ పద్యం గుర్తుకు వస్తుంది.
* బూతుల్లోనూ అందమయినవి కొన్ని, అసహ్యమయినవి కొన్ని ఉంటాయి. సంస్కృత భాషలో ఉన్నంత మాత్రాన మాటలన్నీ ఒక పరిష్కారం గలవి కావు. ‘సుతా సురత సౌందర్యం, జామాతా వేత్తి, నో పితా!’ అని ఒక మాట ఉంది. ‘అమ్మాయి రతి సౌందర్యము, అల్లునికి తెలుస్తుంది, తండ్రికి కాదు!’ అని భావం. నిజమే, కానీ ఎంత చీదరగా ఉంది ఈ మాట! బాగలేదు!
* ఇతి శం! కోతి రాగమ్మ చింతకాయ తొక్కు, ఇక ఆగును!

Friday, August 9, 2013
Subscribe to:
Posts (Atom)