Thursday, July 31, 2014

దొంగతనానికి అర్థం – విష్ణుప్రభాకర్



ఆ పొడుగాటి దారి మీద పక్కన అతని దుకాణం ఉన్నది. బాటసారులు అక్కడ చెట్టుకింద కూచుని సేదదీరుతరు. అతను వాళ్లను కుశలం అడుగుతడు.

ఒకనాడొక బాటసారి అణా వస్తువు కొని రూపాయి యిచ్చినడు. మామూలుగనే అతను లోపలి అల్మారా తెరిచినడు. చిల్లర తిరిగి ఇచ్చేందుకని తన పాత రేకుపెట్టె తెరిచినడు. దాని మూత తెరిచి చూచే లోపల అతని చెయ్యి కదలడం ఆగిపోయింది. పక్కనుండి చూస్తున్న పెద్దమనిషి ఒకతను ఏమయింది?” అని అడిగినడు.


ఏమి లేదు, పెట్టెను మూస్తూ దుకాణదారుడు నెమ్మదిగా చెప్పాడు, పేద మనిషి ఎవరో తన నిజాయితీని కుదువబెట్టి పైసలు తీసుకుపోయినడు అని.

విష్ణు ప్రభాకర్ ప్రఖ్యాత హిందీ కథా రచయిత.

Thursday, July 3, 2014

గొప్ప వారు - గొప్ప ఊరు

మీ ఊళ్లో పెద్దవాళ్లెవరయినా పుట్టారా? ప్రశ్న- లేదండీ! అందరూ పిల్లలే పుడుతున్నారు!జవాబు.
*
నీలంరాజువారు: లక్ష్మీ ప్రసాద్‌గారు ఫోన్ చేశారు. నేను మురళీధర్‌గారిని గుర్తు తెచ్చుకుని తికమకపడ్డాను. ఆయన నన్నందులోంచి బయటపడేశారు. ఈలోగా ఆయనకేదో అవాంతరం వచ్చి మళ్లా ఫోన్ చేస్తానుఅన్నారు. పెద్దాయన ఎందుకు ఫోన్ చేశారా? అని నాకు గాబరా! ఆయన మళ్లీ పిలిచి (కాల్ చేసి!) ఏవో పుస్తకాల సంగతి మాట్లాడారు. మా తండ్రి వెంకట శేషయ్యగారి జీవిత చరిత్ర పంపుతాను చదవండిఅన్నారు. నేనిక్కడ లేచి నిలబడి దండం పెడుతున్నానుఅన్నాను. మరిన్ని మాటల తరువాత, మీరు చాలా ఎమోషనల్కదా అన్నారు. ఎక్సయిటబుల్కూడా అన్నాను నేను. పెద్దవాళ్ల భుజాల మీద ఎక్కి ప్రపంచాన్ని చూచానన్న సైంటిస్టు నాకు ఆదర్శం, అని వినయంగానే అన్నాను. నేను ఈ ప్లానెట్ మీద ఉన్నంత కాలం, మన మైత్రి ఉంటుందన్నారాయన. భుజాలు పొంగిపోయాయి. ఆయన గొప్పవారు!

* ఇజీనారం: గిరీశం గారు గొప్పవారుట్రా, అడుగుతుంది కన్యాశుల్కంలో బుచ్చమ్మ. అంతాయింతా కాదు, సురేంద్రనాథ బ్యానర్జీ అంత గొప్పవారు, జవాబిస్తాడు తమ్ముడు వెంకటేశం! కన్యాశుల్కం గొప్ప రచన. దాన్ని సృష్టించిన గురజాడ అప్పారావుగారు, మరింత గొప్పవారు (ఇందులో కథాక్రమం కొంతవరకు మృచ్ఛకటికానికి అనుసరణ అన్న సంగతి మీరు విన్నారా?) అప్పారావుగారి ఇంటిని కాపాడిన వారు ఇంకా గొప్పవారు. ఆయన రాతబల్లను, కళ్ల జోళ్లను కళ్లారా చూసిన నేను కూడా కుంచెం, కుంచం, కొంచెం గొప్పవాణ్ని! భళా!

* గొప్ప ఊరు: విజయనగరం చూడాలని నాకు చిన్నప్పటినుంచీ ఉంది. మనకేమో, యాత్రకో, పెళ్లికో తప్ప మరో ఊరు పోయే అలవాటు లేదాయె! మొత్తానికి ప్రసాదుగారనే మిత్రుల పుణ్యమా అని విజయనగరం వెళ్లాను. అక్కడ దిగగానే, ఆ నేలను తాకి మొక్కాను. ఎందరో మహానుభావులు నడిచిన గొప్ప నేల అది. గురజాడవారు, ద్వారం నాయుడుగారు, కోడి శ్రీరామమూర్తి, శ్రీశ్రీ, రోణంకి, నారాయణబాబు, చాసో, పతంజలి, మా దాట్ల (రచయితల పేర్లే వస్తున్నాయి. అక్కడ మరెందరో గొప్పవారుండే వారు, ఉన్నారు. ఉంటారు!) నారాయణదాసు, బుర్రకథ కుమ్మరి మాస్టారు...సరే, విషయంలోకి వస్తాను! తాపీ ధర్మారావు, సాలూరు రాజేశ్వరరావు!!! వాసా వారు, అంట్యాకుల పైడరాజుగారు. ఇక చాలు ఈ ప్రవాహం ఆగదు!


* బొంకుల దిబ్బ: ఈ పేరు కన్యాశుల్కం కారణంగా నాకు చిన్నప్పటినుంచీ తెలుసు. పూసపాటి రాజుల కోటకు ఎదురుగా ఉండే ఖాళీ స్థలం అది. బొంకులు అంటే అబద్ధాలు! అక్కడ జరిగే వ్యవహారాల కారణంగా ఆ పేరు వచ్చిందని కథ ఏదో విన్నట్టు గుర్తు. స్వాతంత్య్ర పోరాటంలో ఈ బొంకుల దిబ్బ వద్ద వ్యక్తి సత్యాగ్రహం నిర్వహించారు. అందులో స్థానిక నాయకులు కొందరు అరెస్టయ్యారు. 1940నాటి మాట అది. మరే ఊరయినా ఆ ఖాళీప్రదేశంలో పేద్ద భవనాలు లేచి వుండేవి. అలాంటి కీలకమయిన చోటది! విజయనగరం వారు మాత్రం దాన్ని అట్లాగే కాపాడుతున్నారు. అక్కడ కూరగాయల మార్కెటు నడుస్తున్నది. మరి ఆ వ్యాపారంలో బొంకులుంటాయా? ఉండవు. లేకుంటే అంటే, ఉంటే (!) అది కొనసాగదు గదా!

గొప్పవాళ్లు: నాకక్కడ మరో ప్రసాద్‌గారు పరిచయమయ్యారు. రచయిత, పాత్రికేయుడు అని చెప్పారు. ఆయనొక మంచితనపు మూట! మాటలంటే మంచి మాటలే గల పేటిక! నాకు ఊరు చూపింది ఆయనే. గురజాడ వారి ఇంటికి వెళ్లాము. చూడగానే నాకు కళ్లల్లో నీరొచ్చింది. నాకాయనంటే కొంచెం అభిమానం ఎక్కువ! ఇల్లు నిజంగా రోడ్‌మీద ఉంది. అది నిజంగా రద్దీగల దారి. ఇంట్లో లైబ్రరీ నడుపుతున్నారు. (అవసరమా!) ఎక్కడపడితే అక్కడ అందరూ కూచుని పత్రికలు చదువుకుంటున్నారు. పై అంతస్తులోని పంతులుగారి స్వంత గది, పక్క గదులను వదిలేశారు నయం! అక్కడ బయట గదిలో ఒక పడమటి అమ్మాయి చిత్రం ఉంది. అది మెటిల్డాఅంటారు మా శ్రీనివాస్‌గారు! పంతులుగారి గదిలో కొన్ని అలనాటి వస్తువులను కాపాడుతున్నారు. అక్కడ కింద ఒక గదిలో నాకొక విశేషం కనిపించింది. ఒక అమ్మాయి, కన్యాశుల్కంలోని సన్నివేశాలను (శతజయంతి సందర్భంలోనా?) బొమ్మలుగా గీసి ప్రదర్శించింది. ఆమెచూరిష్‌గా ఉన్నా, ఆ బొమ్మలను అక్కడ ప్రదర్శనకు పెట్టారు.
ప్రసాద్‌గారు నాకు మాటల సందర్భంగా మరో గొప్ప వ్యక్తి గురించి చెప్పారు. బోలెడన్ని పొడి అక్షరాలున్న పేరున్నా ఆయనగారు ఒకానొక సాగిరాజుగారు. వృత్తిరీత్యా లాయరు. కళా, సాహిత్యాల పోషకుడు. ఆయన జిల్లాలోని రచయితల పుస్తకాలు తెచ్చి, సగం ధరకే అమ్ముతుంటారు. ఆయనను ఇంటికి రప్పించి మరీ వెళ్లి కలిసాము. నేను కొన్ని పుస్తకాలు తెచ్చుకున్నాను కూడా. అందులో ముఖ్యంగా తలిసెట్టి రామారావు కార్టూన్ల గురించిన పుస్తకాలు దొరికాయి.

* సంగీత కళాశాల: కర్ణాటక సంగీతాన్ని అభిమానించే వారికి, విజయనగరం ఒక పుణ్యక్షేత్రం లాంటిది. అక్కడి మహారాజా కళాశాల, గుడికంటే ఎక్కువ. నారాయణదాసుగారు మొదలు శ్రీరంగం గోపాలరత్నం గారి వరకు అక్కడ పనిచేసిన ప్రిన్సిపల్స్ పట్టిక చూస్తే ఆశ్చర్యం కలిగింది. మొదటిరోజు వెడితే గుడి తలుపులు మూసి ఉన్నాయి. మరునాడు ఉదయమే మళ్లీ వెళ్లాము. ఆ మెట్లమీద కాలుపెట్టడానికి మనసొప్పలేదు. నమస్కరించి లోనికి పోయాము. పూర్వ వైభవం లేదన్న సంగతి తెలిసిపోతున్నది. అక్కడక్కడ విద్యార్థులు చెట్లకింద అభ్యాసం చేసుకుంటున్నారు. ఆవరణలో, భవనం వెనకవైపు ఒక పెద్ద చెట్టు ఉంది. అది కాలేజీ అంతగానూ పాతది. దాని కింద కూచుని అక్కడివారు, చూడవచ్చిన వారు, మహామహులెందరో పాడి ఉంటారు. వాద్యాలను పలికించి ఉంటారు. ఆ వాతావరణంలో గడిపినంత సేపు, నాకు గుండె బరువైన భావం కలిగింది. ఆవరణలోని చెట్లన్నీ ఏపుగా పెరిగి ఉన్నాయి. సంగీతంవల్లనేమో అనిపించింది. కాలేజీలో చాలాకాలంగా పనిచేస్తున్న ఒక ముసలమ్మతో మాట కలిపాను. ద్వారం దుర్గాప్రసాద్‌గారి ఇంటికి వెళ్లాలన్నాను. ఆ చోటు పేరు చెప్పి, ‘మాస్టారుగారుఅని అడగండి, ఎవరైనా చెబుతారు అన్నదామె. పాత్రికేయుడు ప్రసాద్‌గారిని తోడుగా పెట్టుకుని బయలుదేరాను. వెతకగా, వెతకగా ఇల్లు దొరికింది. కానీ తాళం వేసి ఉంది. దుర్గాప్రసాద్‌గారు ఊళ్లో లేరు. ఆ వెదుకుతున్నంత సేపు నా జేబులోంచి వినపడుతున్నది వారి వాద్యమేనని చెపితే ప్రసాద్ ఆశ్చర్యంగా, ఆనందంగా నావేపు చూచాడు. ఈలోగా నేను వెళ్లిన అసలు కార్యక్రమానికి టైమయింది. నిజానికి నన్ను పిలిచింది ఒక స్కూల్ వాళ్లు. సూర్యుడి పేరున్న ఆ బడిలో గణితం రామానుజన్ పేరున పండగ చేస్తున్నారు. పిల్లలతో, తల్లిదండ్రులతో, పంతుళ్లతో వేరువేరుగా కలగలిపి చాలా మాటలు, ఉపన్యాసాలు జరిగాయి. వాళ్లెంతో ఆదరంగా అన్ని ఏర్పాట్లు చేశారు. మామిడి తాండ్ర, మోతీచూర్ ఇచ్చి సాగనంపారు. విజయనగరంలో ఉత్తర భారతీయులు బోలెడంత మంది ఉన్నారు గనుక మోతీచూర్ అక్కడ స్పెషాలిటీ అయిందన్నారు. ఆశ్చర్యం కలిగింది. ఆ ఊళ్లో దుస్తులు చాలా చవకగా, నాణ్యత గలవి దొరుకుతాయన్నారు. అందుకు టైమ్ లేదు. ఆసక్తి అంతకన్నా లేదు.

* ఇజీనారానికి బ్రహ్మపురమనే బరంపురం చాలా దగ్గర. నాకు బరంపురం మసాలా గుర్తుకు వచ్చింది. పాత్రికేయుడు ప్రసాద్ గట్టివాడు. ఒక ఫోన్‌కొట్టి నన్ను ఒక మార్కెట్‌లోని సందులోకి తీసుకెళ్లాడు. నేను అడిగిన పదార్థం దొరికింది. కొని తెచ్చాను. అక్కడ దాన్ని విప్పాలన్న ఆలోచన కూడా లేదు. ఇల్లు చేరిన తరువాత విప్పి రుచి చూసాను. నాకు గుర్తున్న నాణ్యత లేదు. సరికదా ఇది మరీ నాసిగా ఉంది. బరంపురం కేతకీ మసాలాలో, తాంబూలంలో తినదగ్గ సుగంధ ద్రవ్యాలన్నీ ఉండాలి. ఉండేవి. నామమాత్రంగా ఉన్నాయిప్పుడు. నిజం చెప్పకపోతే తప్పు! అందులో పొగాకు కూడా ఉండాలి. ఉండేది. ఉంది! నాసిగా!

Thursday, June 26, 2014

మోహనరామా - మోహనం - మహరాజపురం సంతానం

సంతానం గారికి మోహనం బాగా ఇష్టం



Mohanarama - Santhanam

 ఈ మోహనరామా 1982 లో పాడినది. డౌన్ లోడ్ చేసి వినండి.

Download link for the track


Saturday, November 2, 2013

అద్దంలో



నిన్ను నీవు అద్దంలో ఏం చూచుకుంటావు
నిన్ను నీవు చూడాలనుకుంటే
ఎదుటి వాళ్ల కళ్లలో చూడు, మాటల్లో చూడు, చిరునవ్వుల్లో చూడు
అన్నిటికీ మించి

నీ లోపలికి నీవే తొంగి చూడు.

Friday, October 25, 2013

కొలతలు - నిష్పత్తులు

తెలంగాణము ఏర్పడుతున్నది: ఏర్పడుతున్నది అన్న మాటకు వేరుగా పడుతున్నదని అర్థమనుకుంట. సరే, గాని మన మిత్రుడు, మంచి కవి. కవిత రాసి చూపించాడు. దాన్ని అచ్చు వేసేట్లయితే ఈ ప్రసక్తి వచ్చేది కాదు. చదివి వినిపించాలి. అందులో ఆయన రణము అన్న మాట వాడుకున్నాడు. చదువుతుంటే, అది రనము అయింది. మాట మార్చగూడదా అంటే యుద్ధము అన్నాడు. అది యుద్దము అయింది. ఎందుకొచ్చిన బాధ? పోరు అంటే పోతుంది గదా అనుకుని ఇద్దరమూ సర్దుకున్నాము. సంస్కృతం ప్రభావం పోయి మనమంతా తమిళులను తలదన్నుతున్నాము. ఈ నేపత్యంలో పరిస్తితి ఎవరికీ అర్తమవుతలేదు! కృష్ణ అన్న మాటను క్రిష్న, క్రుష్నగా మార్చేసుకున్నాము. ఆంద్రప్రదేశ్ అన్నది అలవాటయి పోయింది. వేరు పడుతున్న పది జిల్లాలను తెలుగునాడు, లేదా హైదరాబాద్ రాష్ట్రం అంటే పోతుందేమో? తెలుగుదేశం అందామంటే, ఆ అందమయిన మాటను కొందరు కబ్జాచేసి పెట్టుకున్నారు మరి. ఈ కబ్జా అనే మాటను కంప్యూటర్ తెలుగులో సరిగా రాయడం కుదరదు. అది సిసలయిన ఉరుదూ మాట! ఆక్రమణ అని అర్థం!

* కళల్లో: కలల్లో ఏం కనిపించినా సర్దుకుపోవచ్చు. అది మరెవరికీ కనిపించదు. మనం వర్ణించి, (వర్నించి కాదని మనవి!) చెప్పలేము. కాని ఇళ్లల్లో కనిపించేవి ఇంచుమించు సహజంగ ఉండాలి గద! మా ఇంట్లో ఒక పెయింటింగు ఉంది. (అదిప్పుడు ఎక్కడో దాగి ఉంది) అందులో గీతాబోధ దృశ్యం? అవును అదే! క్రుష్నుడు, ర్జనులకు సంబంధించినది. నా దృష్టి మాత్రం గుర్రాల (బండి ర?) మీద! ఎంత సేపు చూచినా, మొత్తం ఎన్ని గుర్రాలున్నయి, వాటన్నిటికీ కలిపి ఎన్ని కాళ్లున్నయి అర్థమయేది కాదు. పెయింటింగులంటే అట్లాగే ఉండాలి. సర్రియలిజం అనే స్వగోలజం, డాడాయిజం వరకు పోనవసరం లేదు గానీ, పెయింటింగులో కొలత తేడాలుంటేనే సృజనాత్మకత ఉన్నట్టు లెక్క. మామూలు ఫొటోగ్రాఫు వలె ఉంటే, ఆ పెయింటింగును నేను అంతసేపు గమనిస్తానా? గుర్తుంచుకుంటానా? ఇక్కడ ప్రస్తావిస్తానా? ఈ మధ్యన అంతర్జాతీయంగా పెయింటింగ్‌లో ఒక ట్రెండ్ వచ్చింది. మరీ ఫొటోగ్రాఫులాగ బొమ్మలు గీయడం ఒకటి. కంప్యూటర్ సాయంతో ఫొటోను, పెయింటింగ్ వలె కనిపించేలాగ చేయడం! ఒకటని రెండు సంగతులు చెప్పినట్లున్నాను. విశ్వనాథ వారి ప్రభావం.. ఇచ్చటనొక విషయమున్నది, ఒకటియనగా రెండు!అంటారాయన!

ప్రపంచమంతటా, కాలెండరు కొరకు బొమ్మలు గీయడం ఒక పెద్ద కళా విశేషం. (మల్యాగారు కాలెండరు భామలతో పడే కష్టాలు ఎన్‌డిటీవీ గుడ్‌టైమ్స్‌లో చూడగలరు!) గతంలో మందు కంపెనీల వారు గుడ్డలు తడిసిన అమ్మాయిల పెయింటింగులతో మాత్రమే సంతృప్తి పడేవారు. మరి కొందరు, మన దేశంలోని వివిధ దేశాల అందమయి స్త్రీల బొమ్మలను, సచేలలుగా, (అనగా గుడ్డలతో సహా!) బొమ్మలు గీసి కాలెండర్లు వేసేవారు. ఆ అమ్మాయిలకు, కావ్యాలలో వర్ణించిన, చేపల వంటి కన్నులు, శంఖం వంటి మెడ వగైరాలుంటాయి. సరదాకు నేను ఆ రకం బొమ్మలు కొన్ని సేకరించి, స్కాన్ చేసి, నా బ్లాగులో పెట్టి ఇలాంటి అందగత్తె నిజంగా ఉంటే, మీరేమంటారు లాంటి చితిని (చిలిపి) మాట ఒకటి రాశాను. ఎంట్రీకి ఇండియన్ బ్యూటీస్అని పేరు పెట్టాను. ఇంటర్‌నెట్‌లో ఈ-మేల్, ఫీమేల్ అనేవి ముఖ్యమయిన ఆకర్షణలని నా ఉవాచ! కావాలంటే ఉద్ఘాటిస్తాను, నొక్కి వక్కాణిస్తాను కూడా! అమ్మాయి బొమ్మలు చూడదలుచుకున్న వారంతా సెర్చ్లో ఇండియన్  బ్యూటీ అని కొట్టడం, నా బ్లాగుకు రావడం,  ఈ బొమ్మలను చూడడం! (నన్ను తిట్టుకుని వెళ్లిపోవడం!) అదొక సరదా! నా బ్లాగులో టాప్‌టెన్ పేజీల్లో ఇది కూడా ఒకటయిందంటే, సంగతేమిటో అర్థమయే ఉంటుంది!

ఈ నేపథ్యంలో మనం మాడరన్ ఆర్ట్ గురించి మాట్లాడుకుంటే పరిస్థితి తీవ్ర ఇబ్బందికరమవుతుందని చెప్పక తప్పినది కాదు!

* స్థాపత్యం అని ఒక శాస్త్రం ఉంది. అందులో నుంచే స్థపతి అనే మాట వస్తుంది. దేవుని విగ్రహాలను, గుడులకు సంబంధించిన మిగతా సంగతులను ఈ శాస్త్రంలో వివరిస్తారు. ఒక విగ్రహం ఎంత ఎత్తుంటే, ఏయే భాగంలో ఎంత వెడల్పు ఉండాలి. శరీర భాగాల కొలతల్లో ఉండే సాపేక్ష నిష్పత్తులేమిటి, తెలియడానికి లెక్కలుంటాయని చెపితే విన్నాను. తరువాత స్థాపత్యం గురించి తెలిసింది. ఈ లెక్కలు ఉన్నందుకే దేవుని విగ్రహాలన్నీ జీవకళతో, సహజంగా కనిపిస్తుంటాయని అర్థమయింది. ఇక్కడ నాకు ఒకటి, అనగా రెండు సంగతులు గుర్తొస్తుంటాయి. తిరుపతి ఎంకన్న, వెంకన్న (ఏదయినా ఒకటే) విగ్రహంలో మోకాళ్ల నుంచి కింది భాగంలో ఏదో తేడా కనపడుతుంది. అసలు కాళ్లు ఇంకొంచెం లోతులో ఉన్నాయని, కనిపించే వెండి పాదాలు, వేరుగా తగిలించినవని పెద్దలు చెప్పగా విన్నాను. అసలా విగ్రహం బాలాంబిక విగ్రహమనీ, వక్షంలో ఆ తేడా తెలుస్తుందని అన్నవారున్నారు. (చదువరీ మనము దారి తప్పక ముందే తిరిగి విషయములోనికి వెళ్లుదము!) అమ్మవారు, స్వామివారి పక్కన ఉన్నట్లు విగ్రహాలుంటే, వారిద్దరి ఆకారాలు, దామాషా పద్ధతిలోనే (ఎస్టిమేట్స్, ఉజ్జాయింపులకు) సరిగ్గా ఉంటాయి ఉదాహరణ సీతమ్మ, రామయ్యలు! అదే అమ్మవారు, స్వామివారి అంక భాగంలో ఉంటే, ఈ నిష్పత్తిలో కొంచెం తేడా కనపడుతుందని నా మెదడు(?)కు తోచింది. మాలోల నరసింహుల తొడ మీద ఆసీనులయిన అమ్మవారు మరీ చిన్నగుంటారు! కాదా!

రామప్ప గుడిలో నిలబడిన అమ్మాయిలు (శిల్పాలే!) ఏ క్షణంలోనయినా దిగి వచ్చి, ఓ చిరునవ్వు కూడా పడేస్తారేమోనని నేను ఎదురుచూస్తిని! నిజంగా అంత సహజంగా ఉంటాయి ఆ మూర్తులు! ఇంక మీరు, గతంలో చూచిన విగ్రహాలు ఏవి సహజంగ ఉన్నాయి, ఏవి లేవని ఆలోచిస్తారు. ఆలోగా, మరో కొన్ని మాటలున్నాయి.

కూడలిలో, దారి పక్కన నిలబడి మనకు మార్గదర్శనం చేస్తున్న (చేసిన కూడా) నాయకుల  తెలిసినవే. అవన్నీ లైఫ్ సైజ్ కన్నా పెద్దవయినా సరే, సౌష్ఠవం అంటే అసలు కొలతల నిష్పత్తులు మారవు! గమనించారా? ఒకప్పుడు హైదరాబాద్‌లో స్టేడియం దగ్గర ఒక నాయకుని విగ్రహం ప్రతిష్ఠించారు. భారీగా అనావరణం, అనగా తెర తొలగించుట కూడా అయ్యింది. తరువాత, ఆ బొమ్మ ఆయన నిజమూర్తి వలె లేదన్నారు. విగ్రహాన్ని మార్చారు. కేవలం సహజంగా కనపడాలనే గదా?

ట్యాంకుబండ్ మీద నిలిచిన విగ్రహాలలో కొన్ని కేవలం ఊహామూర్తులు. కృష్ణదేవరాయలు పొట్టివాడని చరిత్ర చెపుతుంది. ఇక్కడ మాత్రం భారీ మనిషి. అందుకు మాడల్ సాక్షాత్తు ఎన్‌టీఆర్ అన్నగారేనట తెలుసా?

ఇంకా ఉందా? ఏమో చూద్దాం.
...........................*


మా ఇంట్లో యింకో కుష్ణమూర్తి ఉన్నాడు. అంటే మొదలు ఒక కృష్ణమూర్తి ఉండనే ఉన్నాడని అర్థంగద. ఒకాయన వ్యత్యస్త పాదారవిందుడు. రెండో (ఈ మధ్యన టీవీలో రొండోఅని రాస్తున్నరు) ఆయన కాళ్లు పక్క పక్కననే వున్నాయి. ఈ రెండో ఆయన వెనక ఒక ఆవున్నది. లేక, లేగ, దూడనా? ఈ బొమ్మలు పొడవు వెడల్పులనే నిష్పత్తులు, అదే స్థాపత్య సూత్రాలు, మామూలు మాటల్లో సౌష్ఠవం, వాస్తవికత, సహజత్వం అసలు లేవని నాకనిపిస్తుంది. ఇంతకూ, శిల్పాలు, చిత్రాలలో మూర్తులు సహజంగా ఉండవలెనా? లేక అవి ప్రతీకలు మాత్రమే గనుక ఎట్లాగయినా ఉండవచ్చునా? ఈ అనుమానం నాకు చిన్నప్పటి నుంచీ ఉంది. రానురాను అది మరింత అనుమానమవుతున్నదే తప్ప, విడిపోయే వీలు కనపడటం లేదు. మీరేమంటారూ?

Sunday, October 20, 2013

కాలం కదులుతుందా?

లీ చైల్డ్ అనే రచయిత జాక్ రీచర్ అనే పాత్రను సృష్టించాడు. ఈ రీచర్ నిజంగా విచిత్రమయిన మనిషి. రీచర్ సినిమాలు కూడా వస్తున్నాయి. రీచర్ నిద్రకు ఉపక్రమించి సరిగ్గా గంట యాభయి నిమిషాలకు లేవాలనుకుంటాడు. లేస్తాడు. వీలవుతుందా. మీకు వీలవుతుందా. అసలు మీరది ప్రయత్నించారా. కొందరికి వీలవుతుందనిపిస్తుంది. ఇక్కడ విషయం కాలం కదలిక గురించి. తరువాత ఆ కదలిక మనకు తెలియడం గురించి.

చాలా కాలం గడిచింది అనడం మనకు మామూలయింది. ఇప్పుడున్నది ఇంకో క్షణంలో ఉండదన్నది మన అనుభవం. ఆ క్షణమే ఉండదు. అనుక్షణం ఆ క్షణం గతమవుతుంది. కనుకనే కాలం గడిచింది, కదిలింది అన్న భావం మనకు కలుగుతుంది. ఇక్కడ ఏం కదిలింది. ఎట్లా కదిలింది. కాలమంటే ఒక పదార్థం కాదు, వస్తువు కాదు. ఇప్పుడిక్కడ ఉండి ఇంకో క్షణం ఇంకో చోట ఉండడం కాలానికి చేతగాదు. మరి కాలం కదిలిందంటే ఏం కదిలింది. ఎట్లా కదిలింది. ఎక్కడినుంచి ఎక్కడికి కదిలింది. కాలం ముందుకే కదులుతుందట. వెనక్కు కదలదట. ఇది మరో విచిత్రం.

ఏం కదిలింది, ఎట్లా కదిలింది తెలియకుండా, ఎంత వేగంగా కదిలిందన్న లెక్క కుదురుతుందా. ఎండలో నిలబడ్డది ఇష్టమయిన వారితోనయితే, వారి కొరకయితే, ఎండ తెలియదు, కాలం కూడా తెలియదంటారు. ఎదురుచూపులో ఎద బరువు కారణఁగా క్షణమొక యుగమయిందంటారు. వేరే ఊరికి పోతుంటే కాలం బరువుగా సాగుతుందట. తిరిగి ఇంటికి వస్తుంటే మాత్రం చాలా సులభంగా సాగుతుందట. అంటే కాలానికి ఒక నిర్ణీతవేగం లేదా

సైన్సు ప్రకారం భూమి 365 దినాలకు ఒక సారి సూర్యుని చుట్టు తిరుగుతుంది. 24 గంటలలో తన చుట్టు తాను తిరుగుతుంది. ఇక్కడ నుంచి లెక్కవేసి గడియారాలు తయారు చేశారు. అంతా అర్థమయిపోయిందనుకుని మరీ నిక్కచ్చిగా పనిచేసే అణుగడియారాలను కూడా తయారు చేశారు. అప్పుడప్పుడు గడియారానికి ఒక్క క్షణం కలిపి సరిచేస్తున్నామంటున్నారు. ఇంతకూ ఈ గడియారాలు ఏం కొలుస్తున్నయి. కాలం గడియారం ప్రకారం కదులుతుందా, గడియారం కాలం ప్రకారం కదులుతుందా.

కాలం ఒక అనుభవం. దాని కదలిక కూడా అనుభవం. దానికి ఒక వేగం ఉందా. దాన్ని గడియారాలు లెక్కబెడుతున్నాయా. లేనేలేదు. గడియారాలు కదులుతున్నాయి. మనం కాలం కదిలిందని అనుకుంటున్నాము.

ప్రపంచంలో ఎన్నో వస్తువులు ఉన్నాయి. వాటి మధ్యన పరస్పరం ఒక సంబంధం ఉంది. ఆ సంబంధం మారుతూ పోతుంది. గడియారాన్ని చూస్తుంటే ఎప్పుడూ ఒకే టైం కనబడదు. ఇప్పుడొక టైం ఉంటుంది. కొంచెం సేపయిన తరువాత చూస్తే, టైం కదిలి కనబడుతుంది. నాలుగు నిమిషాలు కదిలి కనబడింది అనుకుందాము. నాలుగు నిమిషాలు అంటే ఏమిటి. నిమిషాల ముల్లు వేగంగా కదులుతుంది. గంటల ముల్లులో ఆ వేగం అంత సులభంగ కనిపించదు. సెకండ్ల ముల్లు ఉంటే అది మరింత వేగంగ కదులుతూ కనబడుతుంది. మనం రెండవసారి గడియారం చూచినప్పుడు కొంత మార్పు, కదలిక కారణంగా వచ్చిన మార్పు కనబడుతుంది. అక్కడ అయిదు నిమిషాల తేడా కనబడితే, అయిదు నిమిషాల కాలం గడిచిందన్న భావం మనకు కలుగుతుంది. ఈలోగా మన మెదడు, మనసు వందల మైళ్లు తిరిగి వచ్చేసి ఉంటుంది. ప్రపంచంలో అన్ని సంగతులు అట్లాగే వేగంగా కదిలి ఉండవచ్చుగదా. అప్పుడూ గడిచిన కాలం అయిదు నిమిషాలేనా. లేదా ప్రపంచం మందకొడి అయ్యుండవచ్చు కూడా. ఈ తేడాలు పాపం గడియారానికి తెలియవు. అది తన మానాన తను పని చేస్తూ పోతుంది. ఇంట్లో ఉన్న ఏ రెండు గడియారాలూ ఒకే టైం చూపించవు. అసలవి చూపించేది కాలాన్ని కానే కాదు. మనం వాటికి ఒక కదలిక నేర్పించాము. వాటి కదలికతో కాలం కదులుతున్నదని అనుకుంటున్నాము.

ఒక్కసారి కళ్లు మూసుకుని ఈ ప్రపంచంలో మనం గానీ, మరో జీవిగానీ మరే వస్తువులూ, పదార్థాలూ లేవని ఊహించండి. అప్పుడు కాలం కదులుతుందా. గడియారం కదలికకూ కాలం కదలికకూ సంబంధం లేదనుకున్నాము. కాలం కదిలితే, తనంత తాను కదులుతుందని గదా. కనుక ఖాళీ ప్రపంచంలోనూ కాలం కదులుతుండాలి మరి. గుర్తుంచుకోండి. అది ఖాళీ ప్రపంచం. అక్కడ ఏ వస్తువులూ లేవు. అంటే అక్కడ ఏమీ జరగడం లేదు. అంటే ఏమీ కదలడం లేదు. సంఘటనలు లేవు. సంగతులు లేవు. మరిక కదలిక ఎక్కడిది. కాలం కదలిక మాత్రం ఎక్కడిది.


చదువుతుంటే కాలం కదిలినట్టు తెలియనే లేదు, అంటారేమో. ఆలోచించండి. మీకు సంతోషమయితే నాకూ సంతోషమే. మీకు బుర్ర తిరిగి తలనొప్పి మొదలయితే అంతకన్నా సంతోషం. సంతోషంలో నా కాలం వేగంగా గడుస్తుంది. తలనొప్పితో మీ కాలం ఆగిపోతుంది. కుంటి నడకలు నడుస్తుంది. అయినా గడియారం మాత్రం తన వేగంతో తాను నడుస్తుంది. ఇంతకూ కాలం కదులుతుందా, ఆలోచించండి.

Wednesday, October 9, 2013

మనిషి తీరు

మనిషి తీరే అంత
చేయలేని పనులను చేస్తూ, పడుతూ లేస్తూ
అసాధ్యమయిన పనులను అలవోకగా సాధిస్తూ
ఆలోచనలకు అందని దూరాలకూ, తీరాలకూ చేరుకోవడం

నక్షత్రాల మధ్యన పుట్టిన మనిషి
నక్షత్రమయ్యే దాకా నలిగి పోతుంటాడు
నక్షత్రాలను తాకుతాడు, వాటితో ఆడుకుంటాడు
కలలు కంటాడు, కల్లలు కంటాడు

తోకచుక్కల మీద ఎక్కి గెలాక్సీలు దాటుతుంటాడు
అంతా చూడాలని, అంతా తెలుసుకోవాలని తపన
అనంతమయిన ప్రశ్నలకు ఆన్సర్ వెతకాలని తపన
అందినా అందకున్నా అసంతృప్తి మిగిలే ఉండాలి

అగాధాలను, అత్యున్నత శిఖరాలను
స్థల కాలాలలోని వంపులను
తెలియని సంగతుల సొంపులను
కళ్ల ముందు చూడగలగాలన్నది ఒకటే గమ్యం
అది ఒక మంట
ఆలోచనల గురించిన మంట
మనసులో మంట

మనిషి తీరు అంతే
(పై బొమ్మ చాలా పెద్దది. వాల్ పేపర్ గా పనికి వస్తుంది. సేవ్ చేసి వాడుకోండి)