నేను తెలుగులో చాలా రాశాను. పుస్తకాలు కూడా. ఇంకా రాస్తూనే ఉన్నాను. సైన్సు,సాహిత్యం, సంగీతం, కళలు నా హాబీలు.
Monday, March 30, 2015
Sunday, December 28, 2014
బాహర్ నికాలో - మర్ జాయేగీ
పొట్లం మీద అక్షరాలు భయపెడుతున్నయ్
పొగాకు చంపుతుంది, అని
అవునూ,
పొగాకు చంపుతుందా
దానికంత దమ్ముందా
ప్రేమ చంపుతుంది
ప్రేమికురాలు చంపుతుంది
అన్నం చంపుతుంది
ఆకలి చంపుతుంది
మామూలుగా ఒక మాట చంపుతుంది
ఇక పొగాకు చంపితేనేమట
పోతే పోనీ పోరా
నాబతుకు నాచావు
అందరూ చంపే వాళ్లే
అన్నిటికన్నా ముందు నా ఆలోచనలు
ఆ తరువాతే మిగతా అన్నీ
పోతే పోనీ పోరా
Tuesday, October 21, 2014
బీభత్స, వినోదాల మధ్యనే కదా జీవితం!
ఎప్పుడో రాసిన నా వ్యాసం ఇది.
జీవితం కష్టసుఖాలు కలగలసిన కాలక్రమం. మనుషులుగా మనం మాత్రం ప్రతినిత్యం ఈ సత్యాన్ని మరిచిపోవాలని ప్రయత్నం చేస్తుంటాం. కానీ ప్రకృతి మాత్రం తన ప్రకృతిని ప్రదర్శిస్తూనే ఉంటుంది. ‘‘ఈ ప్రకృతిని పూర్తిగా అర్థం చేసుకోవడం, అనుభవించడం వీలుగాదు’’ అన్నాడు డేవిడ్ థోరో. అలా అనుకోవడం తప్పులాగుంది. అందుకే ప్రకృతి తన తీరును మన ముందు ఉంచుతూ ఉంటుంది.
భూమి రకరకాలుగా మారి ఈనాటి రూపం పొందింది. దానిమీద వాతావరణం తయారయింది. నిప్పుదొరికి మన బతుకులను మార్చేసింది. నీరు మన ఉనికికే ఆధారంగా నిలబడి ఉంది. ఇలా మనల్ని, అంటే మానవజాతిని ముందుకు నడుపుతున్న ఈ శక్తులే ఒక్కోసారి మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. భూమి, దాన్ని ఆవరించుకుని ఉన్న తత్వాలు ఇలా విలయతాండవం చేసినప్పుడు మనుషులు ఒకసారి విస్తుపోయి ‘‘అవునుగదా!’’ అనుకుంటారు.
చరిత్రలో, కథల్లో, సాహిత్యంలో వైపరీత్యాల గురించి లెక్కలేనన్ని విశేషాలున్నాయి. అయినా అవన్నీ ఒకక్షణం పక్కన బెట్టి మనమంతా సరదాగా, మరో రోజు గురించి, సంవత్సరం గురించి ఆలోచిస్తాం. అది సహజం. జీవితంలోని ఈ నాటకీయత, ఈ సంబరాలు, భయాలు అన్నీ కలిస్తేనే అది అసలు సిసలయిన సత్యమవుతుంది.
చావు తప్పదు. అయినా దాన్ని గురించి ఆలోచించడమే తప్పనుకుంటాం. అపాయాలు, ఆపదలు తప్పవు. అయినా వాటి గురించి అనుకోకుండా ఉండడం అలావాటు చేసుకుంటాం.
గుజరాత్‌లో పొద్దున్నే జెండాకు దండం పెట్టడానికి బయలుదేరిన ఎంతోమంది పిల్లలు ఇంటికి తిరిగి రాలేదు. రావడానికి ఇల్లూ మిగలలేదు. వాళ్ళూ మిగలలేదు. జెండా పుణ్యమా అని కొందరు బ్రతికి బయటపడినవారు ఉన్నారు. ఇళ్ళు మాత్రం ఇసకలో కట్టిన పిచికగూళ్ళలా కుప్పకూలాయి.
టీవీలో మధ్యాహ్నం దాకా సంబరాలు చూసినవారు, ఆ తర్వాత సర్వనాశనమయిన పట్టణాలను, బతుకులనూ చూశారు. అప్పటిదాకా దేశభక్తి, క్రమశిక్షణలతో ఉప్పొంగిన గుండెలు,ఒక్కసారిగా బరువెక్కాయి. అందరి మనసుల్లోనూ ఒకటే భావం! ఆ కూలిన ఇంటి ముందు నిలబడి, దిగులుగా చూసే పరిస్థితి నాకే వచ్చి ఉంటే? గుండె మరింత బరువవుతుంది.
ఆపదలు చెప్పిరావు, ప్రకృతి వైపరీత్యాలు అర్థం కావు. మానవులంతా బతుకుదెరువు పేరుతో అపాయాల్లోకి నడిచివస్తున్నారు. అందరూ ఒకే చోట గుమికూడుతున్నారు. గుజరాత్ భూకంపం మరీ పెద్దది. అందుకే పల్లెల్ని కూడా అది నేలమట్టం చేసింది. గుడిసె, చిన్న ఇల్లు కూలితే అందులో ప్రమాదం తక్కువ. అందులో చిక్కుకున్న వాళ్ళను రక్షించడమూ సులభం! ఆరేడు అంతస్తులుగా ఇళ్ళు కట్టుకుని నగరాల్లో బ్రతుకుతున్నవారే ఈ భూకంపంలో ఎక్కువగా మరణించారు, నష్టపోయారన్నది మాత్రం నిజం.
మన దేశంలో రాజధానితో సహా ఎన్నో నగరాలు, భూకంపాలకు గురయ్యే అవకాశం ఉందని తెలుసు. తుపానులు, వరదలు మొదలయిన బీభత్సాలకు నగరాలు, జనావాసాలు గురవుతూనే ఉన్నాయి. అలాగని అందరూ ఆయా ప్రాంతాలను వదిలి వెళ్ళిపోతున్నారా? కనీసం భయపడుతున్నారా?
ఇక్కడ నష్టం జరిగే వీలుందని తెలిసి కూడా, చింతించకుండా ఉండిపోవడం రెండు కారణాల వల్ల జరుగుతుంది. ఒకటి, తప్పని పరిస్థితుల్లో, అంతకంటే మంచి అవకాశం లేకుంటే అక్కడే ఉండడం మంచిది. అపాయం వచ్చిననాడు చూడవచ్చు! రెండవది, ఒక రకమయిన మొరటుబారిన బ్రతుకుతీరు. ‘‘మనకు గతం మంచి పాఠాలు నేర్చుకునే అలవాటులేదు’’ అంటారు గోల్డెన్.
ప్రమాదం జరిగితే వెంటనే పుట్టే ప్రశ్న ‘‘ఎందుకిలా జరిగిందీ?’’ అని. వైజ్ఞానికులు చాలా రకాల ప్రమాదాలకు కారణాలు చెప్పగలుగుతున్నారు. కొన్నింటిని ముందుగా సూచించగలుగుతున్నారు కూడా!
ఒకప్పుడు ప్రమాదాలు జరిగితే, వివరాలు అంతగా తెలిసేవి కావు. సమాచారప్రసార సాధనాలు బాగా పరిణతి చెందిన ఈ రోజుల్లో ప్రమాదం తాలూకు వివరాలు క్షణాల మీద మన ముందు దర్శనమిస్తున్నాయి. ఒక్క క్షణం విస్తుపోయినా దూరం నుంచి చూసిన వారు మళ్ళీ రోజువారీ కార్యక్రమంలో మునిగిపోతారు. వార్తల ఛానల్స్ భూకంపం భీభత్సాన్ని చూపుతుంటే, మిగతా ఛానల్స్ వినోదాన్ని చేటలతో చెరుగుతూనే ఉన్నాయి. జీవితమూ అంతే! మనం, మనవారు కానంతవరకు ఫర్వాలేదు. అయితే ప్రమాదంలో తీవ్రంగా నష్టపోయిన వారికి మాత్రం, వెంటనే కొంత, తర్వాత మరికొంత, శాశ్వత ప్రాతిపదిక మీద ఇంకొంత సాయం అవసరం.
పట్టించుకోనివారు ఉన్నట్లే, చేతనయినంత సాయం చేసేవారు కూడా ఉండడం గమనించదగింది. కాలం గడిస్తే 26 జనవరి భూకంపం చరిత్ర అవుతుంది. కొందరికి మాత్రం అది వ్యక్తి చరిత్రలో భాగమవుతుంది. వారి కోసం మనమేమి చేయగలం
Thursday, August 28, 2014
Thursday, August 7, 2014
Thursday, July 31, 2014
దొంగతనానికి అర్థం – విష్ణుప్రభాకర్
ఆ పొడుగాటి దారి మీద పక్కన అతని దుకాణం ఉన్నది.
బాటసారులు అక్కడ చెట్టుకింద కూచుని సేదదీరుతరు. అతను వాళ్లను కుశలం అడుగుతడు.
ఒకనాడొక బాటసారి అణా వస్తువు కొని రూపాయి యిచ్చినడు. మామూలుగనే అతను లోపలి అల్మారా తెరిచినడు. చిల్లర తిరిగి ఇచ్చేందుకని తన
పాత రేకుపెట్టె తెరిచినడు. దాని మూత తెరిచి చూచే లోపల అతని చెయ్యి కదలడం ఆగిపోయింది.
పక్కనుండి చూస్తున్న పెద్దమనిషి ఒకతను “ఏమయింది?” అని
అడిగినడు.
“ఏమి లేదు”, పెట్టెను మూస్తూ దుకాణదారుడు నెమ్మదిగా
చెప్పాడు, “పేద మనిషి ఎవరో తన నిజాయితీని కుదువబెట్టి పైసలు
తీసుకుపోయినడు” అని.
విష్ణు ప్రభాకర్ ప్రఖ్యాత హిందీ కథా రచయిత.
Thursday, July 3, 2014
గొప్ప వారు - గొప్ప ఊరు
‘మీ ఊళ్లో పెద్దవాళ్లెవరయినా పుట్టారా?
ప్రశ్న- ‘లేదండీ! అందరూ పిల్లలే పుడుతున్నారు!’
జవాబు.
* నీలంరాజువారు: లక్ష్మీ ప్రసాద్‌గారు ఫోన్ చేశారు. నేను మురళీధర్‌గారిని గుర్తు తెచ్చుకుని తికమకపడ్డాను. ఆయన నన్నందులోంచి బయటపడేశారు. ఈలోగా ఆయనకేదో అవాంతరం వచ్చి ‘మళ్లా ఫోన్ చేస్తాను’ అన్నారు. పెద్దాయన ఎందుకు ఫోన్ చేశారా? అని నాకు గాబరా! ఆయన మళ్లీ పిలిచి (కాల్ చేసి!) ఏవో పుస్తకాల సంగతి మాట్లాడారు. ‘మా తండ్రి వెంకట శేషయ్యగారి జీవిత చరిత్ర పంపుతాను చదవండి’ అన్నారు. ‘నేనిక్కడ లేచి నిలబడి దండం పెడుతున్నాను’ అన్నాను. మరిన్ని మాటల తరువాత, మీరు చాలా ‘ఎమోషనల్’ కదా అన్నారు. ‘ఎక్సయిటబుల్’ కూడా అన్నాను నేను. పెద్దవాళ్ల భుజాల మీద ఎక్కి ప్రపంచాన్ని చూచానన్న సైంటిస్టు నాకు ఆదర్శం, అని వినయంగానే అన్నాను. నేను ఈ ప్లానెట్ మీద ఉన్నంత కాలం, మన మైత్రి ఉంటుందన్నారాయన. భుజాలు పొంగిపోయాయి. ఆయన గొప్పవారు!
* నీలంరాజువారు: లక్ష్మీ ప్రసాద్‌గారు ఫోన్ చేశారు. నేను మురళీధర్‌గారిని గుర్తు తెచ్చుకుని తికమకపడ్డాను. ఆయన నన్నందులోంచి బయటపడేశారు. ఈలోగా ఆయనకేదో అవాంతరం వచ్చి ‘మళ్లా ఫోన్ చేస్తాను’ అన్నారు. పెద్దాయన ఎందుకు ఫోన్ చేశారా? అని నాకు గాబరా! ఆయన మళ్లీ పిలిచి (కాల్ చేసి!) ఏవో పుస్తకాల సంగతి మాట్లాడారు. ‘మా తండ్రి వెంకట శేషయ్యగారి జీవిత చరిత్ర పంపుతాను చదవండి’ అన్నారు. ‘నేనిక్కడ లేచి నిలబడి దండం పెడుతున్నాను’ అన్నాను. మరిన్ని మాటల తరువాత, మీరు చాలా ‘ఎమోషనల్’ కదా అన్నారు. ‘ఎక్సయిటబుల్’ కూడా అన్నాను నేను. పెద్దవాళ్ల భుజాల మీద ఎక్కి ప్రపంచాన్ని చూచానన్న సైంటిస్టు నాకు ఆదర్శం, అని వినయంగానే అన్నాను. నేను ఈ ప్లానెట్ మీద ఉన్నంత కాలం, మన మైత్రి ఉంటుందన్నారాయన. భుజాలు పొంగిపోయాయి. ఆయన గొప్పవారు!
* ఇజీనారం: గిరీశం గారు గొప్పవారుట్రా, అడుగుతుంది కన్యాశుల్కంలో బుచ్చమ్మ. అంతాయింతా కాదు, సురేంద్రనాథ బ్యానర్జీ అంత గొప్పవారు, జవాబిస్తాడు తమ్ముడు వెంకటేశం! కన్యాశుల్కం గొప్ప రచన. దాన్ని సృష్టించిన గురజాడ అప్పారావుగారు, మరింత గొప్పవారు (ఇందులో కథాక్రమం కొంతవరకు మృచ్ఛకటికానికి అనుసరణ అన్న సంగతి మీరు విన్నారా?) అప్పారావుగారి ఇంటిని కాపాడిన వారు ఇంకా గొప్పవారు. ఆయన రాతబల్లను, కళ్ల జోళ్లను కళ్లారా చూసిన నేను కూడా కుంచెం, కుంచం, కొంచెం గొప్పవాణ్ని! భళా!
* గొప్ప ఊరు: విజయనగరం చూడాలని నాకు చిన్నప్పటినుంచీ ఉంది. మనకేమో, యాత్రకో, పెళ్లికో తప్ప మరో ఊరు పోయే అలవాటు లేదాయె! మొత్తానికి ప్రసాదుగారనే మిత్రుల పుణ్యమా అని విజయనగరం వెళ్లాను. అక్కడ దిగగానే, ఆ నేలను తాకి మొక్కాను. ఎందరో మహానుభావులు నడిచిన గొప్ప నేల అది. గురజాడవారు, ద్వారం నాయుడుగారు, కోడి శ్రీరామమూర్తి, శ్రీశ్రీ, రోణంకి, నారాయణబాబు, చాసో, పతంజలి, మా దాట్ల (రచయితల పేర్లే వస్తున్నాయి. అక్కడ మరెందరో గొప్పవారుండే వారు, ఉన్నారు. ఉంటారు!) నారాయణదాసు, బుర్రకథ కుమ్మరి మాస్టారు...సరే, విషయంలోకి వస్తాను! తాపీ ధర్మారావు, సాలూరు రాజేశ్వరరావు!!! వాసా వారు, అంట్యాకుల పైడరాజుగారు. ఇక చాలు ఈ ప్రవాహం ఆగదు!
* బొంకుల దిబ్బ: ఈ పేరు కన్యాశుల్కం కారణంగా నాకు చిన్నప్పటినుంచీ తెలుసు. పూసపాటి రాజుల కోటకు ఎదురుగా ఉండే ఖాళీ స్థలం అది. బొంకులు అంటే అబద్ధాలు! అక్కడ జరిగే వ్యవహారాల కారణంగా ఆ పేరు వచ్చిందని కథ ఏదో విన్నట్టు గుర్తు. స్వాతంత్య్ర పోరాటంలో ఈ బొంకుల దిబ్బ వద్ద వ్యక్తి సత్యాగ్రహం నిర్వహించారు. అందులో స్థానిక నాయకులు కొందరు అరెస్టయ్యారు. 1940నాటి మాట అది. మరే ఊరయినా ఆ ఖాళీప్రదేశంలో పేద్ద భవనాలు లేచి వుండేవి. అలాంటి కీలకమయిన చోటది! విజయనగరం వారు మాత్రం దాన్ని అట్లాగే కాపాడుతున్నారు. అక్కడ కూరగాయల మార్కెటు నడుస్తున్నది. మరి ఆ వ్యాపారంలో బొంకులుంటాయా? ఉండవు. లేకుంటే అంటే, ఉంటే (!) అది కొనసాగదు గదా!
గొప్పవాళ్లు: నాకక్కడ మరో ప్రసాద్‌గారు పరిచయమయ్యారు. రచయిత, పాత్రికేయుడు అని చెప్పారు. ఆయనొక మంచితనపు మూట! మాటలంటే మంచి మాటలే గల పేటిక! నాకు ఊరు చూపింది ఆయనే. గురజాడ వారి ఇంటికి వెళ్లాము. చూడగానే నాకు కళ్లల్లో నీరొచ్చింది. నాకాయనంటే కొంచెం అభిమానం ఎక్కువ! ఇల్లు నిజంగా రోడ్‌మీద ఉంది. అది నిజంగా రద్దీగల దారి. ఇంట్లో లైబ్రరీ నడుపుతున్నారు. (అవసరమా!) ఎక్కడపడితే అక్కడ అందరూ కూచుని పత్రికలు చదువుకుంటున్నారు. పై అంతస్తులోని పంతులుగారి స్వంత గది, పక్క గదులను వదిలేశారు నయం! అక్కడ బయట గదిలో ఒక పడమటి అమ్మాయి చిత్రం ఉంది. అది ‘మెటిల్డా’ అంటారు మా శ్రీనివాస్‌గారు! పంతులుగారి గదిలో కొన్ని అలనాటి వస్తువులను కాపాడుతున్నారు. అక్కడ కింద ఒక గదిలో నాకొక విశేషం కనిపించింది. ఒక అమ్మాయి, కన్యాశుల్కంలోని సన్నివేశాలను (శతజయంతి సందర్భంలోనా?) బొమ్మలుగా గీసి ప్రదర్శించింది. ఆమెచూరిష్‌గా ఉన్నా, ఆ బొమ్మలను అక్కడ ప్రదర్శనకు పెట్టారు.
ప్రసాద్‌గారు నాకు మాటల సందర్భంగా మరో గొప్ప వ్యక్తి గురించి చెప్పారు. బోలెడన్ని పొడి అక్షరాలున్న పేరున్నా ఆయనగారు ఒకానొక సాగిరాజుగారు. వృత్తిరీత్యా లాయరు. కళా, సాహిత్యాల పోషకుడు. ఆయన జిల్లాలోని రచయితల పుస్తకాలు తెచ్చి, సగం ధరకే అమ్ముతుంటారు. ఆయనను ఇంటికి రప్పించి మరీ వెళ్లి కలిసాము. నేను కొన్ని పుస్తకాలు తెచ్చుకున్నాను కూడా. అందులో ముఖ్యంగా తలిసెట్టి రామారావు కార్టూన్ల గురించిన పుస్తకాలు దొరికాయి.
* సంగీత కళాశాల: కర్ణాటక సంగీతాన్ని అభిమానించే వారికి, విజయనగరం ఒక పుణ్యక్షేత్రం లాంటిది. అక్కడి మహారాజా కళాశాల, గుడికంటే ఎక్కువ. నారాయణదాసుగారు మొదలు శ్రీరంగం గోపాలరత్నం గారి వరకు అక్కడ పనిచేసిన ప్రిన్సిపల్స్ పట్టిక చూస్తే ఆశ్చర్యం కలిగింది. మొదటిరోజు వెడితే గుడి తలుపులు మూసి ఉన్నాయి. మరునాడు ఉదయమే మళ్లీ వెళ్లాము. ఆ మెట్లమీద కాలుపెట్టడానికి మనసొప్పలేదు. నమస్కరించి లోనికి పోయాము. పూర్వ వైభవం లేదన్న సంగతి తెలిసిపోతున్నది. అక్కడక్కడ విద్యార్థులు చెట్లకింద అభ్యాసం చేసుకుంటున్నారు. ఆవరణలో, భవనం వెనకవైపు ఒక పెద్ద చెట్టు ఉంది. అది కాలేజీ అంతగానూ పాతది. దాని కింద కూచుని అక్కడివారు, చూడవచ్చిన వారు, మహామహులెందరో పాడి ఉంటారు. వాద్యాలను పలికించి ఉంటారు. ఆ వాతావరణంలో గడిపినంత సేపు, నాకు గుండె బరువైన భావం కలిగింది. ఆవరణలోని చెట్లన్నీ ఏపుగా పెరిగి ఉన్నాయి. సంగీతంవల్లనేమో అనిపించింది. కాలేజీలో చాలాకాలంగా పనిచేస్తున్న ఒక ముసలమ్మతో మాట కలిపాను. ద్వారం దుర్గాప్రసాద్‌గారి ఇంటికి వెళ్లాలన్నాను. ఆ చోటు పేరు చెప్పి, ‘మాస్టారుగారు’ అని అడగండి, ఎవరైనా చెబుతారు అన్నదామె. పాత్రికేయుడు ప్రసాద్‌గారిని తోడుగా పెట్టుకుని బయలుదేరాను. వెతకగా, వెతకగా ఇల్లు దొరికింది. కానీ తాళం వేసి ఉంది. దుర్గాప్రసాద్‌గారు ఊళ్లో లేరు. ఆ వెదుకుతున్నంత సేపు నా జేబులోంచి వినపడుతున్నది వారి వాద్యమేనని చెపితే ప్రసాద్ ఆశ్చర్యంగా, ఆనందంగా నావేపు చూచాడు. ఈలోగా నేను వెళ్లిన అసలు కార్యక్రమానికి టైమయింది. నిజానికి నన్ను పిలిచింది ఒక స్కూల్ వాళ్లు. సూర్యుడి పేరున్న ఆ బడిలో గణితం రామానుజన్ పేరున పండగ చేస్తున్నారు. పిల్లలతో, తల్లిదండ్రులతో, పంతుళ్లతో వేరువేరుగా కలగలిపి చాలా మాటలు, ఉపన్యాసాలు జరిగాయి. వాళ్లెంతో ఆదరంగా అన్ని ఏర్పాట్లు చేశారు. మామిడి తాండ్ర, మోతీచూర్ ఇచ్చి సాగనంపారు. విజయనగరంలో ఉత్తర భారతీయులు బోలెడంత మంది ఉన్నారు గనుక మోతీచూర్ అక్కడ స్పెషాలిటీ అయిందన్నారు. ఆశ్చర్యం కలిగింది. ఆ ఊళ్లో దుస్తులు చాలా చవకగా, నాణ్యత గలవి దొరుకుతాయన్నారు. అందుకు టైమ్ లేదు. ఆసక్తి అంతకన్నా లేదు.
* ఇజీనారానికి బ్రహ్మపురమనే బరంపురం చాలా దగ్గర. నాకు బరంపురం మసాలా గుర్తుకు వచ్చింది. పాత్రికేయుడు ప్రసాద్ గట్టివాడు. ఒక ఫోన్‌కొట్టి నన్ను ఒక మార్కెట్‌లోని సందులోకి తీసుకెళ్లాడు. నేను అడిగిన పదార్థం దొరికింది. కొని తెచ్చాను. అక్కడ దాన్ని విప్పాలన్న ఆలోచన కూడా లేదు. ఇల్లు చేరిన తరువాత విప్పి రుచి చూసాను. నాకు గుర్తున్న నాణ్యత లేదు. సరికదా ఇది మరీ నాసిగా ఉంది. బరంపురం కేతకీ మసాలాలో, తాంబూలంలో తినదగ్గ సుగంధ ద్రవ్యాలన్నీ ఉండాలి. ఉండేవి. నామమాత్రంగా ఉన్నాయిప్పుడు. నిజం చెప్పకపోతే తప్పు! అందులో పొగాకు కూడా ఉండాలి. ఉండేది. ఉంది! నాసిగా!
Subscribe to:
Posts (Atom)


