Saturday, September 1, 2012

ఆంగ్లంలో మనుచరిత్ర


‘అల్లసాని పెద్దన’ మనుచరిత్ర- ఆంగ్లం.
అనువాదకులు: శిష్ట్లా శ్రీనివాస్
పేజీలు:404;
వెల: రూ.495/-
దృశ్యకళా దీపిక ప్రచురణలు;
లాసన్స్ బేకాలనీ, విశాఖపట్నం

తెలుగులో కావ్యాలు అనగానే, అందరికీ ముందు గుర్తుకువచ్చేది మనుచరిత్ర. మనుచరిత్ర అనగానే అందరికీ ముందు గుర్తుకు వచ్చేది ప్రవర వరూధినులు. కానీ, ఈ కథలో ప్రవరునికి పాత్ర లేదు. వరూధినికి స్వరోచి, అతనికి స్వారోచిషుడనే మనువు పుట్టాలి. అది మనుచరిత్ర. కథను తెలుగు చదవలేనివారికి కూడా అందించే పద్ధతిలో శిష్ట్లా శ్రీనివాస్‌గారు ఈ ఇంగ్లీషు అనువాదాన్ని స్వయంగాచేసి, ప్రచురించారు. ఇంతకుముందు ఈయనే ఆముక్తమాల్యదను ఆంగ్లంలో అందించారు.

శ్రీనివాస్, ఆంధ్ర విశ్వవిద్యాలయం కళల విభాగంలో కళాచరిత్ర బోధకులు. శిల్పం, చిత్రకళ మీద జరిపే పరిశీలనలు, పరిశోధనలతో వారి దృష్టి సారస్వతంవేపు మళ్లింది. భూమి గుండ్రంగా ఉందని చూపే బొమ్మలు, శిల్పాల ప్రేరణతో ఆయన ‘కపిత్థాకార భూగోళ’అనే పుస్తకం రాశారు. శ్రీకృష్ణదేవరాయలు, గురజాడవారు వీరిని ఎంతో ప్రభావితం చేశారు. రాయల రచనను ఆంగ్లంలోకి అనువదించడానికి అదే ప్రేరణ అనవచ్చు. రాయలను సాక్షాత్తు శ్రీమహావిష్ణువుగా భావించి తన కావ్యాన్ని అంకితమిచ్చిన పెద్దన మనుచరిత్ర, క్రమంలో తరువాత వచ్చింది.

కృష్ణదేవరాయలకు తాను దాసీపుత్రుడన్న జనవాక్యం, బాధాకరంగా తోచడం సహజం. రాయల వ్యాసంగంలో ‘స్వారోచిష మను సంభవం’ తగిలింది. ఆ మనువుకూడా రాణికి పుట్టినవాడు కాదు. కనుక రాయలు ఆ కథను పెద్దన చేత తెలుగులో వ్రాయించాడు. అందులో ప్రయత్నంగా పెద్దన కొన్ని మార్పులుచేర్పులతో కథను మలిచి మహత్తర కావ్యంగా రాయలకు అంకితం చేశాడు. మనువుల కథ సంస్కృతంలో మార్కండేయ పురాణంలో వస్తుంది. దాన్ని మారన తెలుగు కావ్యంగా మలిచాడు. రాయలు కూడా రచన అదే మార్గంలో ఉండాలని పెద్దనకు సూచించాడు. అల్లసాని కవి మాత్రం మారన పేరు కూడా ఎత్తకుండా కథను మహా రంజకంగా వెలయించాడు. ఆంధ్ర(!) కవితా పితామహుడనిపించుకున్నాడు. ఆ కావ్యాన్ని శ్రీనివాస్ ప్రస్తుతం, పద్యానికి పద్యం, పాదానికి పాదంగా ఆంగ్లంలో అందించాడు.

శ్రీనివాస్ స్వతహాగా పరిశోధకుడు. తాను తెలుగు, సంస్కృతాలలో పండితుడిని కానని తానే చెపుతాడు. కానీ, కావ్యం ముందు వెనుకల గురించి ఎంతో పరిశీలించి ఎనె్నన్నో అంశాలను కూడా ఈ పుస్తకంలో అందించాడు. కథను సూక్ష్మంగా అందించడం అవసరం. దాన్ని మరీ సూక్ష్మంగా అందించి మరెన్నో విషయాలను మాత్రం చాలా వివరంగా, 100 పేజీలకు పైన వ్యాసాల రూపంలో ఇచ్చాడు. అనువాదం పద్ధతి, అక్నాలెజ్‌మెంట్స్ తర్వాత, ప్రవేశికలో ప్రారంభించి, పురాణాలు, మూడుసార్లు వచ్చిన మనుకథలలో తేడాలు, రాయలు, అల్లసాని, వారి గురించి కావ్యం గురించి ఇచ్చిన సమాచారం తెలిసిన వారికి కూడా కొత్త ఆలోచనలను అందజేసే తీరులో ఉంది. కళాదృష్టితో చూచి ఈ అనువాదకుడు, కథ ఔట్‌డోర్, ఇన్‌డోర్‌లలో నడిచిన తీరు గురించి చేసిన వ్యాఖ్యానం చాలా బాగుంది.
కృష్ణరాయలు, పెద్దనలిద్దరూ వైష్ణవ గురువుల శిష్యులు. ఆముక్త మాల్యద అనువాదం నాటికి శ్రీనివాస్‌కు అంతగా అందని వైష్ణవం విశేషాలు ఈ పుస్తకంలో సవివరంగా కనిపిస్తాయి. కావ్యం అయిన తరువాత యిరవయి పుటలలో ఇచ్చిన వివరాలు, గొప్ప పరిశోధన దృష్టికి నిదర్శనాలు.

అల్లసాని పెద్దన గురించి చెప్పేవారంతా ‘అల్లిక జిగిబిగి’గురించి వ్యాఖ్యానిస్తారు. పెద్దన రచనలో సంస్కృతం ఎక్కువ. అయినా మాటలు మంచి పట్టుగల నడకలో సాగుతాయని చెప్పక తప్పదు. ‘లంబమాన రవి రథతురగ చారుచామర’ లాంటి మాటలు ఎందరికో కలకాలంగా గుర్తున్నాయి. ప్రవరుడు హిమాలయాలకు వెళ్లి (అపజనించె)న, తరువాత పద్యమంతా సంస్కృతమే. అంబర చుంబి శిరస్సరజరీ అంటూ పద్యం జలపాతంలాగే సాగుతుంది. దాన్ని శ్రీనివాస్ ఆంగ్లంలో ఎట్లా రాశారు? నిజమే, ఈ పద్యంలోనే కాదు, మొత్తం కావ్యంలోనే, ఆంగ్లంలో, అల్లిక జిగిబిగి కానరాదు. ఇది వ్యాఖ్యానాలమీద ఆధారపడి చేసిన అనువాదమని శ్రీనివాస్ స్వయంగా చెప్పాడు. ఇంగ్లీషులో కావ్యాన్ని చదివే వారికి, మూలం నడక తెలియదుకానీ, ఏ భావమూ, అభివ్యక్తీ జారకుండా అనువాదం సాగింది. మూలం చదివి, అర్థంచేసుకున్న వారయినా, ఈ విషయాన్ని సహృదయతతో ‘బాగుందం’టారు.

అనువాదకుని అసలు ఆసక్తి శిల్పంలో! ఆముక్తమాల్యద అనువాద గ్రంథంలోలాగే ఈ పుస్తకంలో కూడా, ఎన్నో ఫొటోలు పొందుపరిచారు మరి. ఈ చిత్రాలన్నింటికీ కథలోని సందర్భంతో సంబంధం ఉందా? కొంతవరకు ఉంది. చాలావరకు లేదు. కానీ అరుదయిన శిల్పకళను చూచిన ఆనందం మాత్రం పాఠకునికి మిగులుతుంది.
అల్లసానివారి అల్లిక ‘జిగి బిగి’అంటే ‘విగరస్ అండ్ టైట్’అనే విశేషణాలను వాడారు వ్యాసంలో. ముక్కు తిమ్మనార్య ముద్దుపలుకులను, పదాలు ముద్దులవలె ఉన్నాయని అర్థం వచ్చే మాటలతో అనువదించారు. ముద్దుపలుకులంటే, ముద్దొచ్చే పలుకులేమో? ముఖ పత్రం మీద కృష్ణరాయల బొమ్మ (శిల్పం) ఉంది అల్లసాని పెద్దన, శిష్ట్లా శ్రీనివాస్‌ల పేర్లున్నాయి. రెండు పేర్లలోని స,శ,ష లకు ఒకే ఎస్‌ను వాడారు. ఈ పద్ధతిని గురించి అందరూ ఆలోచించాలి.

ఈ అనువాదంతో శ్రీనివాస్ ఆంధ్ర సాహిత్యానికి గొప్ప ఉపకారం చేశారు. వారింకా ఏయే కావ్యాలను అందిస్తారోనని అంతా ఎదురుచూస్తారు. పుస్తకంలో అచ్చుతప్పులు (అక్కడక్కడ) ఉన్నాయి. పాయసంలో పుడకల్లాగ!

No comments:

Post a Comment