Friday, April 12, 2013

నారాయణ్ శ్రీధర్ బేంద్రే

స్వర్గీయ శ్రీ పైడిమర్రి రాజా రామచంద్రరావు గారు కళా తపస్వి.
ఆయన బహుముఖ ప్ఱజ్ఞ గురించి చెప్పడాలికి ఒక పుస్తకం రాయాలి.
ఆయన రాసిన ఒక పుస్తకాన్ని తెలుగు చేసే అవకాశం నాకు దక్కింది.
అందులో నుంచి ఒక్క పేజీ మాతరం ఇక్కడ పంచుకుంటున్నాను.
ఇది భారతీయ కళల గురించిన పుస్తకం. 
అందులోని చివరి భాగంలో ప్రఖ్యాత చిత్రకారుడు బేంద్రే గురించి రాశారు.

నారాయణ్ శ్రీధర్ బేంద్రే




వాస్తవికత యొక్క ప్రాముఖ్యాన్ని గుర్తించే ప్రయత్నంలో నారాయణ్ శ్రీధర్ బేంద్రే నైరూప్య చిత్రకళ అనే గమ్యం దాకా పయనించాడు. అంతకు ముందే అతను భారతీయ లఘుచిత్రకళల మీద అకడమిసిజమ్, ఇంప్రెషనిజమ్, క్యూబిజమ్, ప్రాచ్యభావాలను ముఖ్యంగా గమనించాడు. అతనికి వస్తు నిర్మాణ వైచిత్రిలోని వివరాల పట్ల అత్యంత శ్రద్ధ. అందుకే రంగులు సాధించగల ప్రేరణావకాశాల గురించి ఎంతో తరచి చూచాడు. అనుకోకుండా అలవోకగా కుంచె కొన్ని రూపాలను ముందుంచింది. పసుపు, నారింజ, నీలం, ముదురుగోధుమ లాంటి రంగుల వరుసలతో ఒక కదలిక కనిపించింది. అందులోనే స్థలం కదిలి చిందులు వేసింది. అతను ఈ కళా సమన్వయాన్ని ఫ్రెంచి ప్రవీణుడు ఎమిలీ బోనార్డ్ నుంచి నేర్చుకున్నాడు. ఆ రంగులలోనే ఆకారాలు ఆవిష్కరింపబడ్డాయి. చుట్టు హద్దులుగా ఉండే గీతల అవసరం తీరి పోయింది. బేంద్రే ఆ తరువాతి కాలంలో వేసిన చిత్రాలలో ఒక ఔద్ధత్యం కనబడుతుంది. రంగులు వాటి గట్లు తెంచుకుని విలయతాండవం చేస్తాయి. అంతకు ముందేమో, రూపాలు ముందే ఊహించి సమన్వయ పరిచినట్లు ఉండేవి. ఆ తరువాతి నైరూప్య కళా ప్రయోగం పూర్తిగా మరో తీరు. ఆక్షన్ చిత్రాలూ అలాంటివే. అంటే, సౌందర్య పిపాసలో అతను తెరిపి లేకుండా తపించి, తనకు తాను కొత్త పద్ధతిలోకి మారగలిగాడని చెప్పడానికి ఇదొక ప్రమాణం.

బేంద్రేలోని అశ్చర్యకరమైన వైవిధ్యాన్ని బరోడాలో ఎందరో చిత్రకారులు అనుసరించారు. బరోడా విశ్వవిద్యాలయం వారి ఫైన్ ఆర్ట్స్ విభాగానికి బేంద్రే అధిపతిగా ఉన్నాడు మరి. అక్కడ అడ్డు లేని స్వాతంత్ర్యంతో కొత్త సృజన తల ఎత్తింది. జ్యోతి భట్, శాంతి దవే, జి.ఆర్. సంతోష్,  గులాం ముహమ్మద్ షేఖ్ అందుకు ఉదాహరణలు.
 

కొట్టవచ్చినట్టి వైవిధ్యంగల చిత్రకారుడు బేంద్రే. అతను ఎన్నో శైలులు, పద్ధతులతో ప్రయోగాలు చేశాడు. ఒక మూసలో ఇరుక్కు పోయేది లేదన్నాడు. అతని మీద మాత్రం బాంబే పద్ధతి ప్రబావం కొంతవరకు ప్రసరించింది.ముఘల్, రాజపుత్ లాంటి స్థానిక సంప్రదాయాల ప్రభావంతో బాటు, బెంగాల్ పునరుద్ధరణ ఉద్యమం, సెజాన్, గాగిన్ ల పోస్ట్ ఇంప్రెషనిజంల ప్రభావాలు కొంత పడ్డాయి. అతని విస్తృతమయిన కళాసృష్టికి భారతీయతే ముఖ్యాధారం. అతని చుట్టూ ఉన్న వాతావరణమే అందులో ప్రతిబింబించింది. ఎంతో వ్యక్తిగతమయిన సమగ్ర దృష్టికి అతని చిత్రాలు సమగ్రమయిన ఉదాహరణలు. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురయినా అతనిలో మాత్రం నిరంతర అన్వేషణ కొనసాగింది. అది జీవితంలోని మానవత వెచ్చదనం, వర్ణాలకు స్పందించింది.

No comments:

Post a Comment