దేవాలయాలపై బొమ్మలు - పరమపద సోపానాలు
రచన:
డా.కొత్తపల్లి ఘన శ్యామల ప్రసాదరావు
శ్రీ గురుకృపాసింధు ప్రచురణలు,
రాజమండ్రి. వెల: రూ. 150/-
ప్రతులకు రచయిత, డి బ్లాక్, 212,
కె.ఎస్.ఆర్.గ్రీన్‌వ్యాలీ కాంప్లెక్స్,
మాధవ ధార, విశాఖపట్నం-18
ఫోన్: 9291489379
తాపీ ధర్మారావుగారు గొప్ప పండితులు. ఆయన హేతువాద దృష్టితో 1936లోనే ‘దేవాలయాలమీద బూతు బొమ్మలెందుకు?’ అని ఓ చిన్న పుస్తకం వెలువరించారు. నిజానికి
ధర్మారావుగారు రాసిన మిగతా పుస్తకాలేమిటో తెలియని వారు కూడా ఈ పుస్తకాన్ని చదివారు. పనిగట్టుకుని ఆ పుస్తకాన్ని పదే పదే అచ్చువేయించి, బతికించిన తీరు, మనిషి మనస్తత్వానికి
ఒక ఉదాహరణ.
వారణాసి సుబ్రహ్మణ్య శాస్ర్తీగారనే మరొక పండితుడు ‘తాపీ వారి దూషణమునకు సమాధానము’ అని మరో పుస్తకం రాసి వేయించారు. కానీ, అది మాత్రం అంతగా ప్రచారంలోకి రాలేదు.
పూర్వపక్షం, అంటే ప్రతివాదం, లేదా ఖండనగా వచ్చిన పుస్తకం ఎక్కడో మరుగున వుండిపోయింది. తాపీవారి పుస్తకం పుట్టిన తరువాత పుట్టిన డా.కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు
ప్రస్తుతం ఈ ‘దేవాలయాలపై బొమ్మలు’అనే పుస్తకాన్ని తాపీవారి మాటలకు ఖండన రూపంగా అందిస్తున్నారు. ఈ రచయిత మామూలు మనిషేమీ కాదు. ఎనె్నన్నో పుస్తకాలు రాసారు.
దేశమంతటా తిరిగి ఎంతో సమాచారం సేకరించారు. ఎన్నో గ్రంథాలనుంచి విషయం గురించి ఎంతో సమాచారాన్ని సమకూర్చారు. అన్నింటినీ ఆధారాలుగా వారే ముందు, తాపీవారి వాదాలకు, తరువాత ఆరుద్రగారి ఒక రచనకు, మాటకు మాట పద్ధతిలో సవివరంగా సమాధానాలు రాశారు. చివరకు దేవాలయాల మీది ‘బూతు’ బొమ్మలు, ‘పరమ పద సోపానాలు’ అంటూ తమ వాదం అందించారు.
ఒక విషయాన్ని గట్టిగా నమ్మిన వారికి, ఆ విషయాన్ని మరొకరు చులకన చేసి, కించపరిస్తే బాగా కోపం కలుగుతుంది. విషయం మనసునకు మరీ దగ్గరైనదైతే కోపము కూడా ఎక్కువవుతుంది. ప్రసాదరావుగారి రచనలో ఈ కోపం కనపడుతుంది. ఎప్పుడో పోయిన ఒక వ్యక్తికి సమాధానంగా కాక, ఆ వ్యక్తి అభిప్రాయాలకు ఖండనగా మాత్రమే రచన సాగితే మరింత బాగుండేది.
అట్లాగని ఈ ఖండనలో పస లేదంటే తప్పు తప్పున్నర! తాపీ వారి మాటలను ఒక్కొక్కటే ఎత్తుకుని జవాబు చెప్పిన తీరు ఆలోచింప చేసేదిగా ఉంది. మామూలు పాఠకుడు, పండితుని అభిప్రాయాన్నివిని, ‘అవునేమో’ అనుకుంటాడు. మరి వారిలో వివేచన కలిగించడమా, సరదా కోరికా? అన్న ప్రశ్నతో చర్చ మొదలవుతుంది. ‘మాటలకు అర్థాలు మరిచిపోయారని’ తాపీవారు చేసిన అభియోగం మీద మరొక మంచి చర్చ సాగుతుందిక్కడ. ‘మనిషే దేవుని సృష్టించాడు’ అన్నది తాపీవారి మరొక మాట. ప్రసాదరావుగారి ప్రతివాదంలో, మనుజులంతా మనువు సంతతి,
మనువు తనను దేవుడు సృష్టించాడు అన్నాడు అంటూ చెబుతూ పంచ మహా భూతములను దేవుడు సృష్టించాడు, ద్వాపర, కలియుగాలలో మాత్రమే సంతాన ప్రాప్తి కొరకు స్ర్తి, పురుషుల కలయిక అవసరం అయింది లాంటి ఎన్నో వాదాలను చెబుతారు. వీటన్నిటికీ ఆధారాలు కూడా చూపుతారు. ఇవన్నీ ఈనాటి చదువులకు, అవగాహనలకు అందని సంగతులని అనే వారున్నారు. సృష్టి, దేవుడి సృష్టి, వాటికి ఆధారాలుగా చూపుతున్న ఆకారాలు అన్నీ మనిషి సృష్టించినవే అంటే, వాదం మరింత ముందుకు సాగుతుంది.
ద్రౌపది, అయిదుగురు భర్తలు గురించి ఈ పుస్తకంలో చక్కని చర్చ వుంది. ఇటీవల వచ్చిన ఒక రచన గురించి కూడా ఇక్కడ ప్రసక్తి వుంది. పండితులు ఈ రకంగా చర్చ జరుపుతూ వుంటే, మామూలు పాఠకులకు కూడా ఆలోచించే అలవాటు కలుగుతుంది. స్ర్తి పురుష అంగాలు, లింగారాధన, ప్రతీకలు మొదలైన అంశాల గురించిన చర్చ ఆసక్తికరంగా సాగింది. కానీ, వాదంలో చివరి మాట నాదే, అన్న ధోరణి మరింత చర్చకు వీలు లేకుండా
చేస్తుందేమో? ఎదుటి వారిది వితండ పద్ధతి అయినంత మాత్రాన మనదీ అదే తీరు కాకూడదు గదా! 118 పేజీల వరకు తాపీవారి మాటలకు చక్కని సమాధానాలతో రచన సాగుతుంది.
తరువాత ఆరుద్ర రచనకు సమాధానాలున్నాయి. ‘గుడిలో సెక్స్’ గురించిన ఈ చర్చలో శాస్త్ర గ్రంథాల నుంచి రెఫరెన్సులు లేవు. బొమ్మలు, పరమపద సోపానాలు అంటూ సూక్ష్మంగానైనా రచయిత తమ
వాదాన్ని ఆవిష్కరించారు. ఇక్కడ కూడా రచన ఆసక్తికరమైన అంశాలను మన ముందు ఉంచుతుంది. ఏ విషయం గురించినదయినా, చర్చ జరగడం మంచి సంప్రదాయం, చెప్పవలసిన వారు, నోరు మూసుకుని
ఊరుకుంటే, కొన్ని అభిప్రాయాలు స్థిరమవుతాయి. ప్రసాదరావుగారి మాటలకు మరెవరయినా సమాధానాలను అందిస్తారా? చర్చ కొనసాగితే, విషయం మరింత విశదమవుతుంది. ఆసక్తి, వీలుగలవారందరూ ఈ చర్చలో
పాలుపంచుకోవాలి.
ఆర్ష విజ్ఞాన విశారదుడు ‘కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు’
ReplyDeleteవందేమాతరం-అని అన్న బంకించంద్ర ఛటోపాధ్యాయ మాతృదేశ భక్తితత్త్వాన్ని మరోసారి చిగురింప చేశాడు! మాతృదేశ భక్తి మన జాతీయతా వికాసానికి సనాతన ప్రాతిపదిక! మాతాభూమీ పుత్రోహం పృథిత్వాః’ అని సృష్ట్యాదిలో వేదద్రష్టలు ఎలుగెత్తడంతో ఈ జాతీయతా వికసనం అంకురించింది. కొత్తపల్లివారి జీవన ప్రస్థానం. క్రీ.శ. 1937లో కృష్ణాజిల్లా కైకలూరులో జన్మించిన ఘనశ్యామల ప్రసాదరావు పార్థివ శరీర పరిత్యాగం చేసి పరమపదం వైపు సాగిపోయాడు. ఆయన ‘సమకాల ప్రచార ప్రమాణాల ప్రాతిపదిక’గా ప్రసిద్ధుడు కాకపోవచ్చు. కాని భరతమాతృ ఆరాధనను ఆజీవన వ్రతంగా ఆచరించిన విశుద్ధుడు. ‘కాషాయాంబర చుంబితాంబర యశః కాదంబినీ కేతన’ అయిన మాతృభూమిని అజరామర అక్షర సుమాలతో అర్చించిన అద్భుత జీవనుడు, జాతీయత సాహిత్య ప్రపంచంలో సుప్రసిద్ధుడు..
ఐదువేల ఏళ్లకు పూర్వం వేదవ్యాసుడు వ్రాసిన మహాభారత ఇతిహాసం సుప్రసిద్ధం. దాదాపు ఎనిమిది వందల ఏళ్లకు పూర్వం అగస్త్య పండితుడు రచించిన బాలభారత సంస్కృత కావ్యం ప్రసిద్ధమైనది కాదు. కొంతమంది సంస్కృత పండితులకు మాత్రమే పరిచయమై ఉండవచ్చు. అలాంటి విశుద్ధ కావ్యానికీ, విలక్షణ కవికీ ఆధునిక కాలంలో ప్రసిద్ధిని కలిగించిన ఘనత ‘ఘనశ్యామల’ది. ‘అగస్త్య పండితాస్ బాలభారత-ఎ క్రిటికల్ స్టడి’-అన్న పేరుతో ఈ సంస్కృత కావ్యం గురించి ఘనశ్యామల రాసిన ఆంగ్ల విమర్శ గ్రంథం భారతీయతను ప్రపంచానికి మరోసారి చాటిచెప్పగలిగింది. ఆర్భాటం లేని రీతిలో ఘనశ్యామల దాదాపు పదిహేను సంవత్సరాల పాటు దేవాలయ వ్యవస్థ గురించి అధ్యయనం చేశాడు, పరిశోధన చేశాడు. ప్రారంభించిన తరువాత పనిపూర్తయ్యే వరకు అదే ధ్యాసతో తపస్సు చేయగలిన కఠోర నియమశీల ఘనశ్యామల. ‘అవధాన కళానిధి’ కాబట్టి అనేక కార్యక్రమాలపై ఏకకాలంలో ధ్యానం నిలపగలిగిన ‘ఆర్ష విజ్ఞాన విశారదుడు’ ఘనశ్యామల. తన పరిశోధన అధ్యయనం ప్రాతిపదికగా మూడు పుస్తకాలను రచించాడు. ‘భారతీయ దేవాలయాల’ గురించి శోధించాడు. పరమపద సోపానాలు-దేవాలయాలపై బొమ్మలు అన్న సనాతన జీవన పద్ధతికి భాష్యం చెప్పాడు. దేవాలయ వ్యవస్థను కించపరచడానికి, బొమ్మలకు అశ్లీలత అద్దడానికి సంస్కృతి వ్యతిరేకులు సాగించిన కుట్రకు విరుగుడు ఘనశ్యామల రచించిన ఈ గ్రంథం. ‘జీవించే దేవాలయం’ అన్నది ఆయన కృషికి పరాకాష్ఠ. మొత్తం భరతభూమి సనాతన జీవన మందిరం, భరతమాత సనాతన దేవత అన్నది ఆయన జీవన ప్రస్థానంలో నిరంతరం భాసించిన స్ఫూర్తి. ఆయన మలుపు తిరిగాడు. కనుమరగయ్యాడు. ‘స్ఫూర్తి’ నిరంతరం కొనసాగుతుంది.
సుదీర్ఘ సాహితీ సాంస్కృతిక జాతీయతా జీవనయాత్ర సాగించిన ఘనశ్యామల తన నిజమైన జీవితం ‘దక్ష, ఆరమ’లతో ఆరంభమైందని స్వయంగా చెప్పేవాడు. ‘దక్ష’ అంటే ‘అటెన్షన్’, ‘ఆరమ’ అని అంటే ‘స్టాండ్ అట్ ఈజ్’. ‘దక్ష’, ‘ఆరమ’ సంస్కృత ఆజ్ఞలు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ శాఖా నిర్వహణకు సంబంధించినవి. కొత్తపల్లి వారి జీవన ప్రస్థాన భూమిక ‘సంఘ’ ప్రాంగణం. అందుకే సంఘ లక్ష్యాలను ఆయన వివిధ గీతాలలో వినిపించగలిగాడు. ‘యాచిదేహీ యాచిడోలీ’ ఈ దేహంతో, ఈ కన్నులతో మాతృదేశ పరమవైభవాన్ని సాధించడం, దర్శించడం ఈ లక్ష్యం. ఘనశ్యామల ప్రసాదరావు ‘కలం’ ద్వారా ఈ లక్ష్యాన్ని-
జన జాగృత నవ భారత మహోదయం ఈ కనులతోనే కాంచుదాము ఈ జీవితమున సాధించుదాం ......................
శ్రీ కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు గారికి శ్రద్దాంజలితో....