Tuesday, September 17, 2013

ఎందుకో తెలుసా?

నేను మా ఆవిడతో పేకాడడం మానేశాను.
అసలు నేను మా ఆవిడతో పోటీ పడడమే మానేశాను.

ఎందుకో తెలుసా?

ఎన్ని సార్లు పేక ఆడినా ఆమే గెలిచింది. అట్లాగని నాకు కార్డు ముక్కలాట రాదనుకుంటున్నారేమో?
నేను పెద్ద ఎత్తున పైసలు పెట్టి ఆడే వారి మధ్యన కూడా బాగా ఆడతాడని పేరున్న మనిషిని. కానీ అదేమి చిత్రమో తెలియదు, మాయామెతో మాత్రం గెలిచింది తక్కువ. నిజం ఒప్పుకుంటున్నాను, మరీ పిచ్చిగా, ఇంట్లో ఉన్న మంచి డెక్కులన్నీ బయట పడేసి జన్మలో కార్డులాట ఆడ కూడదని నిర్ణయించుకున్నాను.

ఆటలో ఓడిపోతే ఎదుటి వారు ఎంత మిత్రులయినా గొంతు పిసికేయాలన్నంత కోపం వస్తుంది, నిజమే కదూ
నా భార్యకు రమ్మీ ఒకటే వచ్చు. నేను జాకీ మణేలా అనే తురుఫు ఆట మొదలు ఎన్నో రకాలు వచ్చు. ఆడి గెలిచినది అబదఅదం కాదు. కానీ ఇప్పుడు ఆడడం లేదు.

కొంత మందికి తెలియకుండానే మంచి కార్డులు పడుతుంటాయి.  అవి ఎప్పటికీ వాళ్లకే పడుతుంటాయి. అది విచిత్రం.

బతుకులోనూ అంతే. కొందరికి మంచి జరుగుతూనే ఉంటుంది. తెలియకుండానే జరుగుతూ ఉంటుంది. కొంత మందికి మంచి జరిగినా మంచిలాగ కనిపించదు. అసలది అర్థమే కాదు. దానితో ఒక రకమయిన భావన మనసులో నిలుస్తుంది. బలుస్తుంది. అదంతే అన్న భావం వచ్చిన తర్వాత మంచి జరిగినా కనిపించదు. అర్థం కాదు.


తాము పంచినా మరొకరు పంచినా కార్డులు ఒక్కరికే ఎప్పుడూ మంచివే పడుతున్నాయంటే, అక్కడేదో మోసం జరుగుతున్న భావం కలగడం సహజం. నేను ఇంటర్నెట్ మీద ఒక తెలివి పరీక్ష తీసుకున్నాను. నిజంగా నాకే ఆశ్చర్యం కలిగేటన్ని మార్కులు వచ్చినయి. నేను తెలివి గలిగిన మనిషినని ఎన్నో చోట్ల ఎన్నో సందర్భాలలో ఎందరో ఒప్పుకున్నారు. మామూలు చదువులోనూ మంచి గుర్తింపు సంపాయించుకున్నాను. కానీ, ఈ ఇంటర్నెట్ వారు మాత్రం, ఫలితం ఇస్తూ, నీవు మోసమైనా చేసి ఉండాలి (ఒక అసభ్యమయిన మాటతో సహా), లేదంటే నిజంగా గొప్ప తెలివి గలవాడవయినా అయ్యుండాలి అని రాశారు. వారి పరీక్ష పద్దతిలో అంతగా మోసం చేసే వీలు ఉన్నదీ లేనిదీ వారికే తెలియదా, లేక ఒకనికి మరీ అంత తెలివి ఉందని ఒక్క సారిగా ఒప్పుకునే ఇష్టం లేకనా వారు ఆ మాటలన్నది

వరుసగా ప్రశ్నలు, వాటికి వేగంగా జవాబులు. ఇక అక్కడ మోసానికి తావేదీ. పరీక్ష గడిచిన సమయం ఎంతో లెక్కించే వీలు అక్కడ ఉందా, నాకు గుర్తు లేదు. ఎందుకో నాకు అర్థం కాలేదు గానీ, వారు తెలివి గలవారిని అంత సులభంగా గుర్తించ దలుచుకోలేదని అనిపించింది. అదే పనిగా గెలుపు పొందే వారి మీద, (మాయావిడ గారిలాగన్నమాట) మనకు మోసం చేస్తున్నారేమోనని అనుమానం రావడం కూడా ఇట్లాంటిదేనా. వారు మోసం చేసే అవకాశం లేదని తెలిసి కూడా మనం అట్లా అనుకుంటాము, కదూ!

నేను సైన్సు చదువుతాను. అందరికీ అర్థం కావాలని  సంగతులను చేతయినంత సులభమయిన మాటల్లో మన భాషలో రాస్తాను. ఆ రకంగా నాకు కొన్ని ఆలోచనలు మనసులో పుట్టి ఎప్పటినుంచో నిలబడి ఉన్నయి.
ఉదాహరణకు మనమంతా ఈ భూమా మీద ఉన్నాము. అంతకు ముందునించీ ఈ భూమిఉన్నది.
ఈ భూమి సూర్యుని నుంచి ఒక ప్రత్యేకమయిన దూరములో ఉంది. అది ఇంకొంచెం దూరంగ ఉందనుకుందాము. భూమి మీద నీరు మంచవుతుంది. అదే , సూర్యునికి కొంచెం దగ్గరగ ఉందనుకుంటే నీరు ఆవిరయి పోతుంది. మొత్తానికి భూమి ఇప్పుడున్న దూరంలో ఉంది గనుకనే నీరు ఉండడమూ, జీవం పుట్టుకా వీలయింది. నీరు ఈ రకంగ కాక కొంచెం ఎక్కువగనో తక్కువగనో ఉంటే ఏమి పరిస్థతి ఉండేదో తెలియదు.

దూరమన్నది మన ఉనికికి ఆదారమయిన చాలా అంశాలలో ఒక్కటి మాత్రమే. వాతావరణం ఉన్నది. అందులో ఎన్నో అంశాలున్నయి. ఉదాహరణకు ఒత్తిడి. ఇదొక పరిస్థితి. దానికొక కొలత. ఈ కొలతలో ఏ మాత్రం తేడా వచ్చినా మనం ఇట్లా ఉండడము వీలుగాదు. వేడిమి సంగతి కూడ అంతే. ఒకటి రెండు డిగ్రీలు వేడిమి పెరిగిందంటే మనమంత గిలగిలలాడుతుంటము. ఇటువంటి కొలతలు మనకు తెలిసి, తెలియక ఎన్నో ఉన్నయి.

అన్నిటికన్న ఆశ్చర్యకరమయినది భూమికి ఉన్న ఆకర్షణ శక్తి.

భూమి పెద్దగ ఉండి ఒక వేగంతో తన చుట్టు తాను తిరుగుతూ సూర్యుని చుట్టు కూడ తిరుగుతున్నది. కనుక దానికి ఒక ఆకర్షణ శక్తి పుట్టింది. ఆ శక్తి ఇప్పుడున్నట్టు కాక ఇంకొక రకంగ ఉంటే మనం ఇక్కడ ఉండడం కుదరదు.
ఈ రకంగ చూస్తే, ఎన్ని సంగతులు అనుకూలంగ ఉంటే మనమున్నము అన్నది అన్నిటికన్న ఆశ్చర్యమయిన ప్రశ్నగా ఎదురవుతుంది.

అయినా మనము నిత్యము ఈ సంగతుల గురించి ఆలోచిస్తున్నమా? అది ప్రశ్న!
మనమే ఎంతో తెలివిగల వారలమనుకుని గర్వంగ బతుకుతున్నము.
ఈ ప్రపంచం గురించి మనకెంతో తెలుసునని విర్రవీగుతున్నము.
మన గురించి మనకే సరిగా తెలియదు. విశ్వం గురించి, నక్షత్రాల గురించి తెలుసుననుకుంటున్నము.
మనకొక తెలివి, మన అలోచనలకొక పద్దతి ఉన్నదని మన భావన.
ప్రపంచము, విశ్వము మన కను సన్నలలో ఉన్నయని ఒక భావన.
ఒక్క క్షణం ఆలోచించండి. ఈ విశ్వమన్న ఆలోచన మన మనసు, అంటే మెదడులో పుట్టింది కద
సైన్సు, సామాజిక శాస్త్రం, మిగతా తెలివి మొత్తం, మన మనసులో కలిగిన అవగాహనలు మాత్రమే గద
వీటిలో ఎక్కడన్న కొంచెం లెక్క తప్పి ఉండ కూడదా?

అలోచించండి.

ఎన్ని పరిస్థితులు అనుకూలిస్తే మనం ఇట్ల ఉండగలుగుతున్నము
మనకు ఎంత అర్థమయింది, ఎంత కాలేదు?
అయినా అంత బాగనే సాగుతున్నదన్న భావన మాతరం మనలో ఉండనే ఉన్నది.
మాయామెకు మంచి ముక్కలు పడి చీట్లాటలో గెలిస్తే, అందులో చీటింగ్ ఉందన్న భావన నాకెందుకు?
ఒటమి కలిగినప్పుడల్లా ఎదుటి వారిని చంపుదమన్నంత కసి ఎందుకు?
అంతా మన నమ్మకమే అయినప్పుడు, ఈ విశ్వం, ప్రపంచం, మనం, మన తెలివి అన్నీ నమ్మకాలే అయినప్పుడు, మన ఒక్కరి నమ్మకానికి విలువ ఎంత?

అలోచించండి, మీరు కూడా, నా లాగనే!!

No comments:

Post a Comment