Friday, September 27, 2013

నాకు సమ్మతమే

కొంత మంది నిత్యం రాస్తారట. నిత్యం ఆలోచనలు రావద్దూ. వాళ్లకు వస్తాయేమో. నిత్యం రాస్తే చెప్పనవసరం లేని సంగతులన్నీ ప్రపంచం ముందు ఉంచడమవుతుందేమోనని నా అనుమానం. ఒకనాడు, నేను లేనిదే ఈ ప్రపంచం ఎట్ల నడుస్తుంది అని అనుమానం వస్తుంది. కానీ క్షణం నిలబడి చూస్తే నీ గురించి పట్టించుకునే వారే లేరని అర్థమవుతుంది. ఒకనాడు అట్లా అనిపించక పోవచ్చు. ఇందాక ఒకాయన ఫోన్ చేసినడు. ఆయనకు మన వద్ద ఏదో దొరుకుతుందని నమ్మకం కలిగినట్టుంది. అందుకు వేరే వారు మరి కొందరు కారణమవుతరు. కొందరు మన మంచితనం రుచి చూచి ఉండే అవకాశం ఉందిగద. వాంఢ్లు మంచివాడులే అంటరు. ఈ కొత్త మనిషి ఆ ఆలోచనను వెంటబెట్టుకుని మన మీదికి దండయాత్ర చేస్తడు. మంచివాడులే అన్న మనిషి మనతో ఏ సందర్భంలో ఏ రకంగ మాట్లాడిందీ ఇక్కడ ప్రస్తుతం గాదు. ఆ మనిషికి మనం మంచి వాండ్లమేనన్న భావం కలిగింది. ఇవాళ మన కర్మ ఎట్లున్నదో ఆయన చూడవచ్చినడా. రాడుగద.ఆయనకు కావలసిందేదో అడగడము చాతగావాలె. లేకుంటే అది దొరకదు. ఇంతకు ఆ వస్తువు నా దగ్గర ఉందన్న భావము ఎందుకు కలిగింది. మీ కొరకు తెగ వెతుకుతున్ననంటడు. అంత అబద్ధం. నేనేమన్న సూదినా ఎంత వెతికినా దొరకకుండ ఉండేందుకు. నన్ను చెట్టెక్కించాలె. మతలబ్ కీ దునియా అని ఒక మాట ఉన్నది. లోని అర్థము వేరని భావము. నోనెక్కడనో ఒక వ్యాసము రాసిన. రాసి ఊరుకుంటే కథే లేదు. అది పత్రికలో వచ్చింది. అందులో నేనేదో సంగతి రాసిన. అది చదివిన వారికి నా దగ్గర ఒక వస్తువు ఉన్నదన్న భావము కలుగుతుంది. వ్యాసము ఉద్దేశ్యము మాత్రము అది కాదు. మరేదో సంగతి గురించి చెప్పినా ఒక పదార్థము లేదా వస్తువు నా దగ్గర ఉందన్న భావము కలుగుతుంది.  ఆ వస్తువు కావాలనుకున్న వారంత నా మీదికి దండయాత్ర చేస్తే నేనేమవుత?

సరిగ్గ అదే జరిగింది. ఆ వస్తువు నా దగ్గర ఉన్నదా లేదా అన్నది ప్రశ్నే కాదు. ఒక పక్షాన ఉంటే అది నేను ఎంత మందికి ఇవ్వగలుగుతానన్నది ఇంకొక సంగతి.

మొత్తానికి నాగురించి పట్టించుకున్న వారు ఉన్నరని రుజువయింది. అయ్యా, దాని వలన ఎవరికి ఎంత ప్రయోజనము కలిగింది. అది ప్రశ్న.

నిత్యం రచనలు చెస్తుంటే ఇట్ల పిండి పిసికే సంగతులు తప్ప మతలబు గల మాటలు రావు. ఇంక ఆలోచనలను పంచుకోవడమని మరొక పద్ధతి ఉన్నది. అంటే రాయనవసరము లేకుండ, అంత దూరము పోకుండనే మాటలతోటి మందిని మప్పగించడము ఇక్కడ జరుగుతుంది. ఎప్పటికి మప్పగించడమే కాకపోవచ్చు. అప్పుడో ఇప్పుడో మంచి మాట రాక పోదు. ఎవ్వరు గూడ ఎప్పటికి మంచి మాటలనే చెప్పజాలరు. సైన్సులో ఏ విషయమయినా అండర్ ద గివన్ కండిషన్స్ మాత్రమే సత్యము. ఒక పరిస్థతిలో మాత్రమే అవి సత్యము. ఒకటి కూడ కాదు. కొన్ని పరిస్థతులు. తరువాత మరొకరు వచ్చి ఇది సత్యము కాదు, అని నిరూపించే వరకు మాత్రమే ఏదయినా సత్యము. మాటలు కూడ ఎటువంటి పరిస్థతిలో పలుకబడినవి అన్న ప్రశ్న పుడుతుంది గద. గొప్పవారు చెప్పినవన్ని గొప్ప మాటలేనా. అప్పుడప్పుడు వారు కూడ అనుమానాస్పదమయిన వంగతులు చెప్పే వీలు ఉన్నదిగద. అందుకు కొన్ని కారణములు టయి. వారొక మాటను ఒక సందర్భములో చెప్పి ఉంటరు. అది ఆ సందర్భములో సత్యమే. కాని సందర్భమును పక్కనబెట్టి మాటను మాత్రమే మనము ఉదహరించినప్పుడు దానికి వేరే అర్థములు తోచే ప్రమాదము ఉన్నది.

నిత్యము రాసే వారి మాటలు, గొప్పవారనిపించుకున్న వారి మాటలను కూడ తర్కించి గాని అంగీకరించ గూడదని తాత్పర్యము.

ఆలోచించండి. అవుననిపించినా కాదనిపించినా నాకు సమ్మతమే.

ఆ సంగతి మీరు కడుపులో దాచుకుంటే మాత్రము మాకు ఏ సంగతీ తెలియదు. అవునా, ఆలోచించండి.

No comments:

Post a Comment