లీ చైల్డ్ అనే రచయిత జాక్ రీచర్ అనే పాత్రను
సృష్టించాడు. ఈ రీచర్ నిజంగా విచిత్రమయిన మనిషి. రీచర్ సినిమాలు కూడా వస్తున్నాయి.
రీచర్ నిద్రకు ఉపక్రమించి సరిగ్గా గంట యాభయి నిమిషాలకు లేవాలనుకుంటాడు. లేస్తాడు.
వీలవుతుందా. మీకు వీలవుతుందా. అసలు మీరది ప్రయత్నించారా. కొందరికి
వీలవుతుందనిపిస్తుంది. ఇక్కడ విషయం కాలం కదలిక గురించి. తరువాత ఆ కదలిక మనకు
తెలియడం గురించి.
చాలా కాలం గడిచింది అనడం మనకు మామూలయింది.
ఇప్పుడున్నది ఇంకో క్షణంలో ఉండదన్నది మన అనుభవం. ఆ క్షణమే ఉండదు. అనుక్షణం ఆ క్షణం
గతమవుతుంది. కనుకనే కాలం గడిచింది, కదిలింది అన్న భావం మనకు కలుగుతుంది. ఇక్కడ ఏం
కదిలింది. ఎట్లా కదిలింది. కాలమంటే ఒక పదార్థం కాదు, వస్తువు కాదు. ఇప్పుడిక్కడ
ఉండి ఇంకో క్షణం ఇంకో చోట ఉండడం కాలానికి చేతగాదు. మరి కాలం కదిలిందంటే ఏం
కదిలింది. ఎట్లా కదిలింది. ఎక్కడినుంచి ఎక్కడికి కదిలింది. కాలం ముందుకే
కదులుతుందట. వెనక్కు కదలదట. ఇది మరో విచిత్రం.
ఏం కదిలింది, ఎట్లా కదిలింది తెలియకుండా, ఎంత
వేగంగా కదిలిందన్న లెక్క కుదురుతుందా. ఎండలో నిలబడ్డది ఇష్టమయిన వారితోనయితే, వారి
కొరకయితే, ఎండ తెలియదు, కాలం కూడా తెలియదంటారు. ఎదురుచూపులో ఎద బరువు కారణఁగా
క్షణమొక యుగమయిందంటారు. వేరే ఊరికి పోతుంటే కాలం బరువుగా సాగుతుందట. తిరిగి ఇంటికి
వస్తుంటే మాత్రం చాలా సులభంగా సాగుతుందట. అంటే కాలానికి ఒక నిర్ణీతవేగం లేదా
సైన్సు ప్రకారం భూమి 365 దినాలకు ఒక సారి సూర్యుని
చుట్టు తిరుగుతుంది. 24 గంటలలో తన చుట్టు తాను తిరుగుతుంది. ఇక్కడ నుంచి లెక్కవేసి
గడియారాలు తయారు చేశారు. అంతా అర్థమయిపోయిందనుకుని మరీ నిక్కచ్చిగా పనిచేసే
అణుగడియారాలను కూడా తయారు చేశారు. అప్పుడప్పుడు గడియారానికి ఒక్క క్షణం కలిపి
సరిచేస్తున్నామంటున్నారు. ఇంతకూ ఈ గడియారాలు ఏం కొలుస్తున్నయి. కాలం గడియారం ప్రకారం
కదులుతుందా, గడియారం కాలం ప్రకారం కదులుతుందా.
కాలం ఒక అనుభవం. దాని కదలిక కూడా అనుభవం. దానికి
ఒక వేగం ఉందా. దాన్ని గడియారాలు లెక్కబెడుతున్నాయా. లేనేలేదు. గడియారాలు
కదులుతున్నాయి. మనం కాలం కదిలిందని అనుకుంటున్నాము.
ప్రపంచంలో ఎన్నో వస్తువులు ఉన్నాయి. వాటి మధ్యన
పరస్పరం ఒక సంబంధం ఉంది. ఆ సంబంధం మారుతూ పోతుంది. గడియారాన్ని చూస్తుంటే ఎప్పుడూ
ఒకే టైం కనబడదు. ఇప్పుడొక టైం ఉంటుంది. కొంచెం సేపయిన తరువాత చూస్తే, టైం కదిలి
కనబడుతుంది. నాలుగు నిమిషాలు కదిలి కనబడింది అనుకుందాము. నాలుగు నిమిషాలు అంటే
ఏమిటి. నిమిషాల ముల్లు వేగంగా కదులుతుంది. గంటల ముల్లులో ఆ వేగం అంత సులభంగ కనిపించదు.
సెకండ్ల ముల్లు ఉంటే అది మరింత వేగంగ కదులుతూ కనబడుతుంది. మనం రెండవసారి గడియారం
చూచినప్పుడు కొంత మార్పు, కదలిక కారణంగా వచ్చిన మార్పు కనబడుతుంది. అక్కడ అయిదు
నిమిషాల తేడా కనబడితే, అయిదు నిమిషాల కాలం గడిచిందన్న భావం మనకు కలుగుతుంది. ఈలోగా
మన మెదడు, మనసు వందల మైళ్లు తిరిగి వచ్చేసి ఉంటుంది. ప్రపంచంలో అన్ని సంగతులు
అట్లాగే వేగంగా కదిలి ఉండవచ్చుగదా. అప్పుడూ గడిచిన కాలం అయిదు నిమిషాలేనా. లేదా
ప్రపంచం మందకొడి అయ్యుండవచ్చు కూడా. ఈ తేడాలు పాపం గడియారానికి తెలియవు. అది తన
మానాన తను పని చేస్తూ పోతుంది. ఇంట్లో ఉన్న ఏ రెండు గడియారాలూ ఒకే టైం చూపించవు.
అసలవి చూపించేది కాలాన్ని కానే కాదు. మనం వాటికి ఒక కదలిక నేర్పించాము. వాటి
కదలికతో కాలం కదులుతున్నదని అనుకుంటున్నాము.
ఒక్కసారి కళ్లు మూసుకుని ఈ ప్రపంచంలో మనం గానీ,
మరో జీవిగానీ మరే వస్తువులూ, పదార్థాలూ లేవని ఊహించండి. అప్పుడు కాలం కదులుతుందా.
గడియారం కదలికకూ కాలం కదలికకూ సంబంధం లేదనుకున్నాము. కాలం కదిలితే, తనంత తాను
కదులుతుందని గదా. కనుక ఖాళీ ప్రపంచంలోనూ కాలం కదులుతుండాలి మరి. గుర్తుంచుకోండి.
అది ఖాళీ ప్రపంచం. అక్కడ ఏ వస్తువులూ లేవు. అంటే అక్కడ ఏమీ జరగడం లేదు. అంటే ఏమీ
కదలడం లేదు. సంఘటనలు లేవు. సంగతులు లేవు. మరిక కదలిక ఎక్కడిది. కాలం కదలిక మాత్రం
ఎక్కడిది.
చదువుతుంటే కాలం కదిలినట్టు తెలియనే లేదు,
అంటారేమో. ఆలోచించండి. మీకు సంతోషమయితే నాకూ సంతోషమే. మీకు బుర్ర తిరిగి తలనొప్పి
మొదలయితే అంతకన్నా సంతోషం. సంతోషంలో నా కాలం వేగంగా గడుస్తుంది. తలనొప్పితో మీ
కాలం ఆగిపోతుంది. కుంటి నడకలు నడుస్తుంది. అయినా గడియారం మాత్రం తన వేగంతో తాను
నడుస్తుంది. ఇంతకూ కాలం కదులుతుందా, ఆలోచించండి.
No comments:
Post a Comment