Sunday, October 6, 2013

సంగీతప్రియ - రసికప్రియ

మాటను సాగదీసి, పాటగా మార్చిన మొదటి మనుషులెవరో గానీ, వారి ఈ ప్రపంచం మొత్తం రుణపడి ఉంది. పాటలేని ప్రపంచం చాలా బోసిగా ఉంటుంది కదూ!

* శిశువులకు, పశువులకు, పాములకు గూడా సంగీతం తెలుసును, అని అర్థం వచ్చే మాట ఒకటి మనవాళ్లు .చెపుతారు. కానీ అది నిజం కాదు. పాములకు చెవులుండవు. వాటికి పాట వినేంత వినికిడి లేనే లేదు.

***
(సంగీతప్రియ అవార్డు అందుకుంటూ నేను)

*
కర్ణాటక సంగీతమనే చీమ కుట్టింది. సంగీతమంటే, ఇదే సంగీతం మిగతాదంతా కాదు అన్న భావం బాగా గట్టిబడింది. మొదట్లో శాస్ర్తియ సంగీతం వినాలంటే రేడియో ఒక్కటే దిక్కు. చిన్నప్పటినుంచీ, ఇంట్లో రేడియో, ట్రాన్సిస్టర్ రూపంలో ఉంది గనుక సరిపోయింది. చదువు పేరున ఇల్లు విడిచి దేశం మీద పడినప్పుడు మొదట్లో రేడియో లేదు. సంగీతం అంతకన్నా లేదు. వరంగల్‌లో ఎం.ఎస్సీ చదువుతున్నప్పుడు అక్కడ, సంగీత కచేరీలు జరిగేవేమో తెలియదు. అక్కడి మెడికల్ కాలేజీలో రేడియోసంగీత్ సమ్మేళన్లో భాగంగా, శంకర్, సుబ్రమణ్యం, వైద్యనాథన్ సోదరుల వయొలిన్ త్రయం కచేరీ జరిగింది. ఆ సంగతి తెలిసి నేను వెళ్లాను. అక్కడ జరిగిన రెండవది గాత్ర కచేరీ, ఎవరిదో గుర్తులేదు. సోదరత్రయానికి మృదంగం మీద సహకరించినది పాలఘాట్ మణి అయ్యర్ గారని గుర్తుకువస్తే, ఒళ్లు జలదరిస్తుంది. ఆయనను నేను మళ్లీ చూడలేదు. ఆ అపర నందీశ్వరుడు కనిపించినపుడు, ఆయన గురించి నాకు అంతగా తెలియదు. వరంగల్‌లోనే భద్రకాళి గుడిలో ఎం.ఎస్. బాలసుబ్రహ్మణ్య శర్మగారి కచేరీ విన్నాను. ఆయన తన్మయత్వంలో ఎవరినీ పట్టించుకోకుండా పాడడం చాలా బాగనిపించింది. అక్కడ జనం గోల చేస్తుంటే, ఆయన ఆపి, గట్టిగా అరిచి, మళ్లీ పాట మొదలుపెట్టారు. బాగా గుర్తుంది!

శాస్ర్తియ సంగీతం ఒకటి ఉంటుందని తెలియకుండానే చాలామంది బతుకు చాలిస్తారు. తెలిసిన వాళ్లు కూడా చాలామంది వినరు. విన్న వారికి చాలామందికి, ‘నాకిది అర్థం కాదుఅన్న భావం ఉంటుంది. తిండి తినే వారందరికీ వంట గురించి తెలుసునా? తినడం చాలదా? సంగీతం వింటే చాలదా? అది తెలిస్తే రుచి పెరుగుతుందేమో గానీ, తెలియకుండానే వింటున్నాను నేను. అయినా బాగుంది.

హైదరాబాదుకు చేరేలోపలే, ఒక మిత్రుడిచ్చిన చిన్న ట్రాన్సిస్టరు ఒకటి నాకు సంగీతాన్ని, సంతోషాన్ని పంచి పెట్టింది. నాలుగు రూకలు రావడం మొదలయింతర్వాత ఒక ట్రాన్సిస్టర్ కొన్నాను. హాస్టల్లో చాలామందికి, పాటలు వినాలన్న కోరిక ఉన్నా, రేడియో కొనాలన్న ఆలోచన మాత్రం లేదు. నేను చదివే పుస్తకాలు, మెచ్చుకునే సినిమాల కారణంగా, మిత్రులంతా కలిసి నాకు, ‘తాతయ్యఅని పేరు పెట్టారు. తాతయ్య రేడియోలో సంగీతం తప్ప, సినిమా పాటలు పలకవు, వదిలేయండిఅనేవారు.

నల్లకుంటలో ఒక గదిలో, తమ్మునితో బాటు ఉంటున్నప్పుడు, కూరలకని బయలుదేరి, టేప్‌రికార్డర్ కొని తెచ్చాను. ఇంటికి వచ్చి డబ్బులు తీసుకుపోయి ఇచ్చినట్టు గుర్తు. అప్పటికి రికార్డెడ్ కాసెట్లు అంతగా వచ్చేవి కావు. నా దగ్గర మరీ అంతగా పైసలు ఉండేవీ కావు. రేడియోలో మీడియం వేవ్‌లోనే మద్రాసు కూడా వినిపించేది. బాలమురళి కచేరీ, కాసెట్లో రికార్డ్ చేసి విన్నాను. సంగీత సేకరణకు అది ప్రారంభం. కమర్షియల్ కాసెట్లకు బోలెడు డబ్బులవుతాయి. ఖాళీది కొని ఆ కాసెట్లకు కాపీలు చేసి ఇచ్చే వాళ్లున్నారని తెలిసింది. అది అన్యాయమనీ, కళాకారుల పట్ల ద్రోహమనీ భావం ఉన్నా కొంత కాలం తప్పలేదు. కొంచెం వెసులుబాటు కలిగిన తర్వాత కాసెట్లు అసలు రికార్డింగులనే కొనడం మొదలయింది. రేడియో కచేరీలను రికార్డు చేయడం కూడా సాగింది. అప్పట్లో ఒకసారి ఎల్లా వెంకటేశ్వరరావుగారు, శంకరమఠంలో 24 గంటలపాటు మృదంగం వాయించి రికార్డు సృష్టించారు. నేను నా టేప్‌రికార్డర్‌తోబాటు వెళ్లి, కార్యక్రమంలో కొంత భాగం, ఒక గంటపాటు రికార్డు చేశాను. ఆ రికార్డింగ్‌లో నేను బంధించిన ఎన్.ఎస్.శ్రీనివాసన్, ఎల్లా గారలు తరువాత నాకు సహోద్యోగులు, మిత్రులు అవుతారని కలలో కూడా ఊహించలేదు. అంతకన్నా ఆశ్చర్యం, ఆ రికార్డింగ్‌ను ఎమ్‌పీత్రీగా మార్చి, ఇంటర్‌నెట్‌లో ప్రపంచంతో పంచుకుంటానని అసలే అనుకోలేదు.

ఎక్కడ కచేరీ జరిగినా, తిండిని కూడా మరచి వెళ్లి కూచోవటం అలవాటయింది. సీకా వాళ్లు టికెట్లు అమ్ముతున్నారంటే, వారం రోజులపాటు మంచి సంగీతం వినడానికి గొప్ప అవకాశం రవీంద్రభారతిలో జరిగే, వారి ఫెస్టివల్ టికెట్ల మీద, ఇంకా నంబర్లు వేయకముందే వెళ్లి, నాకు కావలసిన వరుసలో, చివరి సీటు నంబరు వేసుకుని, టికెట్ తెచ్చుకున్నాను. సంగీతం వినడానికి ఏకంగా మద్రాసుకే వెళ్లడం దాకా చేరింది పరిస్థితి.
ఒక్కసారి అక్కడి నుంచి, ఇటీవలి కాలంలోకి వస్తే, కంప్యూటర్ వచ్చింది. పాతకాలం, టేపులు, క్యాసెట్ల మీది రికార్డింగులను డిజిటయిజ్ చేసి వింటున్నారు. అటువంటి సంగీతాన్ని, ఇంటర్‌నెట్‌లో పంచుకుంటున్నారు. నేను ఇట్లాంటివేమీ మిస్ కాలేదని గర్వంగా చెప్పగలను. ఒక సహోద్యోగి అన్న మాట మీద పట్టింపు వచ్చి కంప్యూటర్ వాడడం నేర్చుకున్నాను. అందులో మంచి నైపుణ్యాన్ని సాధించానని చెప్పగలను. రికార్డింగులను డిజిటయిజ్ చేయడమూ నేర్చుకున్నాను. ఆ రికార్డింగులను ఇంటర్‌నెట్‌లో పంచుకోవడమూ నేర్చుకున్నాను. నా దగ్గర ఉన్న కాసెట్ రికార్డులన్నీ అయిన తరువాత, సరేలే, మనకెందుకన్నట్లు ఊరుకున్నాను. స్వర్గీయ మిత్రులు శ్రీనివాసన్ గారింట్లో ఆయన సేకంచిన కాసెట్లు ఉన్నాయి. శారదా శ్రీనివాసన్‌గారి మంచితనం వల్ల, వాటినన్నిటినీ తెచ్చి, ‘కన్వర్ట్చేయసాగాను. వాటిని నా బ్లాగుద్వారా ప్రపంచంతో పంచుకోవడమూ మొదలయింది. ఈ ప్రపంచంలో ఒకే ఆసక్తి గలవారంతా, ఒక చోట చేరడంలో ఆశ్చర్యం లేదు. ఇంటర్‌నెట్ ప్రపంచంలో అది మరింత సులభంగా వీలవుతుంది.

శ్రీనివాసన్ రాజగోపాలన్ అనే ఒక ఉత్తముడు, ఇంటర్‌నెట్‌లో సంగీతప్రియపేరున కర్ణాటక సంగీత అభిమానుల బృందాన్ని రూపొందించారు. నా ఆసక్తి, శ్రమ వాళ్ల దృష్టిలోకి వచ్చింది. నేను సేకరిస్తున్న సంగీతాన్ని, వాళ్లతో పంచుకోవలసిందిగా పిలుపునిచ్చారు. నాకు మొదట్లో అంతగా ఉత్సాహంగా ఉండలేదు. కానీ, అప్పటికే ఇంటర్‌నెట్ ద్వారా, సంగీతాన్ని పంచుకునే మిత్రులతో మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. అలాంటి వారిలో కొందరు అప్పటికే సంగీతప్రియబృందంలో ఉన్నారు. బరోడాలో ఉండే, కన్నడిగులయిన మిత్రులు గురుమూర్తిగారు, నన్ను ప్రోత్సహించారు. ఈ పేరున మనకు సేకరణ మీద శ్రద్ధ పెరుగుతుంది. ధ్యాసగా సంగీతం వినడం, అవసరంగా మారుతుందిఅన్నారు. నిజం గదా!అనిపించింది. ఒక ఉద్యమం మొదలయింది. ఇవాళ ఇంట్లో వేల గంటల సంగీతం వచ్చి చేరింది. ఎక్కడెక్కడి నుంచి, మిత్రులు (కేవలం సంగీత మిత్రులు) వారి దగ్గరున్న రికార్డింగులు, టేపులు, కాసెట్ల రూపంలో పంపుతున్నారు . తిండి, పుస్తకాలతోబాటు, శాస్ర్తియ సంగీతం, బతుకులో ఒక ముఖ్యమయిన భాగమయింది.

నా గొప్ప చెప్పుకోవడానికి మరెవరూ లేనప్పుడు, అదేదో నేనే చెప్పుకోవాలట! కర్ణాటక సంగీత ప్రచారానికి సేవ చేసిన వారికి, ‘సంగీతప్రియవారు రసిక ప్రియఅని ఒక అవార్డును ప్రారంభించారు. 2011 సంవత్సరానికిగాను, ఆ బహుమతిని నాకిచ్చారు. 2012 ఫిబ్రవరిలో చెన్నైలో నాకు ఆ బహుమతిని ఇచ్చారు. ఈ సంగతి, సంగీతాభిమానులయిన కొందరికి తప్పక, చాలామందికి తెలియకపోవచ్చు! నా సంతోషం కొరకు నేనేదో చేస్తుంటే, మీరు నన్ను పిలిచి సన్మానిస్తున్నారు. అది మీ మంచితనం!అన్నట్లున్నాను ఆ సభలో!
గోపాలం, ఇలాంటి పనులు చేస్తాడని చెప్పి, రికార్డింగులు అడిగితే ఆయనకు ఏం ఇంటరెస్టు? ఏం లాభం?’ అని అడిగారట ఒక విద్వాంసులు. వినయంగా విన్నవించుకుంటున్నాను, ‘నాకు ఖర్చేగాని డబ్బు రాదు కానీ, కలిగే ఆనందాన్ని అంతుల్లేవు!

*
మన దేశంలో గ్రామఫోన్ రికార్డింగుల తయారీ 1903లో మొదలయిందంటారు. సేలం గోదావరి అనే ఆవిడ ఎంతమందికి తెలుసు? కోయంబత్తూరు తాయి రికార్డులు రేపిన సంచలనం గురించి కథలుగా చెపుతారు. విజయనగరానికి చెందిన కళాకారుడొకాయన ఆ రోజుల్లోనే ఈలపాట మీద కర్ణాటక సంగీతం వినిపించారు. పాతకాలపు రికార్డు చాలామంది ఇళ్లలో పడి ఉన్నాయి. అలాంటి వాటిని సేకరించి పాటలను అందరితో పంచుకోవాలని, నాలాంటి కొందరు తాపత్రయ పడుతున్నారు.

* తిరువయ్యారులో త్యాగరాజస్వామి వారి ఆలయం, బెంగుళూరు నాగరత్నమ్మ అనే గాయని పుణ్యమా అని కట్టబడింది. ఆమె గురించి మిత్రులు శ్రీరామ్ వెంకటకృష్ణన్, ‘దేవదాసి అండ్ ఎ సెయింట్అని పుస్తకం రాశారు. దానికి తెలుగు అనువాదం కూడా వచ్చింది. సంగీత, సాహిత్య అభిమానులందరూ తప్పక చదవవలసిన పుస్తకాలవి. తెలుగు సాహిత్యం గురించి నాగరత్నమ్మ పడిన కష్టాలు గొప్పవి!

2 comments:

  1. ఇంచు మించు ఇలాంటి కష్టాలు అన్ని నెనూ పడ్డాను. సుమారు 1000 కాసెట్స్ సేకరించాను , మీరు వరంగల్ లో ఎమెస్సి ఎప్పుడు చేసారు, నాది కే.ఎం.సి లో 1976 బాచ్ . సంగీతం లో కొద్దిగా ప్రవేశం ఉంది .

    ReplyDelete
  2. sir,

    my M Sc too ended in 76.
    Kindly send me your mail id.
    We can communicate privately.

    ReplyDelete