Friday, February 10, 2012

మన గురించి మనం - 6


మెదడుందా? తెలివి ఉందా?
మనసు ఉందా? భావాలు ఉన్నాయా?
గుండె ఉందా? ధైర్యం ఉందా?

మెదడు లేదు అనడం కూడా కుదరదు. లేదు అన్నమాట ఎక్కడినుంచి రావాలి ఆలోచనలో నుంచి కదా మెదడు లేకుండా ఆలోచన ఎట్లా వీలయింది మనం ఉన్నమన్న భావం ఉందంటే మెదడు ఉందని కదా అర్థం కనుక ఎవరయినా మెదడు లేదు అంటే వారు తమకు మెదడు  ఉందని చెప్పినట్టు లెక్క. తెలివి సంగతి మరోలాగ ఉంటుంది. ముందు మెదడు ఉంది అంటే ఏమని అర్థం పురంరె ఉంది. అందులో మెదడు ఉంది. అంటే ఏదో పదార్థం ఉందని అర్థం. మన బుర్రలో మెదడు ఉందని మనం చూడలేము. ఈ మధ్యన డాక్టర్లు మన మెదడును చూడగలుగుతున్నారు మనిషికి మత్తు కూడా ఇవ్వకుండానే మెదడుకు చికిత్స చేస్తున్నారు. కనుక మనకూ మెదడు ఉండే ఉంటుంది అని ఒక నమ్మకం. మరి మెదడు ఉంటే తెలివి ఉన్నట్టేనా?
మెదడు తెలివి ఒకటేనా?

ఒకటేమో కనిపించే పదార్థం. ఇంకొకటి కనపడని అలోచన.
అవి రెండూ ఒకటి కానే కావు!

పదార్థానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. అవి కొంత స్థలాన్ని ఆక్రమించుకుంటాయి. వాటికి కొలతలు ఉంటాయి. ఆకారాలూ ఉంటాయి. ఒక చోటు కూడా ఉంటుంది మెదడు తలలో ఉంటుంది కొంత బరువు ఉంటుంది. ఆకారమూ ఇంచుమించు తెలుసు. మరి తెలివికి ఇవేవీ లేవుగదా!

ఆలోచనలు ఎట్లాగున్నాయని అడగ వచ్చు కానీ ఎంత ఉన్నాయని అడిగితే అర్థం ఉండదు. ఉన్నామన్న భావనకు పొడవు వెడల్పులుండవు. ఈ ఆలోచన ఎక్కడ ఉందన్నా అర్థం ఉండదు.

నాహృదయంలో నిదురించే చెలీ అని పాట పాడితే బాగానే ఉంది కానీ, ఈ చెలి ఎక్కడ నిదురించింది. ఆలోచనల్లో కదా ఎక్కడున్నాయి ఆ ఆలోచనలు. మనసులోనా మెదడులోనా. ఇంగ్లీషులో బ్రెయిన్, మైండ్ అని రెండు మాటలున్నాయి. మనకా బాధ లేదు. రెండూ ఒకటేనన్న భావం కలిగే విధంగా మాట ఉంది. కానీ మనం దానితోనూ తికమక పడుతున్నాము.
గట్టి గుండె గల మనిషి అంటే డాక్టర్లు ఆ మనిషికి బతికే అవకాశాలు తక్కువంటారు. అంటే రక్తం పంపించే గుండె, ధైర్యం ప్రదర్శించే గుండె వేరువేరన్నమాట.

ఇవన్నీ కలిసి మెదడులోనే ఉన్నాయని చెప్పడానికి ఇంత గందరగోళం.
ఈ మనసు, మెదడు, గుండె కాంప్లెక్స్ విచిత్రమయినది. స్వంతదారునికే తప్ప మిగతా వారికి వాటి లోతులు తెలియవు. ఉనికి కూడా తెలియదనవచ్చునేమో.

ఎవరి అలోచన వారికే తెలుస్తుంది. మిగతా వారికి దాని చాయలు కూడా తెలియవు. కొండొకచో చెప్పినా అర్థం కావు. మన చేతులు, కాళ్లు, తల. నాలుక లాంటి వాటి సంగతి అట్లా కాదు. మెదడులోకి వైద్యులు కళ్లతో తొంగి చూడ గలుగుతారు. ఇతరుల మెదడును చూడ గలిగిన ఈ డాక్టర్లు మనసులోకి మాత్రం చూడలేరు. వారికి మెదడు కనిపిస్కుంది. అందులోని మనసు, గుండె కనిపించవు. అవి ఎవరివి వారికే స్వంతం.

ఇంత చెప్పినా ఈ మనసంటే ఏమిటో తెలియలేదు. తెలియదు.
అది మెదడులో ఉందంటే నమ్మకం కుదరదు.
కనుకనే దాన్ని మనం పట్టుకోవాలి. అదుపులో పెట్టుకోవాలి.
ఆలోచించండి. వీలవుతుందా?

No comments:

Post a Comment