Monday, February 20, 2012

జీవం లైబ్రరీ


మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు - జీవులన్నింటికీ చరిత్ర ఉంది. భూమి మీద జీవం పుట్టి నాలుగు బిలియన్ సంవత్సరాలయిందంటారు. చరిత్ర కూడా అక్కడే మొదలయింది. ఈ వరుసలో ఎన్నో రకాలు జంతువులు, చెట్లు వచ్చాయి. పోయినయి కూడా. ఇవాళ మనమున్న ఈ ప్రపంచం తీరు.. ప్రస్తుతం ఉన్న లక్షల కోట్ల రకాల జంతువులు, జీవుల మీద ఆధారపడి ఉంటుంది. ఈ జీవమే రాళ్లను కరిగిస్తుంది. మట్టిని తిరగబెడుతుంది. వానకు కారణమవుతుంది. వరదలో కొట్టుకు పోతుంది. భూమి మీది వాతావరణం ఉన్న తీరుకు చెట్లు, జంతువులు కారణమంటే ఆశ్చర్యం లేదు. జీవుల బతుకు తీరు ఆధారంగా, వాతావరణంలో వాయువుల సమ్మేళనం మారుతూ ప్రపంచాన్ని మారుస్తుంది. మొత్తం మీద ఈ భూప్రపంచమే ఒక జీవిలాగ కనబడుతుంది!

నాలుగయిదు దశాబ్దాల కింద జీవశాస్త్రం చదువుకున్న వారికి జంతువులు, చెట్ల మధ్య తేడా గురించి చెప్పేవారు. అప్పటికి జీవం అనే చెట్టుకు ఇవి రెండే కొమ్మలు. మరేవో చిన్న రకాలు ఉన్నా లెక్కలోకి వచ్చేవికావు. ప్రస్తుతం 19 లక్షల స్పీసీలను గుర్తించి లక్షణాలను నిర్వచించారు. పరిణామక్రమంలో ఈ రకాలకుగల సంబంధాలను మరీ కొత్త పద్ధతులతో పరిశీలిస్తున్నారు. జీవం అనే చెట్టు బొమ్మగీస్తే, అది పొదమాదిరి కనిపించే పరిస్థితి వచ్చింది. జంతువులు, చెట్లతో బాటు అంతే బలంగా ఫంజి, అంటే బూజు జాతి మొక్కలు(!) వచ్చి చేరాయి. ఇవి మొక్కలేనన్న అనుమానం ఉండేది కాదని చెప్పే కాలం వచ్చింది. మిగతా ఎనె్నన్నో రకాలు, వాటిలో కొన్ని, జీవం పుట్టిన నాటి నుంచీ సంబంధాలు కొనసాగుతున్నవి! వాతావరణపరంగా చచ్చినచోట్ల కూడా జీవం కనబడిందని అంటున్నారు పరిశోధకులు. మనుషుల్లో తీవ్రవాదులు... ఈ రకం జీవుల ముందు ఎంత?
భూమి మీద కనిపించే వైవిధ్యం అంతులేనిది! ఆ లైబ్రరీలో పుస్తకాలకు లెక్కలేదు. కొన్ని ఉన్నాయని కూడా, ఇంకా గుర్తించింది లేదు. ఈ లైబ్రరీతో లాభం ఏమిటి? అవి ఎవరయినా ప్రశ్న అడిగితే, అంతకంటే పిచ్చి ప్రశ్న ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు.

పుస్తకాల లైబ్రరీలను కాపాడవలసిందే. వాటిలో తరతరాల ఆలోచనలు ఉంటాయి. ప్రకృతి అనే ఈ లైబ్రరీలో కూడా అంతే విలువయిన సమాచారం దాగి ఉంటుంది. పుస్తకాల సమాచారం లాగే, ఇక్కడ కూడా కొంత సమాచారమే కనబడుతూ ఉంటుంది. జీవులను గురించి పరిశోధనలు సాగుతుంటే, రానురాను, ఊహలకు అందని లక్షణాలు బయటపడుతున్నాయి. కొంత సమాచారం మామూలు మనిషికి అవసరమయేది కాదు అనిపిస్తుంది కూడా. కానీ, తరచి చూస్తే ఆశ్చర్యాలు ఎదురవుతాయి. పసిఫిక్ యూ అని ఒక చెట్టు ఉంది. అది ఎందుకూ పనికి రాదనుకున్నారు. ఏవగించుకున్నారు కూడా. పరిశోధకుడొకరు, ఆ చెట్టునుంచి టాక్సాల్ అనే రసాయనాన్ని వెలికి తీశారు. ఇప్పుడు ఆ మందు ‘ట్యూమర్ల’ను తగ్గించడంలో, అన్నిటికన్నా ముందుగా గుర్తుకు వస్తున్నది. సముద్రంలో ఉండే కొన్ని రకాలు సూక్ష్మజీవులకు చమురును తిని, అరిగించుకోవడం చేతనవుతుంది. సముద్రంలో ప్రయాణిస్తున్న ఓడల నుంచి చమురు ఒలికినప్పుడు ఈ సంగతిని గ్రహించారు. ఆ బ్యాక్టీరియాను తెచ్చి పరిశ్రమలలో పరిశుభ్రత కొరకు వాడితే, పర్యావరణమే శుభ్రమవుతుందని పరిశోధన మొదలయింది.

భరించరాని వేడి ఉండే వేడి నీటి బుగ్గలలో జీవం ఉందని గమనించారు. మెల్లోస్టోన్ హాట్‌స్ప్రింగ్‌లలో కనుగొన్న ఈ సూక్ష్మజీవుల నుంచి ఎంజైములను సేకరించారు. ఈ రసాయనాలను వైద్యంలో వాడుతున్న తీరు పరిశోధకులకే ఆశ్చర్యం కలిగిస్తున్నది. నేర పరిశోధనలో కూడా ఈ రసాయనాల వాడకం కొత్త దారులను చూపింది. మనుషుల జన్యువుల విశే్లషణలో కూడా వీటికి పాత్ర ఉందంటున్నారు. ఈ వేడిని తట్టుకుని వేడిలో బతికే సూక్ష్మజీవుల కారణంగా కలిగిన లాభాన్ని లెక్క వేస్తే, ట్రిలియనులలో ఉంటుంది!

మామూలుగా బతికే మనలాంటి వారికి, మనుషుల గురించే సరిగా తెలియదు. ఇక ఎన్నిరకాల పిట్టలున్నాయి, పాములున్నాయి, బూజులున్నాయి, వాటిలో ఏవయినా మనకు పనికివస్తాయాలాంటి ప్రశ్నలు మనకు తోచనే తోచవు! మన బతుకు మనం బతుకుతూ వెళతాం. కానీ, ఈ నడకలో, ఎన్ని రకాల జంతువులను, మొక్కలను తొక్కి నాశనం చేస్తున్నామన్న సంగతి మనకు పట్టదు. అడవులు అవసరం లేదు. చెరువులు అవసరం లేదు. మనిషికి కూడూ, గూడూ రెండు ఉంటే చాలుననే పరిస్థితిలో ఉన్నాము. ఫలితంగా ఎనె్నన్నో రకాల అరుదయిన జంతు, వృక్షజాతులు పూర్తిగా లేకుండా పోతున్నాయి. మామూలుగా, పరిణామంలో భాగంగా కొన్ని రకాలు పోతాయి. పోవాలి. కానీ మనిషి కారణంగా అందుకు వెయ్యిరెట్ల రకాలు సమసిపోతున్నాయని లెక్క తేల్చారు. చేపల రకాలు, అటు సముద్రంలోనూ, ఇటు మంచినీటిలోనూ తరుగుతున్న తీరు ఇందుకొక ఉదాహరణ. సముద్రమంతా ఆసిడ్‌గా మారుతున్నది. అందులో జీవం మారుతున్నది. సముద్రాల వేడిమి కూడా పెరుగుతున్నది. పగడపు కొండలన్నీ సున్నం గుట్టలుగా మిగులుతున్నాయి. కోనిఫెరస్ చెట్లుగల అడవులు బోసిపోతున్నాయి. ప్రకృతిలో మార్పులు సహజం. గత 300 ఏళ్లలో మార్పు తీరు మారింది. అందులో మనిషి ప్రభావం ఎక్కువగా కనబడుతున్నది. మనిషి మనుగడకే ముప్పు తెచ్చే తీరుకు దారితీసింది. ప్రకృతిలో సహజంగా ఉండే వైవిధ్యం నిలబడితే, అది ప్రకృతిగా మిగులుతుంది. మనిషి కారణంగా దాని తీరు మారితే అది ‘వికృతి’ అవుతుంది. పచ్చదనం ఈ భూమికి గుర్తుగా నిలిచిన లక్షణం. ఆ రంగు తరిగిపోతుంటే, భూమి తీరు మారుతుంటే, మనం మాత్రం మిగులుతామా? ఈ రకంగా జరుగుతున్నదట! అన్న భావం ఒకటి మిగిలినా చాలు! మళ్లీ పిచుకలు కనిపిస్తాయి. నత్తలు నడుస్తాయి. కప్పలు బెకబెకమంటాయి. ప్రకృతి, ప్రకృతిగా మిగులుతుంది. 

No comments:

Post a Comment