Sunday, February 26, 2012

సైన్సు - బతుకుతీరు

మన దేశంలో ఫిబ్రవరి 28వ తేదీన లెక్క ప్రకారం ‘జాతీయ సైన్సు దినోత్సవం’ జరుపుకోవాలి. అక్కడో యిక్కడో జరుపుకుంటారు కూడా! కానీ, మామూలుగా ఆ తేదీన పార్లమెంటులో బడ్జెట్ ప్రతిపాదన జరుగుతుంది. కనుక, చాలామంది చూపు అటువేపే ఉంటుంది. ప్రతిసారీ సిగరెట్లు, మత్తుపానీయాల ధరలు పెరుగుతాయి. అయినా వాటి అమ్మకం కూడా పెరుగుతుంది తప్ప తరగదు. ఇంతకూ సైన్సు దినోత్సవం జరపడానికి ఫిబ్రవరి 28ని ఎందుకు ఎంచుకున్నారు. బడులు, కాలేజీలలో కూడా పరీక్షలు దగ్గర పడ్డాయని పిల్లలూ, పంతుళ్లు గోల పడుతుండే సమయం అది. సీవీ రామన్ గారిని గుర్తుంచుకోవడానికి ఆయన పుట్టిన రోజు హాయిగా నవంబర్‌లో వస్తుంది. అప్పుడు ఈ ‘సైన్స్ డే’ జరపవచ్చునన్న ఆలోచన ఎందుకు రాలేదు?

సంవత్సరమంతా గుర్తుండవలసిన మిత్రులు, లేక గాంధీ లాంటి మహనీయులను ఒక రోజున మాత్రం ప్రత్యేకంగా గుర్తుచేసుకోవడంలో అర్థం ఉంటే ఉంది. గాంధీగారికి పుట్టిన దినం ఉంది. సైన్సుకు అలాంటి దినమంటూ లేదు. ప్రతినిత్యమూ సైన్సు దినోత్సవమే. సైన్సు పద్ధతి ప్రకారం నడిచే వారికి నిత్యమూ ఉత్సవంగానే సాగుతుంది. సైన్సుకు ఒక పద్ధతి ఉంటుందని చాలామందికి తెలియదు. తెలిసినా అదేదో వంకాయ కూర వండే పద్ధతిలాంటి క్రమం తెలిసి ఉంటుంది. ఆ పద్ధతిని సైన్సులోనే కాదు, బతుకు అంతటిలోనూ వాడవచ్చు. వాడాలికూడా! ఎందుకంటే బతుకు మహా సైంటిఫిక్‌గా సాగే విషయం మరి!


ప్రశ్నలడగడంతో సైన్సుపద్ధతి మొదలవుతుంది? ఫిజిక్సులో ప్రయోగమయినా ఎదుటి మనిషి పేరు తెలుసుకోవడమయినా ఈ ప్రశ్నతోనే మొదలవుతుంది. తరువాత కొంచెం పరిశీలన. మరిన్ని ప్రశ్నలడిగి, ఒక ప్రతిపాదనను తయారుచేయడం తరువాతి అంచె. ఆ తరువాత సిద్ధాంతాన్ని పట్టుకుని ప్రయోగాలు చేయడం (ఎదుటి మనిషి పేరు తెలిసింది. ఆ పేరు పెట్టి పిలిస్తే పలుకుతాడా?) ప్రయోగం ఫలితాలను బట్టి ఒక అనుభవం. సూక్ష్మంగా చెపితే సైన్సు పద్ధతి ఇంత సులభంగానూ ఉంటుంది. ప్రశ్న, ప్రతిపాదన, ప్రయోగం, సమాచారం, ఒక సూత్రం! ఇదీ క్రమం. కానీ సైన్సు ఈ క్రమంలో మాత్రమే జరగదని చాలామందికి అర్థం కాదు. మొత్తానికి సైన్సులో ప్రతి విషయానికి సంబంధించి ప్రయోగం, పరీక్షలూ జరుగుతాయనీ, ప్రతి విషయానికీ వెనుక గట్టి ఆధారాలు, సాక్ష్యాలు ఉంటాయనీ మాత్రం అర్థమవుతుంది.


సైన్సు పద్ధతి, అంచెలుగా ముందుకు మాత్రమే సాగుతుంది, అనుకుంటే మరి ఆ తరువాత ఏమిటి? వంకాయ కూర తయారయితే సరిపోదు. అందులో రకరకాల మార్పులుండాలి. మరెన్నో రకాల దినుసులు అందులో చేరడానికి వీలు ఉండాలి. సైన్సులోనూ, అడుగడుగునా, రకరకాల చేరికలు, మార్పులు ఉంటాయి. ఒకే అంచెను రకరకాలుగా, ఒకేరకంగా కూడా మరీ మరీ చేసి చూడడం తప్పనిసరి! ఇందులో వంకాయ కూర పద్ధతి పనికిరాదు. కూరలో ఒకసారి ఉప్పువేస్తే అక్కడికి ఆ అంచె ముగుస్తుంది. సైన్సులో అలాగ్గాదు. పరిస్థితులు వచ్చిన కొద్దీ సిద్ధాంతానికి కొత్త రూపాలు, అర్థాలు పుట్టుకువస్తాయి. వంకాయ కూర ఎవరింట్లో వారిది తయారవుతుంది. సైన్సు ఎవరికి వారు చేసేదికాదు. ఎక్కడ చేసినా ఒకే రకమయిన ఫలితాలు ఉండాలి. నీరు వంద డిగ్రీల సెల్సియస్ దగ్గర మరుగుతుందని అందరికీ తెలుసు. కానీ, వాతావరణంలోని ఒత్తిడి మారితే, అంకె మారుతుంది. ఈ సంగతి చాలామందికి తెలియదు. అందుకే సైన్సులో సిద్ధాంతాలకు ఒక ‘రైడర్’ ఉంటుంది. ‘అండర్ ద గివన్ కండిషన్స్’ అంటే పేర్కొనబడిన పరిస్థితులలో మాత్రమే సిద్ధాంతం నిజమవుతుంది. సైన్సులో శాశ్వత సత్యాలు లేవని అందుకే అంటూ ఉంటారు. విషయం గురించి మరో కొత్త అవగాహన కలిగే వరకు మాత్రమే అది నిజం! అందుకే ఒక ప్రయోగాన్ని వేరు వేరు ప్రాంతాలలో చేసి, ఫలితాలను ఒక చోట చేర్చిన తరువాత మాత్రమే ఒక విషయానికి అంగీకారం అందుతుంది. సైన్సులోని వారందరూ అవునంటేనే అదొక సూత్రమవుతుంది!


సైన్సులో పుట్టిన ప్రతి ఆలోచన, ప్రతిపాదన పరీక్షలకు గురయే తీరును గమనిస్తే మనకు బతుకులోని ఆలోచనలను గురించి కూడా మంచి అవగాహన కలుగుతుంది. ప్రతిపాదన పుట్టగానే అందుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం మొదటి కార్యక్రమం. వంకాయ కూర చూడడానికి, తినడానికి ఒక రకంగా ఉంటుందని ఊహించిన తర్వాత వండే కార్యక్రమం సాగుతుంది. అది అనుకున్నట్టు రావచ్చు. రాకపోవచ్చు. సైన్సులోనూ ఇలాగే జరుగుతుంది. నమ్మగలరా? అందిన ఫలితాలు అనుభవాలను బట్టి, సమాచారానికి అర్థాలు వెదకడం, అసలయిన కార్యక్రమం. వంకాయ కూర ఎలాగున్నా తినవచ్చు. కానీ, మరోసారి వండాలనుకుంటే ఏమిటి మార్గం? అది ఇక్కడి పరిస్థితి. వచ్చిన సమాచారం అనుకున్న తీరును అవునంటుంది. కొన్నిసార్లు కాదంటుంది. అప్పుడప్పుడు అనుకోని ఫలితాలు ఎదురయి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అడపాదడపా అనుకున్న ఫలితాలు మొత్తంగా రానే రావు. వీటి ఆధారంగా చూస్తే మొదట్లో చేసిన ప్రతిపాదన నిజమవుతుంది. లేదా వీగిపోతుంది. కాదు, మార్పులతో మరేదో ప్రయత్నం సాగాలనిపిస్తుంది. అసలు ఆలోచనే మారాలనీ అనిపిస్తుంది!


జీవితమంతా సైన్సు అని ఊరకే గోలపెడితే సరిపోదు. మన ఆలోచనలు, బతుకు తీరు తయారయింది. వంకాయలు, కూరకూడా రసాయనాలే అంటే సరిపోదు. మన ఆలోచనలు, బతుకుతీరు ఈ క్రమంలో సాగుతాయని అర్థం చేసుకుంటే, అప్పుడు శాస్ర్తియ దృక్పథం, ఆలోచనా విధానం అలవడతాయి. మనం చేసే ఏ పనిలోనయినా, ఆలోచన, ప్రతిపాదన, ప్రయోగం, ఫలితాలు, వాటికి అర్థాలు ఉండనే ఉంటాయి గదా! ఎవరో చెప్పినందుకు ఏ విషయమూ సత్యం కాదు. నిప్పును ముట్టుకుంటే చెయ్యి కాలుతుందని అనుభవంలోకి వస్తుంది గనుక, పిల్లలు కూడా నిప్పునుంచి దూరంగా ఉంటారు. ఎవరో చెపితే, ఎవరికయినా, ‘చేసి చూస్తే పోదా?’ అనిపిస్తుంది. అందుకే ప్రశ్న అవసరం. ప్రతిపాదన అవసరం. ప్రయోగం అవసరం.
ఫిబ్రవరి 28న సైన్సు దినోత్సవం జరుపుకుంటే బాగానే ఉంటుంది. ఈ ఉత్సవం, ఆలోచనలు ప్రతినిత్యం సాగితే మరింత బాగుంటుంది! బాగా బతకడానికి ఆలోచనలు ఉండాలి. ఆ ఆలోచనలు సైంటిఫిక్ మార్గంలో సాగితే మరీ మరీ బాగుంటుంది!

No comments:

Post a Comment