Saturday, August 3, 2013

అచ్చులో లోకాభిరామం

చాలా కాలం పాటు అచ్చులో వచ్చిన అంశాలను నెట్ లో అందించాను.
ఇక్కడికన్నా నా బహుభాషా బ్లాగులో అటువంటి అంశాలు ఎక్కువ.

ఆంధ్రభూమి శాస్త్రి గారూ, మూర్తి గారూ పట్టుబట్టి నా లోకాభిరామంని లోకాభిరామమ్ గా మార్చి అచ్చులో అందిస్తున్నారు.

అంశాలు కొత్తవి.
ఇక్కడినుంచి ఎత్తినవి కావు.

చిత్తగించండి.
ఊదవలసిన శంఖం


* ‘నేను చెప్పే మాటలు ఎవరికీ పట్టవని నాకు తెలుసు. అయినా చెపుతాను. ఈ మాటలు, నేను చెప్పకుంటే మరెవరూ చెప్పరు. చెప్పలేరు’ అంటాడొక చైనా తాత్వికుడు.

‘ఊదర సంగై ఊది వెచ్చాల్, విడియుం బోదు, విడియాట్టుం’ అని ఒక తమిళ సామెత. ఊదే శంఖాన్ని ఊదేస్తే, తెల్లవారేటప్పుడు తెల్లవారనీ, అని అర్థం.

* కనీ పెంచీ, కనిపించిన దేవతలు అమ్మా, నాన్నా! బతుకుకు, చదువుకు గురువు, తరువాత హితుడు, స్నేహితుడు నాన్న! (నేను నాన్నగారు, స్నేహితులు అనలేదని ఎవరూ బాధ పడనవసరం లేదు! మా తీరే అంత!) ఈ పని ఈ రకంగా చేయండి, అని నాన్న ఏనాడూ చెప్పింది లేదు. అయినా అన్నింటికీ ఆయనే గురువు. నాన్న సైకిలు పెట్టే చోట, గోడలో ఒక చిన్న చెక్క తలుపు అల్మారా ఉండేది. నేనూ, తమ్ముడూ పొద్దున్నే ముఖం కడుక్కుని వచ్చి అక్కడ నిలబడి, ‘ఎలుకా! మాకేమయినా యియ్యవా?’ అని అడగాలి. కళ్లు మూసుకుని అడగాలి. అల్మారాలో ఎలుక ఉంటుంది. అది మాకు బిస్కెట్లు, చాక్లెట్లు ఇస్తుంది. ఇప్పటిలాగ చారెడు, బారెడు చాకొలేట్లు లేవప్పుడు. ప్యారీ, దకన్, రావల్‌గావ్ అంటూ రెండు వేపుల చెవులు మెలేసిన చాక్లేట్లవి. బుద్ధిగా పిడక బూడిదతో పళ్లు తోముకుని, ముఖం కడుక్కుని వచ్చి నిలబడడమంటే, ఎలుక కొరకేనా?

నాన్న ఆ ఊళ్లోనే, అంటే మా ఊళ్లోనే బడిలో టీచరు. ఆయన సిద్ధమయి, ధోవతీ కట్టుకుని, తాంబూలం వేసుకుని, సైకిలు తీసుకుని ఠీవిగా బయలుదేరితే దారిలో ఎవరూ అడ్డువచ్చేవారు కాదు. కానీ, అదంతా చూచే ఓపిక ఎక్కడిది! ఉడుతలా పరుగెత్తి బడికి చేరుకునే వాణ్ని. పుస్తకాలు లేవు. కనీసం పలక లేదు. నాకసలు బడిలో అడ్మిషనే లేదు. ప్రార్థన అయింతర్వాత చెప్రాసీ (బంట్రోతు) శాంతయ్య, నన్ను ఇంట్లో దింపుతాడు. అతను భుజం మీద ఎత్తుకుని ఇంటికి తెస్తుంటే, నచ్చక, ఒకనాడు, అతని చెవి కొరికినట్టు జ్ఞాపకం! శాంతయ్య తలకు రుమాలు కట్టుకునేవాడు. మరి చెవి ఎట్లా కొరకడం కుదిరింది? ఇప్పుడు అనుమానం వస్తుంది. పెద్దవాణ్ని అయింతర్వాత శాంతయ్య ఎప్పుడూ ఆ సంగతులు చెప్పి మురిసిపోతుండేవాడు.

నేనూ బడిలో చేరాను. అక్షరాలు దిద్దే అవసరం లేకుండా, ఏకంగా పుస్తకం పట్టుకున్నానట. ఒకనాడు అందరినీ నిలబెట్టి నాన్న డిక్టేషన్ చెపుతున్నాడు. నేను మెడలిక్కించి ముందున్నవాడి పలకలోకి తొంగి చూచాను. తల మీద ఠపీమని దెబ్బ పడింది. తిరిగి చూస్తే నాన్న! పలక కింద పడేసి ఏడుస్తూ ఇంటికి వెళ్లిపోయాను. పలకను నాన్న ఇంటికి తెచ్చాడు. ఆయన చెప్పిన మాట, అప్పటికే నేను రాసి ఉంచానన్న సంగతి ఆ పలక ప్రకటించింది! నాన్న గట్టిగా నవ్వాడు! నేనూ గర్వంగా నవ్వాను.

క్రమశిక్షణంటే నాన్న తర్వాతే ఎవరయినా! ఆయన్ను చూచి గడియారం తత్తరపడేదేమో? చివరి వరకూ ఆయన అదే పద్ధతిగా బతికారు.

ఇంట్లో తాతయ్య పుస్తకాలు ఒక పెద్ద అల్మారా నిండా ఉండేవి. వాల్మీకం మొదలు ఆనంద రామాయణం దాకా, ఎన్ని రామాయణాలున్నా ఆశ్చర్యం లేదు. ఆరోగ్యం, వైద్యం, యాత్రా చరిత్రలు, గారడీ విద్య, మొదలయిన పుస్తకాలన్నీ తాతయ్య కొని చదివారంటే భుజాలు పొంగిపోతాయి. ఆ పుస్తకాలను తరచు దులిపి, నిర్వహించడం నా డ్యూటీ. ఆ పుస్తకాలు నావి, అది గర్వం!

నాన్న బాగా చదువుకున్న మనిషి. కానీ సర్ట్ఫికేట్లు లేని చదువది. ఏదో ఒక చిన్న ట్రెయినింగ్ పొంది, ప్రైమరీ స్కూల్ పంతులుగా సెటిలయ్యారాయన. అందులోని ఆనందం గురించి తర్వాతెప్పుడో చెప్పాడాయన మాతో! ఆయన విపరీతంగా పుస్తకాలు చదివేవాడు. నాకు అక్షరాలతో పరిచయం ‘చందమామ’తో మొదలయింది. మూడవ తరగతిలో ఉన్నప్పుడు చందమామ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా చదవడం అలవాటయిపోయింది. అందులో వచ్చే వ్యాపార ప్రకటనలు కూడా గుర్తున్నాయి. నాన్న తాను చదివిన నవల, పత్రిక ఏదయినా సరే తరువాత నా ఒళ్లో పడేయడం అలవాటయింది. కోడిగుడ్డు దీపం పెట్టుకుని, అయిపోయిందాక అపరాధ పరిశోధక నవల చదివి,ఆ దృశ్యాలు కళ్ల ముందు మెదులుతుంటే, భయంగా పడుకోవడం గుర్తుంది! ‘ఈ ప్రపంచంలో పనికిరాని పుస్తకమని ఏదీ లేదు’ అని నాన్న అనుకున్నాడనిపిస్తుంది. అంగట్లో పప్పు కట్టిచ్చిన కాయితం కూడా చదవందే పడేయకపోవడం, అప్పుడే అలవాటయింది.

సెలవులు వచ్చినయంటే, ఏ లైబ్రరీ నుంచో సంచెడు పుస్తకాలు ఇంటికి వస్తాయి. నిదానంగా చదివితే నాలుగు రాళ్లు కాలం గడుస్తుంది. కానీ, అంత ఓపిక ఏదీ? పిచ్చెత్తినట్టు అన్నీ చదివేసి, మరో బ్యాచ్ కొరకు ఎదురుచూడడమే!
అది పరీక్షకు చదవవలసిన ‘సిలబస్’ పుస్తకం గానీ, సరదాగా చదివే నవల గానీ, చదువు కాని చదువుగా చదివే మరో పుస్తకం గానీ, పుస్తకమంటే, నాన్నలాగే మిత్రుడు, ఆప్తుడు! కష్టపడి చదవడం, సరదాగా చదవడమన్న తేడా లేదు! అన్నీ యిష్టంగానే చదవడం అలవాటయింది. వరుసబెట్టి రెండు క్లాసిక్సు, రెండు నవలలు చదివి, అదే ఊపులో ‘సిలబస్’ కూడా చదివితే, అన్నీ ఒకే రకంగా, సినిమాలాగ గుర్తుకు వచ్చేవి.

మా ఊరి బడిలో అయిదవ తరగతి వరకే ఉండేది. తరువాత, పక్కనున్న పాలమూరులో చదువు. చిత్రంగా నాన్నకు, తిరిగి మా బడికే బదిలీ అయింది. చివరి పీరియడ్ జరుగుతుండగా, (మామూలుగా అది ఆటల పీరియడ్) నన్ను వెతికి, ‘ఇంటికి పరుగెత్తకు;’ అని ఒక మాట చెప్పి వెళతాడు నాన్న! అంటే ఆనాడు సినిమా చూసే కార్యక్రమం ఉందని అర్థం. సినిమాలు చూడడమే కాదు, వాటిని గురించి చర్చించడం కూడా నాన్న దగ్గర నేర్చుకున్నాను. నమ్మండి, నమ్మకపొండి, జరదా పాన్ తినడం, నాన్న దగ్గర నేర్చుకున్నాను!

జీవితాన్ని హాయిగా ఎంజాయ్ చెయ్యాలన్నది నాన్న ఫిలాసఫీ. పట్నంలో పడి, నన్ను నేను వెదుక్కుంటూ బతికే రోజుల్లో పండగకు ఇంటికి వెళతాను. సాపాట్లు (భోజనాలు) అయింతరువాత నాన్న పాన్ వేసుకుని, ఆ అందమైన పెట్టెను నా ముందుకు తోస్తారు అది అలవాటు. ఒకసారి, నేను ‘మానేశాను వద్దు’ అన్నాను. ‘నాన్నా! టీ, కాఫీ తాగవు. మరే అలవాట్లూ లేవు. ఉన్న ఈ ఒక్క సరదా (అదే జరదా) మానేసి ఏం చేస్తవయ్యా?’ అన్నారాయన.

-మళ్లీ వచ్చేవారం


No comments:

Post a Comment