భారత చంద్రయానం
- రచన: డా.టి.వి. వెంకటేశ్వరన్,
అనువాదం: ఎ.జి.యతిరాజులు,
ప్రజాశక్తి బుక్‌హౌస్,
ఎం.హెచ్. భవన్,
ఆజమాబాద్, హైదరాబాద్- 20, 040- 27660013.
- రచన: డా.టి.వి. వెంకటేశ్వరన్,
అనువాదం: ఎ.జి.యతిరాజులు,
ప్రజాశక్తి బుక్‌హౌస్,
ఎం.హెచ్. భవన్,
ఆజమాబాద్, హైదరాబాద్- 20, 040- 27660013.
తెలుగులో సైన్సు పుస్తకాలు వస్తున్నాయంటేనే ఆనందం. అం దునా ఏవో పాత విషయాలను గురించి కాకుండా, ఇటీవలి చంద్రమండల పరిశీలనల గురించి పుస్తకమంటే అంతకన్నా ఆనందం ఏముంటుంది. వెంకటేశ్వరన్‌ఈ పుస్తకాన్ని తమిళంలో రాశారు. ఆయన బహుశః పరిశోధకుడై ఉండాలి. చంద్రయానం ఒక్కటే గాక, చంద్రుని గురించి కూడా సరళంగా తెలియజేయడం తన రచన ఉద్దేశమని సూటిగా చెప్పారు. సైన్సులో ఒక అధునాతన విషయాన్ని గురించి, అందరికీ అర్థం కావాలంటే, ఆ విషయం గురించిన పూర్వాపరాలు తెలిసి ఉండడం నిజంగా అవసరం. ఈ పద్ధతిని అందరూ పాటించాలి.
ఇందులో కవితా ధోరణిలో పెట్టిన శీర్షికలు చంద్ర వదనం, మాటున ఉండి చూచే మర్మమేమి?, నీవులేక నేనులేను, బుగ్గపై గాయం లాంటివి పాఠకుడిని పట్టి చదివిస్తాయి. కథనం కూడా అంత బాగానూ నడుస్తుంది. చంద్ర బింబంలోని మచ్చల గురించి చెప్పిన వివరాలు బాగున్నాయి. చంద్రగోళం గురించి సవివరంగా చెప్పడమే కాదు, సాంకేతిక విషయాలూ అందించారు. చంద్రగోళం నిర్మాణం గురించి, అది పుట్టిన నాటినుంచి ఈ నాటి వరకు వచ్చిన మార్పుల గురించి శాస్ర్తియ విశేషాలతో వివరించారు. చంద్ర గ్రహాన్ని పరిశీలించడానికి, దూరం నుంచి అక్కడ దిగి చేసిన ప్రయత్నాల వివరాలు కూడా ఉన్నాయి. 125వ పేజీలో మన పరిశోధకులు చేసిన చంద్రయానం వివరాలు మొదలవుతాయి. చంద్రయాన్ సాధించిన విజయాలతో పుస్తకం ముగుస్తుంది. ఈ తరహా పుస్తకంలో బొమ్మలు ఉంటే మరింత సులభంగా అర్థమవుతుందనే భావనతో అవసరమైన చోటల్లా కావలసినన్ని ఫొటోలు, రేఖాచిత్రాలు వేశారు. అచ్చు టెక్నాలజీ బాగా పెరిగిన ఈ కాలంలో ఫొటోలు మరింత బాగావేసి ఉండవచ్చుననిపించింది.
అనువాదం చాలా సులభంగానే సాగింది. సాంకేతిక వివరాలు ఎక్కువగా ఉన్నందుకు చదివించే సౌలభ్యం కొంత తగ్గిన భావన కలిగింది. అనువాదకులు తెలుగులో వాడుకలో ఉన్న పదజాలంతో అంతగా పరిచయంగలవారు కారు. సూర్యుని చుట్టూ తిరిగేది గ్రహం. దాని చుట్టూ తిరిగే మూన్స్‌ని మనం ఉపగ్రహాలంటున్నాము. పుస్తకంలో సహాయక గ్రహాలు అనే మాట వాడారు. గ్రహాలను గోళాలు అన్నారు. అంతెందుకు చిత్రా నక్షత్రాన్ని చైత్రం నక్షత్రం అన్నారు. వికీర్ణం- వికిరణంల మధ్య తేడా ఉంది. ఇంత మంచి పుస్తకానికి, ఒక సంపాదకుని సాయం తోడయితే, మరింత బాగా వచ్చి, మరింత బాగా చదవడానికి వీలుండేది. పత్రికలకే కాదు, అన్ని ప్రచురణలకూ విషయం తెలిసిన సంపాదకులుండాలన్న సంగతిని మనవారు గుర్తిస్తే కాస్త బాగుండేదేమో!
No comments:
Post a Comment