Thursday, March 1, 2012

సమస్యలూ - సమాధానాలూ!

కష్టాలు మనిషికి కాక మానుకు వస్తాయా? అని ఒక మాట ఉంది. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అని మరో మాట ఉంది. మానులకూ, పీతలకూ కష్టాలుంటాయి. వాటి నుంచి బయటపడే దారులు కూడా మానుకు, పీతకూ తెలిసే ఉంటాయి. ఇక మనిషి కూడా సమస్యనుంచి బయటపడే దారి తెలిసినంత వరకు ఫరవాలేదు. కానీ తెలివిగా సమస్య నుంచి బయటపడటం అందరికీ చేతగాదు. అందుకు వారి తెలివే అడ్డుపడుతుందంటే ఆశ్చర్యం కాదు? సమస్యను సరిగా గుర్తించడంలోనే సమస్య ఉంది. సమస్యకు వీలయినన్ని సమాధానాలు వెదకడం అంతకన్నా పెద్ద సమస్య! ప్రతి సంగతి గురించి, అందరికీ అభిప్రాయాలు, అవగాహనలు ఉంటాయి. అవి సమాధానం వెదికే దారికి అడ్డుపడతాయి. కొందరిలో అవి మరీ బలంగా అడ్డు పడతాయి. ఈ అడ్డుపడడం తెలియకుండానే జరుగుతుంది. సమస్య మరీ బలంగా కష్టాలకు దారి తీసినా మనస్తత్వం అర్థం కాకపోవచ్చు. సమస్య అసలు లేదనుకోవడం ఒక సమస్య. తర్వాత చూద్దాము అనుకోవడం మరొక సమస్య! అంతకుముందు కలిగిన అభిప్రాయాలు అన్నిటికన్నాపెద్ద సమస్య!

అనుభవాలు విచిత్రమయినవి. అనుక్షణం మన మెదడులోకి అంతులేకుండా సమాచారం వస్తూనే ఉంటుంది. ఈ సమాచారాన్నంతా నిజానికి మనం గ్రహించలేము. నేను ఈ అక్షరాలు రాస్తుంటే కింద ఇంట్లో ఎవరో మాట్లాడుతున్నారు. అలాగే మీరు వాక్యాలు చదువుతూ వుంటే బయట వేడి, కాగితం స్పర్శ, కంప్యూటర్ చప్పుడు, వెలుగు అందుతున్న తీరు, ఎనె్నన్నో సంగతులు తెలుస్తుంటాయి. ఈ సమాచారమంతా అందుతున్నది. మెదడు ఆ సంగతులను గురించి చేయవలసిందేదో చేస్తూనే ఉన్నది. కానీ, మీ చూపుమాత్రం చదవడం మీద మాత్రమే కేంద్రీకృతమయి ఉంది.
ఏ సందర్భంలోనయినా, పట్టించుకోనవసరం లేని సంగతులేవో మెదడుకు తెలుసు. లేదంటే, అంతా గందరగోళమవుతుంది. కానీ ఈ పట్టించుకోవనవసరం లేదనుకున్న సంగతులు కొన్ని చోట్ల, సమస్యను కనబడకుండా చేస్తాయి. సమాధానం తోచకుండా చేస్తాయి. తెలియకుడానే, కొన్ని రకాల సమాచారాన్ని మెదడు పక్కన పెడుతుంది. కనుక సమస్య తాలూకు అసలయిన రూపం అర్థం కాదు.


చదువుకున్నవారికన్నా మేలని కొందరి గురించి చెపుతారు. వారికి అవసరమయిన సమాచారం వారికి బాగా తెలుసు. చదువు ఎక్కువయిన కొద్దీ, అనుభవం పెరిగినకొద్దీ ఫిల్టరింగ్ కూడా పెరుగుతుంది. నిజంగా చదువుకున్నవారు సమస్యల గురించి తెలివిగా, సృజనాత్మకంగా ఆలోచించ లేకపోతారు. అయిదు సంవత్సరాలు దాటని పిల్ల తెలివి వందయితే, 40 సంవత్సరాలు దాటిన వారి తెలివి రెండు మాత్రమే అంటున్నారు పరిశోధకులు.


నూనె గానుగ తిరుగుతున్నది. గానుగ స్వంతదారు అక్కడ లేడు. తార్కికుడు ఆశ్చర్యంగా బుద్ధిగా తిరుగుతన్న ఎద్దును గమనించాడు. గానుగ మనిషిని పిలిచి ‘గానుగ ఆడుతున్నట్లు ఎట్లా తెలుస్తుంది? అని అడిగాడు. ఎద్దుమెడలో గంట ఉంది గదా అన్నాడు గానుగ మనిషి. ఎద్దు ఒకే చోట నిలబడి మెడ ఆడిస్తే ఏం చేస్తావన్నాడు పండితుడు. నా ఎద్దు నీలాగ చదువుకోలేదు. దానికలాంటి ఆలోచనలు రావన్నాడు గానుగ మనిషి!


చదువులో ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం ఒకటి ఉంది. మిగతా జవాబులన్నీ తప్పులే. వాటినసలు పట్టించుకోనవసరం లేదు. చదువులో బోలెడు నియమాలు, పరిధులు ఉంటాయి. కొత్త ఆలోచనలకు అక్కడ చోటు చటుక్కున దొరకదు. ఒక పనిలో అనుభవం బాగా ఉందంటే, ఆ పని చేయడానికి సరైన దారుల గురించి గట్టి అభిప్రాయాలు ఏర్పడి ఉంటాయి. ప్రత్యేకమయిన పద్ధతులు, వాటి గురించి గట్టి అభిప్రాయాలు కూడా ఉంటాయి. కొత్త ఆలోచన ఏది వచ్చినా ముందు ‘కాదు’ అన్నమాట ముందుకు వస్తుంది.


ఒక సీసాలో అరడజను తేనెటీగలను, అనే్న దోమలను పెట్టి సీసాను అడ్డంగా పెట్టాలి. సీసా మూత తెరిచే ఉంటుంది. కానీ అది కిటికీ వేపు గాక లోపలివేపు ఉండాలి. సీసా అడుగు వెలుగు వేపు ఉండాలి. అప్పుడేమవుతుందో ఊహించగలరా? వెలుగు వేపు మాత్రమే మార్గం ఉందనుకునే తేనెటీగలు ఎంతసేపయినా సీసా అడుగు భాగానికి కొట్టుకుంటూ అక్కడే అలసి చస్తాయి. దోమలో, మరో పురుగులో అయితే అటూ యిటూ వెదిగి, మార్గం తెలుసుకుని బయటపడతాయి. తేనెటీగల తెలివి, వెలుగుమీద వాటికిగల నమ్మకం వాటికి శత్రువవుతుంది. వాటికి గాజు అని అడ్డంకి ఒకటి ఉంటుందని తెలియదు! అందులోంచి దూరడం వీలుగాదు. మిగతా పురుగులకు భేషజాల్లేవు. కనుకనే వాటికి మార్గం దొరుకుతుంది.


అందుకే మరీ తెలివిగా ఆలోచిస్తే సమస్యలకు సమాధానాలు దొరకవంటారు. ఆ సమస్యకు సమాధానం మరీ మామూలుగా ఉండవచ్చు. ఆట పద్ధతిగా ఉండవచ్చు. తెలివికి అది అందకపోవచ్చు! సమస్యకు సమాధానం కావాలంటే, తెలివికన్నా ఆలోచన ఎక్కువ అవసరం. సమస్యకు కథలోలాంటి సమాధానం ఊహించగలిగే పద్ధతుల గురించి ట్రెయినింగులు కూడా జరుగుతున్నాయి. ఆ పాటవం గలవారికి మంచి గిరాకీగా ఉంది ఈ రోజుల్లో! ఆలోచనల్లోంచి ఎన్నో కొత్త కొత్త ప్రొడక్ట్‌లు పుట్టాయి. విజయగాథలు వెలువడ్డాయి.


సమాచారం ముఖ్యం కాదిక్కడ. మెదడును సరిగా వాడటంతో కిటుకు తెలుస్తుంది.

1 comment: