Friday, June 8, 2012

ఆంగ్లంలో రాయల ఆముక్తమాల్యద


తెలుగునుంచి ఇంగ్లీషులోకి అనువాదమవుతున్న సాహిత్యమే తక్కువ. అందునా ఒక తెలుగు కావ్యాన్ని యథాతథంగా ఇంగ్లీషులో చెప్పే ప్రయత్నాలు జరగనేలేదు. విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం, లలిత కళల విభాగంలో, అధ్యాపకులు శిష్ట్లా శ్రీనివాస్ ఏకంగా శ్రీకృష్ణదేవరాయల ‘ఆముక్తమాల్యద’ను ఎంచుకుని ఆంగ్లంలోకి అనువదించారు. ‘తాను ధరించిన పూమాలను శ్రీరంగనాధునికి సమర్పించిన’ శూడికుడుత్తు నాచ్చియార్ అనే గోదాదేవికి ఆముక్తమాల్యద అని పేరు. చెప్పడానికి గోదమ్మ గురించి నిజానికి పెద్ద కథ లేనేలేదు. కానీ శ్రీ కృష్ణదేవరాయలు, వైష్ణవ సాంప్రదాయానికి చెందిన మరెన్నో అంశాలు కావ్యంలో ఉండవలసిన వర్ణనలు కలిపి ఈ పేరున కావ్యాన్ని వెలయించాడు.

తెలుగు కావ్యాలలో ‘ఆముక్తమాల్యద’కున్న స్థానం విశిష్టమయినది. విచిత్రమయినది. కవిత్వంలో రెండు లక్షణాలుంటాయని, మొదటిది శబ్దం, కూర్పు, బిగింపు, గడుసుదనము, పలుకుబడి కలిగి ఉంటే, రెండవ దానిలో భావము, కల్పన, అలంకారములు, కథన శైలి ముఖ్యమయినవి. ఆముక్తమాల్యద ‘ఈ రెండు మార్గములలోను దానికదే సాటి’ అని విశ్వనాధ సత్యనారాయణగారి విశే్లషణ. పైగా ఈ కావ్యం సులభంగా నములుడుపడని నారికేళ పాకంలో నడుస్తుందని అందరూ అంగీకరించిన విషయం.

శ్రీనివాస్‌గారు ఇంతకుముందు కళా విషయాలను గురించి మంచి పుస్తకాలను రచించి, ప్రచురించారు. మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయనచూపు కావ్యాలను అనువాదం చేయడంవేపు మళ్లింది. మొదటి ప్రయత్నంగా తాము రాయల ఆముక్తమాల్యదను ఎంపిక చేసుకోవడానికి ఎన్నో కారణాలున్నాయంటూ శ్రీనివాస్‌గారు ఒక చక్కని నోట్ రాశారు. ముందు పుస్తకం గురించి పరిశోధన మొదలైంది. ప్రతులు, వ్యాఖ్యానాలు, చరిత్ర అన్నింటినీ సేకరించి సవివరంగా పరిశీలించారు. అనువాదం కూడా చేశారు. ఇంతకు ముందు రాసిన పుస్తకాలకు లాగే, ఈ ఆంగ్లానువాదానికి కూడా తానే ప్రచురణకర్త, సంపాదకుడు కూడా!

కావ్యంయొక్క అనువాద భాగం 325 పేజీలపైన ఉంది. ముందొక 125 పేజీలు, చివర మరొక కొన్నిపేజీలు, ఆసక్తికరమయిన విశేషాలతో నిండి ఉన్నాయి. చిత్రంగా ఈ పుస్తకంలో బోలెడన్ని బొమ్మలున్నాయి. బొమ్మలెందుకు అన్న ప్రశ్నకు కూడా శ్రీనివాస్ చక్కని వివరణ ఇచ్చి ఉన్నారు. కృతజ్ఞతల పేజీలో కొందరి పేర్లున్నాయి. నిజమే కానీ, పుస్తకమంతా శ్రీనివాస్‌గారి త్రివిక్రమావతారం కనిపిస్తుంది. ఇందులో ఒక వెసులుబాటు ఉంది. కొన్ని కష్టాలూ ఉన్నాయి.

పరిశోధకుడు, అనువాదకుడు, ఫ్రచురణకర్త తానే అయిన శ్రీనివాస్ ఒక కళాజీవిగా, కథకుడుగా చక్కనిపుస్తకాన్ని అందించారు. ముద్రణ కూడా చాలా బాగుంది. అట్టమీద బొమ్మ అందంగా ఉంది. గానీ ఆ బొమ్మనే ఎందుకు వాడిందీ అర్ధం లేదు. మొత్తానికి ఈ పుస్తకం ప్రచురణలో మరెవరిదైనా ప్రమేయం ఉంటే, దాని తీరు మరోరకంగా ఉండేదన్న భావం కలిగింది.

పరిశోధన చేసి రాసిన ప్రవేశిక, పండితులను ఆకర్షించేదిగా ఉంది. రాయల ఆముక్తమాల్యద వ్రాసిన తీరు గురించి, కథాక్రమం గురించి విడిగా చెప్పారు.ఆ తరువాత రియాలిటీ అండ్ మిత్ అనే పేరుతో కావ్యానికి సంబంధించిన సాహిత్య,రాజకీయ, మతపరమైన విశేషాలను ఎన్నో ఉపశీర్షికల కింద తర్కించారు. ఇందులోని చాలా అంశాలు (శ్రీనివాస్‌వల్ల కాదుగానీ) చర్చనీయమైనవే. రకరకాల విషయాలను ఒక చోటి చేర్చి చూడాలని శ్రీనివాస్ చేసిన ప్రయత్నం చాలా బాగుంది.

గోదమ్మ, పన్నిద్ధరాళ్వారులలో ఒకరు. కనుక కావ్యమంతటా వైష్ణవమే. కనుక శ్రీనివాస్‌గారు వైష్ణవం గురించి తర్కించడం సమంజసం,. అవసరం కూడా. కానీ మరింత వివరంగా ఈ విషయం గురించి సమాచారం చేరి ఉంటే బాగుండును. అహోబిల మఠాన్ని స్థాపించినవారు ఆదివణ్ శఠకోపయతి. ప్రస్తుతం ఉన్న ఇరువురు జియ్యర్లతో సహా, మఠానికి అధిపతులయిన యతీంద్రులు అందరి పేరులోను ముందు ఈ శఠకోప శబ్దం ఉంటుంది. ఈ పదానికి గల అర్ధం గురించి ప్రసక్తి సరిగా లేదని అనుమానం. శఠమనే దుర్లక్షణాన్ని దూరం చేసేది శఠగోపమని సంప్రదాయం. తమిళ భాషలో క,గలలకు ఒకటే అక్షరం గనుక అది శఠకోపమయిందా? తరువాత ‘వణ్ శఠకోప’ అని ఒక మాట వాడారు. శ్రవణ్ శఠకోప అని ఉండాలేమో! శ్రీమాన్ వంటి శబ్దమది.

‘చాలా తక్కువగా ఉన్న అచ్చు తప్పుల లాగే, ఏవో చిన్న ప్రశ్నలు తప్ప, శ్రీనివాస్ అందించిన పరిశోధనాంశాలు, కావ్యాలతో పోటీపడి చదివించేవిగా ఉన్నాయి. అనువాదానికి పడ్డ శ్రమకు సూచనగా పాఠభేదాలు, వ్యాఖ్యానాలతో తేడాల గురించి చేసిన చర్చ ఆసక్తికరంగా ఉంది. ‘పొరి విళంగాగ గములు’ అన్న మాటకు అర్ధం వెదికిన తీరు, ఆ వివరాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. తమిళంతో, అలనాటి తమిళంతో మంచి పరిచయమున్న వారు ఈ విషయాలను వివరిస్తే బాగుండును. పొరి అంటే పొడి అని అర్ధం ఉంది. లడ్డూలవంటి మధుర పదార్ధాలను ‘కాయలుగా వర్ణించే పద్ధతి కూడా ఉంది. గమి అన్నా గములు అన్నా సమూహమే! బాగుంది.

రాయల రచన చిత్రంగా సాగుతుంది. అది పండితులకే తప్ప మామూలు పాఠకులకు సులభంగా లొంగదు. మాతృక శైలి నారికేళమయితే, అనువాదశైలి కూడా అదే దారిని నడవాలా? నడవకూడదు. నడవలేదు. ఫలితంగా కావ్యం ఇంగ్లీషులో చదివితే అర్ధమయ్యేదిగా వచ్చింది. మూలంలోని ’జిగి’, ’బిగి’ అందవు. ఒకరకంగా అది లోపం. కానీ విషయం అందుతుంది. అది గుణం!

రెండవ అశ్వాసంలోనే విష్ణుచిత్తుడు ‘నాకు చదువురాదు!’ అని చెప్పడానికి ఒక పద్యం! ‘స్వామీ నన్ను’ అని ఆరంభమయే ఆ పద్యం అందరికీ తెలిసి ఉంటుంది. అందులో రెండు పాదాల నిడివికి పైన ఒక దీర్ఘమయిన సమాస పరంపర. దాన్ని ఇంగ్లీషులో మాత్రం చాలా సులభగ్రాహ్యమైన మాటలలో రాశారు. (ఈ పద్యం అనువాదంలో 91-ఎమెస్కో వారి మూలంలో 90-పాఠభేదమని అర్ధం!

అట్లాగే మూడవ ఆశ్వాసంలో 85 పద్యం ఒక సీసం. అది రాయల రచనకు మచ్చుతునక. మొదటి పాదంలోని మొదటి భాగం సంస్కృత సమాసం. రెండవ భాగం, (దొడ్డ కెందమ్మ కన్‌దోయి వాలి) అచ్చతెనుగు. ఆంగ్లంలో ఈ శైలిని ప్రతిబింబించడం సాధ్యమా? రాయల రచన ఎంత గహనంగా సాగుతుందో, శ్రీనివాస్ అనువాదం అంత సరళంగా సాగింది. మూలంలోని తీరు కనపడకపోవడం, లోపమయితే ఇది లోపం! అశోక్ బ్యాంకర్ అనే రచయిత ఆంగ్లంలో రామాయణం రాశాడు. అది నవల చదివినట్టు ఉంటుంది. అది లోపమా?

శ్రీనివాస్ కథను పద్యాల ప్రకారం వచనంగా చెప్పలేదు. పాదాల ప్రకారం అనువాదం చెప్పారు. అది కవిత మాత్రం కాదు. తన మాటలలో లయ ఉందని ఆయనే అన్నారు. తెలుగు పద్యాలలో ఎక్కడా కనిపించని ‘కొటేషన్’ మార్కులు ఎమెస్కో తెలుగు ప్రతిలో ఉన్నాయి. ఆశ్చర్యం మార్కులు అనువాదంలో ఉన్నాయి. అవి విషయంలో అనువాదకుడు పొందిన అనుభూతికి గుర్తులు!

కళా పరిశోధకుడు, పరిశీలకుడు శ్రీనివాస్, ఈ ‘కావ్యం’లో వాడిన ఫోటోలను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ‘సచిత్ర’ కావ్యం ఒక కొత్త పద్ధతి. పద్యం చదువుతుంటే, తన కనుల ముందు మెదలిన చిత్రాలను, (అక్కడకక్కడ నేరుగా సంబంధం లేకున్నా) వాడిన తీరు ఆసక్తికరంగా ఉంది.

‘తలిరింగైదువుజోదునానతి’ (వి.95)లో ఆయుధాల ప్రసక్తి. అక్కడ బొమ్మ లియోనార్డో దావించీ ఫిరింగి! భలే!
తెలుగు, ఇంగ్లీషు భాషలతో సమానంగా పరిచయమున్నవారు రెండు ‘వర్షన్స్’ను తులనాత్మకంగా చదివి ఆనందించవచ్చు. తెలుగు తెలియనివారు గోదమ్మ కథను, మిగతా అంశాలను మరింత బాగా ఆనందించవచ్చు. ఆనందించవలె! ఈ పుస్తకాన్ని అంతర్జాతీయ సంస్థలవారు (ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్) అందుకుని ఉంటే, తెలుగులోని రచనల తీరు ప్రపంచానికి ‘మరింత’ బాగా అందేదని అనిపించింది. ఇప్పుడు అందనిది లేనే లేదు. మంచిపనికి మంచి ప్రాచుర్యం రావాలి. శ్రీనివాస్‌గారు ‘సేల్స్’ అన్న కార్యకమాన్ని కూడా తామే తలకెత్తుకుంటే తర్వాతి సృజనాత్మక కార్యక్రమం సాగదు. పుస్తకం అందవలసిన దూరాలకు అందదు!

అందంగా ఆసక్తికరంగా రూపొందించిన ‘ఆముక్తమాల్యద’ గ్రంథానికి అయిదు తక్కువ అయిదువందలు. తక్కువే ధర!

-కె.బి.గోపాలం

ఈ రచయిత ఈ మధ్యనే మనుచరిత్ర ఆంగ్లానువాదం కూడా ప్రచురించారు.

వివరాలకు:

శ్రీనివాస్ శిష్ట్లా
దృశ్యకళాదీపిక
4-61-7, లాసన్స్ బే కాలనీ,
విశాఖపట్నం - 530017

ఫోన్ - 09395345431

sistlasrini@gmail.com 

2 comments:

  1. నాకు ఈ పుస్తకం కావాలండీ.
    ఎలా తెప్పించుకోవటం?

    ReplyDelete
  2. చిరునామా ఇవ్వబడినది.

    ReplyDelete