Saturday, June 30, 2012

తలకెక్కే తత్వాలు


తత్వగీతం: దీవి సుబ్బారావు
(తత్వగీతాల సంకలనం)
పేజీలు: 166,
వెల: రూ.100/-
ప్రతులకు: నవోదయ,
విశాలాంధ్ర పుస్తకాలయాలు;

పోతులూరి వీరబ్రహ్మంగారి పేరు చెప్పగానే అందరికీ ‘కాలజ్ఞానం’ముందు గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత బ్రహ్మంగారి తత్వాలు తలపునకు వస్తాయి. దీవి సుబ్బారావుగారు శ్రమకోర్చి బ్రహ్మంగారి తత్వాలను సేకరించి, పరిష్కరించి ప్రచురించారు. ఈ సేకరణలో వారికి మరి కొందరు పండితులు సాయం చేశారు. బ్రహ్మంగారి దారిలోనే తత్వాలు పాడిన సిద్దయ్య, లక్ష్మప్పల రచనలు కూడా ఈ సంకలనంలో చేర్చడం బాగుంది. వీటితోబాటు అజ్ఞాత గీత రచయితల తత్వాలు కూడా కొన్ని, సంకలనం చివరలో చేర్చారు. చదవడానికే కాక పాడడానికి కూడా అనువయిన తత్వాల రాగ తాళాల వివరాలను ప్రచురించడం మరింత ఉచితంగా ఉపయోగకరంగా ఉంది.

బ్రహ్మంగారి తత్వాలు వినడానికి ఎంతో సులభంగా ఉంటాయి. కాని వాటిలో యోగ విద్యకు సంబంధించిన వివరాలు సూచనలు నిండుగా ఉంటాయి. ఉదాహరణకు చాలా తత్వాలలో ‘బయలు’అనే మాట కనబడుతుంది. ఈ మాట అర్థాన్ని వివరింపబూనితే కొన్ని పేజీల గ్రంథమవుతుంది. ‘బయలూరికి పోవలెరా’ అంటారు బ్రహ్మము. అది మోక్షానికి గుర్తు. కుక్కను పట్టవలె, మూడు మూతల పెట్టెలో భూతము, పాము చిర్రున లేచుట, ఆరు కొమ్ముల ఏనుగు, అయిదు కోతులు, అయిదు మేకలు మొదలయినవన్నీ లోతయిన ప్రతీకలు. ‘నీళ్లలో మునిగి గొణుగుచు ఉంటే నిలకడ చెడును’ అంటారు బ్రహ్మము. చిల్లర రాళ్లకు మొక్కుచు ఉంటే అనే ఈ పాట వేరువేరు రకాలుగా అందరికీ పరిచయమయినదే.

ఊర్థ్వమూలం, అధశ్శాఖం అన్న మాటను సులభంగా ‘మొదలు మీదుగ, తలలు క్రిందగ’ వర్ణిస్తారు మరొక పాటలో. ఇక సిద్దయ్య పాటలలో ఏ కులమని నను వివరమడిగితే’అన్నది చాలా ప్రసిద్ధము. లక్ష్మప్ప తత్వం ‘ఎరిగినందుకు గురుతు ఎరుకయే సాక్షి’ ఆ తర్వాత అమరనారాయణ కైవారయోగి నోట కూడా ‘తెలిసినందుకు గురుతు’గా ప్రతిధ్వనించింది. ఇల్లు ఇల్లనియేవు, జీవులెనుబది నాల్గు లక్షల, ‘గూట చిలుక’ లాంటి తత్వాలు కూడా ఈ సంకలనంలో ఉన్నాయి.

ఇంకా బ్రహ్మంగారు, ఆయన శిష్యుల తత్వాలు మిగిలి ఉండవచ్చునంటారు సంపాదకులు సుబ్బారావు. తత్వాలంటే నిజానికి పాటలు. ఈ ప్రచురణలోని తత్వాలలో చాలాచోట్ల లయ (వరుస) కుదరడం లేదు. మూలంలో అట్లా ఉండడానికి వీలు లేదేమో? అర్థం పేరిట పరిష్కరణ కారణంగా ఈ తేడా వచ్చిందా? తత్వాలను పల్లవి, చరణాలుగా వేసినట్టు కనబడదు. ప్రతి చరణం తర్వాత పల్లవి రావాలి. చివరలో మాత్రం ఇచ్చారు. ఏమయినా, విషయంలో ఆసక్తిగల వారందరికీ ఈ పుస్తకం అవశ్యం పఠనీయం.

No comments:

Post a Comment