Sunday, June 17, 2012

సైన్సు.. బతుకు.. తీరు..


సైన్సు అంటే ఫ్రపంచం. సైన్సు అంటే జీవితం. ప్రపంచంలో, జీవితంలోనూ అందమయిన, ఆనందమయిన సంగతులుంటాయి. అంతకంటే ఎక్కువగా అందుకు వ్యతిరేకమయిన అంశాలు కూడా ఉంటాయి. అందుకే, సైన్సులోకూడా గొప్ప సంగతులుంటాయి. అవి ప్రపంచాన్ని గురించి పాఠాలు చెపుతాయి. కొన్ని సంగతులు మాత్రం భయంకరంగా ఉండి పాఠాలు చెపుతాయి. వాటిని పట్టించుకోకుండా బతకడం వీలుకాదు.

భూమి- విశ్వం:
మనిషి మొదట్లో ఈ విశ్వానికి తాను, తన భూగోళం కేంద్రం అనుకున్నాడు. ఇవాళటికీ భూమి స్థిరంగా ఉందని, సూర్యుడు తూర్పున ఉదయించి, పడమట అస్తమిస్తాడనీ అనుకునేవారు మన మధ్యన ఉన్నారు. కోపెర్నికస్ వచ్చి, భూమి మిగతా గ్రహాలతోబాటు సూర్యునిచుట్టూ తిరుగుతున్నదని అన్నాడు. అప్పటివారంతా ‘అర్థంలేని మాటలు’ అని కొట్టిపడేశారు. విశ్వానికి భూమి కేంద్రం కాదని అర్థం కావడానికి వందల ఏళ్లు పట్టింది. గెలిలెయో వచ్చి, దుర్భిణీ పెట్టి చూపించి విషయాన్ని వివరించసాగాడు. అప్పటివారికి చంద్రునిమీద గుంటలున్నాయంటే నచ్చలేదు. అసలు కొందరు టెలిస్కోపునే ఏవగించుకున్నారు. మతవాదులు గెలిలెయోను శిక్షలతో సత్కరించారు. సైన్సు నిజం చెపుతుంది. మనిషికి ఆ నిజం కనిపించడానికి సమయం పడుతుంది.

సూక్ష్మజీవులు:
అసలు కొంతకాలంవరకు ఈ సూక్ష్మప్రపంచం గురించి తెలియదు. తెలిసిన సూక్ష్మజీవుల ప్రపంచమంతా మనకు శత్రువులతో నిండి ఉందన్న భావం ఇంకా మిగిలింది. మన ఒంట్లో సూక్ష్మజీవులు ఉండి మనకు సాయం చేస్తుంటాయని చాలామందికి తెలియదు. సూక్ష్మజీవులను మందుల సాయంతో చంపడం ఒక పద్ధతి. సూక్ష్మజీవులనే వాడి వాటిని నాశనం చేయడం మరో పద్ధతి. టీకాలు లేకుంటే.. ఈ ప్రపంచం, ఈ జనాభా మరొక రకంగా ఉండేది. ఆటలమ్మ, మశూచి లాంటి వ్యాధులను వాటి ప్రభావాన్ని చూచిన వారికి తప్ప, ఈ సంగతి సులభంగా అర్థం కాదు. ఇక కొన్ని సూక్ష్మజీవులు మాత్రం అదుపు చేయడానికి వీలుగాని వేగంతో పెరుగుతున్నాయి.

ఇన్‌ఫ్లుయెంజా వైరసు అనుక్షణం మారుతూ పోతుంది. ఈ ఏడాది తయారుచేసిన టీకా మందు మరో ఏడాదిలో పనిచేయదు. స్ట్ఫాలోకోకస్ క్రిమి ఆసుపత్రులలో నిండి అందరినీ గజగజలాడిస్తున్నది. ఎబోవా, సార్స్, బర్డ్ఫ్లూ, స్వైన్‌ఫ్లూ లాంటి కొత్త వ్యాధులు బయటపడుతున్నాయి. క్షయవ్యాధి తిరిగి తల ఎత్తుతున్నదంటున్నారు. ఎన్ని రకాల మందులు వేసినా, తట్టుకుని పెరిగే క్రిములు వస్తున్నాయంటున్నారు. కొత్త శతాబ్దం వచ్చింది. పాత సమస్యలు మాత్రం మొండిగా కొనసాగుతున్నాయి. సైన్సు ముందుకు సాగుతున్నది. కొన్ని విషయాలలో మాత్రం గెలుపు కుదరడం లేదు.

తిండి తీరు:
మనిషి బతకడానికి తిన్నంతకాలం పరిస్థితి బాగానే ఉంది. కానీ, తిండిలో రుచి వెతకడంతో సమస్యలు పుట్టుకు వస్తున్నాయి. రుచికరమయిన తిండి ఏదీ ఆరోగ్యకరమైనది కాదనే పరిస్థితి వచ్చింది. మన దేశంలో తీపి, నూనె, నెయ్యి లాంటివి చాలామందికి విషాలుగా కనబడుతున్నాయి. అసలు తిండి తినకుండా బతకడం వీలయితే బాగుండుననే వారు ఉన్నారు. రుచిగల తిండి తింటే గుండె జబ్బులు, డయాబెటిస్, కొన్ని రకాల క్యాన్సర్లు క్రమంగా పెరుగుతాయని పరిశోధనల ద్వారా నిరూపిస్తున్నారు. మసాచుసెట్స్- యుఎస్‌ఏలో 1948లో 5000 మందితో గుండె- తిండి సంబంధం గురించి పరిశోధనలు మొదలయ్యాయి. అప్పటి వలంటీర్ల మనుమలు, మనుమరాండ్రతో ఇంకా ఈ సర్వే సాగుతున్నది. ఇంతకాలం పరిశోధించి వారు చెప్పింది ఒకటే సంగతి. రుచిగల తిండి మంచిది కాదు.. అని! అక్కడి వారు వేపిన మాంసం, ఐస్‌క్రీములు మరీ ఎక్కువగా తింటున్నారు. అవి అసలు పనికిరావని తినకూడదని పరిశోధకులు చెపుతున్నారు. పండ్లు, కాయధాన్యంలో రకాలు కొన్ని, నట్స్, రెడ్‌వైన్ మంచివని కూడా వారే చెపుతున్నారు.

మానవులు తిండి దొరకని కాలంలో, కేవలం కాయలు, పళ్లు ఏరుకుని, జంతువులను వేటాడి తిండి సంపాదించేవారు. అప్పుడు, కావలసినపుడు తిండి దొరికేది కాదు. ఉప్పు, కొవ్వు, చక్కెరలు దొరికినంత తినడం అప్పుడు మొదలయింది. అప్పుడవి తిన్నా నష్టం లేదు. కానీ, కూచుని కదలకుండా దినం గడిపే ఈ కాలంలోనూ అదే తింటామంటే కుదరడంలేదు. మనవారు నెయ్యి పోసుకుని తిన్నారు. అంతగాను శ్రమించారు. మనకు శ్రమ తెలియదు. నెయ్యి తినడం కుదరదు. సైన్సు ఎన్నో చెపుతుంది. మంచీ, చెడు తెలుసుకోవడం మనిషికి ఒకోసారి కష్టమవుతుంది.

జంతు జాతులు కనుమరుగు:
రకరకాల విషయాల ఆధారంగా గతంలో జరిగిన సంగతులను పరిశోధించే వారున్నారు. వాటిలో పాలియోంటాలజిస్టులు కూడా ఒక రకం. వారు జీవం చరిత్రను గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. జీవజాతుల చరిత్రలో ఇప్పటికి మొత్తం ఐదుసార్లు పెద్ద ఎత్తున జంతు, వృక్షాలు తుడిచిపెట్టుకుపోయినట్లు వారు లెక్కలు తీశారు. అంతరిక్షం నుంచి రాళ్లువచ్చి గుద్దుకుని, అగ్ని పర్వతాలు పేలి, లేక వాతావరణంలో పెద్ద ఎత్తున మార్పులు వచ్చి ఈ ప్రళయాలు జరిగాయి. ఇంకా కొన్ని కారణాలు కూడా ఉండి ఉంటాయి.

జంతు జాతులు నమూనా మిగలకుండా తుడిచిపెట్టుకుపోతాయంటే చాలామందికి నమ్మకం కుదరలేదు. మాస్టడాన్ అనే ఏనుగులాంటి జంతువు ఎముకలు కనిపించినపుడు, ఆ రకం ప్రాణి అడవులలో ఎక్కడో ఉండాలని అనుకున్నారు. కానీ, ఆ జాతి పోయి శతాబ్దాలయింది. ప్రస్తుతం ఆరవ ప్రళయం జరుగుతున్నదని పాలియోంటాలజిస్టులు అంటున్నారు. మనిషి జాతి ఒక ఖండం నుంచి మరో ఖండానికి వ్యాపించిన కొద్దీ పెద్ద జంతువులు నాశనమయిపోయినయి. అమెరికాలో మాస్టడాన్, ఆస్ట్రేలియాలో పెద్ద కంగారూ, యూరోపులో పొట్టి ఏనుగులు అందుకు ఉదాహరణలు. మనిషి ప్రస్తుతం వేటవల్ల, వాటి ఆవాస ప్రాంతాలను ఆక్రమించడం చేతనూ, వ్యాధులు ప్రబలడానికి కారణం కావడం వల్లనూ, ఎన్నో జంతు జాతుల వినాశనానికి కారణమవుతున్నాడు. కొన్ని మార్పులు చాలా కాలంపాటు జరుగుతాయి. అవి మనకు కనిపించవు, అర్థం కావు. వాటికి గల కారణాలు చటుక్కున తోచవు. అందులో మన ప్రమేయం ఉందని అసలే అర్థం కాదు. సైన్సు హెచ్చరిస్తుంది. అది మనకు అనవసరమనిపిస్తుంది.

ఐన్‌స్టైన్ సూత్రం:
శక్తిని నిర్వచించడానికి- ఈ ఈజ్ ఈక్వెల్‌టు ఎమ్.సి స్క్వేర్ అని ఒక సూత్రాన్ని ఐన్‌స్టైన్ ప్రతిపాదించాడు. ఇది నిజంగా, చాలా గొప్ప సమీకరణమని అందరూ చెపుతారు. అంత వరకు బాగానే ఉంది. అది నిజానికి మరో చిత్రమయిన అంశాన్ని సూచిస్తుంది. గొప్ప శక్తిని పుట్టించడానికి ఎక్కువ పదార్థం అవసరం లేదని, ఈ ఈక్వేషన్‌కు మరోలా అర్థం చెప్పవచ్చు. సీస్క్వేర్ అన్న పరిమాణంలో ఆ రహస్యం (అంత రహస్యమేమీ కాదది!) ఉంది. అది కాంతివేగం. సెకండుకు అది 186,282 మైళ్లు కదులుతుంది. ఆ అంకెను అదే అంకెతో గుణించాలి. (స్క్వేర్ అంటే అదే) వచ్చే అంకె 34,70,09,83,524. ఐన్‌స్టైన్ సూత్రాలు అర్థంగాక బుర్రలు బద్ధలు కొట్టుకున్న వారి లిస్టులో మనమూ చేరదామంటే సరే! కానీ ఇక్కడ ఒక విషయం మాత్రం సులభంగా అర్థమవుతుంది. ఒక మహానగరాన్ని క్షణాలమీద నాశనం చేయాలంటే, ఒక్క పిసరంత ప్లుటోనియం ఉంటే చాలు! ఐన్‌స్టైన్ సూచనను ఈ రకంగా అర్థం చేసుకున్నవారు ఎంతమంది? సైన్స్ ఎన్నో చెపుతుంది. వాటికి అర్థాలు, అన్వయాలు మనం వెతకాలి మరి!

మనమూ - మన మెదడు:
సైన్సు అనగానే ఫిజిక్సు, కెమిస్ట్రీ, జియాలజీ లాంటివే అందరికీ కళ్లముందు కదలాడతాయి. వాటి ప్రభావం, ప్రమేయం మన మీద ఉందని గమనించగలిగితే మరో రకంగా ఉంటుంది. అందుకే, మన సంగతి చూడాలని ప్రయత్నం. మన ప్రవర్తన, పద్ధతులు, భావాలు మొదలయినవి మన అదుపులో లేవు. మనకు అర్థం కావు అని పెద్ద పెద్ద పరిశోధకులంతా చెపుతూనే ఉన్నారు. ఆనందంగా, ఆహ్లాదంగా ఉన్నారంటే ఆనాడు బయట వాతావరణం సుఖప్రదంగా ఉన్నందుకట తెలుసా? పది రకాల రుచులను నాలుకకు అందించి, అందులో ఏది బాగుందని అడిగితే, అందరికీ, లేదా చాలామందికి మొట్టమొదటి రుచి గుర్తుకు వస్తుందట. మరీ తరచుగా కనిపించే వస్తువు లేదా మనిషి మీద ప్రేమ మరీ ఎక్కువవుతుందట. జంటల మధ్యన ఆకర్షణకు వాసనలు ఆధారమట. ఇక కథను మరోవైపు నడిపిస్తే మనం కారణం లేకుండా, తెలియకుండా కొందరు వ్యక్తులు, కొన్ని వస్తువులను అసహ్యించుకుంటాము. అందిన సమాచారానికి, మనకు నచ్చిన, అనుకూలమయిన అర్థాలు చెప్పుకుంటాము. అనవసరమైన సంగతులన్నీ మన దృష్టిని ఆకర్షిస్తాయి. జ్ఞాపకాలు అనుకుంటున్నవన్నీ మనకు మనం చెప్పుకుంటున్న సంగతులు మాత్రమే. అందులో చాలావాటిని నమ్మడానికి లేదని పరిశోధన పూర్వకంగా రుజువు చేశారు.
మనకు ప్రపంచ జ్ఞానం చాలా ఉందనుకుంటాము. సైన్సులోనూ ఎందరో మహామహులు కొత్తదారులు వేసి ప్రపంచం నడిచే తీరును, దిశలను మార్చారు. కాని, వారి ప్రవర్తన మాత్రం ఎవరికీ అర్థం కాలేదు!

సైన్సుకు అందని అంశాలలో మనిషి, మెదడు మొట్టమొదటివి!

అంతా కోతులమే!:
కోతులు మన తాతలు అంటే బాగుంటుంది. మనం కోతులం కాదులే! అనుకోవచ్చు. కానీ పరిణామక్రమం ఒక నాటిలో, వందేళ్లలో జరిగిన సంగతి కాదు. ఇంకా మనలో ఎంత కోతి శాతం మిగిలి ఉందన్నది అసలు ప్రశ్న!
భూ చరిత్రలో సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాలకు గుర్తింపు లేదు. మనకు ఈ సంగతి అర్థమయింది గనుక మనల్ని మనం ప్రత్యేక జాతిగా అనుకుంటున్నాము కానీ, కోతుల జాతి చరిత్రలో మనం ఇటీవలి మార్పు కింద లెక్క. చింపాంజీలకు, గొరిల్లాలకన్నా మనకు కొంచెం ఎక్కువ తెలివి ఉందేమో! కానీ ఈ కోతి మనసుకు కొంత మాత్రమే తెలుసు!
అందరూ జీవమంతా, వైవిధ్యంతో సహా, ఒకేనాడు పుట్టిందనుకున్నవాళ్ళే. డార్విన్ కూడా ఇలాగే అనుకున్నాడు. కానీ పరిశీలనల కారణంగా అభిప్రాయాలు మార్చుకుని పరిణామసిద్ధాంతాన్ని మనకు అందించాడు. ఒకటిన్నర శతాబ్దం గడిచింది గానీ, పరిణామం పద్ధతి మాత్రం ఇంకా అర్థం కాలేదు. మనం కోతులమంటే ఎవరికీ నచ్చదు. కానీ సైన్సు మాత్రం అదే నిజమంటున్నది!

ఆలోచనలు ఉన్నంత మాత్రాన సైన్సు సాగదు. సాగలేదు. అవగాహనలో లోతు అవసరం!

మనిషికి మనిషే శత్రువు:
ఈ సంగతి అందరికీ అనుభవంలో ఉన్నదే. వాతావరణం, నీరు, గాలి, ఆరోగ్యం లాంటివి సమస్యగా మారాయంటే, మన కారణంగానే కనుక, మనకు మనమే శత్రువులం. మానవ చరిత్రలో రాజ్యాలు, రాజుల గురించి చెపుతారు. కానీ మనిషి స్వభావం గురించి తక్కువగా మాత్రమే చర్చిస్తారు. ఒక తండ్రి, తన కొడుకుకు తిండి దొరకదని, తన శరీరాన్ని పీక్కుతినమన్నాడు. ఒక మహారాజు మరణించిన తరువాత కూడా, తనతో సిరిసంపదలను పాతి పెట్టించుకున్నాడు. ఆడ తోడును బలవంతంగా వెంటబెట్టుకు‘పోయిన’ కథలు మన దేశం, చైనాలలో ఉన్నాయి. నరబలి కథలు మనకు తెలిసినవే. ఆజ్‌టెక్ జాతి వారు ఒక మందిరం పారంభం కొరకు వేలాది మందిని బలియిచ్చారు. ఈ సంగతులలో నిజమెంతో, కథ ఎంతో చెప్పడం తేలిక! బైబిల్‌లో, గ్రీకు పురాణాల్లో, నార్స్ చరిత్రలో రోమన్ గాథలలో నరబలి నిండుగా వివరాలతో కనబడుతుంది. మనిషిని మనిషి చంపడం రకరకాలుగా సాగింది. కానీ, అదొక తంతుగా చంపడం కూడా సాగడం విచిత్రం! మనిషిని మనిషి తినడం అంతకన్నా విచిత్రం! ఇందులోని సైన్సు అర్థం కాదు. ఇందులో సైన్సు ఏమిటి అన్నా తప్పులేదు!

పర్యావరణం- వాతావరణం:
సులభంగా అర్థమయే సంగతులు కూడా మనకు పట్టడంలేదు. కార్లు, దీపాలు, మరెన్నో సౌకర్యాల పేరున ఇంధనాలను వాడుతున్నాము. కార్బన్‌డై ఆక్సైడ్ లెస్సగా పుడుతున్నది. భూవాతావణం మొత్తం వేడెక్కుతున్నది. ఫలితంగా మంచు కరుగుతున్నది. పూలు అకాలంగా, త్వరత్వరగా పూస్తున్నాయి. చల్లదనం పేరున, మనుషులు జంతువులు వలసపోతున్నారు!

మనం పుట్టించిన ఈ కాలుష్యం, మనం పోయిన తర్వాత వందల ఏళ్ల దాకా నిలిచి ఉంటుంది. అంటే ప్రభావాలు, మన వారిమీద కలకాలం కొనసాగుతాయి! నరబలి అంటే.. ఇదేమి సైన్సు అనవచ్చు. కాలుష్యం కూడా మరో రకం నరబలి కాదా?

విశ్వం - విస్తారం:
మనకు మన గురించి అర్థం కాలేదు. మన మనసు తెలియదు. మెదడు లోతు తెలియదు. కానీ ప్రపంచమంతా అర్థమయిందన్న భావం మాత్రం బలంగా ఉంది. ప్రపంచ జ్ఞానం అన్న మాటను అందరమూ గర్వంగా వాడుతుంటాము. ఈ విశ్వంలో మన ప్రపంచం ఒక చిన్న చుక్క! విశ్వం అన్నమాట వినగానే, చదువుకున్నవారికి, విశ్వం గురించి చదువుతున్నవారికి తోచేవి గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలు, బ్లాక్‌హోల్స్, తోకచుక్కలు, మరింత దుమ్ము మాత్రమే! ఇవన్నీ కలిసి విశ్వంలో నాలుగు శాతం కన్నా ఎక్కువ భాగం కాదంటే ఆశ్చర్యం కదా! మిగతాదంతా చీకటి అంటే డార్క్ వ్యవహారం. విశ్వంలో 23 శాతం డార్క్ మాటర్ ఉంది. మిగిలిన 73 శాతం డార్క్ ఎనర్జీ. వీటి స్వభావం గురించి తెలిసింది తక్కువ. డార్క్ పదార్థం కణాల గురించి కేవలం అభిప్రాయాలు మాత్రమే ఉన్నాయి. సమాచారం లేదు. ఇక డార్క్ శక్తి గురించి అసలేమీ తెలియదు. దీన్ని ‘సైన్సులో అసలు సిసలయిన మిస్టరీ’ అని వర్ణిస్తున్నారు. కానీ, ఈ డార్క్ వ్యవహారం ఆధారంగానే విశ్వం విస్తరిస్తున్నదని మాత్రం తెలుసు. ఈ విస్తరణ ఊహలకందని వేగంతో సాగుతున్నది. విస్తరణ సాగితే విశ్వం పలచబడుతుంది. చల్లబడుతుంది. కుప్పకూలుతుంది. అది బిగ్ బ్యాంగ్‌తో మొదలయిన కథకు చక్కని ముగింపు!

ఇది సైన్సు తీరు! విజ్ఞానం అంటే తెలివి. మనకు తెలిసింది తక్కువ అన్న తెలివి. ఆ కొంచెం తెలిసిన సైన్సు- అర్థం కాదంటారు. అవసరం లేదంటారు. ఏమిటిదంతా?

1 comment:

  1. chaalaa amsaalu chakkaga vivarinchaaru.
    rendu, moodu postluga chesivunte bhagundedemo sir,
    thank you.

    ReplyDelete