కంటికి ఎన్నో కనబడతాయి. చెవులకు ఎన్నో వినబడతాయి. ఈ కనిపించే వినిపించేదంతా సమాచారం. అందులో భాష ఉంది. భాష కాని సమాచారం కూడా ఉంది. మనసుకు ఎక్కనంత వరకు ఈ సమాచారమంతా కేవలం వెలుగు, ధ్వని మాత్రమే. మెదడును ఉపయోగించి వాటికి అర్థాలు వెతకాలి. అందుకు మనకు ముందుగా అనుభవం ఉండాలి. కనిపించేవీ, వినిపించేవీ అప్పటికే మనకు తెలిసి ఉంటే వాటికేదో అర్థం ఉంటే, అది తెలుస్తుంది. అందులో కొన్ని నమ్మకాలు, విలువలు, గుర్తున్న అంశాలు, గమ్యాలు, అవసరాలు మొదలయిన ఎన్నో విషయాల ప్రభావం కూడా తోడుగా ఉంటుంది. మన లోపలే బోలెడంత సమాచారం కుప్పగా పడి వుంటుంది. దాని ఆధారంగా, ఈ కొత్త సమాచారం సంగతి తెలుస్తుంది. ఒక అనుభవంలో నుంచి, సాధారణమయిన భావాలు, సంకేతాలు మెదడుకు అందుతాయి.
కనిపించే, వినిపించే సమాచారాన్ని అందించిన వారు ఒక ఉద్దేశ్యంతో, ఒక అర్థాన్ని ఊహించి సంకేతాలను తయారుచేసి ఉండవచ్చు. లేదా, ఆ సమాచారం దానంతటదే పుట్టి ఉండవచ్చు. కోపం తెలియజేయడానికి చేతిలోని వస్తువును కింద పడవేస్తే ఒక అర్థం. ఆ వస్తువు అనుకోకుండా కింద పడితే ఒక అర్థం. భాష తెలిస్తే ఒక అర్థం, తెలియని భాషయితే అది మరో అర్థం! సమాచారం అందగానే మనలోపల కొంత జల్లింపు జరుగుతుంది. పంపేవారుంటే, వారిలో కూడా ఈ జల్లింపు ఉంటుంది. ఒక వస్తువు, ఒక మనిషి కనబడితే, చటుక్కున గుర్తిస్తాము. ఆ తర్వాత వరుసగా జల్లింపు జరిగితే ఆ మనిషి, వస్తువు గురించి, సమయ సందర్భాల గురించీ అర్థమవుతుంది. గడియారం గంటకొట్టింది. అంటే ఒక పనికి వేళయిందని అర్థం. పాల మనిషి వచ్చాడు. అంటే గిన్నె తెచ్చి పాలు పట్టాలని అర్థం! ఈ సంగతులన్నీ అలవాటుగా అనుకోకుండా జరిగిపోతుంటాయి. వాటి గురించి మనం ప్రత్యేకంగా ప్రయత్నించి ఆలోచించనవసరం లేదు.
ముందుగా ఒక సంగతి తెలుస్తుంది. దాని కారణంగా మరేదో అర్థమవుతుంది. ఆ తరువాత చేయవలసింది, చెప్పవలసింది ఏదో ఉంటుంది. కొన్నిసార్లు ఏమీ చేయకుండా ఉంటేనే సరైన పనని కూడా అర్థమవుతుంది. వచ్చినది పాల మనిషి అనుకుంటాము. అతను వచ్చే టైం అయింది గనుక ఆ భావం. కానీ చూస్తే, అతను కాదు. మరోసారి, మామూలుగా వచ్చే పాలమనిషి కాదు, కానీ, ఈ వచ్చిన కొత్తమనిషి మాత్రం మనకు పాలు పొయడానికే వచ్చాడు. ఈ మాట అర్థం అయ్యేలోగా కొంత ఆలోచన ప్రయత్నం జరుగుతాయి. వచ్చినది పాల మనిషి కాదని తెలిస్తే, మెదడులో మరెన్నో ప్రశ్నలు, మరెన్నో అర్థాలు మొదలవుతాయి.
కొన్నిసార్లు ఈ ప్రశ్నలు, అర్థాలు అనుకున్నట్లు సాగవు. సమాచారానికి తప్పుడు అర్థాలు తోస్తాయి. సమాచారం మరీ ఎక్కువయినా తప్పుడు అర్థాలు పుడతాయి. లేక మొదట అందిన సమాచారం సరిగా మెదడుకు ఎక్కదు. సరయినది కాదు. మన ఆలోచనలు, అనుమానాలు మొదలయినవి నూరుపాళ్లు సరయినవి కాకపోవడం కూడా తప్పుడు అర్థాలకు కారణమవుతుంది.
బయట ఏదో పడింది. ‘అదేమిటి?’ అర్థం కాలేదు. ఇక మెదడులో ఆలోచనలు సుడులు తిరగడం మొదలవుతుంది. అప్పుడిక ఏదో శారీరకంగా చేయవలసి ఉంటుంది. వెళ్లి చూడాలి. లేక ఆ ధ్వని గురించిన మన అనుభవాలను వెదకాలి. అప్పుడు సంగతి తెలిసిపోతుంది.
ముల్లా నస్రుద్దీన్ యింట్లోనుంచి ‘దబ్’ అని ధ్వని వచ్చింది. పక్కింటి అతను వచ్చి ‘ఏమిటా చప్పుడు?’ అన్నాడు. ‘చొక్కా పడింది!’ అన్నాడు నస్రుద్దీన్. ‘చొక్కాపడితే అంత చప్పుడా?’ పక్కింటతను అనుమానంగా అడిగాడు. ‘అందులో నేనూ ఉన్నాను లేవయ్యా?’ నవ్వుతూ చెప్పాడు ముల్లా! అదీ, సంగతి! అర్థమయిందా?
అర్థం కాకుంటే, కొత్త అర్థం కొరకు ప్రయత్నించాలి. ఇది కొంచెం చికాకుగా ఉంటుంది. ఒక సిద్ధాంతాన్ని, లేదా కొన్ని సిద్ధాంతాలను ఊహించి, ఒక్కొక్క దాన్ని పరిశీలించాలి. ముల్లాను వదిలి మరేదో ఆలోచించండి. అర్థమవుతుంది. పని జరగకుంటే , మరెవరినో సాయం అడగాలి. ఆ మిగతా వారు ఏం చేస్తున్నారు, ఏమంటున్నారు గమనించాలి. అలవాటయిన వారయితే ముల్లాను అడగరు. అడిగి తప్పు చేసినా, అతను చెప్పింది విని ఊరుకుంటారు. మనం కొత్త వాళ్ళమయితే, కాసేపు తికమకపడి, ఆ తర్వాత అర్థం చేసుకుంటాము. చివరకు ఏమీ జరగనట్టే, మనదారిన మనం పోతాము.
అసలు మీకు ముల్లా తెలుసా? అతగాడిని ఇదివరకెప్పుడయినా చూచారా? పలకరించారా? ఇవేవీ జరగకుంటే ఒక తీరు. అంతంతగా గుర్తుంటే మరొక తీరు. బాగా తెలిసి ఉంటే అసలే వేరు! ముల్లాలాగే ఉన్నాడు. అతనేనా? కాదా? అనుమానం మొదలయిందనుకోండి. అది మరింత గజిబిజి. ముల్లా యింటికి ఎవరో పరుగెత్తుకు వచ్చారు. బజార్లో ముల్లా గాడిదమీదనుంచి పడి మతితప్పి ఉన్నాడని, వాళ్లావిడకు చెప్పడానికి వారు వచ్చారు. కానీ, ఇక్కడ ముల్లా లక్షణంగా అరుగుమీద వాలి ఉన్నాడు. వాళ్లు ఖంగుతిన్నారు. ‘ఏమిటి?’ అన్నాడు నస్రుద్దీన్. వాళ్లు సంగతి వివరించారు. ‘ఆ పడినవాడి తలపాగా ఏ రంగు?’ అన్నాడు ముల్లా. ‘ఎరుపు’ అన్నారు వచ్చినవారు. ‘అయితే నేను కాదు! నా దగ్గర ఎర్ర తలపాగా లేదు!’ అన్నాడు ముల్లా నిదానంగా! అదీ సంగతి. అర్థమయిందా?
అర్థం కాకుంటే మీరు చేసే సిద్ధాంతాలను గురించి మరో వ్యాసం రాయవచ్చు. అన్నిటికంటే ముందు మిమ్మల్ని మీరు గిల్లి చూచుకోవాలి. లేదా పిచ్చెత్తి పరుగెత్తాలి! సరదా సంగతి పక్కన పెడితే, మనకు అర్థమయిన సంగతిని బట్టి మన భావాలు, ఆవేశాలు మారిపోతాయి. ఇది ఏ సమాచారం గురించి అయినా ఒకటే. ఇందాక కిందపడింది మీ వస్తువు, మీ అభిమాన వస్తువని తెలిస్తే కోపం రావడం సహజం కదా! ఎమోషన్ మారితే అర్థాలు మారతాయి. అర్థాలతో ఎమోషన్ మారుతుంది. మీ పుస్తకం కిందపడింది. పాడయింది. ఎదుటివారు ఏమీ జరగనట్లున్నారు. వారు మీకు విలన్‌లాగా కనబడతారు. మీ విలువలు, నమ్మకాలు, జ్ఞాపకాలు అన్నీ కలిసి చుట్టుముట్టి, కందిరీగలాగా రొద చేస్తాయి. కొంతకాలం వరకు ఏదీ సరిగా అర్థం కాదు. అసలు జరిగింది ఏమిటో గుర్తుండని స్థితి వస్తుంది. అప్పుడిక అందిన సమాచారానికి అర్థం వెతికే రూటు మారుతుంది.
మామూలు సమాచారం అర్థం కావడంలో ఇంత గొడవ ఉందని ఎప్పుడయినా ఆలోచించారా? ఇక వికాసం అర్థమయిందో లేదో ఆలోచించే తీరు వెదకాలి. అర్థమయిందా?
అగ్ని ప్రళయం
అనగనగా ఒకతను. అతను యిద్దరు అమ్మాయిలను ప్రేమించాడు. ఇద్దరినీ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆ ఇద్దరేమో నిజానికి పక్షులు. కిలకిలా గలగలా నవ్వి వెళ్లిపోయాయి. మనిషి ఉత్తరంగా వెళ్లాడు. ఒక బోటు తయారు చేసుకున్నాడు. ప్రపంచానికి నిప్పంటించాడు. తాను మాత్రం బోటెక్కి తప్పించుకుపోయాడు.
అగ్గి అడవులంతా పాకింది. అతివేగంగా పాకింది. దక్షిణంగా సాగింది. మనుషులు, చెట్లు, రాళ్లు, జంతువులు, నీళ్లు అన్నింటినీ మసి చేసింది. చివరకు భూమిని కూడా!
మరీ దక్షిణంలో ఉండే అడవి కుక్క అగ్గిని చూచింది. చిటపటలు విన్నది. తప్పించుకోవాలని పరుగులు పెట్టింది. కుదరలేదు. కనుక అగ్గిని ఆర్పాలని ప్రయత్నించింది. ఇద్దరు అబ్బాయిలను సంచిలో వేసుకుని ఉత్తరంగా ఉరికింది. పొగమంచును నోట్లోకి తీసుకుని, నిమిలి ఊసింది. మంట ఆరిపోయింది. మంటయితే పోయింది కానీ, నీళ్లు లేవు. కుక్కకు దాహంగా ఉంది. అది పటికబెల్లం నమిలింది. మరింత పటిక బెల్లం తెచ్చి, గుంట తోడి పూడ్చిపెట్టింది. అదంతా నీరయి లోయ నిండిపోయింది. అంటే మళ్లీ నీరొచ్చింది.
ఇద్దరు అబ్బాయిలు ఏడవసాగారు. వారికి మనుషులెవరూ కనబడలేదు. కుక్క పుల్లలతో ఇల్లు కట్టింది. పుల్లలను చీల్చి నిలబెట్టింది. రాత్రి గడిచేసరికి పుల్లలన్నీ పిల్లలుగా మారాయి.
కథ కంచికి. మనం ఇక్కడే!
ఇంతకూ అర్థమయిందా? ఇది మరీ మరీ పాత కథ. అప్పటి ఆలోచనలు ఇట్లాగే ఉంటాయి.
అసలు మాట!
- 23/05/2012
ఈ విశ్వం మొత్తానికీ, అసలు అర్థం లేకుంటే, దానికి అర్థంలేదని మనకు అర్థమయి ఉండేది కాదు. ఈ విశ్వంలో వెలుగే లేకుంటే, కనుక కళ్లున్న జీవులే లేకుంటే, అది చీకటని మనకు తెలిసేది కాదు. చీకటంటే, ఆ మాటకు అర్థం ఉండేదికాదు. -సి.ఎస్.లెనిన్
అర్థమయిందా? అయిందనుకుంటే అయింది. అర్థం కాదనుకుంటే, అర్థం కాదన్న సంగతి మనకు అర్థం కాదు!
అర్థమయిందా? అయిందనుకుంటే అయింది. అర్థం కాదనుకుంటే, అర్థం కాదన్న సంగతి మనకు అర్థం కాదు!
జాగ్రత్తగా గమనించండి. అది వాతావరణం గురించి కాదు. జీవితంలో జరుగుతున్న సంఘటనల సంగతి అంతకన్నా కాదు. వాటికి మనమిచ్చే అర్థాలమీద అంత ఆధారపడి ఉంది. వాటికి మనమిచ్చే అర్థాలను బట్టి, మనం ఇవాళ ఉన్న తీరు, రేపు ఉండబోయే తీరు తేలుతుంది. -టోనీ రాబర్ట్స్
‘మనిషి’ అంటే అర్థాలు వెదుకుతున్న ఒక జీవి- ప్లేటో!
అర్థమయిందా? ప్రతిదానికి అర్థముండాలన్నా, అవి అర్థం కావాలన్నా కష్టం మరి!
No comments:
Post a Comment