Sunday, October 21, 2012

మన గురించి మనం - మరోసారి!


చెప్పాలా ప్రత్యేకంగా
మాట్లాడాలన్న ఆలోచన మనిషికి ఎందుకు కలిగిందో ఆశ్చర్యం కదూ?
మాటలు అంటే ఏవో చప్పుళ్లని కదా అర్థం!
ఈ అర్థం అన్నమాటతోనే అన్నీ అనర్థాలు వస్తాయి.
భాష అని ఒకటి ఎట్లా ఎందుకు పుట్టింది. ఈ భాష మనిషి బతుకులో చాలా ముఖ్యమయిన అంశంగా మారింది.
మనమేవో ధ్వనులు చేస్తాం. అవి మిగతా వారికి అర్థమవుతాయి. అన్ని చప్పుళ్లూ అర్థమవుతాయా అది చిక్కు. చప్పుళ్లకు అర్థం ఉండాలి. అప్పుడే అవి అర్థమవుతాయి. పదాలు, వాటితో భాష ఉండాలి. అప్పడే అవి మాటలవుతాయి. అవి కూడా అందరికీ అర్థం కావు. ఆ భాష తెలిసిన వారిక మాత్రమే అర్థమవుతాయి. ఒక రకమయిన ధ్వనుల కూర్పుతో ఒక అర్థం పుడుతుంది. అది ఒక మాట అనిపించుకుంటుంది. చిత్రంగా ఒకే మాటకు రకరకాల అర్థాలు ఉండవచ్చు, ఒకే మాట అనుకున్నది ఒకే మాట కాకపోవచ్చు కూడా. అంటే గింటే, భాష తెలియాలంటే మాటలకున్న అర్థాలు తెలిసి ఉండాలి. తప్పదు.

వింత ఏమిటంటే, ఏ మాటకు ఏ మాటకు ఏమి అర్థం అన్న సంగతి ఎట్లా తెలుస్తుంది. ఈ అర్థమన్నది ఎక్కడుంటుంది. మాటకు ఒక నిడివి ఉంది. ప్రేమికుని మాట ముడుచుకుంటే వాని మనసు, విచ్చుకుంటే మొత్తం ప్రపంచం అని అర్థం వచ్చే కవిత ముక్క ఒకటి ఉరుదూలో ఉంది. ఇలాంటి అర్థం కొలతలు లేనిది. ఎక్కడ ఉందో తెలియదు. పాలు అన్నాము. అది తెలుగే. ఆ మాటకు ఛందస్సు ప్రకారం ఒక నిడివి ఉంది. అది ఒక రకమయిన ధ్వని రూపం. ఒక క్రమంలో వచ్చిన ప్రకంపనాల క్రమం అది. స్ట్రోబోస్కోపు అనే పరికరానికి ఆ ధ్వని రూపం తెలుస్తుంది. దాని స్థలం, కాలం, కదలిక, ధ్వని  పరిమాణాలు ఇట్లా ఎన్నో లక్షణాలు తెలుసుకోవచ్చు. మరి దాని అర్థం ఏమిటి అంటే చిక్కు మొదలవుతుంది. పాలు అంటే పశువులిచ్చే పాలు. ఆవుపాలు, బర్రెపాలు, అవి కూడా జున్నుపాలు, గుమ్మపాలు ఏవయినా కావచ్చు. మర్రిపాలు కూడా పాలే. అందిన పాలల్లో మీరూ నేనూ పాలు పంచుకోవచ్చు. అర్థం కాకపోతే నాకేమీ పాలుపోలేదని నేననవచ్చు. రాజుగారు లేదా నాయకులు దేశాన్ని పాలించడంలో పాలున్నాయి గదా. అని ఏ రకం. ఒక గురువు ఒక లఘువు కలిసిన చిన్న మాటకు ఇన్ని అర్థాలా అంటే కథ ముగియలేదు. ఇంకా ఎన్ని ఉన్నాయో తెలుసుకోవలసి ఉంది. మాటకు కొలతలకు అందే లక్షణాలు కొన్ని మాత్రమే. అందులో అర్థం మాత్రం లేదు. ధ్వనితో ఒక అర్థం మనసులో మెదలాడవచ్చు. కానీ ఆ ధ్వనితో గానీ, లో గానీ ఆ అర్థం ఉండదు.

తమిళులకు పాల్ అంటే చాలు ఒక అర్థం తోస్తుంది. అర మాత్ర తగ్గినా అర్థం అదే. కన్నడిగులకు హాలు అంటే అర్థమవుతుంది. అక్షరం మారింది. హాలు అంటే మనకు ఇంగిలీషు పుణ్యమా అని మరో అర్థం తోస్తుంది. అక్కడ మనకు పాలు అనే అర్థం తోచక పోవడానికి కారణం మన చెవులు మాత్రం కావు. అవి తమ పనిని లక్షణంగా చేస్తున్నా సరే అర్థం తోచదు. మిల్ష్ అంటే ఏమి తోచింది. మిల్క్ లాగే ఉందని కదా. జెర్మనులు మిల్క్ బదులు మిల్ష్ అంటారు. చెవులకు బౌతికమయిన ధ్వని మాత్రమే తెలుస్తుంది. మన చెవులు లక్షణంగా పని చేస్తున్నా సరే, మరేదో భాషలో పాల గురించే అడిగినా వెర్రిమొగం మన వంతవుతుంది.

అదే మాటలతో వచ్చిన చిక్కు.

పాల గురించి ఇంత చెప్పుకున్న తరువాత ఒక అనుమానం. దుగ్ధం అంటే కూడా పాలే. క్షీరం అన్నా అదే అర్థం మరి. ఇన్ని భాషలలో ఇన్ని మాటలు. అన్నిటికీ ఒకటే అర్థం. మరి ఈ అర్థం ఏ భాషలో ఉంది. అది అసలు ప్రశ్న.

అర్థానికి భాష లేదు.

భాషలో మాటలకు మాత్రమే అర్థం ఉంది. లేదా అర్థాలున్నాయి.
మాటల భావం తెలియాలంటే తెలియనిదేదో తెలిసి ఉండాలి.
అందనిదేదో అంది ఉండాలి.
నైరూప్యమయిన భావం తెలిసి ఉండాలి.
ఈ సంగతి గురించి మనం ఇంతకు ముందు ఎప్పుడయినా ఆలోచించామా?
ఆలోచన మనకు అలవాటు లేదు కదా!
చెప్పింది వినడం మాత్రమే తెలిసిన మొద్దబ్బా(మ్మా)లము కదా మనము.
అంటే గింటే ఏదయినా చెయ్యడం సులభం. దాని గురించి చెప్పడం కష్టం అని తేలిందా?
మన గురించి మనం ఆలోచిస్తేనే ఇంత గందరగోళం ఉందే!
ఇక మిగతా సంగతుల గురించి పట్టించుకుంటే ఏమవుతుంది.

No comments:

Post a Comment