ఎవరయినా కంటికి ఫురుగులాగా కనబడుతున్నారంటే- అలుసయినట్లు కదా అర్థం!
పురుగులు బోలెడుంటాయి. ఊరికే చనిపోతాయి. అయినా బోలెడుంటాయి. ఈ ప్రపంచంలో అన్నింటికన్నా ఎక్కువ సంఖ్యలో ఉండే జీవులు కీటకాలే. అంతగా విజయవంతంగా బతుకున్నాయంటే, వాటి నిర్మాణంలో, బతుకు తీరులో ఎంతో పరిణతి, వైవిధ్యం ఉంటుందని అర్థం. హెలికాప్టర్‌ను చూస్తే తూనీగలాగా కనబడుతుంది. వెస్పా అనే స్కూటర్‌కు కందిరీగ పేరు పెట్టారని అందరికీ తెలియకున్నా తప్పులేదు. పురుగులను, వాటి నిర్మాణాన్ని మనిషి అనుకరించి రకరకాల అవసరాలకు వాడుతున్నాడు. ఒక్క పురుగులేగాక ఎన్నో జంతువులు, మొక్కలు మనిషి తెలివికి పదునుపెట్టాయి. ఆ పదును కారణంగా బయో మిమిక్రీ అనే రంగం పుట్టింది.
పరిణామక్రమంలో జంతు, వృక్షాలు మారుతూ మారుతూ బతుకు సుఖంగా సాగడానికి అనువయిన క్షణాలను పెంచుకున్నాయి. పక్షుల ముక్కులు, పురుగులు, పక్షి రెక్కలు మొదలు ఎన్నో లక్షణాలు మనిషి సాంకేతిక ప్రగతికి
ఆధారాలయినాయి. మార్క్ మైల్స్ అనే యువ పరిశోధకుడు మైక్రో ఎలెక్ట్రో మెకానికల్ అండ్ మెటీరియల్ ప్రాసెసింగ్ అనే రంగంలో పనిచేస్తున్నాడు. అదేమిటో అర్థం చేసుకోవడానికి మనకు సమయం పడుతుంది. పదార్థం నిర్మాణంలో సూక్ష్మ వివరాలు అనుకుని ముందుకుసాగుదాం. అతను పరిశోధన పత్రికలను సీరియస్‌గా చదువుతున్నాడు. సీతాకోకచిలుక రెక్కలు, వాటిలో రంగులను గురించిన వ్యాసం ఒకటి అతడిని ఆకర్షించింది. కొన్ని సీతాకోకచిలుకల రెక్కలు నీలం రంగుతో మెరిసిపోతుంటాయి. రంగులు ఎక్కడ కనిపించినా వాటికి ఆధారంగా కొన్ని రసాయనాలు ఉంటాయని అందరికీ తెలిసే ఉంటుంది. ఈ నీలం రంగు మాత్రం రసాయనంలో నుంచి రావడం లేదు. ఇక్కడ భౌతిక శాస్త్రం ఉంది. ఈ రకం రంగులు పదార్థం నిర్మాణం కారణంగా వస్తాయి. సీతాకోక చిలుక రెక్కలమీద చాలా చాలా చిన్న పలకలు అమర్చి ఉంటాయి. వాటి ఆకారం, వరుస, మధ్య దూరం అన్నీఒక పద్ధతిలో ఉంటాయి. వెలుగు వాటి మధ్యన ప్రతిఫలిస్తూ రంగులు కనబడడానికి కారణమవుతుంది. ఇక్కడ ఆ రంగు నీలంగా ఉంది! రసాయనం అంటే పిగ్మెంట్ ఆధారంగా ఈ రకం నీలం తళతళ పుట్టాలంటే ఎంతో శక్తి అవసరమవుతుంది. అరుదుగా దొరికే శక్తిని సీతాకోక చిలుక తన రంగుల ప్రదర్శనకు వాడటంలేదు. ఆ శక్తి ఎగరడానికి తిండి వెదకటానికీ, పిల్లలను కనడానికి పనికివస్తుంది. అందుకే అది రంగు కోసం ఫిజిక్సును పట్టుకుంది.
ఈ పద్ధతితో మనం కూడా రంగులను పుట్టించవచ్చునని మైల్స్‌కు ఆలోచన పుట్టింది. ఎలెక్ట్రానిక్స్ రంగంలో పలుచని పరికరాల్లో రంగులు అవసరమవుతాయి. మైల్స్ వెంటనే రంగు పరికరాలను తయారుచేసే కంపెనీ పెట్టాడు. త్వరలోనే క్వాల్‌కామ్ అనే కంపెనీవారు దాన్ని కొన్నారు. ‘మిరాసోల్ డిస్‌ప్లే’ అనే పరికరంలో రంగు పద్ధతిని వాడుకుంటున్నారు. ఆప్టికల్ ఇంటర్‌ఫీరెన్స్ అనే పద్ధతితో గాజుపలకల కింద, కదిలే చిన్న చిన్న అద్దాలను ఏర్పాటు చేస్తారు. అద్దాలు పదినుంచి యాభయి చదరపు మైక్రాన్లు మాత్రమే ఉంటాయి. అవి కిందకు, మీదకూ కదులుతూ మైక్రో సెకెండ్స్‌లో రకరకాల రంగులు కనిపించడానికి కారణమవుతాయి. సీతాకోకచిలుక రెక్కలలోని పలకలమీద ఏ రంగూ లేని కాంతి పడుతుంది. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఆ సూర్యకాంతి చూస్తుండగా రకరకాల రంగులను వెదజల్లుతుంది. మనకు తెలిసిన ఎల్‌సీడీ డిస్‌ప్లేలో కూడా రంగులు కనబడతాయి. ఈ రకం టెలివిజన్‌లు, మానిటర్‌లు మామూలయిని. కానీ, వీటిలో కరెంటు సాయంతో రంగు, వెలుగు పుట్టాలి. మిరాసోల్‌లో మాత్రం స్వంత వెలుగు లేదు. ఉన్నది సూర్యకాంతి మాత్రమే. బయట వెలుగు ఎంత బలంగా ఉంటే, అందులోని రంగులు కూడా అంతగా తళతలాడతాయి. ఎల్‌సీడీకి అయ్యే కరెంటు ఖర్చులో పదవ వంతుతో ఇక్కడ, ఇంకా మంచి రంగులు కనబడతాయి. ఈ పద్ధతినివాడి క్వాల్‌కామ్ వారు ఈ-రీడర్ (కిండిల్ లాంటి పుస్తకాలు చదివే పరికరం) తయారుచేశారు.
టెక్నాలజీని మిగతా వారికి అందజేస్తున్నారు కూడా. జీవుల శరీర నిర్మాణం ఆధారంగా పరికరాలు రావడం కొత్త మాత్రం కాదు. కొన్ని రకాల మొక్కల విత్తనాలు మన శరీరానికి, దుస్తులకు అంటుకుపోతుంటాయి.వాటిని తీయడానికి వేళ్ళతో ప్రయత్నిస్తే వేళ్లకు పట్టుకుంటాయి. వీటిలో వంకర తిరిగిన ముళ్లలాంటి భాగాలుంటాయని గమనించారు. వాటి ఆధారంగా 1955లోనే ‘వెల్‌క్రో’ పుట్టింది. సంచులు, దుస్తులు, షూస్‌లో బెల్టులు, జిప్‌ల బదులు చిరచిరలాడుతూ ఊడివచ్చి, అదిమితే మళ్లీ అతుక్కునే ‘వెల్‌క్రో’ అందరికీ తెలుసు. దాని వెనుక కథ మాత్రం తెలియదు. కొన్ని రకాల గడ్డి మొక్కలు గాలిలో కదిలే తీరునూ, నిటిలస్ అనే సముద్ర జంతువు శంఖం నిర్మాణాన్ని ఆధారంగా, పారిశ్రామిక పంఖాలను తయారచేశారు. ఒంటె తన ముక్కులో తేమను సేకరించుకునే తీరు ఆధారంగా, ఖతార్ దేశంలో ఒక గ్రీన్‌హౌస్‌ను పనిచేయిస్తున్నారు. పదార్థ నిర్మాణం మరీ చిన్నదయిన నానోస్కేల్‌కు చేరుతున్నది గనుక ఇప్పుడు మరెన్నో విచిత్రాలు రానున్నాయి.
బయో మిమిక్రీ అన్నది ఒక పదార్థం కాదు. అదొక పద్ధతి. మన దేశంలోనే కొండ ప్రాంతాలలో కడుతున్న ఒక ఆధునిక నగరంలో వర్షాలను ఆకర్షించే పద్ధతిలో ఆకురాలు చెట్లను నాటారు. అక్కడ వర్షం రాకపోవడమనే ప్రశ్న ఉండదంటున్నారు. మర్రి ఆకుల ఆదర్శంగా ఇంటి పైకప్పు మీద పెంకులను అమర్చి, వర్షం నీటిని సేకరించే ప్రయత్నం జరుగుతున్నది. చీమల పుట్టలు ఆదర్శంగా తడవని గోడలు కడుతున్నారు. లవాసా అనే ఈ నగరం 2020 నాటికి పూర్తి అవుతుంది. అది మూడులక్షల మందికి ఆశ్రయమిస్తుంది.
మనిషి కారణంగా వాతావరణం పాడవుతున్నదని అందరూ గుర్తించారు. ఆ రకం ప్రభావం తగ్గించాలన్న ఆలోచన మొదలయింది. ప్రకృతివల్ల పడే ప్రభావం మరొకరికి సాయంగా ఉంటుంది. మన నగరాలు కూడా ఆ రకంగా ఉండవచ్చునన్న ఆలోచన ఈ మధ్యన మొదలయింది. నగరాల్లో కురిసిన వర్షం, అక్కడి మురికి, చెత్తలను వెంట తీసుకునిపోయి, ఏదో ప్రవాహంలో కలుస్తుంది. ఆ నీరు మరింత పరిశుభ్రంగా, ప్రవాహంలో కలిస్తే బాగుంటుందన్న ఆలోచన, అందుకు తగిన ప్రయత్నాలు సాగుతున్నాయి.
అడవులు తగలబడుతుంటే పైన్ చెట్లు, యూకలిప్టస్ చెట్లు విచిత్రంగా తప్పించుకుంటాయి. యూకలిప్టస్ బెరడు ఊడి పడిపోయి బోదెను కాపాడుతుంది. ఈ పద్ధతి ఆధారంగా మంటకు తట్టుకునే గుడ్డను తయారుచేశారు. పీతలు, రొయ్యల శరీరంలోనుంచి ఒక రసాయనాన్ని గమనించి, అదే పద్ధతిలో మరో గుడ్డను తయారుచేశారు. ఇందులోని ఒక రసాయనం పొర మంటను అడ్డుకుంటుంది. పక్షులు, పురుగుల నుంచి నేర్చుకోవలసింది మరెంతో ఉందంటారు సైంటిస్టులు. సీతాకోకచిలుకల నుంచే మరెన్నో పాఠాలు అందుతున్నాయి. ఒక రకం సీతాకోకచిలుక రెక్కల మీద నల్లని మచ్చలుంటాయి. అవి సూర్యరశ్మిని బాగా పీల్చుకుంటాయి. వాటి నిర్మాణాన్ని గమనించి, అనుకరించి మరింత బాగా పనిచేసే సోలార్ టెక్నాలజీని సిద్ధం చేస్తున్నారు.
ప్రస్తుతం నకిలీ వస్తువులను తయారుచేసి మోసగించే ప్రయత్నాలకు సమాధానంగా, మంచి ఉత్పత్తుల మీద హోలోగ్రామ్‌లను పెడుతున్నారు. అదే రకమయిన హోలోగ్రామ్‌లను దొంగచాటుగా తయారుచేయడం కుదరదు. సీతాకోకచిలుకల రెక్కల నిర్మాణం ఆధారంగా, త్వరలోనే, హోలోగ్రామ్స్‌కన్నా మంచి పద్ధతి రానున్నదని చెపుతున్నారు. అందంగా దుస్తులు వేసుకున్న అమ్మాయిలను సీతాకోక చిలుకలు అనడం తెలుసు. ఇప్పుడు సిడ్నీలో ఒక ఫాషన్ డిజైనర్, రంగులులేని మార్ఫోటెక్స్ అనే గుడ్డను తయారుచేయించాడు. అది వెలుగులో రకరకాల రంగులతో మెరుస్తుంది. ఇంతకంటే చక్కని మిమిక్రీ ఇంకేముంటుంది?
No comments:
Post a Comment