Tuesday, October 30, 2012

సమయం కుదిరితే...

ఎవర్ని ఏ పని సాయం అడిగినా సమయం లేదంటారు. నిద్ర గురించి కూడా ఆలోచించకుండా, పనిచేసినా సమయం సరిపోవడం లేదు. ఇక సైన్సులోకి వెళ్లి అడిగితే- వాళ్లకు సమయం సమస్య మరో రకంగా ఎదురవుతుంది. రెండు రసాయన పరమాణువులు కలిసి ఒక అణువు పుట్టడానికి పట్టే సమయం ఒక పికో సెకండ్. అది నిజంగా ఎంత నిడివి ఉన్న మాట మనకు తోచదు. కన్ను రెప్పపాటు- మనకు తెలిసిన చిన్న కొలత. ఒక కొండ పుట్టడానికీ, రెండు గెలాక్సీలు కొట్టుకోవడానికి పట్టే సమయం ముందు మన కనురెప్ప పాటు అలాంటిదే. నిజానికి సైన్సు అనుకుంటున్న విషయాలు జరగడానికి పట్టే కాలం మనిషి జీవనకాలానికన్నా చాలా ఎక్కువ. పరిశోధకులు తరతరాలుగా ఒకే అంశం గురించి పరిశోధిస్తున్నారంటే ఆశ్చర్యం లేదు. 1920 ప్రాంతంలో మొదలయిన కొన్ని పరిశోధనలు అక్కడే, ఆ పరిశోధన శాలల్లోనే ఇంకా కొనసాగుతున్నాయి. ఆ ఆలోచన మొదలుపెట్టిన వారు పోయారు. చరిత్రలో ఒక అంశం గురించి మరీ చాలా కాలంపాటు సమాచారం సేకరించి పరిశీలించిన సందర్భానికి ఉదాహరణ బహుశః ఖగోళ శాస్త్రంలో ఉంది. ప్రాచీన నాగరికతలయిన బాబిలోన్ లాంటి చోట్ల మొదలయిన సమాచార సేకరణ ఇంకా సాగుతున్నది. సాంకేతిక శక్తి మారిందని, ఆ తరువాత వచ్చిన సమాచారాన్ని పాత పద్ధతి సమచారానికి కలపడానికి వీలు లేదన్నా సరే, కనీసం ఆరు వందల సంవత్సరాలపాటు పాత పద్ధతి సమాచార సేకరణ జరిగింది. గ్రహణాలు మొదలయిన సంగతులను గురించి మన దేశంలో, ఆసియా దేశాలలో కూడా ఈ రకమయిన సమాచార సేకరణ జరిగింది.

ఇప్పటికీ పరిశోధకులు కొన్ని ప్రయోగాలకు తమ జీవితకాలం సరిపోదు అంటారు. నిజంగా సమయం సమస్య కాకుండా ఉంటే, ఏ రకం పరిశోధనలు వీలవుతాయని వారిని ప్రశ్నించారు. మీరే వెయ్యి, పదివేల సంవత్సరాలు ఉండగలిగితే, ఏ రకం ప్రయోగాలు చేస్తారని ప్రశ్న. జవాబు రావడానికి ఒక చిక్కు ఎదురవుతుంది. అంతకాలం గడిచేలోగా సాంకేతిక వనరులు, పద్ధతులు మారిపోతాయి. అవి మారకనే ఇప్పటి సదుపాయాలతో, ఎక్కువ కాలం జరగవలసిన పరిశోధనలు ఎన్నో ఉన్నాయని తెలిసింది.

* జీవం పుట్టుక: మిల్లర్, ఉరే అనే పరిశోధకులు 1950 దశకంలో జీవం పుట్టుక గురించి ఒక సిద్ధాంతం చేశారు. పరిస్థితులు అనుకూలంగా ఉంటే జీవం పుట్టుకకు అవసరమయిన అమైనో ఆమ్లాల వంటి రసాయనాలు వాటంతటవే పుడతాయన్నారు. ఈ రకం రసాయనాలు అంతరిక్షం నుంచి వచ్చాయన్నవారు కూడా ఉన్నారు. వాటంతటవే పుట్టడం గురించి పరిశోధించాలంటే తగిన పరిస్థితులు కల్పించి, తగిన రసాయనాలను చేర్చి, తేలికగా వాటిని పరిశీలించాలి. అది అనుకున్నంత సులభం కాదు. పదివేల సంవత్సరాలు వేచి చూస్తే, నిజంగానే జీవ రసాయనాలు పుట్టవచ్చు. మొదట్లో జీవం పుట్టడానికి అంతకన్నా ఎక్కువ కాలమే పట్టి ఉండవచ్చు. తమంత తాము పుట్టి, తమ వంటి రసాయనాలను తయారుచేయగలగడం జీవ రహస్యమన్నది అర్థమయిన విషయమే.

భూమి, దాని మీద పరిస్థితులు, రసాయనాలు, గతంలో ఎప్పుడో ఉన్నప్పటి తీరుగా ఏర్పాటుచేయాలి. భూమి మీద అలనాటి పరిస్థితులలో లక్షల రకాల రసాయనాలు ఉండి ఉంటాయి. అవి అంతులేని రకాలుగా కలిసి, ఎన్నో ప్రయోగాలు జరిగి ఉంటాయి. ఆ రసాయనాలు తగినంతగా ఉంటే, అవి కలవడానికి వీలు కలుగుతుంది. తక్కువగా ఉంటే, అవి ఒక్క చోటికి రావడానికి మరింత కాలం కావాలి. జీవ రసాయనాలు రాళ్లమీద పుట్టినట్టు ఒక ఆలోచన ఉంది. అక్కడి తేమలో అంతులేని రసాయన చర్యలు జరిగి ఉంటాయి. వాటి సంఖ్య ఒకటి పక్కన ముప్ఫయి సున్నాలు వేసినంత- అని అంచనా ఉంది. ఆ కార్యక్రమం వందల మిలియనుల సంవత్సరాల పాటు సాగి ఉండవచ్చు.

ఇప్పుడు ఒక పరిశోధన, పరిశోధనశాల పదివేల సంవత్సరాలపాటు కొనసాగే వీలుంటే, జీవం పుట్టుక ప్రయోగాన్ని కొంతవరకయినా పరిశీలించవచ్చు. అప్పుడు జరిగిన రకం రసాయన ప్రయోగాలను ఇప్పుడు జరిపి చూడవచ్చు. వాటి సంఖ్య ఎంత ఎక్కువ ఉంటే, అంత త్వరగా, సంతృప్తికరంగా ఫలితాలు అందుతాయి. గదుల నిండా రకరకాల రసాయనాలు కలిసిన పాత్రలు, తగిన తేమ, ఒత్తిడి, వేడి లాంటి పరిస్థితులతోబాటు ఏర్పాటయి ఉంటాయి. ఇప్పుడు మనకు కంప్యూటర్ అందుబాటులో ఉంది గనుక పాత్రలు నిజంగా ఏ గాజు పాత్రలో కాక, కంప్యూటర్ చిప్స్ రూపంలో ఉంటాయి. తగిన పరిస్థితులు అక్కడ కలిగించడం, అవసరం కొద్దీ మార్చడం సులభమవుతుంది. వీటిని చిప్ పరిశోధనశాలలు అనవచ్చునేమో! వాటిలో ఎక్కడో ఏదో ఒక రసాయనం, తనలాంటి రసాయనాన్ని తయారుచేస్తే క్షణాల్లో తెలిసిపోతుంది.

సాంకేతిక పద్ధతులను వాడుతున్నాము గనుక పరిశోధనకు పట్టే సమయాన్ని కూడా తగ్గించే ప్రయత్నాలు జరుగుతాయి. ఎక్కడో ఒక రసాయన చర్య మనమనుకున్న రకంగా జరుగుతున్నాయని సూచన వస్తే, అక్కడి పరిస్థితులను మరింత అనుకూలంగా మార్చవచ్చు. ప్రయోగాలు సాగితే, అసలు ప్రకృతిలో రసాయనాలు కలిసి, రకరకాల మార్పులకు దారితీసే పద్ధతులు అర్థం కావచ్చు! ఇంతకూ ఈ పరిశోధన వీలవుందా? అవసరమా ?-అని అడిగితే మాత్రం జవాబు లేదు.
* భౌతిక ప్రపంచం, సిద్ధాంతాలు: జెరాల్డ్ గాబ్రియెన్స్ హార్వార్డ్ యూనివర్సిటీలో భౌతిక శాస్త్రంలో పరిశోధనలు చేస్తుంటారు. పదివేల సంవత్సరాలు దొరికితే తాము చేయగలిగిన పరిశోధన గురించి ఆయన చెప్పిన అంశాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి.
భౌతిక శాస్త్రంలో కొన్ని సిద్ధాంతాలు, నియమాలు శాశ్వతమయినవని అనుకుంటున్నాము. అన్ని ప్రొటానులకు ఒకే రకమైన ఛార్జ్ ఉందంటున్నారు. కాంతి ఎప్పుడయినా ఒకే వేగంతో కదులుతుందంటారు. ఇలాంటివే మరెన్నో విషయాలున్నాయి. వాస్తవంగా చూచి పరిశీలించినవారు కొందరు ఈ రకం సిద్ధాంతాలలో మార్పు ఉండే వీలుందంటున్నారు. అంతరిక్ష పరిశోధనలో ఇటువంటి మార్పులను గమనించామన్న వారు కూడా ఉన్నారు. వారిని అందరూ అంగీకరించకపోవడమన్నది మరో సంగతి. పరిశోధనలన్నీ ఈ సిద్ధాంతాల ఆధారంగానే నడుస్తున్నాయి. జెరాల్డ్ పరిశోధనశాలలో ఎలెక్ట్రానుకు గల అయస్కాంత శక్తిని కొలిచారు. ఈ రకం కణాల అసలు లక్షణాలను గురించి చేసిన పరిశోధనల్లో, వేసిన కొలతల్లో ఇంతకంటే కచ్చితమయినది మరొకటి లేదంటారు. ఈ పరిశీలనలను వేల సంవత్సరాలపాటు చేస్తూపోతే, కొలతలో మార్పు కనబడుతుందేమోనంటారు జెరాల్డ్.

ఒక్క ఎలక్ట్రాను అయస్కాంత శక్తిని కొలవడమే నిజంగా ఆశ్చర్యకరమయిన సంగతి. అది జరగాలంటే, విద్యుత్తు అయస్కాంత లక్షణాలు స్థిరంగా ఉండే పరిస్థితిలో ఎలక్ట్రాను ఒకే తలంలో కదిలే విధంగా ఏర్పాటుచేయాలి. అది వృత్తాకార మార్గంలో గుండ్రంగా తిరిగేట్లు చేయాలి. దాని శక్తి మరే కారణంగా పెరగడం లేదని స్థిరం చేసుకోవాలి. అట్లా తిరుగుతుండే కణాన్ని తిరగబడేలా బలాలను ఉపయోగించాలి. ఇన్ని జరిగిన తరువాత ఫలితం తెలుస్తుంది. దాని శక్తి- ఒకటి పక్కన పదమూడు సున్నాలు వేసిన కొలతలో మూడవ వంతులు మాత్రమేనని!

ఇదంతా ఎవరికి అర్థమవుతుందని, ఎందుకు ఉపయోగపడుతుందని అడిగితే లాభం లేదు. ప్రపంచంలో జరుగుతున్న సైన్సు మొత్తం, మనకు నేరుగా పనికివచ్చేకాలం పోయింది. కొంత సైన్సు- కేవలం సైన్సుకొరకు జరుగుతుంది. అసలు కాలానికి, ఈ కొలతకు సంబంధం ఏమిటని మనం అడగడానికి వీలుంది. ఈ కొలత వెయ్యి సంవత్సరాల కాలంలో, ఒక్క భాగం పెరగడమో, తరగడమో జరిగి ఉండవచ్చు గదా! అది తెలియాలంటే, ఈ కొలతలను సంవత్సరాలపాటు పరిశీలించాలి. సైన్సులో ఏదీ శాశ్వతం కాదు. మార్పు వేగం మరీ నెమ్మదిగా జరుగుతుంటే, ఆ సంగతి తెలిసే వరకు మాత్రమే సిద్ధాంతం నిలబడుతుంది. ఆ మార్పు పరిశోధనశాలలో కొన్ని సంవత్సరాల కాలంలో చూపడం, చూడడం కుదరదు. భౌతిక, రసాయనిక, జైవిక విషయాలలో మార్పులు, ఒకప్పుడు జరిగిన వేగం, ఇప్పుడు జరుగుతున్న వేగం ఒకేలాగ ఉండవు. అందుకే ప్రయోగాలు వేల సంవత్సరాలపాటు సాగితే సంగతి తెలుస్తుంది. సాంకేతిక నైపుణ్యం పెరిగినకొద్దీ ఫలితాలు తొందరగా తెలిసే అవకాశాలు కూడా ఉన్నాయి.
................................
ఇలాంటివే మరికొన్ని ఆలోచనలు
...................................
కోతులు రాను రాను మారి.. మానవులు వచ్చారని సిద్ధాంతం. వేల సంవత్సరాలుపాటు, రకరకాల కోతులను పెంచి వాటి తెలివి తేటలను, మిగతా పద్ధతులను పరిశీలిస్తే, మార్చగలిగితే ఏ రకం జీవులు వస్తాయని పరిశీలించాలంటారు- షికాగో యూనివర్సిటీ జెనెటిసిస్ట్ బ్రూస్ లాన్.

నక్షత్రాలు పేలిపోవడం గురించి పరిశీలించడానికి పదివేల సంవత్సరాల పథకంతో సిద్ధంగా ఉన్నారు మేరీలాండ్ పరిశోధకులు కోల్‌మిల్లర్. నక్షత్రాలు పేలడం, సూపర్ నోవాలు పుట్టడం అరుదయిన విషయం. మన గెలాక్సీలో సూపర్‌నోవా క్రీ.శ.1604లో పుట్టిందని కెప్లర్ గమనించాడు. ఇటీవలివన్నీ మరీ దూరంలో గల గెలాక్సీలలో పుట్టాయి. సమయం ఉంటే అక్కడ బ్లాక్‌హోల్స్ గురించి పరిశీలించవచ్చు.

మనిషి తినే తిండి మారుతుంది. మార్పుల కారణంగా డయాబెటిస్ వంటి వ్యాధులు మొదలవుతాయి. వేల సంవత్సరాలలో మన తిండి, ఆరోగ్యం మారే తీరును పరిశోధించాలి, అంటారు శారా టిస్క్ఫా.

త్వరలోనే ప్రపంచంలోని చమురు నిక్షేపాలు అడుగంటుతాయి. అయిపోతాయి. వాటి స్థానంలో మరో రసాయన ఇంధనం దొరికే వీలు లేదు. అంటే మనుషులు బతికే తీరు పూర్తిగా మారిపోతుంది. అప్పుడు మనిషి, గతంలోని ఆటవిక మానవునివలే మారి, వనరుల కోసం కీచులాడుకుంటాడా? ఇది లారెన్స్ స్మిత్ ప్రశ్న!

జీవులలో ఒక కొత్త జాతి (స్పీసీస్) పుట్టడానికి లక్ష సంవత్సరాలు పడుతుంది. ఇదిమనకు తెలిసిన కాలం తీరు కాదు. భౌగోళిక కాలం అని మరొకటి ఉంది. లక్ష సంవత్సరాలు ఒక పరిశీలన సాగించే వీలుంటే, జీవుల పరిణామాన్ని గమనించవచ్చునంటారు- జెర్రీ కోయిన్.

1 comment: