నేను తెలుగులో చాలా రాశాను. పుస్తకాలు కూడా. ఇంకా రాస్తూనే ఉన్నాను. సైన్సు,సాహిత్యం, సంగీతం, కళలు నా హాబీలు.
Saturday, November 2, 2013
Friday, October 25, 2013
కొలతలు - నిష్పత్తులు
తెలంగాణము ఏర్పడుతున్నది: ఏర్పడుతున్నది అన్న మాటకు వేరుగా పడుతున్నదని
అర్థమనుకుంట. సరే, గాని మన మిత్రుడు, మంచి కవి. కవిత రాసి
చూపించాడు. దాన్ని అచ్చు వేసేట్లయితే ఈ ప్రసక్తి వచ్చేది కాదు. చదివి వినిపించాలి.
అందులో ఆయన రణము అన్న మాట వాడుకున్నాడు. చదువుతుంటే, అది రనము అయింది.
మాట మార్చగూడదా అంటే యుద్ధము అన్నాడు. అది యుద్దము అయింది. ఎందుకొచ్చిన బాధ?
పోరు అంటే పోతుంది గదా అనుకుని ఇద్దరమూ సర్దుకున్నాము. సంస్కృతం ప్రభావం పోయి
మనమంతా తమిళులను తలదన్నుతున్నాము. ఈ నేప‘త్యం’లో పరి‘స్తి’తి ఎవరికీ అ‘ర్త’మవుతలేదు! కృష్ణ
అన్న మాటను క్రిష్న, క్రుష్నగా మార్చేసుకున్నాము. ఆం‘ద్ర’ప్రదేశ్ అన్నది
అలవాటయి పోయింది. వేరు పడుతున్న పది జిల్లాలను తెలుగునాడు,
లేదా హైదరాబాద్ రాష్ట్రం అంటే పోతుందేమో? తెలుగుదేశం అందామంటే,
ఆ అందమయిన మాటను కొందరు ‘కబ్జా’
చేసి పెట్టుకున్నారు మరి. ఈ కబ్జా అనే మాటను కంప్యూటర్ తెలుగులో సరిగా రాయడం
కుదరదు. అది సిసలయిన ఉరుదూ మాట! ఆక్రమణ అని అర్థం!
* కళల్లో: కలల్లో ఏం కనిపించినా సర్దుకుపోవచ్చు. అది మరెవరికీ కనిపించదు. మనం వర్ణించి, (వర్నించి కాదని మనవి!) చెప్పలేము. కాని ఇళ్లల్లో కనిపించేవి ఇంచుమించు సహజంగ ఉండాలి గద! మా ఇంట్లో ఒక పెయింటింగు ఉంది. (అదిప్పుడు ఎక్కడో దాగి ఉంది) అందులో గీతాబోధ దృశ్యం? అవును అదే! క్రుష్నుడు, అ‘ర్జ’నులకు సంబంధించినది. నా దృష్టి మాత్రం గుర్రాల (బండి ర?) మీద! ఎంత సేపు చూచినా, మొత్తం ఎన్ని గుర్రాలున్నయి, వాటన్నిటికీ కలిపి ఎన్ని కాళ్లున్నయి అర్థమయేది కాదు. పెయింటింగులంటే అట్లాగే ఉండాలి. సర్రియలిజం అనే స్వగోలజం, డాడాయిజం వరకు పోనవసరం లేదు గానీ, పెయింటింగులో కొలత తేడాలుంటేనే సృజనాత్మకత ఉన్నట్టు లెక్క. మామూలు ఫొటోగ్రాఫు వలె ఉంటే, ఆ పెయింటింగును నేను అంతసేపు గమనిస్తానా? గుర్తుంచుకుంటానా? ఇక్కడ ప్రస్తావిస్తానా? ఈ మధ్యన అంతర్జాతీయంగా పెయింటింగ్‌లో ఒక ట్రెండ్ వచ్చింది. మరీ ఫొటోగ్రాఫులాగ బొమ్మలు గీయడం ఒకటి. కంప్యూటర్ సాయంతో ఫొటోను, పెయింటింగ్ వలె కనిపించేలాగ చేయడం! ఒకటని రెండు సంగతులు చెప్పినట్లున్నాను. విశ్వనాథ వారి ప్రభావం.. ‘ఇచ్చటనొక విషయమున్నది, ఒకటియనగా రెండు!’ అంటారాయన!
ప్రపంచమంతటా, కాలెండరు కొరకు బొమ్మలు గీయడం ఒక పెద్ద కళా విశేషం. (మల్యాగారు కాలెండరు భామలతో పడే కష్టాలు ఎన్‌డిటీవీ గుడ్‌టైమ్స్‌లో చూడగలరు!) గతంలో మందు కంపెనీల వారు గుడ్డలు తడిసిన అమ్మాయిల పెయింటింగులతో మాత్రమే సంతృప్తి పడేవారు. మరి కొందరు, మన దేశంలోని వివిధ దేశాల అందమయి స్త్రీల బొమ్మలను, సచేలలుగా, (అనగా గుడ్డలతో సహా!) బొమ్మలు గీసి కాలెండర్లు వేసేవారు. ఆ అమ్మాయిలకు, కావ్యాలలో వర్ణించిన, చేపల వంటి కన్నులు, శంఖం వంటి మెడ వగైరాలుంటాయి. సరదాకు నేను ఆ రకం బొమ్మలు కొన్ని సేకరించి, స్కాన్ చేసి, నా బ్లాగులో పెట్టి ‘ఇలాంటి అందగత్తె నిజంగా ఉంటే, మీరేమంటారు లాంటి చితిని (చిలిపి) మాట ఒకటి రాశాను. ఎంట్రీకి ‘ఇండియన్ బ్యూటీస్’ అని పేరు పెట్టాను. ఇంటర్‌నెట్‌లో ఈ-మేల్, ఫీమేల్ అనేవి ముఖ్యమయిన ఆకర్షణలని నా ఉవాచ! కావాలంటే ఉద్ఘాటిస్తాను, నొక్కి వక్కాణిస్తాను కూడా! అమ్మాయి బొమ్మలు చూడదలుచుకున్న వారంతా ‘సెర్చ్’లో ఇండియన్ బ్యూటీ అని కొట్టడం, నా బ్లాగుకు రావడం, ఈ బొమ్మలను చూడడం! (నన్ను తిట్టుకుని వెళ్లిపోవడం!) అదొక సరదా! నా బ్లాగులో టాప్‌టెన్ పేజీల్లో ఇది కూడా ఒకటయిందంటే, సంగతేమిటో అర్థమయే ఉంటుంది!
ఈ నేపథ్యంలో మనం మాడరన్ ఆర్ట్ గురించి మాట్లాడుకుంటే పరిస్థితి తీవ్ర ఇబ్బందికరమవుతుందని చెప్పక తప్పినది కాదు!
* స్థాపత్యం అని ఒక శాస్త్రం ఉంది. అందులో నుంచే స్థపతి అనే మాట వస్తుంది. దేవుని విగ్రహాలను, గుడులకు సంబంధించిన మిగతా సంగతులను ఈ శాస్త్రంలో వివరిస్తారు. ఒక విగ్రహం ఎంత ఎత్తుంటే, ఏయే భాగంలో ఎంత వెడల్పు ఉండాలి. శరీర భాగాల కొలతల్లో ఉండే సాపేక్ష నిష్పత్తులేమిటి, తెలియడానికి లెక్కలుంటాయని చెపితే విన్నాను. తరువాత స్థాపత్యం గురించి తెలిసింది. ఈ లెక్కలు ఉన్నందుకే దేవుని విగ్రహాలన్నీ జీవకళతో, సహజంగా కనిపిస్తుంటాయని అర్థమయింది. ఇక్కడ నాకు ఒకటి, అనగా రెండు సంగతులు గుర్తొస్తుంటాయి. తిరుపతి ఎంకన్న, వెంకన్న (ఏదయినా ఒకటే) విగ్రహంలో మోకాళ్ల నుంచి కింది భాగంలో ఏదో తేడా కనపడుతుంది. అసలు కాళ్లు ఇంకొంచెం లోతులో ఉన్నాయని, కనిపించే వెండి పాదాలు, వేరుగా తగిలించినవని పెద్దలు చెప్పగా విన్నాను. అసలా విగ్రహం బాలాంబిక విగ్రహమనీ, వక్షంలో ఆ తేడా తెలుస్తుందని అన్నవారున్నారు. (చదువరీ మనము దారి తప్పక ముందే తిరిగి విషయములోనికి వెళ్లుదము!) అమ్మవారు, స్వామివారి పక్కన ఉన్నట్లు విగ్రహాలుంటే, వారిద్దరి ఆకారాలు, దామాషా పద్ధతిలోనే (ఎస్టిమేట్స్, ఉజ్జాయింపులకు) సరిగ్గా ఉంటాయి ఉదాహరణ సీతమ్మ, రామయ్యలు! అదే అమ్మవారు, స్వామివారి అంక భాగంలో ఉంటే, ఈ నిష్పత్తిలో కొంచెం తేడా కనపడుతుందని నా మెదడు(?)కు తోచింది. మాలోల నరసింహుల తొడ మీద ఆసీనులయిన అమ్మవారు మరీ చిన్నగుంటారు! కాదా!
రామప్ప గుడిలో నిలబడిన అమ్మాయిలు (శిల్పాలే!) ఏ క్షణంలోనయినా దిగి వచ్చి, ఓ చిరునవ్వు కూడా పడేస్తారేమోనని నేను ఎదురుచూస్తిని! నిజంగా అంత సహజంగా ఉంటాయి ఆ మూర్తులు! ఇంక మీరు, గతంలో చూచిన విగ్రహాలు ఏవి సహజంగ ఉన్నాయి, ఏవి లేవని ఆలోచిస్తారు. ఆలోగా, మరో కొన్ని మాటలున్నాయి.
కూడలిలో, దారి పక్కన నిలబడి మనకు మార్గదర్శనం చేస్తున్న (చేసిన కూడా) నాయకుల తెలిసినవే. అవన్నీ లైఫ్ సైజ్ కన్నా పెద్దవయినా సరే, సౌష్ఠవం అంటే అసలు కొలతల నిష్పత్తులు మారవు! గమనించారా? ఒకప్పుడు హైదరాబాద్‌లో స్టేడియం దగ్గర ఒక నాయకుని విగ్రహం ప్రతిష్ఠించారు. భారీగా అనావరణం, అనగా తెర తొలగించుట కూడా అయ్యింది. తరువాత, ఆ బొమ్మ ఆయన నిజమూర్తి వలె లేదన్నారు. విగ్రహాన్ని మార్చారు. కేవలం సహజంగా కనపడాలనే గదా?
ట్యాంకుబండ్ మీద నిలిచిన విగ్రహాలలో కొన్ని కేవలం ఊహామూర్తులు. కృష్ణదేవరాయలు
పొట్టివాడని చరిత్ర చెపుతుంది. ఇక్కడ మాత్రం భారీ మనిషి. అందుకు మాడల్ సాక్షాత్తు
ఎన్‌టీఆర్ అన్నగారేనట తెలుసా?
ఇంకా ఉందా? ఏమో చూద్దాం.
...........................*
మా ఇంట్లో యింకో కుష్ణమూర్తి ఉన్నాడు. అంటే మొదలు ఒక కృష్ణమూర్తి ఉండనే ఉన్నాడని అర్థంగద. ఒకాయన వ్యత్యస్త పాదారవిందుడు. రెండో (ఈ మధ్యన టీవీలో ‘రొండో’ అని రాస్తున్నరు) ఆయన కాళ్లు పక్క పక్కననే వున్నాయి. ఈ రెండో ఆయన వెనక ఒక ఆవున్నది. లేక, లేగ, దూడనా? ఈ బొమ్మలు పొడవు వెడల్పులనే నిష్పత్తులు, అదే స్థాపత్య సూత్రాలు, మామూలు మాటల్లో సౌష్ఠవం, వాస్తవికత, సహజత్వం అసలు లేవని నాకనిపిస్తుంది. ఇంతకూ, శిల్పాలు, చిత్రాలలో మూర్తులు సహజంగా ఉండవలెనా? లేక అవి ప్రతీకలు మాత్రమే గనుక ఎట్లాగయినా ఉండవచ్చునా? ఈ అనుమానం నాకు చిన్నప్పటి నుంచీ ఉంది. రానురాను అది మరింత అనుమానమవుతున్నదే తప్ప, విడిపోయే వీలు కనపడటం లేదు. మీరేమంటారూ?
Sunday, October 20, 2013
కాలం కదులుతుందా?
లీ చైల్డ్ అనే రచయిత జాక్ రీచర్ అనే పాత్రను
సృష్టించాడు. ఈ రీచర్ నిజంగా విచిత్రమయిన మనిషి. రీచర్ సినిమాలు కూడా వస్తున్నాయి.
రీచర్ నిద్రకు ఉపక్రమించి సరిగ్గా గంట యాభయి నిమిషాలకు లేవాలనుకుంటాడు. లేస్తాడు.
వీలవుతుందా. మీకు వీలవుతుందా. అసలు మీరది ప్రయత్నించారా. కొందరికి
వీలవుతుందనిపిస్తుంది. ఇక్కడ విషయం కాలం కదలిక గురించి. తరువాత ఆ కదలిక మనకు
తెలియడం గురించి.
చాలా కాలం గడిచింది అనడం మనకు మామూలయింది.
ఇప్పుడున్నది ఇంకో క్షణంలో ఉండదన్నది మన అనుభవం. ఆ క్షణమే ఉండదు. అనుక్షణం ఆ క్షణం
గతమవుతుంది. కనుకనే కాలం గడిచింది, కదిలింది అన్న భావం మనకు కలుగుతుంది. ఇక్కడ ఏం
కదిలింది. ఎట్లా కదిలింది. కాలమంటే ఒక పదార్థం కాదు, వస్తువు కాదు. ఇప్పుడిక్కడ
ఉండి ఇంకో క్షణం ఇంకో చోట ఉండడం కాలానికి చేతగాదు. మరి కాలం కదిలిందంటే ఏం
కదిలింది. ఎట్లా కదిలింది. ఎక్కడినుంచి ఎక్కడికి కదిలింది. కాలం ముందుకే
కదులుతుందట. వెనక్కు కదలదట. ఇది మరో విచిత్రం.
ఏం కదిలింది, ఎట్లా కదిలింది తెలియకుండా, ఎంత
వేగంగా కదిలిందన్న లెక్క కుదురుతుందా. ఎండలో నిలబడ్డది ఇష్టమయిన వారితోనయితే, వారి
కొరకయితే, ఎండ తెలియదు, కాలం కూడా తెలియదంటారు. ఎదురుచూపులో ఎద బరువు కారణఁగా
క్షణమొక యుగమయిందంటారు. వేరే ఊరికి పోతుంటే కాలం బరువుగా సాగుతుందట. తిరిగి ఇంటికి
వస్తుంటే మాత్రం చాలా సులభంగా సాగుతుందట. అంటే కాలానికి ఒక నిర్ణీతవేగం లేదా
సైన్సు ప్రకారం భూమి 365 దినాలకు ఒక సారి సూర్యుని
చుట్టు తిరుగుతుంది. 24 గంటలలో తన చుట్టు తాను తిరుగుతుంది. ఇక్కడ నుంచి లెక్కవేసి
గడియారాలు తయారు చేశారు. అంతా అర్థమయిపోయిందనుకుని మరీ నిక్కచ్చిగా పనిచేసే
అణుగడియారాలను కూడా తయారు చేశారు. అప్పుడప్పుడు గడియారానికి ఒక్క క్షణం కలిపి
సరిచేస్తున్నామంటున్నారు. ఇంతకూ ఈ గడియారాలు ఏం కొలుస్తున్నయి. కాలం గడియారం ప్రకారం
కదులుతుందా, గడియారం కాలం ప్రకారం కదులుతుందా.
కాలం ఒక అనుభవం. దాని కదలిక కూడా అనుభవం. దానికి
ఒక వేగం ఉందా. దాన్ని గడియారాలు లెక్కబెడుతున్నాయా. లేనేలేదు. గడియారాలు
కదులుతున్నాయి. మనం కాలం కదిలిందని అనుకుంటున్నాము.
ప్రపంచంలో ఎన్నో వస్తువులు ఉన్నాయి. వాటి మధ్యన
పరస్పరం ఒక సంబంధం ఉంది. ఆ సంబంధం మారుతూ పోతుంది. గడియారాన్ని చూస్తుంటే ఎప్పుడూ
ఒకే టైం కనబడదు. ఇప్పుడొక టైం ఉంటుంది. కొంచెం సేపయిన తరువాత చూస్తే, టైం కదిలి
కనబడుతుంది. నాలుగు నిమిషాలు కదిలి కనబడింది అనుకుందాము. నాలుగు నిమిషాలు అంటే
ఏమిటి. నిమిషాల ముల్లు వేగంగా కదులుతుంది. గంటల ముల్లులో ఆ వేగం అంత సులభంగ కనిపించదు.
సెకండ్ల ముల్లు ఉంటే అది మరింత వేగంగ కదులుతూ కనబడుతుంది. మనం రెండవసారి గడియారం
చూచినప్పుడు కొంత మార్పు, కదలిక కారణంగా వచ్చిన మార్పు కనబడుతుంది. అక్కడ అయిదు
నిమిషాల తేడా కనబడితే, అయిదు నిమిషాల కాలం గడిచిందన్న భావం మనకు కలుగుతుంది. ఈలోగా
మన మెదడు, మనసు వందల మైళ్లు తిరిగి వచ్చేసి ఉంటుంది. ప్రపంచంలో అన్ని సంగతులు
అట్లాగే వేగంగా కదిలి ఉండవచ్చుగదా. అప్పుడూ గడిచిన కాలం అయిదు నిమిషాలేనా. లేదా
ప్రపంచం మందకొడి అయ్యుండవచ్చు కూడా. ఈ తేడాలు పాపం గడియారానికి తెలియవు. అది తన
మానాన తను పని చేస్తూ పోతుంది. ఇంట్లో ఉన్న ఏ రెండు గడియారాలూ ఒకే టైం చూపించవు.
అసలవి చూపించేది కాలాన్ని కానే కాదు. మనం వాటికి ఒక కదలిక నేర్పించాము. వాటి
కదలికతో కాలం కదులుతున్నదని అనుకుంటున్నాము.
ఒక్కసారి కళ్లు మూసుకుని ఈ ప్రపంచంలో మనం గానీ,
మరో జీవిగానీ మరే వస్తువులూ, పదార్థాలూ లేవని ఊహించండి. అప్పుడు కాలం కదులుతుందా.
గడియారం కదలికకూ కాలం కదలికకూ సంబంధం లేదనుకున్నాము. కాలం కదిలితే, తనంత తాను
కదులుతుందని గదా. కనుక ఖాళీ ప్రపంచంలోనూ కాలం కదులుతుండాలి మరి. గుర్తుంచుకోండి.
అది ఖాళీ ప్రపంచం. అక్కడ ఏ వస్తువులూ లేవు. అంటే అక్కడ ఏమీ జరగడం లేదు. అంటే ఏమీ
కదలడం లేదు. సంఘటనలు లేవు. సంగతులు లేవు. మరిక కదలిక ఎక్కడిది. కాలం కదలిక మాత్రం
ఎక్కడిది.
చదువుతుంటే కాలం కదిలినట్టు తెలియనే లేదు,
అంటారేమో. ఆలోచించండి. మీకు సంతోషమయితే నాకూ సంతోషమే. మీకు బుర్ర తిరిగి తలనొప్పి
మొదలయితే అంతకన్నా సంతోషం. సంతోషంలో నా కాలం వేగంగా గడుస్తుంది. తలనొప్పితో మీ
కాలం ఆగిపోతుంది. కుంటి నడకలు నడుస్తుంది. అయినా గడియారం మాత్రం తన వేగంతో తాను
నడుస్తుంది. ఇంతకూ కాలం కదులుతుందా, ఆలోచించండి.
Wednesday, October 9, 2013
మనిషి తీరు
మనిషి తీరే అంత
చేయలేని పనులను చేస్తూ, పడుతూ లేస్తూ
అసాధ్యమయిన పనులను అలవోకగా సాధిస్తూ
ఆలోచనలకు అందని దూరాలకూ, తీరాలకూ చేరుకోవడం
నక్షత్రాల మధ్యన పుట్టిన మనిషి
నక్షత్రమయ్యే దాకా నలిగి పోతుంటాడు
నక్షత్రాలను తాకుతాడు, వాటితో ఆడుకుంటాడు
కలలు కంటాడు, కల్లలు కంటాడు
తోకచుక్కల మీద ఎక్కి గెలాక్సీలు దాటుతుంటాడు
అంతా చూడాలని, అంతా తెలుసుకోవాలని తపన
అనంతమయిన ప్రశ్నలకు ఆన్సర్ వెతకాలని తపన
అందినా అందకున్నా అసంతృప్తి మిగిలే ఉండాలి
అగాధాలను, అత్యున్నత శిఖరాలను
స్థల కాలాలలోని వంపులను
తెలియని సంగతుల సొంపులను
కళ్ల ముందు చూడగలగాలన్నది ఒకటే గమ్యం
అది ఒక మంట
ఆలోచనల గురించిన మంట
మనసులో మంట
మనిషి తీరు అంతే
(పై బొమ్మ చాలా పెద్దది. వాల్ పేపర్ గా పనికి వస్తుంది. సేవ్ చేసి వాడుకోండి)
Sunday, October 6, 2013
సంగీతప్రియ - రసికప్రియ
మాటను సాగదీసి, పాటగా మార్చిన మొదటి మనుషులెవరో గానీ,
వారి ఈ ప్రపంచం మొత్తం రుణపడి ఉంది. పాటలేని ప్రపంచం చాలా బోసిగా ఉంటుంది కదూ!
* శిశువులకు, పశువులకు, పాములకు గూడా సంగీతం తెలుసును, అని అర్థం వచ్చే మాట ఒకటి మనవాళ్లు .చెపుతారు. కానీ అది నిజం కాదు. పాములకు చెవులుండవు. వాటికి పాట వినేంత వినికిడి లేనే లేదు.
***
(సంగీతప్రియ అవార్డు అందుకుంటూ నేను)
* కర్ణాటక సంగీతమనే చీమ కుట్టింది. సంగీతమంటే, ఇదే సంగీతం మిగతాదంతా కాదు అన్న భావం బాగా గట్టిబడింది. మొదట్లో శాస్ర్తియ సంగీతం వినాలంటే రేడియో ఒక్కటే దిక్కు. చిన్నప్పటినుంచీ, ఇంట్లో రేడియో, ట్రాన్సిస్టర్ రూపంలో ఉంది గనుక సరిపోయింది. చదువు పేరున ఇల్లు విడిచి దేశం మీద పడినప్పుడు మొదట్లో రేడియో లేదు. సంగీతం అంతకన్నా లేదు. వరంగల్‌లో ఎం.ఎస్సీ చదువుతున్నప్పుడు అక్కడ, సంగీత కచేరీలు జరిగేవేమో తెలియదు. అక్కడి మెడికల్ కాలేజీలో ‘రేడియో’ సంగీత్ సమ్మేళన్’లో భాగంగా, శంకర్, సుబ్రమణ్యం, వైద్యనాథన్ సోదరుల వయొలిన్ త్రయం కచేరీ జరిగింది. ఆ సంగతి తెలిసి నేను వెళ్లాను. అక్కడ జరిగిన రెండవది గాత్ర కచేరీ, ఎవరిదో గుర్తులేదు. సోదరత్రయానికి మృదంగం మీద సహకరించినది పాలఘాట్ మణి అయ్యర్ గారని గుర్తుకువస్తే, ఒళ్లు జలదరిస్తుంది. ఆయనను నేను మళ్లీ చూడలేదు. ఆ అపర నందీశ్వరుడు కనిపించినపుడు, ఆయన గురించి నాకు అంతగా తెలియదు. వరంగల్‌లోనే భద్రకాళి గుడిలో ఎం.ఎస్. బాలసుబ్రహ్మణ్య శర్మగారి కచేరీ విన్నాను. ఆయన తన్మయత్వంలో ఎవరినీ పట్టించుకోకుండా పాడడం చాలా బాగనిపించింది. అక్కడ జనం గోల చేస్తుంటే, ఆయన ఆపి, గట్టిగా అరిచి, మళ్లీ పాట మొదలుపెట్టారు. బాగా గుర్తుంది!
శాస్ర్తియ సంగీతం ఒకటి ఉంటుందని తెలియకుండానే చాలామంది బతుకు చాలిస్తారు. తెలిసిన వాళ్లు కూడా చాలామంది వినరు. విన్న వారికి చాలామందికి, ‘నాకిది అర్థం కాదు’ అన్న భావం ఉంటుంది. తిండి తినే వారందరికీ వంట గురించి తెలుసునా? తినడం చాలదా? సంగీతం వింటే చాలదా? అది తెలిస్తే రుచి పెరుగుతుందేమో గానీ, తెలియకుండానే వింటున్నాను నేను. అయినా బాగుంది.
హైదరాబాదుకు చేరేలోపలే, ఒక మిత్రుడిచ్చిన చిన్న ట్రాన్సిస్టరు ఒకటి నాకు సంగీతాన్ని, సంతోషాన్ని పంచి పెట్టింది. నాలుగు రూకలు రావడం మొదలయింతర్వాత ఒక ట్రాన్సిస్టర్ కొన్నాను. హాస్టల్లో చాలామందికి, పాటలు వినాలన్న కోరిక ఉన్నా, రేడియో కొనాలన్న ఆలోచన మాత్రం లేదు. నేను చదివే పుస్తకాలు, మెచ్చుకునే సినిమాల కారణంగా, మిత్రులంతా కలిసి నాకు, ‘తాతయ్య’ అని పేరు పెట్టారు. ‘తాతయ్య రేడియోలో సంగీతం తప్ప, సినిమా పాటలు పలకవు, వదిలేయండి’ అనేవారు.
నల్లకుంటలో ఒక గదిలో, తమ్మునితో బాటు ఉంటున్నప్పుడు, కూరలకని బయలుదేరి, టేప్‌రికార్డర్ కొని తెచ్చాను. ఇంటికి వచ్చి డబ్బులు తీసుకుపోయి ఇచ్చినట్టు గుర్తు. అప్పటికి రికార్డెడ్ కాసెట్లు అంతగా వచ్చేవి కావు. నా దగ్గర మరీ అంతగా పైసలు ఉండేవీ కావు. రేడియోలో మీడియం వేవ్‌లోనే మద్రాసు కూడా వినిపించేది. బాలమురళి కచేరీ, కాసెట్లో రికార్డ్ చేసి విన్నాను. సంగీత సేకరణకు అది ప్రారంభం. కమర్షియల్ కాసెట్లకు బోలెడు డబ్బులవుతాయి. ఖాళీది కొని ఆ కాసెట్లకు కాపీలు చేసి ఇచ్చే వాళ్లున్నారని తెలిసింది. అది అన్యాయమనీ, కళాకారుల పట్ల ద్రోహమనీ భావం ఉన్నా కొంత కాలం తప్పలేదు. కొంచెం వెసులుబాటు కలిగిన తర్వాత కాసెట్లు అసలు రికార్డింగులనే కొనడం మొదలయింది. రేడియో కచేరీలను రికార్డు చేయడం కూడా సాగింది. అప్పట్లో ఒకసారి ఎల్లా వెంకటేశ్వరరావుగారు, శంకరమఠంలో 24 గంటలపాటు మృదంగం వాయించి రికార్డు సృష్టించారు. నేను నా టేప్‌రికార్డర్‌తోబాటు వెళ్లి, కార్యక్రమంలో కొంత భాగం, ఒక గంటపాటు రికార్డు చేశాను. ఆ రికార్డింగ్‌లో నేను బంధించిన ఎన్.ఎస్.శ్రీనివాసన్, ఎల్లా గారలు తరువాత నాకు సహోద్యోగులు, మిత్రులు అవుతారని కలలో కూడా ఊహించలేదు. అంతకన్నా ఆశ్చర్యం, ఆ రికార్డింగ్‌ను ఎమ్‌పీత్రీగా మార్చి, ఇంటర్‌నెట్‌లో ప్రపంచంతో పంచుకుంటానని అసలే అనుకోలేదు.
ఎక్కడ కచేరీ జరిగినా, తిండిని కూడా మరచి వెళ్లి కూచోవటం అలవాటయింది. సీకా వాళ్లు టికెట్లు అమ్ముతున్నారంటే, వారం రోజులపాటు మంచి సంగీతం వినడానికి గొప్ప అవకాశం రవీంద్రభారతిలో జరిగే, వారి ఫెస్టివల్ టికెట్ల మీద, ఇంకా నంబర్లు వేయకముందే వెళ్లి, నాకు కావలసిన వరుసలో, చివరి సీటు నంబరు వేసుకుని, టికెట్ తెచ్చుకున్నాను. సంగీతం వినడానికి ఏకంగా మద్రాసుకే వెళ్లడం దాకా చేరింది పరిస్థితి.
ఒక్కసారి అక్కడి నుంచి, ఇటీవలి కాలంలోకి వస్తే, కంప్యూటర్ వచ్చింది. పాతకాలం, టేపులు, క్యాసెట్ల మీది రికార్డింగులను డిజిటయిజ్ చేసి వింటున్నారు. అటువంటి సంగీతాన్ని, ఇంటర్‌నెట్‌లో పంచుకుంటున్నారు. నేను ఇట్లాంటివేమీ మిస్ కాలేదని గర్వంగా చెప్పగలను. ఒక సహోద్యోగి అన్న మాట మీద పట్టింపు వచ్చి కంప్యూటర్ వాడడం నేర్చుకున్నాను. అందులో మంచి నైపుణ్యాన్ని సాధించానని చెప్పగలను. రికార్డింగులను డిజిటయిజ్ చేయడమూ నేర్చుకున్నాను. ఆ రికార్డింగులను ఇంటర్‌నెట్‌లో పంచుకోవడమూ నేర్చుకున్నాను. నా దగ్గర ఉన్న కాసెట్ రికార్డులన్నీ అయిన తరువాత, సరేలే, మనకెందుకన్నట్లు ఊరుకున్నాను. స్వర్గీయ మిత్రులు శ్రీనివాసన్ గారింట్లో ఆయన సేకంచిన కాసెట్లు ఉన్నాయి. శారదా శ్రీనివాసన్‌గారి మంచితనం వల్ల, వాటినన్నిటినీ తెచ్చి, ‘కన్వర్ట్’ చేయసాగాను. వాటిని నా ‘బ్లాగు’ ద్వారా ప్రపంచంతో పంచుకోవడమూ మొదలయింది. ఈ ప్రపంచంలో ఒకే ఆసక్తి గలవారంతా, ఒక చోట చేరడంలో ఆశ్చర్యం లేదు. ఇంటర్‌నెట్ ప్రపంచంలో అది మరింత సులభంగా వీలవుతుంది.
శ్రీనివాసన్ రాజగోపాలన్ అనే ఒక ఉత్తముడు, ఇంటర్‌నెట్‌లో ‘సంగీతప్రియ’ పేరున కర్ణాటక సంగీత అభిమానుల బృందాన్ని రూపొందించారు. నా ఆసక్తి, శ్రమ వాళ్ల దృష్టిలోకి వచ్చింది. నేను సేకరిస్తున్న సంగీతాన్ని, వాళ్లతో పంచుకోవలసిందిగా పిలుపునిచ్చారు. నాకు మొదట్లో అంతగా ఉత్సాహంగా ఉండలేదు. కానీ, అప్పటికే ఇంటర్‌నెట్ ద్వారా, సంగీతాన్ని పంచుకునే మిత్రులతో మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. అలాంటి వారిలో కొందరు అప్పటికే ‘సంగీతప్రియ’ బృందంలో ఉన్నారు. బరోడాలో ఉండే, కన్నడిగులయిన మిత్రులు గురుమూర్తిగారు, నన్ను ప్రోత్సహించారు. ఈ పేరున మనకు సేకరణ మీద శ్రద్ధ పెరుగుతుంది. ధ్యాసగా సంగీతం వినడం, అవసరంగా మారుతుంది’ అన్నారు. ‘నిజం గదా!’ అనిపించింది. ఒక ఉద్యమం మొదలయింది. ఇవాళ ఇంట్లో వేల గంటల సంగీతం వచ్చి చేరింది. ఎక్కడెక్కడి నుంచి, మిత్రులు (కేవలం సంగీత మిత్రులు) వారి దగ్గరున్న రికార్డింగులు, టేపులు, కాసెట్ల రూపంలో పంపుతున్నారు . తిండి, పుస్తకాలతోబాటు, శాస్ర్తియ సంగీతం, బతుకులో ఒక ముఖ్యమయిన భాగమయింది.
నా గొప్ప చెప్పుకోవడానికి మరెవరూ లేనప్పుడు, అదేదో నేనే
చెప్పుకోవాలట! కర్ణాటక సంగీత ప్రచారానికి సేవ చేసిన వారికి,
‘సంగీతప్రియ’ వారు ‘రసిక ప్రియ’
అని ఒక అవార్డును ప్రారంభించారు. 2011 సంవత్సరానికిగాను,
ఆ బహుమతిని నాకిచ్చారు. 2012 ఫిబ్రవరిలో చెన్నైలో
నాకు ఆ బహుమతిని ఇచ్చారు. ఈ సంగతి, సంగీతాభిమానులయిన
కొందరికి తప్పక, చాలామందికి తెలియకపోవచ్చు! నా సంతోషం కొరకు నేనేదో
చేస్తుంటే, మీరు నన్ను పిలిచి సన్మానిస్తున్నారు. అది మీ
మంచితనం!’ అన్నట్లున్నాను ఆ సభలో!
గోపాలం, ఇలాంటి పనులు చేస్తాడని చెప్పి, రికార్డింగులు అడిగితే ‘ఆయనకు ఏం ఇంటరెస్టు? ఏం లాభం?’ అని అడిగారట ఒక విద్వాంసులు. వినయంగా విన్నవించుకుంటున్నాను, ‘నాకు ఖర్చేగాని డబ్బు రాదు కానీ, కలిగే ఆనందాన్ని అంతుల్లేవు!’
గోపాలం, ఇలాంటి పనులు చేస్తాడని చెప్పి, రికార్డింగులు అడిగితే ‘ఆయనకు ఏం ఇంటరెస్టు? ఏం లాభం?’ అని అడిగారట ఒక విద్వాంసులు. వినయంగా విన్నవించుకుంటున్నాను, ‘నాకు ఖర్చేగాని డబ్బు రాదు కానీ, కలిగే ఆనందాన్ని అంతుల్లేవు!’
* మన దేశంలో గ్రామఫోన్ రికార్డింగుల తయారీ 1903లో మొదలయిందంటారు. సేలం గోదావరి అనే ఆవిడ ఎంతమందికి తెలుసు? కోయంబత్తూరు తాయి రికార్డులు రేపిన సంచలనం గురించి కథలుగా చెపుతారు. విజయనగరానికి చెందిన కళాకారుడొకాయన ఆ రోజుల్లోనే ఈలపాట మీద కర్ణాటక సంగీతం వినిపించారు. పాతకాలపు రికార్డు చాలామంది ఇళ్లలో పడి ఉన్నాయి. అలాంటి వాటిని సేకరించి పాటలను అందరితో పంచుకోవాలని, నాలాంటి కొందరు తాపత్రయ పడుతున్నారు.
* తిరువయ్యారులో త్యాగరాజస్వామి వారి ఆలయం, బెంగుళూరు నాగరత్నమ్మ అనే గాయని పుణ్యమా అని కట్టబడింది. ఆమె గురించి మిత్రులు శ్రీరామ్ వెంకటకృష్ణన్, ‘దేవదాసి అండ్ ఎ సెయింట్’ అని పుస్తకం రాశారు. దానికి తెలుగు అనువాదం కూడా వచ్చింది. సంగీత, సాహిత్య అభిమానులందరూ తప్పక చదవవలసిన పుస్తకాలవి. తెలుగు సాహిత్యం గురించి నాగరత్నమ్మ పడిన కష్టాలు గొప్పవి!
Thursday, October 3, 2013
Friday, September 27, 2013
నాకు సమ్మతమే
కొంత మంది నిత్యం రాస్తారట. నిత్యం ఆలోచనలు
రావద్దూ. వాళ్లకు వస్తాయేమో. నిత్యం రాస్తే చెప్పనవసరం లేని సంగతులన్నీ ప్రపంచం
ముందు ఉంచడమవుతుందేమోనని నా అనుమానం. ఒకనాడు, నేను లేనిదే ఈ ప్రపంచం ఎట్ల
నడుస్తుంది అని అనుమానం వస్తుంది. కానీ క్షణం నిలబడి చూస్తే నీ గురించి
పట్టించుకునే వారే లేరని అర్థమవుతుంది. ఒకనాడు అట్లా అనిపించక పోవచ్చు. ఇందాక
ఒకాయన ఫోన్ చేసినడు. ఆయనకు మన వద్ద ఏదో దొరుకుతుందని నమ్మకం కలిగినట్టుంది. అందుకు
వేరే వారు మరి కొందరు కారణమవుతరు. కొందరు మన మంచితనం రుచి చూచి ఉండే అవకాశం
ఉందిగద. వాంఢ్లు మంచివాడులే అంటరు. ఈ కొత్త మనిషి ఆ ఆలోచనను వెంటబెట్టుకుని మన
మీదికి దండయాత్ర చేస్తడు. మంచివాడులే అన్న మనిషి మనతో ఏ సందర్భంలో ఏ రకంగ
మాట్లాడిందీ ఇక్కడ ప్రస్తుతం గాదు. ఆ మనిషికి మనం మంచి వాండ్లమేనన్న భావం
కలిగింది. ఇవాళ మన కర్మ ఎట్లున్నదో ఆయన చూడవచ్చినడా. రాడుగద.
ఆయనకు కావలసిందేదో అడగడము చాతగావాలె. లేకుంటే అది
దొరకదు. ఇంతకు ఆ వస్తువు నా దగ్గర ఉందన్న భావము ఎందుకు కలిగింది. మీ కొరకు తెగ
వెతుకుతున్ననంటడు. అంత అబద్ధం. నేనేమన్న సూదినా ఎంత వెతికినా దొరకకుండ ఉండేందుకు.
నన్ను చెట్టెక్కించాలె. మతలబ్ కీ దునియా అని ఒక మాట ఉన్నది. లోని అర్థము వేరని
భావము. నోనెక్కడనో ఒక వ్యాసము రాసిన. రాసి ఊరుకుంటే కథే లేదు. అది పత్రికలో
వచ్చింది. అందులో నేనేదో సంగతి రాసిన. అది చదివిన వారికి నా దగ్గర ఒక వస్తువు
ఉన్నదన్న భావము కలుగుతుంది. వ్యాసము ఉద్దేశ్యము మాత్రము అది కాదు. మరేదో సంగతి
గురించి చెప్పినా ఒక పదార్థము లేదా వస్తువు నా దగ్గర ఉందన్న భావము కలుగుతుంది. ఆ వస్తువు కావాలనుకున్న వారంత నా మీదికి
దండయాత్ర చేస్తే నేనేమవుత?
సరిగ్గ అదే జరిగింది. ఆ వస్తువు నా దగ్గర
ఉన్నదా లేదా అన్నది ప్రశ్నే కాదు. ఒక పక్షాన ఉంటే అది నేను ఎంత మందికి ఇవ్వగలుగుతానన్నది
ఇంకొక సంగతి.
మొత్తానికి నాగురించి పట్టించుకున్న వారు
ఉన్నరని రుజువయింది. అయ్యా, దాని వలన ఎవరికి ఎంత ప్రయోజనము కలిగింది. అది ప్రశ్న.
నిత్యం రచనలు చెస్తుంటే ఇట్ల పిండి పిసికే సంగతులు
తప్ప మతలబు గల మాటలు రావు. ఇంక ఆలోచనలను పంచుకోవడమని మరొక పద్ధతి ఉన్నది. అంటే
రాయనవసరము లేకుండ, అంత దూరము పోకుండనే మాటలతోటి మందిని మప్పగించడము ఇక్కడ
జరుగుతుంది. ఎప్పటికి మప్పగించడమే కాకపోవచ్చు. అప్పుడో ఇప్పుడో మంచి మాట రాక పోదు.
ఎవ్వరు గూడ ఎప్పటికి మంచి మాటలనే చెప్పజాలరు. సైన్సులో ఏ విషయమయినా అండర్ ద గివన్
కండిషన్స్ మాత్రమే సత్యము. ఒక పరిస్థతిలో మాత్రమే అవి సత్యము. ఒకటి కూడ కాదు.
కొన్ని పరిస్థతులు. తరువాత మరొకరు వచ్చి ఇది సత్యము కాదు, అని నిరూపించే వరకు
మాత్రమే ఏదయినా సత్యము. మాటలు కూడ ఎటువంటి పరిస్థతిలో పలుకబడినవి అన్న ప్రశ్న
పుడుతుంది గద. గొప్పవారు చెప్పినవన్ని గొప్ప మాటలేనా. అప్పుడప్పుడు వారు కూడ
అనుమానాస్పదమయిన వంగతులు చెప్పే వీలు ఉన్నదిగద. అందుకు కొన్ని కారణములు టయి. వారొక
మాటను ఒక సందర్భములో చెప్పి ఉంటరు. అది ఆ సందర్భములో సత్యమే. కాని సందర్భమును
పక్కనబెట్టి మాటను మాత్రమే మనము ఉదహరించినప్పుడు దానికి వేరే అర్థములు తోచే
ప్రమాదము ఉన్నది.
నిత్యము రాసే వారి మాటలు, గొప్పవారనిపించుకున్న
వారి మాటలను కూడ తర్కించి గాని అంగీకరించ గూడదని తాత్పర్యము.
ఆలోచించండి. అవుననిపించినా కాదనిపించినా నాకు
సమ్మతమే.
ఆ సంగతి మీరు కడుపులో దాచుకుంటే మాత్రము మాకు ఏ
సంగతీ తెలియదు. అవునా, ఆలోచించండి.
Tuesday, September 24, 2013
Tuesday, September 17, 2013
ఎందుకో తెలుసా?
నేను మా ఆవిడతో పేకాడడం మానేశాను.
అసలు నేను మా ఆవిడతో పోటీ పడడమే మానేశాను.
ఎందుకో తెలుసా?
ఎన్ని సార్లు పేక ఆడినా ఆమే గెలిచింది. అట్లాగని
నాకు కార్డు ముక్కలాట రాదనుకుంటున్నారేమో?
నేను పెద్ద ఎత్తున పైసలు పెట్టి ఆడే వారి మధ్యన
కూడా బాగా ఆడతాడని పేరున్న మనిషిని. కానీ అదేమి చిత్రమో తెలియదు, మాయామెతో మాత్రం
గెలిచింది తక్కువ. నిజం ఒప్పుకుంటున్నాను, మరీ పిచ్చిగా, ఇంట్లో ఉన్న మంచి
డెక్కులన్నీ బయట పడేసి జన్మలో కార్డులాట ఆడ కూడదని నిర్ణయించుకున్నాను.
ఆటలో ఓడిపోతే ఎదుటి వారు ఎంత మిత్రులయినా గొంతు
పిసికేయాలన్నంత కోపం వస్తుంది, నిజమే కదూ
నా భార్యకు రమ్మీ ఒకటే వచ్చు. నేను జాకీ మణేలా
అనే తురుఫు ఆట మొదలు ఎన్నో రకాలు వచ్చు. ఆడి గెలిచినది అబదఅదం కాదు. కానీ ఇప్పుడు
ఆడడం లేదు.
కొంత మందికి తెలియకుండానే మంచి కార్డులు
పడుతుంటాయి. అవి ఎప్పటికీ వాళ్లకే
పడుతుంటాయి. అది విచిత్రం.
బతుకులోనూ అంతే. కొందరికి మంచి జరుగుతూనే
ఉంటుంది. తెలియకుండానే జరుగుతూ ఉంటుంది. కొంత మందికి మంచి జరిగినా మంచిలాగ
కనిపించదు. అసలది అర్థమే కాదు. దానితో ఒక రకమయిన భావన మనసులో నిలుస్తుంది.
బలుస్తుంది. అదంతే అన్న భావం వచ్చిన తర్వాత మంచి జరిగినా కనిపించదు. అర్థం కాదు.
తాము పంచినా మరొకరు పంచినా కార్డులు ఒక్కరికే
ఎప్పుడూ మంచివే పడుతున్నాయంటే, అక్కడేదో మోసం జరుగుతున్న భావం కలగడం సహజం. నేను
ఇంటర్నెట్ మీద ఒక తెలివి పరీక్ష తీసుకున్నాను. నిజంగా నాకే ఆశ్చర్యం కలిగేటన్ని
మార్కులు వచ్చినయి. నేను తెలివి గలిగిన మనిషినని ఎన్నో చోట్ల ఎన్నో సందర్భాలలో ఎందరో
ఒప్పుకున్నారు. మామూలు చదువులోనూ మంచి గుర్తింపు సంపాయించుకున్నాను. కానీ, ఈ
ఇంటర్నెట్ వారు మాత్రం, ఫలితం ఇస్తూ, నీవు మోసమైనా చేసి ఉండాలి (ఒక అసభ్యమయిన
మాటతో సహా), లేదంటే నిజంగా గొప్ప తెలివి గలవాడవయినా అయ్యుండాలి అని రాశారు. వారి
పరీక్ష పద్దతిలో అంతగా మోసం చేసే వీలు ఉన్నదీ లేనిదీ వారికే తెలియదా, లేక ఒకనికి
మరీ అంత తెలివి ఉందని ఒక్క సారిగా ఒప్పుకునే ఇష్టం లేకనా వారు ఆ మాటలన్నది
వరుసగా ప్రశ్నలు, వాటికి వేగంగా జవాబులు. ఇక
అక్కడ మోసానికి తావేదీ. పరీక్ష గడిచిన సమయం ఎంతో లెక్కించే వీలు అక్కడ ఉందా, నాకు
గుర్తు లేదు. ఎందుకో నాకు అర్థం కాలేదు గానీ, వారు తెలివి గలవారిని అంత సులభంగా
గుర్తించ దలుచుకోలేదని అనిపించింది. అదే పనిగా గెలుపు పొందే వారి మీద, (మాయావిడ
గారిలాగన్నమాట) మనకు మోసం చేస్తున్నారేమోనని అనుమానం రావడం కూడా ఇట్లాంటిదేనా.
వారు మోసం చేసే అవకాశం లేదని తెలిసి కూడా మనం అట్లా అనుకుంటాము, కదూ!
నేను సైన్సు చదువుతాను. అందరికీ అర్థం
కావాలని సంగతులను చేతయినంత సులభమయిన
మాటల్లో మన భాషలో రాస్తాను. ఆ రకంగా నాకు కొన్ని ఆలోచనలు మనసులో పుట్టి
ఎప్పటినుంచో నిలబడి ఉన్నయి.
ఉదాహరణకు మనమంతా ఈ భూమా మీద ఉన్నాము. అంతకు
ముందునించీ ఈ భూమిఉన్నది.
ఈ భూమి సూర్యుని నుంచి ఒక ప్రత్యేకమయిన దూరములో
ఉంది. అది ఇంకొంచెం దూరంగ ఉందనుకుందాము. భూమి మీద నీరు మంచవుతుంది. అదే ,
సూర్యునికి కొంచెం దగ్గరగ ఉందనుకుంటే నీరు ఆవిరయి పోతుంది. మొత్తానికి భూమి
ఇప్పుడున్న దూరంలో ఉంది గనుకనే నీరు ఉండడమూ, జీవం పుట్టుకా వీలయింది. నీరు ఈ రకంగ
కాక కొంచెం ఎక్కువగనో తక్కువగనో ఉంటే ఏమి పరిస్థతి ఉండేదో తెలియదు.
దూరమన్నది మన ఉనికికి ఆదారమయిన చాలా అంశాలలో
ఒక్కటి మాత్రమే. వాతావరణం ఉన్నది. అందులో ఎన్నో అంశాలున్నయి. ఉదాహరణకు ఒత్తిడి. ఇదొక
పరిస్థితి. దానికొక కొలత. ఈ కొలతలో ఏ మాత్రం తేడా వచ్చినా మనం ఇట్లా ఉండడము
వీలుగాదు. వేడిమి సంగతి కూడ అంతే. ఒకటి రెండు డిగ్రీలు వేడిమి పెరిగిందంటే మనమంత
గిలగిలలాడుతుంటము. ఇటువంటి కొలతలు మనకు తెలిసి, తెలియక ఎన్నో ఉన్నయి.
అన్నిటికన్న ఆశ్చర్యకరమయినది భూమికి ఉన్న ఆకర్షణ
శక్తి.
భూమి పెద్దగ ఉండి ఒక వేగంతో తన చుట్టు తాను
తిరుగుతూ సూర్యుని చుట్టు కూడ తిరుగుతున్నది. కనుక దానికి ఒక ఆకర్షణ శక్తి
పుట్టింది. ఆ శక్తి ఇప్పుడున్నట్టు కాక ఇంకొక రకంగ ఉంటే మనం ఇక్కడ ఉండడం కుదరదు.
ఈ రకంగ చూస్తే, ఎన్ని సంగతులు అనుకూలంగ ఉంటే
మనమున్నము అన్నది అన్నిటికన్న ఆశ్చర్యమయిన ప్రశ్నగా ఎదురవుతుంది.
అయినా మనము నిత్యము ఈ సంగతుల గురించి
ఆలోచిస్తున్నమా? అది ప్రశ్న!
మనమే ఎంతో తెలివిగల వారలమనుకుని గర్వంగ
బతుకుతున్నము.
ఈ ప్రపంచం గురించి మనకెంతో తెలుసునని
విర్రవీగుతున్నము.
మన గురించి మనకే సరిగా తెలియదు. విశ్వం గురించి,
నక్షత్రాల గురించి తెలుసుననుకుంటున్నము.
మనకొక తెలివి, మన అలోచనలకొక పద్దతి ఉన్నదని మన
భావన.
ప్రపంచము, విశ్వము మన కను సన్నలలో ఉన్నయని ఒక
భావన.
ఒక్క క్షణం ఆలోచించండి. ఈ విశ్వమన్న ఆలోచన మన
మనసు, అంటే మెదడులో పుట్టింది కద
సైన్సు, సామాజిక శాస్త్రం, మిగతా తెలివి మొత్తం,
మన మనసులో కలిగిన అవగాహనలు మాత్రమే గద
వీటిలో ఎక్కడన్న కొంచెం లెక్క తప్పి ఉండ కూడదా?
అలోచించండి.
ఎన్ని పరిస్థితులు అనుకూలిస్తే మనం ఇట్ల
ఉండగలుగుతున్నము
మనకు ఎంత అర్థమయింది, ఎంత కాలేదు?
అయినా అంత బాగనే సాగుతున్నదన్న భావన మాతరం మనలో
ఉండనే ఉన్నది.
మాయామెకు మంచి ముక్కలు పడి చీట్లాటలో గెలిస్తే,
అందులో చీటింగ్ ఉందన్న భావన నాకెందుకు?
ఒటమి కలిగినప్పుడల్లా ఎదుటి వారిని చంపుదమన్నంత
కసి ఎందుకు?
అంతా మన నమ్మకమే అయినప్పుడు, ఈ విశ్వం, ప్రపంచం,
మనం, మన తెలివి అన్నీ నమ్మకాలే అయినప్పుడు, మన ఒక్కరి నమ్మకానికి విలువ ఎంత?
అలోచించండి, మీరు కూడా, నా లాగనే!!
Saturday, September 14, 2013
జిడ్డు కృష్ణమూర్తి నాకు తెలుసా?
జేకే మాటలు ఎందరి హృదయాల్లో నాటుకున్నాయో, ఎందరికి నిజంగా అర్ధమైనాయోనని ప్రసంగవశంగా రచయిత ఒకచోట అనుమానం వెలిబుచ్చి మనకు తెలియదు, అంటారు. కానీ, అందరూ ఆయన తమను ఆశీర్వదించాలనుకుంటారు. ఈ దండాలు, దాస్యాలు తప్ప మనకు ఆలోచనలు చేతగాలేదు. ‘మనకు చేతనయిందల్లా సేవ, పూజ, ఆరాధన, దీవెనలు అందుకోవడం మాత్రమే అయ్యుండాలి అంటారు రచయిత. జేకే చూపిన దారిని నడిచే సామర్థ్యం, కుతూహలం, సుముఖత మనలో లేవంటారీయన. అది జేకే దురదృష్టం అనేంతవరకు వెళతారు కూడా!
.................
............
జిడ్డు కృష్ణమూర్తి నాకు తెలుసా?
రచన: నీలంరాజు లక్ష్మీప్రసాద్
పుటలు: 250
వెల:150 రూ/-
ప్రతులకు: నవోదయ బుక్‌హౌస్,
కాచిగూడ, హైదరాబాద్-27
ఫోన్: 040-24652337
...............
.................
............
జిడ్డు కృష్ణమూర్తి నాకు తెలుసా?
రచన: నీలంరాజు లక్ష్మీప్రసాద్
పుటలు: 250
వెల:150 రూ/-
ప్రతులకు: నవోదయ బుక్‌హౌస్,
కాచిగూడ, హైదరాబాద్-27
ఫోన్: 040-24652337
...............
పుస్తకం పేరులో ఒక ప్రశ్న. ఆ ప్రశ్న అడుగుతున్నది రచయిత అయితే, పుస్తకంలోని మొదటి ముప్ఫయిమూడు పేజీలు ప్రత్యక్షంగా, మిగతావి (ఈయన ఇతర రచనలతోబాటు) పరోక్షంగా జవాబు అందిస్తున్నాయి. కృష్ణమూర్తిగారిని ఆయన ‘కృ’ అన్న పేరుతో పిలిచారు. ‘కృ’కు నీలంరాజువారు బాగా తెలుసు. అయినా లక్ష్మీప్రసాద్‌లోని మంచితనం, మిగతా అంశాలను ‘తెలిసినంతమేరకు’ అన్న శీర్షిక కింద చేర్పించింది. ఈ రచయితకు తాను రాయదలచుకున్న అంశం తలకెక్కింది. వొంటబట్టింది. ఆయన సాయంతో పాఠకులు తమను తాము ప్రశ్న అడిగేసుకుని జవాబు వెదుకుతారు, ఈ పుస్తకం చదివితే!
మదనపల్లెలో పుట్టి చిన్నతనంలోనే ఇంగ్లండుకు తరలించబడిన జిడ్డు కృష్ణమూర్తి మనవాడు, తెలుగువాడు అని చెప్పుకోవడం మనలోని ఖాళీతనాన్ని చూపుతుంది. భారతీయుడివా అన్న ప్రశ్నకు ‘అవును. భారతదేశంలో పుట్టాను’ అని జవాబిచ్చాడు జె.కె. జె.కె అన్నపేరు ప్రపంచమంతటా తెలుసు. తెలియనిదల్లా మనకే. ఆయనేదో ప్రపంచానికి దారి చూపిస్తాడనుకుంటూ, అందరం ఆయన చుట్టూ మూగితే, అదేదో మీరే చేయాలి అని దారిచూపించాడాయన. శ్రీకృష్ణమూర్తిగారు, వారు లాంటి సంబోధనలను మించి ఎంతో ముందుకు సాగిన ఆ మనిషి ‘అర్థం కాడు!’ అనే స్థాయికి చేరుకున్నాడు. సమస్య అక్కడే ఉంది. జేకే మాటలు అర్థంకాకపోతే తప్పు ఆయనదా? లేక మనలో ఏదయినా లోపం ఉందా? ఈ రెండవ ప్రశ్నకు జవాబు చెప్పడానికి చేసిన ప్రయత్నమే లక్ష్మీప్రసాద్ రచనల్లో కనబడుతుంది. రచనలు కొన్ని ఒకచోటచేరి ఈ పుస్తకమయింది. దీన్ని నవల చదివినట్లు ఈ చివర నుంచి, ఆ చివర వరకు ఒక్కసారి చదివి, ‘అర్థం కాలేదు’ అని పక్కనబెడితే మాత్రం తప్పకుండా లోపం మనదే.
తెలివిగలవారు కూడా తెలివి అనే బరువు కింద నలుగుతుంటారు. ఆ బరువును తప్పించుకుంటే తప్ప, ఆలోచనలను స్వీకరించడం కుదరదు. ‘పాతది అంతమొందితే తప్ప నూ తన సృష్టి జరగదు’- అని ఈ పుస్తకం మొ దట్లోనే ఒకమాట కనబడుతుంది. దీన్ని గురించి చర్చకు అవకాశం ఉంది. జరగాలి. అందుకు మనం ప్రయత్నించాలి. జేకే చెప్పింది ఈ ప్రయత్నం గురించేననిపిస్తుంది.
జేకే మాటలు ఎందరి హృదయాల్లో నాటుకున్నాయో, ఎందరికి నిజంగా అర్ధమైనాయోనని ప్రసంగవశంగా రచయిత ఒకచోట అనుమానం వెలిబుచ్చి మనకు తెలియదు, అంటారు. కానీ, అందరూ ఆయన తమను ఆశీర్వదించాలనుకుంటారు. ఈ దండాలు, దాస్యాలు తప్ప మనకు ఆలోచనలు చేతగాలేదు. ‘మనకు చేతనయిందల్లా సేవ, పూజ, ఆరాధన, దీవెనలు అందుకోవడం మాత్రమే అయ్యుండాలి అంటారు రచయిత. జేకే చూపిన దారిని నడిచే సామర్థ్యం, కుతూహలం, సుముఖత మనలో లేవంటారీయన. అది జేకే దురదృష్టం అనేంతవరకు వెళతారు కూడా!
అందుకే కుతూహలం (మిగతా లక్షణాలు ఉండనివ్వండి) కలవారంతా ఈ పుస్తకం చదవాలి. ఇందులో మనకు ‘కృ’ ఆలోచనలమీద వ్యాఖ్యానాలు, అన్వయాలు కనబతాయి. భగవద్గీత విన్న తరువాత అర్జునుడు చప్పట్లుకొట్టలేదు. గొప్ప మాట విన్న తర్వాత చప్పట్లతో మన బాధ్యత తీరదు అంటారు ప్రసాద్. ఈయన మనకు సాయపడగలరనడానికి ఇంతకన్నా చక్కని ఉదాహరణ లేదేమో?
ఆనంద సామ్రాజ్యం తాళం చెవి, మనదగ్గరే ఉందన్నా, మనసులో శూన్యం కలిగితే, ఆ సంగతి, శూన్యంపోయిన తరువాత తెలుస్తుంది అన్నా, మనం (చప్పట్లు మాని) ఆలోచనలో పడిపోతాం. పడిపోవాలి. అదే ఈ పుస్తకం ఉద్దేశమనవచ్చు. కొన్ని విషయాలు చటుక్కున అర్థంకావు. అట్లాగని, అసలే అర్థంకావు, అనవచ్చా? సామూహిక అభిప్రాయాల బరువును కాసేపయినా దించుకుని, కనీసం తగ్గించుకుని ప్రయత్నిస్తే, కొత్త అభిప్రాయాలు అర్థమయ్యే వీలుంది. రచయిత ఈ బరువులతో నలిగినవారే. పడుకుని దండం పెడతారన్నారట. జేకే ‘వద్దని’ఆయనే వంగారట!
జేకే మతాలకు అతీతమయిన మాటలు చెప్పారని కూడా తెలియని వారున్నారు. అసలు ఆయన పేరుకూడా తెలియనివారి ప్రసక్తి ఇక్కడ రాదు. అనుకరణ, అనుసరణలు వద్దన్నారు. నేను గురువును కాను, నాకు శిష్యులు, అనుయాయులు లేరు అన్నారు. ఇంకా ఎన్నో అన్నారు! కొండ అద్దంలో లాగ ఆయన ఈ పుస్తకంలో కొంత కనిపిస్తారు.
చివరగా ఒక్క మాట. సామూహిక ఆలోచనల బరువులాంటిదే ఇంగ్లీష్ భాష బరువు కూడా. ఇంగ్లీషు మాటలకు సమానార్థాల పేరున్న పెద్ద మాటలు, ఇంగ్లీష్ పద్ధతి వాక్యాలు ఎదురవుతాయి ఈ పుస్తకంలో. కొంచెం ఓపికగా చదివితే అర్థమవుతాయి.
Subscribe to:
Posts (Atom)