Friday, March 30, 2012

సైన్సంటే ఏమిటి?

‘సైన్సును సమాజంలోకి తీసుకుపోతున్నాము’-అన్నారొక పెద్దాయన. నిజమే. ఆ అవసరం చాలా ఉందనిపించింది, ఆ మాట వినగానే. ఆయనగారికి తెలిసిన సైన్సు, అలాంటి వారంతా చేస్తున్న సైన్సు, అందరికీ పట్టదు. అంత సులభంగా అర్థం కాదు. ఆ సైన్సును ఆయనగారు అరటిపండు గుజ్జులాగా చేసి మన ముందు ఉంచినా, మనకు అదేమిటో అంతుపట్టదు. అసలు, సైన్సు అని ఒకటి ఉందనీ, మనమంతా అందులోనే, దానివలన, దానిచేత బతుకుతున్నామనీ మనకు తెలియదు మరి! ఈ విశ్వంలో, ఈ ప్రపంచంలో సైన్సు కానిది ఏదీ లేదు. ప్రపంచంలో మనం కూడా ఉన్నామంటే, మనం కూడా సైన్సే. ఈ సంగతి తెలియకుండానే మనమంతా బతుకుతున్నాము. మన గురించి, మన బ్రతుకు, పరిసరాలు, ప్రపంచం గురించి మనకు తెలుసనే అనుకుంటాము. కానీ తెలిసింది గోరంత మాత్రమే. అందుకే ‘సైన్సు’ అనగానే ‘ఇది మనది కాదు, మనకు కాదు!’ అన్న భావన ఎదురవుతుంది.



మనమున్నాము. మరిన్ని జంతువులు, చెట్లు, మరెన్నోరకాల ప్రాణులున్నాయి. భూమి, నీరు, గాలి, వాతావరణం ఉన్నాయి. కదలిక, కాలం, విద్యుత్తు, అయస్కాంతం, అంతరిక్షం, నక్షత్రాలు, ఇలా ఎనె్నన్నో ఉన్నాయి. మన నుంచి మొదలు మహా విశ్వం దాకా ఉండే అన్నింటి గురించి, నిర్మాణం, పని తీరు, పరస్పర సంబంధాలు, వాటి వెనుక శక్తుల గురించి తెలుసుకుంటే.. అదే సైన్సు. తెలుసుకోవాలన్న కోరికతో ముందుకు సాగి, మరీ లోతుగా ఆ తెలివిలో మునిగినవారు సైంటిస్టులు. వారికి తెలిసిన సైన్సు, ‘మన గురించి కాదు!’ అనేంత లోతుకు చేరింది. వారికీ, మామూలు మనుషులయిన మనకు మధ్యన దూరం పెరిగింది. మొదటినుంచి మొదలుపెట్టి, సైన్సు గురించి తెలుసుకోవాలని ప్రయత్నించేవారికి, కొంత తెలుసు. వాళ్లు లోతులకు వెళ్లాలనే ప్రయత్నంలో, బ్రతుకులోని సైన్సును మరిచిపోతుంటారు.


సైన్సు అన్నది ఒక మూడు అంతస్తుల భవనమయితే, సైంటిస్టులు పై అంతస్తులో ఉంటారు. మిగతా ప్రపంచం కన్నా వారికి లోతయిన సైన్సు గురించి ఎక్కువ ధ్యాసుంటుంది. మధ్య అంతస్తుతో వీరికి కొంచెం సంబంధాలు ఉంటాయి. ఏ కొందరికోతప్ప కింద అంతస్తు ఒకటి నేల మీద ఉందనీ, అది కూడా సైన్సే అనీ భావం కలగడానికి తీరిక, ఆలోచన ఉండదు. కొంతమంది కింది అంతస్తుతో సంబంధం లేకుండా, తమ ప్రపంచంలో బతుకుతుంటారు. తమ శ్రమ మొత్తం, కింది అంతస్తుతో సహా మొత్తం భవనం కోసమన్న సంగతి వారికి గుర్తుచేయాలి!


మధ్య అంతస్తులోవారు తెలిసీ తెలియక బతుకుతుంటారు. సైన్సు ఉందని తెలుసు. సైన్సన్నా, సైంటిస్టులన్నా బోలెడంత గౌరవం వీరికి! కానీ, సైన్సు కోసం అనుకుని, సూత్రాలను, శాస్త్రాలను చదువుతారే తప్ప, అర్థం చేసుకుని, ప్రభావాలను వెదికే పద్ధతి అలవాటు ఉండదు. వీళ్లకు అప్పుడప్పడు కింద అంతస్తులో వారితో సంబంధాలు ఉంటాయి. కానీ, ఆ సంబంధంలో సైన్సుమాత్రం ఉండదు. జరిగేదంతా సైనే్స అయినా అదింకా సైన్సుగా కనబడదు! సైన్సు భవనంలో కింద అంతస్తు చాలా పెద్దది. అది ఈ ప్రపంచమంత పెద్దది. ప్రపంచమే ఈ అంతస్తు. అందులో మనమంతా ఉన్నాము. మనకు సైన్సు అంటే తెలియదు. మనం, మన బతుకు సైన్సు అని తెలియదు. చెప్పడానికి ఎవరూ రారు. వచ్చినా సరైన మాటలు చెప్పరు. కనుక మనలో కొందరు సైన్స్ అనే మాట వినకుండానే, బతుకు సాగిస్తారు. కొందరు అనకుండా, అందరూ అనడం బాగుంటుందేమో! మీరింత వరకు ఈ వ్యాసాన్ని చదివారంటే, మీరు పై అంతస్తుల గురించి పట్టించుకుంటారనీ, అప్పుడప్పుడు మొత్తం భవనం గురించి పట్టించుకుంటారనీ అనవచ్చు. ‘పిల్లలు చదువుతారు’ అంటారు చాలామంది సైన్సు గురించి మాట్లాడుతూ! ‘మీరెందుకు చదవరు?’ అని వారిని ఎవరడగాలి?


నిద్ర లేచింది మొదలు మరునాడునిద్ర లేచేదాకా, బ్రతుకంతా సైన్సు. శరీరం, దాని పనితీరు, ఆరోగ్యం, అనారోగ్యం, అందుకు కారణాలు, అన్నీ సైన్సు. కూడూ, గూడూ, గుడ్డా, అంతా సైన్సు. అర్థమయితే, అందులో కొంత సాంకేతిక శాస్త్రం ఉంది. అదేదో కొత్త సంగతి కాదు. ఒక విషయం, లక్షణాలు, పరిస్థితులను తెలుసుకుంటే సైన్సు. దాన్ని వాడుకునేందుకు పద్ధతులను సిద్ధం చేస్తే, అది సాంకేతిక శాస్త్రం. ఇందులో యంత్రాలు, పరికరాలు, పద్ధతులూ మొదలయినవి ఉంటాయి. వాటికి ఆధారమయిన సమాచారమంతా సైన్సు. ప్రపంచమంతా సాంకేతిక ప్రపంచమయింది. లాట్రిన్ లేకున్నా సరేగాని, అందరిదగ్గరా సెల్‌ఫోన్‌లు మాత్రం ఉన్నాయని జనాభా లెక్కలవారు చెపుతున్నారు. ఫోన్, ఫ్యానూ, ఫ్రిజ్, కనీసం లైటు, లేకుంటే నూనె దీపం వీటన్నిటిలోనూ సాంకేతిక శాస్త్రం ఉంది. సైన్సు ఉంది. దీపం ఉంది చాలు.. అందులో సైన్సు నాకెందుకు? అని అనుకుంటే, అంతకన్నా అమాయకులు మరొకరు ఉండరు. చమురు దీపంలో ఒత్తి వెలిగిస్తే మండుతుంది. కిరసనాయిలు దీపంలో వత్తి మరోలాగ ఉండాలి. గుండ్రని లైటు బల్బులో వేడి కూడా పుడుతుంది. వేడెక్కని కరెంటు దీపాలున్నాయి. ఇలాంటి సంగతులు మీకు తెలిసే ఉంటాయి. అంటే మీకు సైన్సు తెలుసని అర్థం. అది సైన్సు అని మాత్రం తెలియదు. భవనం మొత్తం సైన్సు. కానీమధ్య అంతస్తులో ‘భట్టీ’ సైన్సు, పైన అంతస్తులో ‘గట్టి’ సైన్సు ఉన్నాయని అనుకుంటాము కొందరము. అసలు మన భవనం సైన్సు అని తెలియకుండానే బతుకుతాము మరికొందరము. అందుకే మనమధ్యకు సైన్సును తీసుకురావాలనుకుంటారు ‘పైవాళ్లు’. వాళ్ల సైన్సు మనకు అర్థం కాదు. మనకు తెలిసిన సైన్సు, మన అనుభవంలోకి వస్తున్న సైన్సు గురించి మనకు సూచన ఇస్తేచాలు. ఈ కింద అంతస్తులోని మన బ్రతుకులు మరింత బాగా నడుస్తాయి.


సైన్సు ఉందనీ, అందుకు సంబంధించి ఒక ఆలోచన పద్ధతి ఉందనీ, తెలియక మనమంతా ‘గుడ్డెద్దు చేలో పడ్డట్టు’ బతుకుతున్నాము. ఆలోచన తీరు కొంచెం మారితే, మనం చేసే పనుల అర్థం తెలుస్తుంది. పరిశీలన, ప్రయోగం, అనుభవాల ద్వారానే ప్రపంచంలోని పద్ధతులన్నీ నడిచాయి. ప్రమిదలో గ్యాసు నూనె అనే కిరసనాయిలును పోసి, దీపం వెలిగిస్తే, వత్తితో బాటు ప్రమిదంతా మండుతుంది. అయినా నేనలాగే చేస్తానంటే, అది సైంటిఫిక్ ఆలోచన కాదు. అలాంటి ఆలోచనలతో గుడిసె, ఇల్లు అంతా మండుతుంది. సైన్సునూ, దాని పద్ధతినీ పట్టించుకోని మన బతుకులు ఈ రకంగానే సాగుతున్నాయి. వ్యవసాయం, ఆరోగ్యం, సదుపాయాలు, వస్తువులు అన్నీ సైన్సులోంచి పుట్టి సాంకేతిక శాస్త్రం ద్వారా మనకు చేరుతున్నాయి. ఆ సంగతి తెలిసీ తెలియక, పట్టించుకోకుండానే వాటిని వాడుకుంటున్న మనకు పై అంతస్తులో వారు, సైన్సును పంచి పెడుతున్నామంటారు. ముందు బతుకును తాకిన సైన్సును అర్థం చేసుకుందాం. తర్వాత మిగతా సైన్సు కూడా అర్థమవుతుంది.

Thursday, March 15, 2012

తెలివి అంటే..?


ఫ్రపంచం గురించి మనకు చాలా తెలుసును, అనిపిస్తుంది. అన్ని రకాల పనులు మనకు వచ్చుననిపిస్తుంది. అయినా, మనకు బాగా అలవాటున్న పనిలో కూడా పొరపాట్లు జరుగుతుంటాయి. ఇక తెలియని పని చేయడానికి పూనుకుంటే, ఏమవుతుందో ఎవరూ ముందుగా చెప్పలేరు. పని బాగా జరగవచ్చు. ప్రహసనంగానూ ముగియవచ్చు!

ఈ మధ్యన ఎక్కడో ఒక వింత సంఘటన గురించి రాశారు. అది నిజంగా జరిగిందా? అని అడగడానికి లేదు. అది కేవలం కల్పన అయ్యుండవచ్చు కూడా. కానీ, అందులోనుంచి ఒక ఆలోచన మాత్రం అందరికీ తప్పకుండా పుడుతుంది. ఒక పెద్దాయన ఇల్లు కట్టిస్తున్నాడు. మధ్యలో పనివాళ్లు, పండగ పేరునో మరో కారణంగానో ఎవరూ రాలేదు. పని నడుస్తున్న పై అంతస్తులో అనవసరంగా మిగిలిపోయిన కొన్ని ఇటుకలున్నాయి. వాటిని కిందకు చేర్చితే, కొంత సమయం ఆదా అవుతుందన్న ఆలోచన పెద్దాయనకు వచ్చింది. తగిన ఏర్పాటు కోసం అతను చుట్టూ గమనించాడు. బరువులను పైకి చేర్చడానికి, బావినుంచి చేంతాడులాగ లాగడానికి ఒక చక్రం అమర్చి ఉండటం చూచాడతను. పని సులభంగానే జరుగుతుందనిపించింది. తాడు కూడా ఉంది. అది చాలా పొడుగుగా కూడా ఉంది. సిమెంటు, ఇటుకను తోడుకోవడానికి అమర్చిన ఒక బకెట్‌లాంటి నిర్మాణం కూడా ఉంది.

అతగాడు తాటిని చక్రం మీదుగా కిందకు వదిలాడు. ఒక చివరను బకెట్‌కు కట్టి మరో చివరను కిందకు వదిలాడు. కిందకు వెళ్లి తాటిని ఏదో బరువుకు కట్టాడు. పైకిపోయి, బకెట్‌ను వేలాడదీసి అందులో ఇటుకలు వేశాడు. కిందకువచ్చి తాటిని వదిలి బకెట్‌ను కిందకు దింపడానికి, నెమ్మదిగా, తాటిని వదలసాగాడు. బకెట్‌లో ఇటుకలు ఆ మనిషికన్నా ఎక్కువ బరువు ఉండడం ఇక్కడి, అసలు విశేషం.

బకెట్ బరువు కారణంగా కిందకు వచ్చింది. తక్కువ బరువున్నాడు గనుక తాటి చివరతో ఇతను పైకి ఎగిరాడు! బకెట్ నేలకు గుద్దుకుంది. దాని అడుగు ఊడింది. బరువు కారణంగా ఇతను కిందకు వచ్చిపడ్డాడు. ఖాళీ బకెట్ పైకిపోయింది. ఈ రెండుసార్లూ బకెట్ ఇతనికి తగిలిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇతను కిందపడ్డాడు. బకెట్ పైకి పోయింది. పడ్డ తాకిడిలో అతడు తాటిని వదిలేశాడు. పక్కకు కదలవచ్చని తోచేలోగా బకెట్ తిరిగి కిందకు వచ్చి ఇతనిపై పడింది!!

ఇలాంటి సంఘటనలు కామెడీ సినిమాల్లోనూ, కార్టూన్ ఫిల్ముల్లోనూ కనబడుతూ ఉంటాయి. నిజంగా మన ముందు జరిగినా, మొదట తప్పకుండా నవ్వు వస్తుంది! కామన్‌సెన్స్ పని చేయకపోవడాన్ని ఆధారంగా ఎన్నో హాస్య సంఘటనలు పుడుతుంటాయి. మనందరికీ ఎప్పుడో ఒకసారి ఇలాంటి అనుభవమేదో ఎదురయి ఉంటుంది. వంట బాగా చేతయిన వారు కూడా చేతులు కాల్చుకుంటూనే ఉంటారు మరి!

మేకును దిగగొట్టాలనే ప్రయత్నంలో సుత్తితో చేతిని కొట్టుకోవడం ఒక మామూలు రకం ఉదాహరణ!
‘పనిలో మూర్ఖత్వంకన్నా భయంకరమయింది మరోటి లేదు’ అన్నాడు జెర్మన్ కవి గ్యోఠే. ఏం చేస్తే ఏం జరుగుతుందని ఊహించగలగడం, మామూలు తెలివికన్నా ఒక మెట్టు ఎత్తున ఉండే మరోరకం తెలివి. పెద్ద వాళ్లనడిగితే, దీన్ని మరింత బరువుగా చెపుతారు. జీవితంలో ఎదురయ్యే సంఘటనలు (సమస్యలు) అవకాశాలను అర్థం చేసుకుని తట్టుకోగలగడం అంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే అది ప్రాక్టికల్ తెలివి. పనితనంలో తెలివి. దీనే్న కామన్‌సెన్స్ అనవచ్చు. ప్రపంచజ్ఞానం అన్నా తప్పుకాదేమో! దీనికి ఒక సిద్ధాంతం ఉండదు. కేవలం సందర్భం మాత్రం ఉంటుంది.

ఒక వ్యక్తి ఉద్యోగం, వ్యాపారం చాలా బాగా చేస్తూ ఉండవచ్చు. కానీ, వీరికి మిగతా మామూలు పనులు అంతగా చేతగాకపోవచ్చు. మాటలాడడం, సరదాగా ఉండడం ఈ మామూలు పనులు అంటే ఆశ్చర్యం లేదు. గొప్ప తెలివిగలవారని పేరున్న వారికి, చొక్కా గుండీ కుట్టుకోవడం చేతగాక పోవచ్చు. అయితే కొంపమునుగుతుందా అని ఎవరైనా అడిగితే చేయగలిగింది లేదు! అందుకే ఈ ప్రాక్టికల్ తెలివిని, మిగతా తెలివి, జ్ఞానాలతోబాటు కట్టడానికి లేదు. చూడడానికి అంతకన్నా లేదు.ఈ తెలివిలో ఎన్నో ఆలోచనలు, మెళకువలు, అలవాట్లు కలగలిసిపోయి ఉంటాయి. ఈ తెలివికీ, ఐక్యూ పరీక్షలకూ సంబంధం ఉండదు. ‘మీకు స్టవ్ రిపేర్ చేయడం కూడా వచ్చా?’ అని అడిగారు ఎవరో! నిజానికి ఆ రోజు వరకు ఆ పని వచ్చునన్న భావం లేదు! అందుకు సంబంధించి ఎక్కడన్నా నేర్చుకోవడం వీలవుతుందా, అంతకన్నా తెలియదు. స్టవ్ రిపేర్ చేయగలగడం ఏ రకం తెలివి? పీహెచ్‌డీలకు ఈ పనికీ సంబంధం లేదే? ఇది మరి ఏ రకం తెలివి?

కూర్చుని, ఆలోచించడం, కాయితాలు నలుపు చేయడం ఒక రకమయిన తెలివి. ఆ కాయితాలను, అందించ వలసిన వారికి, సకాలంలో, అన్నింటికన్నా సులభమయిన పద్ధతిలో అందించగలగడం, మరోరకం తెలివి. అదే దక్షత! ప్రాక్టికల్ తెలివి. ఈ రెండవ రకం సంఘటన, సమస్య, అవకాశం గురించి, ఒక్క మెదడుతో పని చేస్తే లాభం లేదు. మొత్తం శరీరంతో ఆలోచించాలి! శరీరంలోని నాడీ మండలమంతా అందులో పాలు పంచుకోవాలి! చివరకు శరీరంలోని హార్మోనులకూ ఇందులో భాగం ఉంది. అన్నీ కలిస్తేనే ఈ తెలివి పని చేస్తుంది!

తెలివి..
తికమక
నీటిలో కొట్టుకుపోయే వారు, గడ్డిపరక కూడా తమను ఒడ్డుకు చేర్చగలుగుతుంది, అనుకుంటారు! తెలిసి కూడా ఎందుకీ తికమకకు గురవుతాడు మనిషి?

కొన్ని పనులు ఎప్పుడూ ఒకేలాగ జరుగుతుంటాయి. వాటివల్ల మనకు ప్రపంచం మీద పట్టు దొరికిందన్న భావం కలుగుతుంది. అట్లాకాక, కొత్తగా ఏదయినా జరిగితే, అనుమానాలు పుడతాయి.
ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలని మన ప్రయత్నమంతా. ఏం చేస్తే ఏం జరుగుతుందో తెలిసినంత వరకు అంతా క్షేమంగానే ఉంటుంది. అనుభవంలో లేని సంగతులు ఎదురయితే, తికమక, భయం మొదలవుతాయి. గడ్డిపరక కూడా సాయపడగలదేమో అనిపిస్తుంది.

ఏం జరుగుతుందో తెలుసు అనుకుంటే, ఆ ఫలితాల కొరకు చూస్తాము. జరిగింది, ఫలితంగా వచ్చింది మరోరకంగా ఉంటే, ముందు ఆశ్చర్యం, అందులోనుంచి తికమక మొదలవుతాయి. ఇక జరుగుతున్నదేదీ అర్థంకాని స్థితి పుట్టుకు వస్తుంది.
ఒక చేతితో చరిస్తే చప్పట్లు కావు. ఎవరూ లేని అడవిలో చెట్టు విరిగిపడినా చప్పుడు రాదు, అంటారు జెన్ పద్ధతి ఆలోచన గలవారు. వీటిని గురించి ఆలోచించాలి. అప్పుడు అసలు తత్వం అర్థమవుతుంది. తికమకలోనుంచి కూడా ఆలోచన పుట్టాలి. జవాబులేని ప్రశ్నలు పుడతాయి. మొదడు ఖాళీ అవుతుంది. హిప్నాటిస్టులు ఈ పద్ధతిని వాడుకుని మెదళ్లను ఖాళీ చేస్తారట!

ఆలోచనలో...

ఇద్దరు భిక్షువులు సాయంత్రం పూట నడిచి ఎక్కడికో పోతున్నారు. వర్షం కురిసింది గనుక, దారి మొత్తం నీళ్లు నిలిచి ఉన్నాయి. అటువైపున ఒక అందమయిన అమ్మాయి నిలబడి, మడుగు దాటలేక తికమక పడుతున్నది. భిక్షువులలో పెద్దతను, అక్కడికి వెళ్లి, అమ్మాయిని అమాంతంగా ఎత్తి తెచ్చి ఇవతల దింపాడు. ఆ సాయంత్రం చిన్న భిక్షువు పెద్దతని దగ్గరకు వచ్చాడు.
‘మనం భిక్షువులము. అమ్మాయిలను ముట్టుకోగూడదు కదా?’ అని అడిగాడు.
‘అవున’న్నాడు పెద్ద భిక్షువు. ‘మరి మీరు అమ్మాయిని ఎత్తుకుని తెచ్చారెందుకు?’ అడిగాడతను.
పెద్ద భిక్షువు చిరునవ్వు నవ్వాడు. ‘కదూ! నేనామెను అక్కడే దింపేశాను. నువ్వింకా మోస్తున్నావు’ అన్నాడు.

తికమక

గురువు రోషీతో ఒక శిష్యురాలు ‘నాకు మీమీద ప్రేమ పెరుగుతున్నది. తికమకగా ఉంటున్నది’ అన్నది.
‘ఏం ఫరవాలేదు! నీకు నీ గురువు గురించి కలిగే భావాలను నీలోనే ఉంచుకో! నిజానికది మంచిది. నాకు మనిద్దరికి సరిపడేంత క్షమశిక్షణ ఉందిమరి!’ అన్నాడు గురువు.

Tuesday, March 13, 2012

గతంలో దృశ్యాలే!

జరగబోయేది తెలియదు, జరిగిపోయింది మిగలదు... అనికదా మనకున్న అభిప్రాయం. కానీ, మనం బతుకుతున్నది గతంలో అంటే నమ్మగలరా? కనీసం, మనం చూస్తున్నది గతం అంటే అర్థమవుతుందా? కాంతి వేగంగా కదులుతుంది, నిజమే. కానీ, దానికి కూడా ఒక వేగం, పరిధి ఉన్నాయి. మన కంటికి కనిపించే వస్తువు ఏదయినా కాంతి కారణంగానే కనిపిస్తుంది. వస్తువుమీద ప్రతిఫలించిన కాంతి మన కంటికి చేరడానికి కొంత సమయం పడుతుంది. అంటే మనం చూస్తున్న దృశ్యం అంతకాలం కిందటిదని గదా అర్థం! అద్దం ముందు నిలుచున్నామనుకుందాం. మనకు కనిపించే మన తీరు కొంతకాలం కిందటిది. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. ఎంత కాలంకిందటిది? అని ప్రశ్నించిన తర్వాత సంగతి మరింత బాగా తెలుస్తుంది. అద్దానికి మనం అడుగు దూరంలోనే ఉన్నాం. అంత దూరాన్ని దాటడానికి కాంతి సెకండులో వెయ్యి మిలియన్ల భాగం సమయాన్ని మాత్రమే తీసుకుంటుంది. ఆ తేడాను మనం చూడలేము. కనుకనే కనిపించింది ఈ క్షణమే అనుకున్నా తప్పులేదు. వస్తువు నుంచి ఎంత దూరంలో ఉంటే, అది కనిపించే సమయంలో తేడా అంతగా పెరుగుతుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచంలోని వస్తువులు మనకు ఇంచుమించు అదే క్షణంలో కనిపించిన భావం ఉంటుంది గనుక సరిపోయింది. ఒక్కసారి తల ఎత్తి ఆకాశంలోకి చూస్తే, ఈ గతం సంగతి మరింత అనుభవంలోకి వస్తుంది.


చందమామను చూడండి. ఆ గోళం భూమికి అన్నింటికన్నా దగ్గరలోగల అంతరిక్ష విశేషం. సగటున చందమామ మననుంచి 3,80,000 కిలోమీటర్లు (2,36,120 మైళ్లు) దూరంలో ఉంది. కనుక మనం చూస్తున్న చంద్రబింబం, ఒక సెకండు కింద ఉండిన తీరు మాత్రమే! సెకండుతేడా తెలిసే వీలుంది. కానీ, అంత దూరం దృశ్యంలో ఆ తేడా కనబడటం లేదు. మరిక సూర్యుని వేపుచూడండి. గతం బతుకు కథ మొదలవుతుంది!

సూర్యనక్షత్రం మన నుంచి 150 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. కిలోమీటర్లలో చెప్పాలంటే 93 మిలియనులు. అంతరిక్షం లెక్కలో చూస్తే, అది మనకు అన్నిటికన్నా, దగ్గరలో వున్న నక్షత్రం. ఇక్కడ కాంతి వేగం గురించి కొంచెం తెలిసే వీలుంది. మనం ఈ క్షణాన సూర్యుని చూస్తున్నామంటే... అది ఎనిమిది నిమిషాల కిందటి బింబం లేదా దృశ్యం! ఏం చేసినా వీలుగాదు, గానీ, ఒక సంఘటనను ఊహించండి. ఒక్కసారిగా సూర్యగోళం మాయమయిందనుకోండి. ఆ సంగతి మనకు ఎనిమిది నిమిషాలదాకా అర్థం కాదు. అంటే సూర్యుని వెలుగు, వేడిమి ఆ ఎనిమిది నిమిషాల కాలంపాటు మనకు అందుతూనే ఉంటుంది. సూర్యుని ప్రభావం కూడా అంతసేపు వరకు కొనసాగుతూనే ఉంటుంది. గ్రహాలన్నీ సూర్యుని గురుత్వాకర్షణ కారణంగా ఆ గోళం చుట్టూ తిరుగుతున్నాయి. సూర్యుడు మాయమయినా ఆ గురుత్వాకర్షణ కూడా కొనసాగుతుంది. ఆ ఎనిమిది నిమిషాలు గ్రహాలు... లేని సూర్యుని చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. సూర్యుడిని చూడడమంటే గతంలోకి చూడడమని అర్థమయి ఉంటుంది. ఆ గతం వెలుగు, వేడి ఆధారంగానే మనం చూడగలుగుతున్నాము. బతక గలుగుతున్నాము!


గతంలోకి మన చూపు ఇక్కడ మొదలవుతుంది. ఇక మరింత దూరం చూచిన కొద్దీ మనం, మరింత గతంలోకి వెళ్లిపోతాము. గ్రహాలు, వాటి చుట్టూ ఉండే ఉపగ్రహాలు మనకు తెలుస్తున్నాయి. కానీ తెలిసేది... అవి కొంత గతంలో ఉండిన పరిస్థితి మాత్రమేనని అర్థమయే ఉంటుంది. అంగారక గ్రహం, భూమి... సూర్యుని చుట్టూ ఒకే మార్గంలో, ఒకే దూరంలో తిరగవు. మార్గాలు రెండుగా, ఒకదానికొకటి దూరంగా ఉన్నాయని సులభంగానే అర్థమవుతుంది. కానీ, వాటి మధ్య దూరం మారుతూ ఉంటుందంటే ఆలోచన కొంత దూరం సాగాలి. కనుక అంగారక గ్రహం మనకు ఉండే దూరాన్ని బట్టి, దాని దృశ్యం మనకు నాలుగు నుంచి పనె్నండు నిమిషాలు తేడాతో కనబడుతుంది.


మానవుడు అంగారక గ్రహం మీద దిగడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగా మనుషులు లేని పరిశోధక నౌకలను గ్రహంమీద దింపి పరిశీలనలు జరిపించాడు. ఈ క్షణాన కనిపించేది ఈ క్షణం దృశ్యం, స్థానం కాదని తెలుసు. లెక్క సరిగా చేస్తే గానీ, గ్రహాన్ని సరిగా చూడడం, దాని మీదకు ఒక నౌకను దింపడం కుదరదు. ఎంత విచిత్రమో ఊహించండి. అక్కడ దిగిన యంత్రం పేరు మార్చ్ రోవర్. అంగారక గ్రహం మనకు వీలయిన ఎక్కువ దూరంలో ఉందంటే, దాని దృశ్యం పనె్నండు నిమిషాల తరువాత కనబడుతుంది. అక్కడ కదులుతున్న మార్చ్ రోవర్‌కు ఒక సంకేతం పంపించాలి. దాన్నుంచి మన వరకు సమాచారం అందాలి. ఈ రెంటికీ కనీసం నలభయి నిమిషాలు పడుతుంది. నౌక ప్రమాదంలో ఉందంటే, భూమి మీది పరిశోధకులు ఏదో చేయాలన్న ప్రయత్నానికి అర్థంలేదు! అందుకనే, ఈ రకం యంత్రాలన్నీ తమ నిర్ణయాలు తాము చేసుకునే రకంగా తయారుచేస్తారు. అవి నెమ్మదిగా పనిచేస్తాయి కూడా!


గురుగ్రహం మనకు దగ్గరగా ఉన్న సమయంలో కనిపించేది ముప్ఫయి రెండు నిమిషాల క్రిందటి దృశ్యం. మనమింకా సౌరమండలంలోనే ఉన్నాము. అంచుల్లో ఉన్న నెప్ట్యూన్ గ్రహం నాలుగు గంటల క్రిందట దృశ్యం మాత్రమే మనకు కనబడుతుంది.


వోయేజర్ వన్ అనే అంతరిక్ష పరిశోధక నౌక ఆ దూరాలను దాటి అంతరిక్షపులోతులోకి కదిలిపోతూ ఉంది. సౌర మండలం వెలుపలి అంచులనుంచి అది భూమికి అందించిన సమాచార సంకేతం ఇక్కడికీ లేదా ఇక్కడనుంచి పంపిన సందేశం, అక్కడకు చేరడానికి 31 గంటల 52 నిమిషాలు 22 సెకండ్లు. ఇది కూడా 2010 సంవత్సరం నాటి లెక్క! ఇంకా లోతులలో ఉండే నక్షత్రాలు, పన్సార్లు, క్వేజార్లనుంచి మనమున్న దూరం లెక్కలను అందుకే గంటలలో కాక, కాంతి సంవత్సరాలలో కొలుస్తారు.


టెలిస్కోపు అవసరం లేకుండా మామూలు కంటికి కనిపించే చేరువ నక్షత్రం ఆల్ఫాసెంటారి! అది మనకు నాలుగు సంవత్సరాలు క్రితమున్న తీరుగా కనబడుతున్నది. నక్షత్రాలు అంతరిస్తాయని తెలుసు గదా! అంతరించిపోయి, ప్రస్తుతం లేని నక్షత్రాలను దూరం కారణంగా, మనమింకా చూడగలుగుతున్నామంటే నమ్మగలరా? మరిక మనం గతంలో బతుకుతున్నామంటే ఆశ్చర్యం ఏముంది?

Saturday, March 10, 2012

ఆఫీసులో ఫోను

ఫోను లేనిదే ఎవరికీ దినం గడవడం లేదు. కానీ, చాలామందికి ఫోనులో మాట్లాడే పద్ధతి తెలియడం లేదు. ఆఫీసులోనయితే ఫోను విషయంలో మరింత శ్రద్ధ అవసరం.

# మూడు రింగుల లోపలే ఫోను ఎత్తి ఆన్సర్ చేయం గౌరవకరంగా ఉంటుంది. నిజంగా బిజీగా ఉంటే, అటువేపువారికి ఆ మాట చెప్పండి. అర్జెంటయితే వారు లైనులో ఉంటారు. లేదంటే మరో మారు ఫోన్ చేస్తామంటారు. అది మీరు కూడా నిర్ణయించవచ్చు.


# ఫోన్‌లో వారి మీద మీ చిరాకు, పరాకు ప్రయోగించకండి. చిరాకులో ఉన్నాసరే, ఫోన్‌లో మాత్రం ఉత్సాహంగానే మాట్లాడాలి. అవతల వారికి మీ పరిస్థితి తెలిసి ఉండదు. వారు మీరే మీ కంపెనీ పద్ధతులకు ప్రతిబింబం అనుకుంటారు.


# మీ పేరు చెప్పి గ్రీట్ చేస్తే, సంభాషణ నేరుగా విషయంలోకి వస్తుంది. కంపెనీ గురించి, కావలసిన మనుషుల గురించి అవసరమయిన ప్రశ్నలుండవు.


# ఫోన్‌లో నెమ్మదిగా, తక్కువస్థాయి గొంతుకతో మాట్లాడడం మంచిది. గుసగుసలాడడం తప్పు. అవతలివారికి మన గొంతు స్ఫుటంగా వినిపించాలి.


# మొరటుతనం ఏ మాత్రం కూడదు. ‘తెలియదు!’ అనేకన్నా‘తెలుసుకుని చెపుతానండీ!’ అంటే గౌరవంగా ఉంటుంది.


# మరొకరికి ఎవరికయినా మెసేజీ తీసుకోవలసి వస్తే, వివరాలన్నీ రాసుకోవాలి. మెసేజ్‌ను మరిచిపోకుండా అందించాలి. 



చిన్న చిన్న జాగ్రత్తలతో మన కంపెనీ, ఆఫీసు, చివరకు మనం మంచితనానికి గుర్తులుగా మిగులుదాం.

Thursday, March 8, 2012

ఆలోచన -అనుసరణ


చేయదలుచుకున్న వారికి చేతి నిండా పని ఉంటుంది. అలాంటివారికే మరింత పని వచ్చి నెత్తినపడుతుంది. అయినా పని అలవాటు గనుక, అన్ని పనులూ చేయాలనుకుంటారు ఈ రకం మనుషులు. తెల్లవార్లూ పనిలో తలమునకలవుతుంటే, కొంచెం ఆలోచించడానికి, కొత్త దారులు వెదకడానికీ వెసులుబాటు ఉండదు. కొన్ని సులభమయిన పద్ధతులను పాటిస్తే, ఆ తీరిక కూడా దొరికే వీలు ఉంటుంది.

చదవడంలో జాగ్రత్త: 

ఈమధ్యన ఇంటర్‌నెట్, ఈ-మెయిల్ వచ్చి మనల్ని సమాచారంలో ముంచెత్తుతున్నాయి. కంప్యూటర్ కనిపించిన మరుక్షణం మెయిల్, రీడర్ చూడడం అందరికీ బాగా అలవాటయిపోయింది. వచ్చిన మెయిల్‌లో నిజంగా పనికివచ్చేవి, అవసరమయినవి చాలా తక్కువగా ఉంటాయి. మిగతావన్నీ ‘లేకున్నా ఫరవాలేదు’ రకమే. కానీ వాటిలో కొన్ని ఆకర్షిస్తాయి. అక్కడే మనల్ని నిలబెడతాయి. ఈరకం మెయిల్స్‌ను తరువాత చూడవచ్చేమో గమనించండి.

చదువుతున్నది కాలక్షేపం కొరకయినా, కథ, నవల ఈ చివరి నుంచి ఆ చివరిదాకా చదవవలసి ఉంటుంది. వార్తాపత్రిక చదివే పద్ధతి కూడా ఉంది. శీర్షికలు చూస్తూపోయి నిజంగా ఆసక్తికరమయిన అంశాలను మాత్రమే పూర్తిగా చదువుతాము. ఈరకంగా ఒకటికన్నా ఎక్కువ పేపర్లు చదివినా ఫరవాలేదు. నిజంగా అవసరమనిపిస్తే, ఆ మెయిల్సూ, ఆ చదవడం తరువాత కూడా కొనసాగించవచ్చు.

ఇవాళటి పనులు: చాలామందికి ఉదయం నిద్రలేవగానే ఆనాడు చేయవలసిన పనులను గుర్తుతెచ్చుకోవడం అలవాటు. అంతటితో ఆగకుండా, చేయవలసిన పనులను ఓ కాయితం మీద రాసి ముందు ఉంచుకుంటే మరింత మేలు. వాటి ప్రాముఖ్యతను, అవసరాన్ని బట్టి పనులను ఒక క్రమంలో చేస్తూ వెళ్లవచ్చు. ముంచుకువచ్చే పనులు కొన్ని ఉంటాయి. వాటిపేరున ముందు నిర్ణయించుకున్న పనులు పక్కనపడిపోతాయి. అవి మరునాటికి ముంచుకు వచ్చే పనులవుతాయి. ‘గుర్తుంటుందిలే!’ అనుకోకుండా లిస్టు వేసుకోవాలి. ఒకటే లిస్టు ఉండాలి. దానికి కట్టుబడి పనులను చేస్తూ పోవాలి! ప్రతి వస్తువుకూ ఒక చోటు: ప్రయత్నించి ఒక పని చేయాలని మొదలుపెడతాము. అందుకు అవసరమయిన చిన్న వస్తువు ఏదో కనిపించదు.

దాన్ని వెతకడం పేరున కొంత కాలం వృధా. వెతుకుతుంటే, మధ్యలో ఆసక్తికరమే గానీ, అనవసరమయిన మిగతా వస్తువులేవో కనబడతాయి. వాటితో మరింత కాలం వృధా! ముందు రకరకాల పనులకు సంబంధించిన వస్తువులు ఉంటే, అవన్నీ ‘నేను ముందు’ అంటూ మనలను పిలుస్తూ ఉంటాయి. అందుకే వంటింట్లో మొదలు, ఆఫీసులో బల్లమీద దాకా, ప్రతి వస్తువుకూ ప్రత్యేకంగా ఒక చోటు ఉండాలి. అందులో సులువు అనుభవంలోకి వస్తేగాని అర్థం కాదు!

ఏది ముందు? ఏది తరువాత?: 

ఈవిషయం గురించి ఎంత చెప్పినా తక్కువే. కొన్ని పనులు ముఖ్యమైనవి. ఎక్కువ ముఖ్యం, తక్కువ ముఖ్యంగా ఇవి మళ్లీ రెండు రకాలు. కొన్ని పనులు అర్జెంటుగా ముంచుకు వస్తాయి. వీటిలోనూ రెండు రకాలుంటాయి. వీటిని మొత్తంగా కలిపి చూస్తే మొత్తం పనులు నాలుగు రకాలవుతాయి. వాటిలో మనం సాధారణంగా అర్జెంటును ఎక్కువగా పట్టించుకుంటాము. గొప్ప పనిలో ఉండగా ఫోను మోగుతుంది. దానికి జవాబివ్వడం అందరికీ అర్జెంటుగా తోస్తుంది. అది నిజమే. కానీ, ఆ ఫోన్ ఎవరినుంచి, ఎందుకు తెలిసిన తర్వాత అది అర్జెంటు, అవునా కాదా నిర్ణయించగలగాలి.
విరామం, రానున్న పనులను, రేపటి, ఆ తర్వాతి పనులను గురించి ఆలోచించడం, పథకం వేయడం ముఖ్యమే కానీ అర్జెంటు కాదు. అందుకే అందరూ ఈ పనులను వాయిదావేస్తుంటారు. విరామం లేకుంటే శరీరం ఎప్పుడో ఒకసారి సహకరించడం మానేస్తుంది. రానున్న పనులను పట్టించుకోనందుకు, అవి ముఖ్యం నుంచి ‘ముంచుకువచ్చే’ లిస్టులోకి దూకేస్తాయి. అందుకే, ఏ పని ఎప్పుడు చేయాలని నిర్ణయించడం ఎంతో అవసరం.

ముఖ్యమయిన పనుల మీద శ్రద్ధ

చాలామందికి తమ పనితనం మీదగొప్ప నమ్మకం ఉంటుంది. ముఖ్యంగా కంప్యూటర్ వచ్చిన తర్వాత ఈ మల్టీ టాస్కింగ్ మరీ ఎక్కువయింది. ముఖ్యమయిన పని చేస్తున్నప్పుడు ధ్యాసంతా దానిమీదే ఉంటే మంచిది. కానీ, అంతగా పట్టించుకోనవసరం లేకుండా రోటీన్‌గా చేసే పనులు కొన్ని ఉంటాయి. నిజానికి అలాంటి పనులను అన్నీ ఒకేసారి లేదా రెండు మూడు ఒకేసారి చేయడమే మంచిదినిపిస్తుంది. ఎవరితోనో ‘చాట్’ చేయడానికి ప్రత్యేకంగా ‘టైం స్లాట్’ అవసరంలేదు. మరో పని చూస్తూ ఈ హస్కు కొనసాగించవచ్చు. ఎప్పుడయినా చేయగలిగే పనులు: ఎవరో వస్తామంటారు. అనుకున్న సమయానికి రాలేకపోతారు. వారికోసం వేచి చూస్తూ గోళ్లు గిల్లుకోనవసరం లేదు. మధ్యలో ఆపినా ఫరవాలేదనిపించే పనులు కొన్ని ఉంటాయి. వాటిని ముందేసుకుని కూచుంటే రావలసినవారు వచ్చేదాకా కాలం వృధా కాదు. వారు రాగానే పని ఆపి, మళ్లీ తర్వాత ప్రారంభించవచ్చు.
అదేపనిగా చింత: అనుకున్నదేదో జరగలేదు. దాన్ని గురించి అదేపనిగా బాధపడుతూ కూచుంటే అర్థం లేదు. మరో పనేదో చేస్తుంటే, మనసు బాగుపడుతుంది.

సమస్యకు సరైన సమాధానం కూడా దొరికే వీలు ఉంటుంది. ఇవన్నీ చాలామంది తెలియకుండానే పాటిస్తుంటారు. తెలిసి పాటిస్తే మరింత మేలు.

వడిగల గుర్రం

చైనా కథ
ఒక రాజుగారు! ఆయనకు మంచి వడిగల గుర్రం ఒకటి నాకు ఉండాలనిపించింది. దానికి ఎంత విలువయినా ఇవ్వాలనిపించింది. ఆ మాటేచెప్పి ముగ్గురు మనుషులను దేశాల మీదకు పంపించాడు. మూడేళ్లు గడిచాయి. ఆ తర్వాత ఆ ముగ్గురూ ఉత్తి చేతులతో తిరిగి వచ్చారు. అనుకున్న లక్షణాలున్న గుర్రం దొరకలేదన్నారు.

రాజుగారి అంతరంగికులలో ఒకతను, ‘ఈసారి నన్ను వెదకనివ్వండి’ అన్నాడు. రాజుగారు సరేనన్నారు. ఆంతరంగికుడు బయలుదేరాడు. సాటిలేని ఒక గుర్రం గురించి వార్త తెలిసింది. అతను ఆ స్థలానికి చేరుకున్నాడు. కానీ, గుర్రం, యుద్ధంలో మరణించింది. ఆలోచన గల ఆంతరంగికుడు బోలెడు ధర యిచ్చి, చనిపోయిన గుర్రం తల కొని తెచ్చాడు. దాన్ని చూచిన రాజుగారు కోపగించుకున్నాడు. ‘కొంచెం ఓపిక కావాలి ప్రభూ’ అన్నాడు ఆంతరంగికుడు.

గుర్రం తల వెల గురించి ప్రపంచమంతటా వార్త వ్యాపిచింది. రాజుగారికి గుర్రాలమీద అభిమానం అందరికీ తెలిసింది. ఎందరెందరో ఆయనకు గుర్రాలను తెచ్చి చూపించారు. రాజుగారికి మంచి గుర్రాలు ఒకటికన్నా ఎక్కువే చిక్కాయి!

ముక్కుసూటిగా!

ఇంగ్లీషులో అసర్టివ్‌నెస్ అని ఒక మాట ఉంది. ఇతరులతో వ్యవహారం సాగించే సందర్భంలో నమ్మకంగా, సూటిగా ఉండడమని ఆ మాటకు అర్థం. ఎదుటివారు ఏమనుకుంటారోననీ, మంచితనం పేరునా చాలామంది ఈ లక్షణాన్ని పక్కన బెడుతుంటారు. ముక్కుసూటితనానికి మొరటుతనానికి తేడా ఉంది.

పిల్లిని తరిమితే, ప్రదేశాన్నిబట్టి దానికి రెండు మార్గాలున్నాయి. భయపడి పరుగెత్తడం, ధైర్యంగా ఎదురుతిరగడం. మనుషులకు మరో మార్గం కూడా ఉంది.

లొంగిపోవడం: లేదా తల వంచడం: అంటే విషయం గురించి మన అభిప్రాయాలను, భావాలను చెప్పలేకపోవడం. ఈ పద్ధతివల్ల అంతా చిక్కులే. పని చేస్తున్నవారి మీద మరో పని వచ్చిపడటం ఈ మొహమాటం వల్లనే. ఇలాంటి సందర్భంలో లోపలే కుమిలిపోవడమే మిగులుతుంది.

మొరటుతనం: అనవసరంగానే కోపం తెచ్చుకుని, వీలయితే వాదానికి దిగడం మరో మార్గం. ఇది పిల్లి ఎదురు తిరిగినట్టు ఉంటుంది. దీనివల్ల ఎవరికీ లాభం లేదు. దాంతో కోపం చికాకు మరింత పెరుగుతుంది! ముక్కుసూటి పద్ధతి: కోరికలు, భావాలను సూటిగా చెప్పగలగడమే ఆసర్టివ్‌నెస్. ‘నావల్ల కాదు’ అని చెప్పగలిగే లక్షణమిది. అందులో మొరటుతనానికి చోటులేదు. దీన్ని గురించి ఎంత తెలుసుకుంటే, ఎంత అనుసరిస్తే, అందరికీ అంత మేలు!

Tuesday, March 6, 2012

గుర్తుంచుకోవాలి


ప్రపంచంలో మనిషికున్నంత తెలివి మరో జాతికి లేదు. మనిషి తన పరిణామక్రమంలో తెలివిగా మిగతా జంతువులనూ, ప్రపంచాన్ని వాడుకోవడం నేర్చుకున్నాడు. వ్యవసాయం, నాగరికత, కళలు, సైన్సు, రాజకీయం అన్నీ ఈ తెలివితోనే సాధ్యమయ్యాయి. మిగతా జంతువులు లేకుంటే ఈ ప్రగతి కొంచెం కూడా వీలయ్యేది కాదనవచ్చు. అవి మనకు ఆహారాన్ని యిచ్చాయి. స్వయంగా అవే ఆహారమయ్యాయి. దుస్తులయ్యాయి. తోడు నిలిచాయి. ప్రేరణనిచ్చాయి. మన కాయకష్టంకన్నా పశువుల శ్రమే ఎక్కువని చెప్పనవసరంలేదు. చివరకు వినోదానికి కూడా ఈ జంతువులే
ఆధారాలవుతున్నాయి. నాగరికతకు, మనుగడకు దారులు వేసిన మహనీయులను గుర్తుంచుకుని పండగ చేయడం మనిషికి అలవాటు.

కానీ, జంతువుల సేవను మనం అంతగా పట్టించుకున్నట్లు కనబడదు. మొక్కుబడిగా వన్యప్రాణి వారోత్సవం చేస్తాం గాని, కుక్కల పేరున, ఆవుల పేరున పండగ చేయడం మరిచిపోయామా? పరోక్షంగా సేవ చేసే జంతువులు సరేసరి!

బీటూ పులి

పులులను చూడడానికి దేశ దేశాలు నుంచి జనం మన దేశానికి వస్తుంటారంటే ఆశ్చర్యం కాదా? వాటిని చంపకుండా, బతికిస్తేనే ఎక్కువ లాభమని ఎందుకు తోచదని ప్రశ్నిస్తారు విషయం అర్థమయినవారు. పులులున్న ప్రాంతంలో బిక్కుబిక్కుమంటూ బతికే పల్లెవారిని అడిగితే, మరింత బాగా పరిస్థితి అర్థమవుతుంది. వారికి పులి శత్రువు కానేకాదు!

ఒంటరిగా, భయమెరుగకుం డా తిరుగుతుంటే ఈ బలిష్ట మృగం అందరికీ ఆకర్షణే. బంధన్‌గడ్ పార్క్‌లో బీటూ అనే పులి
ప్రపంచమంతటా ప్రసిద్ధి చెందిన ప్రాణి. ఈ మగపులికి అసాధారణంగా తన కూనల మీద ప్రేమ ఉండేదంటారు పరిశీలించినవారు.

ఇంటర్నెట్‌లో ఈ పులి గురించి సెర్చ్ చేసి చూడండి. అంతులేని వీడియోలు దొరుకుతాయి. పర్యాటకులకు బీటూ కనిపించిందంటే పండగ! అడపాదడపా బీటూ పల్లెల మీద పడి పశువులను ఎత్తుకుపోయేది. అయినా పల్లెవారికది హీరోగానే మిగిలింది. బీటూ తండ్రి పేరు ఛార్జర్. అది అంతర్జాతీయ పత్రికల ‘అట్టమీద బొమ్మ’గా ఎన్నిసార్లు వచ్చిందో లెక్కలేదు. పదేళ్లపాటు అందరినీ ఆకర్షించిన ఛార్జర్... పులుల సంరక్షణకు ఉత్తమ ఉదాహరణ!

* పులులను గుర్తుంచుకోవడానికి, అది ఎంతమంది మనుషులను చంపింది? అనే లెక్క ఆధారంగా ఉందంటే నమ్మగలరా? నేపాల్- భారత్ సరిహద్దు ప్రాంతంలో చంపావత్ అనే పులి ఉండేది. అది 436మందిని చంపింది. 1907లో అదికూడా చనిపోయింది!

లైకా కుక్క 

కుక్కకు, మనిషికీ గల సంబంధం పురాతనమయింది. కానీ, అంతరిక్షంలోకి ఒంటరిగా వెళ్లిన లైకా కథతో కుక్కల చరిత్ర మలుపు తిరిగింది. 1957 నవంబర్ మూడున రష్యావారు స్ఫుత్నిక్-2 అనే అంతరిక్ష నౌకను ప్రయోగించారు. స్ఫుత్నిక్ ఒకటిలాగా కాక ఈసారి నౌకలో ఒక పాసింజర్ ఉండడం విశేషం. ఆ పాసింజర్ లైకా అనే మచ్చల కుక్క. అది మాస్కో నగరంలో విచ్చలవిడిగా తిరుగుతున్న ఊరకుక్క. దానికి చలి, ఆకలి బాగా అలవాటు! కుక్కనుగానీ, నౌకనుగానీ తిరిగి భూమికి చేర్చే ప్రయత్నం అప్పట్లో వీలేలేదు. నౌకతోపాటు లైకా కూడా పోవలసిందే. నిజానికి నౌకను ప్రయోగించిన
కొన్ని గంటలలోనే లైకా చనిపోయింది. రష్యావారు ఈ సంగతిని 2002 దాకా రహస్యంగా ఉంచారు. ప్రయోగించిన నౌక భూమి
చుట్టూ రెండు, మూడుసార్లు తిరిగే లోపలపాడయింది. అపుడు పుట్టిన వేడికి లైకా బలయింది. కానీ లాంచింగ్, టేకాఫ్ లాంటి పరిస్థితులకు జీవులు తట్టుకోగలుగుతాయని రుజువుచేసిన ఘనత లైకాకు దక్కింది.

ఆ తరువాత మరో 8 కుక్కలు అంతరిక్షంలోకి వెళ్లాయి. వాటిలో ఆరు క్షేమంగా భూమికి తిరిగివచ్చాయి. చివరకు 1961లో గగారిన్ అంతరిక్షంలోకి వెళ్లివచ్చిన తొలి మానవుడిగా పేరుపొందాడు. ఆ తర్వాత అంతరిక్ష యాత్రలు ఆటగా మారాయి.

* రష్యాలో లైకా బొమ్మతో పోస్టర్లు, పోస్ట్‌కార్డులు, స్టాంపులు వచ్చాయి ఆ రోజుల్లో.

Thursday, March 1, 2012

సమస్యలూ - సమాధానాలూ!

కష్టాలు మనిషికి కాక మానుకు వస్తాయా? అని ఒక మాట ఉంది. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అని మరో మాట ఉంది. మానులకూ, పీతలకూ కష్టాలుంటాయి. వాటి నుంచి బయటపడే దారులు కూడా మానుకు, పీతకూ తెలిసే ఉంటాయి. ఇక మనిషి కూడా సమస్యనుంచి బయటపడే దారి తెలిసినంత వరకు ఫరవాలేదు. కానీ తెలివిగా సమస్య నుంచి బయటపడటం అందరికీ చేతగాదు. అందుకు వారి తెలివే అడ్డుపడుతుందంటే ఆశ్చర్యం కాదు? సమస్యను సరిగా గుర్తించడంలోనే సమస్య ఉంది. సమస్యకు వీలయినన్ని సమాధానాలు వెదకడం అంతకన్నా పెద్ద సమస్య! ప్రతి సంగతి గురించి, అందరికీ అభిప్రాయాలు, అవగాహనలు ఉంటాయి. అవి సమాధానం వెదికే దారికి అడ్డుపడతాయి. కొందరిలో అవి మరీ బలంగా అడ్డు పడతాయి. ఈ అడ్డుపడడం తెలియకుండానే జరుగుతుంది. సమస్య మరీ బలంగా కష్టాలకు దారి తీసినా మనస్తత్వం అర్థం కాకపోవచ్చు. సమస్య అసలు లేదనుకోవడం ఒక సమస్య. తర్వాత చూద్దాము అనుకోవడం మరొక సమస్య! అంతకుముందు కలిగిన అభిప్రాయాలు అన్నిటికన్నాపెద్ద సమస్య!

అనుభవాలు విచిత్రమయినవి. అనుక్షణం మన మెదడులోకి అంతులేకుండా సమాచారం వస్తూనే ఉంటుంది. ఈ సమాచారాన్నంతా నిజానికి మనం గ్రహించలేము. నేను ఈ అక్షరాలు రాస్తుంటే కింద ఇంట్లో ఎవరో మాట్లాడుతున్నారు. అలాగే మీరు వాక్యాలు చదువుతూ వుంటే బయట వేడి, కాగితం స్పర్శ, కంప్యూటర్ చప్పుడు, వెలుగు అందుతున్న తీరు, ఎనె్నన్నో సంగతులు తెలుస్తుంటాయి. ఈ సమాచారమంతా అందుతున్నది. మెదడు ఆ సంగతులను గురించి చేయవలసిందేదో చేస్తూనే ఉన్నది. కానీ, మీ చూపుమాత్రం చదవడం మీద మాత్రమే కేంద్రీకృతమయి ఉంది.
ఏ సందర్భంలోనయినా, పట్టించుకోనవసరం లేని సంగతులేవో మెదడుకు తెలుసు. లేదంటే, అంతా గందరగోళమవుతుంది. కానీ ఈ పట్టించుకోవనవసరం లేదనుకున్న సంగతులు కొన్ని చోట్ల, సమస్యను కనబడకుండా చేస్తాయి. సమాధానం తోచకుండా చేస్తాయి. తెలియకుడానే, కొన్ని రకాల సమాచారాన్ని మెదడు పక్కన పెడుతుంది. కనుక సమస్య తాలూకు అసలయిన రూపం అర్థం కాదు.


చదువుకున్నవారికన్నా మేలని కొందరి గురించి చెపుతారు. వారికి అవసరమయిన సమాచారం వారికి బాగా తెలుసు. చదువు ఎక్కువయిన కొద్దీ, అనుభవం పెరిగినకొద్దీ ఫిల్టరింగ్ కూడా పెరుగుతుంది. నిజంగా చదువుకున్నవారు సమస్యల గురించి తెలివిగా, సృజనాత్మకంగా ఆలోచించ లేకపోతారు. అయిదు సంవత్సరాలు దాటని పిల్ల తెలివి వందయితే, 40 సంవత్సరాలు దాటిన వారి తెలివి రెండు మాత్రమే అంటున్నారు పరిశోధకులు.


నూనె గానుగ తిరుగుతున్నది. గానుగ స్వంతదారు అక్కడ లేడు. తార్కికుడు ఆశ్చర్యంగా బుద్ధిగా తిరుగుతన్న ఎద్దును గమనించాడు. గానుగ మనిషిని పిలిచి ‘గానుగ ఆడుతున్నట్లు ఎట్లా తెలుస్తుంది? అని అడిగాడు. ఎద్దుమెడలో గంట ఉంది గదా అన్నాడు గానుగ మనిషి. ఎద్దు ఒకే చోట నిలబడి మెడ ఆడిస్తే ఏం చేస్తావన్నాడు పండితుడు. నా ఎద్దు నీలాగ చదువుకోలేదు. దానికలాంటి ఆలోచనలు రావన్నాడు గానుగ మనిషి!


చదువులో ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం ఒకటి ఉంది. మిగతా జవాబులన్నీ తప్పులే. వాటినసలు పట్టించుకోనవసరం లేదు. చదువులో బోలెడు నియమాలు, పరిధులు ఉంటాయి. కొత్త ఆలోచనలకు అక్కడ చోటు చటుక్కున దొరకదు. ఒక పనిలో అనుభవం బాగా ఉందంటే, ఆ పని చేయడానికి సరైన దారుల గురించి గట్టి అభిప్రాయాలు ఏర్పడి ఉంటాయి. ప్రత్యేకమయిన పద్ధతులు, వాటి గురించి గట్టి అభిప్రాయాలు కూడా ఉంటాయి. కొత్త ఆలోచన ఏది వచ్చినా ముందు ‘కాదు’ అన్నమాట ముందుకు వస్తుంది.


ఒక సీసాలో అరడజను తేనెటీగలను, అనే్న దోమలను పెట్టి సీసాను అడ్డంగా పెట్టాలి. సీసా మూత తెరిచే ఉంటుంది. కానీ అది కిటికీ వేపు గాక లోపలివేపు ఉండాలి. సీసా అడుగు వెలుగు వేపు ఉండాలి. అప్పుడేమవుతుందో ఊహించగలరా? వెలుగు వేపు మాత్రమే మార్గం ఉందనుకునే తేనెటీగలు ఎంతసేపయినా సీసా అడుగు భాగానికి కొట్టుకుంటూ అక్కడే అలసి చస్తాయి. దోమలో, మరో పురుగులో అయితే అటూ యిటూ వెదిగి, మార్గం తెలుసుకుని బయటపడతాయి. తేనెటీగల తెలివి, వెలుగుమీద వాటికిగల నమ్మకం వాటికి శత్రువవుతుంది. వాటికి గాజు అని అడ్డంకి ఒకటి ఉంటుందని తెలియదు! అందులోంచి దూరడం వీలుగాదు. మిగతా పురుగులకు భేషజాల్లేవు. కనుకనే వాటికి మార్గం దొరుకుతుంది.


అందుకే మరీ తెలివిగా ఆలోచిస్తే సమస్యలకు సమాధానాలు దొరకవంటారు. ఆ సమస్యకు సమాధానం మరీ మామూలుగా ఉండవచ్చు. ఆట పద్ధతిగా ఉండవచ్చు. తెలివికి అది అందకపోవచ్చు! సమస్యకు సమాధానం కావాలంటే, తెలివికన్నా ఆలోచన ఎక్కువ అవసరం. సమస్యకు కథలోలాంటి సమాధానం ఊహించగలిగే పద్ధతుల గురించి ట్రెయినింగులు కూడా జరుగుతున్నాయి. ఆ పాటవం గలవారికి మంచి గిరాకీగా ఉంది ఈ రోజుల్లో! ఆలోచనల్లోంచి ఎన్నో కొత్త కొత్త ప్రొడక్ట్‌లు పుట్టాయి. విజయగాథలు వెలువడ్డాయి.


సమాచారం ముఖ్యం కాదిక్కడ. మెదడును సరిగా వాడటంతో కిటుకు తెలుస్తుంది.