Tuesday, March 13, 2012

గతంలో దృశ్యాలే!

జరగబోయేది తెలియదు, జరిగిపోయింది మిగలదు... అనికదా మనకున్న అభిప్రాయం. కానీ, మనం బతుకుతున్నది గతంలో అంటే నమ్మగలరా? కనీసం, మనం చూస్తున్నది గతం అంటే అర్థమవుతుందా? కాంతి వేగంగా కదులుతుంది, నిజమే. కానీ, దానికి కూడా ఒక వేగం, పరిధి ఉన్నాయి. మన కంటికి కనిపించే వస్తువు ఏదయినా కాంతి కారణంగానే కనిపిస్తుంది. వస్తువుమీద ప్రతిఫలించిన కాంతి మన కంటికి చేరడానికి కొంత సమయం పడుతుంది. అంటే మనం చూస్తున్న దృశ్యం అంతకాలం కిందటిదని గదా అర్థం! అద్దం ముందు నిలుచున్నామనుకుందాం. మనకు కనిపించే మన తీరు కొంతకాలం కిందటిది. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. ఎంత కాలంకిందటిది? అని ప్రశ్నించిన తర్వాత సంగతి మరింత బాగా తెలుస్తుంది. అద్దానికి మనం అడుగు దూరంలోనే ఉన్నాం. అంత దూరాన్ని దాటడానికి కాంతి సెకండులో వెయ్యి మిలియన్ల భాగం సమయాన్ని మాత్రమే తీసుకుంటుంది. ఆ తేడాను మనం చూడలేము. కనుకనే కనిపించింది ఈ క్షణమే అనుకున్నా తప్పులేదు. వస్తువు నుంచి ఎంత దూరంలో ఉంటే, అది కనిపించే సమయంలో తేడా అంతగా పెరుగుతుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచంలోని వస్తువులు మనకు ఇంచుమించు అదే క్షణంలో కనిపించిన భావం ఉంటుంది గనుక సరిపోయింది. ఒక్కసారి తల ఎత్తి ఆకాశంలోకి చూస్తే, ఈ గతం సంగతి మరింత అనుభవంలోకి వస్తుంది.


చందమామను చూడండి. ఆ గోళం భూమికి అన్నింటికన్నా దగ్గరలోగల అంతరిక్ష విశేషం. సగటున చందమామ మననుంచి 3,80,000 కిలోమీటర్లు (2,36,120 మైళ్లు) దూరంలో ఉంది. కనుక మనం చూస్తున్న చంద్రబింబం, ఒక సెకండు కింద ఉండిన తీరు మాత్రమే! సెకండుతేడా తెలిసే వీలుంది. కానీ, అంత దూరం దృశ్యంలో ఆ తేడా కనబడటం లేదు. మరిక సూర్యుని వేపుచూడండి. గతం బతుకు కథ మొదలవుతుంది!

సూర్యనక్షత్రం మన నుంచి 150 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. కిలోమీటర్లలో చెప్పాలంటే 93 మిలియనులు. అంతరిక్షం లెక్కలో చూస్తే, అది మనకు అన్నిటికన్నా, దగ్గరలో వున్న నక్షత్రం. ఇక్కడ కాంతి వేగం గురించి కొంచెం తెలిసే వీలుంది. మనం ఈ క్షణాన సూర్యుని చూస్తున్నామంటే... అది ఎనిమిది నిమిషాల కిందటి బింబం లేదా దృశ్యం! ఏం చేసినా వీలుగాదు, గానీ, ఒక సంఘటనను ఊహించండి. ఒక్కసారిగా సూర్యగోళం మాయమయిందనుకోండి. ఆ సంగతి మనకు ఎనిమిది నిమిషాలదాకా అర్థం కాదు. అంటే సూర్యుని వెలుగు, వేడిమి ఆ ఎనిమిది నిమిషాల కాలంపాటు మనకు అందుతూనే ఉంటుంది. సూర్యుని ప్రభావం కూడా అంతసేపు వరకు కొనసాగుతూనే ఉంటుంది. గ్రహాలన్నీ సూర్యుని గురుత్వాకర్షణ కారణంగా ఆ గోళం చుట్టూ తిరుగుతున్నాయి. సూర్యుడు మాయమయినా ఆ గురుత్వాకర్షణ కూడా కొనసాగుతుంది. ఆ ఎనిమిది నిమిషాలు గ్రహాలు... లేని సూర్యుని చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. సూర్యుడిని చూడడమంటే గతంలోకి చూడడమని అర్థమయి ఉంటుంది. ఆ గతం వెలుగు, వేడి ఆధారంగానే మనం చూడగలుగుతున్నాము. బతక గలుగుతున్నాము!


గతంలోకి మన చూపు ఇక్కడ మొదలవుతుంది. ఇక మరింత దూరం చూచిన కొద్దీ మనం, మరింత గతంలోకి వెళ్లిపోతాము. గ్రహాలు, వాటి చుట్టూ ఉండే ఉపగ్రహాలు మనకు తెలుస్తున్నాయి. కానీ తెలిసేది... అవి కొంత గతంలో ఉండిన పరిస్థితి మాత్రమేనని అర్థమయే ఉంటుంది. అంగారక గ్రహం, భూమి... సూర్యుని చుట్టూ ఒకే మార్గంలో, ఒకే దూరంలో తిరగవు. మార్గాలు రెండుగా, ఒకదానికొకటి దూరంగా ఉన్నాయని సులభంగానే అర్థమవుతుంది. కానీ, వాటి మధ్య దూరం మారుతూ ఉంటుందంటే ఆలోచన కొంత దూరం సాగాలి. కనుక అంగారక గ్రహం మనకు ఉండే దూరాన్ని బట్టి, దాని దృశ్యం మనకు నాలుగు నుంచి పనె్నండు నిమిషాలు తేడాతో కనబడుతుంది.


మానవుడు అంగారక గ్రహం మీద దిగడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగా మనుషులు లేని పరిశోధక నౌకలను గ్రహంమీద దింపి పరిశీలనలు జరిపించాడు. ఈ క్షణాన కనిపించేది ఈ క్షణం దృశ్యం, స్థానం కాదని తెలుసు. లెక్క సరిగా చేస్తే గానీ, గ్రహాన్ని సరిగా చూడడం, దాని మీదకు ఒక నౌకను దింపడం కుదరదు. ఎంత విచిత్రమో ఊహించండి. అక్కడ దిగిన యంత్రం పేరు మార్చ్ రోవర్. అంగారక గ్రహం మనకు వీలయిన ఎక్కువ దూరంలో ఉందంటే, దాని దృశ్యం పనె్నండు నిమిషాల తరువాత కనబడుతుంది. అక్కడ కదులుతున్న మార్చ్ రోవర్‌కు ఒక సంకేతం పంపించాలి. దాన్నుంచి మన వరకు సమాచారం అందాలి. ఈ రెంటికీ కనీసం నలభయి నిమిషాలు పడుతుంది. నౌక ప్రమాదంలో ఉందంటే, భూమి మీది పరిశోధకులు ఏదో చేయాలన్న ప్రయత్నానికి అర్థంలేదు! అందుకనే, ఈ రకం యంత్రాలన్నీ తమ నిర్ణయాలు తాము చేసుకునే రకంగా తయారుచేస్తారు. అవి నెమ్మదిగా పనిచేస్తాయి కూడా!


గురుగ్రహం మనకు దగ్గరగా ఉన్న సమయంలో కనిపించేది ముప్ఫయి రెండు నిమిషాల క్రిందటి దృశ్యం. మనమింకా సౌరమండలంలోనే ఉన్నాము. అంచుల్లో ఉన్న నెప్ట్యూన్ గ్రహం నాలుగు గంటల క్రిందట దృశ్యం మాత్రమే మనకు కనబడుతుంది.


వోయేజర్ వన్ అనే అంతరిక్ష పరిశోధక నౌక ఆ దూరాలను దాటి అంతరిక్షపులోతులోకి కదిలిపోతూ ఉంది. సౌర మండలం వెలుపలి అంచులనుంచి అది భూమికి అందించిన సమాచార సంకేతం ఇక్కడికీ లేదా ఇక్కడనుంచి పంపిన సందేశం, అక్కడకు చేరడానికి 31 గంటల 52 నిమిషాలు 22 సెకండ్లు. ఇది కూడా 2010 సంవత్సరం నాటి లెక్క! ఇంకా లోతులలో ఉండే నక్షత్రాలు, పన్సార్లు, క్వేజార్లనుంచి మనమున్న దూరం లెక్కలను అందుకే గంటలలో కాక, కాంతి సంవత్సరాలలో కొలుస్తారు.


టెలిస్కోపు అవసరం లేకుండా మామూలు కంటికి కనిపించే చేరువ నక్షత్రం ఆల్ఫాసెంటారి! అది మనకు నాలుగు సంవత్సరాలు క్రితమున్న తీరుగా కనబడుతున్నది. నక్షత్రాలు అంతరిస్తాయని తెలుసు గదా! అంతరించిపోయి, ప్రస్తుతం లేని నక్షత్రాలను దూరం కారణంగా, మనమింకా చూడగలుగుతున్నామంటే నమ్మగలరా? మరిక మనం గతంలో బతుకుతున్నామంటే ఆశ్చర్యం ఏముంది?

1 comment:

  1. కొత్త విషయాలు తెలుసుకున్నానండీ. నా ఫ్రెండ్స్ కి కూడా లింక్ పంపించాను చదవమని. టైటిల్ కూడా భలే apt. గా ఉంది.

    ReplyDelete