Saturday, July 28, 2012

వంట - మంట - మనిషి

మనిషి మొదట్లో తిండి దొరికింది దొరికినట్లు పచ్చిదిగానే తిన్నాడు. సుమారు 20 లక్షల సంవత్సరాల క్రితం, తిండిని వండడం నేర్చుకున్నాడు. దాంతో మనిషి తిండి తీరులో మార్పు వచ్చిందంటే చాలదు. అసలు మనిషి జాతి పరిణామం పూర్తిగా మరోదారి పట్టడానికి వంట, మంట కారణమంటారు పరిశోధకులు. మాంసాన్ని వండుకు తినాలన్న ఆలోచన ఎప్పుడు, ఎక్కడ మొదలయిందన్న సంగతి తెలియదు. తెచ్చుకున్న మాంసం ప్రమాదవశాత్తు కాలిందని, కాలిన మాంసం రుచిగా ఉండడం గుర్తించినందుకు వంట మొదలయిందని కథగా చెపుతారు. కాలిన మాంసంలో వేలు గుచ్చి వేడిగా ఉందని, నోట్లో పెట్టుకున్నారని, అట్లా రుచి తెలిసిందని కూడా చెపుతారు. మంటలో పడిన మాంసం ముందు, ముడుచుకుపోతుంది. లోపల ఉన్న నీరు ఆవిరయి, బయటకు వస్తుంది. కొవ్వు పదార్థాలు కరిగి బయటకు కారుతాయి. అవి అంటుకుని, మండి మాంసం రంగు మారుతుంది. అందులో కొత్త పదార్థాలు, కొత్త వాసనలు పుడతాయి. ఇదంతా 20 లక్షల సంవత్సరాల నాడు, మొదటిసారిగా తెలిసింది. మనిషి తిండి తీరు, జీవించే కాలం, పిల్లలను కనే తీరు మొదలయినవి ఈ వంటవల్ల మరిపోయినాయని మాత్రం తరువాత తెలిసింది. చింపాంజీలతో మొదలు మరే జంతువులకూ వంట చేయడం తెలియదు.
కోతి జాతులతో పోలిస్తే, మనిషి నోరు, పళ్లు ఎంతో మృదువు లక్షణం గలవి. దవడలు, వాటిని కదిలించే కండరాలు కూడా గట్టివి కావు. చెట్ల కొమ్మలను నములుకుని తినే శక్తి మనిషికి ఏనాడూ లేదు. మన శరీరంలోని జీర్ణ వ్యవస్థ కూడా మిగతా కోతులలోలాగా లేదు. ఉదాహరణకు మనిషి పెద్దపేగు నిజానికి చాలా చిన్నది. అందుకు ఆకు కూరలు, కూరగాయలు వండకుంటే, అంతగా అరగవు. పళ్లుకూడా అరగవు. పచ్చిమాంసం తింటే మనిషికి ప్రాణం మీదకు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇంత బలహీనమయిన జీర్ణ మండలం గల మనిషి మిగతా జంతువులన్నింటినీ మించి, ప్రపంచాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం వెనక రహస్యం ఏమిటి?

సుమారు 25 లక్షల సంవత్సరాల కింద కూడా మనుషులకు, కోతులకు మధ్య పెద్ద తేడాలేదు. అప్పట్లో మనుషులకు కూడా చేతులు పొడుగ్గా, కాళ్లు పొట్టివిగా ఉండేవని తెలుసు. మెదడు కూడా చింపాంజీలకంటే పెద్దదిగా ఉండేది కాదు. కడుపు, ఉరఃపంజరం పెద్దవిగా ఉండేవి. అంటే అప్పటి మనిషి, చెట్లు, కాయలతోనే కడుపు నింపుకునే వాడని అర్థం! ఆ తరువాత 6 లక్షల సంవత్సరాల కాలంలో, మనుషులు మరింత మనుషులయ్యారు. చేతులు పొట్టివయి, కాళ్లు పొడుగయ్యాయి. పేగుల పొడుగు తగ్గింది. నమిలే పళ్లుకూడా చిన్నవిగా మారాయి. మెదడు మాత్రం, నలభయి శాతం పెద్దదయింది. ఈ మార్పులన్నీ తిండిని వండుకు తినడం వల్లనే జరిగాయని పరిశోధకులు నిస్సందేహంగా చెపుతున్నారు.

రాతి పనిముట్ల వాడకంతో, మాంసం మరింత బాగా దొరికింది. వండుకుని తిన్నందుకు శక్తి ఎక్కువగా అందింది. కనుక మెదడు పెద్దదయింది. వండుకుని తినడంలో మనిషి మరెన్నో మెళకువలు నేర్చుకున్నాడు. ఆఫ్రికాలో 19 లక్షల ఏండ్లనాటి అవశేషాలు ఈ ఊహకు మరెంతో బలాన్నిచ్చి నిజంగా మార్చాయి.

వండిన మాంసం మెత్తబడుతుంది. సులభంగా నమలవచ్చు. రుచి పెరుగుతుంది. కాల్చిన మాంసంలో సూక్ష్మక్రిములు మిగలవు. మరికొన్ని రోజుల దాకా అవి తినడానికి పనికి వచ్చింది. మాంసంలాగే, దుంపలు, వేళ్లుకూడా కాల్చిన తరువాత, రుచితో బాటు బలాన్నిచ్చే తిండిగా మారతాయి. పచ్చి తిండి 65 శాతం అరిగితే, వండినది 90 శాతం వరకు అరుగుతుంది. అంతకుముందు, అందుబాటులోని గట్టి, రుచిలేని శాకాహారం కూడా, మంట, వంటలతో మనిషికి అందుబాటులోకి వచ్చాయి. వెదుళ్లు, బంగాళాదుంప లాంటివి పచ్చివి తినడంవల్ల అపాయం ఉండేది. వేడివల్ల వాటిలోని విషాలు విరిగి, అవి మంచి తిండిగా అందుబాటులోకి వచ్చాయి. ఈ రకంగా, తిండిని అరిగించుకునేందుకు శరీరం పడే కష్టం సగానికి తగ్గిపోయింది. కనుక నోరు, పెదవులు, పళ్లు, దవడల నిర్మాణంలో గొప్ప మార్పులు వచ్చాయి. శరీరంలో, అన్నింటికన్నా పెద్ద మార్పు మెదడులో కనబడింది. శక్తి మిగతా శరీర భాగాలకన్నా, మెదడుకు ఎంతో మేలు చేసింది. తిండి గట్టిగా ఉంటే, దాన్ని నింపాదిగా నమలడంతోనే కాలం గడిచేది. వంటతో పరిస్థితి మారింది. కొత్త తిండిని వెతికేందుకు, కావలసినంత కాలం కలిసి వచ్చింది. మంచి తిండి దొరికినవారు బలం గలవారయ్యరు. పిల్లలను కన్నారు. జాతి, బలంగా ముందుకు సాగింది.

మనిషి శరీరంలో మెదడు, పరిమాణం ప్రకారం, తక్కువ చోటును ఆక్రమిస్తుంది. కానీ, తిన్న తిండి మాత్రం పావు వంతు మెదడుకే వాడుకవుతుంది. మెదడు పెరిగితే బతుకు తీరు పెరుగుతుంది. తాబేటి పెంకులో వంట చేయవచ్చునన్న ఆలోచన ఇందుకొక ఉదాహరణ. గట్టి గింజలను పొడిగా, నూరి, తినడం మరొక ఉదాహరణ. పిండి తెలిసిన తరువాత రొట్టెను కనుగొనడానికి ఎక్కువ కాలం పట్టలేదు. గట్టి రొట్టెలను కొన్ని దినాలు దాచుకుని తినడం కూడా తెలిసింది. తడిపిన పిండిని, ఏ వానాకాలంలోనో, వాడకుండా పక్కన పెడితే అది పులిసింది.

ఆ పిండిలో కార్బన్‌డై ఆక్సైడ్ పుట్టింది. పిండిని కాలిస్తే, మరింత మెత్తని, రుచిగల రొట్టె వచ్చింది. మట్టి కుండలు 30,000 సంవత్సరాల క్రితం వచ్చాయి. దుంపలను, మాంసాలను నిప్పుల సెగమీద, ఎక్కువేపు ఉడికించే పద్ధతి తెలిసింది. వాటికి నీరు కలిపి ఉడికించి పులుసు చేయడం తెలిసింది. ఉప్పు కలిసి, మాంసాన్ని, ఆరబెట్టి దాచుకోవడం, వంటలో తరువాతి మెట్టు. ఈ వరుగులు, కరువులోనూ మనిషిని కాపాడగలుగుతాయని అర్థమయింది. అదొక గొప్ప మార్పు. ఇంచుమించు ఈ కాలంలోనే తిండిని మరింత రుచిగలదిగా మార్చే, ఉల్లి, మిరియాలు లాంటి వాటిని మనిషి కనుగొన్నాడు. తిండికి బాగా మసాలాలు కలిపితే అది ఎక్కువ కాలం మన్నింది. తిండి తీరు మారుతున్నకొద్దీ, మనిషి శరీరంలో రోగ నిరోధక శక్తి లాంటివి కూడా మారిపోయాయి. పచ్చి తిండి మీద ఉండే క్రిములు ఆరోగ్యానికి హాని కలిగించడం మొదలయింది. అయినా, వంట కారణంగానే, మనిషి, అనువుగాని వాతావరణం, పరిసరాలు, పరిస్థితులను తట్టుకుని ముందుకు సాగగలిగాడు. వంట వల్ల వచ్చిన లాభాలతోపోలిస్తే, నష్టాలు తక్కువే. ఇవాళ వండకుండా తిండి తినే వారు చాలా అరుదు.

అన్నింటికన్నా ముఖ్యంగా, తిండి పేరున వెచ్చించే సమయం బాగా తగ్గింది. లేకుంటే, సగం రోజు తిండితోనే సరిపోయేది!

Thursday, July 19, 2012

బొమ్మ

అన్యాయం.
ఈ బొమ్మ నాకొరకు గీసి పంపిన పెద్ద మనిషి పేరు మరిచి పోయాను.
కలకత్తా నుంచి పంపారాయన.
ఎవరబ్బా?


Sunday, July 15, 2012

ఔషధం పంటలు

మొక్కల నుంచి మందులను సేకరించడం మొదటి నుంచి జరుగుతూనే ఉన్నది. కానీ, మనకు అవసరమయిన మందులను మొక్కల చేత తయారుచేయించే పద్ధతి మాత్రం నిజంగా కొత్తది. ఈ పద్ధతి, పరిశోధన యింకా పరిశ్రమ దాకా రాలేదు గానీ, కొత్త ఆశలు కనబడుతున్నాయి. జూలియన్ మా అనే దంత వైద్యుడు 1980లోనే ఒక ఆలోచన చేశాడు. అతను దంతాలు పుచ్చిపోకుండా ఉండే పద్ధతిని అనే్వషించాడు. నోటిలోని సూక్ష్మజీవులన్నీ వాటంతటవి ఉండాలి. ఈ పుప్పిపళ్ళ క్రిములు మాత్రం నాశనం కావాలన్నదే అతని ప్రయత్నం. నిజానికి అతని ప్రయత్నం ఫలిస్తే పళ్ల డాక్టర్ల అవసరం సగానికి తగ్గుతుందని అందరూ అతడిని ఆట పట్టించేవారు. బ్యాక్టీరియాలు దంతాల మీద ప్రభావం చూపకుండా ఆంటిబాడీలు (టీకా) తయారుచేయాలని మా ప్రయత్నం. ఆంటీబాడీలను బతికి ఉన్న కణాలు మాత్రమే తయారుచేయగలుగుతాయి. అంటే టీకా మందులలాగే ఈ పుప్పిపళ్లు టీకాను కూడా జంతువుల్లో పెద్ద ఎత్తున తయారుచేయాలి. అది ఖర్చు, కష్టంతోకూడిన పని గనుక అప్పట్లో కుదరలేదు.


జూలియన్ తన పరిశోధన సాగించి 1990లో పిహెచ్‌డీ అందుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో కాలిఫోర్నియాలోని ఒక పరిశోధక బృందం వారు మొక్కలలో ఆంటిబాడీలు పుట్టించడం వీలవుతుందని ప్రకటించారు. ‘అనుకోకుండా జరిగిందిది. లక్షల మంది టూత్‌పేస్ట్‌లాగా టీకాలను వాడి దంతాలను రక్షించుకునే పద్ధతికిది ఆరంభం’ అని జూలియన్ ఈ బృందంతో చేయి కలిపాడు. వ్యవసాయ రంగంలో కొత్త అర్థం గల ఔషధ వ్యవసాయం మొదలయింది. తినడానికి వీలయ్యే టీకాను తయారుచేయాలన్నది వీరి గమ్యం, లక్ష్యం! టీకా మందుల వెల ఎక్కువగా ఉంటుందని అందరికీ తెలుసు. మొక్కల సాయంతో వాటిని తయారుచేయగలిగితే, వైద్య రంగంలో అది ఒక పెనుమార్పుగా మిగులుతుంది. అసలు ఆంటిబయోటిక్స్ అవసరమే లేని పరిస్థితికి ఇది దారితీయవచ్చు.

ఇదంతా ఆలోచన మాత్రమే. ఇంకా జరగవలసింది ఎంతో ఉంది. అందులో మొదటి మెట్టుగా గత నెలలో అమెరికాలో మొక్కలనుంచి తీసిన ఒకానొక ప్రొటీన్ డ్రగ్‌ను వాడకానికి ఆమోదించారు. మరికొన్ని మందులు కూడా ఈ పద్ధతిలో, త్వరలోనే రానున్నాయి. కానీ, జూలియన్ మా, సహచరులు మాత్రం మరెంతో అనుకున్నారు. కలలుగన్నారు. అవన్నీ అప్పుడే నిజం కాలేదు గానీ, ఔషధ వ్యవసాయమనే రంగం మాత్రం మొదలయింది. ప్రగతి అనుకున్నంత వేగంగా జరగకపోవడానికి కారణాలు సాంకేతిక పరమయినవి. మొక్కలనుంచి మందులను ఎప్పటినుంచో తీస్తున్నారు. అవన్నీ చిన్న అణువులు. ఎక్కువగా తయారవుతుంటాయి కూడా. మొక్కలకు తెలియని కొత్త ప్రోటీన్లను, అంటే మనకు అవసరమయిన ఆంటిబాడీలను తయారుచేయడానికి, జెనటిక్ ఇంజనీరింగ్ పద్ధతులను వాడవలసి ఉంటుంది. ఇది అంత వేగంగా జరిగే పని కాదు. ప్రతి ప్రయత్నం ఫలిస్తుందన్న నమ్మకం కూడా ఉండదు. అవసరమయిన జన్యువులను మొక్కల కణాలలో ప్రవేశపెట్టాలి. ఆ కణాలనుంచి మొక్కలను పెంచాలి. ఇందుకు మామూలుగా కొన్ని నెలలు పడుతుంది. ఇంత చేసినా ఒక మొక్కలోనుంచి ఆ రసాయనం తయారయేది చాలా తక్కువ మాత్రమే. తయారయిన రసాయనంలో అనుకున్న లక్షణాలు కనబడకపోయే ప్రమాదం కూడా ఉంది. అంతా బాగుందనుకున్నా, సంకర మొక్కలు లేకుండా జాగ్రత్తపడి, పెద్ద మొత్తంలో ఆంటిబాడీలను తయారుచేయగలగాలి. ఇదంతా జరిగేసరికి సంవత్సరాలు పడుతుంది.

ఆహారం పంటలను గురించి చాలా పరిశోధనలు జరిగాయి. వాటి గురించి బాగా తెలుసు. కనుక టీకా తయారీ ప్రయత్నాలకు కూడా ముందుగా మొక్కజొన్న లాంటి రకాలనే ఎంచుకున్నారు. కానీ, ఆహారం పంటల మీద అదుపు ఎక్కువ గనుక, జన్యుపరంగా మార్పులు చేసిన మొక్కజొన్నను బాహాటంగా పండించడానికి పర్మిషన్లు కష్టమయ్యాయి. మొత్తం మొక్కజొన్న పంటంతా మారిపోతుందని భయపెట్టి, అసలు పరిశోధనకు ఈ రకం పంటలను వాడనే కూడదన్నారు కొందరు పరిశోధకులు.
అమెరికాలోని నెబ్రాస్కా ప్రాంతంలో ఒక రైతు ఒకానొక కంపెనీ వారి కొరకు జన్యు మార్పులు గల కార్న్ పండించాడు. ఆ తరువాతి పంటగా అదే పొలంలో సోయాబీన్ వేశాడు. పొలంలో ఎక్కడో పడి మిగిలిన మొక్క జొన్న విత్తనాలు కూడా మొలకెత్తాయి. సోయాతోపాటు అవి కూడా పెరగసాగాయి. అందరూ పెద్ద గోల చేశారు. ఔషధం పంటలను మిగతా పంటల మధ్యన పండించకూడదన్నారు. కంపెనీలు భయపడి ఔషధ వ్యవసాయం పథకాలను మానుకున్నాయి.

పంటల కొరకు అందరినీ ఒప్పించడం నిజానికి సులభం. టీకాలు, మందులు తయారయిన తరువాత వాటిని మనుషులమీద ప్రయోగించడానికి, నిజమయిన అడ్డంకులుంటాయని అంటారు సైంటిస్టులు. డ్రగ్స్‌కు అనుమతి అందేసరికి ఎంతో కాలం, కష్టం, ఖర్చు ఎదురవుతాయి. అందునా మామూలుగా కాక కొత్త పద్ధతిలో తయారయిన మందులంటే మరింత కష్టమవుతుంది. ఒక ప్రోటీనును జంతువులనుంచి గాక మొక్కలనుంచి తీశారంటే, అందులో తేడాలుంటాయి. ప్రోటీన్ వరుసల్లో కలిసే చక్కెరలు జంతువులు, మొక్కల్లో వేరు వేరుగా ఉంటాయి. మొక్కలలో తయారయిన రసాయనం మనిషి శరీరంలో ప్రవేశించి రోగ నిరోధక వ్యవస్థను మరోరకంగా ప్రేరేపించే అవకాశం ఉంటుంది. ఇలాంటి అడ్డంకులు ఎన్నో ఉంటాయి. అయినా ‘మా’ మాత్రం ఉత్సాహంగా ముందుకుసాగాడు. పుప్పిపళ్ల సమస్యకు సమాధానమయిన ఆంటి బాడీలున్న పొగాకు మొక్కను రూపొందించాడు. మందును పరిశోధన స్థాయిలో పరీక్షించారు కూడా. కానీ యింకా కొంత కృషి జరగవలసి ఉంది. ఇప్పటివరకు మొక్కలలో తయారయిన డ్రగ్స్‌ను వాడడానికి అనుమతి లభించిందే లేదు. గత నెలలో ఆ పద్ధతి మొదలయింది. మరికొన్ని ఈ రకం మందులు వాడుకలోకి వచ్చాయి కూడా. క్యూబాలో హెపిటైటిస్ టీకామందును తయారుచేసి 30 దేశాలకు ఎగుమతి చేశారు కూడా. 2006లో వీరు మొక్కలలో తయారయిన ఆంటిబాడీతో ఈ టీకా మందును పరిశుద్ధి చేసే పద్ధతిని ప్రవేశపెట్టారు. అందుకు అవసరమయిన పొగాకు మొక్కలను పొలాలలోగాక పరిశోధనశాలలో మట్టి అవసరం లేకుండా పెంచారు. మరెన్నో యిలాంటి ఉదాహరణలున్నాయి

ఔషధ వ్యవసాయం చాలా నెమ్మదిగానయినా సరే నిజమవుతున్నది. ఆలోచన నుంచి ఆచరణకు వచ్చేలోగా, సైన్సులో ఎన్ని కష్టాలు, సమస్యలుంటాయనేది తెలుసుకోవడానికి ఇదొక ఉదాహరణ!

Sunday, July 8, 2012

పెద్దవారయినా పిల్లలే!


బ్రతుకును దుర్భరంగా మార్చుకోవచ్చు. దాన్ని ఎంతో ఫలవంతంగానూ మార్చుకోవచ్చు. రెంటికీ పడవలసిన కష్టం మాత్రం సమానమేనంటాడు కార్లోస్ డాస్టెనెడా. అతనొక రచయిత, తత్వవేత్త. ప్రపంచం అనవసరమంటూ ఏకాంతంలో బతికిన మనిషి. ఈ మాటలను మాత్రం ప్రపంచంలో ఉన్నప్పుడే అన్నాడు. ఈ ప్రపంచంలో కొంతమంది కావలసిన తెలివి, పనితనం ఉండి కూడా బతుకు పోరాటంలో ఓడిపోతుంటారు. పెద్దవారయి కూడా పిల్లలలాగా ప్రవర్తిస్తారు. పిల్లవాడు ఏడ్చి పనులు సాధించుకుంటాడు. పెద్దవారు ఏడిస్తే, ఆ ఏడుపు ఒకటే మిగులుతుంది.

భావాలను, ఆవేశకావేశాలను మనం నియంత్రణలో పెట్టడం ఒక పద్ధతి. వాటి ప్రభావానికి గురికావడం మరొక పద్ధతి. మనదారిని మనం నిర్ణయించడం, ప్రవాహంలో పడి కొట్టుకుపోడం ఇలాంటివే. సంతృప్తి, సంతోషాల దారిలో ముందుకు సాగవచ్చు. పిల్లతనంలో ఉండిపోయి పశ్చాత్తాపాలు, మనస్తాపాలలో మునగవచ్చు. దీనికి తెలివి, పనితనాలతో సంబంధం లేదు! ఇందుకు కావలసిన తెలివి మరో రకం! పిల్లవానిగా ఉన్నప్పుడు పిల్లవానివలె మాట్లాడాను, ఆలోచించాను. పెద్దవాడినయిన తరువాత ఆ తీరు మార్చుకున్నాను’ అని బైబిల్‌లో ఎక్కడో ఒక మాట వస్తుంది.

మనలో ఇంకా పిల్లతనం మిగిలి ఉందనడానికి ఎన్నో గుర్తులున్నాయి.

*ప్రతి మాటా, విషయం మన గురించేననుకోవడం, మరీ ఎక్కువగా స్పందించడం. విమర్శను భరించలేకపోవడం. ఇవన్నీ పిల్లతనానికి మొదటి గుర్తులు. ‘అది కాదు!’ అనకుండా, విమర్శను గురించి ఆలోచించాలి.

*చేసిన పనికి వెంటనే ప్రతిఫలం ఆశించటం. అందినదానికి పొంగిపోవడం, అనుకూలం కాని పనులను తప్పించుకోవడం తెలివికి సంబంధించినవి కావు. ఇవి స్వభావానికి సంబంధించినవి. ఈ రెండు లక్షణాలుంటే, ఏ పనయినా ముగిసేదాకా ఓపిక ఉండదు.
శమన బతుకు బాధ్యత మనదన్న సంగతి మరిచి, అందరిమీద ప్రపంచంమీద నింద వేయడం, ప్రపంచం తన కొరకు ఏమీ చేయలేదన్న బాధను వ్యక్తం చేయడం బలహీనతకు గుర్తు.

*బలహీనత మనసును ఆవరించిన వారికి తమలో లోపాలు తెలియవు. ఎదుటివారి లోపాలను ఎత్తిచూపడం సులభంగా చేతనవుతుంది. ఎదుటివారు బాధపడతారన్న చింత అసలే ఉండదు.

*మనకు అన్యాయం జరిగింది అనుకోవడంలో అంతగా తప్పులేదేమో? సమస్యను అర్థం చేసుకోవడం, వీలయితే లేదా తప్పదనుకుంటే వదిలేయడం, ప్రయత్నించి సమస్యకు సమాధానం వెతకడం ఒక దారి. ఈ దారిని మరిచి కొందరు కక్ష పెంచుకుని ప్రతీకారానికి దిగుతారు. చిన్నబాబు కిందపడతాడు. అది తన తప్పేనని అర్థం కాదు. నేలను ఒక దెబ్బ వేస్తే, వాడికి సంతోషం! ఇక అంతేనా బతుకంతా?

*ఇంకా కావాలి, అనేది పిల్లల మనస్తత్వం. చిన్న గ్లాసయినా అర్థం కాదు. కానీ అది నిండా ఉండాలి. వీలయితే మరింత కావాలి. కడుపు సంగతి తెలియదు. ఈ రకం భావాలలో ఇరుక్కుపోయిన వారు, జేబులో డబ్బును ఖర్చుపెట్టకుండా ఉండలేరు. ‘చాలినంత’ అంటే ఏమిటో వారికి తెలియదు. పథకం, ప్రణాళికల గురించి ఆలోచనే రాదు!

*ప్రతిదాన్నీ బాగుండలేదనడం, పని జరిగినదాకా ఓపిక పట్టలేకపోవడం, మిగతావారికి కూడా అవసరాలుంటాయని గుర్తించలేకపోవడం, ఎంతసేపూ తమ అవసరాలు, సంతృప్తి గురించే ఆలోచన పిల్లతనం లక్షణాలు. పెరిగి కూడా పిల్లలుగా మిగిలిన వారిలో ఈ లక్షణాలు ఉంటాయి. వారికి పని ఇచ్చి, జరుగుతుందనుకుంటే కష్టం. అనుక్షణం వాళ్లను గమనిస్తూ ఉండాలి
.
*ఎదురయిన ప్రతి సమస్యను ‘బూచీ’గా చూచి భయపడడం పిల్లతనం చేష్టలలో మరొకటి. ఎవరో వచ్చి తమను గట్టెక్కించాలనుకునేవారు మనకు అడుగడుగునా కనబడతారు. ‘టీ తాగుతాను, రెండు రూపాయలివ్వండి’ అంటూ అడిగేవారు అడుగుడుగునా ఎదురవుతున్నారు. రెండు రూపాయలు ఉన్నా మనకే ఎందుకు ఇవ్వాలన్న ఆలోచన వారికి రాదు. ఈ ఉదాహరణ రంగులు, షేపులు మారి ఎక్కడ చూచినా ఎదురవుతుంది. తమ ప్రవర్తన, అభ్యర్థనల ప్రభావం ఎలాగుంటుందని వారు ఆలోచించలేరు!

*ఏం చేస్తే, ఏమవుతుందోనన్న అనుమానం, ఆతురత, కలగలిసి ఉన్న తెలివి తెరమరుగు కావడం చాలామందిలో కనబడుతుంది. బాగుంది, బాగుండలేదు అనేవి రెండే తెలుసు. నాకు పనికివస్తుంది, పనికిరాదు అనే రెండు నిర్ణయాలు ఈ రెంటిమధ్యన కూడా కొన్ని పరిస్థితులు ఉంటాయి. ఒక పరిశీలన మనకు కొంత నష్టం జరిగినా, మరికొందరికి లాభం జరుగుతుంది గనుక దాన్ని చేయాలి, చేయవచ్చునన్న ఆలోచన పిల్లలకురాదు! పెద్దయినా ఈ రకం ఆలోచనలో బిగుసుకుపోయేవారు కనబడుతూనే ఉంటారు.

*అందరూ ననే్న ఎత్తుకోవాలి. అందరూ నాతోనే ఆడుకోవాలి. అందరూ ననే్న పట్టించుకోవాలి. పట్టించుకునే వారు ఒక్కరు, ఒక్కక్షణం కనిపించకపోయినా, జగము చీకటాయెనే అన్న భావం! మార్పును ఏ మాత్రం భరించలేము. అనుమానం అసలే ఉండకూడదు. అంతా కళ్లముందు ఉండాలి. అనుక్షణం భద్రత గురించిన భరోసా ఉండాలి! ఇవన్నీ పసిపిల్లల భావాలు కదా! మనలోనూ ఇంకా ఈ భావాలే ఏదో ఒక రూపంలో ఉన్నాయంటే, మనం పెరిగినట్లేనా? పెద్దవాళ్లమయినట్లేనా?

*నా అవసరాలు, నా పరిధులు నావి. వాటిలో ఏమాత్రం సడలింపు లేదు. మీరు మాత్రం మీ అవసరాలను, హద్దులను దాటి నాకు సాయం చేయాలి అనుకుంటే అన్యాయం కాదా? అందరూ అట్లాగే అనుకుంటే, ఎవరికివారు సాయం చేయగలుగుతారు.
ఈ లక్షణాలలో కొన్ని మనలోనూ ఉంటాయి. అంతోకొంతో ఉంటాయి. అప్పుడప్పుడయినా తల ఎత్తుతుంటాయి. వాటిని అర్థం చేసుకుని దారిలో పెట్టగలగాలి. ఇష్టంలేని పనులు, వీలుగావనుకున్న పనులు ముందు చేసి, ఆ తరువాత ఇష్టమయిన, సులభమయిన పనులు చేయాలంటారు.

మన భావాలను, అంటే మనలను మనం అదుపు చేసి, ముందుకు నడిపించడం ఇక్కడి ట్రిక్కు. అది అసాధ్యమేమీ కాదు. అది మనకూ వచ్చును. దానే్న మనం అలవాటుగా, లక్షణంగా మార్చుకుంటే అంతా సుఖంగా సాగుతుంది!
====

అందం.. ఆనందం

ఆ యువకుడు బజారులో నిలిచి, అందరినీ పిలిచాడు. ‘నా గుండె చూడండి! ఎంతో అందంగా, బలంగా ఉంది!’ అన్నాడు. అందరూ అతని గుండెను పరీక్షించారు. అది అందంగా, బలంగా ఉంది. ఆనందంగా కొట్టుకుంటున్నది. అందరూ, ‘ఆహా’ ఏమి గుండె?’ అన్నారు. యువకుని గుండె పొంగిపోయింది. పిసరంత గర్వమూ పెరిగింది. ‘గుండె అంటే నాదే గుండె!’ అన్నాడతను.
అక్కడికి ఒక మసలతను వచ్చాడు. ‘ఏం బాబూ? నా గుండెకంటే గొప్పదా? నీ గుండె? అంటూ ప్రశ్నించాడు. యువకుడు, గుంపులోని వారందరూ ముసలతని గుండెను పరిశీలించారు. అది గట్టిగా కొట్టుకుంటున్నది. కానీ అతుకులు, గతకులుగా ఉంది. గుంటలు మిట్టలుగా ఉంది. కొన్ని చోట్ల మరీ అన్యాయంగా గుంటలున్నాయి కూడా! అందరూ ఆ సంగతే గట్టిగా చెప్పారు.
అప్పుడు ముసలతను చెప్పసాగాడు. ‘అబ్బాయి గుండె అందంగా ఉండవచ్చు. అది నాకిస్తానన్నా నేను ఒప్పుకోను. నా గుండెలోని అతుకులు నాతో ప్రేమను పంచుకున్న వారి గుర్తులు. నేను నా గుండెలోనుంచి ఒక ముక్క వారికి ఇచ్చాను. వారూ బదులుగా నాకొక ముక్క యిచ్చారు. కానీ ఆ ముక్క నా గుండెలో సరిగా కుదరలేదు. అందుకే నా గుండె అతుకులు, గతుకులుగా ఉంది. అయినా నాకు ఫరవాలేదు. నేను కొందరికి నా గుండెలోనుంచి ఒక ముక్క ఇచ్చినా, వారు మరో ముక్కను తిరిగి ఇవ్వలేకపోయారు. అందుకే నా గుండెలో గుంటలున్నాయి. అదనంగా వచ్చిన ముక్కలేమో మిట్టలయ్యాయి. ఇప్పుడర్థమయిందా? అందమయిన గుండె అంటే ఏమిటో?’ అన్నాడతను. మాటలు వింటున్న యువకుని కళ్ల వెంట నీళ్లు కారుతున్నాయి. తన గుండె నుంచి పెద్ద ముక్క తీసి వణికేచేతులతో ముసలతనికి అందించాడు. ముసలతనూ అదేపని చేశాడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు హత్తుకున్నారు. అందరి కళ్ల వెంటా నీరు చుక్కలుగా జారింది.

అసలు మాట
ఏపనయినా ముందు కష్టంగా కనబడుతుంది. అర్థమయిన తరువాత ఇంతేనా అనిపిస్తుంది. అంటే సులభమవుతుంది -అజ్ఞాత విజ్ఞుడు
ఆలోచన అన్నిటికన్నా కష్టమనిపిస్తుంది. కానీ, అందులోని రుచి తెలిసిన తరువాత అంతకన్నా సులభం మరొకటి లేదనిపిస్తుంది. ఈ ప్రపంచం ఇంధనాల సాయంతో కాదు, ఆలోచనల సాయంతో నడుస్తున్నది. ఇంధనాలు కూడా ఒకప్పుడు ఆలోచనలు మాత్రమే!
===

*ఈ ప్రపంచానికి నీవు కేవలం ఒక మనిషివి. కానీ ఒక మనిషికి మాత్రం నీవే ప్రపంచానివి!
*ఎండలో నడుస్తుంటే, నీడలు మన వెంట ఉంటాయి. నీడలోకి రాగానే మాయమవుతాయి. కొంతమంది మనుషులు కూడా అలాగేచేస్తారు!
*కొందరు కళాఖండాలను సేకరిస్తారు. నేను మిత్రులను సేకరిస్తాను.
*విజయం, సంతోషానికి దారి కాదు. సంతోషం విజయానికి దారి. చేసేదేదో సంతోషంగా చేద్దాం!

Thursday, July 5, 2012

పరిశోధకుల చరిత్ర

పరిశోధకులు చరిత్ర సృష్టించారు. కానీ, చరిత్ర మాత్రం వారిని క్షమించలేదు. వ్యక్తిగతంగా పరిశోధకులకు ఉన్న నమ్మకాలు, పద్ధతులను అడ్డుగా పెట్టి వారిని హింసకు గురి చేసింది. అలాంటివారు ఎందరెందరో పరిశోధకులు చరిత్రలో కనబడతారు.

ఆలన్ ట్యూరింగ్, 1952లో తాను ‘స్వలింగ సంపర్కం’ చేశానని ఒప్పుకున్నాడు. అతని మీద కేసు పెట్టి విచారణ జరిపించారు. జైలుశిక్ష అనుభవించాలి, లేదా హార్మోన్ ఇంజెక్షన్ చేయించుకుని ‘మగతనాన్ని’ పోగొట్టుకోవాలని నిర్ణయం వచ్చింది. జైలులో ఉంటే పరిశోధన సాగదని ట్యూరింగ్, ఇంజెక్షన్‌కు ఒప్పుకున్నాడు. ఆ తరవాత అతను క్రిప్టోగ్రఫీ పరిశోధనలు చేయకూడదని కూడా నిర్ణయం వచ్చింది. ట్యూరింగ్ శరీరంలోనూ, మెదడులోనూ ఇంజెక్షన్ తరువాత 1953లో మాంఛెస్టర్ యూనివర్సిటీ వారు అతనికి, అయిదు సంవత్సరాలు ఉద్యోగం ఇచ్చారు. కానీ, అతను 1954 జూన్‌లోనే ఆత్మహత్య చేసుకున్నాడు!
చరిత్రలో ఇలాంటి బాధలకు గురయిన పరిశోధకులు మరెందరో ఉన్నారు.




మహమ్మద్ ఇబ్న్ జకరియా అల్ రాజీ, 865 నుంచి 932 వరకు బాగ్దాద్‌లో జీవించిన వైద్యుడు. చరిత్ర అతడిని రేజెన్ అనే పేరుతో గుర్తుంచుకున్నది. అరబిక్ ప్రపంచంలో పాశ్చాత్య విజ్ఞానాన్ని హిప్పోకేట్స్, గాలెన్ వంటి వారిని ప్రచారం చేయడానికి అతను ప్రయత్నించాడు. అతను రాసిన ఒక పుస్తకం ఎంతో పేరు పొందింది. మతగురువులు మాత్రం, ఆ పుస్తకంతోనే, అతని తలమీద కొట్టాలని నిర్ణయించారు. ఫలితంగా రాజీ గుడ్డివాడయ్యాడు. తరువాత, వైద్యం, ప్రచారం సాగలేదు.


మైకేల్ సెర్వెటస్ (1511-1553) స్పెయిన్‌లో వైద్యుడు. ఊపిరితిత్తులు, రక్తప్రసరణల గురించి పరిశోధించాడు. ఇతను కూడా పరిశోధన గురించి పుస్తకం రాసి, అందులోనే మతం గురించి కూడా కొంత రాశాడు. సెర్వెటస్ స్పెయిన్ నుంచి స్విట్జర్లాండ్ పారిపోవలసి వచ్చింది. అక్కడ కూడా మతవాదులు అతడిని వెంటాడారు. పట్టి పీడించి, పుస్తకాలతో సహా అతడిని జెనీవా సరస్సు తీరాన సజీవ దహనం చేశారు.

గెలిలెయో గెలిలి (1564-1642) గురించి విద్యార్థులకుకూడా తెలిసి ఉంటుంది. భూమి, సూర్యుని చుట్టు తిరుగుతుందని చెప్పిన కోపెర్నికస్ సిద్ధాంతాన్ని అవునన్నందుకు, మతం అతడిని శిక్షించింది. అతను బతికినన్ని రోజులు ఇంట్లోనుంచి బయటకు రావడం కుదరలేదు. అతని పుస్తకాలు కూడా వెలుగు చూడలేదు.

హెన్రీ ఓల్డెన్ బుర్గ్(1619-1677), ఇతను లండన్‌లో 1667లోనే రాయల్ సొసైటీని స్థాపించాడు. గొప్పస్థాయి పరిశోధన పత్రాలను ప్రచురణకు ఆహ్వానించాడు. ఈ పేరున అతను యూరపులాంటి ఇతర ప్రాంతాలలోని విదేశీయులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగించవలసి వచ్చింది. నెదర్లాండ్స్, ఇటలీ లాంటి దేశాలకు కూడా అతను ఉత్తరాలు రాశాడు. ఈ ఉత్తరాల సంఖ్య మరీ ఎక్కువయింది. ఈ సంగతి అధికారుల దృష్టిలో పడింది. విదేశీ గూఢచారి అని ఆక్షేపించి, అతడిని అరెస్టు చేశారు. టవర్ ఆఫ్ లండన్‌లో అతడిని చాలాకాలం బందీగా ఉంచారు.

గెర్‌హార్డ్ డొమాక్ (1895-1964) డొమాక్ జెర్మనీలో పాతాలజీ, బ్యాక్టీరియాలజీలలో పరిశోధకుడు. సల్ఫనమయిడ్ అనే మొట్టమొదటి ఆంటిబయోటిక్‌ను కనుగొన్నాడని అతనికి గుర్తింపు వచ్చింది. అదే విషయానికిగాను అతనికి 1939లో నోబెల్ (వైద్యం) బహుమతినికూడా ఇచ్చారు. నాజీ వ్యతిరేకి అయిన ఓసిమెట్‌స్కీకి 1936లో నోబేల్ శాంతి బహుమతి ఇచ్చారు గనుక, డొమాక్ తన బహుమతిని అందుకోగూడదని నాజీ ప్రభుత్వం శాసించింది. అతడిని అరెస్టు చేసి వారంపాటు బందీగా ఉంచారు కూడా. యుద్ధం ముగిసిన తరువాత 1947లో డొమాక్ తన బహుమతిని అందుకోగలిగాడు. చిత్రంగా, అతనికి బహుమతితోబాటు రావలసిన పైకం మాత్రం, అందలేదు. చాలా కాలం అయింది, గనుక, డబ్బు ఇవ్వలేదన్నారట!


ఆల్‌బర్ట్ ఐన్‌స్టైన్ (1879-1955) ఐన్‌స్టైన్ చేసిన పరిశోధనలు అర్థమయినా, కాకున్నా అందరికీ ఈ పేరు మాత్రం తెలిసి ఉంటుంది. ఐన్‌స్టైన్, జెర్మనీలోని ఉల్మెలో యూదుల వంశంలో పుట్టాడు. అతను మతాన్ని పాటించలేదు. సాపేక్ష సిద్ధాంతంతోబాటు, ఆతని రాజకీయాల గురించి కూడా మాట్లాడి, జెర్మనీవారి నిరసనకు గురయ్యాడు. 1933లో హిట్లర్ అధికారంలోకి వచ్చేనాటికి ఐన్‌స్టైన్ అమెరికాలో ఉన్నాడు. అయినా బెర్లిన్‌లోని అతని ఉద్యోగం, ప్రుసియన్ అకాడమీ ఆఫ్ సైనె్సస్‌లో సభ్యత్వం రద్దయ్యాయి. ఆస్తిని ప్రభుత్వం లాక్కున్నది. పుస్తకాలన్నింటినీ బజార్లో పెట్టి తగలబెట్టారు. ఐన్‌స్టైన్ తిరిగి జెర్మనీకి రాలేదు. పైగా తన దేశం వారు బాంబు తయారుచేస్తున్నారని, అమెరికా ప్రెసిడెంటు రూజ్వెల్టుకు ఉత్తరం రాశాడు. అమెరికాలోనూ అటువంటి పరిశోధనలు జరగాలన్నాడు!

చరిత్రలో ఎందరెందరో పరిశోధకులు ఈ రకంగా వేధింపులకు గురయ్యారు!

Wednesday, July 4, 2012

పలచనవుతున్న విశ్వం

ఈ విశాల విశ్వంలో మనుషులనే మనం నిజంగా ఒంటరి జీవులం. బుద్ధిజీవులు మరెక్కడయినా ఉన్నారేమోనని వెతకడమే గానీ, ఎవరూ కనిపించడంలేదు. ఇదిలా ఉండగా- ఈ విశ్వం వేగంగా విస్తరిస్తున్నది. గెలాక్సీలు, నక్షత్రాలు మొదలయినవన్నీ ఒకదాన్నుంచి మరొకటి దూరంగా మరింత దూరంగా వెళ్లిపోతున్నాయి. మనం చూడగలిగిన ప్రాంతం కొంత మాత్రమే. 


వెలుగున్నంత దూరం వరకే కనబడుతుంది. విశ్వం వ్యాపించడం ఇట్లాగే కొనసాగితే కొంతకాలం తరువాత, మనకు కనిపించే ప్రాంతంలో ఖాళీ ఎక్కువ, నక్షత్రాలు తక్కువగా మిగులుతాయి. ఇంతకూ ఈ పరిస్థితి రేపెప్పుడో మాత్రం రావడంలేదని, అందుకు బిలియన్ల సంవత్సరాలు పడుతుందని గుర్తుంచుకోవాలి. కొన్ని పదుల బిలియన్ల సంవత్సరాలు సాగితే, మన చుట్టూ మరేవో కొన్ని గెలాక్సీలు మాత్రమే మిగులుతాయి. మిగతావన్నీ మనకు కనిపించని చీకటి ప్రాంతంలోకి వెళ్లిపోతాయి.
ఇదంతా జరగడానికి ఒక శక్తి కారణంగా ఉంది. దాన్ని డార్క్ ఎనర్జీ అంటారు. అంటే ఏమిటని? ఎవరైనా అడిగితే వెర్రిమొగమే సమాధానం. మహామహా పరిశోధకులకే ఈ శక్తి గురించి, దాని స్వభావం గురించి అర్థంకావడంలేదు. అలాంటిదేదో ఉందన్న అనుమానం మాత్రం అందరికీ ఉంది. విశ్వంలోని ఖాళీలలో శక్తి ఉంది. పదార్థమంతా కూడా శక్తియొక్క రూపమే. పదార్థంగా మారని శక్తినుంచి ఒక రకమయిన వికర్షణ పుడుతుంది. డార్క్ ఎనర్జీ అంటే అదేనా? తెలియదు! గురుత్వాకర్షణ శక్తి మరీ ఎక్కువయినందుకు ఈ డార్క్ ఎనర్జీ పుట్టిందా? అంతకన్నా తెలియదు! ఈ అనుమానాలకు ఆధారాలున్నాయి. వాటిలో సమస్యలు కూడా ఉన్నాయి.

విశ్వంలోని కాంతిని ఈ డార్క్ ఎనర్జీ మింగుతున్నది. అయినా, ఇది కాంతినుంచే పుట్టి ఉండవచ్చునన్న అనుమానం కూడా ఉంది. కాంతి, వెలుగు అంటే విద్యుదయస్కాంత తత్వానికి ఒక రూపం లేక ఫలితం. అందరికీ తెలిసిన ఫిజిక్సుకు అందని రకం విద్యుదయస్కాంత తరంగాలు ఉన్నాయని మరో అనుమానం. వాటి అలల నిడివి, మనకు కనిపించే విశ్వంలోని తత్వానికి ట్రిలియన్ల రెట్లు ఎక్కువ. అదే డార్క్ ఎనర్జీ అంటున్నారు కొందరు. వెలుగుగానీ, అయస్కాంత శక్తిగానీ, వాటి వాటి అలల నిడివి వల్ల రకరకాలుగా ప్రభావాన్ని చూపుతాయి. మనకు కనిపించే కాంతి కొంత. దానికి, అటు యిటూ కనిపించని కాంతులున్నాయని తెలుసు. అదే దారిలో విద్యుదయస్కాంత తరంగాలు కూడా ఉన్నాయని ఇద్దరు పరిశోధకులు గట్టిగా నమ్ముతున్నారు. విశ్వంలోని పూర్తి ఖాళీ ప్రాంతాలలో కూడా అర్థంకాని అయస్కాంత క్షేత్రాలున్నాయని గమనించారు. వాటికి ఈ అతి దీర్ఘ తరంగాలు గల విద్యుదయస్కాంత తత్వం ఆధారమని వీరిద్దరూ అంటున్నారు. మన గెలాక్సీలోనే బ్లాక్‌హోల్స్ ఉన్నాయి. వాటిలోనుంచి కూడా కొన్ని అయస్కాంత క్షేత్రాలు పుడుతున్నాయి! అవి కూడా ఇలాంటివేనంటున్నారు!

విశ్వం తననుంచి తాను దూరంగా పోతున్నది. అంటే అంతులేకుండా విస్తరిస్తున్నది. ఈ సంగతి సుమారు ఇరవయి సంవత్సరాల క్రితమే గట్టిగా రుజువయింది. సూపర్‌నోవాలు ఉండవలసిన వెలుగు లేకుండా, ఉండవలసిన దానికన్నా, మరెంతో దూరంగా ఉన్నాయని గమనించారు. ఈ సంగతిని ఆధారంగా ‘విశ్వం విశాలమవుతున్నద’ని చెప్పినవారికి 2011లో నోబెల్ బహుమతి కూడా ఇచ్చేశారు. విశ్వంలో చాలా భాగం ఖాళీగా ఉంది. అక్కడ కొన్ని వర్చువల్ పార్టికల్స్ పొంగుతున్నాయని క్వాంటమ్ సిద్ధాంతం చెపుతుంది. ఆ పొంగులోనుంచి కొంత శక్తి పుడుతుంది. పార్టికల్స్‌మాత్రం ఈ క్షణం పుట్టి మరో క్షణంలో మాయమవుతాయి, శక్తి మిగులుతుంది. మార్పేమీ లేకుండా మిగులుతుంది. దీనే్న కాస్మలాజికల్ కాన్‌స్టాంట్ అన్నారు. ఇందులోనుంచి లేదా ఇందుకు సంబంధించి డార్క్ ఎనర్జీ పుడుతుందని మరో అనుమానం.

విశ్వం విచ్చుకుంటూ పోవడానికి కొంత, నిజానికి చాలా శక్తి అవసరం. ఒక ఘనపు కిలోమీటరు విశ్వానికి అర జౌల్ శక్తి కావాలి (అసలు, విషయమే అర్థం కావడంలేదంటే, అందులో ఈ లెక్కలు అంతకన్నా అర్థం కావు గనుక వదిలేద్దాం!). వర్చువల్ పార్టికల్స్‌లో నుంచి పుట్టుకు వస్తున్న శక్తి మొత్తాన్ని లెక్కించే ప్రయత్నం చేశారు. అది ‘సున్నా’అని లెక్క తేలింది. 
(ఇదేమిటని ముక్కున వేలేసుకుంటే తప్పులేదు!) మరో లెక్క ప్రకారం, ఈ శక్తి అపారం. ఎంత అపారమంటే, దాని ప్రభావంవల్ల విశ్వంలోని పదార్థమంతా సర్వనాశనమవుతుంది. (ఈసారి ఇదేమిటని బుర్ర పట్టుకుంటే అంతకన్నా తప్పులేదు. ఫిజిక్సు అనే మదర్ ఆఫ్ సైన్సెస్ పద్ధతి అలాగే ఉంటుంది మరి!) ఇదంతా మనకు అర్థం కాలేదంటే ఆశ్చర్యం లేదు. పరిశోధకులకు కూడా ఈ సంగతులు అర్థం కాలేదు. కనుక వాళ్లు రూటుమార్చి, డార్క్ ఎనర్జీకి, గురుత్వాకర్షణ శక్తికి మధ్య సంబంధాలను వెతుకుతున్నారు. గురుత్వాకర్షణ అన్న విషయానికి ఆధారం ఆకర్షణ. రెండు పెద్ద పెద్ద ఆకారాల మధ్యన ఆకర్షణ ఉంటుందని దీని భావం. కానీ, వాటిమధ్యన దూరం బిలియన్ల కాంతి సంవత్సరాలయితే, ఆకర్షణ పోయి వికర్షణ మొదలవుతుందని ఒక సిద్ధాంతాన్ని తెచ్చారు వారు.

గురుత్వాకర్షణ గురించి ఇంత తేలికగా మాట్లాడడం తప్పు అంటారు మరికొందరు. ఐన్‌స్టైన్ ప్రతిపాదించిన సాధారణ సాపేక్ష సిద్ధాంతం ప్రకారం, గ్రావిటీ అంటే స్థలకాలాలు వంపు తిరగడం. ఈ లెక్క ఆధారంగానే సౌర మండలంలోని గ్రహాలు, మనిషి ప్రయోగించే కృత్రిమ ఉపగ్రహాల దారులను, కదలికలను లెక్క వేస్తున్నారు. దాన్ని మొత్తం విశ్వం స్థాయిలోకి పెంచి, స్థలకాలాలను వంచగలిగితే- లెక్క ఎలాగుంటుందో అర్థంకాదు! పరిశోధకులు ఏదో అడ్డు వచ్చిందని పని మానే రకం కాదు. జోస్ బెల్ట్రాన్, ఆంటోనియో మరోటోలు మరీ రాటుదేలిన పరిశోధకులు. వాళ్లు స్పెయిన్‌లో గ్రావిటీ గురించి ఎంత కాలంగానో పరిశోధిస్తున్నారు. ఆకర్షణ పోయి వికర్షణగా మారడం గురించి ముందు ఊహించినది వీళ్లే. అంతలోనే మరో సంగతి తోచింది. అక్కడ విద్యుదయస్కాంత తత్వం లక్షణాలు కనిపించాయి. స్థలకాలాల బదులు దృష్టి అయస్కాంతాలు, వోల్టేజీలవైపు మళ్లింది. తరువాతి సంగతులు మరెప్పుడయినా చూద్దాం!

పాఠక మిత్రులకు ఒక మనవి! సైన్సు అంటే- తెలిసిన విషయాల గురించి అని మన భావన! కానీ సైన్సులో తెలిసిన సంగతులకన్నా, తెలియని సంగతులే ఎక్కువ. వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నం గనుక సైన్సు కొనసాగుతుంది. ఈ విషయం అర్థం కావడానికే ఇలాంటి వ్యాసాలు!

Tuesday, July 3, 2012

మనలో ఎవరు బెస్ట్?

'ఎలాగున్నారు?’ అని ఎవరినయినా ఒక ప్రశ్న అడిగి చూడండి. ‘ఆఁ! ఏదో! బాగానే ఉన్నాం!’ అంటారు గానీ, ఎవరూ సంతోషంగా ఉన్నామని చెప్పరు. కానీ, వ్యాపారాలు చేసే సంస్థల్లో మాత్రం బెస్ట్, గ్రేట్ లాంటి మాటలు ఊరికే వినపడుతుంటాయి. ఏదో ఒక పరికరం, అందులోని భాగం గురించి వ్యాపార పరంగా చర్చ జరుగుతూ ఉంటుంది. అందులో ‘మీరు ఇవ్వగల బెస్ట్ ప్రైస్ (ధర) చెప్పండి!’ అని ఒక డయలాగ్ ఉంటుంది. ఆ ధర కొనేవారికి తక్కువగానూ, అమ్మేవారికి లాభకరంగానూ ఉండాలి. అక్కడ బెస్ట్ అంటే అన్నింటికన్నా మంచి అనే అర్థం! అదే మరి మనుషులు, ఉద్యోగులు, వారి పని గురించి మాట్లాడుతుంటే మాత్రం ఈ మాటల అర్థాలు మారిపోతాయి. అవి ఒక్కొక్కరికి ఒక రకంగా అర్థమవుతాయి. అక్కడే సమస్యలు మొదలవుతాయి.
మనతో బాటు, మరెందరో పనిచేస్తుంటారు. అందరిలోనూ కలిసి బెస్ట్ ఎవరని వెతకవలసిన అవసరం వస్తుంది. అక్కడ అభిప్రాయాలలో చాలా తేడా కనబడుతుంది. మీరుండేస్థాయిని బట్టి పని నాణ్యత, వ్యక్తుల క్లాసు గురించిన అవగాహన మారుతుంది. ఆఫీసులో ఏదో ఒక పని చేయవలసిన అవసరం వస్తుంది. ‘దీనికి ఎవరు బెస్ట్?’ అని ప్రశ్న మొదలవుతుంది. తగినవారు ఎవరైనా ఉన్నారా, అనే ప్రశ్న కూడా పుడుతుంది. ఉన్నవాళ్లంతా మంచివాళ్ళే. కానీ, కొత్త అవసరం వచ్చేదాకా దానికి సరిపడే వారు ఉన్నారా? అన్న సంగతి తెలియదు!


‘నీవు కోరిందేదో నీ దగ్గర ఉందన్న సంగతి, ఆ కోరిందేదో తెలిసేదాకా తెలియదు’ అని ఒక మాట ఉంది. మనుషులయినా అంతే! ఆఫీసులో, కంపెనీలో ‘బెస్ట్’ గురించిన వెదుకులాట చాలా రకాలుగా ఉంటుంది. మనుషుల గురించయితే, అందుకు కొన్ని పద్ధతులున్నాయి. అందరికీ తెలిసిన ‘పనె్నండు ప్రశ్నల పరీక్ష’ ఒకటి ఉంది. అది కాపీ రైటు కింద వస్తుంది. ఉద్యోగి భావాలను గుర్తించే ప్రయత్నంలో మామూలుగా కొన్ని ప్రశ్నలుంటాయి.


* కంపెనీ నమ్మే విలువలనే ఇంచుమించుగా నేను కూడా నమ్ముతాను.
* నేను, నా కంపెనీ భవిష్యత్తు బాగుంటుందనుకునేవారిలో ఒకడిని.
* కంపెనీ గమ్యాలను చేరడంలో, నా పాత్ర ఏమిటో నాకు బాగా అర్థమయింది-లాంటి కొన్ని పడికట్టు భావాల గురించి సర్వే చేస్తుంటారు. కానీ, ఈ రకం ప్రశ్నలు అన్ని సందర్భాలలో, అన్ని డిపార్టుమెంట్లలో సంతృప్తికరమయిన ఫలితాలను ఇవ్వవు. మరింత సూటిగా, ఒక్కొక్క ఉద్యోగికి చేతనయిన పనులు, పనులు చేయడంలోనూ, కంపెనీ పట్ల వారు చూపించే విధేయత మొదలయినవి మరీ లోతుగా చూడవలసిన అవసరం వస్తుంది. అట్లా, ప్రశ్నల సంఖ్య ఎక్కువవుతుంది. సర్వే, చాలా చికాకు అవుతుంది. ఒకానొక కంపెనీ వారు సర్వే కోసం నాలుగు వందల ప్రశ్నలు సిద్ధం చేశారు. ఇక ఆ సర్వేలోనుంచి, అనుకున్న ఫలితాలు రావని వేరుగా చెప్పనవసరం లేదు.


మీరు ఎంతగా ‘బెస్ట్’కు దగ్గరవుతున్నారన్న సంగతి ముందు మీకు తెలుస్తుంది. కానీ, మీ చేత పని చేయిస్తున్న వారి ఎక్స్‌పెక్టేషన్స్ మరోరకంగా ఉంటాయి. మీ సూపర్‌వైజర్, ‘కానీ’ అని ఒక పుల్ల వేస్తాడు. మీది మేనేజర్ అగ్గిపుల్ల గీచి ఈ పుల్లను వెలిగిస్తాడు. కనుక ఎవరు బెస్ట్ అన్న ప్రశ్నకు జవాబు, ఉద్యోగుల మధ్య నుంచి రాదు. మేనేజర్ల నుంచి వస్తుంది. మేనేజర్లకు తమ సిబ్బందితో ఉండే మంచి సంబంధాల ఆధారంగా నిర్ణయం వస్తుంది. మనం మనుషులం. మేనేజర్లు కూడా మనలాగే మనుషులు. కనుక, కొన్ని సందర్భాలలో నిజమయిన ‘బెస్ట్’ బయటపడకుండా, నిరాశకు లోనవుతారు. అదనంగా పని చెప్పడానికి, బెస్ట్ గురించి వెతికితే మాత్రం, అక్కడి ప్రశ్నలు మరోరకంగా ఉంటాయి. పనిని బెస్ట్‌గా చేయగలిగిన వారికన్నా, బెస్ట్‌గా మాట వినేవారికి భారం అప్పగించే వీలు ఎక్కువ. అందులో అందరికీ సులువుంది. ఉద్యోగులలో నిజంగా బెస్ట్ ఎవరన్నది, చిక్కు ప్రశ్న. ఒక్కొక్క విషయానికి, సందర్భానికి ఒకరు బెస్ట్‌గా ఉంటారు. కొంతమందిలోని మంచీ చెడు లక్షణాలను మేనేజర్లు గమనించరు. ఒక పెయింటింగ్ ఉంటుంది. అందులో అక్కడక్కడ ఖాళీలు ఉంటాయి. ఆ ఖాళీలలో కూడా రంగులు పులిమితే, పెయింటింగ్ అందం, ఆకర్షణ తగ్గుతాయి. ఒక పూల గుత్తిలో, ఒక పువ్వు తగ్గినా, ఎక్కువయినా దాని రూపం మారుతుంది. బాపు బొమ్మలో ఒక గీత తగ్గినా ఆ బొమ్మ అసంపూర్తి అవుతుంది అంటారు. మనుషుల వ్యక్తిత్వాలు కూడా అలాంటివే. 



మనమయినా, మన మేనేజర్లయినా, వ్యక్తిత్వంలోని ఖాళీలను అదనపు లక్షణాలను ఈరకంగా గుర్తించగలగాలి. మన దృష్టిలో కొన్ని లక్షణాలు మాత్రమే వచ్చి, మిగతావి రాకుంటే, ఆ వ్యక్తి మనమే అయినా సరే, చిత్రం అసంతృప్తి అవుతుంది. కొంపలు మునుగుతున్నా సరే, నిత్యం ఆఫీసుకు సమయానికి వచ్చేవారు మంచి ఉద్యోగులా? చెప్పిన పనిని నిజంగా ధ్యాస పెట్టి ముగించేవారా? కంపెనీ, సంస్థ గమ్యాల గురించి అవగాహన ఉండి, అందుకు తమ వంతు కృషి చేసేవారిని ఏమనాలి? పని చేసినా, చేయకున్నా, సరైన సమయంలో మంచి సలహాలు, అభిప్రాయాలు, ఆలోచనలు అందజేసేవారుంటారు. వారినేమనాలి? కొందరికి సమస్యలను విడదీయడంలోని మెళకువలు తెలిసి ఉంటాయి. కొందరు పని సాధించడంలో పట్టుదలగలవారుంటారు. ఈ లక్షణాలు అన్నీ ఒకరిలో దొరకవు. కొంతమందిలో ఈ లక్షణాలే కనిపించవు. అన్ని మంచి గుణాలే, కానీ, జాగ్రత్తగా గమనిస్తే, మంచి గుణాలు రెండింటి మధ్యన వైరుధ్యం కనబడుతుంది. ఒక్కొక్క గుణం గురించి ఆలోచించినా, వాటిలో మంచితో బాటు కొంచెం చెడు కూడా కనిపించే వీలుంది. ఎవరికివారికే ఈ అభిప్రాయాలు వేరువేరుగా ఉంటాయి. మొత్తంమీద ఎవరి అభిప్రాయం కూడా పూర్తిగా తప్పుకాదు, పూర్తిగా సరయింది కాదని గుర్తుంచుకుంటే బాగుంటుంది. సందర్భాన్ని బట్టి, మనుషుల విలువ తెలుస్తుంది. ‘తగినవారు’ ఉంటారు. ఆ సమయానికి వారే బెస్ట్! మొత్తంమీద ఎవరి అభిప్రాయం కూడా పూర్తిగా తప్పుకాదు, పూర్తిగా సరయింది కాదని గుర్తుంచుకుంటే బాగుంటుంది.

సందర్భాన్ని బట్టి మనుషుల విలువ తెలుస్తుంది. ‘తగినవారు’ ఉంటారు. ఆ సమయానికి వారే బెస్ట్! మొత్తంమీద బెస్ట్ అనే వారుండరు!


ఇంతా జరిగిన తరువాత, మేనేజర్ల మీద కూడా బాసులుంటారు. వారి అభిప్రాయాలను కాదనగలిగే శక్తి, తక్కువగా ఉంటుంది. అందరిమధ్యన జరిగిన నిర్ణయాలను, అక్కడ, అవుననిపించుకుంటే, అనిపించగలిగితే, ఆ సందర్భంలో ఆ మేనేజర్ బెస్ట్! అవునన్న పెద్ద బాసు బెస్ట్! ఆ బాసు మేనేజర్‌ని బెస్ట్ అంటారు. మేనేజరు మనందరినీ బెస్ట్ అంటారు! అప్పుడు మాటకు అర్థం ఉంటుంది!




నాకు నచ్చని సంగతులు!




టైమెంత అని అడగటానికి చేతిని చూపించడం! నా గడియారం ఎక్కడుందో నాకు తెలుసు? గడియారం లేనిది నీకు గదా? బాత్‌రూం ఎక్కడ అని అడగడానికి ఏం చూపిస్తావ్? (సారీ)

సినిమా చూస్తున్నాము. ‘చూశావా? చూశావా? అంటాడు పక్కతను! బోలెడు డబ్బు పెట్టి సినిమాకు వచ్చింది, చూడటానికి కాకపోతే, గోళ్లుగిల్లుకోవడానికా?

నిన్నొక ప్రశ్న అడగనా?’ అనే ప్రశ్న! అప్పుడే ఒక ప్రశ్న అడిగావు. మరోకటి ఎలాగూ అడుతావిక!

‘జీవితం చిన్నది’ అనే మాట! ఏమిటర్థం? మనకు చేతయిన పెద్ద సంగతి అదొకటే! దానికంటే ఎక్కువ కాలం మరేమి సాధించగలం గనుక?

సందర్భం!
అదొక నగరం. అక్కడొక కుటుంబం. కుటుంబమే, కానీ ఉండేది ఇద్దరే! ఒక తల్లీ, ఒక కూతురు. మరో దిక్కులేని వారయినా, వారుకూడా కుటుంబమే. సుఖంగా బ్రతుకుతున్నారు. ఒకరిమీద ఒకరికి ప్రేమ కూడా బోలెడుంది. కానీ, వాళ్లిద్దరికీ నిద్రలో నడిచే అలవాటు ఉంది. అదొక పెద్ద సమస్యలా కనిపించలేదు వారికి. ఒకరు లేస్తే మరొకరికి మెలుకవవుతుంది. ఎలాగో సర్దుకుంటున్నారు.

ఒకానొక రాత్రి, ప్రపంచమంతా నిశ్శబ్దంగా నిద్రలో ఉంది. తల్లీ కూతుళ్లిద్దరూ ఒకేసారి, నిద్రలో నడక మొదలుపెట్టారు. ఇద్దరికీ మెలుకువ రాలేదు. నడుస్తూ, నడుస్తూ రాళ్ల తోటలోకి చేరుకున్నారు. అక్కడ పొగ మంచు నిండి ఉంది. ఇద్దరూ ఒకరొకరికి ఎదురుపడ్డారు.

‘‘ఆహా! రాక్షసీ! చివరికి ఎదురయ్యావా? నీ వల్లే గదా నా బతుకంతా నాశనమయింది, ఆ శిథిలాల మీద నీవు నీ బతుకు బంగళా కట్టుకున్నావు! నిన్ను చంపగలిగితే బాగుండును!’ అన్నది తల్లి ఆవేశంగా!

‘‘నువ్వొక ఆడదానివా? ఆశపోతు ముసలిపీనుగా! నా బతుకుకూ నాకూ మధ్య అడ్డుగోడగా నిలబడ్డావు! నాబతుకు కూడా నీ బతుకులాగా తెల్లవారుతుంటే, నేనూరుకుంటానా? నువ్వు చస్తే, నా పీడ విరుగడవుతుంది!’’ అన్నది కూతురు.
అంతలో కోడి కూసింది. తల్లికీ, కూతురికీ మెలుకువ వచ్చింది.

‘నువ్వేమిటి బంగారు తల్లీ! ఇక్కడున్నావు?’ అంది తల్లి. ‘నీవేమిటమ్మా ఇక్కడ?’ అంది కూతురు. ఇద్దరూ కలిసి ఇంట్లోకి వెళ్లారు.

-ఖలిల్ జిబ్రాన్ ఆధారంగా!

అసలు మాట
నోరు విప్పకుండా ఉంటే, చవటలమని ఎలాగూ అర్థమవుతుంది! నోరు విప్పి, ఇక సందేహం లేకుండా చేయడమెందుకు?
-రామీ బెల్సన్

ఏదో ఎగురుతూ వస్తున్నది. ఏమిటా అని చూస్తున్నాను. అదొక రాయి. అది నాకే తగిలింది!

Sunday, July 1, 2012

నీ నీతి - కవిత


కుక్కనిస్తవా?
పెట్టనిస్తవా? అన్నడు మగవాడు.
నేను నీకు అమ్మను! అన్నది ఆడది.
బండబూతులనిపించింది గదూ!
మనమంతా మరి దిక్కుమాలినంత నీతి మంతులముగద!!

నాథా నేను నీకు కొడలనయితిని, మామా!
అంటుందొక నాయిక నాటకంలో
సిస్టర్ మీరు ఈ ప్రపంచంలో అందరికీ సిస్టరేనా,
మా బావగారికి కూడానా అంటడొక తుంటరి హీరో
అట పట్టి విటుండయి రాగజూచి
ఆయాసము చెందింది ఒక అమ్మ
ఈడిపస్ ను తుడిపేసింది ఒక హీరోయిన్

పండు తిన్న నాటి నుంచి పక్కటెముకతోనే సరిపోయింది బతుకంతా
యింకా సిగ్గొకటా?
కటకటా
శీర్ణమేఖల గురించి తెలుసా
దయ్యాన్ని నరకంలో దాచే సంగతి తెలుసా
నేలతో నింగి అన్నది నను తాకరాదని
స్పర్శ దండుగ – నిష్కర్శ దండుగ
ఆలోచనలతో పండుగ
తలనిండా మెండుగ
అర్థమయిందా ఏమన్నా
ప్రాదుర్భూత పురాతన కథా కాసార కల్లోలకృత్తటవర్తీ తత డిండీరచ్ఛటా మాత్రాన
ఈ మాటలో రంగుల్లేని నిజాలు వచ్చినవి.
నన్నేమన్నా మీ ఇష్టం
నెత్తికీ లోపలి మెదడుకూ
రంగెయ్యను తెలియని మనిషిని.
నీ మనసులో ఏదో ఉందనిన మనిషిలో ఏదో ఉంది.
నాలో బలహీనత ఉంది.
దిక్కుమాలిన మంచితనం ఉంది.
అదే మరి నీతిమంతనం
వెన్నల నవ్విననాడు విరిసిన మల్లెలు ఏరలేదు
నిప్పు లేకుండానే పొగ రగిలిన నాడు ఉలకలేదు పలకలేదు.
నీతిగదూ
దిక్కుమాలిన నీతి!!