Saturday, July 28, 2012

వంట - మంట - మనిషి

మనిషి మొదట్లో తిండి దొరికింది దొరికినట్లు పచ్చిదిగానే తిన్నాడు. సుమారు 20 లక్షల సంవత్సరాల క్రితం, తిండిని వండడం నేర్చుకున్నాడు. దాంతో మనిషి తిండి తీరులో మార్పు వచ్చిందంటే చాలదు. అసలు మనిషి జాతి పరిణామం పూర్తిగా మరోదారి పట్టడానికి వంట, మంట కారణమంటారు పరిశోధకులు. మాంసాన్ని వండుకు తినాలన్న ఆలోచన ఎప్పుడు, ఎక్కడ మొదలయిందన్న సంగతి తెలియదు. తెచ్చుకున్న మాంసం ప్రమాదవశాత్తు కాలిందని, కాలిన మాంసం రుచిగా ఉండడం గుర్తించినందుకు వంట మొదలయిందని కథగా చెపుతారు. కాలిన మాంసంలో వేలు గుచ్చి వేడిగా ఉందని, నోట్లో పెట్టుకున్నారని, అట్లా రుచి తెలిసిందని కూడా చెపుతారు. మంటలో పడిన మాంసం ముందు, ముడుచుకుపోతుంది. లోపల ఉన్న నీరు ఆవిరయి, బయటకు వస్తుంది. కొవ్వు పదార్థాలు కరిగి బయటకు కారుతాయి. అవి అంటుకుని, మండి మాంసం రంగు మారుతుంది. అందులో కొత్త పదార్థాలు, కొత్త వాసనలు పుడతాయి. ఇదంతా 20 లక్షల సంవత్సరాల నాడు, మొదటిసారిగా తెలిసింది. మనిషి తిండి తీరు, జీవించే కాలం, పిల్లలను కనే తీరు మొదలయినవి ఈ వంటవల్ల మరిపోయినాయని మాత్రం తరువాత తెలిసింది. చింపాంజీలతో మొదలు మరే జంతువులకూ వంట చేయడం తెలియదు.
కోతి జాతులతో పోలిస్తే, మనిషి నోరు, పళ్లు ఎంతో మృదువు లక్షణం గలవి. దవడలు, వాటిని కదిలించే కండరాలు కూడా గట్టివి కావు. చెట్ల కొమ్మలను నములుకుని తినే శక్తి మనిషికి ఏనాడూ లేదు. మన శరీరంలోని జీర్ణ వ్యవస్థ కూడా మిగతా కోతులలోలాగా లేదు. ఉదాహరణకు మనిషి పెద్దపేగు నిజానికి చాలా చిన్నది. అందుకు ఆకు కూరలు, కూరగాయలు వండకుంటే, అంతగా అరగవు. పళ్లుకూడా అరగవు. పచ్చిమాంసం తింటే మనిషికి ప్రాణం మీదకు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇంత బలహీనమయిన జీర్ణ మండలం గల మనిషి మిగతా జంతువులన్నింటినీ మించి, ప్రపంచాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం వెనక రహస్యం ఏమిటి?

సుమారు 25 లక్షల సంవత్సరాల కింద కూడా మనుషులకు, కోతులకు మధ్య పెద్ద తేడాలేదు. అప్పట్లో మనుషులకు కూడా చేతులు పొడుగ్గా, కాళ్లు పొట్టివిగా ఉండేవని తెలుసు. మెదడు కూడా చింపాంజీలకంటే పెద్దదిగా ఉండేది కాదు. కడుపు, ఉరఃపంజరం పెద్దవిగా ఉండేవి. అంటే అప్పటి మనిషి, చెట్లు, కాయలతోనే కడుపు నింపుకునే వాడని అర్థం! ఆ తరువాత 6 లక్షల సంవత్సరాల కాలంలో, మనుషులు మరింత మనుషులయ్యారు. చేతులు పొట్టివయి, కాళ్లు పొడుగయ్యాయి. పేగుల పొడుగు తగ్గింది. నమిలే పళ్లుకూడా చిన్నవిగా మారాయి. మెదడు మాత్రం, నలభయి శాతం పెద్దదయింది. ఈ మార్పులన్నీ తిండిని వండుకు తినడం వల్లనే జరిగాయని పరిశోధకులు నిస్సందేహంగా చెపుతున్నారు.

రాతి పనిముట్ల వాడకంతో, మాంసం మరింత బాగా దొరికింది. వండుకుని తిన్నందుకు శక్తి ఎక్కువగా అందింది. కనుక మెదడు పెద్దదయింది. వండుకుని తినడంలో మనిషి మరెన్నో మెళకువలు నేర్చుకున్నాడు. ఆఫ్రికాలో 19 లక్షల ఏండ్లనాటి అవశేషాలు ఈ ఊహకు మరెంతో బలాన్నిచ్చి నిజంగా మార్చాయి.

వండిన మాంసం మెత్తబడుతుంది. సులభంగా నమలవచ్చు. రుచి పెరుగుతుంది. కాల్చిన మాంసంలో సూక్ష్మక్రిములు మిగలవు. మరికొన్ని రోజుల దాకా అవి తినడానికి పనికి వచ్చింది. మాంసంలాగే, దుంపలు, వేళ్లుకూడా కాల్చిన తరువాత, రుచితో బాటు బలాన్నిచ్చే తిండిగా మారతాయి. పచ్చి తిండి 65 శాతం అరిగితే, వండినది 90 శాతం వరకు అరుగుతుంది. అంతకుముందు, అందుబాటులోని గట్టి, రుచిలేని శాకాహారం కూడా, మంట, వంటలతో మనిషికి అందుబాటులోకి వచ్చాయి. వెదుళ్లు, బంగాళాదుంప లాంటివి పచ్చివి తినడంవల్ల అపాయం ఉండేది. వేడివల్ల వాటిలోని విషాలు విరిగి, అవి మంచి తిండిగా అందుబాటులోకి వచ్చాయి. ఈ రకంగా, తిండిని అరిగించుకునేందుకు శరీరం పడే కష్టం సగానికి తగ్గిపోయింది. కనుక నోరు, పెదవులు, పళ్లు, దవడల నిర్మాణంలో గొప్ప మార్పులు వచ్చాయి. శరీరంలో, అన్నింటికన్నా పెద్ద మార్పు మెదడులో కనబడింది. శక్తి మిగతా శరీర భాగాలకన్నా, మెదడుకు ఎంతో మేలు చేసింది. తిండి గట్టిగా ఉంటే, దాన్ని నింపాదిగా నమలడంతోనే కాలం గడిచేది. వంటతో పరిస్థితి మారింది. కొత్త తిండిని వెతికేందుకు, కావలసినంత కాలం కలిసి వచ్చింది. మంచి తిండి దొరికినవారు బలం గలవారయ్యరు. పిల్లలను కన్నారు. జాతి, బలంగా ముందుకు సాగింది.

మనిషి శరీరంలో మెదడు, పరిమాణం ప్రకారం, తక్కువ చోటును ఆక్రమిస్తుంది. కానీ, తిన్న తిండి మాత్రం పావు వంతు మెదడుకే వాడుకవుతుంది. మెదడు పెరిగితే బతుకు తీరు పెరుగుతుంది. తాబేటి పెంకులో వంట చేయవచ్చునన్న ఆలోచన ఇందుకొక ఉదాహరణ. గట్టి గింజలను పొడిగా, నూరి, తినడం మరొక ఉదాహరణ. పిండి తెలిసిన తరువాత రొట్టెను కనుగొనడానికి ఎక్కువ కాలం పట్టలేదు. గట్టి రొట్టెలను కొన్ని దినాలు దాచుకుని తినడం కూడా తెలిసింది. తడిపిన పిండిని, ఏ వానాకాలంలోనో, వాడకుండా పక్కన పెడితే అది పులిసింది.

ఆ పిండిలో కార్బన్‌డై ఆక్సైడ్ పుట్టింది. పిండిని కాలిస్తే, మరింత మెత్తని, రుచిగల రొట్టె వచ్చింది. మట్టి కుండలు 30,000 సంవత్సరాల క్రితం వచ్చాయి. దుంపలను, మాంసాలను నిప్పుల సెగమీద, ఎక్కువేపు ఉడికించే పద్ధతి తెలిసింది. వాటికి నీరు కలిపి ఉడికించి పులుసు చేయడం తెలిసింది. ఉప్పు కలిసి, మాంసాన్ని, ఆరబెట్టి దాచుకోవడం, వంటలో తరువాతి మెట్టు. ఈ వరుగులు, కరువులోనూ మనిషిని కాపాడగలుగుతాయని అర్థమయింది. అదొక గొప్ప మార్పు. ఇంచుమించు ఈ కాలంలోనే తిండిని మరింత రుచిగలదిగా మార్చే, ఉల్లి, మిరియాలు లాంటి వాటిని మనిషి కనుగొన్నాడు. తిండికి బాగా మసాలాలు కలిపితే అది ఎక్కువ కాలం మన్నింది. తిండి తీరు మారుతున్నకొద్దీ, మనిషి శరీరంలో రోగ నిరోధక శక్తి లాంటివి కూడా మారిపోయాయి. పచ్చి తిండి మీద ఉండే క్రిములు ఆరోగ్యానికి హాని కలిగించడం మొదలయింది. అయినా, వంట కారణంగానే, మనిషి, అనువుగాని వాతావరణం, పరిసరాలు, పరిస్థితులను తట్టుకుని ముందుకు సాగగలిగాడు. వంట వల్ల వచ్చిన లాభాలతోపోలిస్తే, నష్టాలు తక్కువే. ఇవాళ వండకుండా తిండి తినే వారు చాలా అరుదు.

అన్నింటికన్నా ముఖ్యంగా, తిండి పేరున వెచ్చించే సమయం బాగా తగ్గింది. లేకుంటే, సగం రోజు తిండితోనే సరిపోయేది!

No comments:

Post a Comment