Tuesday, November 29, 2011

ఏడు వందల కోట్లు - ఏమవుతుంది?


జనం, మరింతగా జనం

భారతదేశంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను అమలుచేసిన తీరు కారణంగా గతంలో కొంతమందికి చెడ్డపేరు వచ్చింది. ఒక దశాబ్దం కింద అందరికీ అదే చర్చనీయాంశంగా కనిపించిన ‘జనాభా సమస్య’ ఇప్పుడు ఎందుకు తెరమరుగు అయిందో తెలియదు. 2011 అక్టోబరు 31న ఈ ప్రపంచంలోని ఏడు బిలియనుల జనాభాలో చివరి వ్యక్తిగా మన దేశంలో ఒక శిశువు పుట్టినట్టు చెప్పారు. ఆ ఘనత మరో దేశంలో మరో శిశువుకు ఉందన్నారు కూడా. మొత్తానికి 700 కోట్లలో మనమూ ఒక్కరం అయ్యాము! ఈ సంఖ్య గంటకు 10వేలమంది చొప్పున పెరుగుతూ పోతున్నది. 

2050 నాటికి జనాభా 9.3 బిలియనులు (930 కోట్లు) అవుతుందని ఐక్యరాజ్యసమితి అంచనా. ఆ సంఖ్య అటూ ఇటూ అవుతుందనడంలో ఆశ్చర్యం లేదు. 1950లో ప్రపంచ జనాభా 250 కోట్లు. ఈసారి 2050 లెక్కలో తేడా అంత ఉండవచ్చునంటున్నారు! పుట్టిన ప్రతి మనిషికీ కూడు, గుడ్డ, గూడు కావాలి. అవసరాలు అంతటితో ఆగితే బాగుండును. కాలం మారింది. ప్రతి మనిషికీ కరెంటుగానో, మరో రూపంగానో ‘శక్తి’ కావాలి. పుట్టిన ప్రతి మనిషి నుంచీ వ్యర్థ పదార్థాలు పుడతాయి. ప్రతి ఒక్కరూ కాలుష్యం కలిగిస్తారు. ఇందులో బీద, ధనికుల మధ్య కొంచెం తేడా ఉండవచ్చుగానీ, మొత్తంమీద ప్రపంచం మీద ప్రభావం మాత్రం తప్పదు. పర్యావరణంతోబాటు, సామాజిక, ఆర్థిక సమస్యలకు జవాబులు అంత సులభంగా అందనిరోజులు ముందున్నాయి అంటున్నారు ఆలోచనగలవారందరూ!
1970 ప్రాంతంలో అందరూ జనాభా గురించి చర్చించేవారు. మన దేశం, చైనా వంటి చోట్ల ‘జనాభా సమస్య’ను గొప్ప జాతీయ విపత్తుగా గురించి కార్యక్రమాలు అమలు చేశారు. అందులో చాలా మొరటుతనం కనిపించింది కూడా. సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఆరువందల కోట్లకు చేరిన జనాభా, చూస్తూండగానే మరో మైలురాయిని దాటింది. పనె్నండు సంవత్సరాల క్రితం ప్రపంచం మరోరకంగా ఉండేదని బల్లగుద్ది చెప్పవచ్చు. ప్రస్తుతం మనిషిని చుట్టుకున్న సమస్యల రూపం మారింది. భద్రత ఏ రంగంలోనూ కనిపించకపోవడం కొట్టవచ్చినట్టు కనబడే లక్షణంగా వచ్చింది!

ఎటు చూచినా, ఏ అంశాన్ని చర్చించినా, అది చివరకు జనాభా సంఖ్యను ముందుకు తెచ్చి నిలబెడుతుంది. దేశాలమధ్య వలసల నుంచి మొదలు, వ్యాపారం దాకా అన్నింటిలోనూ మనుషుల సంఖ్య ‘భయంకరంగా’ ముందుకువచ్చి భయపెడుతున్నది. ఇదే రకంగా పరిస్థితి కొనసాగితే, మనమనుకుంటున్న మానవవిజయాలే మన జాతికి శత్రువులుగా మారతాయా? మనుషుల మనుగడకు మంగళం పాడతాయా? అన్న ప్రశ్న పుడుతుంది! ఈ భూమి 700 కోట్ల మందిని మోయగలుగుతుందా? వారి అవసరాలను అందిస్తుందా?

ఈ ప్రశ్నలు చాలామంది మనసుల్లో ఉన్నాయి. కానీ అందరూ బాహాటంగా అడిగింది మాత్రం లేదు. అడిగిన తరువాత అవి భయంకరంగా కనిపిస్తాయి. తప్పదు. కానీ, జవాబు మాత్రం అంతకంటే ఆశ్చర్యంగా ఉంటుంది! నమ్మండి, ఈ ప్రపంచానికి ఏడు వందల కోట్ల జనాభా భారం కానే కాదు! వీళ్లందరినీ తెచ్చి మన దగ్గరి పెద్ద రాష్ట్రంలో ఒక దాంట్లో ఉంచవచ్చు. అయినా అక్కడ రద్దీ, పెద్దనగరాల్లో ఉన్న కంటే ఎక్కువ మాత్రం కానే కాదు. నగరాల్లో అందరూ, అంత రద్దీలోనూ హాయిగా బతుకుతూనే ఉన్నారు. వీళ్లందరికీ సరిపడేంత తిండి ఈ ప్రపంచంలో సిద్ధంగా ఉంది. నీరుంది. మిగతా అవసరాలూ ఉన్నాయి. ముందుకాలంలోనైనా, ప్రస్తుతమైనా, వనరులు సమస్య కావు. వాటి పంపిణీ, జనం వాటిని కొనగలిగే శక్తి మాత్రమే అసలైన సమస్యలు.

నిజానికి ఈ ప్రపంచంలో మరింతమంది వచ్చి చేరినా తగినన్ని వనరులు కొంతకాలం వరకూ ఉంటాయి. 1820 ప్రాంతంలో పారిశ్రామిక విప్లవం మొదలయింది. 2008లో మాత్రమే ప్రపంచంలో ఆర్థిక మాంద్యం మొదలయింది. ఈ మధ్యన ప్రపంచంలో ఆర్థిక ఉత్పత్తి 11 రెట్లు పెరిగిందన్నమాటను ఎవరూ కాదనలేరు.

మనిషి సగటు జీవన కాలం 70 సంవత్సరాలకు పెరిగింది. ప్రతి తల్లీ కనే పిల్లలసంఖ్య సగానికి తగ్గింది. నిజానికి జనాభా పెరిగే రేటు తగ్గింది! ఈ రకంగా గమనిస్తే, సమస్య మనుషుల సంఖ్య కాదని సులభంగానే గుర్తించవచ్చు. ఈ మనుషులు ఎంత ఉత్పత్తి చేస్తున్నారు, ఎంత వాడుకుంటన్నారన్నది అసలు సమస్య! ఆఫ్రికాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. చైనా, మన దేశం ఎంత జనాభా ఉన్నా, నెట్టుకు వస్తూనే ఉన్నాయన్న సత్యాన్ని గుర్తించాలి. పరిస్థితి అంతటా ఒకరకంగా ఉండకపోవడం అసలు సమస్య! జనాభా ఎక్కువగా పెరుగుతున్న చోట్ల వనరులు తక్కువగా అందుతున్నాయి. ఈ పరిస్థితిని జారెడ్ డయమండ్ లాంటి పరిశోధకులు చక్కగా విశే్లషించారు.
ప్రపంచంలో 700 కోట్లమంది ఉన్నామిప్పుడు. ఇందులో వంద కోట్ల మందికి కనీస వనరులు కూడా అందడంలేదు. అందుకు కారణం, వారి అవసరాలకు సరిపడా తిండి, నీరు లాంటివి లేకపోవడం మాత్రం కాదు. నిజానికి పండిన పంటల్లో సగం నాశనమై, ఎవరికీ ఉపయోగపడకుండా పోతున్నదన్న సంగతిని అందరూ గుర్తించాలి. తలుచుకుంటే ఈ ప్రపంచం మరో రెండు వందల కోట్ల మందిని కూడా భరించగలదు. ఈలోగా, పర్యావరణం, సరఫరా, ఇంధనాలు మొదలైన అంశాలను గురించి సరైన పథకాలు అమలు కావాలి! మనుషులు మాత్రం బాగుంటే చాలదు, మిగతా ప్రపంచం, జీవులు కూడా బాగుండగలగాలి! అదే అసలు సమస్య!

జనాభా - ప్రభావం

జనాభా పెరిగినందుకు పెద్ద నష్టం లేదంటున్నవారి మాట సత్యమే! అయినా సమస్యను సమస్యగా చూడవలసిన అవసరం మాత్రం ఉండనే ఉంది. మనుషుల అవసరాలను అందించినంత మాత్రాన సరిపోదు. ఆ తతంగం ప్రభావంగా జరిగే మిగతా మార్పుల గురించి పట్టించుకుంటే గాని మనుషుల మనుగడ అనుకున్నంత సుఖంగా సాగదు.
మునుముందు ఏం జరగనున్నదీ అంచనా వేయడం కష్టం. గతంలో జరిగినవన్నీ తరువాత కూడా జరుగుతాయన్న నమ్మకం లేదు. ఇప్పటివరకు, ఎదురైన సమస్యలను ఏదో రకంగా నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నాం. ఎంతటి సమస్యలున్నా ఎదుర్కొనేందుకు ఎక్కువమంది మనుషులుంటారన్న వాదం బాగానే ఉంది. కానీ, పరిస్థితిని అంత సులభంగా అంచనా వేయకూడదు. మనుషులు ఎక్కువయితే, ముందుగా భూగోళం మీద ప్రభావం ఎక్కువవుతుంది. మనుషులు అన్ని విధాలా మునుముందుకు సాగుతుంటే, మిగతా జీవుల పరిస్థితి మాత్రం నానాటికీ తీసికట్టు అయిందన్నది ఇప్పటికే మన అనుభవం. ఎన్నో రకాల జంతు, వృక్షజాతులు అంతరిచిపోయినయి కూడా. ఏటేటా మరో యాభై రకాలు ఈ దిశగా అంతరించే స్థితికి చేరుతున్నాయని అంచనా! పులులు, తోడేళ్లు, సొరచేపలు లాంటి వేటాడే ప్రాణులు అంతరిస్తే, ఆహార చక్రంలో పెద్ద మార్పులువస్తాయి.

జాతులు తుడిచిపెట్టుకుపోయే మహాతరంగం, మనిషి కారణంగా మరోసారి జరుగుతున్నదని పరిశోధకులు అంటున్నారు. మన అవసరాలు పేరున, నేల, నీరు, గాలి మొదలైనవాటి తీరును పూర్తిగా మారుస్తున్నాము. వాతావరణం వేడెక్కుతున్నదన్న విషయం అందరూ అంగీకరించినదే. వ్యర్థ పదార్థాల సమస్య మరోవేపు పెనుభూతంగా పెరుగుతున్నది. పర్యావరణం, ప్రకృతి ఒకే రకంగానే ఉంటేనే మానవజాతి మనుగడకు సాగుతుంది.
మనుషులు బతికితే చాలదు. మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశం కాదు, ఆర్థిక శక్తిగా మారింది అంటున్నారు. అయినా కోట్లమంది ఆకలితో బతుకుతున్నారు. ప్రపంచం మొత్తం మీదలాగే మన దేశంలోనూ కొన్ని ప్రాంతాలలో పరిస్థితి బాగుందన్న భావం కలిగిస్తుంది. మన దేశంలోనూ ‘ఆఫ్రికా’ లాంటి పరిస్థితులు అక్కడక్కడ ఉన్నాయి. బీమారూ (బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్) రాష్ట్రాలకు ఇంకా ఆ పేరు పోనే లేదు. ఒక్క కోల్‌కత నగరంలోనే 2025 నాటికి నాలుగున్నర కోట్లకుపైన జనం ఉంటారని లెక్క తేల్చారు. ఈ నగర విస్తీర్ణం పెరగటానికి వీలు లేదంటే ఆశ్చర్యం. జనాభా విషయంలో మొత్తం ప్రపంచానికి ఇదొక నమూనా! ప్రభావాలను జాగ్రత్తగా అంచనా వేయాలి!

Monday, November 28, 2011

మన గురించి మనం - 2


కాలం ఆగదు!
కాలం కదలదు!!
కదిలేది మనమేనా?


గోళ్లు గిల్లుకుంటూ కూచున్నా సరే, రోజు గడిచిపోతుంది. చూస్తుండగానే వయసు పెరిగిపోతుంది. నిన్నటిరోజు మళ్లా రాదు. కన్ను మూసి తెరిచే లోగా ఆ క్షణం గడిచి పోతుంది. అందుకనే చేయవనలసినదేదో సకాలంలో చేయాలి. లేకుంటే దానికి అర్థమే ఉండకపోవచ్చు.

ప్రశ్న గురించి మరోసారి తలుచుకుంటే, మరో ప్రశ్న పుడుతుంది. ఇంతకూ ఈ కాలం ఎందుకని తన మానాన తాను గడిచి పోతుంది? కాలం కొలతలకు నిలవదంటున్నారు. అంతా భ్రమ అంటున్నారు. సమయం ఇక్కడ ఉండి మరో చోటికి కదలదు. కదూ, అని ఈ సంగతి గురించి ఆలోచిస్తూ గంటలు గడపొచ్చు! ఇంతకూ కాలం ఎట్లా కదులుతుంది ఎక్కడికి పోతుంది? కదిలే ప్రతి అంశానికి గమ్యం ఉండాలిగదా? కాలానికి గమ్యం ఏది?

ఈ ప్రశ్న అడిగామంటే కాలం కదులుతుందని మనం నమ్మినట్లే కదా? అది కదిలితే దానికొక వేగం ఉంటుంది. గడియారం సంగతేమిటని అడుగుతారు కదూ? అది మనం చెప్పిన లెక్క ప్రకారం కాలాన్ని కొలత వేయడానికి ప్రయత్నం మాత్రం చేస్తుంది. ఏ రెండు గడియారాలూ ఒకే సమయం చెప్పవు. అన్నీ తప్పుడు సమయం చూపించేవే అన్నా తప్పు లేదు. టైమ్ చెప్పే లోగా ఆ క్షణం దాటి పోతుంది మరి.

గడియారం వేసే లెక్క మనకు తెలిసిన కొన్ని సంగతుల గురించి మాత్రమే. ఇప్పుడు చూస్తే ఒక టైము. నాలుగు క్షణాల తరువాత మరొక టైము. ఆ మధ్య కాలం గురించి మాత్రమే చెప్పగలదు గడియారం. ఆ రెండు క్షణాల మధ్య కాలంలో ఈ ప్రపంచంలోని సంగతుల వేగం మారిందనుకోండి. కనీసం మన అలోచనల వేగం మారవచ్చు కదా. మారిపోక తప్పదు. ఎందుకని మనం గడియారాన్ని తిరగి తిరిగి చూస్తున్నామని ఒక కారణం ఉంటుంది. దాన్ని బట్టి ఆ క్షణాల పరిధి పెరగవచ్చు, తరగనూ వచ్చు.
ఈ ప్రపంచంలో ఉదయాస్తమానాలూ, మనిషికీ, మిగతా జీవులకూ, శరీరానికి వయసు పెరిగే లక్షణం మొదలయినవి లేవనుకుంటే కాలం ప్రభావం తెలుస్తుందా?

ప్రపంచంలో మరెన్నో విషయాలు మనకు కాలం గురించి చెపుతాయి. అది కదిలిందన్న భావాన్ని కలిగిస్తాయి. రుతువులు, వాటి ప్రభవాలు అందులో ముఖ్యమయినవి. ఇవేవీ లేకుంటే కాలం కదలిక తెలుస్తుందా ఏమో ఆ అనుభవం గురించి ఆలోచనే రాలేదు ఇప్పటి వరకూ అంటే చేయగలిగింది లేదు. విశ్వంలో ఏమీ లేదనుకుందాం. ఇక కదలిక ఎక్కడిది. ప్రపంచమంతా ఈ కదలిక మీదనే ఆధార పడిందంటే ఆశ్చర్యం కదూ?

భౌతికశాస్త్రమంతా కదలిక గురించేనని ఎప్పుడయినా అనిపించిందా? ఆలోచించండి!!

కదలికే బ్రతుకు. కదలికే దానికి అంతం. మొదలూ కూడా. అందుకే అంతా సంతోషంగా ఉంటే కాలం పరుగెట్టి పోతుంది. నిజంగా కాలం, దాని కదలిక లేదంటే, బతుకుఎంత సంతోషంగా గడిచినా తేడా తెలియదేమో?

ఆలోచించండి!!

Wednesday, November 23, 2011

నాగసూరి పుస్తకం - సమీక్ష


సైన్స్ దృక్పథం (సైన్స్ విజ్ఞాన వ్యాసాలు)
రచన: డా. నాగసూరి వేణుగోపాల్
డా. పి. బాబి వర్ధన్
పేజీలు: 104, ధర: రూ. 50/-
ప్రతులకు:
విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
బ్యాంక్ స్ట్రీట్, హైదరాబాద్
సైన్సుకు స్వంతంగా ఒక దృక్పథం ఉండదు. స్వంత విలువలు కూడా ఉండవు. సైన్సుకు ఒక తత్త్వం ఉంటుంది. అది ఒక పద్ధతిలో కొనసాగుతుంది. విజ్ఞాన పద్ధతి ప్రకారం ఆలోచించే మనుషులకు ‘శాస్ర్తియ దృక్పథం’ అలవాటవుతుంది. మానవ విలువలకూ అక్కడ కొత్త అర్థాలు పుడతాయి.

పత్రికలు, మాధ్యమాలకు సైన్సంటే ఒక రకమయిన భయం. ముందు అది వారికి అర్థం గాదు. అర్థమయిన చోటికి రాస్తే చదివే వారికి అర్థం గాదు. ‘‘రాజకీయ వార్తలు చదివినంత హాయిగా సైన్సు వార్తలు చదవగలరా?’’ అన్న ప్రశ్నతో ఈ పుస్తకం మొదలవుతుంది. ఇందులో సైన్సు రచనల గురించి కూడా చర్చ ఉంది. అందులో పేర్లు కనబడిన వారంతా సైన్సులోని అంశాలను ఎంచుకుని వాటి గురించి రాశారు. ఈ రచయితలు మాత్రం అసలు సైన్సు ఏమిటి? ఎందుకు? ఎట్లాంటి విషయాలను గురించి రాశారు. అందుకని వీరిని అభినందించాలి.

వీళ్ళు సైన్సు అంటే ఏమిటి? అని నిర్వచించే ప్రయత్నం చేశారు. స్థూలంగా అని మొదలుపెట్టి ఇంచుమించు ఒక వివరణ ఇచ్చారు. సైన్సు అలాగుంటుంది. మనిషికి తోడ్పడిన ప్రతి అంశం, సైన్స్ రంగం కూడా అని ఒక మాట వదిలారు. ఇది సమగ్రం కాదేమో? అయినా ఆలోచనకు ఒక ప్రాతిపదిక మొదలయితే పాఠకులు, విషయంలో తలమునకలవుతారు. అదే విషయం ముందుకు సాగిస్తూ వీరు సైన్స్ ఫిక్షన్, పాపులర్ సైన్స్‌ల మధ్య తేడాను చూపే ప్రయత్నం చేశారు.

అవసరం లేదు. అర్థం కాదు. అనుకుంటే ఈ ప్రపంచంలో ఏదీ అర్థం కాదు. అందరూ సినిమాలు అర్థమవుతాయి గనుకనే చూస్తున్నారా? కాలక్షేపానికి అవసరం గనుక చూస్తున్నారు. సైన్సు కూడా మనకు అంతగానూ అవసరమని, ఈ పుస్తకంలోని వ్యాసాలు చెపుతున్నాయి. ‘సైన్సు మా పిల్లలు చదువుతారు!’ అనే వారంతా ఓపిక చేసుకుని ఈ రకం వ్యాసాలు చదవాలి. సైన్సు-ప్రజలు-సమాజం క్రమంలోని వ్యాసాలు చర్చకు మంచి ప్రాతిపదిక వేస్తాయి. సైన్సంటే మనగురించి, పరిసరాలు, ప్రపంచం, పరస్పర సంబంధాల గురించి నడిచే అవగాహన. అది మరీ లోతయే సరికి కొంచెం దూరంగా కూడా అయింది! అందుకే విషయాన్ని గురించి మరింత చర్చ నడిపించారు ఈ రచయితలు. పత్రికలు, మిగతా ప్రసార మాధ్యమాలు, సరయిన అవగాహనతో ఈ బాధ్యతను తీసుకుంటే మనుషులలో ఆలోచన ధోరణి మారుతుంది. మీడియాలో పరిస్థితులను గురించి జర్నలిజం నిపుణులయిన ఈ రచయితల చర్చ బాగా సాగింది.

తెలుగునాట, భారతదేశంలో ప్రపంచంలోని వైతాళికుల గురించి వ్యాసాలు మొక్కుబడిగా ఉన్నాయి. అందుకు కారణం ఈ వ్యాసాలు. ముందు ఏదో పత్రిక కొరకు రాయడం. అన్నట్టు పండిత గోపాలాచారి గారు కనిపించారు గానీ, యెల్లాప్రగడ సుబ్బారావు గారు ఏరీ? షంసుల్ ఉమర్ గురించి మరింత తెలిస్తే బాగుండును అనిపించింది.
సైన్సు రాసినా, దాని గురించి రాసినా, భాష సమస్య అని అందరూ అలవాటుగా అంటూ ఉంటారు. ఈ పుస్తకంలో ఆ సంగతి కూడా చర్చకు వచ్చింది. విషయంపట్ల విధేయతగల ఈ పరిశోధక రచయితలు పదాల గురించి మరింత కృషి చేస్తే ఎందరికో ప్రయోజనం ఉండి తీరుతుంది. జెన్ అంటే పుట్టుకకు సూచన. జెనెటిక్స్ అంటే పుట్టుకల శాస్త్రం. హైడ్రోజెన్ అంటే నీటి పుట్టుకకు కారణం. కనుకనే అది సంస్కృతంలో ఉదజని!

కలాం, కొడవటిగంటి, నండూరి రామ్మోహన రావు గారల గురించిన వ్యాసాలున్నాయిక్కడ.
ఈ వ్యాసాలు ఒక పథకం ప్రకారం రాసినవి కాకున్నా వాటినలా సర్దడం బాగుంది. ముందే సైన్సు. అందునా సైన్సు గురించి కనుక ఈ రచయితలు తమ భాషను మరింత సులభంగా ఉండే తీరుకు మార్చుకుంటే రీడబిలిటీ పెరుగుతుంది. ‘పరిశోధనా ఆకాశంలో స్ర్తి సగం కాదని వాస్తవాలు చెబుతున్నాయి’ లాంటి వాక్యాలు ఇంగ్లీషు వాసన కొడుతున్నాయి.

ఈ రచయితల కృషికి వినియోగం, మరింత కృషి జరుగుతుందని ఆశిద్దాం.

Tuesday, November 22, 2011

నీటిమీద నూనె - రంగులు


నీటిమీద నూనె ఏదైనా పడితే దానిమీద రంగులు కనబడతాయి. ఎందుకు?

కేవలం నీరే ఉండి, దానిమీద వెలుగు ఎంతగా నాట్యం చేసినా రంగులు కనబడవు. కేవలం చమురు ఉన్నా సరే, దానిమీద రంగులు కనబడవు. ఇక నీళ్లమీద, మనం మామూలుగా వంటలో వాడుకునే మంచి నూనెవేసి చూడండి. దానిమీద కూడా రంగులు కనబడవు. వేరే నీళ్ల మీద కొంచెం కిరోసిన్ వేసి చూడండి. కొంచెంగా రంగులు కనబడతాయి. (నిజంగా ఈ ప్రయోగం చేయదలుచుకుంటే, పిల్లలు పెద్దవాళ్ళనడిగి, వారి సాయంతో చేయాలి. లేకుంటే గొడవ!)


వర్షం తరువాత రోడ్డు మీదకు నీరు పారుతుంది. దానిమీద మాత్రం రంగులు నాట్యమాడుతూ కనబడతాయి. ఇందుకు కారణం సులభంగా చెప్పవచ్చు. రోడ్డుమీద నడిచే రకరకాలవాహనాలనుంచి చమురు చుక్కలు కిందపడతాయి. వర్షం నీటి మీద ఆ చమురు పలుచని పొరగా పరచుకుంటుంది. నీటికంటే చమురు సాంద్రత తక్కువ. కనుక అది నీటి మీద నిలుస్తుంది. ఇక్కడ ఉండే చమురులలో సర్‌ఫెక్టెంట్స్ అనే రకం రసాయనాలు కలిసి ఉంటాయి. అందుకే చమురు నీటి మీద అంతటా పరచుకుంటుంది. మంచి నూనెలో ఈ రసాయనాలు ఉండవు. పైగా దాని సాంద్రత కొంచెం ఎక్కువ. కనుక, అది నీటిమీద అంత సులభంగా పరచుకోదు. నీటిమీద తేలడం మాత్రం తేలుతుంది. అంటే మొత్తానికి చమురు నీటి మీద పరచుకోవడం, ఆ పొర మందం, అది మధ్యలో ఎక్కువగా ఉండడం మీద రంగుల సంగతి ఆధారపడి ఉంది.

చమురు మీద పడిన వెలుగు, రెండు చోట్ల నుంచి పరావర్తనం చెందుతుంది. అంటే తిరిగి వెనుకకు వస్తుంది. చమురు పొర పైతలం నుంచి ఒకసారి, ఆ పొర నీటికి తగులుతూ ఉండే, లోపలి తలం నుంచి మరొకసారి, అది ప్రతిఫలిస్తుంది. ఈ రెండు వెలుగులమధ్య కొంత తేడా ఉండడం సహజం. ఆ తేడా వల్లనే రంగులు కనబడతాయి. ప్రతిఫలించే కాంతి మార్గాలు, ఒకే స్థాయిలో ఉన్నంతకాలం, రంగులు కనబడవు.

మరి, రంగులు ఎక్కడివి అనే ప్రశ్నకు సులభంగా సమాధానం చెప్పాలంటే, సూర్యకాంతిలో ఏడు రంగులు కలిసి ఉంటాయి. వర్షం తర్వాత, నీటి తుంపరలో, ఆ కాంతి ప్రతిఫలించి, ఇంద్రధనుస్సుగా కనబడుతుంది. పట్టకం అనేగాజు దిమ్మెలో కూడా కాంతి విడిపడి కనబడుతుంది. నీటిమీద వ్యాపించిన చమురు పొర తగినంత మందం ఉంటే, అందులోనూ, కాంతి విడిపోయి రంగులు కనబడతాయి. *

Monday, November 21, 2011

‘అన్నా’యం వెనుక సైన్సు!


అవి ఆటోలకు డిజిటల్ మీటర్లు రాని రోజులు. నూటికి తొంభై తొమ్మిది ఆటోలలో మీటరును ఎక్కువ తిరగేట్టు మార్చేవారు! ‘ఎందుకయ్యా? ఇది అన్యాయం కాదా?’ అన్నాను-అమాయకంగా! ‘సర్! పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ తక్కువ పోసేరకంగా మారుస్తున్నారు!’ అన్నాడు ఆటోవాలా. అంతటితో ఆగక ‘నీవు మాత్రం ఎక్కడా అన్యాయం చేయనట్టు మాట్లాడుతున్నావు!’-అన్నాడతను!

నిజంగానే మనమంతా లంచగొండితనం, అన్యా యం లాంటివి మన ఒక్కరిలో తప్ప మిగతా అందరిలోనూ ఉన్నాయనుకుంటాము. కానీ పరిశోధకులు మాత్రం మరో లాగా అంటున్నారు. ఏ కారణం లేకుండానే ఎవరైనా లంచగొండులు, అన్యాయం చేసే వారుగా మారతారు’-అంటున్నారు. జీవ పరిణామంలోని అంశాలను గమనించిన తర్వాత ఇది నిజమేననిపిస్తుంది. న్యాయం, న్యాయం అంటూ నైతికంగా గొప్పవారమనుకునే తీరు అర్థంలేనిదని రుజువయింది. అందరూ మోసమే చేస్తున్నప్పుడు, గుంపులో కలిసి అదే తోవన పోయినందుకు లాభం ఉంటుందని పరిణామక్రమం సూచించింది. అయినా, తనవరకు వచ్చినప్పుడు మాత్రం ఏమీ ఎరగనట్టే ఉండడం అందులో భాగమే. హిపొక్రసీ అనే ఈ లక్షణం అందరిలోనూ బ్యాక్‌గ్రౌండ్‌గా ఉండి తీరుతుందంటారు మనస్తత్వ శాస్తవ్రేత్త రాబ్ కుర్జ్‌బాన్.

ఎవరైనా చేతనయినంత వరకు, చేతనయినంతగా నీతిగా ఉన్నారంటే, మోసం చేయడానికి అవకాశం అందనందుకే అంటారు పరిశోధకులు. ఈ విషయాన్ని గురించి స్విట్జర్లాండ్‌లో పరిశోధనలు సాగిస్తున్న శాముయెల్ బెండహాన్ ఒక ఆటను రూపొందించారు. ఆడేవారు, కొంత సొమ్మును తాము, తమ ఉద్యోగుల మధ్యన పంచుకోవాలి. అందులో మూడు పద్ధతులున్నాయి. ఉద్యోగులకు జీతాలు పెంచవచ్చు. పంచేవారికి నష్టం వస్తుంది. లేక జీతాలను అదే తీరుగా ఉంచవచ్చు. మూడవమార్గంగా జీతాలను తగ్గించి తమకు ఎక్కువ మిగిలే ఏర్పాటు చేయవచ్చు. ఇది దొంగ పద్ధతి. ‘ఇంతకూ మీరు ఏ పద్ధతిని ఎంచుకుంటారు?’ అని ముందే అడిగితే, నూటిలో నలుగురు మాత్రం న్యాయమార్గం గురించి మాట్లాడారు. నిజం డబ్బులతో, ఒకే ఉద్యోగితో ఆట కొనసాగిస్తేన్యాయం కొనసాగింది. ఉద్యోగులసంఖ్య పెరిగిన కొద్దీ అన్యాయం తలెత్తసాగింది. అయిదవ రౌండు తర్వాత అయిదవవంతు మంది అన్యాయం చేశారు. పదవరౌండకల్లా సగంమంది అన్యాయానికి దిగారు.

నెదర్లాండ్స్‌లోనూ అమెరికాలో షికాగోలోనూ, అధికారంతో మొదలయ్యే కరప్షన్ గురించి పరిశోధనలు జరుగుతున్నాయి. అధికారం గల మనుషులు, అన్యాయం చెయ్యడానికి సులభంగా పూనుకుంటారని ఈ పరిశోధనల్లో గమనించారు. వారే, అన్యాయాన్ని చేతనయినంత గట్టిగా విమర్శించగలుగుతారట కూడా!
బ్రిటిష్ చరిత్రకారుడు, రాజకీయ నాయకుడు వార్డ్ ఆక్టన్ ‘అధికారం కరప్షన్ వైపు మొగ్గు చూపుతుంది’ అని సిద్ధాంతీకరించాడు. ఇక్కడ డబ్బు, దస్కం లావాదేవీల గురించి మాత్రమే కాదు చెపుతున్నది. ఆలోచనలలో కూడా తప్పుడు దారులు మొదలవుతాయి. లంచగొండితనం గురించి గగ్గోలు చేస్తున్నవారు అందరూ, మంచితనం కొద్దీ చేస్తున్నారా? అందులో వారికేదైనా ప్రయోజనం ఉందా? అని ప్రశ్న పుడుతుంది. తమ భూములు అమ్ముడుపోవడం లేదని, వాతావరణం, నీటి కాలుష్యం గురించి ఉద్యమాలుచేసిన వారి గురించి విన్నాము!

అధికారం చేత జిక్కినవారి ఆలోచనల తీరు మారుతుంది. అందులో నీతికి అంతగా చోటు ఉండదు. అది మత్తుపానీయం ప్రభావంలాంటిది. ఆల్కహాలు కారణంగా మనిషి ఆలోచనల ఫోకస్ మారుతుంది. తమ మీద తమకు నమ్మకం, తామే నిజంగా గొప్పవారమన్న భావం పెరుగుతుంది. అధికారానిది కూడా ఇదే దారి అంటారు పరిశోధకులు జోరిస్ లామర్స్. మామూలుగానయితే మనుషులు, కొన్ని పనులు చేయడానికి జంకుతారు, కానీ, అధికార భావం పెరిగితే ఈ జంకు తగ్గుతుందని మా పరిశోధనల్లో గమనించామంటారు లామర్స్.
అధికారంతో బాటు, అన్యాయాన్ని పెంచే మార్గం, ఆ అన్యాయం నుంచి మనం దూరంగా ఉన్నామన్న భావన. ఆ తప్పుడుపని మనవల్లే జరిగినా చేసేది మనం కానంతవరకు అన్యాయం, ఫరవాలేదన్న పద్ధతి ఇది. లంచగొండితనంలో మధ్యవర్తుల పాత్ర గురించి పరిశోధన జరుగుతున్నది. రాజకీయ నాయకునికి లంచం మనమివ్వనవసరం లేదు. ఆ మధ్యవర్తులు ఆ ఏర్పాటు చేస్తారు. అందుకు తాము కూడా కొంత డబ్బు తీసుకుంటారు. ఆ పని సేవగా చేసిన భావం కలిగిస్తారు. విషయం బయట పడినా పూచీ, పదిమందిదవుతుంది.
లంచగొండితనం రాకూడదు. వచ్చిందంటే, అది అందరిలోకీ వ్యాపిస్తుంది. ప్రపంచంలో లంచగొండి దేశాల పట్టికను ‘ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్‌నేషనల్’ అనే సంస్థ ఏటేటా ప్రకటిస్తుంది. డెన్మార్క్, న్యూజీలాండ్, సింగపూర్, ఫిన్‌లాండ్, స్వీడన్‌లలో ఈ లక్షణం 2010 లెక్కల ప్రకారం ఇంచుమించు లేదు. ఇరాన్, అప్ఘానిస్తాన్, బర్మా, సోమాలియాలు మరీ లంచగొండి దేశాలు. మన దేశం పేరు, ఆ తర్వాత రానే వస్తుంది.

అధికారంగలవారిది పెద్దస్థాయి అన్యాయం. అక్కడ బంట్రోతుది అదొక పద్ధతి. ఆటోవాలాది ఇంకో పద్ధతి. ‘ప్రధానమంత్రులే అన్యాయం చేస్తుంటే మనదెంత సార్!’ అన్నాడు ఆటో నడుపుతున్న పెద్దమనిషి. అవునా? అన్యాయం చేసే అవకాశం ఉండి కూడా చేయని వారు ఎవరున్నారు? వెదుకుదాము మరి!
అన్యాయం - పరిశోధనలు!

*మిల్‌వేకీలోని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ పరిశోధకులు మైకేల్ హేజెల్ హూన్ ఎలెయిన్ వాంగ్ ఈమధ్యన ఒక విచిత్రమైన సిద్ధాంతాన్ని ప్రకటించారు. ముఖం పెద్దదిగా ఉన్న మగవారు అవినీతి పనులను చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంది అంటారు ఈ పరిశోధకులు. వెడల్పు ముఖం గలవారు, బేరసారాల్లో సులభంగా అబద్ధం చెప్పగలుగుతారట.

చేతిలో విమాన ప్రయాణం గురించి గీతలుంటాయన్నంత చిత్రంగా ఉంది ఈ ప్రకటన అన్నారు మిగతా పరిశోధకులు. స్టాటిస్టిక్స్ అనే పద్ధతి ప్రకారం కొన్ని సంగతులను ఈ రకంగా చెపుతూ ఉండడం, అవి హాస్యాస్పదంగా ఉండడం అప్పుడప్పుడు జరుగుతుంది. అందుకే ఈ పరిశోధనలోని మరొక అంశాన్ని కూడా గమనించమంటున్నారు మైకేల్ ఎలెయిన్. పెద్ద ముఖంగలవారు, ఎక్కువ పవర్‌ఫుల్‌గా కూడా ఫీలవుతారట. శక్తి, అధికారం గలవారు సులభంగా అన్యాయం చేస్తారని, ఇంతకుముందు అందరూ అన్నదేగదా!

ముఖం వెడల్పుగా ఉన్నంత మాత్రాన, వారికి అధికారం, పవర్ అనే భావనలు ఎందుకు గలుగుతాయని అడగవచ్చు. ఆ ముఖం తీరు, వ్యక్తిత్వానికి గుర్తుగా కనబడుతుంది. అందులో ముఖ్యంగా, ఆ రకం ముఖంగలవారిని నమ్మగూడదనే భావం ఎదుటివారికి కలుగుతుంది. వారు తమ మీదకు విరుచుకుపడతారన్న భావం కూడా కలుగుతుంది, అంటారు ఈ పరిశోధకులు. కనుక వెడల్పు ముఖం వారితో వ్యవహారం జరుగుతున్నప్పుడు, ఎదుటివారు, కొంత కింద చేయిగా వ్యవహరిస్తారట. అట్లా అందరూ వారి ముందు, భయపడుతూ ఉంటే, రాను రాను వారిలో అధికారభావం, పైచేయి లక్షణాలు బలుస్తాయట!

* సమాజానికంతటికీ ఆ విషయంగా ఆలోచన పుట్టి, అన్యాయం గురించి గోల చేస్తే అది తగ్గే సూచనలున్నాయంటారు బెంజమిన్ ఓల్కెన్ లాంటి పరిశోధకులు. ఆయన ఇండోనీషియాలో రోడ్లు వేయడంలో జరిగిన స్కామ్ గురించి పరిశోధించారు. ఎవరో, ఎక్కడో లంచగొండితనాన్ని బయటపెట్టారంటే, మరో చోట ఆ లక్షణం తగ్గుతుందట. అన్నా హజారేగారి ప్రభావం- దేశంలో ఎంత ఉందన్న సంగతి గురించి పరిశోధన జరిగితే బాగుంటుందని కొందరు నిపుణులు అంటున్నారు.

*తిరుమల క్షేత్రంలో వేంకటేశ్వరస్వామి వారు, గురువారం ‘నేత్రదర్శనం’ అనుగ్రహిస్తారు. అంటే, ఆనాడు స్వామి కళ్లు తెరుస్తాడని నమ్మకం. అందుకే అక్కడి సిబ్బంది గురువారం లంచాలు పట్టరని, అన్యాయం చేయరని, అభిజ్ఞ వర్గాల కథనం. ఇలాంటి విషయాలను కూడా మనస్తత్వ వేత్తలు పరిశోధించాలి! *

Sunday, November 20, 2011

మన గురించి మనం - 1


మీరు ఆలోచించగలరా?

ఆలోచిస్తారా?
మరి ఆలోచించండి!

ఒక సముద్రం ఉంది. అందులో ఒక చేప ఉంది. అక్కడ చేపలు, మిగతా జంతువులు చాలా ఉన్నాయి. వాటి సంగతి మనకు అవసరం లేదు. కథ ఈ చేప గురించి. అది కనిపించిన జంతువులన్నింటినీ పెద్ద సముద్రం ఏదో ఉందట. అది ఎక్కడుంది?” అని అడుగుతూ ఉంటుంది. మిగతా జంతువులు నవ్వగలుగుతాయేమో తెలియదు గానీ, పక్కకు తప్పుకుని వెళ్లిపోయేవట.

కథ చిన్నదే. కానీ గొప్పది. ఇందులో ఆలోచించడానికి బోలెడు వ్యవహారం ఉంది.

మనమందరమూ ఆ చేప లాగే బతుకుతున్నామేమో?

పసిపాపను చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది గదూ? ఎంత ఆశ్చర్యమంటే అంత ఆశ్చర్యం! కానీ మనం మనలను చూచి, కనీసం పక్క మనిషిని చూచి ఎప్పుడయినా ఆశ్చర్య పడ్డామా? లేదు కదూ? ఎందుకని ఆలోచించగలరా? ప్రతి మనిషి ఒకప్పుడు పసిబిడ్డే గదా? పసిబిడ్డ ఆశ్యర్యమయితే పెరిగిన మనిషి ఎందుకు వింతగా కనిపించడం లేదు? ఒకటే కారణం. మనకు కొన్ని సంగతులు అలవాటయి పోతాయి. వాటిని గురింటి ఆలోచన అవసరం లేదనుకుంటాము. మనుషులను చూడడం అలవాటయి పోయింది. మనిషిలో వింత లేదనిపిస్తుంది.

ఇలాటివి ఇంకా ఎన్నో సంగతులు ఉంటాయి. ఒక వస్తువును కింద పడేస్తాము. కంచం పడిందనుకుందాము. అది కింద పడుతుంది. ఎందుకనో ఆలోచించామా ఎప్పుడయినా? కంచం గాలిలోనే ఎందుకు నిలవలేదు? పైకి ఎందుకు ఎగిరిపోలేదు? అట్లాగ జరిగి ఉండవచ్చు గదా? ఎందుకని కంచం కింద పడింది? భూమికి ఆకర్షణ ఉందని ఎవరో అనగా విన్నట్టున్నాము కదూ? ఏమిటా ఆకర్షణ? కంచం నుంచి నేలకు తాళ్లేవీ లేవుగదా?సంబంధం లేని వస్తువులను భూమి ఎట్లా తన వేపు లాక్కుంటుంది? ఈ రకం ప్రశ్న ప్రతిసారీ అడగము మనం. ఎందుకంటే వస్తువులు కింద పడడం మనకి అలవాటయి పోయింది గనుక. అందులో ఆశ్చర్యం మనకు కనిపించదు. ప్రశ్నలు అడగడం చేతనయితే ఎన్ని అడిగినా అంతుండదు. మా ఇంట్లో ఒక మాట మళ్లా మళ్లా వినబడుతుంటుంది. ఆశ్చర్య పడ దలుచుకుంటే ఈ ప్రపంచంలో ఎన్నయినా విషయాలున్నాయని!

ప్రతి మామూలు విషయంలోనూ ప్రశ్నలు దాగి ఉన్నాయి. అడగడం చేతగావాలి. అంతే. పిల్లలకు ప్రశ్నలడగడం లో అనుమానాలుండవు. ఉండగూడదు కూడా. అనుమానం రావడమే గొప్ప. దాన్ని గురించి తరచి అడగకుండా సమాధానం ఎందుకు ఎక్కడినుంచి వస్తుంది. ప్రశ్నకు జవాబు అందితే అందులోనుంచి మరెన్నో ప్రశ్నలు పుట్టుకు వస్తాయి. ఎందుకు అన్న ప్రశ్నకు జవాబు కష్టమని మరో అనుభవం.

మనమంతా ఒకప్పుడు పిల్లలమే అన్న సంగతి మరిచి అంతా తెలుసన్న భావంతో, ప్రశ్నలడగడం మరిచి పోయాము గదూ?
మనలో ఇంకా ఆ పసిబిడ్డ ఉండి ప్రశ్నలడగ గలగాలి. మనం అలవాటయిపోయిన ప్రపంచంలోనుంచి తప్పించుకుని కొంచెం సేపు పిల్లలుగా బతకగలగాలి. సముద్రంలో చేప సముద్రాన్ని గమనించలేకపోయింది. మనం కనీసం మన ప్రపంచాన్ని గమనించ గలగాలి.
ఆలోచించగలగాలి!!

Friday, November 18, 2011

ఆహార వ్యవస్థలో మార్పులు


ప్రపంచ జనాభా ఏడువందల కోట్లకు చేరింది. అందులో వందకోట్ల మందికి తిండి కరువయిందంటున్నారు. నిజానికి ప్రపంచంలో పండుతున్న పంటమాత్రం అందరికీ సరిపడేటంతగానూ ఉంటున్నది. పంపిణీ అంతటా ఒకే రకంగా కుదరడం లేదు. ధరలు పెరుగుతుండడంతో చాలామంది తమకు కావలసిన ఆహారాన్ని కొనలేకపోతున్నారు.

జనాభా పెరగుతూనే పోతుంది. 2050 నాటికి మరో రెండు మూడు బిలియనుల మందికి తిండిపెట్టవలసిన పరిస్థితి వస్తుంది. అంటే ఆహారం అవసరం రెండింతలవుతుంది. రానురాను చాలామందికి ఆదాయాలు పెరుగుతాయి. కనుక ఆహారం అవసరాలు కూడా మారతాయి. మరోవేపు ‘జీవ ఇంధనాల’ పేరున పొలాలను మరిన్ని అవసరాలకు వాడుకుంటామని అంటున్నారు. అంటే మొత్తానికి వ్యవసాయం, ఫలసాయాల గురించి, మరింతగా ఆలోచించవలసిన పరిస్థితి మనముందు ఉంది.

వ్యవసాయం పేరున అడవులు నాశనమవుతున్నాయి. వీలున్న ప్రతిచోటా పంటలు వేస్తున్నారు. ఈ రకంగా వ్యవసాయం, పర్యావరణానికి హాని కలిగిస్తున్నది. అందుబాటులో ఉండే భూమి ఎక్కువ శాతం వ్యవసాయానికే వాడుకవుతున్నది. నీరు కూడా వ్యవసాయానికే ఎక్కువ కావాలి. వ్యవసాయం కారణంగా, ఆహార పరిశ్రమ కారణంగా కాలుష్యం కలుగుతున్నదంటే ఆశ్చర్యం కాదు. మొత్తానికి వ్యవసాయం పెరగాలి. దానివల్ల కలిగే చెడు ప్రభావాలు మాత్రం పెరగకూడదు.

ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న ఏడువందల కోట్ల మందికి ఆహారం అందాలి. వచ్చే నలభయి సంవత్సరాలలో ఆహారం ఉత్పత్తి రెండింతలు కావాలి. ఈ రెండు పనులు జరగుతున్నా సరే కాలుష్యం మాత్రం పెరగకూడదు. ప్రపంచ ఆహార వ్యవస్థ, ఈ మూడు అవసరాలను ఒకటి చేస్తూ ముందుకు సాగాలి. ఇది కుదిరే పనేనా అన్న ప్రశ్నకు జవాబు చెప్పడానికి జూనాతన్ ఎ ఫోలీ నాయకత్వంలో ఒక నిపుణుల బృందం ప్రయత్నించింది. నీటి ఉపయోగం, కాలుష్యాలను జాగ్రత్తగా గమనిస్తూ గ్రీన్ హౌస్ వాయువులను నియంత్రణలో ఉంచుతూ, జంతు, వృక్షజాతులకు హాని కలుగకుండా, పంటను రెండింతలు చేయడానికి ఈ పద్ధతులు వీలు కలిగిస్తాయని వారు సలహా యిస్తున్నారు.
స్థూలంగా ఈ సూచనలను పాటిస్తే ఫల సాయాన్ని పెంచడం వీలవుతుంది. పండిన పంటను అందరికీ అందేరకంగా పంపిణీకి వీరి పథకంలో గట్టి సలహాలున్నాయి. వాతావరణ కాలుష్యం జరగకుండా చూడడం మీద మరింత కేంద్రీకరించినట్లు కనబడుతుంది.

శ వ్యవసాయ భూముల విస్తీర్ణం పెంచే పద్ధతి మానుకోవాలి: అడవులు, గడ్డి మైదానాలను పంటపొలాలుగా మార్చడం మంచి పద్ధతి కాదు. అడవులకు కార్బన్ సైకిల్లో పెద్ద పాత్ర ఉంది. వాతావరణం వేడెక్కడం, అందరూ పట్టించుకోవలసిన సమస్య.

శ ఫలసాయం పెరగాలి: తిండి అవసరం రెండింతలవుతుంది. అయినా పంట పొలాల వైశాల్యం మాత్రం పెరగకూడదు. అంటే ఉన్న పొలాలలో నుంచే రెండింతల దిగుబడి తీయాలి. పంటలో జన్యుపరంగా, నిర్వహణ పరంగా మార్పులు తీసుకు రాగలిగితే ఇది వీలవుతుంది. ఇక్కడ బాగా పండే పొలాలలో దిగుబడి పెంచడం ఒక పద్ధతి. తక్కువ పంటనిచ్చే పొలాల నుంచి ఎక్కువ దిగుబడి తీయడం మరొక పద్ధతి. ఈ రెండవ పద్ధతి బీద దేశాలకు వరం లాంటిది.

శ వనరులను మరింత బాగా వాడుకోవాలి: దిగుబడి ప్రస్తుతం ఎలాగున్నా దాన్ని పెంచాలి. కానీ ఆ ప్రయత్నంలో నీరు, ఎరువులు, ఇంధనశక్తి లాంటి వనరులను ఇష్టం వచ్చినట్టు వాడితే సమస్య మరింత పెరుగుతుంది. ఒక కాలరీ పండును పెంచడానికి ఒక లీటరు నీరు అవసరమంటే ఆశ్చర్యం కదూ? ఈ నిపుణుల సంఘం వారు ఈ పరిస్థితిని మార్చాలంటున్నారు. చుక్కనీరు (డ్రిప్ ఇరిగేషన్), మార్చింగ్, నీరు వ్యర్థం కాకుండా చూడడం లాంటి పద్ధతులను మరింత వాడాలంటున్నారు.
ఎరువుల విషయంలో పరిస్థితి మరింత అన్యాయంగా ఉంది. ఎవరూ ఎరువులను ‘సరయిన’ పద్ధతిలో, మోతాదుల్లో వాడడం లేదు. చైనాలో మన దేశంలోని ఉత్తర ప్రాంతాలలో మధ్య యు.ఎస్., యూరపు పడమటి ప్రాంతాలలో రసాయన ఎరువుల వాడకం, అవసరానికి ఎన్నోరెట్లు ఎక్కువగా జరుగుతున్నట్లు ఈ బృందం వారు చెపుతున్నారు. దున్నడం, ఎరువు అవసరమయిన చోట మాత్రమే వేయడం ఆర్గానికి వ్యవసాయం లాంటి పద్ధతులు వాడాలంటున్నారు.

శ తిండి పద్ధతులు మారాలి: పంటలను, పశువులకు, జంతువులకు మేతగా పెట్టి వాటిని బలిపించి ఆ తర్వాత తినడం ప్రస్తుతం ఎక్కువ జరుగుతున్నది. అందుకు బదులు మనుషుల ఎక్కువగా పంటలను తామే తినడం మంచి పద్ధతి అని ఈ సంఘం సూచించింది. శాకాహారం ఎక్కువగా తింటే పరిస్థితి మారుతుందట.
శ పండిన ఆహారం వ్యర్థం కాకుండా జాగ్రత్త పడాలి: ప్రపంచంలో పండిన పంటలో మూడవ వంతు వ్యర్థంగా పోతున్నదట. ఇందులో ఎలుకుల వంటి జీవుల పాత్ర కూడా ఉంది. ధనిక దేశాల్లో వండిన తిండి వ్యర్థమవుతుంది. ఉంది గనుక, తిండి తిని బొజ్జలు పెంచుకుంటున్నారు కొందరు. బీద దేశాలలో పంట, ఉత్పత్తి దగ్గరే నాశనమవుతుంది. మొత్తంమీద ఆహార పదార్థాలను చేతయినంత వరకు వ్యర్థం కాకుండా చూడగలిగితే అందరికీ మంచిది.

అందరూ అన్ని పంటలూ పండించకూడదనీ, అనుకూలమయిన పంటలను, వనరుల ఆధారంగా పండించి, అందరి అవసరాలు తీరేతీరుగా ఇచ్చి పుచ్చుకోవడం మంచిదనీ సూచనలు వచ్చాయి. తొమ్మిది వందల కోట్ల మందికి ఆహారం అందించాలి. మానవజాతి ఇంతకు ముందెన్నడూ ఇంతటి సమస్యను ఎదురుకున్నది లేదు!

రాతి కెరటాలు - సమీక్ష


బతుకు పరిశీలన!

-గోపాలం కె.బి.
(ఆంద్రభూమి దినపత్రిక నుంచి)

స్కూలు మొత్తంలో/వారికిష్టమైంది గంటే/ ప్రేయర్ గంట కాదు/ఇంటికెళ్ళే ప్రేమ గంట, అంటాడు కవి గోపి. ‘అది అమ్మపిలుపులా’ కమ్మగా ఉంటుంది. అన్నప్పుడు గోపి, వాళ్లది కాక తన బాల్యం గురించి చెపుతున్నాడనిపిస్తుంది.

కవిగా ఎన్. గోపి ప్రస్థానం ‘తంగెడు పూల’తో 1976లో మొదలయింది. పరిశోధన విమర్శ, అధ్యాపకం, పెద్ద ఉద్యోగాలు, పేపర్ కాలం, నిర్వహణ లాంటి పనులన్నింటినీ ఒక చేత్తో చేస్తూ, గోపి మరొక చేత్తో బలంగా కవితా వ్యవసాయం సాగించాడు. కనుకనే ఇప్పటికి 16 సంకలనాలు వచ్చాయి. ఇది 17వది. మధ్యలో ‘నానీ’లు ప్రత్యేకంగా వచ్చాయి. ఎన్ని వచ్చినా నేటికీ గోపి కవితలో ‘కవిత్వం’, బిగువు తగ్గలేదు. వాక్యాల నడుం విరిస్తే వచన కవిత అన్న వ్యాఖ్య గోపీ విషయంలో వర్తించదు. అతని కవిత్వంలో ‘నీటి తల్లికి ఇన్ని సమాధులా?’ అన్నా, ‘ఆకలిదెంత చైతన్యమో?’ అన్నా ప్రకృతి పరిశీలన, బతుకు పరిశీలనలతో నిండిన కవిత పలుకుతుంది.

చిత్రదీపాలు వెలిగించిన గోపి, చుట్టకుదురులో కుదురుకుంటూనే జలగీతాలు పాడాడు. మా ఊరు మహాకావ్యం అంటూ ఈ కవి తన పల్లెతనాన్ని, పట్టు తప్పకుండా ప్రదర్శించాడు. రాతిలో కూడా కెరటాలు చూడాలనుకున్నాడు. ఈ సంకలనంలో మొత్తం 44 కవితలున్నాయి. అన్నీ గొప్పవి అని బహుశా గోపీ కూడా అనుకోడు. 2010, 2011లలో రాసిన ఈ కవితలను పుస్తకంలో కలగలిపి ముద్రించారు. కాలక్రమం ప్రకారం వేస్తే కవిత్వతత్వం, కవితత్వం మరింత బాగా ఆవిష్కృతమయ్యేవేమో?


‘ఏక్‌తార’ అన్న కవితలో ‘ఎన్నాళ్ళ నుంచో వెతుకుతున్న స్క్రూడ్రైవర్ దొరికింది. అతుక్కుపోయిన తలుపులను తెరిచి నాలోకి వెళ్ళాలి - అంటాడు.
‘ప్రక్రియ’లో పెన్నుది బంగారు పత్తి అయితే, అక్షరాలు బంగారమవుతాయా? అని ప్రశ్నించి, అయినా కవిత్వం గాలిలా వ్యాపిస్తుంది’ అంటాడు. ఆ కలం గురించే మరో చోట ‘కలం జేబులో బందీ అయిపోయింది’ అంటాడు ఈ సంకలనంలో మగ్న, పాదచిహ్నాలు, లాంటి మరెన్నో ‘మంచి’ కవితలున్నాయి. సహజంగానే కవి గోపి, ప్రపంచంలోని సంఘటనలకు తన ప్రపంచలోనికి సంఘటనలకు స్పందించి కవితలు రాశాడు. కాళహస్తి గోపురానికొక కవిత, కవి గుడిహాళం స్మృతికి ఒక కవిత.

ఓల్గా గారికి 60 ఏళ్ళు నిండితే కవిత పుట్టింది. గోపికి కూడా అరవయి నిండినయి. అందుకేనేమో కొంచెం బతుకు తత్వం గురించిన ఆలోచన ఎక్కువయింది. రోజులు మారిపోతున్నాయి అంటాడు. ఇల్లు పంచుకుంటే స్పందిస్తాడు. అమెరికా నచ్చలేదు. తరాల అంతరం కూడా కదిపింది. దీన్ని లామెంటింగ్ అంటారేమో?

గుత్తెదార్లు, నీళ్ళ సీస, పెన్ను పత్తి లాంటి ప్రయోగాలు చేసి గోపి తన మట్టివాసనను చెప్పక చెప్పుకున్నాడు. పెన్ను ‘నిబ్’ను పత్తి అనేవాళ్ళమన్న సంగతి గుర్తుకు వచ్చి ఒళ్ళు పులకించింది.

గోపిలో ఒక మెత్తని మిత్రుడున్నాడన్న సంగతి అతని పుస్తకాన్ని శేషాద్రిగారికి అంకితమివ్వడంలో కనబడుతుంది. అలాగే చాలా కవితల్లో గోపి మనలను కొన్ని పనులు చేయవద్దని హెచ్చరిస్తాడు. అతనికి డిస్టర్బెన్స్ ఇష్టం లేదులాగుంది!

ఈ సంకలనం పేరు ‘రాతి కెరటాలు’. ఆ పేరున మొదటి కవిత ఉంది. ఆ శీర్షికకూ సంకలనంలోని మిగతా 43 కవితలకూ సంబంధం ఉందా? ఏమో?

డా. ఎన్. గోపి ‘పత్తి’ నుంచి ఇకముందు మరిన్ని మంచి కవితలు, రచనలు తప్పక వస్తాయన్న నమ్మకం ఉంది.

రాతికెరటాలు
డా. ఎన్. గోపి (కవితా సంకలనం)
పేజీలు: 80, వెల: రూ. 60/-
ప్రతులకు: అభవ్ ప్రచుఠణలు
13/1/5బి, శ్రీనివాసపురం
రామంతాపూర్, హైదరాబాద్-13

Sunday, November 13, 2011

కాలం సమస్య


కాలం సమస్య!

చూస్తుండగానే మరో వారం వచ్చేస్తుంది. కాలం పరుగెడుతుంది. అదే కాలం నత్తనడకలు నడుస్తుంది. కాలాన్ని కొలత వేస్తాం. వృథా చేస్తాం. ఇంకొంచెం ఉంటే బాగుండును అనుకుంటాం. ఇంతకూ కాలం అంటే ఏమిటి? ఈ ప్రశ్నకు జవాబు కొరకు వేల సంవత్సరాలుగా పరిశోధనలు, ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి. ఫలితాలే అనుమానం.

‘కాలాన్ని గుర్తించవచ్చు. కానీ అర్థం చేసుకోవడమే కుదరదు!’ అంటారు తత్వవేత్త జూలియన్ బార్బర్. ‘కాలం ఇంత కాలమయినా అర్థం కాకపోవడం ఆశ్చర్యం’ అంటారామె. కాలం గురించి అర్థం కాకున్నా, శాస్త్ర విజ్ఞానం ముందుకు సాగుతూనే ఉంది. అందుకే కాలంమీద అంత ధ్యాస అవసరం రాలేదేమో? ఫిజిక్సులో న్యూటన్ గతి సిద్ధాంతాలు, ఐన్‌స్టైన్ సాపేక్ష సిద్ధాంతం, చివరకు అణునిర్మాణానికి సంబంధించిన క్వాంటం సిద్ధాంతాలు, కాలం గురించిన అవగాహన అవసరం లేకుండానే పని చేస్తున్నాయి. గడియారాలు రకరకాలుగా వచ్చాయి. కానీ వాటిని తయారుచేసే వారికి ‘కాలం’ అసలు స్వరూపం అర్థం కానవసరం లేదు.

కాలం ఎప్పుడూ ముందుకే నడుస్తుంది. ఇది అవగాహన, అనుభవాల మీద అర్థమయిన సంగతి! అందరికీ వయసు పెరుగుతున్నది. తరగడం లేదు. అందుకే గడియారాలు ముందుకే నడుస్తాయి. కనీసం వాటిని అలా తయారు చేస్తారు. అది ఎండ గడియారం గానీ, చక్రాల గడియారం గానీ, అణు గడియారం గానీ. అందులో కాలం తెలియడానికి ‘కదలిక’ అవసరం. కదలిక అంటే మార్పునకు మరో రూపం. అంటే కాలానికి, మార్పునకూ సంబంధం ఉందని అర్థం! అంతే అక్కడికంటే, అవగాహన, ముందుకు కదలదు.

కాలం గురించి రెండురకాల వివరణలున్నాయి. అది విశ్వానికి గల మౌలిక లక్షణం అంటుంది మొదటి వివరణ. స్థలం, పదార్థం ఉన్నట్లే, కాలం కూడా దానంతటది ఉంది. అందులో సంఘటనలు జరుగుతున్నాయి. న్యూటన్ చెప్పిన ఈ వివరణ ప్రకారం ఈ కాలం కూడా ఒక పదార్థం. అట్లా అనకుంటే, దాన్ని కొలతవేయడం కుదరదు. ఐన్‌స్టైన్ వచ్చి కాలం అందరికీ, అన్ని పరిస్థితుల్లో ఒకేలాగ కదలదు అని ఒక కొత్త ఆలోచనను ఇచ్చాడు. కాలం ఒక భ్రమ అన్నాడాయన. ‘స్థలకాలాల సంబంధం కొంచెం వీలును కలిగిస్తుందని అందరూ అన్నారు.
ఇక రెండవ వివరణ మళ్ళీ ఫిలాసాఫికల్‌గా సాగుతుంది. మార్పు ఈ విశ్వానికి సహజ లక్షణం. ఈ మార్పుల కారణంగా మన మనసులలో కాలం అనే భావన కలుగుతుంది అని లైబ్నిజ్ లాంటి వారి వాదం. అంటే అది మనసు, మెదళ్ళల్లో పుడుతుందని అర్థం! అంటే మరి కాలం వాస్తవమా? ఒకవేళ నిజమయితే ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడ అంతమవుతుంది? ఇదంతా చూస్తుంటే మనకేమీ తెలియదని మాత్రం గట్టిగా తెలుస్తుంది.

Friday, November 11, 2011

కూల్ డ్రింక్స్ తాగడం లాభకరమా


మంచినీటి కంటే, కార్బొనేటెడ్ కూల్ డ్రింక్స్ తాగడం లాభకరమా?

ప్రశ్న - జవాబు

మన శరీరానికి నీరు కావాలి. నోటి నుంచి అటు చివరిదాకా ఉండే గొట్టంలో తాగిన నీరంతా పీల్చబడి శరీరానికి అందుతుంది. శరీరానికి కావలసింది నీరయితే దానితోబాటు, మరేవో కలిపి తాగడంవల్ల లాభం లేదు. పైగా నష్టమే ఉంది. కూల్‌డ్రింక్స్ వల్ల దప్పి సులభంగా తీరుతుందన్నది కేవలం ఒక తప్పుడు భావన. గ్యాసు కలిసిన నీరు తాగితే తేన్పులు వస్తాయి. వాటితో లాభం ఉండదనడానికి లేదు. తాగింది ఏ నీరయినా శరీరానికి అందుతుంది. లేదంటే అటు చివర నుంచి బయటకు వస్తుంది. తాగిన నీరు మూత్రం ద్వారా బయటకు రావడం సహజం. చెమట ద్వారా వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి.

కూల్ డ్రింక్‌లో చక్కెర ఉంటుంది. తాగిన నీటిలో కొంత ఆ చక్కెరను కరిగించడంతో పోతుంది. రుచి బాగుంటుంది గనుక కూల్ డ్రింక్‌ను, మామూలు నీటికన్నా ఎక్కువగా తాగుతారు. కనుక దప్పి తీరిన భావం కలుగుతుంది. నీటి చల్లదనం విషయం కూడా కొందరి విషయంలో అంతే. శరీరానికి కావలసిన నీరు, శరీర ఉష్ణోగ్రతకు మారిన తర్వాతే పీల్చబడి లోపలికి చేరుతుంది.

===========
సాధారణంగా చెట్ల బెరడు మొరటుగా ఉంటుంది. జామ లాంటి చెట్ల బెరడు నునుపుగా ఉంటుంది. ఎందుకు?

చెట్లకు బెరడు ఒక రక్షణ కవచం లాంటిది. జంతువులు, పురుగులు, పరాన్నజీవులయిన మొక్కల నుంచి అది రక్షణనిస్తుంది. నునుపుగా ఉండే బెరడుమీద పురుగులు, బూజులకు పట్టు దొరకదు. కానీ నునుపు బెరడు నెమ్మదిగా పెరుగుతుంది. అటువంటి చెట్టుకు గాటు పెడితే అది తొందరగా మానదు. ఈ రకం చెట్ల మొత్తం పెరుగుదల కూడా తక్కువ వేగంతో సాగుతుంది.

తుమ్మ, వేపలాంటి చెట్ల బెరడు జామకంటే నాలుగింతల ఎక్కువ వేగంతో పెరుగుతుంది. అంటే వాటి గాట్లు కూడా త్వరగా పూడుకుపోతాయి. మొరటు బెరడుంటే చెట్లలో తేమ చాలాకాలం నిలుస్తుంది. అందుకే వాటికి ఎవరూ ప్రయత్నంగా నీరు పెట్టనవసరం లేదు. అయితే పెరుగుదల వేగం కారణంగా, వీటి బెరడు పెచ్చులుగా లేస్తుంది. ఆ సందుల్లో పురుగులు చేరుకుంటాయి. అందుకే వేప, తుమ్మ చెట్లలో జిగురు పుడుతుంది. దాని వాసన, తీరు వల్ల పురుగులు దూరంగా పోతాయి.

మరీ తేమ ప్రాంతంలో ఉండే చెట్ల బెరడు మెత్తగా ఉంటుంది. త్వరత్వరగా మారి పురుగులను చేరనివ్వదు.

Wednesday, November 9, 2011

కొండ - కవిత

ఇది ొక అజ్ఞాత కవి రచనకు నా అనువాదం మాత్రమే





నీ చేతిలో 

నీవు కవివయితే, నన్ను అవుననిపించు.
కవిత చూపించు, అంటావు నీవు.
మరి నేను నీ చేతిలోకి ఒక రాతి గులకను పడేస్తాను
చిన్నగా
గుండ్రంగా
మామూలుగా, గులకరాయి

నేను మురిసి పోవాలా?
ఇదేం కవిత, ఇదేం ప్రాస?
గద్దించి అడుగుతావు నీవు
నాకు నీ మనసు తెలుసు, కానీ,

నీ చేతిలో ఒక కొండ ఉంది
దాని శిఖరం ఒకప్పుడు ఆకాశాన్ని తాకి ఉండవచ్చు
కానీ, కాలం, కన్నీళ్లూ దాన్నిప్పుడు కరిగించేశాయి
అదిప్పుడు కొండ కాదు మరి!

నీ చేతిలో గతమంతా ఉంది
అది కరిగి అరిగి గులకయింది
కొండ గుండుగా,
గుండు గులకగా మారింది.
ముందు ముందది ఇసుక రేణువవుతుంది.

నీ చేతిలో ఒక నక్షత్రశకలం ఉంది
మహావిశ్వం లోని ఒక అంశం ఉంది.
ఆ రేణువు ఏ బీచిలోనో కలిస్తే
నక్షత్రాలకన్నా ఎక్కువయిన సంఖ్యలో ఒకటవుతుంది

నీ చేతిలో ఒక మూలకం ఉంది
అది నీటిలో మునుగుతుంది.
కానీ ఒడుపుగా వేస్తే మాత్రం ఎగురుతూ నాట్యాలాడుతుంది
నీటి మీద ఎగురుతూ నిక్షేపమవుతుంది!

బహుశః నీ చేతిలోని రాతితోనే
గోలియాత్ ప్రాణాలు పోయి ఉంటాయి.
అది, రాక్షసుడిని కూడా లొంగదీసిన
డేవిడ్ నమ్మకానికి గుర్తు!

నీ చేతిలో ఉన్నది
ప్రశ్న ఒకటే కాదు, జవాబు కూడా!
కవిత ప్రాస అందులోనే ఉన్నాయి
వాటిని కల్పించింది నాకన్నా మాటకారి మరెవరో!

Tuesday, November 8, 2011

రసాయనశాస్త్ర సంవత్సరం - వ్యాసం


రసాయన శాస్త్ర సంవత్సరం

మ్మాయి కడుపుతో ఉంది. పండులాంటి బిడ్డను కనాలని కలలుకంటూ ప్రతినిత్యం ఉదయం నిద్ర లేవగానే వాకింగ్‌కు వెడుతుంది. దారిలో పచ్చికూరల రసాలు, నానబెట్టిన గింజలు లాంటివి తెచ్చుకుంటుంది. స్నానం చేసి వాటిని తింటుంది. ఫ్రిజ్‌లో నుంచి పళ్ళరసం తెచ్చుకుని తాగుతుంది. ఇదంతా చూస్తుంటే ఆమె ఆరోగ్యం గల బిడ్డను కనడం, అంత అనుమానం కలిగించే సంగతి కాదు అనిపిస్తుటంది కదూ! కానీ విషయం మరింత అర్థమయిన కొద్దీ, అసలు ఈ ప్రపంచంలో ఏ పని మంచిది? ఏది చెడ్డది? అన్న ప్రశ్నలకు జవాబు భయంకరంగా ఉంటుంది!

పరిశ్రమలకు దగ్గరలో ఉండే వాతావరణంలో రకరకాల రసాయనాలు ఉన్నాయట. అవి తల్లి, బిడ్డల ఆరోగ్యాలకు హాని కలిగిస్తాయిట. ఇక ప్లాస్టిక్‌లలో హార్మోనుల వంటి రసాయనాలు ఉండి, పుట్టబోయే బిడ్డపై ప్రభావం చూపిస్తాయట. చిన్న పిల్లలకు పాలసీసా, వాటర్ బాటిల్స్ కూడా ప్లాస్టిక్‌వి వాడకూదంటున్నారు. సబ్బు, సెంటు, షాంపూలతో మనకు హాని కలిగించే రకం రసాయనాలు తక్కువ మోతాదులో నయినా, చాలా ఉన్నాయంటున్నారు. రసాయన శాస్త్రం మనలను భయపెడుతున్నది.

2011 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి వారు ‘అంతర్జాతీయ రసాయన శాస్త్ర సంవత్సరం’గా ప్రకటించారు. ఆ రంగం గురించి సదస్సులు, సామావేశాలు జరుపుతున్నారు. వాళ్ళకు చాలా సంగతులు తెలుసు గనుక, మాట్లాడుకుంటారు. మనలాంటి వారికి ఈ ఏడు ఏం మిగిల్చి పోతుందన్నది ప్రశ్న? ఏమి మిగిల్చినా లేకున్నా కొన్ని ప్రశ్నలు మాత్రం తప్పకుండా మిగులుతాయి.

జీవం ఎలా మొదలయింది?: అందరికీ తెలిసిన కార్బన్, ఆక్సిజెన్, హైడ్రోజెన్, నైట్రోజెన్ లాంటి రసాయనాలతోనే జీవం మొదలయింది. నాలుగు బిలియన్ సంవత్సరాల క్రితం ఈ జీవం పుట్టిన తీరు మాత్రం ఇంకా వీడని ముడిగానే మిగిలి ఉంది. రసాయనాల కలయిక కారణంగా పుట్టిన జీవం శక్తిని వాడుకుంటుంది. తనకు ప్రతిరూపాలను సిద్ధం చేస్తుంది. ఇవన్నీ మనకు అలవాటుగా కనబడుతున్నాయి గనుక సరిపోయింది గానీ, ఆశ్చర్య పడదలచుకుంటే జీవం కన్నా ఆశ్చర్యం మరొకటి లేదు.

అణువులు, పరమాణువులు: రసాయన శాస్త్రం మొత్తంగా అర్థమయిందంటున్నారు. కొత్త మూలకాలను పుట్టిస్తున్నారు. కానీ, రకరకాల రసాయన పరిమాణువుల మధ్యన బంధనాలు ఏర్పడి, రకరకాల రసాయనాలు, అణువులుగా మారడం మాత్రం ఇంకా ఒక మిస్టరీగానే మిగిలింది. కార్బన్ తీగలన్నారు. గ్రాఫీన్ పేరుతో కార్బన్ మరో మెట్టుపైకి ఎక్కింది. వీటిని వాడి వింతలు చేసి చూపవచ్చునంటున్నారు. మాట బాగుంది. కానీ ఫలితాలే అంత బాగా రావడం లేదు!

కార్బన్‌తో కంప్యూటర్ నిర్మాణం: గ్రాఫీన్‌ను కనుగొన్నందుకు 2010 నోబేల్ బహుమతిని ఇచ్చేశారు. కానీ, నిజానికి ప్రగతి మొత్తం రసాయన శాస్తవ్రేత్తల చేతుల్లోనే ఉందింకా. కార్బన్‌ను వాడి రకరకాల నిర్మాణాలను స్థిరంగా ఉండేలా తయారు చేయగలగడం ప్రస్తుత సమస్య. నానోట్యూబులతో వీలుగాని నిర్మాణాలు, గ్రాఫీన్‌తో వీలవుతాయని నమ్మకంగా చెపుతున్నారు కార్బన్ కంప్యూటర్ అనే కల నిజం కావడానికి చాలా కాలం పడుతుంది.
శసౌరశక్తి వాడకం: ఎండను వాడుకోలేక పోతున్నామని ప్రతి ఉదయం అందరికీ ఒక హెచ్చరిక అందుతున్నది. పత్ర హరితంలాగ, ఎండ నుంచి శక్తిని గ్రహించే పద్ధతి గురించి ఆలోచనలు సాగుతున్నాయి. అందుకు మళ్లీ అందరూ రసాయన శాస్త్రాన్ని ఆశ్రయించవలసి ఉంది. ఆకులో మాంగనీసు, కాల్షియం కలిసి, నీటిని విడగొడుతున్నాయి. అది ఎలా జరుగుతుందన్నది మాత్రం అర్థం కాలేదు. ఈ విషయంగా జరుగుతున్న ప్రయత్నాలు ఫలిస్తే ప్రపంచం తీరు మారుతుంది. అక్కడా రసాయనాలే కీలకంగా సమస్యలవుతున్నాయి.

ఇంధనాలు, వాడకం తయారీ: యాంత్రిక జీవనానికి అలవాటుపడిన బతుకులు సుఖంగా ముందుకు సాగాలంటే రసాయన ఇంధనాలే ఆధారం సహజంగా ఉండే శక్తి రూపాలతో పని జరిగే కాలం పోయింది. సూర్యుని నుంచి మనం నేరుగా శక్తిని పిండుకునే ప్రయత్నాలు ఫలించేలోగా, మరో పద్ధతిని వాడాలి. చెట్లు ఆ పని చేస్తున్నాయి గనుకనే జీవం కొనసాగుతున్నది. తిండి కొరకు మాత్రమే గాకుండా, ఇంధనంగా కూడా మొక్కల నుంచి శక్తిని సేకరించి వాడుకోవాలి! పంటను మొత్తంగా వాడగలిగిన నాడు, అంటే మొక్కలోని అన్ని భాగాలనూ, అందులోని శక్తినీ వాడిన నాడు పరిస్థితి మారుతుంది.

ఔషధాలు, ఆరోగ్యం: తిండి, ఇంధనం ఉంటే సరిపోదు. మనిషి ఆరోగ్యంగా కూడా ఉండాలి. అక్కడ కూడా, రకరకాల రసాయనాలతోనే పని నడుస్తుంది. వందలు, వేలరకాల రసాయనాలను తయారుచేసి, వాటి ఉపయోగాలను పరిశీలించాలన్న ఆలోచన వచ్చింది. ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరిన్ని ఎక్కువ రసాయనాలను తయారు చేయాలి. తక్కువ మోతాదులో ఉన్నా, వాటిని సేకరించి పరీక్షించగలగాలి. రసాయనాల నిర్మాణంలో ప్రకృతి నుంచి పాఠాలు నేర్చుకోవాలి.

మన శరీరంలో రసాయనాలు: రసాయనాలను తయారు చేస్తే చాలదు. వాటితో సమాచార ప్రసార పద్ధతిలో, సంపర్కం ఉండాలి. వాటిని మనం ‘పని చేయించ’గలగాలి. రసాయన సెన్సర్లు, బయోమెడిసిన్ లాంటి కొత్త మాటలు వినబడుతున్నాయి.

మనం, మన పరిసరాలు, అంటే రకరకాల రసాయనాలు, వాటి పనితీరులో భౌతికి శాస్త్రం ఉంటుంది మనమే రసాయనాలు! మన బతుకు, ప్రపంచం అంతా రసాయనాలు. ఇక రసాయనాలను గురించి ఆలోంచకుండా ఉండగలమా? శాస్త్ర విజ్ఞానం గానీ, మరొకటి గానీ, రసాయనాల కారణంగానే సాగుతున్నది, సాగుతుంది కూడా!

(ఆంధ్రభూమి దినపత్రిక నుంచి నా రచన)
#$#$#$#$

Monday, November 7, 2011

పుస్తకాల సేకరణ

నాకు పుస్తకాలంటే, సంగీతమన్నానూ ఎంతో ఇష్టం.
బతుకంతా వాటితోనే సాగింది. సాగుతున్నది.
కానీ చాలా మందికి చదవడం కష్టంగా ఉంటుందని నాకు తెలుసు.
ఎవరి దారి వారిది.

కానీ నాదొక మనవి.
మీ ఇంట్లో పుస్తకాలు ఉన్నాయనుకోండి.
వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదనుకోండి.
అప్పుడు వాటి వల్ల నష్టమే గాని లాభం ఉండదు.

పుస్తకాల కొరకు ఏమయినా చేసే వారు కొందరు.
వాటిని వదిలించుకోవడానికి ప్రయత్నించే వారు మరి కొందరు.
నేను మాత్రం ఇండ్లలో ఉన్న పాత వుస్తకాలు సేకరించాలన్న ప్రయత్నంలో ఉన్నాను.
మీ వద్దగానీ మీకు తెలిసిన వారి వద్దగానీ రనికి రావనిపించిన పుస్తకాలు ఉంటే వివరాలు నాకు పంపండి.
వాటిని నేను తీసుకునే ప్రయత్నం చేస్తాను.
పుస్తకాలు తెలుగు, ఇంగ్లీషు. హిందీ, ఉరుదూ, సంస్కృతాలలో ఏవయినా సరే వివరాలు పంపండి.

పుస్తకాలను పాడు గాకుండా చూచి నిజంగా అవసరమనుకున్న వారికి అందించే పని నేను చేస్తాను.

ఈ కార్యక్రమం త్వరలోనే ఒక ఉద్యమంగా మారనున్నదని మనవి

భవదీయుడు

గోపాలం కె బి.