Monday, November 21, 2011

‘అన్నా’యం వెనుక సైన్సు!


అవి ఆటోలకు డిజిటల్ మీటర్లు రాని రోజులు. నూటికి తొంభై తొమ్మిది ఆటోలలో మీటరును ఎక్కువ తిరగేట్టు మార్చేవారు! ‘ఎందుకయ్యా? ఇది అన్యాయం కాదా?’ అన్నాను-అమాయకంగా! ‘సర్! పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ తక్కువ పోసేరకంగా మారుస్తున్నారు!’ అన్నాడు ఆటోవాలా. అంతటితో ఆగక ‘నీవు మాత్రం ఎక్కడా అన్యాయం చేయనట్టు మాట్లాడుతున్నావు!’-అన్నాడతను!

నిజంగానే మనమంతా లంచగొండితనం, అన్యా యం లాంటివి మన ఒక్కరిలో తప్ప మిగతా అందరిలోనూ ఉన్నాయనుకుంటాము. కానీ పరిశోధకులు మాత్రం మరో లాగా అంటున్నారు. ఏ కారణం లేకుండానే ఎవరైనా లంచగొండులు, అన్యాయం చేసే వారుగా మారతారు’-అంటున్నారు. జీవ పరిణామంలోని అంశాలను గమనించిన తర్వాత ఇది నిజమేననిపిస్తుంది. న్యాయం, న్యాయం అంటూ నైతికంగా గొప్పవారమనుకునే తీరు అర్థంలేనిదని రుజువయింది. అందరూ మోసమే చేస్తున్నప్పుడు, గుంపులో కలిసి అదే తోవన పోయినందుకు లాభం ఉంటుందని పరిణామక్రమం సూచించింది. అయినా, తనవరకు వచ్చినప్పుడు మాత్రం ఏమీ ఎరగనట్టే ఉండడం అందులో భాగమే. హిపొక్రసీ అనే ఈ లక్షణం అందరిలోనూ బ్యాక్‌గ్రౌండ్‌గా ఉండి తీరుతుందంటారు మనస్తత్వ శాస్తవ్రేత్త రాబ్ కుర్జ్‌బాన్.

ఎవరైనా చేతనయినంత వరకు, చేతనయినంతగా నీతిగా ఉన్నారంటే, మోసం చేయడానికి అవకాశం అందనందుకే అంటారు పరిశోధకులు. ఈ విషయాన్ని గురించి స్విట్జర్లాండ్‌లో పరిశోధనలు సాగిస్తున్న శాముయెల్ బెండహాన్ ఒక ఆటను రూపొందించారు. ఆడేవారు, కొంత సొమ్మును తాము, తమ ఉద్యోగుల మధ్యన పంచుకోవాలి. అందులో మూడు పద్ధతులున్నాయి. ఉద్యోగులకు జీతాలు పెంచవచ్చు. పంచేవారికి నష్టం వస్తుంది. లేక జీతాలను అదే తీరుగా ఉంచవచ్చు. మూడవమార్గంగా జీతాలను తగ్గించి తమకు ఎక్కువ మిగిలే ఏర్పాటు చేయవచ్చు. ఇది దొంగ పద్ధతి. ‘ఇంతకూ మీరు ఏ పద్ధతిని ఎంచుకుంటారు?’ అని ముందే అడిగితే, నూటిలో నలుగురు మాత్రం న్యాయమార్గం గురించి మాట్లాడారు. నిజం డబ్బులతో, ఒకే ఉద్యోగితో ఆట కొనసాగిస్తేన్యాయం కొనసాగింది. ఉద్యోగులసంఖ్య పెరిగిన కొద్దీ అన్యాయం తలెత్తసాగింది. అయిదవ రౌండు తర్వాత అయిదవవంతు మంది అన్యాయం చేశారు. పదవరౌండకల్లా సగంమంది అన్యాయానికి దిగారు.

నెదర్లాండ్స్‌లోనూ అమెరికాలో షికాగోలోనూ, అధికారంతో మొదలయ్యే కరప్షన్ గురించి పరిశోధనలు జరుగుతున్నాయి. అధికారం గల మనుషులు, అన్యాయం చెయ్యడానికి సులభంగా పూనుకుంటారని ఈ పరిశోధనల్లో గమనించారు. వారే, అన్యాయాన్ని చేతనయినంత గట్టిగా విమర్శించగలుగుతారట కూడా!
బ్రిటిష్ చరిత్రకారుడు, రాజకీయ నాయకుడు వార్డ్ ఆక్టన్ ‘అధికారం కరప్షన్ వైపు మొగ్గు చూపుతుంది’ అని సిద్ధాంతీకరించాడు. ఇక్కడ డబ్బు, దస్కం లావాదేవీల గురించి మాత్రమే కాదు చెపుతున్నది. ఆలోచనలలో కూడా తప్పుడు దారులు మొదలవుతాయి. లంచగొండితనం గురించి గగ్గోలు చేస్తున్నవారు అందరూ, మంచితనం కొద్దీ చేస్తున్నారా? అందులో వారికేదైనా ప్రయోజనం ఉందా? అని ప్రశ్న పుడుతుంది. తమ భూములు అమ్ముడుపోవడం లేదని, వాతావరణం, నీటి కాలుష్యం గురించి ఉద్యమాలుచేసిన వారి గురించి విన్నాము!

అధికారం చేత జిక్కినవారి ఆలోచనల తీరు మారుతుంది. అందులో నీతికి అంతగా చోటు ఉండదు. అది మత్తుపానీయం ప్రభావంలాంటిది. ఆల్కహాలు కారణంగా మనిషి ఆలోచనల ఫోకస్ మారుతుంది. తమ మీద తమకు నమ్మకం, తామే నిజంగా గొప్పవారమన్న భావం పెరుగుతుంది. అధికారానిది కూడా ఇదే దారి అంటారు పరిశోధకులు జోరిస్ లామర్స్. మామూలుగానయితే మనుషులు, కొన్ని పనులు చేయడానికి జంకుతారు, కానీ, అధికార భావం పెరిగితే ఈ జంకు తగ్గుతుందని మా పరిశోధనల్లో గమనించామంటారు లామర్స్.
అధికారంతో బాటు, అన్యాయాన్ని పెంచే మార్గం, ఆ అన్యాయం నుంచి మనం దూరంగా ఉన్నామన్న భావన. ఆ తప్పుడుపని మనవల్లే జరిగినా చేసేది మనం కానంతవరకు అన్యాయం, ఫరవాలేదన్న పద్ధతి ఇది. లంచగొండితనంలో మధ్యవర్తుల పాత్ర గురించి పరిశోధన జరుగుతున్నది. రాజకీయ నాయకునికి లంచం మనమివ్వనవసరం లేదు. ఆ మధ్యవర్తులు ఆ ఏర్పాటు చేస్తారు. అందుకు తాము కూడా కొంత డబ్బు తీసుకుంటారు. ఆ పని సేవగా చేసిన భావం కలిగిస్తారు. విషయం బయట పడినా పూచీ, పదిమందిదవుతుంది.
లంచగొండితనం రాకూడదు. వచ్చిందంటే, అది అందరిలోకీ వ్యాపిస్తుంది. ప్రపంచంలో లంచగొండి దేశాల పట్టికను ‘ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్‌నేషనల్’ అనే సంస్థ ఏటేటా ప్రకటిస్తుంది. డెన్మార్క్, న్యూజీలాండ్, సింగపూర్, ఫిన్‌లాండ్, స్వీడన్‌లలో ఈ లక్షణం 2010 లెక్కల ప్రకారం ఇంచుమించు లేదు. ఇరాన్, అప్ఘానిస్తాన్, బర్మా, సోమాలియాలు మరీ లంచగొండి దేశాలు. మన దేశం పేరు, ఆ తర్వాత రానే వస్తుంది.

అధికారంగలవారిది పెద్దస్థాయి అన్యాయం. అక్కడ బంట్రోతుది అదొక పద్ధతి. ఆటోవాలాది ఇంకో పద్ధతి. ‘ప్రధానమంత్రులే అన్యాయం చేస్తుంటే మనదెంత సార్!’ అన్నాడు ఆటో నడుపుతున్న పెద్దమనిషి. అవునా? అన్యాయం చేసే అవకాశం ఉండి కూడా చేయని వారు ఎవరున్నారు? వెదుకుదాము మరి!
అన్యాయం - పరిశోధనలు!

*మిల్‌వేకీలోని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ పరిశోధకులు మైకేల్ హేజెల్ హూన్ ఎలెయిన్ వాంగ్ ఈమధ్యన ఒక విచిత్రమైన సిద్ధాంతాన్ని ప్రకటించారు. ముఖం పెద్దదిగా ఉన్న మగవారు అవినీతి పనులను చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంది అంటారు ఈ పరిశోధకులు. వెడల్పు ముఖం గలవారు, బేరసారాల్లో సులభంగా అబద్ధం చెప్పగలుగుతారట.

చేతిలో విమాన ప్రయాణం గురించి గీతలుంటాయన్నంత చిత్రంగా ఉంది ఈ ప్రకటన అన్నారు మిగతా పరిశోధకులు. స్టాటిస్టిక్స్ అనే పద్ధతి ప్రకారం కొన్ని సంగతులను ఈ రకంగా చెపుతూ ఉండడం, అవి హాస్యాస్పదంగా ఉండడం అప్పుడప్పుడు జరుగుతుంది. అందుకే ఈ పరిశోధనలోని మరొక అంశాన్ని కూడా గమనించమంటున్నారు మైకేల్ ఎలెయిన్. పెద్ద ముఖంగలవారు, ఎక్కువ పవర్‌ఫుల్‌గా కూడా ఫీలవుతారట. శక్తి, అధికారం గలవారు సులభంగా అన్యాయం చేస్తారని, ఇంతకుముందు అందరూ అన్నదేగదా!

ముఖం వెడల్పుగా ఉన్నంత మాత్రాన, వారికి అధికారం, పవర్ అనే భావనలు ఎందుకు గలుగుతాయని అడగవచ్చు. ఆ ముఖం తీరు, వ్యక్తిత్వానికి గుర్తుగా కనబడుతుంది. అందులో ముఖ్యంగా, ఆ రకం ముఖంగలవారిని నమ్మగూడదనే భావం ఎదుటివారికి కలుగుతుంది. వారు తమ మీదకు విరుచుకుపడతారన్న భావం కూడా కలుగుతుంది, అంటారు ఈ పరిశోధకులు. కనుక వెడల్పు ముఖం వారితో వ్యవహారం జరుగుతున్నప్పుడు, ఎదుటివారు, కొంత కింద చేయిగా వ్యవహరిస్తారట. అట్లా అందరూ వారి ముందు, భయపడుతూ ఉంటే, రాను రాను వారిలో అధికారభావం, పైచేయి లక్షణాలు బలుస్తాయట!

* సమాజానికంతటికీ ఆ విషయంగా ఆలోచన పుట్టి, అన్యాయం గురించి గోల చేస్తే అది తగ్గే సూచనలున్నాయంటారు బెంజమిన్ ఓల్కెన్ లాంటి పరిశోధకులు. ఆయన ఇండోనీషియాలో రోడ్లు వేయడంలో జరిగిన స్కామ్ గురించి పరిశోధించారు. ఎవరో, ఎక్కడో లంచగొండితనాన్ని బయటపెట్టారంటే, మరో చోట ఆ లక్షణం తగ్గుతుందట. అన్నా హజారేగారి ప్రభావం- దేశంలో ఎంత ఉందన్న సంగతి గురించి పరిశోధన జరిగితే బాగుంటుందని కొందరు నిపుణులు అంటున్నారు.

*తిరుమల క్షేత్రంలో వేంకటేశ్వరస్వామి వారు, గురువారం ‘నేత్రదర్శనం’ అనుగ్రహిస్తారు. అంటే, ఆనాడు స్వామి కళ్లు తెరుస్తాడని నమ్మకం. అందుకే అక్కడి సిబ్బంది గురువారం లంచాలు పట్టరని, అన్యాయం చేయరని, అభిజ్ఞ వర్గాల కథనం. ఇలాంటి విషయాలను కూడా మనస్తత్వ వేత్తలు పరిశోధించాలి! *

No comments:

Post a Comment