మీరు ఆలోచించగలరా?
ఆలోచిస్తారా?
మరి ఆలోచించండి!
ఒక సముద్రం ఉంది. అందులో ఒక చేప ఉంది. అక్కడ చేపలు, మిగతా జంతువులు చాలా
ఉన్నాయి. వాటి సంగతి మనకు అవసరం లేదు. కథ ఈ చేప గురించి. అది కనిపించిన
జంతువులన్నింటినీ “పెద్ద సముద్రం ఏదో ఉందట. అది ఎక్కడుంది?” అని అడుగుతూ ఉంటుంది. మిగతా జంతువులు
నవ్వగలుగుతాయేమో తెలియదు గానీ, పక్కకు తప్పుకుని వెళ్లిపోయేవట.
కథ చిన్నదే. కానీ గొప్పది. ఇందులో
ఆలోచించడానికి బోలెడు వ్యవహారం ఉంది.
మనమందరమూ ఆ చేప లాగే బతుకుతున్నామేమో?
పసిపాపను చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది గదూ? ఎంత ఆశ్చర్యమంటే
అంత ఆశ్చర్యం! కానీ మనం మనలను చూచి, కనీసం పక్క మనిషిని చూచి
ఎప్పుడయినా ఆశ్చర్య పడ్డామా? లేదు కదూ? ఎందుకని
ఆలోచించగలరా? ప్రతి మనిషి ఒకప్పుడు పసిబిడ్డే గదా? పసిబిడ్డ
ఆశ్యర్యమయితే పెరిగిన మనిషి ఎందుకు వింతగా కనిపించడం లేదు? ఒకటే కారణం. మనకు
కొన్ని సంగతులు అలవాటయి పోతాయి. వాటిని గురింటి ఆలోచన అవసరం లేదనుకుంటాము.
మనుషులను చూడడం అలవాటయి పోయింది. మనిషిలో వింత లేదనిపిస్తుంది.
ఇలాటివి ఇంకా ఎన్నో సంగతులు ఉంటాయి. ఒక
వస్తువును కింద పడేస్తాము. కంచం పడిందనుకుందాము. అది కింద పడుతుంది. ఎందుకనో
ఆలోచించామా ఎప్పుడయినా? కంచం గాలిలోనే ఎందుకు నిలవలేదు? పైకి ఎందుకు
ఎగిరిపోలేదు? అట్లాగ జరిగి ఉండవచ్చు గదా? ఎందుకని కంచం
కింద పడింది? భూమికి ఆకర్షణ ఉందని ఎవరో అనగా
విన్నట్టున్నాము కదూ? ఏమిటా ఆకర్షణ? కంచం నుంచి
నేలకు తాళ్లేవీ లేవుగదా?సంబంధం లేని వస్తువులను భూమి ఎట్లా తన వేపు
లాక్కుంటుంది? ఈ రకం ప్రశ్న ప్రతిసారీ
అడగము మనం. ఎందుకంటే వస్తువులు కింద పడడం మనకి అలవాటయి పోయింది గనుక. అందులో
ఆశ్చర్యం మనకు కనిపించదు. ప్రశ్నలు అడగడం చేతనయితే ఎన్ని అడిగినా అంతుండదు. మా
ఇంట్లో ఒక మాట మళ్లా మళ్లా వినబడుతుంటుంది. ఆశ్చర్య పడ దలుచుకుంటే ఈ ప్రపంచంలో
ఎన్నయినా విషయాలున్నాయని!
ప్రతి మామూలు విషయంలోనూ ప్రశ్నలు దాగి ఉన్నాయి.
అడగడం చేతగావాలి. అంతే. పిల్లలకు ప్రశ్నలడగడం లో అనుమానాలుండవు. ఉండగూడదు కూడా.
అనుమానం రావడమే గొప్ప. దాన్ని గురించి తరచి అడగకుండా సమాధానం ఎందుకు ఎక్కడినుంచి
వస్తుంది. ప్రశ్నకు జవాబు అందితే అందులోనుంచి మరెన్నో ప్రశ్నలు పుట్టుకు వస్తాయి.
ఎందుకు అన్న ప్రశ్నకు జవాబు కష్టమని మరో అనుభవం.
మనమంతా ఒకప్పుడు పిల్లలమే అన్న సంగతి మరిచి
అంతా తెలుసన్న భావంతో, ప్రశ్నలడగడం మరిచి పోయాము గదూ?
మనలో ఇంకా ఆ పసిబిడ్డ ఉండి ప్రశ్నలడగ గలగాలి.
మనం అలవాటయిపోయిన ప్రపంచంలోనుంచి తప్పించుకుని కొంచెం సేపు పిల్లలుగా బతకగలగాలి.
సముద్రంలో చేప సముద్రాన్ని గమనించలేకపోయింది. మనం కనీసం మన ప్రపంచాన్ని గమనించ
గలగాలి.
ఆలోచించగలగాలి!!
No comments:
Post a Comment