బతుకు పరిశీలన!
-గోపాలం కె.బి.
(ఆంద్రభూమి దినపత్రిక నుంచి)
స్కూలు మొత్తంలో/వారికిష్టమైంది గంటే/ ప్రేయర్ గంట కాదు/ఇంటికెళ్ళే ప్రేమ గంట, అంటాడు కవి గోపి. ‘అది అమ్మపిలుపులా’ కమ్మగా ఉంటుంది. అన్నప్పుడు గోపి, వాళ్లది కాక తన బాల్యం గురించి చెపుతున్నాడనిపిస్తుంది.
కవిగా ఎన్. గోపి ప్రస్థానం ‘తంగెడు పూల’తో 1976లో మొదలయింది. పరిశోధన విమర్శ, అధ్యాపకం, పెద్ద ఉద్యోగాలు, పేపర్ కాలం, నిర్వహణ లాంటి పనులన్నింటినీ ఒక చేత్తో చేస్తూ, గోపి మరొక చేత్తో బలంగా కవితా వ్యవసాయం సాగించాడు. కనుకనే ఇప్పటికి 16 సంకలనాలు వచ్చాయి. ఇది 17వది. మధ్యలో ‘నానీ’లు ప్రత్యేకంగా వచ్చాయి. ఎన్ని వచ్చినా నేటికీ గోపి కవితలో ‘కవిత్వం’, బిగువు తగ్గలేదు. వాక్యాల నడుం విరిస్తే వచన కవిత అన్న వ్యాఖ్య గోపీ విషయంలో వర్తించదు. అతని కవిత్వంలో ‘నీటి తల్లికి ఇన్ని సమాధులా?’ అన్నా, ‘ఆకలిదెంత చైతన్యమో?’ అన్నా ప్రకృతి పరిశీలన, బతుకు పరిశీలనలతో నిండిన కవిత పలుకుతుంది.
చిత్రదీపాలు వెలిగించిన గోపి, చుట్టకుదురులో కుదురుకుంటూనే జలగీతాలు పాడాడు. మా ఊరు మహాకావ్యం అంటూ ఈ కవి తన పల్లెతనాన్ని, పట్టు తప్పకుండా ప్రదర్శించాడు. రాతిలో కూడా కెరటాలు చూడాలనుకున్నాడు. ఈ సంకలనంలో మొత్తం 44 కవితలున్నాయి. అన్నీ గొప్పవి అని బహుశా గోపీ కూడా అనుకోడు. 2010, 2011లలో రాసిన ఈ కవితలను పుస్తకంలో కలగలిపి ముద్రించారు. కాలక్రమం ప్రకారం వేస్తే కవిత్వతత్వం, కవితత్వం మరింత బాగా ఆవిష్కృతమయ్యేవేమో?
‘ఏక్‌తార’ అన్న కవితలో ‘ఎన్నాళ్ళ నుంచో వెతుకుతున్న స్క్రూడ్రైవర్ దొరికింది. అతుక్కుపోయిన తలుపులను తెరిచి నాలోకి వెళ్ళాలి - అంటాడు.
‘ప్రక్రియ’లో పెన్నుది బంగారు పత్తి అయితే, అక్షరాలు బంగారమవుతాయా? అని ప్రశ్నించి, అయినా కవిత్వం గాలిలా వ్యాపిస్తుంది’ అంటాడు. ఆ కలం గురించే మరో చోట ‘కలం జేబులో బందీ అయిపోయింది’ అంటాడు ఈ సంకలనంలో మగ్న, పాదచిహ్నాలు, లాంటి మరెన్నో ‘మంచి’ కవితలున్నాయి. సహజంగానే కవి గోపి, ప్రపంచంలోని సంఘటనలకు తన ప్రపంచలోనికి సంఘటనలకు స్పందించి కవితలు రాశాడు. కాళహస్తి గోపురానికొక కవిత, కవి గుడిహాళం స్మృతికి ఒక కవిత.
ఓల్గా గారికి 60 ఏళ్ళు నిండితే కవిత పుట్టింది. గోపికి కూడా అరవయి నిండినయి. అందుకేనేమో కొంచెం బతుకు తత్వం గురించిన ఆలోచన ఎక్కువయింది. రోజులు మారిపోతున్నాయి అంటాడు. ఇల్లు పంచుకుంటే స్పందిస్తాడు. అమెరికా నచ్చలేదు. తరాల అంతరం కూడా కదిపింది. దీన్ని లామెంటింగ్ అంటారేమో?
గుత్తెదార్లు, నీళ్ళ సీస, పెన్ను పత్తి లాంటి ప్రయోగాలు చేసి గోపి తన మట్టివాసనను చెప్పక చెప్పుకున్నాడు. పెన్ను ‘నిబ్’ను పత్తి అనేవాళ్ళమన్న సంగతి గుర్తుకు వచ్చి ఒళ్ళు పులకించింది.
గోపిలో ఒక మెత్తని మిత్రుడున్నాడన్న సంగతి అతని పుస్తకాన్ని శేషాద్రిగారికి అంకితమివ్వడంలో కనబడుతుంది. అలాగే చాలా కవితల్లో గోపి మనలను కొన్ని పనులు చేయవద్దని హెచ్చరిస్తాడు. అతనికి డిస్టర్బెన్స్ ఇష్టం లేదులాగుంది!
ఈ సంకలనం పేరు ‘రాతి కెరటాలు’. ఆ పేరున మొదటి కవిత ఉంది. ఆ శీర్షికకూ సంకలనంలోని మిగతా 43 కవితలకూ సంబంధం ఉందా? ఏమో?
డా. ఎన్. గోపి ‘పత్తి’ నుంచి ఇకముందు మరిన్ని మంచి కవితలు, రచనలు తప్పక వస్తాయన్న నమ్మకం ఉంది.
రాతికెరటాలు
డా. ఎన్. గోపి (కవితా సంకలనం)
పేజీలు: 80, వెల: రూ. 60/-
ప్రతులకు: అభవ్ ప్రచుఠణలు
13/1/5బి, శ్రీనివాసపురం
రామంతాపూర్, హైదరాబాద్-13
No comments:
Post a Comment